ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త! | Free Coaching For BC job aspirants At BC Study circles Says Burra Venkatesham | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త!

Published Tue, Apr 5 2022 2:57 PM | Last Updated on Wed, Apr 6 2022 2:13 PM

Free Coaching For BC job aspirants At BC Study circles Says Burra Venkatesham - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణాలో వివిధ శాఖల్లో 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి తెరలేచిన నేపథ్యంలో వెనుక బడిన తరగతికి చెందిన నిరుపేదలకు ఉచితంగా శిక్షణనిచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ సమాయత్తమైంది. దాదాపు లక్షా 25వేలమందినిరుపేద ఉద్యోగుల శిక్షణ నిమిత్తం సమగ్ర కార్యాచరణను రూపొందించింది.  బీసీ స్టడీ సెంటర్ల ద్వారా  బీసీ విద్యార్థులతోపాటు, పేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థులను ఆయా పోటీ పరీక్షలకు తీర్చిదిద్దనుంది. 

ఈ సందర్భంగా  బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం సాక్షి.కామ్‌ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. బీసీ స్టడీ సెంటర్‌ పేరుతో  100 కొత్త కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు  చేశామని  మరో యాభై అటువంటి కేంద్రాలు ఒక వారంలో సిద్ధం కానున్నాయని ఆయన తెలిపారు.  ముఖ్యంగా గ్రూపు-1, గ్రూపు-2 లాంటి పోటీ పరీక్షలతోపాటు, పోలీసు, రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు, డీఎస్‌సీ, క్లరికల్‌ తదితర పోటీ పరీక్షలకు కూడా ఉచితంగా శిక్షణ యిస్తామన్నారు. ఇందుకుగాను  స్క్రీనింగ్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఎంపికలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామని కూడా వెంకటేశం స్పష్టం చేశారు.

ఏప్రిల్ 16 న స్క్రీనింగ్ టెస్ట్‌
అలాగే కోచింగ్‌కు ఎంపికకు సంబంధించిన పరీక్ష ఏప్రిల్ 16న జరగనుందని, ఈ పరీక్షకు ఒక గంట ముందు కూడా రిజిస్ట్రేషన్లు అంగీకరిస్తామని ఆయన తెలిపారు.  ఫలితాలను వెంటనే అన్‌లైన్‌లో ప్రకటిస్తామని చెప్పారు.  ఈ స్క్రీనింగ్ పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ద్వారా వారు ఏ కోర్సుకు శిక్షణకు అర్హులో నిర్ణయించి, వారికి కౌన్సిలింగ్‌ ఇస్తామని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌  ద్వారా శిక్షణ
డిజిటల్‌ మీడియా ద్వారా అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. మెటీరియల్ అంతా సిద్ధంగా ఉంచామనీ, అలాగే వీడియోల ద్వారా  ట్రైనింగ్‌ ఉంటుందన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అన్‌అకాడమీ, బైజూస్‌ లాంటి సంస్థలతో టైఅప్‌ కోసం ప్రయత్నిస్తున్నామని వెంకటేశం తెలిపారు.

ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ పొందేవారు సందేహాల నివృత్తి కోసం ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్‌ కావచ్చని కూడా బుర్రా వెల్లడించారు. అలాగే ఫిట్‌నెస్‌ పరీక్షలు లాంటి కొన్ని తప్పనిసరి పరీక్షలకు, శిక్షణకు ఫిజికల్‌గా కూడా  ఆన్‌లైన్‌ విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ఉద్యోగార్థులకు అండగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేశామని  ఈ  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బుర్రా వెంకటేశం కోరారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement