ఎవరికైనా ఒక్కసారి ఎవరెస్ట్ శిఖరం అధిరోహిస్తే చాలు అనే కల ఉంటుంది. కానీ, 41 ఏళ్ల అన్షు జమ్సేన్పా మాత్రం ఒకే సీజన్‌లో రెండుసార్లు పర్వతారోహణ పూర్తి చేసిన తొలి మహిళగా వార్తల్లో నిలిచింది. ఆమె సాధించిన ఘనతకు మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
ఈ పోటీ ప్రపంచంలో ‘వేగం’ అత్యవసరం అని నిరూపిస్తుంది అన్షు జమ్సేన్పా. ఆ వేగం వల్లే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. భర్త, అత్తమామ, పిల్లలు ఇంట్లో అన్ని బాధ్యతలనూ ఓ చేత్తో మోస్తూనే తన కలల జెండాను ఎవరెస్ట్ శిఖరం అంచున రెపరెపలాడించింది.
ఐదు సార్లు అధిరోహణ..
జీవితంలో ఒక్కసారయినా ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని కలలు కనేవారు ప్రపంచం లో చాలా మంది ఉన్నారు. కానీ, అందరి కలలు నెరవేరవు. వారి శ్రమ, పట్టుదల కూడా అంతే వెనకంజలో ఉంటాయి. కానీ, అన్షు జమ్సేన్పా ఎవరెస్ట్ శిఖరాన్ని ఒక్కసారి కాదు ఐదుసార్లు అధిరోహించింది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని దిరాంగ్ ఆమె జన్మస్థలం. ఇద్దరు పిల్లల తల్లి అయిన అన్షు 2009లో పర్వతారోహణ ప్రారంభించింది. తాను సాధించిన విజయం గురించి అన్షు మాట్లాడుతూ– ‘నేను అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో రాణించేదాన్ని. రాక్ క్లైంబింగ్ చేసేదాన్ని. ఆ సమయంలో అరుణాచల్ పర్వతారోహణ, అడ్వెంచర్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్లు నా ప్రతిభ గుర్తించి నా భర్తకు చెప్పి, ఒప్పించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించమని నన్ను ప్రోత్సహించారు. ఒకసారి నేను ఎవరెస్ట్ ఎక్కడం మొదలుపెట్టాను, మరలా వెనక్కి తిరిగి చూడలేదు’ అని వివరించింది అన్షు.
అధిరోహణ కష్టమే.. అయినా ఇష్టం..
శిక్షణా సమయంలో పర్వతాలను అధిరోహించడం తనకు చాలా ఇష్టమని గ్రహించిన అన్షు ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారి జయించిన రోజు ఇప్పటికీ గుర్తుంది అని సంతోషం వ్యక్తం చేస్తుంది. అన్షుకు ఇప్పటికీ గుర్తుంది. ఆమె ఈ విషయం గురించి మరింతగా మాట్లాడుతూ ‘నేను దేవుని దగ్గరికి చేరుకున్నట్టే అనిపించింది. నా కలలో నేను చూసిన సన్నివేశం నా కళ్ల ముందు నిలిచింది. ఆ సమయంలో నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు’ అని సంబరంగా చెబుతుంది అన్షు.
ఆమె తండ్రి ఇండోటిబెట్ సరిహద్దులో ఒక పోలీసు అధికారి, తల్లి నర్సు. ఎవరెస్టును జయించటానికి అన్షు రన్నింగ్, జిమ్, యోగా, ఏరోబిక్స్ వంటివి నేర్చుకుంది. మొదట చిన్న చిన్న పర్వతాలను అధిరోహించడం ద్వారా తన లక్ష్యాన్ని చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment