సంపాదకీయం: ప్రపంచానికి అందనంత ఎత్తులో ఉండి, సాహసులను రారమ్మని నిత్యమూ సవాల్ చేసే ఎవరెస్టు శిఖరం మన రాష్ట్రంలోని మారుమూల గ్రామాలనుంచి వెళ్లిన ఇద్దరు చిన్నారుల సంకల్పబలానికి బిత్తరపోయి ఉంటుంది. ఆసరా ఇవ్వాలేగానీ, అవకాశం రావాలేగానీ దేనికైనా సంసిద్ధులై ముందుకురికే నివురుగప్పిన నిప్పులు... మట్టిలోని మాణిక్యాలు ఇంకెన్ని ఉన్నాయోనని అచ్చెరువొంది ఉంటుంది. నిజామాబాద్ జిల్లా తాడ్వాయికి చెందిన 14 ఏళ్ల మాలావత్ పూర్ణ, ఖమ్మం జిల్లా కలివేరు గ్రామానికి చెందిన 17ఏళ్ల ఆనంద్‌కుమార్ ఆదివారం ఎవరెస్టు శిఖరాగ్రంపై అడుగుపెట్టిన వార్త ప్రతి ఒక్కరినీ పులకింపజేసింది. శిఖరారోహణ చేసిన అత్యంత పిన్నవయస్కురాలిగా పూర్ణ రికార్డులకెక్కింది.
30 మంది పర్వతారోహకుల బృందంలో భాగంగా వెళ్లిన ఈ ఇద్దరూ అందరికంటే ముందుగా దాన్ని చేరుకోగలగడం గర్వకారణమైతే... ఆ ఇద్దరిలోనూ పూర్ణ అరగంట ముందే లక్ష్యాన్ని ఛేదించడం మరింత గొప్పవిషయం. ఈ చిన్నారుల సామాజిక నేపథ్యం, వారి ఆర్ధిక స్థితిగతులు గమనిస్తే వారు సాధించిన ఘన విజయానికున్న ప్రాముఖ్యమేమిటో అర్ధమవుతుంది. పూర్ణ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు, గిరిజనులు. ఆనంద్ తండ్రి ఒక సైకిల్ షాపులో దినసరి కూలి. వారిది దళిత కుటుంబం. పుట్టుకే అన్నిటినీ నిర్దేశిస్తుందని, సకల సౌకర్యాలూ సమకూర్చుకోగల స్తోమత ఉంటేనే దేన్నయినా సాధించడం సాధ్యమవుతుందని భావించేవారి కళ్లు తెరిపించిన సాహస బాలలు వీరిద్దరూ.
పాశ్చాత్యదేశాల్లో పర్వతారోహణ ఒక సాహసక్రీడ. అందుకోసం వేలాది డాలర్ల సొమ్మును ఖర్చుచేస్తారు. పర్వతారోహణ సంస్థలు ఒక్కొక్కరినుంచి దాదాపు 90,000 డాలర్ల వరకూ వసూలు చేస్తాయి. ప్రత్యేకించి ఎవరెస్టు శిఖరారోహణ కోసమని ఏళ్ల తరబడి పొదుపుచేస్తున్నవారూ ఉంటారు. ఏదీ సవ్యంగా ఉండని మన దేశంలో పర్వతారోహణ గురించి చాలామందికి అవగాహన ఉండదు. దానిపై దృష్టి సారించడానికి ప్రోత్సాహం అందించే సంస్థలూ అంతంతమాత్రమే. చదువే సర్వస్వమని, అందుకు పాఠ్యపుస్తకాలే మార్గమని భావించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్లో దాగివుండే ఇతరేతర ప్రతిభాపాటవాలను గుర్తించే స్థితి ఉండదు.
సకాలంలో పాఠ్యపుస్తకాలు రావడమే మహద్భాగ్యమయ్యేచోట, పిల్లలకు కనీస సదుపాయాలు కూడా గగనమయ్యేచోట అలాంటి అవకాశమూ ఉండదు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (స్వేరోస్) కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ చొరవ వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఒక అధికారి నిబద్ధతతో, నిమగ్నతతో పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించగలరనడానికి ఈ ఇద్దరి బాలల ఎవరెస్టు శిఖరారోహణమే ఉదాహరణ. వేలాదిమంది పిల్లలతో స్వయంగా మాట్లాడి, వారిలో దాగివున్న శక్తిసామర్ధ్యాలను గుర్తించి... వాటిని వెలికితీయడానికి గల మార్గాలను అన్వేషించి ఆయన ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మామూలు కొండ ఎక్కడమంటేనే మాటలు కాదు. అడుగడుక్కీ ఆయాసం పెరుగుతూ ఆపైన ప్రతి అడుగూ పెనుభారమవుతూ చివరకది ఊపిరాడనీయని నడకగా మారుతుంది. ఇక అడుగడుగునా మృత్యువు పొంచివుండే ఎవరెస్టు శిఖరం గురించి చెప్పేదేముంది? అక్కడ మనిషిని నిలువునా గడ్డకట్టించే చలి.
ఎత్తు పెరిగేకొద్దీ ఆక్సిజన్ త గ్గుతూ... ఎటునుంచి ఏ మంచుఖండం మృత్యువై విరుచుకుపడుతుందో అర్ధంకాని స్థితిలో ప్రతి అడుగునూ పునర్జన్మగా భావించుకోవాల్సిందే. నిజానికి ఆ యాత్ర... నిద్రపోతున్న మృత్యుదేవతను లేపి పరాచకాలాడటమే. అందుకే దానిని డెత్ జోన్ అన్నారు. ఎవరెస్టు దాకా అవసరం లేదు. అందుకోసమని వివిధ అంచెలుగా ఇచ్చే శిక్షణే అత్యంత కఠోరమైనది. ఈ సాహస క్రీడ కోసం తొలుత 110మందిని ఎంపికచేస్తే అన్ని రకాల పరీక్షలనూ దీటుగా ఎదుర్కొని చివరకు మిగిలింది ఈ ఇద్దరే. ఆ ఇద్దరూ ఇప్పుడు తమ పల్లెలకు, జిల్లాలకే కాదు రాష్ట్రానికే పేరు ప్రఖ్యాతులు సాధించిపెట్టారు. ప్రపంచానికే తలమానికమయ్యారు.
ఇప్పుడు ఈ బాలలిద్దరూ సాధించిన విజయాలు చూశాకైనా మన భవిష్యత్తు పౌరులపై, రేపటి తరంపై ఎంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నామో అర్ధం కావాలి. పిల్లల అభిరుచులేమిటో తెలుసుకుని అందుకు అవసరమైన మంచి వాతావరణాన్ని సృష్టిస్తే... వారొక లక్ష్యాన్ని ఎంచుకునేలా ప్రోత్సహిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో పూర్ణ, ఆనంద్‌లు నిరూపించారు. బాలలు ఈ దేశ వారసత్వ సంపదని సుప్రీంకోర్టు ఆ మధ్య అభివర్ణించింది. అపురూపమైన ఈ వారసత్వ సంపదకున్న విలువనుగానీ, దాని గొప్పతనాన్నిగానీ గుర్తించలేక ప్రభుత్వాలు నిర్లక్ష్యంవహిస్తున్నాయి.
పాఠశాల విద్యకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయక, స్కూళ్లకు అవసరమైన ఉపాధ్యాయులను నియమించక, మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లవంటివైనా అందుబాటులోకి తీసుకురాలేక తమ చేతగానితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ పిల్లలిద్దరూ మారుమూలనుండే పల్లెటూర్లనుంచి వ చ్చారని, అమ్మానాన్నల సామీప్యాన్ని కోరుకునే వయసులో వారికి దూరంగా ఉండి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్నారని తెలిసినప్పుడు ఈ ఎవరెస్టు శిఖరారోహణ మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. వ్యక్తులుగా కొందరు అంకితభావంతో పనిచేయడంవల్ల సాధ్యమైన ఈ విజయం... సమష్టిగా, వ్యవస్థాగతంగా సాగిస్తే మరెన్ని రెట్లు పెరుగుతుందో గుర్తుంచుకుంటే మనలోని నిర్లక్ష్యం మటు మాయమవుతుంది. పూర్ణ, ఆనంద్‌ల విజయం అందుకు దోహద పడాలని కోరుకుందాం.
ఎవరెస్టుపై మన ధీరులు!
Published Wed, May 28 2014 1:29 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement