Everest climber
-
13 రోజుల్లో.. మూడుసార్లు ఆమె ఎవరెస్ట్‌ను జయించింది!
పదమూడు రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచంలోనే మొదటి మహిళగా పూర్ణిమా శ్రేష్ట గుర్తింపు పొందింది. నేపాల్‌లో వృత్తి రీత్యా ఫొటో జర్నలిస్ట్ అయిన 33 ఏళ్ల పూర్ణిమ, సాటి మహిళలను ప్రోత్సహించడానికి సవాళ్లనే సోపానాలుగా చేసుకుంటున్నాను అంటోంది.‘ప్రపంచంలో ఒకే సీజన్లో ఎవరెస్ట్ శిఖరాన్ని మూడుసార్లు అధిరోహించిన మొదటి మహిళగా గుర్తింపు రావడం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. పర్వతారోహణలో పాల్గొంటున్న మహిళలను ఇప్పటికీ వేళ్లమీద లెక్కించవచ్చు. వారికి ఆసక్తి ఉంటుంది. కానీ, భయంతో వెనకంజ వేస్తుంటారు.ఇప్పుడు చాలామంది యువతులు పర్వతారోహణ గురించి నన్ను కలుస్తుంటారు. వారిలో ప్రభావంతమైన మార్పును తీసుకు రాగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. రాబోయే రెండేళ్లలో 14 మంది మహిళలను ఎవరెస్ట్ అధిరోహణకు తీసుకెళ్లగలనని నమ్మకం ఉంది.మూస పద్ధతికి స్వస్తి...ఎప్పుడూ ఒక విధమైన జీవనంలో మూసపద్ధతిలో కొనసాగడం నాకు ఇష్టం ఉండదు. అలాగని నేనేమీ సంపన్నుల ఇంట్లో పుట్టలేదు. మా అమ్మానాన్నలు నేపాల్‌లోని గోర్ఖా ప్రాంతంలోని మారుమూల గ్రామంలో నివసిస్తున్న రైతులు. నా చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ నీటి కొరత ఉండేది. రాగిబిందెతో కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకొచ్చేదాన్ని. ఆ కష్టం నాలో సవాళ్లకు మార్గం చూపింది. ఇప్పటివరకు ఎనిమిది శిఖరాలను అధిరోహించాను. నా సవాళ్ల సాధన కోసం నా స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుండి డబ్బు తీసుకున్నాను. గైడింగ్ కంపెనీ నుండి కొంత లోన్ తీసుకున్నాను. తిరిగి ఈ అప్పు తీర్చడానికి మౌంటనీయర్ గైడ్‌గా చేయాలనుకుంటున్నాను. రికార్డ్ సాధించి, పర్వతారోహణలో మహిళలు పాల్గొనడానికి ఉన్న అడ్డంకులను తొలగించాలన్నది నా లక్ష్యం. చాలామంది అడ్డు చెప్పారు. కానీ, 8,000 కిలోమీటర్ల రికార్డ్‌ను సాధించాను. ‘ఒక సాధారణ అమ్మాయి రికార్డ్ బ్రేక్ చేసింది’ అనే మాటలు విన్నప్పుడు, ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. అలసట కలిగినా..ఈ వసంత కాలంలో ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు సులువుగానే అధిరోహించాను. తర్వాత మూడవసారి కొంచెం అలసటతో కిందటి నెల 25వ తేదీని అధిరోహణ ప్రారంభమైంది. నా గైడ్, నేను ఈ అధిరోహణకు బయల్దేరాం. అలసటతో నా అడుగులు భారంగా అనిపించాయి. శిఖరాగ్రానికి చేరుకోవడానికి మధ్యలోనే అలసటతో కొంతసేపు నిద్రలోకి జారుకున్నాను.నిద్రలేపడానికి గైడ్ నా ముఖంపైకి మంచుగడ్డలను విసరాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో త్వరగానే తేరుకున్నాను. ఒక్కో అడుగు వేయడంపై దృష్టి పెట్టి మధ్యాహ్నం ఒంటి గంటకు శిఖరాగ్రానికి చేరుకుని రికార్డ్ సృష్టించాను. దాదాపు ఒక గంటపాటు పై భాగంలోనే ఉన్నాం. నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. కలల సాధనకు కృషిస్కూల్ చదువు పూర్తయ్యాక ఫొటో జర్నలిజం చేశాను. 2017లో ఎవరెస్ట్ మారథాన్ కవర్ చేసే ఫొటోగ్రఫీ అసైన్మెంట్ సమయంలో పర్వతారోహణ ప్రపంచానికి పరిచయం అయ్యాను. పర్వతాలను కలుసుకోవడానికి అంత సమయం పట్టిందే అని చాలా బాధపడ్డాను. శిఖరపు అంచున నిలబడి, అక్కడినుంచి ప్రపంచాన్ని చూడటంలోని కష్టాన్ని అర్ధం చేసుకోవాలనుకున్నాను. చాలా మంది స్త్రీలు ఇంటిపని కోసం మాత్రమే పుట్టారని అనుకుంటారు. గ్రామాల్లో చాలామంది అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేస్తుంటారు.పెళ్ళే జీవనసాఫల్యంగా ఉంటారు. ఆ తర్వాత వెంటనే మాతృత్వం. ఇంటిపనులతో జీవితం. ఇలా ఉండకూడదు నా జీవనం అనుకున్నాను. 2018లో నా పర్వతారోహణ ప్రక్రియను ప్రారంభించాను. 2022లో కాంచన్ జంగా, లోత్సే, మకాలును అధిరోహించాను. అదే నెలలో అతి తక్కువ రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించగలననే నమ్మకం కలిగింది. ఎవరెస్ట్ పైనుంచి కొత్తగా లేదా గొప్ప పనిచేస్తే ప్రజలు ముఖ్యంగా మహిళల్లో మార్పు వస్తుంది అనుకున్నాను. వాళ్లు కూడా తమ పట్ల శ్రద్ధ వహిస్తారని నా నమ్మకం.ప్రజలలో మహిళల పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చడమే నా ఉద్దేశ్యం. తమ సామర్థ్యాలను విశ్వసించ లేనివారు కలలను సాకారం చేసుకోలేరు.. మనం ఏం సాధించాలని అనుకుంటున్నామో దానిని మనలోనే అన్వేషించాలి. అప్పుడు మనలోని అంకితభావం, ధైర్యంతో ముందడుగు వేస్తే ఆ ఆశయమే అత్యున్నత శిఖరాలను చేర్చుతుంది’’ అని వివరించే పూర్ణిమ మాటలు యువతకు స్ఫూర్తిని కలిగిస్తాయి. -
ఎవరెస్ట్: దారి పొడవునా వ్యర్థాలే.. ఇక ‘డబ్బా’ టాయిలెట్స్!
ఎవరెస్ట్ బేస్ క్యాంపు నుంచి శిఖరానికి చేరుకునే మార్గం వెంబడి మానవ వ్యర్థాలు పోగుపడుతున్నాయి. రాళ్లపై మానవ విసర్జితాల రాశులు దర్శనమిస్తూ హిమాలయ అందాలను వెక్కిరిస్తున్నాయి. పర్వత పర్యాటకులకు అనారోగ్యం ముప్పు పొంచివుంది. దీంతో పర్వతారోహకుల విసర్జితాల వ్యవహారంపై నేపాల్ కొత్త చట్టంతో విరుచుకుపడింది. పర్వతారోహకులు ఇక నుంచి బేస్ క్యాంపు వద్ద తప్పనిసరిగా ‘మలం సంచులు’ కొనాలంటూ ఆంక్షలు విధించింది. అలాస్కాలోని మౌంట్ డెనాలి తదితర పర్వతాల విషయంలోనూ ఇలాంటి కట్టుబాట్లే విజయవంతంగా అమలవుతున్నాయి. వ్యర్థాల నిర్వహణ కోసం పర్వతారోహకులు, షెర్పాలు, ఇతర సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రెండు బ్యాగ్స్ ఇస్తారు. వాటిని వాడిందీ, లేనిదీ వారి తిరుగుపయనంలో తనిఖీ చేస్తారు. ఇందుకోసం నేపాల్ 8 వేల సంచుల్ని అమెరికా నుంచి తెప్పిస్తోంది. సంచుల్లోని రసాయన పదార్థాలు శారీరక వ్యర్థాలను గట్టిపరచి, వాటి దుర్వాసనను తగ్గిస్తాయట. నిజానికి ఇవి క్లీన్ మౌంటెయిన్ క్యాన్స్ (సీఎంసీ). వీటిని పోర్టబుల్ ‘డబ్బా’ టాయిలెట్స్ అనవచ్చు. హిమాలయాల శీతల ఉష్ణోగ్రతల్లో మానవ వ్యర్థాలు పాడవకుండా అలాగే ఉండిపోతూ నేపాల్ అధికార వర్గాలకు చాన్నాళ్లుగా చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఎవరెస్టు శిఖరాధిరోహణం కోసం ఏటేటా పర్వతారోహకులకు ఇచ్చే పర్మిట్ల సంఖ్య పెరుగుతోంది. 2021లో నేపాల్ ఇచ్చిన పర్మిట్స్ 409 కాగా, గత సంవత్సరం 1,500 మందికి పైగా పర్వతారోహకులు, గైడ్స్, సహాయ సిబ్బందికి కలిపి 478 పర్మిట్స్ ఇచ్చారు. దీంతో హిమాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. మంచుకొండల్లో ట్రాఫిక్ పెరుగుతోంది. ఔత్సాహికుల కారణంగా రద్దీ ఏర్పడుతోంది. నేపాల్ ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ఈ ఏడాది పర్వతారోహణ సీజన్ నుంచి అమల్లోకొస్తుంది. ఈ సీజన్ వచ్చే మార్చి నెల నుంచి మే నెల ఆఖరి వరకు ఉంటుంది. ఎవరెస్ట్ పాద ప్రాంతంలోని క్యాంప్ 1, ఎవరెస్ట్ శిఖరం సమీపంలోని క్యాంప్ 4 ప్రాంతం మధ్య సుమారు 3 టన్నుల మానవ వ్యర్థాల పోగులున్నట్టు సాగరమాత కాలుష్య నియంత్రణ కమిటీ అంచనా వేస్తోంది. ఇందులో సగం వ్యర్థాలు క్యాంప్ 4 వద్దే ఉన్నాయట. తమకు ఇచ్చిన ‘మలం సంచుల్ని’ పర్వతారోహకులు తిరిగి తెస్తారా? లేక పర్వతంపైనే పడేసి వస్తారా? అంటూ సందేహం వెలిబుచ్చారు బ్రిటిష్ ఎక్స్‌పెడిషన్ కంపెనీ డైరెక్టర్ జొనాథన్ రీలీ. ప్రపంచంలో అత్యంత ఎత్తైన 14 పర్వత శిఖరాల్లో 8 శిఖరాలు హిమరాజ్యమైన నేపాల్‌లోనే ఉన్నాయి. పర్వత పర్యాటకం ద్వారా నేపాల్ ప్రభుత్వం నిరుడు మే 14 నాటికి రూ.48 కోట్లు ఆర్జించింది. ఒక్క ఎవరెస్ట్ పర్వతమే ఇందులో రూ.41 కోట్లు సంపాదించి పెట్టింది. షెర్పా టెంజింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి గత ఏడాదికి 70 వసంతాలు పూర్తయ్యాయి. - జమ్ముల శ్రీకాంత్ -
రెస్ట్ తీసుకునే వయసులో ఎవరెస్ట్‌పై రాజశిఖామణి
ఒంగోలు: ఉద్యోగ విరమణ చేసినా అతనిలో ప్రతిభాపాటవాలు తగ్గలేదు. ఏకంగా ఎవరెస్టునే ఎక్కి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అతనే కాకుమాను రాజశిఖామణి. ప్రకాశం జిల్లా ఒంగోలు క్లౌపేటకు చెందిన ఈ రిటైర్డ్ ఎస్పీ 63 ఏళ్ల వయసులో ఈనెల 3న ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు. 1981లోనే ఆయన సబ్ఇన్స్పెక్టర్గా పోలీసు శాఖలో ప్రవేశించారు. అత్యంత క్లిష్టమైన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు శిక్షణతోపాటు నేషనల్ సెక్యూరిటీ గార్డు (బ్లాక్ క్యాట్ కమాండో) శిక్షణ పొందారు. 1987లో ఆరుగురు ఐఏఎస్‌లను మావోయిస్టుల చెర నుంచి విడిపించడంలో ఆయన అనుసరించిన వ్యూహంతో గుర్తింపు పొందారు. అత్యధిక కాలం ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో ఏపీ పోలీసు అకాడమీలో పనిచేశారు. విజయనగరం పోలీసు ట్రైనింగ్ కాలేజీ ఎస్పీగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి తనకు ఇష్టమైన పర్వతారోహణ చేయాలని సంకల్పించారు. 2019లో తన 61 ఏళ్ల వయసులో యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్ ఎల్బరస్ 5,642 మీటర్ల ఎత్తును అధిరోహించారు. తాజాగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మరోమారు ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారు. దేశంలోని రిటైర్డ్ పోలీసు అధికారుల్లో ఎవరెస్టు అధిరోహించిన ఏకైక వ్యక్తిగా రాజశిఖామణి నిలిచారు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై మీర్‌పేట యువకుడు
సాక్షి, మీర్‌పేట: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్న ఆ యువకుడు మొదటి అడుగులో హిమాలయాల్లోని బేస్ క్యాంప్‌ను చేరుకున్నాడు. మీర్‌పేట టీఆర్ఆర్ టౌన్‌షిప్‌కు చెందిన వేముల సందీప్ హైటెక్ సిటీలోని ఆటోమేటిక్ డేటా ప్రాసెసింగ్ (ఏడీపీ) కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసున్నాడు. బాల్యం నుంచే ఎత్తయిన కొండలను అధిరోహించాలని బలమైన కోరిక ఉండేది. ఈ క్రమంలో చిన్న చిన్న సాహస యాత్రలకు శ్రీకారం చుట్టాడు. ఎవరెస్ట్ శిఖరంతో పాటు ప్రపంచంలోని ఎత్తయిన 7 శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఈ నెల 4న నేపాల్‌లోని 5,364 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సాహస యాత్రతో ఏడు రోజుల్లో లక్ష్యాన్ని చేరుకున్నాడు. మరో మూడు రోజుల్లో కిందికి చేరుకున్నాడు. సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందీప్ శనివారం అర్ధరాత్రి తిరిగి నగరానికి చేరుకున్నాడు. మైనస్ 18 డిగ్రీల చలిలో.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే నా లక్ష్యం. దేశంలోని పలు ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌లకు వెళ్లాను. కేవలం ఒకే గైడ్ సహాయంతో యాత్రను ప్రారంభించి 7 రోజుల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లక్ష్యానికి చేరుకున్నా. మైనస్ 18 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో, ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేకుండా, మాత్రలు వాడకుండా తిరిగి మూడు రోజుల్లో కిందికి చేరుకుని యాత్రను విజయవంతంగా పూర్తి చేశా. ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే 12 రోజుల్లో పూర్తి చేయాల్సిన సాహసయాత్రను 10 రోజుల్లో పూర్తి చేశా. టాంజానియాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నాను. – వేముల సందీప్ -
భర్తకు చెప్పి ఎక్కడం మొదలుపెట్టాను
ఎవరికైనా ఒక్కసారి ఎవరెస్ట్ శిఖరం అధిరోహిస్తే చాలు అనే కల ఉంటుంది. కానీ, 41 ఏళ్ల అన్షు జమ్సేన్పా మాత్రం ఒకే సీజన్లో రెండుసార్లు పర్వతారోహణ పూర్తి చేసిన తొలి మహిళగా వార్తల్లో నిలిచింది. ఆమె సాధించిన ఘనతకు మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఈ పోటీ ప్రపంచంలో ‘వేగం’ అత్యవసరం అని నిరూపిస్తుంది అన్షు జమ్సేన్పా. ఆ వేగం వల్లే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. భర్త, అత్తమామ, పిల్లలు ఇంట్లో అన్ని బాధ్యతలనూ ఓ చేత్తో మోస్తూనే తన కలల జెండాను ఎవరెస్ట్ శిఖరం అంచున రెపరెపలాడించింది. ఐదు సార్లు అధిరోహణ.. జీవితంలో ఒక్కసారయినా ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని కలలు కనేవారు ప్రపంచం లో చాలా మంది ఉన్నారు. కానీ, అందరి కలలు నెరవేరవు. వారి శ్రమ, పట్టుదల కూడా అంతే వెనకంజలో ఉంటాయి. కానీ, అన్షు జమ్సేన్పా ఎవరెస్ట్ శిఖరాన్ని ఒక్కసారి కాదు ఐదుసార్లు అధిరోహించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని దిరాంగ్ ఆమె జన్మస్థలం. ఇద్దరు పిల్లల తల్లి అయిన అన్షు 2009లో పర్వతారోహణ ప్రారంభించింది. తాను సాధించిన విజయం గురించి అన్షు మాట్లాడుతూ– ‘నేను అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో రాణించేదాన్ని. రాక్ క్లైంబింగ్ చేసేదాన్ని. ఆ సమయంలో అరుణాచల్ పర్వతారోహణ, అడ్వెంచర్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్లు నా ప్రతిభ గుర్తించి నా భర్తకు చెప్పి, ఒప్పించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించమని నన్ను ప్రోత్సహించారు. ఒకసారి నేను ఎవరెస్ట్ ఎక్కడం మొదలుపెట్టాను, మరలా వెనక్కి తిరిగి చూడలేదు’ అని వివరించింది అన్షు. అధిరోహణ కష్టమే.. అయినా ఇష్టం.. శిక్షణా సమయంలో పర్వతాలను అధిరోహించడం తనకు చాలా ఇష్టమని గ్రహించిన అన్షు ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారి జయించిన రోజు ఇప్పటికీ గుర్తుంది అని సంతోషం వ్యక్తం చేస్తుంది. అన్షుకు ఇప్పటికీ గుర్తుంది. ఆమె ఈ విషయం గురించి మరింతగా మాట్లాడుతూ ‘నేను దేవుని దగ్గరికి చేరుకున్నట్టే అనిపించింది. నా కలలో నేను చూసిన సన్నివేశం నా కళ్ల ముందు నిలిచింది. ఆ సమయంలో నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు’ అని సంబరంగా చెబుతుంది అన్షు. ఆమె తండ్రి ఇండోటిబెట్ సరిహద్దులో ఒక పోలీసు అధికారి, తల్లి నర్సు. ఎవరెస్టును జయించటానికి అన్షు రన్నింగ్, జిమ్, యోగా, ఏరోబిక్స్ వంటివి నేర్చుకుంది. మొదట చిన్న చిన్న పర్వతాలను అధిరోహించడం ద్వారా తన లక్ష్యాన్ని చేరుకుంది. -
మస్తాన్‌బాబు ఆశయాలను సాధిస్తా : భద్రయ్య
రంపచోడవరం : ప్రభుత్వం అవకాశం కల్పిస్తే ఐరోపాలోని ఆల్ప్స్ పర్వతాలను అధిరోహించి మల్లి మస్తాన్‌బాబు ఆశయాలను నెరవేరుస్తానని ప్రపంచంలోని ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గిరిజన యువకుడు దూబి భద్రయ్య అన్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మంగళవారం రంపచోడవరం వచ్చిన భద్రయ్యను ఐటీడీఏ పీఓ కేవీఎన్ చక్రధర్‌బాబు అభినందించారు. పీఎంఆర్సీ, ఐటీడీఏ ఆధ్వర్యంలో భద్రయ్యకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భద్రయ్య మాట్లాడుతూ కృషి, పట్టుదల ఐటీడీఏ ఇచ్చిన సహకారంతో ఈ లక్ష్యాన్ని సాధించానన్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతానికి మంచి పేరు తీసుకువచ్చారని, ఐటీడీఏ తరఫున ఉపాధి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సబ్కలెక్ట్ రవిపటాన్శెట్టి, ఈఈ పీకే నాగేశ్వరావు, సీహెచ్ఓ డి.శ్రీనివాస్, ఏపీడీ శంకర్ నాయక్, డీఈలు శ్రీనివాస్, హరికృష్ణ, ఏఎంఓ డీఎస్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పదిరోజుల ప్రయాణం... ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తిరిగి రావడానికి పది రోజుల సమయం పట్టిందని భద్రయ్యఅన్నారు.నార్త్కోల్ నుంచి ఏబీసీ-1,2,3లు దాటుకొని 8848 మీటర్ల ప్రయాణించి ఎవరెస్టును ఎక్కడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఎవరెస్టు శిఖరం అధిరోహణలో ఎక్కడా భయపడలేదని తెలిపారు. మైనస్ జీరో డిగ్రీల వద్ద తన శరీరం సహకరిస్తుందని నిర్ధారించుకున్న తర్వాతే తన ప్రయాణం సాగిందన్నారు. ఆరుగురు సభ్యుల బృందంలో 8500 మీటర్లు పైకి ఎక్కిన తరువాత ఒకరు వెనుదిరిగారని తెలిపారు. మంచుకొండల్లో రాత్రిపూట నడక ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిందన్నారు. ఎవరెస్టు శిఖరం ఎక్కడానికి ఏడురోజులు, తిరిగిరావడానికి మూడు రోజుల సమయం పట్టిందన్నారు. ఎవరెస్టు ఎక్కడానికి సహరించిన ఐటీడీఏ పీఓ, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ తనకు శాశ్వత ఉపాధి అవకాశం కల్పించాలని కోరారు. పోలీస్ శాఖలో చేరాలన్న తన కోరిక నెరవేరకపోవడంతో ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించానన్నరు. గిరిజనుడిగా కొండల్లో సాగిన తన జీవనం ఎవరెస్టును అధిరోహించడానికి ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఎవరెస్టు అధిరోహించాలని కోరిక ఉన్నవారికి తాను శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. -
ఎవరెస్ట్ అధిరోహకుడికి ఫస్ట్‌క్లాస్
చండ్రుగొండ: ఏడాది క్రితం ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి దేశానికే గర్వకారణంగా నిలిచిన సాధనపల్లి ఆనంద్‌కుమార్ చదువులోనూ ప్రతిభ కనబరిచాడు. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లిలోని తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల కళాశాలలో చదువుకుంటున్న ఆనంద్‌కుమార్ ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీలో 721 మార్కులు (72 శాతం) మార్కులు సాధించాడు. ఆనంద్ చదువులోనూ రాణించడంతో కళాశాల ప్రిన్స్‌పాల్ శివన్నారాయణ, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.