సెల్ఫీ విత్‌ 'సక్సెస్‌' | Selfie of Success is also released in Braille version | Sakshi
Sakshi News home page

సెల్ఫీ విత్‌ 'సక్సెస్‌'

Published Sun, Aug 18 2019 1:17 AM | Last Updated on Sun, Aug 18 2019 1:17 AM

Selfie of Success is also released in Braille version - Sakshi

సక్సెస్‌... అంటే ఏంటి? 
ప్రారంభించిన పనిని విజయవంతంగా పూర్తి చేయటం అంటారెవరైనా.  
మరి వ్యాపారాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోగలిగినంత విజయం చవిచూసిన ‘కాఫీ సిద్ధార్థ’ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు? 

నిజానికి సక్సెస్‌ని నిర్వచించటం కష్టం...  
మారుమూల పల్లె మొదలు అగ్రరాజ్యం అమెరికా వరకు... సక్సెస్‌ కోసం ఒకటే ఉరుకులు, పరుగులు. ఆటలో గెలుపు, అంకెలు సాధించటంతో సరి. కానీ జీవితంలో గెలుపు సంగతేంటి? ప్రపంచ మానవ సమూహం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఈ గెలుపు పరుగే కారణం. ఒక వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి మరింతగా విస్తరించడం గెలుపే అయితే, ఆ తర్వాత పతనం కావటం ఓటమిగా భావించాలా.. అసలు గెలుపు సూత్రమేంటి, గెలుపు పరుగు ముగిసేదెక్కడ, సాధించిన ఏ విజయాన్ని ‘సక్సెస్‌’గా భావించవచ్చు? డబ్బు సంపాదించటమే విజయానికి నిదర్శనమైతే, పూరి గుడిసెలో ఉంటూ సంతోషంగా రోజులు వెళ్లదీసే వ్యక్తి ‘సక్సెస్‌’ చెందినట్టు కాదా.. ప్రశ్నల పరంపర.. సవాలక్ష సందేహాలకు సమాధానాలు విడమరిచి చెప్పేదెవరు?

‘సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌’ కొద్దిరోజుల క్రితం అమెజాన్‌ ఆన్‌లైన్‌ అంగట్లో హల్‌చల్‌ చేసిన పుస్తకం. 166 పేజీలతో ఉన్న ఈ పుస్తకం పేరే కాస్త గమ్మత్తుగా అనిపిస్తోంది కదూ. సెల్ఫీకి లోకం ఫిదా అయిన తరుణంలో విజయమే తన సెల్ఫీని మన ముంగిటకు తెచ్చినట్టు అనిపించేలా విడుదలైన ఆ పుస్తకం తక్కువ సమయంలో ఎక్కువ అమ్మకాలతో ఆకట్టుకుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం రాసిన ఆ పుస్తకం విడుదలైన 35 రోజుల్లో దాదాపు 20 వేల ప్రతులు అమ్ముడైనట్టు పబ్లిషర్స్‌ చెప్తున్నారు. కొత్త పుస్తకాల విభాగంలో ఇంత తక్కువ సమయంలో అధిక రేటింగ్‌ పొందిన తొలి పుస్తకం ఇదేనంటూ అమెజాన్‌ గుర్తించిందనేది వారి మాట. మరి ఇంత తక్కువ పేజీలున్న ఈ పుస్తకం అంత క్రేజ్‌ సంపాదించు కోవటానికి కారణం కూడా అంతుచిక్కని ‘విజయ రహస్యమే’. ప్రపంచవ్యాప్తంగా వారివారి రంగాల్లో విజయం సాధించిన వారు అనుసరించిన పద్ధతుల సారాంశాన్ని ఇందులో కళ్లకు కట్టినట్టు వివరించారు. దీంతో పాఠకులు కూడా విజయం అంటే ఇలా వ్యవహరించాలా అన్న తరహాలో ఆలోచించుకునేలా చేసిందా పుస్తకం.

విజయం అంటే డబ్బు సంపాదనే కాదు, విజయాన్ని ఆనందించే తత్వం, తోటి వారిని  సంతోషపెట్టేలా చేయటం అన్న విషయాన్నీ ఆ విజేతల జీవితాలను చూసి తెలుసుకునేలా చేసింది. గెలుపుపై అవగాహన, గెలుపు ప్రయాణం, గెలుపు అర్థం, గెలుపు తెచ్చే అనర్థ్ధం, గెలుపు పరమార్థం... ఇలా 5 అంకాలుగా ఈ పుస్తకంతో సారాంశం సాగిన తీరు ఆకట్టుకుంది. పుస్తకం అనతికాలంలోనే పాఠకుల ఆదరణ దక్కించుకోవటంతో బుర్రా మరికొన్ని పుస్తకాలను వెలువ రించేందుకు సిద్ధపడ్డారు. సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌ పుస్తకాన్ని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ, హిందీ భాషల్లోకి అనువదించబోతున్నారు. అది విశ్వజనీనమైన సబ్జెక్టు కావటంతో కొరియా, జపాన్, చైనా, పోర్చుగల్, పర్షియా, ఇండోనేషియా తదితర దేశాల్లో కూడా వారి భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఓ వైపు ఈ తర్జుమా తంతు జరుగుతుండగానే, ఈ సక్సెస్‌ను సమాజంతో జోడించేలా మరికొన్ని పుస్తకాలను వెలువరించే కసరత్తు మొదలుపెట్టారు బుర్రా వెంకటేశం.  

3 నెలల్లో.. 2వ పుస్తకం..
విజయంపై ఓ అవగాహన తెచ్చేలా చేసిన సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌ తర్వాత ఉత్తేజం కలిగించే విజయగాథలతో కూడిన రెండో పుస్తకాన్ని తేనున్నట్టు బుర్రా వెంకటేశం చెప్పారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఆరాధ్యులుగా మారిన వారి జీవిత గాథల సారాంశాలతో కూడిన పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ‘నో వేర్‌ నవ్‌ అండ్‌ హియర్‌’శీర్షికతో ఉండే ఈ పుస్తకం మరో మూడు నెలల్లో పాఠకుల ముందుకు తేనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రతికూలతలను కూడా అనుకూలంగా మలుచుకుని విజయాన్ని ఎలా సాధించారన్న విషయాన్ని ఆ పుస్తకం వివరిస్తుందంటున్నారు ఆయన.  
ఆ తర్వాత.. అసలు జీవితంలో సక్సెస్‌ ఎంత అవసరం అన్న విషయాన్ని చర్చించే ‘హౌమచ్‌ సక్సెస్‌ యూ నీడ్‌ ఇన్‌ లైఫ్‌’పేరుతో సిద్ధాంత గ్రం«థాన్ని వెలువరించనున్నట్టు వెల్లడించారు. అనూహ్య విజయాలు సాధించిన తక్కువ మంది.. ఎక్కువ మందిని ప్రభావితం చేయటం, భారీ విజయాలు సాధించి ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన వారు, అనంతర వ్యవహారంలో ఎలాంటి ప్రభావానికి లోనయ్యారు... లాంటి విషయాలు ఇందులో వివరించనున్నట్టు పేర్కొన్నారు.  

ఇక ‘థాంక్యూ ఎనిమీ’ పేరుతో మరో పుస్తకం వస్తుందని, మానవ పరిణామ వికాస క్రమంలో విజయాల పరంపరను ఇందులో వివరించనున్నట్టు వెల్లడించారు. ఇది 30 వేల ఏళ్ల నుంచి ఇప్పటి వరకు మనిషి పట్టుదలగా ఎలాంటి విజయాలు సాధించాడో వివరిస్తుందని పేర్కొన్నారు. ఆ విజయాలకు పురిగొల్పిన సవాళ్లను, అధిగమించిన తీరు ఇది వివరిస్తుందని పేర్కొన్నారు. ఆ తర్వాత సంతోషాన్ని నిర్వచించే మరో పుస్తకం ‘షీ’ పేరుతో వస్తుందన్నారు. స్టోరీ ఆఫ్‌ హ్యాపీనెస్‌ బై ఎవరెస్ట్‌ పేరుతో ఉండే పుస్తకం ఆ ఆంగ్ల పదాల తొలి అక్షరాల పొడి రూపమే షీ (ఎస్‌హెచ్‌ఈ)గా ఉంటుందన్నారు.

ఎవరెస్టే వివరించినట్టుగా...
ఎత్తయిన పర్వతంగా ఉన్న ఎవరెస్టు ప్రపంచాన్ని గంభీరంగా గమనిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. అది అలా విశ్వాన్ని గమనిస్తూ విజయాల గాథను వివరిస్తే ఎలా ఉంటుందనే ఐడియాతో కొత్త పుస్తకాలు వస్తాయన్నారు. తొలి పుస్తకంలో విజయమే పాఠకులతో మాట్లాడుతున్నట్టు ఉండగా, తదుపరి పుస్తకాల్లో ఎవరెస్టు పర్వతం మాట్లాడుతున్నట్టు ఉంటుందని పేర్కొన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా పోటీ తత్వం నెలకొని విజయం కోసం పరుగులు పెట్టే క్రమంలో మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. విజయం వైపు పయనంలో సంతోషమే పరమార్థం కావాలి. విజయ కాంక్షలో సంతృప్తి ఎలా అవసరం, దాన్ని స్థిరీకరించుకునే తీరు, ఆ విజయం తనకే కాకుండా, తోటివారికి కూడా ఎలా ఆనందాన్ని పంచాలి అన్న విషయంలో ప్రజలకు కొంత అవగాహన అవసరం. ఆ ఆలోచనలోంచే పుస్తక రచన ప్రారంభించా. ఈ పుస్తకాల అమ్మకంతో వచ్చే లాభాలను నిస్సహాయ వృద్ధుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తా. విజయం తెచ్చే అనర్థాలు కోణం నా తొలి పుస్తకంలో కొత్త విషయం. ఇప్పటివరకు ఎవరూ ఆ కోణంలో రచించలేదు. ఇక రూ.50 వేల కోట్లు ఆర్జించి పెట్టిన హ్యారీపోటర్‌ పుస్తకాలు కూడా బ్రెయిలీ లిపిలో విడుదల కాలేదు. కానీ నా తొలిపుస్తకాన్ని అంధులు కూడా చదివేలా బ్రెయిలీలో అందుబాటులోకి తెచ్చా’అని వెంకటేశం పేర్కొన్నారు.
    – సాక్షి, హైదరాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement