Burra venkatesam
-
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణాలో వివిధ శాఖల్లో 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి తెరలేచిన నేపథ్యంలో వెనుక బడిన తరగతికి చెందిన నిరుపేదలకు ఉచితంగా శిక్షణనిచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ సమాయత్తమైంది. దాదాపు లక్షా 25వేలమందినిరుపేద ఉద్యోగుల శిక్షణ నిమిత్తం సమగ్ర కార్యాచరణను రూపొందించింది. బీసీ స్టడీ సెంటర్ల ద్వారా బీసీ విద్యార్థులతోపాటు, పేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థులను ఆయా పోటీ పరీక్షలకు తీర్చిదిద్దనుంది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం సాక్షి.కామ్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. బీసీ స్టడీ సెంటర్ పేరుతో 100 కొత్త కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని మరో యాభై అటువంటి కేంద్రాలు ఒక వారంలో సిద్ధం కానున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రూపు-1, గ్రూపు-2 లాంటి పోటీ పరీక్షలతోపాటు, పోలీసు, రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు, డీఎస్సీ, క్లరికల్ తదితర పోటీ పరీక్షలకు కూడా ఉచితంగా శిక్షణ యిస్తామన్నారు. ఇందుకుగాను స్క్రీనింగ్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఎంపికలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కూడా వెంకటేశం స్పష్టం చేశారు. ఏప్రిల్ 16 న స్క్రీనింగ్ టెస్ట్ అలాగే కోచింగ్‌కు ఎంపికకు సంబంధించిన పరీక్ష ఏప్రిల్ 16న జరగనుందని, ఈ పరీక్షకు ఒక గంట ముందు కూడా రిజిస్ట్రేషన్లు అంగీకరిస్తామని ఆయన తెలిపారు. ఫలితాలను వెంటనే అన్లైన్లో ప్రకటిస్తామని చెప్పారు. ఈ స్క్రీనింగ్ పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ద్వారా వారు ఏ కోర్సుకు శిక్షణకు అర్హులో నిర్ణయించి, వారికి కౌన్సిలింగ్ ఇస్తామని పేర్కొన్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా శిక్షణ డిజిటల్ మీడియా ద్వారా అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. మెటీరియల్ అంతా సిద్ధంగా ఉంచామనీ, అలాగే వీడియోల ద్వారా ట్రైనింగ్ ఉంటుందన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అన్అకాడమీ, బైజూస్ లాంటి సంస్థలతో టైఅప్ కోసం ప్రయత్నిస్తున్నామని వెంకటేశం తెలిపారు. ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందేవారు సందేహాల నివృత్తి కోసం ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ కావచ్చని కూడా బుర్రా వెల్లడించారు. అలాగే ఫిట్నెస్ పరీక్షలు లాంటి కొన్ని తప్పనిసరి పరీక్షలకు, శిక్షణకు ఫిజికల్‌గా కూడా ఆన్లైన్ విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ఉద్యోగార్థులకు అండగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బుర్రా వెంకటేశం కోరారు. -
సెల్ఫీ విత్ 'సక్సెస్'
సక్సెస్... అంటే ఏంటి? ప్రారంభించిన పనిని విజయవంతంగా పూర్తి చేయటం అంటారెవరైనా. మరి వ్యాపారాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోగలిగినంత విజయం చవిచూసిన ‘కాఫీ సిద్ధార్థ’ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు? నిజానికి సక్సెస్‌ని నిర్వచించటం కష్టం... మారుమూల పల్లె మొదలు అగ్రరాజ్యం అమెరికా వరకు... సక్సెస్ కోసం ఒకటే ఉరుకులు, పరుగులు. ఆటలో గెలుపు, అంకెలు సాధించటంతో సరి. కానీ జీవితంలో గెలుపు సంగతేంటి? ప్రపంచ మానవ సమూహం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఈ గెలుపు పరుగే కారణం. ఒక వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి మరింతగా విస్తరించడం గెలుపే అయితే, ఆ తర్వాత పతనం కావటం ఓటమిగా భావించాలా.. అసలు గెలుపు సూత్రమేంటి, గెలుపు పరుగు ముగిసేదెక్కడ, సాధించిన ఏ విజయాన్ని ‘సక్సెస్’గా భావించవచ్చు? డబ్బు సంపాదించటమే విజయానికి నిదర్శనమైతే, పూరి గుడిసెలో ఉంటూ సంతోషంగా రోజులు వెళ్లదీసే వ్యక్తి ‘సక్సెస్’ చెందినట్టు కాదా.. ప్రశ్నల పరంపర.. సవాలక్ష సందేహాలకు సమాధానాలు విడమరిచి చెప్పేదెవరు? ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ కొద్దిరోజుల క్రితం అమెజాన్ ఆన్లైన్ అంగట్లో హల్చల్ చేసిన పుస్తకం. 166 పేజీలతో ఉన్న ఈ పుస్తకం పేరే కాస్త గమ్మత్తుగా అనిపిస్తోంది కదూ. సెల్ఫీకి లోకం ఫిదా అయిన తరుణంలో విజయమే తన సెల్ఫీని మన ముంగిటకు తెచ్చినట్టు అనిపించేలా విడుదలైన ఆ పుస్తకం తక్కువ సమయంలో ఎక్కువ అమ్మకాలతో ఆకట్టుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం రాసిన ఆ పుస్తకం విడుదలైన 35 రోజుల్లో దాదాపు 20 వేల ప్రతులు అమ్ముడైనట్టు పబ్లిషర్స్ చెప్తున్నారు. కొత్త పుస్తకాల విభాగంలో ఇంత తక్కువ సమయంలో అధిక రేటింగ్ పొందిన తొలి పుస్తకం ఇదేనంటూ అమెజాన్ గుర్తించిందనేది వారి మాట. మరి ఇంత తక్కువ పేజీలున్న ఈ పుస్తకం అంత క్రేజ్ సంపాదించు కోవటానికి కారణం కూడా అంతుచిక్కని ‘విజయ రహస్యమే’. ప్రపంచవ్యాప్తంగా వారివారి రంగాల్లో విజయం సాధించిన వారు అనుసరించిన పద్ధతుల సారాంశాన్ని ఇందులో కళ్లకు కట్టినట్టు వివరించారు. దీంతో పాఠకులు కూడా విజయం అంటే ఇలా వ్యవహరించాలా అన్న తరహాలో ఆలోచించుకునేలా చేసిందా పుస్తకం. విజయం అంటే డబ్బు సంపాదనే కాదు, విజయాన్ని ఆనందించే తత్వం, తోటి వారిని సంతోషపెట్టేలా చేయటం అన్న విషయాన్నీ ఆ విజేతల జీవితాలను చూసి తెలుసుకునేలా చేసింది. గెలుపుపై అవగాహన, గెలుపు ప్రయాణం, గెలుపు అర్థం, గెలుపు తెచ్చే అనర్థ్ధం, గెలుపు పరమార్థం... ఇలా 5 అంకాలుగా ఈ పుస్తకంతో సారాంశం సాగిన తీరు ఆకట్టుకుంది. పుస్తకం అనతికాలంలోనే పాఠకుల ఆదరణ దక్కించుకోవటంతో బుర్రా మరికొన్ని పుస్తకాలను వెలువ రించేందుకు సిద్ధపడ్డారు. సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకాన్ని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ, హిందీ భాషల్లోకి అనువదించబోతున్నారు. అది విశ్వజనీనమైన సబ్జెక్టు కావటంతో కొరియా, జపాన్, చైనా, పోర్చుగల్, పర్షియా, ఇండోనేషియా తదితర దేశాల్లో కూడా వారి భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఓ వైపు ఈ తర్జుమా తంతు జరుగుతుండగానే, ఈ సక్సెస్‌ను సమాజంతో జోడించేలా మరికొన్ని పుస్తకాలను వెలువరించే కసరత్తు మొదలుపెట్టారు బుర్రా వెంకటేశం. 3 నెలల్లో.. 2వ పుస్తకం.. విజయంపై ఓ అవగాహన తెచ్చేలా చేసిన సెల్ఫీ ఆఫ్ సక్సెస్ తర్వాత ఉత్తేజం కలిగించే విజయగాథలతో కూడిన రెండో పుస్తకాన్ని తేనున్నట్టు బుర్రా వెంకటేశం చెప్పారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఆరాధ్యులుగా మారిన వారి జీవిత గాథల సారాంశాలతో కూడిన పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ‘నో వేర్ నవ్ అండ్ హియర్’శీర్షికతో ఉండే ఈ పుస్తకం మరో మూడు నెలల్లో పాఠకుల ముందుకు తేనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రతికూలతలను కూడా అనుకూలంగా మలుచుకుని విజయాన్ని ఎలా సాధించారన్న విషయాన్ని ఆ పుస్తకం వివరిస్తుందంటున్నారు ఆయన. ఆ తర్వాత.. అసలు జీవితంలో సక్సెస్ ఎంత అవసరం అన్న విషయాన్ని చర్చించే ‘హౌమచ్ సక్సెస్ యూ నీడ్ ఇన్ లైఫ్’పేరుతో సిద్ధాంత గ్రం«థాన్ని వెలువరించనున్నట్టు వెల్లడించారు. అనూహ్య విజయాలు సాధించిన తక్కువ మంది.. ఎక్కువ మందిని ప్రభావితం చేయటం, భారీ విజయాలు సాధించి ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన వారు, అనంతర వ్యవహారంలో ఎలాంటి ప్రభావానికి లోనయ్యారు... లాంటి విషయాలు ఇందులో వివరించనున్నట్టు పేర్కొన్నారు. ఇక ‘థాంక్యూ ఎనిమీ’ పేరుతో మరో పుస్తకం వస్తుందని, మానవ పరిణామ వికాస క్రమంలో విజయాల పరంపరను ఇందులో వివరించనున్నట్టు వెల్లడించారు. ఇది 30 వేల ఏళ్ల నుంచి ఇప్పటి వరకు మనిషి పట్టుదలగా ఎలాంటి విజయాలు సాధించాడో వివరిస్తుందని పేర్కొన్నారు. ఆ విజయాలకు పురిగొల్పిన సవాళ్లను, అధిగమించిన తీరు ఇది వివరిస్తుందని పేర్కొన్నారు. ఆ తర్వాత సంతోషాన్ని నిర్వచించే మరో పుస్తకం ‘షీ’ పేరుతో వస్తుందన్నారు. స్టోరీ ఆఫ్ హ్యాపీనెస్ బై ఎవరెస్ట్ పేరుతో ఉండే పుస్తకం ఆ ఆంగ్ల పదాల తొలి అక్షరాల పొడి రూపమే షీ (ఎస్హెచ్ఈ)గా ఉంటుందన్నారు. ఎవరెస్టే వివరించినట్టుగా... ఎత్తయిన పర్వతంగా ఉన్న ఎవరెస్టు ప్రపంచాన్ని గంభీరంగా గమనిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. అది అలా విశ్వాన్ని గమనిస్తూ విజయాల గాథను వివరిస్తే ఎలా ఉంటుందనే ఐడియాతో కొత్త పుస్తకాలు వస్తాయన్నారు. తొలి పుస్తకంలో విజయమే పాఠకులతో మాట్లాడుతున్నట్టు ఉండగా, తదుపరి పుస్తకాల్లో ఎవరెస్టు పర్వతం మాట్లాడుతున్నట్టు ఉంటుందని పేర్కొన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా పోటీ తత్వం నెలకొని విజయం కోసం పరుగులు పెట్టే క్రమంలో మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. విజయం వైపు పయనంలో సంతోషమే పరమార్థం కావాలి. విజయ కాంక్షలో సంతృప్తి ఎలా అవసరం, దాన్ని స్థిరీకరించుకునే తీరు, ఆ విజయం తనకే కాకుండా, తోటివారికి కూడా ఎలా ఆనందాన్ని పంచాలి అన్న విషయంలో ప్రజలకు కొంత అవగాహన అవసరం. ఆ ఆలోచనలోంచే పుస్తక రచన ప్రారంభించా. ఈ పుస్తకాల అమ్మకంతో వచ్చే లాభాలను నిస్సహాయ వృద్ధుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తా. విజయం తెచ్చే అనర్థాలు కోణం నా తొలి పుస్తకంలో కొత్త విషయం. ఇప్పటివరకు ఎవరూ ఆ కోణంలో రచించలేదు. ఇక రూ.50 వేల కోట్లు ఆర్జించి పెట్టిన హ్యారీపోటర్ పుస్తకాలు కూడా బ్రెయిలీ లిపిలో విడుదల కాలేదు. కానీ నా తొలిపుస్తకాన్ని అంధులు కూడా చదివేలా బ్రెయిలీలో అందుబాటులోకి తెచ్చా’అని వెంకటేశం పేర్కొన్నారు. – సాక్షి, హైదరాబాద్ -
గాలిలో తేలి.. తేలి.. తేలిపొండి!
హైదరాబాద్: నగర యువతకు రాష్ట్ర టూరిజం అడ్వెంచర్ స్పోర్ట్స్ విభాగం పారా మోటర్ రైడింగ్‌ను ప్రారంభించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బైసన్‌పోలో మైదానంలో ఆదివారం ప్రారంభమైన ఈ రైడింగ్ మరో 2 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ మహేందరెడ్డి, టూరి జం ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, తెలంగాణ, ఆంధ్ర సబ్‌ఏరియా కమాండింగ్ ఆఫీసర్, మేజర్ జనరల్ ఎన్.శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. డీజీ పీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ రైడ్‌ను ప్రజలు ఎంజాయ్ చేయాలన్నారు. టూరిజం ప్రిన్సిపల్ సెక్రెట రీ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ కేవలం రూ.2,500 చెల్లిస్తే గాలిలో డ్రైవ్ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఈ రైడ్ ఉంటుందన్నారు. -
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
నల్లగొండ : జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షింపజేసే విధంగా రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. శనివారం నల్లగొండ పట్టణం పానగల్‌లోని పచ్చల సోమేశ్వర ఆలయం, ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఉదయ సముద్రం ప్రాంతాలను సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాలను ఆధునీకరించి, ఆ ప్రాంతాలను అభివృద్ధి పర్చాలన్నారు. దేవరకొండ, నాగార్జునసాగర్‌లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి కలెక్టరేట్ కార్యాలయంలో కార్యదర్శి బుర్రా వెంకటేశం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో విదేశాల నుంచి పర్యాటకులు అతి తక్కువ సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. నల్లగొండ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే విధంగా విస్తృత ప్రచారం, హోర్డింగ్‌లను ప్రధాన కూడళ్లలో, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో అమర్చాలని సూచించారు. ఛాయసోమేశ్వర ఆలయ విశిష్టత గురించి ఆలయంలో పడే ఛాయలపై పరిశోధనలకు యూనివర్సిటీ, ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక పర్యటన ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ..జిల్లాకు టేబుల్ టెన్నిస్ హాల్ ఏర్పాటుకు రూ.21 లక్షల నిధులు అంచనా ప్రతిపాదనలు సమర్పించారని, ఆ నిధులు మంజూరు చేస్తామని కార్యదర్శి తెలిపారు. ఈ సమావేశంలో పర్యాటక అధికారి ఎం.శివాజీ, దేవాదాయ శాఖ అధికారి ఎ.సులోచన, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పర్యాటకానికి జిల్లాకో ప్రణాళిక
► భారీగా పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయం ► ప్రత్యేక ప్రణాళికల రూపకల్పనకు కసరత్తు ప్రారంభం ► జిల్లాల యంత్రాంగంతో మంత్రి, కార్యదర్శి, అధికారుల భేటీలు ► తొలి రోజున నాలుగు జిల్లాల్లో సమావేశాలు ► వారం తర్వాత మరిన్ని జిల్లాల అధికారులతో భేటీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి, పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాలకు వేర్వేరు ప్రత్యేకతలు ఉన్న నేపథ్యంలో.. జిల్లాల వారీగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిం చనుంది. ప్రపంచవ్యాప్తంగా ముమ్మర ప్రచారం చేయడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లాల వారీగా పర్యాటక ప్రణాళికలు ఎలా ఉండాలనే దిశగా కసరత్తు ప్రారంభించింది. పర్యాటక, పురావస్తుశాఖల అధికారులు ఆయా జిల్లాలకు వెళ్లి కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా పర్యాటక మంత్రి చందూ లాల్, ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ క్రిస్టీనా, పురావస్తు శాఖ డెరైక్టర్ విశాలాక్షి, ఇతర అధికారులు సోమవారం తొలి విడత సమా వేశాలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజున ఉదయం నుంచి రాత్రి వరకు యాదాద్రి, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల యంత్రాంగంతో జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించారు. యాదాద్రి దేవాలయం, చిట్టకోడూరు రిజర్వాయర్, ఖిలాషాపూర్ ప్రాంతాలలో పర్యటించారు కూడా. వారం తర్వాత రెండో విడతగా మరిన్ని జిల్లాల్లో పర్యటనలు చేయను న్నామని.. మొత్తం 31 జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఏం చేస్తారు..? ► పర్యాటకులను ఆకర్షించేలా తీసుకునే చర్యలకు లక్ష్యాలు నిర్ధారించారు. 2020, 2022, 2027.. ఇలా సంవత్సరాల వారీగా పర్యాటకుల సంఖ్యను లక్ష్యంగా పెట్టుకున్నారు. ► ‘అతిథి దేవోభవ’ పేరుతో ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. ముఖ్యంగా పర్యాటకులను ఆహ్వానించే క్రమంలో ప్రజల్లో కూడా అవగాహన కల్పించనున్నారు. ఆటోవాలాలు, హోటల్ నిర్వాహకులు, ఉద్యోగులు.. ఇలా అంతా పర్యాటకులను నవ్వుతూ స్వాగతించేలా చైతన్యం తీసుకువస్తారు. ►ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేకత ఉంది. స్థానిక పరా్యాటక కేంద్రాలు, ప్రకృతి సిద్ధ వనరులు, ఆచార వ్యవహారాలు వంటి వాటి ఆధారంగా ప్రణాళికలు రూపొందిస్తారు. ►యాదాద్రి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతోపాటు భువనగిరి కోట తదితరాలను పర్యాటకులకు అనుకూలంగా మార్చాలని నిర్ణరుుంచారు. జాతీయ రహదారి నుంచి నేరుగా భువనగిరి కోటకు ప్రత్యేక రహదారి నిర్మాణంతోపాటు బారికేడ్లు ఏర్పాటు చేసి, అక్కడ అన్ని వసతులతో కూడిన స్నాక్ బార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ►ఘన చరిత్ర ఉన్న వరంగల్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం వరంగల్‌లో అంతర్జాతీయ పతంగుల ఉత్స వం నిర్వహించనుండగా... హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలను వచ్చే సంవత్సరం వరంగల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ►పాకాల, లక్నవరం, రామప్ప లాంటి జలాశయాల్లో లేక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. అలాగే పాతకాలం నాటి పూటకూళ్ల ఇళ్ల తరహాలో ఇంటి విడిదుల ఏర్పాటును ప్రోత్సహిస్తారు.