ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర నాజిరా నౌషాద్; లారీలో ప్రయాణిస్తూ...
ఎవరెస్ట్ వరకూ వెళ్లాలంటే ఎవరైనా టూర్ ప్లాన్ చేసుకుంటారు. నలుగురితో కలిసి వెళతారు. ఆమె ఒక్కతే వెళ్లాలనుకుంది. అదీ లిఫ్ట్ అడుగుతూ వెళ్లాలనుకుంది. అలా ఒక్కరే ప్రయాణ ఖర్చులు లేకుండా దొరికిన వాహనంతో పర్యటించడాన్ని ‘హిచ్ హైకింగ్’ అంటారు. ఐదుగురు పిల్లల తల్లి నాజిరా నౌషాద్ సాహసంతో ఈ పని చేసి ‘ఈ దేశం స్త్రీలకు సురక్షితమైనదే’ అని
సందేశం ఇస్తోంది.
ఇది వింత సంగతి. ఘనంగా చెప్పుకోవలసిన సంగతి. లారీల్లో లిఫ్ట్ అడుగుతూ (హిచ్ హైకింగ్) కేరళ నుంచి ఒక ఒంటరి మహిళ ట్రావెల్ చేయగలదా? చేయగలదు అని నిరూపించింది నాజిరా నౌషాద్. ఫిబ్రవరి 9న బయలు దేరి కేరళ నుంచి నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకూ వెళ్లిరావడానికి 50 రోజుల లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
కేరళలోని కుట్టనాడ్‌లోని మన్‌కొంబు నాజిరా ఊరు. అది సముద్ర మట్టానికి 10 అడుగుల దిగువ.
అక్కడి నుంచి బయలుదేరి సముద్రమట్టానికి 17,500 అడుగుల పైన ఉన్న ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు హిచ్ హైకింగ్ చేయాలని నిశ్చయించుకుంది నాజిరా. అలా చేయడంలో ఎంతో రిస్క్. ఒంటరి స్త్రీల మీద ఏ అఘాయిత్యం అయినా జరగొచ్చు.
‘లారీ డ్రైవర్ల మీద చాలా అపప్రథలు ఉన్నాయి. కాని నేను చూసిన లారీడ్రైవర్లు ఎంతో స్నేహపాత్రంగా ఉన్నారు. నా లక్ష్యం చేరుకోవడానికి సాయం చేశారు’ అంటుంది నాజిరా.
షి కెన్ ట్రావెల్ అలోన్
‘ఒంటరిగా స్త్రీ ప్రయాణించగలదు’ అనే స్లోగన్‌తో 33 ఏళ్ల నాజిరా ఈ యాత్ర మొదలెట్టింది. ఆమె భర్త ఒమన్‌లో ఉద్యోగం చేస్తాడు. ఆమెకు ఐదుగురు పిల్లలు. నాజిరా ట్రావెల్ వ్లోగర్. అంటే యాత్రా కథనాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఆమెకు ఫాలోయెర్స్ ఉన్నారు. నాలుగేళ్ల క్రితం భర్త ఇండియా వచ్చినప్పుడు కారులో వాళ్లు టూరు చేశారు. అప్పుడే ఆమెకు తాను కూడా ప్రయాణాలు చేసి సోషల్ మీడియాలో పంచుకోవాలనిపించింది.
‘గత సంవత్సరం మరో ఇద్దరు మహిళలతో కలిసి లదాఖ్ వరకు యాత్ర మొదలెట్టాను రోడ్డు మార్గం ద్వారా. కాని 20 రోజులకే వారు వెనక్కు వెళ్లిపోయారు. నేను మాత్రం యాత్ర కొనసాగించాను. వెనక్కు తిరిగి వచ్చి ‘నేను చూసిన దేశం’ అనే పుస్తకం రాసి ప్రచురించింది. ఆ తర్వాత నెల రోజులకే కేవలం షిప్ చార్జీలు జేబులో పెట్టుకుని లక్షద్వీప్‌కు వెళ్లింది. 10 దీవులను 25 రోజుల్లో తిరిగి వచ్చింది. తన ఫాలోయెర్స్ ఇళ్లల్లో లేదా స్థానికుల ఇళ్లలో రిక్వెస్ట్ చేసి బస చేసేది. ఇప్పుడు ఈ ఎవరెస్ట్ యాత్ర చేసింది.
మన దేశం సురక్షితమే
‘మన దేశం స్త్రీ పర్యాటకులకు సురక్షితమే అని చెప్పడమే నా ఉద్దేశ్యం. మన దేశాన్ని మనం చూడకుండా విదేశాలకు వెళ్లి అక్కడ భద్రత ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు’ అంటుంది నాజిరా. వీపుకు ఒక బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని ఫిబ్రవరి 9న ఆమె కేరళలో బయలుదేరింది. పిల్లల్ని చూడటానికి ఇంట్లో తల్లి ఉంటుంది. ‘పిల్లల్ని అలా వదిలి బయలుదేరడం అందరికీ నచ్చదు. కాని మాటలు అనేవారిని నేను పట్టించుకోను’ అంటుంది నాజిరా.
కేరళ నుంచి లారీలు, ట్రక్కులు పట్టుకుంటూ ఫిబ్రవరి 21కి ఆమె ఢిల్లీ చేరుకుంది. మరో లారీ దొరికే వరకు దిగిన ఊరులో ఏదో ఒక ఇంటి తలుపు తట్టి ఆ ఇంట్లో బస చేస్తూ వెళ్లింది. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సొనౌలీ చేరుకుని అక్కడి నుంచి నేపాల్‌లోని లుల్కాకు విమానంలో వెళ్లింది.
రికార్డు జర్నీ
ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు వెళ్లాలంటే లుల్కా నుంచి ట్రెక్ చేయాలి. అంటే కాలినడకన వెళ్లాలి. 2860 మీటర్ల ఎత్తున్న లుల్కా నుంచి 5364 మీటర్ల ఎత్తున్న బేస్‌క్యాంప్‌కు నడవాలంటే 8 రోజులు పడుతుంది. ‘కాని నేను ఐదురోజుల్లో చేరుకున్నాను. ఒక మహిళ ఇంత వేగంగా చేరుకోవడం రికార్డు’ అంటుంది నాజిరా. ఈ దారిలో ఆమె ప్రయాణించడానికి గైడ్‌ను మాట్లాడుకుంది. బేస్‌క్యాంప్ దగ్గర ఆమె దిగిన ఫొటో నిజంగానే ఒక సాహస చిహ్నం.
కొంతమంది మరొకరు అనుకరించడానికి వీలులేని సాహసాలు చేస్తారు. నాజిరాను ఎంతమంది స్ఫూర్తిగా తీసుకోగలరు? అంత రిస్క్ ఎవరు చేయగలరు? కాని చేయాలనుకుంటే ఒక విజేత అంతకు ముందు దారి వేసింది అని చెప్పడానికి నాజిరా ఉంది. నాజిరా ఈజ్ గ్రేట్.
Comments
Please login to add a commentAdd a comment