ఫీజు 36 శాతం పెంపు
కాఠ్మండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్టు అధిరోహించాలనుకునే వారికి నేపాల్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. హిమాలయ శిఖరాన్ని దక్షిణం దిశ నుంచి మార్చి– మే మధ్య వసంత రుతువులో అధిరోహించాలనుకునే విదేశీయులు ఒక్కొక్కరి నుంచి వసూలు చేస్తున్న ఫీజు మొత్తాన్ని రూ.9.50 లక్షల నుంచి ఏకంగా రూ.13 లక్షలకు పెంచేసింది. సెప్టెంబర్–నవంబర్ మధ్యన ఫీజును రూ.4.75 లక్షల నుంచి రూ.6.48 లక్షలకు పెంచింది. శీతాకాలంలో డిసెంబర్–ఫిబ్రవరి మధ్య, వర్షాకాలం జూన్–ఆగస్టు సీజన్లలో ఒక్కో వ్యక్తి చెల్లించే ఫీజును రూ.2.37 లక్షల నుంచి రూ.3.24 లక్షలకు పెంచామని గురువారం ప్రకటించింది.
నేపాలీ వ్యక్తులైతే వసంత రుతువులో చెల్లిస్తున్న రూ.75 వేల ఫీజును రూ.1.50 లక్షలకు పెంచినట్లు తెలిపింది. నూతన షరతులు ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది. పర్వతారోహణ పూర్తయిన వారు తమ వెంట తీసుకెళ్లిన మల విసర్జన బ్యాగ్‌ను తిరిగి బేస్ క్యాంపునకు వచ్చి, సక్రమంగా వదిలివేయాల్సి ఉంటుంది. 8 వేల మీటర్లకు పైగా శిఖరాలను అధిరోహించే వారు వ్యర్థాలను సేకరించేందుకు బయో డీగ్రేడబుల్ బ్యాగ్‌లను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని తెలిపింది. అంతేకాదు, పర్యాటక శాఖ అనుమతించిన వస్తువులనే వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment