ఎవరెస్ట్: దారి పొడవునా వ్యర్థాలే.. ఇక ‘డబ్బా’ టాయిలెట్స్!  | Mount Everest 'Stinks Of Poo' As Climbers Open Toilet | Sakshi
Sakshi News home page

ఎవరెస్ట్: దారి పొడవునా వ్యర్థాలే.. ఇక ‘డబ్బా’ టాయిలెట్స్! 

Published Sat, Feb 10 2024 7:31 AM | Last Updated on Sat, Feb 10 2024 8:20 AM

Mount Everest Stinks Of Poo As Climbers Open Toilet - Sakshi

ఎవరెస్ట్ బేస్ క్యాంపు నుంచి శిఖరానికి చేరుకునే మార్గం వెంబడి మానవ వ్యర్థాలు పోగుపడుతున్నాయి. రాళ్లపై మానవ విసర్జితాల రాశులు దర్శనమిస్తూ హిమాలయ అందాలను వెక్కిరిస్తున్నాయి. పర్వత పర్యాటకులకు అనారోగ్యం ముప్పు పొంచివుంది. దీంతో పర్వతారోహకుల విసర్జితాల వ్యవహారంపై నేపాల్ కొత్త చట్టంతో విరుచుకుపడింది. పర్వతారోహకులు ఇక నుంచి బేస్ క్యాంపు వద్ద తప్పనిసరిగా ‘మలం సంచులు’ కొనాలంటూ ఆంక్షలు విధించింది.

అలాస్కాలోని మౌంట్ డెనాలి తదితర పర్వతాల విషయంలోనూ ఇలాంటి కట్టుబాట్లే విజయవంతంగా అమలవుతున్నాయి. వ్యర్థాల నిర్వహణ కోసం పర్వతారోహకులు, షెర్పాలు, ఇతర సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రెండు బ్యాగ్స్ ఇస్తారు. వాటిని వాడిందీ, లేనిదీ వారి తిరుగుపయనంలో తనిఖీ చేస్తారు. ఇందుకోసం నేపాల్ 8 వేల సంచుల్ని అమెరికా నుంచి తెప్పిస్తోంది. సంచుల్లోని రసాయన పదార్థాలు శారీరక వ్యర్థాలను గట్టిపరచి, వాటి దుర్వాసనను తగ్గిస్తాయట. నిజానికి ఇవి క్లీన్ మౌంటెయిన్ క్యాన్స్ (సీఎంసీ). వీటిని పోర్టబుల్ ‘డబ్బా’ టాయిలెట్స్ అనవచ్చు.

హిమాలయాల శీతల ఉష్ణోగ్రతల్లో మానవ వ్యర్థాలు పాడవకుండా అలాగే ఉండిపోతూ నేపాల్ అధికార వర్గాలకు చాన్నాళ్లుగా చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఎవరెస్టు శిఖరాధిరోహణం కోసం ఏటేటా పర్వతారోహకులకు ఇచ్చే పర్మిట్ల సంఖ్య పెరుగుతోంది. 2021లో నేపాల్ ఇచ్చిన పర్మిట్స్ 409 కాగా, గత సంవత్సరం 1,500 మందికి పైగా పర్వతారోహకులు, గైడ్స్, సహాయ సిబ్బందికి కలిపి 478 పర్మిట్స్ ఇచ్చారు. దీంతో హిమాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. మంచుకొండల్లో ట్రాఫిక్ పెరుగుతోంది. ఔత్సాహికుల కారణంగా రద్దీ ఏర్పడుతోంది.

నేపాల్ ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ఈ ఏడాది పర్వతారోహణ సీజన్ నుంచి అమల్లోకొస్తుంది. ఈ సీజన్ వచ్చే మార్చి నెల నుంచి మే నెల ఆఖరి వరకు ఉంటుంది. ఎవరెస్ట్ పాద ప్రాంతంలోని క్యాంప్ 1, ఎవరెస్ట్ శిఖరం సమీపంలోని క్యాంప్ 4 ప్రాంతం మధ్య సుమారు 3 టన్నుల మానవ వ్యర్థాల పోగులున్నట్టు సాగరమాత కాలుష్య నియంత్రణ కమిటీ అంచనా వేస్తోంది. ఇందులో సగం వ్యర్థాలు క్యాంప్ 4 వద్దే ఉన్నాయట. తమకు ఇచ్చిన ‘మలం సంచుల్ని’ పర్వతారోహకులు తిరిగి తెస్తారా? లేక పర్వతంపైనే పడేసి వస్తారా? అంటూ సందేహం వెలిబుచ్చారు బ్రిటిష్ ఎక్స్పెడిషన్ కంపెనీ డైరెక్టర్ జొనాథన్ రీలీ.

ప్రపంచంలో అత్యంత ఎత్తైన 14 పర్వత శిఖరాల్లో 8 శిఖరాలు హిమరాజ్యమైన నేపాల్‌లోనే ఉన్నాయి. పర్వత పర్యాటకం ద్వారా నేపాల్ ప్రభుత్వం నిరుడు మే 14 నాటికి రూ.48 కోట్లు ఆర్జించింది. ఒక్క ఎవరెస్ట్ పర్వతమే ఇందులో రూ.41 కోట్లు సంపాదించి పెట్టింది.  షెర్పా టెంజింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి గత ఏడాదికి 70 వసంతాలు పూర్తయ్యాయి.  
- జమ్ముల శ్రీకాంత్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement