బీసీ స్టడీ సర్కిళ్లకు అన్ని వసతులు: ఈటెల
సాక్షి, హైదరాబాద్: ‘‘పోటీ పరీక్షలకు హాజరయ్యే బీసీ అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 9 బీసీ స్టడీ సర్కిళ్లు న్నాయి. వీటన్నింటిలో అనువైన సదుపాయాలు లేని మాట వాస్తవం. ప్రస్తుతం జిల్లాకు ఒకటి చొప్పున ఉన్న స్టడీ సర్కిళ్లలోనే అభ్యర్థులు తగినంత మంది లేరు. నియోజకవర్గ స్థాయిలో కొత్త స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయలేం. తమిళనాడు తరహాలో బీసీ స్టడీ సర్కిళ్లకు పూర్తిస్థాయి మౌలిక వ సతులు, అధ్యాపకులు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’’ అని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్ ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. వివిధ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. సభ్యుల ప్రశ్నలకు ఆర్థికమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి జవాబిచ్చారు.
అధికారుల కుమ్మక్కును అరికడతాం..: భవన నిర్మాణ రంగంలో పలు సంస్థల నుంచి ఒక శాతం సెస్ వసూలు చేయకుండా కార్మిక శాఖ అధికారులు కుమ్మక్కవుతున్నారని ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. ఇందుకు హోంమంత్రి స్పందిస్తూ అధికారుల కుమ్మక్కును అరికడతామన్నారు.
గొత్తికోయల నుంచి రక్షణ
భద్రాచలం ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన గొత్తికోయలు స్థానికుల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి చెప్పగా, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు స్థానికులకు రక్షణ కల్పిస్తామని ఈటెల బదులిచ్చారు.
కొత్త జిల్లాకే కొమురం భీం పేరు..
ఆదిలాబాద్ జిల్లాను రెండుగా విభజిస్తే కొత్తగా ఏర్పడే జిల్లాకు మాత్రమే కొమురం భీం పేరు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని ఈటెల చెప్పారు.
దేవాలయ భూములను కాపాడండి..
83,622 ఎకరాల దేవాలయ భూములకు గాను గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 14,530 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ ప్రశ్నకు బదులుగా మంత్రి ఈటెల చెప్పారు. కబ్జాలను ఉపేక్షించబోమన్నారు. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల వ్యయం కోసం ఆ భూములను వేలం ద్వారా కౌలుకు ఇస్తామన్నారు.
నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావట్లేదు..
రాష్ట్ర జనాభాలో 11 శాతమే ముస్లింలు ఉన్నారని బడ్జెట్‌లో పేర్కొన్న ప్రభుత్వం.. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతుంటే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావట్లేదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున మైనార్టీలకు రిజర్వేషన్ ఏవిధంగా ఇస్తారో చెప్పాలని నిలదీశారు. దీనికి జవాబిస్తూ.. బడ్జెట్ ప్రతిలో ముస్లింల జనాభా శాతం తప్పుగా ప్రచురితమైందని డిప్యూటీ సీఎం అన్నారు. వారు 14 శాతమున్నారని, తప్పును సవరించామని చెప్పారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించే విషయమై ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ట్రాఫిక్ చలాన్ల పెంపు మీదేగా..
జంటనగరాల్లో ట్రాఫిక్ నియంత్రించలేని పరిస్థితుల్లో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని, ట్రాఫిక్‌ను నియంత్రించాల్సిన పోలీసులకు చలాన్ల టారె ్గట్లు పెట్టడం సరికాదని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. దీనికి హోం మంత్రి నాయిని జవాబిస్తూ.. జంటనగరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. రూ.200 ఉండే చలానాను రూ.వెయ్యికి పెం చింది కాంగ్రెస్ ప్రభుత్వమే.. వాటిని తగ్గించేం దుకు చర్యలు చేపడుతామన్నారు.
విద్యుత్ చార్జీలు పెరిగే ప్రమాదం: నాగేశ్వర్
కరెంట్ కొరత, తాజా బడ్జెట్‌లో విద్యుత్ సబ్సిడీలకు అరకొర కేటాయింపుల నేపథ్యంలో భవిష్యత్‌లో తెలంగాణలో సుమారు 40 శాతం మేర విద్యుత్ చార్జీలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సోమవారం మండలిలో బడ్జెట్‌పై చర్చలో ఆయన డిమాండ్ చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్యపై నిపుణుల బృందం ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి కూడా కేవలం వెయ్యి కోట్లిచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. చెరువుల పునరుద్ధరణ పథకం కాంట్రాక్టర్లు, పార్టీ కార్యకర్తల జేబులు నింపే కార్యక్రమంగా మారొద్దని సూచిం చారు. హైదరాబాద్‌లో డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్‌కు నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. 2018లో ఉస్మానియా శతదినోత్సవాలకు కేసీఆర్ అధ్యక్షతన కమిటీ వేయడంతోపాటు వర్సిటీలో అన్ని విభాగాల పటిష్టానికి రూ.500 కోట్లు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని కోరారు.