నల్లగొండ : జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షింపజేసే విధంగా రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. శనివారం నల్లగొండ పట్టణం పానగల్‌లోని పచ్చల సోమేశ్వర ఆలయం, ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఉదయ సముద్రం ప్రాంతాలను సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాలను ఆధునీకరించి, ఆ ప్రాంతాలను అభివృద్ధి పర్చాలన్నారు.
దేవరకొండ, నాగార్జునసాగర్‌లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి కలెక్టరేట్ కార్యాలయంలో కార్యదర్శి బుర్రా వెంకటేశం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో విదేశాల నుంచి పర్యాటకులు అతి తక్కువ సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. నల్లగొండ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే విధంగా విస్తృత ప్రచారం, హోర్డింగ్‌లను ప్రధాన కూడళ్లలో, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో అమర్చాలని సూచించారు.
ఛాయసోమేశ్వర ఆలయ విశిష్టత గురించి ఆలయంలో పడే ఛాయలపై పరిశోధనలకు యూనివర్సిటీ, ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక పర్యటన ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ..జిల్లాకు టేబుల్ టెన్నిస్ హాల్ ఏర్పాటుకు రూ.21 లక్షల నిధులు అంచనా ప్రతిపాదనలు సమర్పించారని, ఆ నిధులు మంజూరు చేస్తామని కార్యదర్శి తెలిపారు. ఈ సమావేశంలో పర్యాటక అధికారి ఎం.శివాజీ, దేవాదాయ శాఖ అధికారి ఎ.సులోచన, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
Published Sun, Mar 5 2017 2:54 AM | Last Updated on Tue, Sep 5 2017 5:12 AM
Advertisement
Advertisement