BC study circles
-
ఇదేం ‘శిక్ష’ణ..?.. కోచింగ్ పూర్తికాకుండానే సంస్థలకు సొమ్ములు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్–3, గ్రూప్–4 ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చే కాంట్రాక్టులు పొందిన పలు ప్రైవేటు కోచింగ్ సంస్థలు శిక్షణ పూర్తి చేయకుండానే సర్కారు సొమ్మును అప్పనంగా దండుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయా సంస్థల నిర్వాకంతో విలువైన సమయాన్ని కోల్పోయిన అభ్యర్థులు పలు జిల్లాల్లో ఏకంగా కలెక్టర్లకు ఫిర్యాదు చేయడంతో వాస్తవ పరిస్థితిని సమీక్షించిన అధికారులకు అసలు సంగతి తెలిసింది. ఇంత జరిగినా అధికారులు కేవలం నోటీసులతో సరిపెట్టి ఇక చేసేదేంలేదని చేతులు దులుపుకోవడం గమనార్హం. ‘ప్రైవేటు’కు అప్పగించి... బీసీ అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ గతేడాది సెపె్టంబర్ 15న రాష్ట్రవ్యాప్తంగా 50 స్టడీ సెంటర్లను తెరిచింది. ఒక్కో కేంద్రంలో 100 మంది అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేసింది. ఒక్కో అభ్యర్థికి మూడు నెలలపాటు అయ్యే శిక్షణ వ్యయాన్ని రూ. 5 వేల చొప్పున ఖరారు చేశారు. ఈ ఫీజును బీసీ సంక్షేమ శాఖ భరిస్తూ... అభ్యర్థులకు మాత్రం ఉచిత శిక్షణ ఇచ్చేందుకు స్టడీ సెంటర్లను తెరిచింది. ఈ లెక్కన ఒక్కో కేంద్రంలో 100 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు రూ. 5 లక్షలు ఖర్చు కానుండగా రాష్ట్రవ్యాప్తంగా 50 సెంటర్ల ద్వారా అయ్యే మొత్తం శిక్షణ ఖర్చు రూ. 2.5 కోటు్లగా ప్రభుత్వం తేల్చింది. ఈ మొత్తంతో అభ్యర్థులకు మూడు నెలలు శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యతను బీసీ స్టడీ సర్కిల్ ఏడు ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టు అప్పగించింది. ఇందులో ఒక సంస్థకు ఏకంగా 20 స్టడీ సెంటర్ల బాధ్యతలు ఇవ్వగా మిగతా ఆరు సెంటర్లకు ఐదేసి సెంటర్ల చొప్పున శిక్షణ బాధ్యతలు ఇచ్చింది. సబ్ కాంట్రాక్టు పేరుతో మాయ.. ఇంతవరకు బాగానే ఉన్నా... శిక్షణ బాధ్యతలు తీసుకున్న ప్రైవేటు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. అభ్యర్థులకు నేరుగా శిక్షణ ఇచ్చే బదులు ఆ బాధ్యతను కొందరికి సబ్ కాంట్రాక్టు ఇచ్చాయి. 20 స్టడీ సెంటర్ల బాధ్యతలు తీసుకున్న ఓ కాంట్రాక్టు సంస్థ... కిందిస్థాయిలో ఒక్కో వ్యక్తికి 10 సెంటర్ల చొప్పున రూ. 7.5 లక్షలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినట్లు తెలిసింది. అయితే సబ్ కాంట్రాక్టు పొందిన వాళ్లంతా తరగతులు ప్రారంభించి దాదాపు నెల రోజులు నిర్వహించిన అనంతరం అప్పటివరకు చెప్పిన క్లాసులకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టు తీసుకున్న సంస్థలను డిమాండ్ చేశారు. కానీ కాంట్రాక్టు సంస్థలు పట్టించుకోకపోవడంతో సబ్ కాంట్రాక్టు సంస్థలు శిక్షణ తరగతులను నిలిపివేశాయి. దీంతో అర్ధంతరంగా కోచింగ్ నిలిచిపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై అభ్యర్థులు జిల్లా కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేయగా మరికొన్ని జిల్లాల్లో అభ్యర్థులను స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేశారు. మరోవైపు దీనిపై వివాదం కొనసాగుతుండగానే శిక్షణ గడువు ముగిసిందంటూ కాంట్రాక్టు సంస్థలు బీసీ స్టడీ సర్కిల్ నుంచి బిల్లులు డ్రా చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నోటీసులిచ్చినా స్పందించలేదు.. కలెక్టర్ల ఆదేశంతో రంగంలోకి దిగిన బీసీ సంక్షేమ అధికారులు వాస్తవ పరిస్థితులను గుర్తించి బీసీ స్టడీ సర్కిల్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఇటీవల కాంట్రాక్టు పొందిన ప్రైవేటు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అవకతవకలపై వెంటనే వివరణ ఇవ్వాలని పేర్కొంది. కానీ ఈ నోటీసులకు ఆయా సంస్థల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అర్ధంతరంగా ఆపేస్తే ఎలా? గ్రూప్–3, గ్రూప్–4 పోస్టులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అనగానే సంబరపడ్డా. నారాయణపేట జిల్లాలోని బీసీ స్టడీ సెంటర్లో కోచింగ్‌కు వెళ్లా. దాదాపు నెలన్నర తరగతుల అనంతరం శిక్షణను అర్ధంతరంగా ఆపేశారు. దీంతో సిలబస్ పూర్తికాక, ఇతర కోచింగ్ సెంటర్లకు వెళ్లే పరిస్థితి సతమతమవుతున్నా. – శ్వేత, బొమ్మన్‌పాడ్, నారాయణపేట జిల్లా -
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త!
-
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణాలో వివిధ శాఖల్లో 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి తెరలేచిన నేపథ్యంలో వెనుక బడిన తరగతికి చెందిన నిరుపేదలకు ఉచితంగా శిక్షణనిచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ సమాయత్తమైంది. దాదాపు లక్షా 25వేలమందినిరుపేద ఉద్యోగుల శిక్షణ నిమిత్తం సమగ్ర కార్యాచరణను రూపొందించింది. బీసీ స్టడీ సెంటర్ల ద్వారా బీసీ విద్యార్థులతోపాటు, పేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థులను ఆయా పోటీ పరీక్షలకు తీర్చిదిద్దనుంది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం సాక్షి.కామ్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. బీసీ స్టడీ సెంటర్ పేరుతో 100 కొత్త కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని మరో యాభై అటువంటి కేంద్రాలు ఒక వారంలో సిద్ధం కానున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రూపు-1, గ్రూపు-2 లాంటి పోటీ పరీక్షలతోపాటు, పోలీసు, రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు, డీఎస్సీ, క్లరికల్ తదితర పోటీ పరీక్షలకు కూడా ఉచితంగా శిక్షణ యిస్తామన్నారు. ఇందుకుగాను స్క్రీనింగ్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఎంపికలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కూడా వెంకటేశం స్పష్టం చేశారు. ఏప్రిల్ 16 న స్క్రీనింగ్ టెస్ట్ అలాగే కోచింగ్‌కు ఎంపికకు సంబంధించిన పరీక్ష ఏప్రిల్ 16న జరగనుందని, ఈ పరీక్షకు ఒక గంట ముందు కూడా రిజిస్ట్రేషన్లు అంగీకరిస్తామని ఆయన తెలిపారు. ఫలితాలను వెంటనే అన్లైన్లో ప్రకటిస్తామని చెప్పారు. ఈ స్క్రీనింగ్ పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ద్వారా వారు ఏ కోర్సుకు శిక్షణకు అర్హులో నిర్ణయించి, వారికి కౌన్సిలింగ్ ఇస్తామని పేర్కొన్నారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా శిక్షణ డిజిటల్ మీడియా ద్వారా అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. మెటీరియల్ అంతా సిద్ధంగా ఉంచామనీ, అలాగే వీడియోల ద్వారా ట్రైనింగ్ ఉంటుందన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అన్అకాడమీ, బైజూస్ లాంటి సంస్థలతో టైఅప్ కోసం ప్రయత్నిస్తున్నామని వెంకటేశం తెలిపారు. ఆన్లైన్ ద్వారా శిక్షణ పొందేవారు సందేహాల నివృత్తి కోసం ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ కావచ్చని కూడా బుర్రా వెల్లడించారు. అలాగే ఫిట్నెస్ పరీక్షలు లాంటి కొన్ని తప్పనిసరి పరీక్షలకు, శిక్షణకు ఫిజికల్‌గా కూడా ఆన్లైన్ విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ఉద్యోగార్థులకు అండగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బుర్రా వెంకటేశం కోరారు. -
పోటీ పరీక్షలకు నిరంతర శిక్షణ: జోగు
సాక్షి, హైదరాబాద్: సివిల్స్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా నిరంతరంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి జోగు రామన్న అధికారులకు సూచించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్లో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ అనితా రాజేందర్, బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్ర సంచాలకులు గొట్టిపాటి సుజాత, ఇతర అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, బీసీ అభ్యర్థులు పోటీ పరీక్షల్లో రాణించే విధంగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని, లైబ్రరీ, శిక్షణకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచాలన్నారు. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్లో నిర్మాణాల్లో ఉన్న స్టడీ సర్కిల్ భవనాలు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. -
నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా శిక్షణ
సాక్షి, హైదరాబాద్ : బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఇకపై నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా బీసీ నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే నోటిఫికేషన్ల కోసం వేచి చూడకుండా ఈ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆయా పోటీ పరీక్షలు వచ్చినప్పుడల్లా శిక్షణకు సీబీసీడబ్ల్యూ నుంచి అనుమతి తీసుకునేలా ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాన్ని కూడా నిలిపేసినట్లు పేర్కొంది. నోటిఫికేషన్లు వెలువడిన తరువాత శిక్షణ ప్రారంభిస్తే సమయాభావం కారణంగా బీసీలకు సకాలంలో శిక్షణ అందుబాటులోకి రావడం లేదని అభిప్రాయపడింది. దీనికి బదులు జిల్లాల్లోని బీసీల జనాభాకు అనుగుణంగా కలెక్టర్లకు బడ్జెట్‌ను కేటాయించి, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకునేలా ప్రభుత్వం మార్పు చేసింది. ఈ విధానం ఇప్పటి వరకు అందుబాటులో లేనందున తెలంగాణ బీసీ స్టడీసర్కిళ్ల కోసం విడిగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని సీజీజీ డెరైక్టర్ జనరల్‌ను ప్రభుత్వం ఆదేశించింది. -
సివిల్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: బీసీ స్టడీ సర్కిళ్లలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ పొందేందుకు ఈ నెల 16న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఎ. వాణీప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. అర్హత పొందిన అభ్యర్థులకు వచ్చే నెల ఒకటి నుంచి శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 100 మందికి విశాఖలో, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 60 మందికి రాజమండ్రిలో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన 100 మందికి విజయవాడలో, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలకు చెందిన 60 మందికి అనంతపురంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో ఈ శిక్షణ ఉంటుందని చెప్పారు. ఈ శిక్షణా తరగతులను ఆయా జిల్లాల కలెక్టర్లు డిసెంబర్ 1 నుంచి 3లోగా ప్రారంభిస్తారని తెలిపారు. ఇందులో బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు 14 శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్నారు. వీరిలోనే 33 శాతం మంది మహిళలు, 3 శాతం మంది వికలాంగులకు రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను apbcstudycircles.cgg.gov.in వెబ్సైట్లో చూడొచ్చని వాణీప్రసాద్ తెలిపారు. -
16న బీసీ స్టడీసర్కిళ్లలో సివిల్స్ శిక్షణకు అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీసీ స్టడీసర్కిళ్లలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ పొందగోరు అభ్యర్థులకు ఈ నెల 16న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు బీసీ స్టడీసర్కిల్ డెరైక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. పరీక్షకు హాజరుకానున్న తెలంగాణ అభ్యర్థులు tsbcstudycricles. cgg.gov.in,. ఆంధ్ర అభ్యర్థులు apbc welfare.cgg.gov.in వెబ్సైట్లలో హాల్‌టికెట్లను గురువారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
బీసీ స్టడీ సర్కిళ్లకు అన్ని వసతులు: ఈటెల
సాక్షి, హైదరాబాద్: ‘‘పోటీ పరీక్షలకు హాజరయ్యే బీసీ అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 9 బీసీ స్టడీ సర్కిళ్లు న్నాయి. వీటన్నింటిలో అనువైన సదుపాయాలు లేని మాట వాస్తవం. ప్రస్తుతం జిల్లాకు ఒకటి చొప్పున ఉన్న స్టడీ సర్కిళ్లలోనే అభ్యర్థులు తగినంత మంది లేరు. నియోజకవర్గ స్థాయిలో కొత్త స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయలేం. తమిళనాడు తరహాలో బీసీ స్టడీ సర్కిళ్లకు పూర్తిస్థాయి మౌలిక వ సతులు, అధ్యాపకులు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’’ అని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్ ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. వివిధ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. సభ్యుల ప్రశ్నలకు ఆర్థికమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి జవాబిచ్చారు. అధికారుల కుమ్మక్కును అరికడతాం..: భవన నిర్మాణ రంగంలో పలు సంస్థల నుంచి ఒక శాతం సెస్ వసూలు చేయకుండా కార్మిక శాఖ అధికారులు కుమ్మక్కవుతున్నారని ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. ఇందుకు హోంమంత్రి స్పందిస్తూ అధికారుల కుమ్మక్కును అరికడతామన్నారు. గొత్తికోయల నుంచి రక్షణ భద్రాచలం ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన గొత్తికోయలు స్థానికుల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి చెప్పగా, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు స్థానికులకు రక్షణ కల్పిస్తామని ఈటెల బదులిచ్చారు. కొత్త జిల్లాకే కొమురం భీం పేరు.. ఆదిలాబాద్ జిల్లాను రెండుగా విభజిస్తే కొత్తగా ఏర్పడే జిల్లాకు మాత్రమే కొమురం భీం పేరు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని ఈటెల చెప్పారు. దేవాలయ భూములను కాపాడండి.. 83,622 ఎకరాల దేవాలయ భూములకు గాను గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 14,530 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ ప్రశ్నకు బదులుగా మంత్రి ఈటెల చెప్పారు. కబ్జాలను ఉపేక్షించబోమన్నారు. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల వ్యయం కోసం ఆ భూములను వేలం ద్వారా కౌలుకు ఇస్తామన్నారు. నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావట్లేదు.. రాష్ట్ర జనాభాలో 11 శాతమే ముస్లింలు ఉన్నారని బడ్జెట్లో పేర్కొన్న ప్రభుత్వం.. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతుంటే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావట్లేదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున మైనార్టీలకు రిజర్వేషన్ ఏవిధంగా ఇస్తారో చెప్పాలని నిలదీశారు. దీనికి జవాబిస్తూ.. బడ్జెట్ ప్రతిలో ముస్లింల జనాభా శాతం తప్పుగా ప్రచురితమైందని డిప్యూటీ సీఎం అన్నారు. వారు 14 శాతమున్నారని, తప్పును సవరించామని చెప్పారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించే విషయమై ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ చలాన్ల పెంపు మీదేగా.. జంటనగరాల్లో ట్రాఫిక్ నియంత్రించలేని పరిస్థితుల్లో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని, ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన పోలీసులకు చలాన్ల టారె ్గట్లు పెట్టడం సరికాదని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. దీనికి హోం మంత్రి నాయిని జవాబిస్తూ.. జంటనగరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. రూ.200 ఉండే చలానాను రూ.వెయ్యికి పెం చింది కాంగ్రెస్ ప్రభుత్వమే.. వాటిని తగ్గించేం దుకు చర్యలు చేపడుతామన్నారు. విద్యుత్ చార్జీలు పెరిగే ప్రమాదం: నాగేశ్వర్ కరెంట్ కొరత, తాజా బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీలకు అరకొర కేటాయింపుల నేపథ్యంలో భవిష్యత్‌లో తెలంగాణలో సుమారు 40 శాతం మేర విద్యుత్ చార్జీలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సోమవారం మండలిలో బడ్జెట్‌పై చర్చలో ఆయన డిమాండ్ చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్యపై నిపుణుల బృందం ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి కూడా కేవలం వెయ్యి కోట్లిచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. చెరువుల పునరుద్ధరణ పథకం కాంట్రాక్టర్లు, పార్టీ కార్యకర్తల జేబులు నింపే కార్యక్రమంగా మారొద్దని సూచిం చారు. హైదరాబాద్‌లో డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్‌కు నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. 2018లో ఉస్మానియా శతదినోత్సవాలకు కేసీఆర్ అధ్యక్షతన కమిటీ వేయడంతోపాటు వర్సిటీలో అన్ని విభాగాల పటిష్టానికి రూ.500 కోట్లు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని కోరారు.