పర్యాటకానికి జిల్లాకో ప్రణాళిక | District Co-tourism plan | Sakshi
Sakshi News home page

పర్యాటకానికి జిల్లాకో ప్రణాళిక

Published Tue, Dec 6 2016 4:45 AM | Last Updated on Sat, Jul 28 2018 6:24 PM

పర్యాటకానికి జిల్లాకో ప్రణాళిక - Sakshi

పర్యాటకానికి జిల్లాకో ప్రణాళిక

భారీగా పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయం
ప్రత్యేక ప్రణాళికల రూపకల్పనకు కసరత్తు ప్రారంభం
జిల్లాల యంత్రాంగంతో మంత్రి, కార్యదర్శి, అధికారుల భేటీలు
తొలి రోజున నాలుగు జిల్లాల్లో సమావేశాలు
వారం తర్వాత మరిన్ని జిల్లాల అధికారులతో భేటీలు  

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి, పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాలకు వేర్వేరు ప్రత్యేకతలు ఉన్న నేపథ్యంలో.. జిల్లాల వారీగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిం చనుంది. ప్రపంచవ్యాప్తంగా ముమ్మర ప్రచారం చేయడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లాల వారీగా పర్యాటక ప్రణాళికలు ఎలా ఉండాలనే దిశగా కసరత్తు ప్రారంభించింది. పర్యాటక, పురావస్తుశాఖల అధికారులు ఆయా జిల్లాలకు వెళ్లి కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు.

ఇందులో భాగంగా పర్యాటక మంత్రి చందూ లాల్, ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ క్రిస్టీనా, పురావస్తు శాఖ డెరైక్టర్ విశాలాక్షి, ఇతర అధికారులు సోమవారం తొలి విడత సమా వేశాలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజున ఉదయం నుంచి రాత్రి వరకు యాదాద్రి, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల యంత్రాంగంతో జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించారు. యాదాద్రి దేవాలయం, చిట్టకోడూరు రిజర్వాయర్, ఖిలాషాపూర్ ప్రాంతాలలో పర్యటించారు కూడా. వారం తర్వాత రెండో విడతగా మరిన్ని జిల్లాల్లో పర్యటనలు చేయను న్నామని.. మొత్తం 31 జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

ఏం చేస్తారు..?
► పర్యాటకులను ఆకర్షించేలా తీసుకునే చర్యలకు లక్ష్యాలు నిర్ధారించారు. 2020, 2022, 2027.. ఇలా సంవత్సరాల వారీగా పర్యాటకుల సంఖ్యను లక్ష్యంగా పెట్టుకున్నారు.
► ‘అతిథి దేవోభవ’ పేరుతో ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. ముఖ్యంగా పర్యాటకులను ఆహ్వానించే క్రమంలో ప్రజల్లో కూడా అవగాహన కల్పించనున్నారు. ఆటోవాలాలు, హోటల్ నిర్వాహకులు, ఉద్యోగులు.. ఇలా అంతా పర్యాటకులను నవ్వుతూ స్వాగతించేలా చైతన్యం తీసుకువస్తారు.
►ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేకత ఉంది. స్థానిక పరా్యాటక కేంద్రాలు, ప్రకృతి సిద్ధ వనరులు, ఆచార వ్యవహారాలు వంటి వాటి ఆధారంగా ప్రణాళికలు రూపొందిస్తారు.
►యాదాద్రి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతోపాటు భువనగిరి కోట తదితరాలను పర్యాటకులకు అనుకూలంగా మార్చాలని నిర్ణరుుంచారు. జాతీయ రహదారి నుంచి నేరుగా భువనగిరి కోటకు ప్రత్యేక రహదారి నిర్మాణంతోపాటు బారికేడ్లు ఏర్పాటు చేసి, అక్కడ అన్ని వసతులతో కూడిన స్నాక్ బార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
►ఘన చరిత్ర ఉన్న వరంగల్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం వరంగల్‌లో అంతర్జాతీయ పతంగుల ఉత్స వం నిర్వహించనుండగా... హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలను వచ్చే సంవత్సరం వరంగల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
►పాకాల, లక్నవరం, రామప్ప లాంటి జలాశయాల్లో లేక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. అలాగే పాతకాలం నాటి పూటకూళ్ల ఇళ్ల తరహాలో ఇంటి విడిదుల ఏర్పాటును ప్రోత్సహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement