Everest mount
-
ఎవరెస్ట్: దారి పొడవునా వ్యర్థాలే.. ఇక ‘డబ్బా’ టాయిలెట్స్!
ఎవరెస్ట్ బేస్ క్యాంపు నుంచి శిఖరానికి చేరుకునే మార్గం వెంబడి మానవ వ్యర్థాలు పోగుపడుతున్నాయి. రాళ్లపై మానవ విసర్జితాల రాశులు దర్శనమిస్తూ హిమాలయ అందాలను వెక్కిరిస్తున్నాయి. పర్వత పర్యాటకులకు అనారోగ్యం ముప్పు పొంచివుంది. దీంతో పర్వతారోహకుల విసర్జితాల వ్యవహారంపై నేపాల్ కొత్త చట్టంతో విరుచుకుపడింది. పర్వతారోహకులు ఇక నుంచి బేస్ క్యాంపు వద్ద తప్పనిసరిగా ‘మలం సంచులు’ కొనాలంటూ ఆంక్షలు విధించింది. అలాస్కాలోని మౌంట్ డెనాలి తదితర పర్వతాల విషయంలోనూ ఇలాంటి కట్టుబాట్లే విజయవంతంగా అమలవుతున్నాయి. వ్యర్థాల నిర్వహణ కోసం పర్వతారోహకులు, షెర్పాలు, ఇతర సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రెండు బ్యాగ్స్ ఇస్తారు. వాటిని వాడిందీ, లేనిదీ వారి తిరుగుపయనంలో తనిఖీ చేస్తారు. ఇందుకోసం నేపాల్ 8 వేల సంచుల్ని అమెరికా నుంచి తెప్పిస్తోంది. సంచుల్లోని రసాయన పదార్థాలు శారీరక వ్యర్థాలను గట్టిపరచి, వాటి దుర్వాసనను తగ్గిస్తాయట. నిజానికి ఇవి క్లీన్ మౌంటెయిన్ క్యాన్స్ (సీఎంసీ). వీటిని పోర్టబుల్ ‘డబ్బా’ టాయిలెట్స్ అనవచ్చు. హిమాలయాల శీతల ఉష్ణోగ్రతల్లో మానవ వ్యర్థాలు పాడవకుండా అలాగే ఉండిపోతూ నేపాల్ అధికార వర్గాలకు చాన్నాళ్లుగా చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఎవరెస్టు శిఖరాధిరోహణం కోసం ఏటేటా పర్వతారోహకులకు ఇచ్చే పర్మిట్ల సంఖ్య పెరుగుతోంది. 2021లో నేపాల్ ఇచ్చిన పర్మిట్స్ 409 కాగా, గత సంవత్సరం 1,500 మందికి పైగా పర్వతారోహకులు, గైడ్స్, సహాయ సిబ్బందికి కలిపి 478 పర్మిట్స్ ఇచ్చారు. దీంతో హిమాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. మంచుకొండల్లో ట్రాఫిక్ పెరుగుతోంది. ఔత్సాహికుల కారణంగా రద్దీ ఏర్పడుతోంది. నేపాల్ ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ఈ ఏడాది పర్వతారోహణ సీజన్ నుంచి అమల్లోకొస్తుంది. ఈ సీజన్ వచ్చే మార్చి నెల నుంచి మే నెల ఆఖరి వరకు ఉంటుంది. ఎవరెస్ట్ పాద ప్రాంతంలోని క్యాంప్ 1, ఎవరెస్ట్ శిఖరం సమీపంలోని క్యాంప్ 4 ప్రాంతం మధ్య సుమారు 3 టన్నుల మానవ వ్యర్థాల పోగులున్నట్టు సాగరమాత కాలుష్య నియంత్రణ కమిటీ అంచనా వేస్తోంది. ఇందులో సగం వ్యర్థాలు క్యాంప్ 4 వద్దే ఉన్నాయట. తమకు ఇచ్చిన ‘మలం సంచుల్ని’ పర్వతారోహకులు తిరిగి తెస్తారా? లేక పర్వతంపైనే పడేసి వస్తారా? అంటూ సందేహం వెలిబుచ్చారు బ్రిటిష్ ఎక్స్‌పెడిషన్ కంపెనీ డైరెక్టర్ జొనాథన్ రీలీ. ప్రపంచంలో అత్యంత ఎత్తైన 14 పర్వత శిఖరాల్లో 8 శిఖరాలు హిమరాజ్యమైన నేపాల్‌లోనే ఉన్నాయి. పర్వత పర్యాటకం ద్వారా నేపాల్ ప్రభుత్వం నిరుడు మే 14 నాటికి రూ.48 కోట్లు ఆర్జించింది. ఒక్క ఎవరెస్ట్ పర్వతమే ఇందులో రూ.41 కోట్లు సంపాదించి పెట్టింది. షెర్పా టెంజింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి గత ఏడాదికి 70 వసంతాలు పూర్తయ్యాయి. - జమ్ముల శ్రీకాంత్ -
ఎవరెస్ట్ యమ డేంజర్.. పది వేల అడుగులు దాటితే..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా వెండి కొండలా ధగధగలాడిపోతూ మంచుతో నిండిపోయిన ఈ పర్వత శిఖరం చేరుకోవడమంటే ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవడమే. అందుకే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నా, ప్రాణాలతో తిరిగి వస్తామన్న భరోసా లేకపోయినా ప్రతీ ఏడాది ఎందరో సాహసికులు ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవాలని తమ దేశ జెండాని పాతాలని ఆరాటపడుతుంటారు. మౌంట్ ఎవరెస్ట్‌ను తొలిసారి ఎక్కడం ప్రారంభించి 70 ఏళ్లయింది. 1953 సంవత్సరం మే 29న న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ భారత్‌కు చెందిన టెన్జింగ్ నార్గేలు ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరుకున్నారు. ఈ 70 ఏళ్లలో కనీవినీ ఎరుగని మార్పులు వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఆధునిక సదుపాయాలు చోటు చేసుకోవడంతో ఎవరెస్ట్ అధిరోహించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్ పర్వతారోహకులకు ఈ ఏడాది నేపాల్ ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు మంజూరు జారీ చేయడంతో ఎవరెస్ట్ అధిరోహణ మరింత ప్రమాదకరంగా మారింది. అసాధారణ రీతిలో 900 మంది పర్వతారోహకులకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొండపై భారీగా ట్రాఫిక్ జామ్‌లు కనిపించాయి. శిఖరాగ్రం చేరుకోవాలంటే 26 వేల అడుగులు పైకి వెళ్లాలి. పది వేల అడుగులు దాటితే ఇంక మృత్యువు ముఖంలోకి అడుగు పెట్టినట్టే. అంత ఎత్తులో ఆక్సిజన్ సరిగా అందదు. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతుంది. రక్తం గడ్డ కట్టేలా వాతావరణం మైనస్ 20 డిగ్రీలకు పడిపోతుంది. శారీరకంగా ఎంత ఫిట్నెస్ ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి ప్రాణాలు పోతాయి. సముద్ర మట్టానికి అంత ఎత్తుకు చేరుకుంటే ఒక్కోసారి మెదడు, ఊపిరితిత్తులకు వాపు వచ్చి శరీరంపై స్వాధీనం కోల్పోతారు. ఈ సారి ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు మంచులో గల్లంతయ్యారు. ఇటీవల ఈ స్థాయిలో మరణాలు ఎప్పుడూ సంభవించలేదు. ‘‘ఒకేసారి పర్వతారోహకులు కొండ ఎక్కుతూ ఉంటే వారికి ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆక్సిజన్ ఏర్పాటు చేయడం అత్యంత ముఖ్యం. మా ద్వారా ఎవరెస్ట్ అధిరోహించే పర్వతారోహకులెవరూ ఇప్పటివరకు ఏ సమస్య ఎదుర్కోలేదు’’అని ఆస్ట్రియాకు చెందిన లుకాస్ ఫర్టెన్‌బాచ్ అనే కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏడాది తమ సంస్థ తరఫున 100 మంది దిగ్విజయంగా ఎవరెస్ట్ ఎక్కి వచ్చారని చెప్పారు. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ముప్పు ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు ఎవరెస్ట్ అధిరోహకులకు అతి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. 1979 నుంచి చూస్తే గత 40 ఏళ్లలో ఎవరెస్ట్‌పై ఉష్ణోగ్రతలు సగటున 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి. దీంతో హిమానీ నదాలు కరిగి మంచు చరియలు విరిగి పడటం వంటిæ ప్రమాదాలు ముంచుకొస్తాయి. కొన్నేళ్లుగా ఎవరెస్ట్ అధిరోహించే వారు ఈ మార్పుల ప్రభావం విపరీతంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పదేళ్లలో ఎవరెస్ట్ ఎక్కే మార్గం ఎలా మారుతుందో ఊహకి కూడా అందడం లేదని నేపాల్ మౌంటనీరింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆంగ్ షెరింగ్ పేర్కొన్నారు. ఆదాయానికి ఆశపడి..? నేపాల్‌కు పర్యాటకమే ప్రధాన ఆధారం. ఎవరెస్ట్ అధిరోహణ నుంచే అధికంగా ఆదాయం సమకూరుతుంది. పశ్చిమ దేశాల నుంచి వచ్చే పర్వతారోహకుల నుంచి11 వేల డాలర్లు (రూ.9 లక్షలు) చొప్పున వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే కాకుండా వెంట తీసుకు వెళ్లే ఆక్సిజన్, ఆహారం, గైడ్ల కోసం మొత్తంగా ఒక్కొక్కరికి 27 వేల డాలర్లు (దాదాపుగా రూ.22 లక్షలు) ఖర్చు అవుతుంది. అయితే నేపాల్ ప్రభుత్వం ఆదాయానికి ఆశపడే అనుమతులు ఎక్కువగా ఇస్తున్నామన్న ఆరోపణల్ని తోసిపుచ్చింది. ప్రతీ పర్వతారోహకుడి ప్రాణ రక్షణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బేస్ క్యాంప్‌లో వైద్యులు, అధికారుల బృందం ఈ సాహస యాత్రను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. ఏదైనా సాధ్యమే ప్రపంచంలో ఎవరెస్ట్ మ్యాన్‌గా పేరు పొందిన నేపాల్‌కు చెందిన షెర్పా కామి రిటా 28 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా నిలిచి తన రికార్డు తానే బద్దలు కొట్టాడు. ఈ ఏడాది వారం రోజుల తేడాలో రెండు సార్లు శిఖరాగ్రానికి చేరుకున్నాడు. తన రికార్డుని పసాంగ్ దావా అనే షెర్పా సమం చేయడంతో ఆ మరుసటి రోజే మళ్లీ ఎక్కి అత్యధికసార్లు ఎవరెస్ట్‌ని ఎక్కిన వ్యక్తిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక బ్రిటన్‌కు చెందిన మాజీ సైనికుడు హరి బుధా మాగర్ కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు. మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు. ఒక మలేసియన్ పర్వతారోహకుడు అనారోగ్యం బారిన పడితే నేపాలీ గైడ్ గెల్జీ అతనిని మోసుకుంటూ కొండ దిగడం మరో అరుదైన ఫీట్‌గా నమోదైంది. ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరితే ప్రపంచాన్నే జయించినంత ఆనందం వస్తుంది కాబట్టే ప్రాణాలకు తెగించి మరీ ఎవరెస్ట్ ఎక్కే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హిచ్ హైకింగ్: ఎవరెస్ట్ వరకూ లిఫ్ట్ అడిగింది
ఎవరెస్ట్ వరకూ వెళ్లాలంటే ఎవరైనా టూర్ ప్లాన్ చేసుకుంటారు. నలుగురితో కలిసి వెళతారు. ఆమె ఒక్కతే వెళ్లాలనుకుంది. అదీ లిఫ్ట్ అడుగుతూ వెళ్లాలనుకుంది. అలా ఒక్కరే ప్రయాణ ఖర్చులు లేకుండా దొరికిన వాహనంతో పర్యటించడాన్ని ‘హిచ్ హైకింగ్’ అంటారు. ఐదుగురు పిల్లల తల్లి నాజిరా నౌషాద్ సాహసంతో ఈ పని చేసి ‘ఈ దేశం స్త్రీలకు సురక్షితమైనదే’ అని సందేశం ఇస్తోంది. ఇది వింత సంగతి. ఘనంగా చెప్పుకోవలసిన సంగతి. లారీల్లో లిఫ్ట్ అడుగుతూ (హిచ్ హైకింగ్) కేరళ నుంచి ఒక ఒంటరి మహిళ ట్రావెల్ చేయగలదా? చేయగలదు అని నిరూపించింది నాజిరా నౌషాద్. ఫిబ్రవరి 9న బయలు దేరి కేరళ నుంచి నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకూ వెళ్లిరావడానికి 50 రోజుల లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కేరళలోని కుట్టనాడ్‌లోని మన్‌కొంబు నాజిరా ఊరు. అది సముద్ర మట్టానికి 10 అడుగుల దిగువ. అక్కడి నుంచి బయలుదేరి సముద్రమట్టానికి 17,500 అడుగుల పైన ఉన్న ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు హిచ్ హైకింగ్ చేయాలని నిశ్చయించుకుంది నాజిరా. అలా చేయడంలో ఎంతో రిస్క్. ఒంటరి స్త్రీల మీద ఏ అఘాయిత్యం అయినా జరగొచ్చు. ‘లారీ డ్రైవర్ల మీద చాలా అపప్రథలు ఉన్నాయి. కాని నేను చూసిన లారీడ్రైవర్లు ఎంతో స్నేహపాత్రంగా ఉన్నారు. నా లక్ష్యం చేరుకోవడానికి సాయం చేశారు’ అంటుంది నాజిరా. షి కెన్ ట్రావెల్ అలోన్ ‘ఒంటరిగా స్త్రీ ప్రయాణించగలదు’ అనే స్లోగన్‌తో 33 ఏళ్ల నాజిరా ఈ యాత్ర మొదలెట్టింది. ఆమె భర్త ఒమన్‌లో ఉద్యోగం చేస్తాడు. ఆమెకు ఐదుగురు పిల్లలు. నాజిరా ట్రావెల్ వ్లోగర్. అంటే యాత్రా కథనాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఆమెకు ఫాలోయెర్స్ ఉన్నారు. నాలుగేళ్ల క్రితం భర్త ఇండియా వచ్చినప్పుడు కారులో వాళ్లు టూరు చేశారు. అప్పుడే ఆమెకు తాను కూడా ప్రయాణాలు చేసి సోషల్ మీడియాలో పంచుకోవాలనిపించింది. ‘గత సంవత్సరం మరో ఇద్దరు మహిళలతో కలిసి లదాఖ్ వరకు యాత్ర మొదలెట్టాను రోడ్డు మార్గం ద్వారా. కాని 20 రోజులకే వారు వెనక్కు వెళ్లిపోయారు. నేను మాత్రం యాత్ర కొనసాగించాను. వెనక్కు తిరిగి వచ్చి ‘నేను చూసిన దేశం’ అనే పుస్తకం రాసి ప్రచురించింది. ఆ తర్వాత నెల రోజులకే కేవలం షిప్ చార్జీలు జేబులో పెట్టుకుని లక్షద్వీప్‌కు వెళ్లింది. 10 దీవులను 25 రోజుల్లో తిరిగి వచ్చింది. తన ఫాలోయెర్స్ ఇళ్లల్లో లేదా స్థానికుల ఇళ్లలో రిక్వెస్ట్ చేసి బస చేసేది. ఇప్పుడు ఈ ఎవరెస్ట్ యాత్ర చేసింది. మన దేశం సురక్షితమే ‘మన దేశం స్త్రీ పర్యాటకులకు సురక్షితమే అని చెప్పడమే నా ఉద్దేశ్యం. మన దేశాన్ని మనం చూడకుండా విదేశాలకు వెళ్లి అక్కడ భద్రత ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు’ అంటుంది నాజిరా. వీపుకు ఒక బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని ఫిబ్రవరి 9న ఆమె కేరళలో బయలుదేరింది. పిల్లల్ని చూడటానికి ఇంట్లో తల్లి ఉంటుంది. ‘పిల్లల్ని అలా వదిలి బయలుదేరడం అందరికీ నచ్చదు. కాని మాటలు అనేవారిని నేను పట్టించుకోను’ అంటుంది నాజిరా. కేరళ నుంచి లారీలు, ట్రక్కులు పట్టుకుంటూ ఫిబ్రవరి 21కి ఆమె ఢిల్లీ చేరుకుంది. మరో లారీ దొరికే వరకు దిగిన ఊరులో ఏదో ఒక ఇంటి తలుపు తట్టి ఆ ఇంట్లో బస చేస్తూ వెళ్లింది. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సొనౌలీ చేరుకుని అక్కడి నుంచి నేపాల్‌లోని లుల్కాకు విమానంలో వెళ్లింది. రికార్డు జర్నీ ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు వెళ్లాలంటే లుల్కా నుంచి ట్రెక్ చేయాలి. అంటే కాలినడకన వెళ్లాలి. 2860 మీటర్ల ఎత్తున్న లుల్కా నుంచి 5364 మీటర్ల ఎత్తున్న బేస్‌క్యాంప్‌కు నడవాలంటే 8 రోజులు పడుతుంది. ‘కాని నేను ఐదురోజుల్లో చేరుకున్నాను. ఒక మహిళ ఇంత వేగంగా చేరుకోవడం రికార్డు’ అంటుంది నాజిరా. ఈ దారిలో ఆమె ప్రయాణించడానికి గైడ్‌ను మాట్లాడుకుంది. బేస్‌క్యాంప్ దగ్గర ఆమె దిగిన ఫొటో నిజంగానే ఒక సాహస చిహ్నం. కొంతమంది మరొకరు అనుకరించడానికి వీలులేని సాహసాలు చేస్తారు. నాజిరాను ఎంతమంది స్ఫూర్తిగా తీసుకోగలరు? అంత రిస్క్ ఎవరు చేయగలరు? కాని చేయాలనుకుంటే ఒక విజేత అంతకు ముందు దారి వేసింది అని చెప్పడానికి నాజిరా ఉంది. నాజిరా ఈజ్ గ్రేట్. -
Sabita Mahato and Shruti Rawat: కూతురి కోసం సందేశం..
సైకిల్ తొక్కుతూ దేశమంతా తిరుగుతూ ‘కూతుళ్లను రక్షించండి, వారిని చదివించండి’ అనే సందేశం ఇవ్వడానికి మూడేళ్ల క్రితమే ఈ సోలో సైకిలిస్ట్ దేశమంతా పర్యటించింది. 173 రోజుల్లో 12,500 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి 29 రాష్ట్రాలను చుట్టి వచ్చింది. రాబోయే సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, తన సందేశాన్ని శిఖరాగ్రాన ఉంచాలనుకుంది 24 ఏళ్ల సబితా మహతో. బీహార్ వాసి అయిన సబిత మూడేళ్ల క్రితం తన మొదటి యాత్రను జమ్మూ కాశ్మీర్ నుండి ప్రారంభించి, దక్షిణాన కేరళ, తమిళనాడులను చేరుకుని, అటు తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లింది. చివరకు సిక్కిం మీదుగా పాట్నా చేరుకుంది. దారిలో అన్ని ప్రదేశాలలోనూ ఒక రోజు విశ్రాంతి తీసుకుంటూ సైకిల్‌పై 12 వేల 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. గత ఫిబ్రవరిలో మరో సైకిలిస్ట్ శ్రుతి రావత్‌తో కలిసి 85 రోజుల్లో 5,800 కిలోమీటర్లు నేపాల్ మీదుగా హిమాలయన్ సైక్లింగ్ టూర్‌ను ప్రారంభించిన సబిత ఈ పర్యటననూ దిగ్విజయంగా పూర్తిచేసింది. లింగ సమానత్వం, పర్యావరణం గురించి పాఠశాల విద్యార్థులతో చర్చించాలనే ఆశయంతో ఇప్పటికీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. అడగడుగునా ఆహ్వానాలు.. సబిత తన ప్రయాణ అనుభవాల గురించి వివరిస్తూ ‘అడవి గుండా వెళుతున్నప్పుడు కూడా నా నినాదాన్ని వదిలిపెట్టలేదు. ‘కూతురుని రక్షించండి. చదివించండి.’ అనే సందేశాన్ని ప్రజలకు ఇస్తూ ఉన్నాను. వెళ్లిన ప్రతి చోటా ఆ ప్రాంతవాసుల ఆదరాభిమానాలు పొందాను. సైకిల్ ప్రయాణంలో నేను బీహార్ వాసినని తెలిసి ప్రజలు ఆశ్చర్యపోయారు. శ్రుతి రావత్‌తో కలిసి చేసిన పర్యటనలో ఇవే అనుభవాలను చవిచూశాను. ఎక్కడకెళ్లినా, అక్కడి ప్రజలు నన్ను ఆదరించిన తీరు మాత్రం మర్చిపోలేను.’ అని తన పర్యటన విశేషాలు సంతోషంగా తెలియజేస్తుంది. పేదరికంలో పెరిగినా.. సబిత మత్స్యకారుల కుటుంబంలో పుట్టింది. పేదరికంలోనూ పెద్ద కలలు కనేది. తనకు చిన్నతనంలోనే పెళ్లి చేయబోతే నిరోధించింది, షార్ట్స్ వేసుకొని సైకిల్ తొక్కుతూ తిరిగేది. దీంతో తండ్రి ఆమెను ఎప్పుడూ ‘జనం ఏమనుకుంటారు’ అని అంటూ వెనకడుగు వేసేలా చేసేశాడు. కానీ, అవేమీ పట్టించుకోలేదు సబిత. స్కూల్లో ఉన్న ఇతర అమ్మాయిల బాల్యవివాహాలనూ అడ్డుకుంది. ‘కూతుళ్లను చదివించండి..’ అనే నినాదంతో సబిత మొదలుపెట్టిన సైకిల్ ప్రయాణానికి పాఠశాల యాజమాన్యం కూడా సాయం చేసింది. భూమికి ఏడున్నరవేల మీటర్ల ఎత్తులో ఉండే హిమాలయాల్లోని సంతోపత్ పర్వతంపై సబిత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ‘నిరంతరం నా ప్రయాణం అమ్మాయిల్లో అవగాహన పెంచడం కోసమే’ అంటుంది సబిత. శ్రుతి రావత్‌తో కలిసి.. డార్జిలింగ్‌లో ఉండే శ్రుతి రావత్ ఈ యేడాదే డిగ్రీ పూర్తి చేసింది. సైకిల్ రైడింగ్ అంటే తనకు చాలా ఇష్టం. సైకిల్ రైడర్స్ గురించి తెలుసుకున్నప్పుడు సబిత పరిచయమై, ఆమె తన యాత్ర గురించి చెప్పినప్పుడు ఈ పర్యటనలో పాల్గొనాలన్న ఆలోచన తనకూ కలిగింది. ‘‘మొదట్లో నేను ఎక్కువ దూరం సోలోగా ప్రయాణించలేదు. క్రీడాకారిణిని కూడా కాదు. రోజూ ఏడు గంటలు సైకిల్‌పై ప్రయాణం చేయడం అప్పట్లో కష్టంగా అనిపించేది. కానీ, సబిత ఇచ్చిన శిక్షణ నాలో ఉత్సాహాన్ని నింపింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించే సైకిల్ యాత్ర చీకటి పడటంతో ముగుస్తుంది. బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల మీదుగా ఉత్తరాఖండ్ అటు నుంచి ట్రాన్స్ హిమాలయాల ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. మా ప్రయాణంలో ముందే భోజన, వసతి సదుపాయాల ప్లానింగ్ కూడా ఉండేది. దాంతో ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఇంట్లో కూర్చుంటే బయటి ప్రపంచం అంతా అమ్మాయిలకు రక్షణ లేనిదిగానే ఉంటుంది. కానీ, బయటకు వచ్చి చూస్తే ఎంతో అద్భుత ప్రపంచం కనిపిస్తుంది’’ అని తమ యాత్రానుభవాలను పంచుకుంది శ్రుతి. -
కీర్తి శిఖరాన్ని తాకారు
సాక్షి, స్టూడెంట్ ఎడిషన్ ఎవరెస్టు...ఈ పేరు విన్న ఔత్సాహికులు ఒక్కసారైనా దాన్ని అధిరోహించాలని తహతహలాడుతుంటారు. కొంతమంది ఒంటరిగా, మరికొంతమంది బృందంగా దీనిని అధిరోహిస్తుంటారు. పర్వతారోహకుల్లో బంధువులు లేదా కుటుంబసభ్యులు ఉండడమనేది అరుదు. అందులోనూ తండ్రీకూతుళ్లు ఉండడం అనేది ఇంకా అరుదు. ఆ కోవకే చెందుతారు అజీత్ బజాజ్ ఆయన కుమార్తె దియా బజాజ్. గుర్గావ్కు చెందిన వీరు ఈ నెల 16వ తేదీన 8,848 మీటర్ల ఎత్తయిన ఎవరెస్టు అధిరోహించారు. ఈ పర్వతాన్ని ఎక్కడమంటే కఠినమైన పరిస్థితుల్లో ముందుకు సాగడమే. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన అజీత్ ఆయన కుమార్తె దియా తొలి ప్రయత్నంలోనే తమ లక్ష్యాన్ని సాధించడం విశేషం. ప్రాణాంతకమైన సవాళ్లను లెక్కచేయకుండా, తీవ్ర చలి వాతావరణమనే ఆందోళన లేకుండా గమ్యాన్ని చేరుకున్నారు. దశాబ్దం క్రితం సాహసోపేత ప్రయాణ సంస్థల నిర్వాహకుడైన 53 ఏళ్ల బజాజ్ ...ఒకే ఏడాది వ్యవధిలో దక్షిణ, ఉత్తర ధ్రువాలను తిలకించారు. అలా ఒకే ఈ రెండుచోట్లకి వెళ్లిన తొలి భారతీయుడిగా నిలిచారు. ఆయన పెద్దకుమార్తె దియా...పర్యావరణ సైన్సులో డిగ్రీ చదివి ఉత్తరకాశిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ సంస్థలో పర్వతారోహణపై శిక్షణ పొందింది. 14 ఏళ్ల లేలేత వయసులోనే ట్రాన్స్ గ్రీన్లాండ్ యాత్ర చేసింది. 2012లో యూరప్‌లో అత్యంత ఎత్తయిన 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించింది. ఏడాదిపాటు శిక్షణ: ‘ఎవరెస్టు శిఖరాన్ని తిలకించాలని ఇరువురం గతేడాది నిర్ణయించుకున్నాం. శిక్షణ అత్యంత ఉల్లాసభరితంగా సాగింది. శారీరకంగా మంచి ఆకృతిని పొందడం కోసం జిమ్‌లో రకరకాల వ్యాయామాలు చేశాం. పరుగులు తీశాం. ఈత కొట్టాం. గతేడాది ఆగస్టులో లడఖ్ యాత్రకు వెళ్లాం. ఎవరెస్టుకు ముందు ట్రయలర్‌గా ఈ యాత్ర సాగించాం’ అని అజీత్ చెప్పారు. ‘ఇటువంటి మూడు సాహస యాత్రల తర్వాత గతేడాది డిసెంబర్లో నేపాల్ వెళ్లాం. అవసరమైన సామగ్రి కొనుగోలు చేశాం. ఆ తర్వాత రెంజోలా పాస్ చేరుకున్నాం. తిరిగి లడఖ్ చేరుకుని అక్కడ కొద్దిరోజులు గడిపాం, మాపై పూర్తి నమ్మకం కలిగింది. ఏప్రిల్ పదిన టిబెట్ వెళ్లాం. ఈ నెల 16న ఎవరెస్టు పర్వతంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం ’ అని దియా చెప్పారు. అజిత్, దియా స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల. అజీత్‌ను చిన్నతనంలో వాళ్ల నాన్న సరదాగా తరచూ పర్వతారోహణకు తీసుకెళ్లేవాడు. ఢిల్లీలోని స్టీఫెన్ కళాశాలలో చదువుకునే రోజుల్లో అజీత్ ఔట్‌డోర్ క్లబ్లో సభ్యుడయ్యాడు. అదే సమయంలో తరచూ సాహసోపేత క్రీడల్లోనూ పాలుపంచుకునేవాడు. ఆ తర్వాత అదో వ్యాపకంగా మారిపోయింది. దియాను కూడా తరచూ తన వెంట తీసుకుపోయేవాడు. తనకు ఇటువంటి తండ్రి దొరకడం పూర్వజన్మ సుకృతమంటూ దియా పొంగిపోయింది. పైగా సాహసయాత్రలో తండ్రే భాగస్వామి కావడం అదృష్టమని చెప్పుకొచ్చింది. చిన్నతనంలో ఈత అంటే సరదా అని, ఆ తర్వాత జాతీయస్థాయి క్రీడల్లో కూడా పాలుపంచుకున్నానంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకుంది. ‘అంటార్కిటాలో రెండో అతిపెద్ద భాగమైన గ్రీన్లాండ్ ఐస్ క్యాప్‌ను అతి చిన్న వయసులో దాటిన రికార్డు నా సొంతం. ఎవరెస్టుపై మా యాత్ర సాగే సమయంలో ఓ రాత్రి భీకర తుపాను వచ్చింది. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు కూడా వీచాయి. తీవ్ర ఆందోళనకు గురయ్యాం. తెల్లవారాక అంతా సర్దుకోవడంతో ఊపిరి పీల్చుకున్నాం’ అని తెలిపింది. -
‘ఒంటరి’గా ఎవరెస్ట్ ఎక్కలేరు!
కఠ్మాండు: ఒంటరి పర్వతారోహకులపై నేపాల్ నిషేధం విధించింది. ఎవరెస్ట్ పర్వతం సహా నేపాల్‌లోని ఇతర పర్వతాల అధిరోహణకు ఒంటరి వ్యక్తులను నేపాల్ ఇకపై అనుమతించరు. ఈ మేరకు నేపాల్ కేబినెట్ పర్వతారోహణ నిబంధనల సవరణకు శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రమాదాల నివారణ, సురక్షిత పర్వతారోహణకే ఈ చర్య తీసుకున్నట్లు నేపాల్ పర్యాటక కార్యదర్శి మహేశ్వర్ చెప్పారు. అంధులు, రెండు కాళ్లు పనిచేయని వారు పర్వతారోహణలో పాల్గొనకుండా నిషేధం విధించారు. -
ఆదర్శంగా నిలిచారు: రాహుల్‌గాంధీ
ఎవరెస్ట్ విజేతలను ప్రశంసించిన రాహుల్‌గాంధీ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఎవరెస్ట్‌ను అధిరోహించి దిగ్విజయంగా తిరిగొచ్చిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లు గురువారమిక్కడ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాన్ని సాధించి దేశంలోని విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారితో కలసి ఫొటోలు దిగారు. అనంతరం పూర్ణ, ఆనంద్‌లు కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్‌ను ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. వారిని మంత్రి ప్రశంసలతో ముంచెత్తారు. వారిద్దరికి రూ.11,001ల చెక్‌ను అందజేశారు. ఇదిలా ఉండగా పూర్ణ, ఆనంద్‌లను ఆల్ ఇండియా దళిత్ ఫెడరేషన్, ఏపీభవన్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీభవన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఏపీభవన్‌లో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, ఎంపీలు కె.కేశవరావు, దత్తాత్రేయ, రాపోలు ఆనంద్ భాస్కర్, జాతీయ సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్, ఆయా సంఘాల నేతలు ఆనంద్‌రావు, లింగరాజులు పాల్గొన్నారు. విజేతలకు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి రూ.10వేల చెక్ అందించారు. 8న హైదరాబాద్‌కు ఎవరెస్టు వీరులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డును సృష్టించిన మాలావత్ పూర్ణ(13), ఆనంద్(18)లు ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ అధికారి కె.వెంకటేశ్వర్లు, ఫిజికల్ డెరైక్టర్ బద్రినాథ్ తెలిపారు. వారిద్దరికి ఘనంగా స్వాగతం పలుకుతామన్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. -
ఎవరెస్టుపై మన ధీరులు!
సంపాదకీయం: ప్రపంచానికి అందనంత ఎత్తులో ఉండి, సాహసులను రారమ్మని నిత్యమూ సవాల్ చేసే ఎవరెస్టు శిఖరం మన రాష్ట్రంలోని మారుమూల గ్రామాలనుంచి వెళ్లిన ఇద్దరు చిన్నారుల సంకల్పబలానికి బిత్తరపోయి ఉంటుంది. ఆసరా ఇవ్వాలేగానీ, అవకాశం రావాలేగానీ దేనికైనా సంసిద్ధులై ముందుకురికే నివురుగప్పిన నిప్పులు... మట్టిలోని మాణిక్యాలు ఇంకెన్ని ఉన్నాయోనని అచ్చెరువొంది ఉంటుంది. నిజామాబాద్ జిల్లా తాడ్వాయికి చెందిన 14 ఏళ్ల మాలావత్ పూర్ణ, ఖమ్మం జిల్లా కలివేరు గ్రామానికి చెందిన 17ఏళ్ల ఆనంద్‌కుమార్ ఆదివారం ఎవరెస్టు శిఖరాగ్రంపై అడుగుపెట్టిన వార్త ప్రతి ఒక్కరినీ పులకింపజేసింది. శిఖరారోహణ చేసిన అత్యంత పిన్నవయస్కురాలిగా పూర్ణ రికార్డులకెక్కింది. 30 మంది పర్వతారోహకుల బృందంలో భాగంగా వెళ్లిన ఈ ఇద్దరూ అందరికంటే ముందుగా దాన్ని చేరుకోగలగడం గర్వకారణమైతే... ఆ ఇద్దరిలోనూ పూర్ణ అరగంట ముందే లక్ష్యాన్ని ఛేదించడం మరింత గొప్పవిషయం. ఈ చిన్నారుల సామాజిక నేపథ్యం, వారి ఆర్ధిక స్థితిగతులు గమనిస్తే వారు సాధించిన ఘన విజయానికున్న ప్రాముఖ్యమేమిటో అర్ధమవుతుంది. పూర్ణ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు, గిరిజనులు. ఆనంద్ తండ్రి ఒక సైకిల్ షాపులో దినసరి కూలి. వారిది దళిత కుటుంబం. పుట్టుకే అన్నిటినీ నిర్దేశిస్తుందని, సకల సౌకర్యాలూ సమకూర్చుకోగల స్తోమత ఉంటేనే దేన్నయినా సాధించడం సాధ్యమవుతుందని భావించేవారి కళ్లు తెరిపించిన సాహస బాలలు వీరిద్దరూ. పాశ్చాత్యదేశాల్లో పర్వతారోహణ ఒక సాహసక్రీడ. అందుకోసం వేలాది డాలర్ల సొమ్మును ఖర్చుచేస్తారు. పర్వతారోహణ సంస్థలు ఒక్కొక్కరినుంచి దాదాపు 90,000 డాలర్ల వరకూ వసూలు చేస్తాయి. ప్రత్యేకించి ఎవరెస్టు శిఖరారోహణ కోసమని ఏళ్ల తరబడి పొదుపుచేస్తున్నవారూ ఉంటారు. ఏదీ సవ్యంగా ఉండని మన దేశంలో పర్వతారోహణ గురించి చాలామందికి అవగాహన ఉండదు. దానిపై దృష్టి సారించడానికి ప్రోత్సాహం అందించే సంస్థలూ అంతంతమాత్రమే. చదువే సర్వస్వమని, అందుకు పాఠ్యపుస్తకాలే మార్గమని భావించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్లో దాగివుండే ఇతరేతర ప్రతిభాపాటవాలను గుర్తించే స్థితి ఉండదు. సకాలంలో పాఠ్యపుస్తకాలు రావడమే మహద్భాగ్యమయ్యేచోట, పిల్లలకు కనీస సదుపాయాలు కూడా గగనమయ్యేచోట అలాంటి అవకాశమూ ఉండదు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (స్వేరోస్) కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ చొరవ వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఒక అధికారి నిబద్ధతతో, నిమగ్నతతో పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించగలరనడానికి ఈ ఇద్దరి బాలల ఎవరెస్టు శిఖరారోహణమే ఉదాహరణ. వేలాదిమంది పిల్లలతో స్వయంగా మాట్లాడి, వారిలో దాగివున్న శక్తిసామర్ధ్యాలను గుర్తించి... వాటిని వెలికితీయడానికి గల మార్గాలను అన్వేషించి ఆయన ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మామూలు కొండ ఎక్కడమంటేనే మాటలు కాదు. అడుగడుక్కీ ఆయాసం పెరుగుతూ ఆపైన ప్రతి అడుగూ పెనుభారమవుతూ చివరకది ఊపిరాడనీయని నడకగా మారుతుంది. ఇక అడుగడుగునా మృత్యువు పొంచివుండే ఎవరెస్టు శిఖరం గురించి చెప్పేదేముంది? అక్కడ మనిషిని నిలువునా గడ్డకట్టించే చలి. ఎత్తు పెరిగేకొద్దీ ఆక్సిజన్ త గ్గుతూ... ఎటునుంచి ఏ మంచుఖండం మృత్యువై విరుచుకుపడుతుందో అర్ధంకాని స్థితిలో ప్రతి అడుగునూ పునర్జన్మగా భావించుకోవాల్సిందే. నిజానికి ఆ యాత్ర... నిద్రపోతున్న మృత్యుదేవతను లేపి పరాచకాలాడటమే. అందుకే దానిని డెత్ జోన్ అన్నారు. ఎవరెస్టు దాకా అవసరం లేదు. అందుకోసమని వివిధ అంచెలుగా ఇచ్చే శిక్షణే అత్యంత కఠోరమైనది. ఈ సాహస క్రీడ కోసం తొలుత 110మందిని ఎంపికచేస్తే అన్ని రకాల పరీక్షలనూ దీటుగా ఎదుర్కొని చివరకు మిగిలింది ఈ ఇద్దరే. ఆ ఇద్దరూ ఇప్పుడు తమ పల్లెలకు, జిల్లాలకే కాదు రాష్ట్రానికే పేరు ప్రఖ్యాతులు సాధించిపెట్టారు. ప్రపంచానికే తలమానికమయ్యారు. ఇప్పుడు ఈ బాలలిద్దరూ సాధించిన విజయాలు చూశాకైనా మన భవిష్యత్తు పౌరులపై, రేపటి తరంపై ఎంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నామో అర్ధం కావాలి. పిల్లల అభిరుచులేమిటో తెలుసుకుని అందుకు అవసరమైన మంచి వాతావరణాన్ని సృష్టిస్తే... వారొక లక్ష్యాన్ని ఎంచుకునేలా ప్రోత్సహిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో పూర్ణ, ఆనంద్‌లు నిరూపించారు. బాలలు ఈ దేశ వారసత్వ సంపదని సుప్రీంకోర్టు ఆ మధ్య అభివర్ణించింది. అపురూపమైన ఈ వారసత్వ సంపదకున్న విలువనుగానీ, దాని గొప్పతనాన్నిగానీ గుర్తించలేక ప్రభుత్వాలు నిర్లక్ష్యంవహిస్తున్నాయి. పాఠశాల విద్యకు బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయక, స్కూళ్లకు అవసరమైన ఉపాధ్యాయులను నియమించక, మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లవంటివైనా అందుబాటులోకి తీసుకురాలేక తమ చేతగానితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ పిల్లలిద్దరూ మారుమూలనుండే పల్లెటూర్లనుంచి వ చ్చారని, అమ్మానాన్నల సామీప్యాన్ని కోరుకునే వయసులో వారికి దూరంగా ఉండి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్నారని తెలిసినప్పుడు ఈ ఎవరెస్టు శిఖరారోహణ మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. వ్యక్తులుగా కొందరు అంకితభావంతో పనిచేయడంవల్ల సాధ్యమైన ఈ విజయం... సమష్టిగా, వ్యవస్థాగతంగా సాగిస్తే మరెన్ని రెట్లు పెరుగుతుందో గుర్తుంచుకుంటే మనలోని నిర్లక్ష్యం మటు మాయమవుతుంది. పూర్ణ, ఆనంద్‌ల విజయం అందుకు దోహద పడాలని కోరుకుందాం. -
‘వాల్’చూపు చూసేద్దాం
వాల్ క్లైంబింగ్ విషయానికొస్తే.. ఇది అందులో ఎవరెస్టు శిఖరంలాంటిది. స్విట్జర్లాండ్‌లోని దిగాది లజ్జోన్.. వాల్ క్లైంబింగ్‌కు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తై కృత్రిమ గోడ. దీని ఎత్తు 540 అడుగులు. అందుకే వాల్ క్లైంబింగ్ అంటే ఆసక్తి ఉన్నవారు ఈ గోడ ఎక్కడానికి ఉవ్విళ్లూరుతుంటారు. వాస్తవానికి ది లజ్జోన్ డామ్ తాలూకు గోడ. దీన్ని ఎక్కాలనుకునేవారు రూ.1,400 చెల్లించాల్సి ఉంటుంది. -
ఎవరెస్ట్‌ను అధిరోహించనున్న రాష్ర్ట విద్యార్థులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు రాష్ట్రానికి చెందిన ఇద్దరు గురుకుల పాఠశాల విద్యార్థులు సిద్ధవుయ్యూరు. 60 నుంచి 70 రోజుల వరకు పట్టే ఈ సాహసయూత్రకు వారు వుంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం విద్యార్థుల ఎవరెస్ట్ అధిరోహణకు సంబంధించి వివరాలను ట్రైనర్ శేఖర్‌బాబు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పూర్ణ(14), ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్ఇయుర్ చదువుతున్న ఆనంద్కుమర్(17)లు గతేడాది నవంబర్‌లో డార్జిలింగ్‌లోని 17వేల అడుగుల ఎత్తున్న మౌంట్ రినాక్ శిఖరాన్ని ఎక్కి రికార్డు సృష్టించారు. వీరి ప్రతిభను గుర్తిం చిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ వీరికి భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్లో ప్రత్యేక తర్ఫీదునిచ్చింది. వీరికి సొసైటీకి చైర్మన్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ తనవంతు సహాయం అందించారు. మూడు నెలల తర్ఫీదు అనంతరం విద్యార్థులను ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధం చేశారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఈ అధిరోహణకు పూనుకున్నామని ట్రైనర్ శేఖర్‌బాబు వెల్లడించారు. 29,100 అడుగుల ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఈ ఇద్దరూ అధిగమిస్తే అత్యంత పిన్న వయస్కులో ఎవరెస్ట్ ఎక్కిన బాలికగా పూర్ణ, దక్షిణాది రాష్ట్రాల నుంచి అత్యంత పిన్న వయస్కుడిగా ఆనంద్‌లు రికార్డులకు ఎక్కే అవకాశం ఉంది.