anand kumar
-
జర్నలిస్ట్ ఆనంద్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గుంటూరు: సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ కుమార్ ఆకస్మిక మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆనంద్ ఢిల్లీలో గత 35 ఏళ్లుగా వివిధ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ సలహాదారు (నేషనల్ మీడియా) కార్యాలయంలో మీడియా కోఆర్డినేటర్ ఆనంద్ కుమార్ పని చేశారు. అంతకు ముందు దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పని చేశారాయన. తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అనారోగ్యంతో ఢిల్లీలోని సర్దార్ పటేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. మరోవైపు ఆనంద్ మృతి పట్ల జర్నలిస్ట్ యూనియన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. -
విధి రాతను ఎదురించి.. విశ్వ వేదికపై నిలిచి..
అతడికి కాళ్లు లేవు.. కానీ కలలు ఉన్నాయి. ఆ కుర్రాడికి కదలడానికి శక్తి లేదు.. అయితేనేం ఎదగాలనే కాంక్ష ఉంది. యువకుడి చుట్టూ కష్టాల చీకట్లు అలముకున్నాయి.. మరేం కాదు రేపటి వెలుగు కోసం వెతకడం అతడికి తెలుసు. రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకుని కన్నీళ్లు పెట్టిన దశ నుంచి విశ్వ వేదికపై మువ్వన్నెల జెండా పట్టుకుని గర్వంగా ఆనంద భాష్పాలు రాల్చినంత వరకు పూర్ణారావు చేసిన ప్రయాణం సాధారణమైనది కాదు. ఒక్క రోడ్డు ప్రమాదం తన బతుకును మార్చేస్తే.. ఆ మార్పును తన కొత్త ప్రస్థానానికి దేవుడిచ్చిన తీర్పుగా చేసుకున్న నేర్పరి అతడు. శ్రీకాకుళం: ఇండోనేషియాలో ఈ నెల 5నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఓ సిక్కోలు కుర్రాడు మిక్స్డ్ డబుల్స్‌లో సిల్వర్, డబుల్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఇంత ఘనత సాధించిన ఆ క్రీడాకారుడికి రెండు కాళ్లు పనిచేయవు. అది కూడా పుట్టుకతో కాదు. అందరిలాగానే బాల్యంలో సరదాగా గడిపి, చక్కగా చదువుకుని, విదేశంలో ఓ ఉద్యోగం వెతుక్కుని కుటుంబాన్ని పోషించేంత వరకు అతను అందరిలాంటి వాడే. కానీ ఓ రోడ్డు ప్రమాదం అతడిని దివ్యాంగుడిని చేసింది. పరిపూర్ణంగా చె ప్పాలంటే రోడ్డు ప్రమాదానికి ముందు పూర్ణారావు వేరు. ప్రమాదం తర్వాత పూర్ణారావు వేరు. టెక్కలి మండలం శ్రీరంగం గ్రామంలో ని రుపేద కుటుంబానికి చెందిన చాపరా లక్ష్మణరావు, మోహిని దంపతుల చిన్న కుమారుడు చాపరా పూర్ణారావు. పూర్ణారావు ఇంటర్ పూర్తి చేసి 2015 సంవత్సరంలో సింగపూర్‌లో ఫైర్ సేఫ్టీలో ఉద్యోగంలో చేరాడు. తన తల్లిదండ్రులను చూసేందుకు 2017 సంవత్సరంలో సొంత గ్రామం వచ్చాడు. మరో రెండు రోజుల్లో సింగపూర్ వెళ్లిపోతున్న తరుణంలో వజ్రపుకొత్తూరు మండలం పూండి సమీపంలో ద్విచక్రవాహనంతో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో వెన్నుపూసకు తీవ్రంగా గాయం కావడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆ ప్రమాదం పూర్ణారావు బతుకులో చీకట్లు నింపింది. 2020 వరకు ఇంటిలో మంచానికే పరిమితమయ్యాడు. చిన్నపాటి పాన్‌షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లిదండ్రులకు పూర్ణారావు పరిస్థితి మరింత ఆవేదనకు గురి చేసింది. ఫేస్బుక్ ద్వారా తెలుసుకుని.. అప్పుడే ఫేస్బుక్లో బెంగళూరులో గల దివ్యాంగుల పునరావాస కేంద్రం గురించి పూర్ణారావు తెలుసుకున్నాడు. స్నేహితుల ఆర్థిక సహకారంతో బెంగళూరులో గల దివ్యాంగుల పునరావాస కేంద్రంలో చేరాడు. అక్కడ మనోధైర్యంపై నేర్చుకున్న అంశాలు అతడిని ఒక లక్ష్యానికి దగ్గర చేశాయి. ఈ క్రమంలో పారా బ్యాడ్మింటన్‌పై ఆసక్తి కలిగింది. యూట్యూబ్‌లో వీడియోలను చూస్తూ సొంతంగా నేర్చుకున్నాడు. తోటి మిత్రులతో కలిసి ప్రతి రోజూ సాధన చేసేవాడు. తొలి ఆటలోనే.. 2020లో కర్ణాటకలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పూర్ణారావు మొట్టమొదటిగా పాల్గొని గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించాడు. దీంతో అతని పట్టుదలకు మెడల్స్ మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. ఆ తర్వాత భువనేశ్వర్‌లో జరిగిన నాల్గో నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొన్నప్పటికీ ఎలాంటి మెడల్స్ రాలేదు. దీంతో కొంత నిరాశ చెందినప్పటికీ, పూర్ణారావు ఆటను కోచ్ ఆనంద్‌కుమార్ గమనించారు. దీంతో మైసూర్లో 2 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత లక్నోలో జరిగిన ఐదో నేషనల్ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని క్వార్టర్స్ ఫైనల్ వరకు వెళ్లాడు. 2023 జూలై నెలలో యుగాండాలో జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ పోటీలకు సిద్ధమైనప్పటికీ పాస్ పోర్టు సక్రమంగా లేదని ఎయిర్‌పోర్టులోనే ఆపివేశారు. దీంతో పూర్ణారావు తీవ్ర నిరాశతో వెనుతిరిగాడు. మెడల్స్‌తో ఉత్సాహం తాజాగా సెప్టెంబర్ 5 నుంచి 10 తేదీలలో ఇండోనేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పూర్ణారావు పాల్గొని మిక్స్డ్ డబుల్స్‌లో సిల్వర్, డబుల్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించడంతో కొత్త ఉత్సాహం వచ్చింది. అతను ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ను సాధించాడు. కర్ణాటక ఓపెన్ స్టేట్ టోర్నమెంట్లో 2 సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించాడు. 2002లో విశాఖపట్టణంలో జరిగిన టోర్నమెంట్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించాడు. 2023లో విశాఖపట్టణంలో జరిగిన టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు. వీటితో పాటు 2023 మార్చి నెలలో విశాఖపట్టణంలో జరిగిన ఏపీ నేషనల్ ట్రయల్స్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ గెలిచాడు. పారా ఒలింపిక్సే లక్ష్యం నాకు ఆర్థిక సాయం అందితే పారా ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి పతకం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మరి కొద్ది రోజుల్లో ఖేలో ఇండియా టోర్నమెంట్‌తో పాటు జపాన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నా. – చాపరా పూర్ణారావు -
సీతమ్మ కొండపై నేడు ‘హర్ శిఖర్ తిరంగా’
సాక్షి, పాడేరు: రాష్ట్రంలో అత్యంత ఎత్తైన (1,680 మీటర్లు) సీతమ్మ కొండకు అరుదైన గౌరవం దక్కనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా హకుంపేట మండలంలోని సీతమ్మ (అర్మ) కొండపైకి వెళ్లి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు సర్వం సిద్ధమైంది. అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అన్ని రాష్ట్రాల్లోని అత్యున్నత శిఖరాలపై జాతీయ జెండా ఎగురవేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ‘హర్ శిఖర్ తిరంగా’ మిషన్ పనిచేస్తోంది. పర్వత ప్రాంతాల్లో సాహసయాత్ర చేసి.. జాతీయ జెండా ఎగురవేయడం దీని ప్రధాన ఉద్దేశం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (నిమాస్) డైరెక్టర్ కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ నాయకత్వంలో ఈ నెల 4వ తేదీ సోమవారం 15 మందితో కూడిన ఆర్మీ బృందం అర్మ కొండపై యాత్ర చేపట్టి జాతీయ జెండా ఎగురవేయనుంది. ఈ కార్యక్రమానికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు సాధనపల్లి ఆనంద్‌కుమార్ హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో.. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ఎత్తులో ఉన్న సీతమ్మ (అర్మ) కొండపై హర్ శిఖర్ తిరంగా మిషన్ సాహసయాత్రతో పాటు జాతీయ జెండా ఆవిష్కరిస్తుందని ఇండియన్ ఆర్మీ ఏపీ ప్రభుత్వానికి గత నెలలో లేఖ పంపింది. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డి పోలీస్, రెవెన్యూ, టూరిజం శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ టూరిజం అథారిటీతో పాటు ప్రభుత్వంచే స్థాపించబడిన అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా క్లైంబింగ్, లాజిస్టిక్స్ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. సోమవారం ఉదయం ఈ యాత్ర ప్రారంభమవుతుంది. హుకుంపేటలో ముందుగా పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తీగలవలస–తడిగిరి పంచాయతీల సరిహద్దు నుంచి కల్నల్ రణవీర్‌సింగ్ జమ్వాల్ నేతృత్వంలోని ఆర్మీ బృందం అర్మ కొండకు సాహస యాత్ర చేపడుతుంది. -
సర్వీస్ మ్యాటర్ మాట్లాడేందుకే వెళ్లాను..
బంజారాహిల్స్ (హైదరాబాద్): తనతో పాటు మరో తొమ్మిది మంది డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతి విషయంపై మాట్లాడేందుకే ముఖ్యమంత్రి కార్యాలయ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కలిసేందుకు ఆమె క్వార్టర్‌కు వెళ్లినట్లు మేడ్చల్ జిల్లా పౌర సరఫరాల శాఖ మాజీ డిప్యూటీ తహసీల్దార్ చెరుకు ఆనంద్‌కుమార్‌రెడ్డి శనివారం పోలీస్ కస్టడీలో వెల్లడించారు. సర్వీస్ మ్యాటర్ డిస్కస్ చేసేందుకే ఆమె ఇంటికి వెళ్లానని చెప్పిన ఆనంద్‌కుమార్, అర్ధరాత్రి ఎందుకు వెళ్లావని పోలీసులు అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో గ్రూప్–2కు సెలెక్ట్ అయిన మొత్తం 26 మంది అభ్యర్థుల పోస్టింగ్‌లు కోర్టు వివాదంతో రద్దయ్యాయి. అయితే 2018లో కోర్టు జోక్యంతో వారందరికీ డిప్యూటీ తహసీల్దార్లుగా పోస్టింగ్లురాగా, ఇందులో 16 మందిని ఏపీకి కేటాయించారు. మిగతా పది మందికి తెలంగాణలో పోస్టింగ్లురాగా అందులో ఆనంద్‌కుమార్ కూడా ఒకరు. ఏపీలో 16 మందికి తహసీల్దార్లుగా ప్రమోషన్లు రాగా తెలంగాణలో మాత్రం నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా డీటీలుగానే ఉన్నామని, ఈ విషయం పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆనంద్ కుమార్ వెల్లడించినట్లు తెలుస్తోంది. సీఎంవోలో కీలక బాధ్యతల్లో ఉన్న స్మితా సబర్వాల్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తే సీఎంతో మాట్లాడి న్యాయం చేస్తారన్న ఉద్దేశంతోనే కలవడానికి వెళ్ళినట్లుగా చెప్పాడు. అయితే ఆమెను కలవడానికి క్వార్టర్‌కు వెళ్లడం ఒక తప్పయితే, అర్ధరాత్రి వెళ్లడం మరో తప్పని పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆనంద్ కుమార్‌రెడ్డిని సస్పెండ్ చేసిన విషయం కూడా విదితమే. ఇదిలా ఉండగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లో నీలోఫర్ చాయ్ తాగుదామని తనను మేడ్చల్‌నుంచి తీసుకొచ్చాడని స్మితా సబర్వాల్ ఇంటికి వెళ్లే విషయం తనకు తెలియదని, తనను అనవసరంగా ఇందులో ఇరికించాడని మరో నిందితుడు కొత్త బాబు కస్టడీలో పోలీసులకు వెల్లడించాడు. -
ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ‘ప్రియతమా’, విడుదల ఎప్పుడంటే..
ఆనంద్ కుమార్ , నాగ వంశీ కృష్ణ, వికాస్ చంద్ర, ఉషా, ఏంజిల్, వృషాలి ప్రధాన పాత్రలలో సంతోష్ పార్లవర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రియతమా’. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ను పులకుర్తి కొండయ్య నిర్మిస్తున్నాడు. ట్రయాంగిల్ లవస్టోరీ గా వెరైటీ కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం ఆర్కే టాకీస్ బ్యానర్ సమర్పణలో రాబోతుండగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్, ప్రముఖ దర్శకుడు రవికుమార్ చౌదరి విడుదల చేయగా, పాటలను లెజెండరీ డైరెక్టర్ బి.గోపాల్ విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమా ను డిసెంబర్ 10 వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ విడుదల ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాత పులకుర్తి కొండయ్య మాట్లాడుతూ.. ప్రియతమా చిత్రం ప్రతి ఒక్కరి ని అలరించే సినిమా. దర్శకుడు సంతోష్ పార్లవార్ మంచి కథ తో ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. ప్రేమ కథలలో సరికొత్త లైన్ ను ఎంతో బాగా యూత్ కి నచ్చేలాగా తెరకెక్కించాడు. మా చిత్రం ఇంతబాగా రావడానికి సహకరించిన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు. డిసెంబర్ 10 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు. ఆనంద్ కుమార్ , నాగ వంశీ కృష్ణ , వికాస్ చంద్ర, ఉషా, ఏంజెల్, వృషాలి, చిత్రం శ్రీను, ఫిష్ వెంకట్, సుమన్ శెట్టి తదితరులు నటించిన ఈ చిత్రానికి చైతన్య సంగీతం అందిస్తున్నాడు. -
మరోసారి కేబీసీకి ‘సూపర్ 30’ ఆనంద్
ముంబై : సూపర్ 30 వ్యవస్థాపకుడు, ప్రముఖ మ్యాథమెటీషియన్ ఆనంద్ కుమార్.. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో మరోసారి పాల్గొననున్నారు. త్వరలో జరగనున్న ఎపిసోడ్ 51, 61,62లలో పాల్గొనవల్సిందిగా కేబీసీ ఆనంద్‌ను ఆహ్వానించనుంది. ఈ మేరకు సూపర్ 30 శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. 2017లో మొదటిసారి ఆయన కేబీసీలో పాల్గొన్నారు. గేమ్ ఆడి 25 లక్షల రూపాయలను గెలుచుకున్నారు. అంతేకాకుండా ‘అరక్షణ్’ సినిమాలో పాత్రకు సంబంధించి అమితాబ్ బచ్చన్‌కు ఆనంద్ కొన్ని సలహాలను కూడా ఇచ్చారు. చదవండి : అక్షయ్ బాటలో మిలింద్.. తొలిసారి ఆ పాత్రలో! -
ప్రేమ కోసం ఏదైనా..
వంశీకృష్ణ, ఆనంద్ కుమార్, వికాస్ చంద్ర హీరోలుగా, ఉషా, రూపాలి సెలోకర్, ఏంజెల్ గరేవాల్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రియతమా’. ‘ఎనీథింగ్ ఫర్ లవ్’ అనేది ఉపశీర్షిక. సంతోష్ పార్లవార్ దర్శకత్వం వహించారు. కర్నూలుకు చెందిన ప్రముఖ నాయకుడు పులకుర్తి కొండయ్య ఆర్కె టాకీస్ పతాకంపై నిర్మించారు. నేడు (ఆగస్టు 5) కొండయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు తీయాలని తొలి ప్రయత్నంగా ‘ప్రియతమా’ చిత్రాన్ని నిర్మించాను. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. సామాజిక సందేశాన్ని అందించే చిత్రాలతోపాటు పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రాల్ని నిర్మించాలనుకుంటున్నాం. ‘ప్రియతమా’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య, కెమెరా: ఆనెం వెంకట్. -
'జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ కోచింగ్'
పట్నా : లాక్డౌన్ నేపథ్యంలోనూ గాయపడిన తన తండ్రిని సొంతూరుకు చేర్చడం కోసం 1200 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించిన జ్యోతి కుమారి పట్ల సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ప్రముఖ మ్యాథమెటీషియన్, సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ జ్యోతి కుమారికి ఉచితంగా ఐఐటీ-జేఈఈ కోచింగ్ అందిస్తామని ప్రకటించాడు. ''ఐదు రోజుల పాటు సైకిల్ తొక్కుతూ 1200 కిలోమీటర్ల ప్రయాణించడం అంటే ఒక సాహసమే. కానీ జ్యోతి కుమారి సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది. సూపర్ 30 తరపున మా తమ్ముడు జ్యోతి కుటుంబాన్ని కలిసి సహాయం అందించాడు. భవిష్యత్తులో ఐఐటీయన్ కావాలనుకుంటే జ్యోతికుమారికి మా సూపర్ 30 స్వాగతం పలుకుతుంది'' అంటూ ఆనంద్ కుమార్ ట్వీట్ చేశారు. (పల్లె విద్యార్థులకు ఆనంద్ కుమార్ పాఠాలు ) #Bihar daughter #jyotikumari has set an example by paddling all the way from #Delhi carrying her father on a bicycle, covering an unimaginable 1200 kms. Yesterday, my brother @Pranavsuper30 met her. If she would like to prepare for #IIT in future she is welcome to the #super30 pic.twitter.com/PMhsMvhDwn — Anand Kumar (@teacheranand) May 25, 2020 అంతకుముందు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యోతికి సైక్లింగ్‌లో శిక్షణతో పాటు ఆమె చదువుకు కూడా సహాయం అందిస్తామని ప్రకటించింది. జ్యోతిని ధైర్యవంతురాలిగా ప్రశంసిస్తూ పలువురు మంత్రులు ఆమెకు సహాయం అందివ్వడానికి ముందుకు వచ్చారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాబ్రీ దేవి సైతం జ్యోతి చదువుకు, వివాహానికి అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆర్డేడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రికి ఉద్యోగం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక జ్యోతి సాహాసానికి ఇవాంకా ట్రంప్ సైతం ఫిదా అయ్యారు. ఆమె కథని ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఇవాంకా ''అదో అందమైన సహనంతో కూడిన ప్రేమ. ఆమె చేసిన ఫీట్‌ని భారత ప్రజలతో పాటు సైక్లింగ్ ఫెడరేషన్ గుర్తించాయి'' అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక ) -
పల్లె విద్యార్థులకు ఆనంద్ కుమార్ పాఠాలు
న్యూఢిల్లీ: ‘సూపర్–30’ కోచింగ్‌తో ఫేమస్ అయిన ఆనంద్ కుమార్ పల్లెటూర్లకు చెందిన పేద విద్యార్థుల కోసం ఒక్క రూపాయికే కోచింగ్ అందించే ప్రాజెక్టులో పాలుపంచుకున్నారని ఈ గవర్నెన్స్ బుధవారం తెలిపింది. ప్రజలకు సుపరిచితుడైన ఆనంద్ కుమార్ ఆన్లైన్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చే మాడ్యూల్‌కు కోర్సును తయారు చేయనున్నారు. ఇది ఐఐటీ జేఈఈ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉపయోగపడనుంది. ఇది పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, సైన్సు, లెక్కలు విద్యార్థులు పట్టు సాధించేలా ఉంటుందని ఆనంద్ చెప్పారు. ఒక్క రూపాయికే పేద విద్యార్థులకు అందుబాటులో ఉంటుందన్నారు. కొత్త రకమైన బోధనా పద్ధతులతో విద్యార్థులు నేర్చుకునేలా, సబ్జెక్టులపై ఆసక్తి పెంచేలా ఉంటుందన్నారు. -
అమ్మ తొమ్మిదిసార్లు చూసింది
‘‘నేను నటించిన ‘సూపర్ 30’ చిత్రాన్ని మా అమ్మ తొమ్మిదిసార్లు చూసింది’’ అంటున్నారు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్. పాట్నాకు చెందిన ఆనంద్ కుమార్ అనే గణితశాస్త్రవేత్తకు సంబంధించిన కథ ఆధారంగా నిర్మితమైన ఈ చిత్రాన్ని హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ థియేటర్లలో ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు చూశారట. ‘ఆనంద్ సార్‌ని, ఆయన సోదరుడు ప్రణవ్ను ఇంతవరకు వ్యక్తిగతంగా కలిసే అవకాశం దొరకలేదు’ అని తన తల్లి అన్నారని కూడా హృతిక్ తెలిపారు. మొత్తానికి సూపర్ 30 సక్సెస్ మీట్‌తో ఆవిడ కోరిక నెరవేరింది. కొంతకాలం క్రితమే ఈ చిత్రం విడుదలైంది. ఆనంద్‌కుమార్ అనే 46 సంవత్సరాల మాథమెటీషియన్ మీద ఎంతో ఇన్స్పైరింగ్గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆనంద్‌కుమార్‌కు, ఆయన సోదరుడు ప్రణవ్కుమార్కు సక్సెస్ మీట్లో తన తల్లిని పరిచయం చేశారు హృతిక్ రోషన్. -
లఘు చిత్ర దర్శకుడికి జాతీయ స్థాయి అవార్డ్
గత కొన్ని సంవత్సరాలుగా బంజారా మహిళా యన్ జీ వో ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తునందుకు గాను తెలుగు వైద్యుడు, సినీ దర్శకులు డాక్టర్ ఆనంద్‌కు సేవా రంగంలో జాతీయ స్థాయి అవార్డ్ లభించింది. నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ మరియు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు సంయుక్తంగా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో, దేశ వ్యాప్తంగా వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రదర్షణ కన పరచిన వారికి జాతీయ స్థాయి అవార్డులను అందజేశారు. ఢిల్లీ లోని ఆంధ్ర మరియు తెలంగాణా భవన్ లోని ఆడిటోరియంలో ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణా భవన్ కమీషనర్ శ్రీ వేణు గోపాలా చారి (ఐఏయస్), జస్టిస్ పి.యస్.నారాయణ, డా. వరికుప్పల శ్రీనివాస్ (వాటర్ ట్రిబ్యునల్ మెంబర్), డా.బింగి నరేందర్ గౌడ్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డ్‌ల ప్రధానం జరిగింది. ఈ సందర్భంగా డా.ఆనంద్ మాట్లాడుతూ, తను ఎన్నో ఆరోగ్య శిబిరాలను నిర్వహించడానికి సహాయ సహ కారాలను అందిస్తున్న మిత్రులందరికీ, సంస్థలకు ప్రత్యేక ధన్య వాదాలు తెలియ చేసారు. ఈ అవార్డ్ ను మాజీ కేంద్ర మంత్రి వర్యులు దివంగత అరుణ్ జైట్లీ గారికి అంకిత మిస్తునట్లుగా ఆయన తెలిపారు. -
‘నా సాయం తిరస్కరించారు.. అభినందనలు’
పట్నా : ఐఐటీ జేఈఈ పరీక్షకు సిద్ధం అవుతోన్న వారికి బిహార్‌కు చెందిన ప్రముఖ గణిత వేత్త ఆనంద్ కుమార్ గురించి తెలిసే ఉంటుంది. ప్రతిభావంతులైన 30 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించి.. వారు ఐఐటీలో సీటు సాధించేందుకు తోడ్పడుతూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఆనంద్ కుమార్. ఈ ఐఐటీ ట్యూటర్ జీవిత చరిత్ర ఆధారంగా... బాలీవుడ్లో ‘సూపర్ 30’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఆనంద్ కుమార్ పాత్రలో నటించారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లలోనూ దూసుకుపోతుంది. ఆనంద్ కుమార్ కృషి గురించి తెలుసుకున్న వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. అంతేకాక ‘ఆనంద్ చేస్తోన్న పని గురించి తెలిసి అతడిని అభినందించడానికి వెళ్లాను. నా వంతుగా ఆయనకు ఆర్థిక సాయం చేద్దామని భావించాను. కానీ ఆశ్చర్యం.. ఆనంద్ నా సాయాన్ని తిరస్కరించారు. తన స్వంతంగానే ఈ సూపర్ 30 కార్యక్రమాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయన పట్టుదల చూసి నాకు చాలా ముచ్చటేసింది. ఆయన కృషిని అభినందిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ కుమార్ స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు సార్.. మీ అభినందనలే నాకు ఎంతో బలాన్నిస్తాయి’ అంటూ రీట్వీట్ చేశాడు. Anand Kumar says in the article that he turned down my offer to fund his efforts. I confirm that when we met, he courteously declined my offer of financial support. I remain an admirer of how he’s changed the lives of so many. https://t.co/3Gn3V1Qdlp pic.twitter.com/fAFqYg6UtU — anand mahindra (@anandmahindra) July 13, 2019 ఆనంద్ కుమార్ 2002లో ఈ సూపర్ 30 ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. నైపుణ్యం కలిగిన 30 మంది పేద పిల్లలను ఎంచుకుని వారికి ఉచిత వసతి కల్పిస్తూ పాఠాలు చెప్తుంటారు. మొదటి ఏడాదిలోనే ఈ అకాడమీకి చెందిన 30 మందిలో 18 మంది ఐఐటీకి సెలక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2010 లో ఈ అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థులు ఐఐటీ జేఈఈకి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో ఆనంద్ కుమార్ గురించి దేశవ్యాప్తంగా తెలిసింది. ఫారిన్ మీడియా కూడా ఆనంద్ కుమార్ కృషిని ప్రశంసించింది. -
మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్ 30’
అదిరిపోయే డ్యాన్సులు, నటనతో బాలీవుడ్ గ్రీక్ గాడ్‌గా ఫేమ్ తెచ్చుకున్న కథా నాయకుడు హృతిక్‌రోషన్. 2017లో కాబిల్ లాంటి వైవిధ్యమైన చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో దాదాపు రెండున్నర సంవత్సరాల విరామం తర్వాత సూపర్–30తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణనిస్తూ ఐఐటీలకు పంపుతూ పేరు గడించిన ప్రముఖ గణితవేత్త ఆనంద్‌కుమార్ జీవిత గాథతో తీసిన సూపర్ 30 సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి వాటిని ఈ చిత్రం ఎంతమేర అందుకుందో తెలుసుకుందాం.. కథ: బిహార్‌లోని పాట్నాలో ఉండే ఆనంద్‌కుమార్‌కు గణితం అంటే ఎనలేని ఆసక్తి. ఆ ఇష్టంతోనే తక్కువ కాలంలో గణితంపై పట్టు తెచ్చుకొని, ప్రఖ్యాత కేంబ్రిడ్జి వర్సిటీలో సీటు దక్కించుకుంటాడు. కానీ పేదింట్లో పుట్టిన ఆనంద్ ఆర్థిక సమస్యలతో కేంబ్రిడ్జికి వెళ్లలేకపోతాడు. అదే సమయంలో అతని కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలతో అతడి చదువు ఆగిపోతుంది. కుటుంబ పోషణ కోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో క్లాసులు చెప్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. కానీ ఓ రాత్రి ఒక బాలుడు, రిక్షా కార్మికుడితో జరిపే సంభాషణతో తీవ్ర వేదనకు గురైన ఆనంద్ ఉద్యోగం మానేసి, పేద పిల్లలకు ఉచితంగా ఐఐటీ శిక్షణ ఇవ్వాలన్న నిర్ణయానికి వస్తాడు. సొంత అకాడమీని నెలకొల్పి, నైపుణ్యం కలిగిన 30 మంది పేద పిల్లలను ఎంచుకుని వారికి ఉచిత వసతి కల్పిస్తూ పాఠాలు చెప్తుంటాడు. తమ కోచింగ్ వ్యాపారానికి ఆనంద్ చర్యలతో నష్టమని గ్రహించిన ప్రైవేటు శిక్షణ సంస్థ యజమాని ఆదిత్య శ్రీవాత్సవ, రాజకీయ నాయకుడు పంకజ్ త్రిపాఠీ ఆనంద్‌పై కక్ష కడతారు. చివరికి వారు ఆనంద్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఏం చేశారు? తను శిక్షణనిస్తున్న పిల్లలకు ఐఐటీలో సీట్లు తీసుకురావాలన్న ఆనంద్‌కుమార్ కల నెరవేరిందా లేదా అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. నటీనటులు: ఆనంద్‌కుమార్ పాత్రలో హృతిక్‌రోషన్ జీవించాడనే చెప్పాలి. ఆ పాత్రలో హృతిక్ ఒదిగిన తీరు అద్భుతం. చాలా చోట్ల ఆయన కళ్లతో, హావభావాలతో సన్నివేశాలకు అదనపు హంగులద్దాడు. కేంబ్రిడ్జిలో సీటు వచ్చే సీన్, పతాక సన్నివేశాల్లో హృతిక్ నటన ఆడియన్స్‌ను సీట్ల నుంచి కదలనివ్వకుండా చేస్తుంది. కొన్ని సీన్లలోనే కనపడినా క్లాసికల్ డ్యాన్స్, మంచి లుక్స్‌తో రితూ పాత్రలో కథానాయిక మృనాల్ ఠాకూర్ ఆకట్టుకుంది. హీరో తండ్రి పాత్రలో నటించిన సీనియర్ నటుడు వీరేందర్ సక్సేనా సహజసిద్ధ నటనతో మెప్పించాడు. కోచింగ్ సెంటర్ యజమానిగా బాగా నటించిన ఆదిత్య శ్రీవాత్సవ పాత్ర కథను కీలక మలుపు తిప్పుతుంది. రాజకీయ నాయకుడిగా పంకజ్ త్రిపాఠీ పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఆనంద్‌కుమార్ తమ్ముడు ప్రణవ్ కుమార్‌గా నటించిన నందిష్ సింగ్ చక్కని నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. ఆనంద్ వద్ద శిక్షణ పొందే పిల్లలుగా నటించిన వారందరూ ఆకట్టుకున్నారు. విలేకరిగా నటించిన అమిత్ సాద్‌తోపాటు మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు. విశ్లేషణ: ఆదర్శంగా నిలిచే ఆనంద్‌కుమార్ జీవితాన్ని అంతే స్ఫూర్తిమంతంగా తెరకెక్కించి, ప్రేక్షకుల ముందుంచడంలో దర్శకుడు వికాస్ భల్ విజయవంతమయ్యాడు. పాత్రల చిత్రణ, వాటి తాలూకు సంఘర్షణకు తెరరూపమివ్వడంలో ఆయన సఫలమయ్యాడు. చిన్న పిల్లల నుంచి తనకు కావాల్సిన నటనను రప్పించుకోవడం, హృతిక్‌ను పాత్రకు తగ్గట్లుగా మలచడంలో సక్సెస్ అయ్యాడు. కథనంలో వేగం తగ్గిన్నప్పుడల్లా సున్నితమైన హాస్యంతో సినిమాను నిలబెట్టాడు. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకున్న హృతిక్ రోషన్ స్టార్ ఇమేజ్ తాలూకు ఛాయలు పాత్రలో కనపడనీయకుండా అద్భుతమైన నటనను కనబరిచారు. బిహారీ హిందీ యాసలో హృతిక్, పంకజ్ త్రిపాఠీ, వీరేందర్ సక్సేనాలు తమ డైలాగులు, నటనతో పేక్షకుల్ని మాయ చేస్తారు. అనయ్ గోస్వామి తన కెమెరా పనితనంతో పాట్నా వీధులు, పేదల జీవితాలను బాగా చూపాడు. అజయ్–అతుల్ సంగీతం కథలో భాగంగా సాగగా.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సంజీవ్ దత్తా రాసిన సంభాషణలు మనసుకు హత్తుకునేలా, పొట్టచెక్కలయ్యేలా, ఆలోచింపజేసేలా ఉన్నాయి. స్ఫూర్తినింపుతూ సందేశాన్నిచ్చే కథ, నటీనటుల సహజమైన నటన, చక్కని వినోదం, హృతిక్‌ను కొత్తగా చూపిన విధానం కలగలిపిన ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుందనడంలో సందేహం లేదు. టైటిల్: సూపర్ 30 (హిందీ చిత్రం) జానర్: బయోగ్రఫీ నటీనటులు: హృతిక్ రోషన్, మృణాల్ ఠాకూర్, పంకజ్ త్రిపాఠీ, వీరేందర్ సక్సేనా, అమిత్ సాద్, నందిష్ సింగ్, ఆదిత్య శ్రీవాత్సవ సంగీతం: అజయ్ గోగావలే –అతుల్ గోగావలే నిర్మాత: అనురాగ్ కశ్యప్, మధు మంతెన వర్మ, సాజిద్ నదియాడ్వాలా దర్శకత్వం: వికాస్ భల్ – నిధాన్ సింగ్ పవార్ -
అప్పడాలమ్మా అప్పడాలు
.... అని రోడ్డుపై అమ్ముతున్నారు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్‌రోషన్. హీరో అప్పడాలు అమ్మాడంటే అది కచ్చితంగా ఏదో సినిమాకే అయ్యుంటుంది. అవును... ‘సూపర్ 30’ కోసం హృతిక్ అప్పడాలు అమ్మారు. బీహార్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రం ‘సూపర్ 30’. ఆనంద్ పాత్రలో హృతిక్ నటించారు. వికాస్ బాల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాలోని హృతిక్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఆనంద్‌కుమార్ జీవితంలో ఇలా అప్పడాలు అమ్మే నాటి పరిస్థితులు ఎంతో ఉద్వేగంతో కూడుకున్నవి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ఆయన కష్టపడి జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు’’ అని హృతిక్ పేర్కొన్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూలై 12న విడుదల కానుంది. -
ఆనంద్‌కుమార్ అబద్ధాలు.. చిక్కుల్లో ‘సూపర్ 30’
పట్నా: హృతిక్ రోషన్ తాజా సినిమా ‘సూపర్ 30’ విడుదల చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ మ్యాథమేటిషియన్ ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అయితే, తన ‘సూపర్ 30’ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎక్కువమంది విద్యార్థులను ఐఐటీలో చేరుస్తున్నట్టు ఆనంద్‌కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో ఆయన వ్యాఖ్యలు అవాస్తవమని పలువురు ఐఐటీ విద్యార్థులు న్యాయస్థానంలో గత ఏడాది పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ విచారణలో ఉండగానే ఆనంద్‌కుమార్ జీవితాన్ని గొప్పగా చూపిస్తూ సినిమా ఎలా విడుదల చేస్తారని ఈ పిల్ దాఖలు చేసిన విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పిల్ దాఖలు చేసిన ఐఐటీ విద్యార్థులైన అవినాశ్ బారో, బికాస్ దాస్, మోన్‌జిత్ దోలే, ధనిరాం థా.. ‘సూపర్ 30’ సినిమా విడుదలను ఆపాలంటూ మరో వ్యాజ్యం వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక కేసు నమోదైన వ్యక్తిపై.. ఆ కేసు తేలకముందే సినిమా ఎలా విడుదల చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆనంద్‌కుమార్‌పై తీసిన సినిమా నిజాలను ప్రతిబింబించినట్టు కనిపించడం లేదని, సినిమాకు నష్టం చేయాలన్నది తమ ఉద్దేశం కానప్పటికీ.. అతనిపై వచ్చిన అభియోగాలకు ఇప్పటివరకు సరైన సమాధానం ఆనంద్‌కుమార్ ఇవ్వాలేదని విద్యార్థుల తరఫు న్యాయవాది అమిత్ గోయల్ తెలిపారు. 2018లో తమ ఇన్స్టిట్యూట్ నుంచి 26మంది విద్యార్థులు ఐఐటీలో చేరారని ఆనంద్‌కుమార్ చెప్పుకున్నారని, కానీ, ఐఐటీలో చేరిన ఆ 26 మంది విద్యార్థులెవరో.. వారి పేర్లు వెల్లడించాలని కోర్టులో కోరినా.. ఇప్పటివరకు ఆయన ఆ వివరాలు తెలుపలేదని పిటిషనర్లు అంటున్నారు. నిరుపేద కుటంబాలకు చెందిన విద్యార్థులకు స్వయంగా కోచింగ్ ఇచ్చి.. ప్రతి సంవత్సరం వారు ఐఐటీల్లో చేరేలా కృషి చేస్తున్న ఆనంద్‌కుమార్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన జీవితాన్ని తెరమీద ఆవిష్కరిస్తూ.. హృతిక్ రోషన్ హీరోగా ‘సూపర్ 30’ సినిమా తెరకెక్కింది. -
‘సూపర్ 30 ఆనంద్ ఓ మోసగాడు’
పట్నా : బిహార్‌కు చెందిన గణిత ఉపాధ్యాయుడు, సూపర్ 30 ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్‌కు గువాహటి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫ్రీగా కోచింగ్ ఇస్తానంటూ ఈశాన్య భారతదేశ విద్యార్థులను ఆనంద్ కుమార్ మోసం చేశారంటూ ఐఐటీ గువాహటికి చెందిన నలుగురు విద్యార్థులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వీరి తరపున కోర్టుకు హాజరైన లాయర్ అశోక్ సరాఫ్ తన వాదనలు వినిపిస్తూ...‘ ఐఐటీ బాబాగా పేరొందిన ఆనంద్ కుమార్ ఫ్రీగా కోచింగ్ ఇస్తానంటూ ఈశాన్య భారతదేశ విద్యార్థులను ఆకర్షించారు. కానీ రామానుజం స్కూల్ ఆఫ్ మాథమెటిక్స్‌లో చేరిన తర్వాత వారి నుంచి 33 వేల రూపాయలు వసూలు చేశారు. అలాగే ఆయన రాంగ్ గైడెన్స్ వల్ల ఎంతో మంది ఐఐటీ ఆశావహులు చాలా నష్టపోయారని’ ఆరోపించారు. దీంతో విద్యార్థులు దాఖలు చేసిన పిల్‌పై విచారణకు హాజరు కావాలంటూ శుక్రవారం ఆనంద్ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. కాగా పట్నా కేంద్రంగా ఆనంద్ కుమార్ ‘సూపర్ 30’ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఇనిస్టిట్యూట్‌లో ఎటువంటి లాభం ఆశించకుండా విద్యార్థులకు శిక్షణనిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 14 ఏళ్ల కిందట కుమార్ స్థాపించిన సూపర్ 30, 2010లో తొలిసారిగా వార్తల్లో నిలిచింది. ఆ ఏడాది ఐఐటీ-జేఈఈలో కుమార్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన మొత్తం 30 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇది అంతర్జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో ఆనంద్ కుమార్ బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సూపర్ 30 అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. -
సూపర్ 30 ఫస్ట్‌లుక్ లాంచ్
ముంబై : బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న సూపర్ 30 సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. టీచర్స్ డే సందర్భంగా బుధవారం తన ట్విటర్, ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హృతిక్ రోషన్ షేర్ చేశారు. ఈ పోస్టర్లో హృతిక్ గుబురుగడ్డంతో సీరియస్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. మ్యాథమేటిక్ ఫార్ములాతో పోస్టర్‌ను డిజైన్ చేసినట్టు కనిపిస్తుండగా పోస్టర్ కింద ‘అబ్ రాజా కా బేటా రాజా నహీ బనేగా’ అనే క్యాప్షన్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. బిగ్ స్క్రీన్‌పై హృతిక్ తొలిసారిగా రియల్ లైఫ్ క్యారెక్టర్‌ను పోషిస్తుండటంతో మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి. వికాస్ భల్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలాకు చెందిన నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సూపర్ 30 వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఈ మూవీలో మృణాల్ ఠాకూర్, టీవీ నటుడు నందిష్ సింగ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ కంగనా రనౌత్ మణికర్ణిక, ఇమ్రాన్ హష్మిల ఛీట్ ఇండియాలతో తలపడనుంది. -
సూపర్ 30కి మద్దతుగా తేజస్వీ యాదవ్
పట్నా : విద్యార్థుల ఫలితాల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు ఎదురుకొంటున్న ప్రముఖ మ్యాథ్స్ నిపుణుడు ఆనంద్ కుమార్‌కు పలువురు ప్రముఖులు బాసటగా నిలిచారు. తొలుత బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా, కుమార్‌కు మద్దతుగా నిలిచారు. ‘మూక దాడులు మరో రూపం దాల్చాయి. ఈ సారి బాధితుడు మన ‘సూపర్ 30’ హిరో కుమార్. నిజమైన మ్యాథ్స్ నిపుణుడైన కుమార్ ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలిచారు. అతని సేవలు బిహార్‌కు, భారత్‌కు గర్వకారణమ’ని శత్రుఘ్న సిన్హా కొనియాడారు. తాజాగా బిహార్ ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ కూడా ఈ ఆరోపణలను ఖండించారు. కుమార్‌ని సోమవారం అతని ఇంట్లో కలిసిన తేజస్వీ ట్విటర్లో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘కుమార్ సమాజంలోని వెనుకబడిన వర్గం నుంచి వచ్చారు. ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి అండగా నిలిచారు. వారి మెరుగైన భవిష్యత్ కోసం పాటుపడుతూ.. తాను కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ నియంతృత భావాలు కలిగిన ఓ వర్గం అతని పేరును చెడగొట్టేలా అసత్యాలను ప్రచారం చేస్తోంది. కుమార్‌కు గౌరవ సూచికగా.. బాలీవుడ్లో అతని బయోపిక్ తెరకెక్కుతోంద’ని పేర్కొన్నారు. పట్నా కేంద్రంగా కుమార్ ‘సూపర్ 30’ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఇనిస్టిట్యూట్‌లో ఎటువంటి లాభం ఆశించకుండా విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. 14 ఏళ్ల కిందట కుమార్ స్థాపించిన సూపర్ 30 2010లో తొలిసారిగా వార్తలో నిలిచింది. ఆ ఏడాది ఐఐటీ-జేఈఈలో కుమార్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన మొత్తం 30 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇది అంతర్జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది. ఇటీవల కుమార్ మాట్లాడుతూ.. ఈ ఏడాది సూపర్ 30కి చెందిన 26 మంది ఐఐటీ-జేఈఈకి అర్హత సాధించినట్టు తెలిపారు. దీనిపై అభ్యంతరం తెలిపిన సూపర్ 30కి చెందిన ఓ విద్యార్థి కుమార్ తప్పడు ప్రచారం చేసుకున్నట్టు ఆరోపించాడు. సూపర్ 30కి చెందిన ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఎగ్జామ్‌లో అర్హత సాధించారని, ఇతర ఇనిస్టిట్యూట్లకు చెందిన వారిని కూడా కుమార్ ఆ జాబితాలో చేర్చాడని తెలిపాడు. కాగా కుమార్ జీవితం ఆధారంగా హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. -
లఘు చిత్ర దర్శకుడికి నాటా ఆహ్వానం
లఘు చిత్రాలను రూపొందించి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న దర్శకుడు ఆనంద్ కుమార్‌కు మరో గౌరవం దక్కింది. ఈ ఏడాది జూలైలో జరగబోయే నాటా (నార్త్ అమెరికా తెలుగు అసోషియేషన్) మెగా కన్వెన్షన్‌లో దర్శకుడు ఆనంద్ కుమార్ పాల్గొననున్నారు. డాక్టర్ అయిన ఆనంద్ సినీరంగం మీద ప్రేమతో దర్శకుడిగా మారారు. హార్మోన్స్ సినిమాతో దర్శకుడి పరిచయం అయిన ఆనంద్, తరువాత లఘు చిత్రాలతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. సామాజిక సమస్యల నేపథ్యంలో ఆనంద్ రూపొందించిన ప్రజా హక్కు, అన్ టచ్ ఎబిలిటీ లాంటి షార్ట్ ఫిలింస్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన 9 ఏళ్ల అమ్మాయి చిరు తేజ్ సింగ్ కథతో తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ఆనంద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధించటంతో పాటు పలు అవార్డు కమిటీల జ్యూరీలలో మెంబర్‌గా ఉన్న ఆనంద్‌కు నాటా ఫిలడెల్ఫియాలో నిర్వహించబోయే మెగా కన్వెన్షన్‌కు ఆహ్వానం అందింది. జూలై 6 నుంచి 8 వరకు జరగబోయే ఈ కన్వెన్షన్‌లో ప్రపంచం నలు మూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. -
‘ఆ పాత్రకు ఆయనే న్యాయం చేయగలడు’
బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సూపర్30’. గణిత ఉపాధ్యాయుడి నిజ జీవిత ఆధారంగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. బీహార్‌లోని ఆనంద్ కుమార్ అనే మ్యాథ్స్ టీచర్ తన విద్యార్థులకు ఐఐటీ దిశగా శిక్షణనిచ్చేవాడు. ఆయన విద్యార్థులందరూ ఐఐటీలోనే చదువుతున్నారు. అయితే అంతటి మేధావి ఆ స్థాయికి చేరుకున్న ప్రయాణాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ...‘ఎనిమిదేళ్ల క్రితం రచయిత సంజీవ్ దత్తా నా వద్దకు వచ్చాడు. సూపర్ 30 పేరుతో మీ గురించి సినిమా తీయాలనుకుంటున్నాను అని చెప్పాడు. హృతిక్ నా పాత్రను పోషించడం చాలా ఆనందంగా ఉంది. తనను నేను కలిసాను. నా పాత్రకోసం తను పడే కష్టాన్ని చూశాను. నేను క్లాస్‌రూంలో చెప్పిన వీడియోలను చూస్తున్నాడు. నా పాత్రపై పట్టు సాధించేందుకు చాలా శ్రమిస్తున్నాడు. హృతిక్ నా పాత్రను చాలా బాగా చేస్తున్నాడు. ఈ పాత్రకు ఆయనే న్యాయం చేయగలడు’ అని తెలిపాడు. వచ్చే ఏడాది జనవరి 25న సూపర్30 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
పగలే పంజా!
సాక్షి, సిటీబ్యూరో: కేవలం పగటి వేళల్లోనే కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, చోరీలకు పాల్పడుతున్న ఆనంద్‌కుమార్ అలియాస్ నందును నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 14న ఓ ఇంటి నుంచి రూ.11 లక్షల సొత్తు, నగదు ఎత్తుకు వెళ్లిన ఇతడిని కేవలం 24 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని 15నే అరెస్టు చేసినా గురువారంఈస్ట్జోన్ డీసీపీ రమేష్, కాచిగూడ ఏసీపీ నర్సయ్యలతో కలిసి సీపీ అంజనీకుమార్ గురువారం వివరాలు వెల్లడించారు. బాగ్ అంబర్‌పేటలోని గంగబౌలి ప్రాంతానికి చెందిన ఆనంద్‌కుమార్ పాత నేరస్తుడు. 2001–15 మధ్య హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ ఠాణాల పరిధుల్లోనూ నేరాలకు పాల్పడ్డాడు. పగటి వేళల్లో, యజమానులు ఉద్యోగాలకు వెళ్లే సమయాల్లో కాలనీల్లో సంచరించే ఇతను తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తాడు. అదును చూసుకుని తాళం పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించి సొత్తు, సొమ్ము ఎత్తుకెళ్లేవాడు. ఇదే పంథాలో గతంలో మహంకాళి, నల్లకుంట, చిక్కడపల్లి, ఎస్సార్‌నగర్, సరూర్‌నగర్, చైతన్యపురి, కోదాడ పోలీసు స్టేషన్ల పరిధుల్లో నేరాలు చేశాడు. తాజాగా ఈ నెల 14న నల్లకుంట పరిధిలో నివసిస్తున్న నర్సు సముద్ర ఇంట్లోకి ప్రవేశించిన ఇతను 25 తులాల బంగారం, రూ.4.57 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నల్లకుంట పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని నందుగా గుర్తించారు. ముమ్మరంగా వేటాడిన అధికారులు 15న అతడిని అరెస్టు చేసి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నందుపై మహంకాళి, నల్లకుంట, చిక్కడపల్లి, ఎస్సార్‌నగర్ ఠాణాల్లో నమోదైన కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి. కోదాడలో నమోదైన ఓ కేసులో ఇతడికి మూడేళ్ళ జైలు శిక్ష కూడా పడింది. నందు నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించామని సీపీ పేర్కొన్నారు. -
చిన్నారులకు ప్రేరణ కలిగించేలా ‘చిరు తేజ్ సింగ్’
ప్రస్తుతం వెండితెర మీద బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. అద్భుత విజయాలు సాధించిన ఎంతో మంది విజయగాథాలు సినిమాలుగా రూపొందుతున్నాయి. అదే ఫార్ములా ఇప్పుడు షార్ట్ ఫిలింస్‌లోనూ కనిపిస్తుంది. తన మేధాశక్తితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చిన్నారి చిరు తేజ్ సింగ్ జీవిత కథ ఆధారంగా తన పేరుతోనే తనే ప్రధాన పాత్రలో ఓ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. N.S NAIK నిర్మాతగా అవార్డ్ విన్నింగ్ లఘు చిత్రాల దర్శకులు డా. ఆనంద్ కుమార్ దర్శకత్వంలో ఈ షార్ట్ ఫిలిం రూపొందింది. ఫ్యాషన్ డిజైనర్ ఫేమ్ మనాలి రాథోడ్, కాటమరాయుడు ఫేమ్ సౌమ్యవేణుగోపాల్ ప్రధానపాత్రల్లో నటించారు. కేవలం 3 నిమిషాల వ్యవధిలో 236 ప్రపంచ పటాలను గుర్తించి, బాల మేధావిగా ఎన్నో పతకాలను, ప్రశంసలను సొంతం చేసుకొని తెలుగు జాతి, మరియు భారతదేశ ప్రతిష్టను పెంచిన చిరుతేజ్ సింగ్ చిత్రం విశ్లేషకులు ప్రశంసలు అందుకుంటోంది. తల్లి కూతురి మధ్య ప్రేమ, టీచర్ స్టూడెంట్ మధ్య వున్న ఆసక్తికరమైన మనసుకు హత్తుకునే సన్నివేశాలతో ఎంతోమంది చిన్నారులకు ప్రేరణ కలిగించేలా ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు దర్శకులు డాక్టర్ ఆనంద్ కుమార్. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా అనాధ పిల్లకోసం అన్నపూర్ణ స్టూడియో ప్రివ్యూ థియేటర్ లో వేయడం జరిగింది. వారితో పాటు ఈ షార్ట్ ఫిలిం చూసిన సమంత యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియచేశారు. నిర్మాత రాజ్ కందుకూరి,దర్శకులు మధుర శ్రీధర్, వీరశంకర్, సాగర్ చంద్ర, సంగీత దర్శకులు రఘు కుంచె, యువ హీరో అభిజిత్, నటి సీత నారాయణ్‌లతో పాటు ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు. -
స్టార్ హీరో డిఫరెంట్ మేకోవర్
కాబిల్ సక్సెస్ తరువాత మరో ఆసక్తికరమైన సినిమాలో నటిస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో నటిస్తున్నాడు హృతిక్. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం సూపర్ 30 పేరుతో స్కూల్ ప్రారంభించిన ఆనంద్ కుమార్ ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు. బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వారణాసి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో హృతిక్ లుక్ కు సంబంధించిన స్టిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. గుబురు గెడ్డంతో డిఫరెంట్ గా కనిపిస్తున్న హృతిక్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సినిమాకు వికాస్ బాహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. -
‘సూపర్’ 30..!
- ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 30 మందికి 30 మంది అర్హత - దేశవ్యాప్తంగా విస్తరిస్తాం: ఆనంద్ కుమార్ పట్నా: ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సూపర్ 30 మరోసారి సత్తా చాటింది. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో బిహార్‌లోని సూపర్ 30లోని మొత్తం 30 మంది విద్యార్థులకుగానూ 30 మంది అర్హత సాధించి చరిత్ర సృష్టించారు. ‘‘ఈ ఏడాది ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 30 మందికి 30 మంది అర్హత సాధించడం సంతోషంగా ఉంది. సూపర్ 30ని విస్తరించేందుకు ఇప్పుడు సమయం వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులను ఎంపిక చేసేందుకు ఇకపై పరీక్షలు నిర్వహిస్తాం. పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తాం’’ అని సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్‌కుమార్ ప్రకటించారు. ఐఐటీ జేఈఈ ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష సూపర్ 30 విజయానికి కారణమని చెప్పారు. ఆనంద్‌కుమార్ సూపర్ 30 సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన 30 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా శిక్షణ అందజేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి ఉచితంగా ఆహారం, వసతి సదుపాయం కల్పిస్తోంది. సూపర్ 30 స్థాపించి ఇప్పటికి 15 ఏళ్లు పూర్తయ్యింది. మొత్తం 450 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తే అందులో 396 మంది విద్యార్థులు ఐఐటీలకు ఎంపికయ్యారు. ఈసారి ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల్లోనూ స్ఫూర్తినిచ్చే గాథలు ఎన్నో ఉన్నాయి. సూపర్ 30లో చదివిన కెవ్లిన్ తండ్రి దీపక్‌కు ఉద్యోగం లేదు. యోగా నేర్పుతుంటాడు. అయినా కుటుంబ పోషణకు తగ్గ ఆదాయం మాత్రం రావడం లేదు. అయితే పేదరికం నుంచి బయటపడాలంటే.. చదువే మార్గమని గుర్తించిన అతడు.. కుమారుడిని ఆ దిశగా ప్రోత్సహించాడు. పదేళ్ల క్రితం తాను సూపర్ 30 గురించి విన్నానని, తన కలను నిజం చేయడానికి తన కుమారుడు ఇక్కడికి రావాలని కోరుకున్నానని, ఇప్పుడు తన కుమారుడు నిజంగానే తన కల నిజం చేశాడంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు దీపక్. తన కల నిజం చేసినందుకు ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇతనిలాగే.. అర్బాజ్ ఆలమ్ కోడిగుడ్ల వ్యాపారి కొడుకు, అభిషేక్.. భూమి లేని నిరుపేద రైతు పుత్రుడు.. అర్జున్ రైతు కూలీ కుమారుడు.. పేదరికాన్ని, ఎన్నో అడ్డంకులను అధిగమించి ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించి.. తమలాంటి ఎందరికో ప్రేరణగా నిలిచారు. అడ్వాన్స్‌డ్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ ఐఐటీల్లో 58 మందికి సీట్లు సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠ శాలల నుంచి 58మంది విద్యార్థులు ప్రతిభ కనబ ర్చారని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వీరిలో సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచి 25 మంది విద్యార్థులు, గిరిజన సంక్షేమ గురుకులాల నుంచి 33 విద్యార్థులు ఉన్నారన్నారు. వీరందరికీ ఐఐటీల్లో సీట్లు దక్కను న్నాయన్నారు. ఎస్టీ కేటగిరీలో దేవేంద్ర నాయక్ ఆలిండియా స్థాయిలో 167 ర్యాంకు, ఎస్సీ కేటగిరీలో ఎం.కార్తీక్ 430 ర్యాంకు సాధించారన్నారు. ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రవీణ్‌కుమార్ ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీఎస్ లాసెట్‌లోనూ గురుకుల విద్యార్థులు సత్తా చాటారన్నారు. -
షరతులతో మాయావతి సోదరుడికి కీలక పదవి
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన సోదరుడు ఆనంద్ కుమార్‌కు పార్టీలో కీలక పదవి కట్టబెట్టారు. బీఎస్పీ ఉపాధ్యక్షుడిగా ఆనంద్ కుమార్‌ను నియమించారు. బీఎస్పీలో మాయావతి తర్వాతి స్థానం ఆయనదే. అయితే ఎప్పటికీ ఎంపీ లేదా ఎమ్మెల్యే కాకూడదని, అలాగే మంత్రి, ముఖ్యమంత్రి పదవులు ఆశించరాదని మాయావతి తన సోదరుడికి షరతు విధించారు. ఆనంద్ కుమార్‌కు చెందిన కార్యాలయాలు, వ్యాపార సంస్థలపై ఇటీవల ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. కాగా ఆయన ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేయలేదు. ఆనంద్ కుమార్ వ్యాపార లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీఎస్పీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి రాగా, ఎస్పీ రెండు, బీఎస్పీ మూడో స్థానానికి పరిమితమయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్ చేశారన్న అంశంపై ఇతర పార్టీలతో కలసి పనిచేసేందుకు తనకు ఎలాంటి పరిమితులు లేవని మాయావతి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలసి పనిచేస్తామని చెప్పారు. ఇటీవల వైద్యపరీక్షలు చేయించుకున్న తర్వాత మాయావతి తొలిసారి పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా టార్గెట్ చేస్తోందని విమర్శించారు. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చక్కెర మిల్లులను అమ్మడం, స్మారక మందిరాలను నిర్మించడంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆమె పైవిధంగా స్పందించారు. -
ఎన్నికల వేళ.. భారీ ఎదురుదెబ్బ!
త్వరలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్న తరుణంలో బహుజన సమాజ్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అధినేత్రి మాయావతి సోదరుడు ఆనందకుమార్‌కు చెందిన రూ. 1300 కోట్ల ఆస్తులపై ఆదాయపన్ను శాఖ కన్ను పడింది. ఈ విషయాన్ని జాతీయ మీడియా ప్రముఖంగా చెబుతోంది. ఏడేళ్ల కాలంలో ఆనందకుమార్ సంపద రూ. 7.1 కోట్ల నుంచి రూ. 1300 కోట్లకు పెరిగినట్లు చెబుతున్నారు. అంటే ఏకంగా 18000 శాతం పెరుగుదల అన్నమాట. ఆయన 12 కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు. 2007 నుంచి 2014 సంవత్సరాల మధ్య ఒక్కసారిగా ఆయన సంపద వేల రెట్లు పెరిగిపోయింది. ఫ్యాక్టర్ టెక్నాలజీస్, హోటల్ లైబ్రరీ, సాచి ప్రాపర్టీస్, దియా రియల్టర్స్, ఇషా ప్రాపర్టీస్ అనే ఐదు కంపెనీలను ఐటీ శాఖ ప్రముఖంగా పేర్కొంది. ఈ ఐదు కంపెనీల ఆస్తులు గణనీయంగా పెరిగినట్లు చెబుతున్నారు. సరిగ్గా 2007 నుంచి 2012 వరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాయావతి పనిచేశారు. ఈ సమయంలోనే ఆయన సంపద భారీగా పెరిగినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఆనందకుమార్ కంపెనీలలోకి పెట్టుబడులు వచ్చిన తీరు మీద కూడా ఆదాయపన్ను శాఖ గట్టిగానే నిఘా వేసింది. షెల్ కంపెనీలు, స్వీట్హార్ట్ ఒప్పందాల ద్వారానే ఆయనకు పెట్టుబడులు వెల్లువెత్తాయని అధికారులు అంటున్నారు. బహుశా ఇదంతా కూడా రాజకీయ మనీ లాండరింగ్‌కు సంబంధించిన మొత్తం అయి ఉంటుందన్న కోణంలో ఆదాయపన్ను శాఖ దర్యాప్తు కొనసాగుతోంది. కంపెనీ 2007 2014 ఫ్యాక్టర్ టెక్నాలజీస్ 0.56 కోట్లు 55.8 కోట్లు హోటల్ లైబ్రరీ 0.93 కోట్లు 214.4 కోట్లు సాచి ప్రాపర్టీస్ 2.92 కోట్లు 104.34 కోట్లు దియా రియల్టర్స్ 0.21 కోట్లు 95.25 కోట్లు ఇషా ప్రాపర్టీస్ 2.75 కోట్లు 66.68 కోట్లు -
'సూపర్-30'కి సూపర్ అవకాశం!
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ పరీక్షలకు శిక్షణనిస్తూ దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన సూపర్-30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ ను ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫాం 'ఎడ్ఎక్స్' గణితశాస్త్రం బోధించాలని ఆహ్వానించింది. ఈ వెబ్ సైట్ ను మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీలు ప్రమోట్ చేస్తున్నాయి. ఈ మేరకు ఎమ్ఐటీ ప్రొఫెసర్ అనంత అగర్వాల్.. ఆనంద్ కు లేఖ రాశారు. 'ఎడ్ఎక్స్' కొన్ని కోర్సులను ఉచితంగా అందిస్తోందని, ఎడ్ఎక్స్, సూపర్-30 కలిసి పనిచేయడం వల్ల ప్రపంచంలో ఎక్కువమంది విద్యార్థులు లాభపడతారని ఆయన లేఖలో చెప్పారు. లేఖపై స్పందించిన ఆనంద్ కుమార్ ఎమ్ఐటీ, హార్వర్డ్ లాంటి విద్యాసంస్థలు సూపర్-30ని తమతో కలుపుకుపోవాలని అనుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎడ్ఎక్స్ లాంటి సంస్థలు పేదల కోసం విద్యను అందిస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. కచ్చితంగా ఎడ్ఎక్స్ తో కలిసి నడుస్తానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఏ మేరకు సాయం చేయగలనో ముందు ముందు చూడాలని అన్నారు. ఆనంద్ కుమార్ కు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో సీటు దొరికినా ఆర్ధిక కారణాల వల్ల అక్కడకు వెళ్లలేకపోయారు. 2002లో సూపర్-30ని ప్రారంభించిన ఆనంద్ ఐఐటీలో చేరేందుకు ఆసక్తి కలిగిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్న విషయం తెలిసిందే. -
బాగ్‌అంబర్‌పేటలో సూట్‌కేసు కలకలం
గుర్తు తెలియని వ్యక్తులు పుట్‌పాత్‌పై వదిలేసిన సూట్‌కేసు కలకలం సృష్టించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూట్‌కేసు పుట్‌పాత్‌పై ఉండడంతో స్థానికులు అందోళనకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఏపీ ఆనంద్‌కుమార్ కథనం ప్రకారం...బాగ్‌అంబర్‌పేట అయ్యప్ప ఆలయం సమీపంలో పుట్‌పాత్‌పై ఓ సూట్‌కేసు పడి ఉంది. దానిని ఎంతసేపటికి ఎవరూ తీసుకోకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇన్స్పెక్టర్ ఆనంద్‌కుమార్ బాంబ్‌స్క్వాడ్ బృందానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాల వాసులను అప్రమత్తం చేసి చాకచక్యంగా సూట్‌కేసును తెరిచారు. అందులో ఏమీ లేకపోవడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. ఈ సూట్‌కేసును చెత్త సేకరించే వారు ఇక్కడ వేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. -
ఒక వర్షపు రాత్రి
పట్టుకోండి చూద్దాం అజాతశత్రువు అనే మాట వినడమేగానీ చూడని వాళ్లు ఆనంద్ కుమార్‌ను ఒక్కసారి చూస్తే సరిపోతుంది. అరవై అయిదు సంవత్సరాల ఆనంద్‌కుమార్ బ్రహ్మచారి. ‘‘ఎందుకు పెళ్లి చేసుకోలేదు?’’ అని అడిగితే- ‘‘బాగా డబ్బు గడించాలనే ఆశతో ఏవోవో వ్యాపారాలు చేశాను. కోట్లు గడించాను. డబ్బు గురించి తప్ప వేరే ఆలోచనేదీ లేకుండా జీవించాను. పెళ్లి చేసుకోవాలనే విషయమే మరిచిపోయాను. ఇప్పుడు నా దగ్గర డబ్బుంది. కానీ మనశ్శాంతి లేదు’’ అంటాడు సిగెరెట్ వెలిగిస్తూ ఆనంద్ కుమార్. ఆనంద్‌కు తన అక్కయ్య కొడుకు, చెల్లి కొడుకు, తమ్ముడి కొడుకు అంటే చాలా ఇష్టం. జూబ్లీహిల్స్‌లో ఖరీదైన బంగ్లాలో ఒంటరిగా నివసించే ఆనంద్ ప్రతి వేసవిలో పిల్లల్ని తన ఇంటికి పిలిపించుకొని నెలరోజులు సరదాగా గడుపుతాడు. ఈసారి కూడా అదే జరిగింది. కాకినాడ నుంచి తన అక్కయ్య అన్నపూర్ణ కొడుకు అంకిత్ వచ్చాడు. పెద్దగా ఎవరితోనూ కలిసిపోడు. ఒంటరిగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతాడు. అయితే సన్నిహితులతో మాత్రం బాగా కలిసిపోతాడు. అనంతపురం నుంచి తమ్ముడు అనంత్ కుమారుడు హరీశ్ వచ్చాడు. హరీశ్ ఎక్కడ ఉంటే అక్కడ సందడే. కబుర్ల పుట్ట! వైజాగ్ నుంచి చెల్లి రజని కుమారుడు తరుణ్ వచ్చాడు. తరుణ్ విపరీతంగా నవలలు చదువుతాడు. తాను చదివిన వాటిని ఇతరులతో చెప్పుకొని తెగ ఆనందిస్తుంటాడు. ‘‘మామయ్యా... ఈ రూమ్‌కు నో స్మోకింగ్ రూమ్ అని బోర్డ్ తగిలించావేమిటి?’’ అని అంకిత్ అడిగాడు. ‘‘నా వరకు ఇది పవిత్రమైన రూమ్. ఇక్కడ నేను రోజూ ధ్యానం చేస్తాను. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతాను. కొన్నిసార్లు మౌనంగా కూర్చుంటాను’’ అన్నాడు ఆనంద్ కుమార్. ఆరాత్రి... ఉన్నట్టుండి వర్షం మొదలైంది. వాతావరణం చల్లగా ఉంది. ఆ చల్లని రాత్రి అంకిత్, తరుణ్, హరీశ్‌లతో కబుర్లు చెబుతున్నాడు ఆనంద్ కుమార్. ఆ కబుర్ల మధ్యలోనే ఒకసారి ఆనంద్ స్వరం కాస్త గరంగా మారింది. ‘‘జీవితాన్ని ఎంజాయ్ చేయడం ముఖ్యమే కానీ అదే జీవితం కాకూడదు. మీలో ఎవరూ చదువులపై, కెరీర్‌పై శ్రద్ధ పెట్టడం లేదని అర్థమవుతుంది. ఇది మంచిది కాదు...’’ ఇలా చాలాసేపే మాట్లాడాడు ఆనంద్ కుమార్. ఆయన మాటలకు కోపం తెచ్చుకున్న వాళ్లు ఉన్నారు. ‘‘పెద్దాయన చెప్పింది నిజమే కదా’’ అనుకున్నవాళ్లు ఉన్నారు. మరుసటి రోజు పని మనిషి సుందరం ఆనంద్‌కుమార్ ఇంట్లోకి వచ్చాడు. కాఫీ చేసి ఆయనకు అందించడానికి బెడ్రూమ్లోకి వెళ్లాడు. అంతే... ఆనంద్ కుమార్ శవం కనిపించింది. ‘హత్య...’ గట్టిగా అరిచాడు సుందరం. ఇంతకీ ఆనంద్‌కుమార్‌ని ఎవరు హత్య చేశారు? ఆ ముగ్గురా?(అంకిత్, తరుణ్, హరీశ్), ఆ ముగ్గురిలో ఒకరా? దొంగలా? సుందరమా? ఎన్నో జటిలమైన కేసులను చేధించిన నరసింహ ఈ కేసులో కూడా హంతకుడెవరో సులభంగానే కనిపెట్టాడు. క్లూ: టాయిలెట్రూమ్, ఆర్ట్రూమ్, రెస్ట్రూమ్, అండర్ వాటర్ రూమ్, నో స్మోకింగ్ రూమ్‌లో హంతకుడు ఒక్కొక్క వస్తువును వదిలివెళ్లాడు. జవాబు: హంతకుడి పేరు తరుణ్. తరుణ్‌కు క్రైమ్ నవలలు చదవడం అంటే విపరీతమైన ఇష్టం. ఆ కథల్లోనే జీవిస్తుంటాడు. తరుణ్ ముక్కోపి. ఆ రాత్రి తనను ఆనంద్‌కుమార్ మందలించడం నచ్చలేదు. ఆ కోపంతో ఆనంద్‌కుమార్‌ని హత్య చేశాడు. క్రెమ్నవలలు చదివిన ప్రభావంతో తన పేరులోని అక్షరాలు వచ్చేలా ఒక్కో గదిలో ఆనంద్కుమార్కి సంబంధించిన వస్తువును పెట్టాడు. ఈ విపరీత బుద్దే అతడిని పట్టించింది. టాయిలెట్ రూమ్(T), ఆర్ట్ రూమ్ (A), రెస్ట్ రూమ్(R), అండర్ వాటర్ రూమ్(U), నో స్మోకింగ్ రూమ్(N) -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్య
కేకే.నగర్ : పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టు చేయించాడన్న కోపంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను హత్య చేసి పరారీలో ఉన్న హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరునెల్వేలి జిల్లా కరివందనల్లూర్ సమీపంలో సెందట్టియార్ సౌత్ వీధికి చెందిన కామాక్షి కుమారుడు ఆనందకుమార్(32) చెన్నైలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య రాధిక(28). వీరికి ఆరు నెలల పసిబిడ్డ ఉంది. చెన్నై నుంచి ఆనందకుమార్ భార్య, బిడ్డను చూడడానికి సొంత ఊరుకు వచ్చారు. మంగళవారం ఉదయం గరిసల కులం సెందట్టియాపురం రోడ్డుపై ఆనందకుమార్ మృతదేహం పడి ఉంది. సమాచారం అందుకున్న గరివలం వందనల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శంకరన్ కోవిల్ ప్రభుత్వాసుపత్రికి పంపారు. పోలీసుల విచారణలో తగాదాల కారణంగా హత్య జరిగిందని తెలిసింది. ఆనందకుమార్ తండ్రికి, అతని తమ్ముడు ముత్తువాళి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని రోజుల క్రితం ముత్తువాళి కుమారుడు సెల్వరాజ్(33) ఆనంద్‌కుమార్‌పై దాడి చేశాడు. శివగిరి పోలీసులు సెల్వరాజ్‌ను అరెస్టు చేశారు. అతడు నిబంధన బెయిల్‌పై వెలుపలికి వచ్చాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడన్న కోపంతో ఆనంద్‌కుమార్‌ను హత్య చేశాడని తెలిసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారిలో ఉన్న సెల్వరాజ్ కోసం గాలిస్తున్నారు. -
సూపర్30 విజయగాథపై పుస్తకం
భోపాల్ : బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఐఐటీయన్లుగా తీర్చిదిద్దుతున్న పట్నాలోని ‘సూపర్30’ ఇన్స్టిట్యూట్ విజయగాథ త్వరలో పుస్తకరూపం దాల్చనుంది. గణితవేత్త ఆనంద్‌కుమార్ స్థాపించిన ఈ సంస్థ గురించి కెనడాకు చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ బిజు మాథ్యూ ఓ పుస్తకం రాయనున్నారు. గ్లోబల్ మెయిల్ న్యూస్పేపర్లో ప్రచురితమైన ఆర్టికల్ ద్వారా సూపర్30 సంస్థ గురించి తెలుసుకున్నానని సైకియాట్రిస్ట్ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన మాథ్యూ తెలిపారు. ఆనంద్‌కుమార్ సంకల్పాన్ని చూసిన తర్వాత సూపర్30పై ’రామానుజన్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్’ పేరుతో ఓ పుస్తకాన్ని రాయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. -
అవకాశాల్లేక కుంగిపోతున్నారు!
పారిస్: అవకాశాల లేమితో కుంగిపోతున్న అట్టడుగు వర్గాల విద్యార్థుల జీవితాలను మార్చేసే శక్తి విద్యకు ఉందని 'సూపర్30' వ్యవస్థాపకులు ఆనంద్‌కుమార్ అన్నారు. గతేడాది ఐఐటీ జేఈఈలో ఉత్తీర్ణత సాధించిన ఆటోరిక్షా డ్రైవర్ కూతురు, సూపర్30 విద్యార్థిని 'నిధి ఝా' విజయగాథ ఆధారంగా ఫ్రెంచి భాషలో తెర కెక్కించిన 'ది బిగ్ డే' చిత్రాన్ని ప్రముఖ ఫ్రెంచి బిజినెస్ స్కూల్ 'ఎసెక్ స్కూల్' లో ప్రదర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. అవకాశాల లేకపోవడం వల్లే అట్టడుగు వర్గాల విద్యార్థులు కుంగుబాటుకు గురవుతున్నారన్నారు. ఇతర విద్యార్థులతో సమానంగా వారికి సామర్థ్యాలు ఉన్నాయని, ఒక్క చిన్న అవకాశం వారి జీవితాలను మార్చేయగలదని తన 30 ఏళ్ల అనుభవంలో ఎన్నో ఉదాహరణలు చూశానని చెప్పారు. నిధి ఝా జీవితం ఆధారంగా ఫ్రెంచి దర్శకుడు పాస్కల్ ప్లిసన్ ది బిగ్ డే చిత్రాన్ని తెరకెక్కించారు. నిధి ఝా ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైన్స్‌లో విద్యనభ్యసిస్తోంది. -
ఆనంద్‌కుమార్‌కు అవమానం
నిజాం కళాశాలలో జూనియర్, సీనియర్ల మధ్య చలరేగిన వివాదంతో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన ఆనంద్‌కుమార్ కు అవమానం జరిగింది. నిజాం కాలేజీలో బీఏ చదువుతున్న ఆనంద్ కుమార్‌ను మంగళవారం లైబ్రరీ వద్ద ఫైనల్ ఇయర్ విద్యార్థులు భరత్, మోహన్ బయోడేటా చెప్పాలని అవమానించారు. దీంతో అతను వారిపై తిరగబడడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో మనస్థాపానికి లోనైన ఆనంద్‌కుమార్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టీఎల్ఎన్ స్వామికి ఫిర్యాదు చేశారు. దీం తో బుధవారం ఆయన భరత్, మోహన్‌లను పిలిపించి మందలించారు. దీనిపై సమాచారం అందడంతో అబిడ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కళాశాలకు వెళ్లి వివరాలు సేకరించడమేగాక, ఆనంద్‌కుమార్‌తో పాటు మోహన్, భరత్‌లను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. -
సూపర్ 30పై విదేశీ సినిమా
పాట్నా: సూపర్-30 ఈ పేరు మీరు వినే వింటారుగా.. ఈ మధ్యకాలంలో చాలాసార్లు విశిష్ఠ స్థానంతో వార్తల్లోకి వచ్చిన పేరిది. బీహార్‌లో ఆనంద్ కుమార్ నిర్వహిస్తున్న ఐఐటీ-జేఈఈ కోచింగ్ ఇన్స్టిట్యూటే సూపర్-30. నిరుపేదలైన విద్యార్థులకు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా కోచింగ్నిచ్చి ఖరగ్‌పూర్ వంటి దేశంలోనే ప్రముఖ ఐఐటీలకు పేదరికంలో ఉన్న మేధావులను తరలించే సంస్థ. ఈ సంస్థ నిర్వహిస్తున్న గొప్పపనులకు ముగ్దుడైపోయి.. పాస్కల్ ప్లిస్సన్ అనే ఓ ప్రెంచి డైరెక్టర్ ఏకంగా 'ది బిగ్ డే' అనే చిత్రం తీశాడు. మొత్తం 90 నిమిషాలతో దీనిని రూపొందించాడు. ఇప్పటికే ఈ చిత్రం తాలుకు ఫొటోలు, వీడియో క్లిప్పులు పలు టీవీల్లో, యూట్యూబ్‌లో కూడా కనువిందుచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ చిత్రంలో ప్రపంచంలోని నాలుగు ప్రత్యేక కథలు ఇమిడి ఉన్నాయి. ఇందులో ఒక కథ సూపర్ 30లో కోచింగ్ తీసుకొని ప్రస్తుతం ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో విద్యనభ్యసిస్తున్న నిధిజా అనే అమ్మాయిది. ఆమె 2014లో జేఈఈ సాధించింది. ఇప్పుడు నిదిజాను, సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్‌కుమార్‌ను, ఆమె తల్లిదండ్రులను ఫ్రాన్స్‌లో జరిగే చిత్రానికి సంబంధించిన ఓ కార్యక్రమానికి హాజరుకావల్సిందిగా డైరెక్టర్ పాస్కల్ ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని బీహార్‌లో షూటింగ్ చేస్తుంటే గతంలో చూశానని, ఇప్పుడు విడుదల కానుండటంతో ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. నిధి చాలా కష్టపడి పైకొచ్చిన అమ్మాయి అని, అలాంటి అమ్మాయి కథ కూడా ఇందులో ఉండటం గర్వించదగిన విషయమని తెలిపారు. కష్టాలు, కన్నీళ్ల మధ్య ఉన్న నలుగురు చిన్నారులు స్వయం కృషితో ఎలా విజయం సాధించారనేదే 'ది బిగ్ డే' అని తెలిపారు. -
ఆనంద్ కుటుంబాన్ని ఆదుకుంటాం
-
ఆనంద్ కుమార్ కుటుంబాన్ని ఆదుకుంటాం
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఏడీబీ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోరంగి ఎస్ఐ ఆనంద్ కుమార్ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మృతుని కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా మంగళవారం రాత్రి ఆనంద్ కుమార్ డ్యూటీ ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా... వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్ఐ ఆనంద్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆనంద్ కుమార్.... తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేపు మండలం కోరంగిలో ఎస్ఐగా పని చేస్తున్నారు. ఆయనకు తొమ్మిదేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఎస్ఐ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
డియర్ ఆనంద్ సర్.. జీవితాంతం రుణపడి ఉంటా
రాంచీ: ద్రోహం చేసినవారిని మరిచిపోయినా ఫర్వాలేదుగానీ.. సాయం చేసిన వారిని మాత్రం ఎప్పటికీ మరువకూడదు. ఎందుకంటే వారే మన భవిష్యత్తు బాటలో మరో రాయిని మన జీవిత సౌదానికి అందించిన ఘనులు. వారిపట్ల కృతజ్ఞతా భావంతో ఉండటం దైవలక్షణం. మనం గొప్ప వాళ్లయిన తర్వాత సాయం చేసిన వారికి ఓసారి కృతజ్ఞత భావాన్ని తెలియజేయడం వల్ల దానిని పొందిన వ్యక్తి ఎంత అద్భుతంగా భావిస్తాడో ఊహిస్తేనే అమితానందం. అయితే, ఇలాంటి కృతజ్ఞతలు పొందేవారు ఈ రోజుల్లో అరుదయ్యారు.. అలా చెప్పేవారు కూడా కరువయ్యారు. కానీ జార్ఖండ్‌కు చెందిన ఓ పేద విద్యార్థి మాత్రం తాను పొందిన సాయాన్ని మరిచిపోలేదు. ఆ సాయం చేసిన వ్యక్తిని లేఖ ద్వారా అలుముకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనీ అనుకుంటున్నారా.. బీహార్‌లో ఐఐటీకి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే అత్యున్నత సంస్థ సూపర్ 30 ఇన్స్టిట్యూట్ యజమాని ఆనంద్ కుమార్. సాయం పొందిన బాలుడు రాహుల్ కుమార్(19). ఒకసారి అతడి లేఖను పరిశీలిస్తే.. డియర్ ఆనంద్ సర్, ధన్యవాదాలు. నా జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిన అందుకు కారణం మీరే. జార్ఖండ్ రాష్ట్రంలోని హజరీబాగ్ జిల్లాలో మా నాన్న ఓ మాములు రైతు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జీవిస్తున్నాం. అక్కడ ఫోన్లు, నెట్ వర్క్‌లు ఏమీ ఉండవు. ఎలాంటి సౌకర్యాలు ఉండవు. నాకు వివాహం అయిన ఓ సోదరి, పాఠశాలలో చదువుతున్న ఇద్దరు సోదరులు ఉన్నారు. మా నాన్న సంవత్సరంలో ఐదు నెలలు మాకున్న కొద్దిపాటి భూమిలో సాగు చేస్తారు. అది కూడా వాతావరణం సహకరిస్తేనే. మిగతా రోజుల్లో కోల్ కతా వెళ్లి భవన నిర్మాణ కూలీగా పనులు చేస్తారు. నేను ఒక్కోసారి ఒకపూట భోజనంతోనే సరిపెట్టుకునే ఇంట్లో పెరిగాను. ఎనిమిదో తరగతిలో ఉండగా నవోదయ పాఠశాలకు ఎంపికయ్యాను. ఆ సమయంలో నేను మా సీనియర్ భరత్ యాదవ్‌ను గమనించాను. అతడికి ఉన్న అంకితభావం నన్ను అమితంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయనొక ఐఐటీయన్. నేను కూడా మా సీనియర్ అంతటి వాడిని కావాలని మనసులో ప్రతిరోజూ స్మరించుకుంటుంటాను. పాఠశాల తర్వాత మీ సూపర్-30 ఇన్ స్టిట్యూట్ గురించి విని ఎంతో క్లిష్టమైన ఎంపిక విధానాన్ని దాటుకొని ప్రవేశం పొందాను. ఆనంద్ సర్ మీరే నాకు జీవితంలో అతిపెద్ద స్ఫూర్తి. పెద్దపెద్ద కుటుంబాల మాదిరిగా మా కుటుంబం లక్షల్లో ఫీజులు చెల్లించలేదు. ఈ విషయం గుర్తించిన మీరు నాకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, నా ఖర్చులు భరించి, పోషణ భారాన్ని మోసి ఐఐటీలో ప్రవేశం పొందేందుకు కావాల్సిన నమ్మకాన్ని ధైర్యాన్నిచ్చారు. నేను ఖరగ్‌పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదవాలనుకుంటున్నాను. గొప్ప పారిశ్రామికవేత్త కావాలనేది నా లక్ష్యం. అది కూడా ఇండియాలోనే. భారత్‌లో ఈ రంగంలో సేవలు అందించే అవకాశాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. విదేశాల్లోకి ఎగిరిపోయి అక్కడే ఉండిపోవాలనుకుంటున్నవారిలో నేను ఎప్పటికీ ఉండను. మా అమ్మనాన్నలు ముసలితనంలో ఎలాంటి పనులు చేయలేనందున వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మా గ్రామంలో ఆస్పత్రి కట్టించాలనేది నా ధ్యేయం. ఐఐటీ ప్రవేశ పరీక్షలో విజయం సాధించిన నన్ను చూసి మా వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. మా అమ్మయితే భావోద్వేగాన్ని ఆపుకోలేక ఆనంద భాష్పాలు రాల్చింది. నాన్న కూడా అంతే. దీనంతటికీ కారణం మీ చలవే. ఐఐటీకి సరిపోయేంత క్వాలిటీ విద్యనందించే పాఠశాలలు మన దేశంలో ఉంటే అంతకంటే మంచి సందర్భం మరొకటి ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో డబ్బులు పెట్టి నాలాంటి వారు చదవలేరు కదా! నాలాంటి వారు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. నేను మాత్రం చాలా అదృష్టవంతుడిని. మీరు నాజీవితంలో ఉండటం మిగతా అన్నింటి కంటే కూడా గొప్ప విషయం... అదృష్టం.. మీకు జీవితాంత రుణపడి ఉంటాను. మీకోసం ఏమైనా చేస్తాను. చూశారుగా ఎంత పరిపక్వతతో రాహుల్ కుమార్ ఈ లేఖ రాశాడో.. ఇలా ఒక్క రాహులే కాదు.. ఎంతో మంది పేద విద్యార్థులకు ఆనంద్ కుమార్ సేవలు అందిస్తున్నారు. -
గివింగ్ ఆటిట్యూడ్ ఉంటేనే సార్థకత
గెస్ట్ కాలమ్ ఆనంద్ కుమార్.. దేశంలో ఈ పేరుగల వ్యక్తులు ఎందరో. కానీ సూపర్-30 ఆనంద్ కుమార్ అంటే.. మాత్రం మ్యాథమెటీషియన్గా దేశవ్యాప్తంగా సుపరిచితం. ఒకప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం వచ్చినా.. ఆర్థిక ఇబ్బందులతో అందుకోలేకపోయిన ఆనంద్ కుమార్‌కు ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ తదితర ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు గెస్ట్ లెక్చర్స్ ఇవ్వాలంటూ ఆహ్వానం పంపాయి. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, పేరు ప్రఖ్యాతులు ఆయన సొంతమయ్యాయి. కారణం.. ఆనంద్ కుమార్ నెలకొల్పిన సూపర్-30. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు ప్రతి ఏటా 30 మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బీహార్‌లోని పాట్నాలో సూపర్-30ను ప్రారంభించారు. తద్వారా ఎంతో మంది నిరుపేద విద్యార్థుల ఐఐటీ కలల్ని నిజం చేశారు ఆనంద్ కుమార్. 2002లో ప్రారంభించిన ఈ సూపర్ 30 ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటి వరకు 308 మంది ఐఐటీల్లో అడుగుపెట్టారు. ఇదే.. ఆనంద్ కుమార్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని అందించింది. గ్రాడ్యుయేషన్ దశలోనే నంబర్ థియరీపై పేపర్ ప్రచురించిన ఆనంద్ కుమార్‌తో నేటి విద్యా వ్యవస్థ.. ఐఐటీల్లో ప్రవేశాలపై ఇంటర్వ్యూ.. అమలులోనే అసలు సమస్య మన దేశంలో ప్రస్తుత విద్యా వ్యవస్థలో చిన్నపాటి లోపాలున్నప్పటికీ.. నేటితరం ప్రపంచస్థాయిలో పోటీపడే రీతిలోనే ఉంది. కానీ అసలు సమస్య అంతా రూపొందిస్తున్న విధానాలను అమలు చేస్తున్న తీరులోనే ఉంటోంది. ఎలాంటి తారతమ్యాలు లేనటువంటి విద్యా వ్యవస్థను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ముఖ్యంగా ప్రైమరీ, సెకండరీ విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలి. విద్యార్థుల జీవితా నికి పునాదులు పడే దశలు ఇవే. దీన్ని గుర్తించాలి. అన్ని స్థాయిల్లో ఉపాధ్యాయుల కొరత మనం ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య ఉపా ధ్యాయుల కొరత. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాథమిక, మాధ్యమిక విద్య దశలు పునాదులైతే.. మొత్తం విద్యా వ్యవస్థ అభివృద్ధికి నిర్దేశకులు ఉపాధ్యాయులు. నేడు ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, నిపుణులు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరైనా సరే.. వారు ఆ స్థాయికి చేరుకోవడానికి కారణం వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులే. కానీ దురదృష్టవశాత్తూ మనం అన్ని స్థాయిల్లో ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్నాం. కారణం.. ప్రతిభావంతులు ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆసక్తి చూపకపోవడం. ఇందుకు మరో రెండు కారణాలు ఉన్నాయి.. అవి.. ఆకర్షణీయమైన కెరీర్ కాదు అనే ఆలోచన, ఉపాధ్యాయు లకు గతంలో మాదిరిగా గౌరవం లభించట్లేదనే భావన. కాబట్టి ముందుగా యువత మైండ్‌సెట్‌ను మార్చాలి. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైందనే భావన కల్పించాలి. ప్రభుత్వాలు ఈ విషయంలో దృష్టి సారించాలి. ఉపాధ్యాయ వృత్తిలో నైపుణ్యా లు ప్రదర్శించిన వారికి తగిన గుర్తింపు ఇవ్వాలి. తద్వారా ప్రతి భావంతులు ఈ వృత్తిలో అడుగు పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఐఐటీల్లో ప్రస్తుత ప్రవేశ విధానం సరైందే గత పన్నెండేళ్లుగా ఐఐటీ ఎంట్రెన్స్ కోచింగ్ ఇస్తున్నా. నా అభిప్రాయం మేరకు ప్రస్తుతం ఐఐటీల్లో ప్రవేశానికి అనుసరిస్తు న్న విధానం సరైందనే నేను భావిస్తున్నాను. సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను మాత్రమే పరీక్షించే విధంగా ఎంట్రెన్స్ ఉంటుందనే పలువురు విద్యావేత్తల అభిప్రాయాలను తోసిపుచ్చలేం. కానీ ఇంజనీరింగ్ అనేది ఒక ప్రత్యేకమైన రంగం. విద్యార్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే రాణించగలరు. అయితే ఇక్కడ మనం గుర్తించా ల్సింది.. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తున్న ఐఐటీలు ఆ తర్వాత కోర్సు క్రమంలో.. విద్యార్థుల ఆల్‌రౌండ్ డెవలప్మెంట్కు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. కోర్ సబ్జెక్ట్‌లతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిలో శిక్షణ నిస్తున్నాయి. అంతేకాకుండా తొలి ఏడాది అంతా అన్ని బ్రాంచ్ లకు ఒకే విధమైన సిలబస్‌ను అమలు చేస్తున్నాయి. రెండు పరీక్షల వల్ల కొంత ఇబ్బందే మూడేళ్లుగా ఐఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశానికి జేఈఈ-మెయిన్స్, అడ్వాన్స్డ్ పేరిట రెండు పరీక్ష లు నిర్వహిస్తున్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. దీనివల్ల కొంత ఇబ్బందే. కొందరు అభ్యర్థులు తమ వాస్త వ టాలెంట్ గురించి ఆలోచించకుండా ఐఐటీని ఏకైక లక్ష్యంగా మార్చుకుని నిరాశ చెందుతున్నారు. కొందరు ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ మెయిన్ స్థాయిలోనే అవకాశం కోల్పోతున్నారు. రీసెర్చ్ కార్యకలాపాలు పెరగాలి ఐఐటీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందనడంలో సందేహం లేదు. కానీ అదే సమయంలో అంతర్జాతీయ స్థాయి ఇన్స్టిట్యూ ట్లతో దీటుగా పోటీపడాలంటే రీసెర్చ్ కార్యకలాపాలు పెరగా లి. నేటి పోటీ ప్రపంచంలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొం ది. మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందిన అభ్యర్థి సాఫ్ట్వేర్ ఉద్యోగంతో కెరీర్‌కు ఫుల్స్టాప్ పెడుతున్నాడు. దీన్ని ఐఐటీలు సీరియస్‌గా పరిగణించాలి. ఎన్నో లక్షల పోటీ నుంచి వేలమంది ని మాత్రమే ఎంపిక చేసే ఐఐటీలు.. ఆయా అభ్యర్థులు తమ బ్రాంచ్‌లకు సరితూగే ఉన్నత విద్యను లేదా కెరీర్‌ను ఎంచుకునే లా తోడ్పాటును అందించాలి. అందుకోసం సంబంధిత రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ వారికి భాగస్వామ్యం కల్పించాలి. ప్రస్తుత కార్పొరేట్ యుగంలో క్యాంపస్ ప్యాకేజ్‌లు అనే సిండ్రోమ్ నుంచి బయటపడి.. ఆర్ అండ్ డీ దిశగా విద్యార్థులను నడిపించాలి. ఆ బాధ్యత ఐఐటీలదే! ఇంజనీరింగ్‌తోపాటు ఎన్నో రంగాల్లో అవసరం నేడు విద్యార్థుల్లో అధిక శాతం ఇంజనీరింగ్వైపు దృష్టి సారిస్తున్నారు. ఇదే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. కానీ అసలైన ఇంజనీర్లుగా రాణించలేకపోతున్నారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయానికి కృషి చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి మారాలి. తాము కోర్సులో చేరిన ఉద్దేశం నెరవేరేలా భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇప్పుడు ఇంజనీరింగ్‌తోపాటు ఎన్నో రంగాలు కొత్త, కొత్త అవకాశాలతో ముందుకొస్తున్నాయి. మ్యాథ్స్, ప్యూర్సైన్స్లను ప్రోత్సహించాలి ప్రస్తుత పరిస్థితుల్లో నెలకొన్న ఇంజనీరింగ్ క్రేజ్ కారణంగా.. ప్యూర్‌సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లపై ఆసక్తి తగ్గుతోంది.ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో మనకు టీచర్లు దొరకరు. వాస్తవానికి ఎన్నో మోడ్రన్ బ్రాంచ్‌లన్నీ ప్యూర్ సైన్స్ ఆధారితంగా ఆవిష్కృతమైనవే. విద్యార్థులు దీన్ని గుర్తించాలి. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాలి. ఇటీవల కాలంలో రీసెర్చ్ స్కాలర్స్‌కు ప్రభుత్వం పెంచిన ఆర్థిక ప్రోత్సాహకాలు కొంత మేర సత్ఫలితాలు అందించే అవకాశం ఉంది. ఆలోచించి.. అభిరుచి మేరకు యువతకు కెరీర్ పరంగా ఇచ్చే సలహా.. స్వీయ ఆలోచన, ఆప్టిట్యూడ్ ఆధారంగా కెరీర్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఈ క్రమంలో ప్రతి విద్యార్థి తన బలాలు, బలహీనతలను బేరీజు వేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక కోర్సును ఎంపిక చేసుకునేముందు.. భవిష్యత్తులో ఆ రంగం ద్వారా సమాజాని కి, జాతికి ఎలాంటి సేవ చేసే అవకాశం లభిస్తుంది? అనే సామాజిక దృక్పథం ఉండాలి. ఆప్టిట్యూడ్‌తోపాటు ‘గివింగ్’ ఆటిట్యూడ్ ఉంటేనే సార్థకత!! -
మీ సేవా కేంద్రాల్లోనూ రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ
పాలకొండ: తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియను సరళతరం చేసే క్రమంలో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్వో) సిహెచ్.ఆనంద్‌కుమార్ చెప్పారు. మంగళవారం ఆయన పాలకొండ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి స్థానిక అధికారులతో సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామన్నారు. జిల్లాలో ఆధార్ నమోదు 80 శాతం పూర్తయిందని, ఈ నెల 15లోగా శతశాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాజాం జీఎంఆర్ కళాశాలలో ఫీడింగ్ ప్రక్రియ శరవేగంతో కొనసాగుతోందన్నారు. వంగర, పొందూరు మండలాల్లో ఆధార్ నమోదు ప్రక్రియ వేగవంతం చేసేందుకు అధికారులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. అంతకుముందు ఆయన పాలకొండ మండలంలో తూకాల్లో తేడావస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆరా తీశారు. తహశీల్దార్ కె.రామకృష్ణ, సీఎస్ డీటీ సరోజిని నుంచి వివరాలు సేకరించారు. తూకంలో తేడాలేకుండా తరచూ తనిఖీలు చేయాలన్నారు. -
ఆరేళ్ల తర్వాత వెలుగు చూసిన హత్యోదంతం
దొడ్డబళ్లాపురం : ఐదేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసుకు సంబంధించి నిందితులను విచారణ జరుపుతుండగా ఆరేళ్ల క్రితం జరిగిన మరో హత్యోదంతం వెలుగు చూసింది. దీంతో పోలీసులు సదరు మృతదేహాన్ని వెలికితీయించి దర్యాప్తు చేపట్టారు. వివరాలు మారళ్లికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. తాలూకాలోని నారసింగనహళ్లి సమీపంలోని అడవిలో కాలువ ఒడ్డున పూడ్చి పెట్టిన మృతదేహాన్ని గత నెల మే 30న డీవైఎస్పీ కోనప్పరెడ్డి, హసీల్దార్ సిద్ధలింగయ్యల సమక్షంలో గ్రామీణ పోలీసులు వెలికి తీశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నారాయణ స్వామి,రామాంజి అనే వ్యక్తులను విచారిస్తుండగా చంద్రశేఖర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణప్ప..ఆరేళ్ల క్రితం ఆనందకుమార్ అనే వ్యక్తిని హత్య చేసి మారళ్లి గ్రామం శివారులోని శ్మశానంలో పూడ్చిపెట్టాడని, తాము సురేశ్,హరీశ్,వెంకటేశ్‌తో కలిసి మృతదేహాన్ని మోయడానికి సహక రించినట్టు నిందితులు గుట్టు విప్పారు. దీంతో ఆనంద్‌కుమార్ కుటుంబ సభ్యులతో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు తహశీల్దార్ రమేశ్‌కుమార్, సీఐ శివారెడ్డి, రూరల్ ఎస్ఐ నవీన్‌కుమార్ శుక్రవారం మారళ్లి శ్మశానానికి వెళ్లి ఆనంద్(38) మృతదేహాన్ని వెలికితీయించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రధాన నిందితుడు కృష్ణప్ప సెంట్రల్ జైలులో ఉన్నాడని, కోర్టు అనుమతితో అతన్ని కస్టడీకి తీసుకుని హత్యకు దారి తీసిన కారణాలను తెలుసుకుంటామన్నారు. హతుడు ఆనంద్‌కుమార్ భార్య లక్ష్మమ్మ మాట్లాడుతూ తన భర్త కృష్ణప్ప వద్ద డ్రై వర్గా పని చేసేవాడన్నారు, గొడవలు రావడంతో పని మానేశాడన్నారు. ఆ తర్వాత హఠాత్తుగా కనిపించకుండాపోయాడన్నారు, ఎప్పటికయినా వస్తారని ఇన్నేళ్లు వేచి చూసామని, ఇంతలోనే అతను హత్యకు గురైనట్లు పోలీసులు చెప్పారని వివరించింది. నిందితుడు కృష్ణప్ప ఫిల్టర్ ఇసుక దందా నిర్వహిస్తూ ఎదురు తిరిగినవారిని హత్యచేసేవాడని ఆమె ఆరోపించింది. సాక్ష్యాలను, శవాలను మాయం చేయడానికి తన వద్ద పని చేసే కూలీలను ఉపయోగించుకునేవాడని పేర్కొంది. -
ఇక్కడ చదివితే ఐఐటీ గ్యారంటీ...
ఆనంద్‌కుమార్... ఆ పేరు ప్రపంచానికి పెద్దగా తెలీదు... కానీ ఐఐటీలోకి ప్రవేశించే ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు మాత్రం సుపరిచితం. ఆయన మీద డిస్కవరీ చానల్లో కార్యక్రమం ప్రసారమైంది... టైమ్ మ్యాగ జైన్ ఒక కథనాన్ని ప్రచురించింది... ఎన్నో సంస్థలు తమతో చేయి కలపమన్నాయి... అన్నిటినీ తిరస్కరించారు ఆనంద్‌కుమార్... ఇంతకీ ఈ ఆనంద్‌కుమార్ ఎవరు? పాట్నాలోని ఒక మారుమూల ప్రదేశంలోకి ప్రవేశించగానే ‘రామానుజన్ స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్’ అకాడమీ కనిపిస్తుంది. అందులోకి అడుగుపెట్టగానే కూటికి పేదలైన 30 మంది విద్యార్థులు, ‘మేం చదువుకి పేదలం కాము’ అన్నట్లుగా కనిపిస్తారు. వారి మధ్య ఎంతో దీక్షగా పాఠాలు చెబుతూ కనిపిస్తారు అనేక అవార్డులు అందుకున్న 31 సంవత్సరాల ఆనంద్ కుమార్. ‘‘మా నాన్నగారు పోస్టాఫీస్‌లో పని చేసేవారు. నేను స్థానిక హిందీ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడే నాకు లెక్కల మీద ఆసక్తి కలిగింది’’ అంటూ లెక్కల మీద ఉన్న ప్రేమ గురించి చెబుతారు ఆనంద్. భారతీయ గణిత శాస్త్రవేత్త ‘శ్రీనివాస రామానుజన్’ ను అమితంగా ఆరాధించే ఆనంద్‌కుమార్ తన అకాడమీకి ఆయన పేరు పెట్టుకున్నాను. డిగ్రీ చదువుతున్న రోజులలో ఆనంద్‌కుమార్ నంబర్ థియరీ మీద రచించిన వ్యాసాలు ‘మేథమెటికల్ స్పెక్ట్రమ్’, ‘ది మేథమెటికల్ గెజిట్’ లలో ప్రచురితమయ్యాయి. అందుకే అకాడమీ ప్రారంభించా... ఆనంద్‌కుమార్‌కు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుకునే అవకాశం రెండుసార్లు వచ్చింది. అయితే రెండుసార్లూ దురదృష్టం వెంటాడింది. ‘‘నిరాశ చెందకుండా నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. నాలాగ బాగా చదువుకుని పై చదువులకు వెళ్లే స్థోమత లేనివారికి సహాయపడాలనే ఉద్దేశంతోనే రామానుజన్ అకాడమీ ప్రారంభించాను’’ అంటారు ఆనంద్. అప్పుడు పడ్డాయి ఈ అడుగులు... ఒకసారి ఒక పేద విద్యార్థి తనకు ఐఐటీ చదవాలనే ఉందంటూ ఆనంద్ దగ్గరకు వచ్చాడు. ఆ పిల్లవాడికి ఉచితంగా పాఠాలు బోధించారు. ‘‘మా ఇద్దరి కష్టం ఫలించింది. ఆ కుర్రవాడు ఐఐటీ సీటు సాధించాడు. నా జన్మకు సార్థకత ఏంటో అర్థం చేసుకున్నాను. పెద్ద చదువులు చదువుకోవాలనే కోరిక ఉన్న పేద విద్యార్థులకు సాయపడాలనుకున్నాను. అప్పుడే సూపర్ 30 కార్యక్రమానికి పునాదులు వేసుకున్నాను’’ అంటారు ఆనంద్. సంస్థ విజయం... ఏటా 30 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంపిక చేసి, వారికి శిక్షణనిచ్చి, ఐఐటీ ఎంట్రన్స్కి పంపించడం ప్రారంభించారు ఆనంద్. ఈ సంస్థ నుంచి ఏటా పంపుతున్న 30 మందిలో కనీసం 26 మంది ఎంపికవుతున్నారు. ఐఐటియన్లు అవుతున్నారు. ఇంతమందిని నిస్వార్థంగా వృద్ధిలోకి తీసుకువస్తున్న ఆనంద్‌కుమార్ మరింతమంది మేధావులను దేశానికి అందిస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇటీవల ‘టైమ్’ పత్రిక ఆనంద్ గురించి ఒక వ్యాసం ప్రచురించింది. అది చూసిన ఒబామా, అవసరమైన సహాయం చేస్తానని తన ప్రతినిధితో కబురు పంపారు. ప్రభుత్వం సహాయం అందించడానికి ముందుకు వచ్చినా ఆనంద్ సున్నితంగా తిరస్కరించారు. తన లాంటి పేదవారిని మరో నలుగురిని పైకి తీసుకురావడం తప్ప తన గురించి నలుగురూ గొప్పగా చెప్పుకోవాలనే ఆలోచన లేదు ఆయనకు. -
ఆనందం.. ఉద్విగ్నం
అతని సంకల్పం ముందు ఎవరెస్ట్ చిన్నబోయింది..మంచుకొండల మీద ఆయన వేసిన ఒక్కో అడుగు భారతఖ్యాతిని, భద్రాద్రి ప్రతిష్టను ప్రపంచనలుమూలలా చాటింది..ఎముకలు కొరికే చలికి స్పర్శ కోల్పోయిన శరీరం లక్ష్యం గుర్తొచ్చినప్పుడల్లా శక్తిని కూడగట్టి అడుగుముందుకు వేయించింది. అడ్వాన్స్బేసిక్ క్యాంప్ మొదలు ఒక్కో క్యాంప్ దాటుతున్నప్పుడు ఆనందంతో అతని మనసు ఉప్పొంగింది. చివరి దశలో పెద్దపెద్ద లోయలు..ఏమాత్రం పట్టుతప్పినా ప్రాణాలకు ముప్పు.. అక్కడే శవాల కుప్పలు..అయినా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా మరో విజేత పూర్ణతో కలిసి ఆనంద్‌కుమార్ ముందుకెళ్లారు. ఎవరెస్ట్ శిఖరాధిరోహణలో చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన సాధనపల్లి ఆనంద్‌కుమార్‌కు ఎన్నెన్నో ఒడిదొడుకులు. మొక్కవోని ఆత్మవిశ్వాసం..‘విజయమో వీరస్వర్గమోనన్న’ పట్టుదల..లక్ష్య ‘సాధనే’ ధ్యేయంగా సాగిన ఆ ప్రస్థానంతో 46 రోజుల కఠోర శ్రమ ఫలించింది..తనపై నమ్మకం ఉంచిన వారి ఆశలు..ఆశయాలు నెరవేరుతున్నాయన్న ‘ఆనందం’ ముందు బాధలన్నీ దూరమయ్యాయంటున్న ‘ఎవరెస్ట్’ విజేత మనోగతం... భద్రాచలం టౌన్: ‘భూ భాగానికి 8,848 మీటర్ల ఎత్తున, మైనస్ 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో అత్యంత ఎత్తై శిఖరం ఎవరెస్టును అధిరోహించగానే ఐఏఎస్ ప్రవీణ్‌కుమార్ సార్‌కు ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా శిఖరాన్ని అధిరోహిస్తామని చెప్పిన మాటలు మదిలో మెదిలాయి. ఆనందంతో గుండె నిండిపోయింది.’ అని ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సాధనపల్లి ఆనంద్‌కుమార్ తెలిపారు. శిఖరం ఎక్కిన తరువాత తొలిసారి జన్మస్థలానికి వచ్చిన ఆయన అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. అలా నా జీవన గమనం మారింది.. ‘నా జీవితంలో కీలక మలుపు అంటే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జాయిన్ కావటమే. ఆరో తరగతి వరకు మా స్వగ్రామం చర్ల మండలం కలివేరులోనే చదువుకున్నాను. అప్పటి వరకు చదువు అంతంతమాత్రంగా సాగింది. మా నాన్న (ఏడుకొండలు) నన్ను రెసిడెన్షియల్ పాఠశాలలో చదవించాలని అనుకున్నారు. దీనికి ఆర్. కొత్తగూడెంకు చెందిన ఇందుల బుచ్చిబాబు సహకరించారు. చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడో తరగతిలో చేరాను. మొన్న ఇంటర్ ప్రథమ సంవత్సరం కూడా అక్కడే పూర్తి చేశాను. ఆటలంటే నాకు ఎంతో ఇష్టం. అన్ని ఆటల్లో ప్రవేశం ఉంది. కళాశాల స్పోర్ట్స్ చాంపియన్‌ను కూడా. బహుషా శిఖర అధిరోహనకు కావాల్సిన శక్తిసామర్థ్యం, పట్టుదల ఆటల వల్లే అలువడి ఉంటుంది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీయాలని ఆ శాఖ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ నిర్ణయించుకున్నారు. ఆయన తీసుకున్న ఆ నిర్ణయమే నా జీవితాన్ని మార్చేసింది. 2013లో నల్లగొండ జిల్లా భువనగిరిలో రాక్‌క్లైంబింగ్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆ శిబిరానికి మా కళాశాల నుంచి నాతోపాటు మరొకరిని పంపారు. మొత్తం ఈ శిక్షణకు 110 మంది హాజరయ్యారు. దానిలో 20 మందిని ఎంపిక చేశారు. అందులో నేనొక్కన్ని. ఆ 20 మందికి అర్జున అవార్డు గ్రహీత, ఎవరెస్టు శిఖర అధిరోహకుడు శేఖర్‌బాబు, పరమేశ్వరరెడ్డి శిక్షణ ఇచ్చారు. శేఖర్‌బాబు ఇచ్చిన అనేక సలహాలు, సూచనలు మాకెంతగానే ఉపయోగపడ్డాయి. అప్పటి వరకు ఎవరెస్టు ఎక్కిన వారి వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటోలను చూపించి మమ్మల్ని ఉత్తేజపర్చారు. ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నా ఎవరెస్టు విజేతగా నిలవాలని...అప్పటి నుంచి వారి మార్గదర్శకత్వంలో ముందుకెళ్లా. వారి సూచనలను తూ.చ తప్పకుండా పాటించా విజేతనయ్యా. సర్దుకుపోయే తత్వమే నా ఎంపికకు కారణమేమో.. పరిస్థితులను బట్టి నడుచుకోవడం నాకు చిన్ననాటి నుంచి అలవాటు. మారుమూల ప్రాంతం, అదీ పేదరికంలో జన్మించడం..కష్టనష్టాలను ఎదుర్కోవడం వల్లనేమో నాకు సర్దుకుపోయే మనస్థత్వం అలువడింది. నాకున్న ఆ లక్షణమే మా శిక్షకులను మెప్పించి ఉండొచ్చు. నన్ను సెలెక్ట్ చేయడానికి అదే కారణమై ఉంటుందని నా అభిప్రాయం. భువనగిరిలో శిక్షణ తరువాత డార్జిలింగ్, సిక్కిం, హిమాలయ పర్వతాలు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి ఎవరెస్టు వాతావరణం అలవాటయ్యేలా మాకు తర్ఫీదు నిచ్చారు. ఇక్కడ మైనస్ 20 డిగ్రీల చలిలో శిక్షణ తీసుకున్నాం. ఇవన్నీ అయ్యాక 20 మందిలో తొమ్మిది మందిని ఎంపిక చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ శిక్షణ ఇచ్చారు. మొత్తం నాలుగుదశల శిక్షణ. దానిలో ఇద్దరం నిలిచాం. శిక్షణలో భాగంగా చల్లదనాన్ని తట్టుకోవడం, ధరించాల్సిన దుస్తులు, తీసుకోవాల్సిన ఆహారం, ఆక్సిజన్ తదితర వాటిపై క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చారు. రోజుకు 30 కిలోమీటర్లు జాగింగ్, యోగాసనాలను ప్రాక్టీస్ చేయించారు. ఫైనల్‌గా తొమ్మిది మందిలో నేను, నిజామాబాద్‌కు చెందిన పూర్ణ సెలెక్ట్ అయ్యాం. ఆ తర్వాత కళాశాలకు వచ్చాం. ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసి తిరిగి వెళ్లాం. స్పర్శ లేదు.. శక్తి కోల్పోయాం.. మంచు ప్రభావంతో శరీరానికి స్పర్శలేకుండా పోయింది. ఒట్లో సత్తువకూడా లేదు. అయినా పట్టుదలతో ముందుకుపోయాం. ఏప్రిల్ 6న హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాం. ఢిల్లీ, నేపాల్‌లోని ఖాట్మాండ్ మీదుగా చైనా వరకు బస్సులో వెళ్లాం. అడ్వాన్స్బేసిక్ క్యాంప్‌గా భావించే 6,400 మీటర్ల వరకు భారతీయఫుడ్ను తీసుకుంటూ వెళ్లాం. అక్కడి నుంచి ప్యాకింగ్ఫుడ్ను తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఫుడ్‌ను నీటిలో వేడిచేసి తినాల్సి వచ్చేది. కష్టంగా ఉన్నా ఆ ఫుడ్‌ను తీసుకున్నాం. అక్కడి నుంచి క్యాంప్ 1- 7,100 మీటర్లు, క్యాంప్ 2- 7,700, క్యాంప్ 3 -8,300 మీటర్లను దాటుకుంటూ ముందుకు వెళ్లాం. మైనస్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మాత్రమే ఉండటంతో శరీరానికి స్పర్శ లేకుండా పోయింది. ఒంట్లో సత్తువ లేదు. చనిపోయినా ఫర్వాలేదనుకుంటూ ముందుకెళ్లాం. బస్తాలు మోయడం వల్లనేమో.. బరువు అనిపించలేదు.. పాఠశాలలో చదివే రోజుల్లో సెలవుల్లో కలివేరులో పనులకు వెళ్లే వాడిని. ధాన్యం బస్తాలు మోయటం, తాపీ పనులు చేయటం వంటివి చేసేవాణ్ని. దీనివల్లనేమో 20 కేజీల బరువుండే బ్యాగ్ పర్వతారోహణలో ఎప్పుడూ వీపుపై ఉన్నా పెద్దభారం అనిపించేది కాదు. ఈ బ్యాగ్‌లో రెండు ఆక్సిజన్ సిలిండర్లు, జాకెట్స్, జ్యూస్, చాక్లెట్స్ తదితర సామగ్రి ఉండేది. ఇంతబరువును వీపుపై ఉంచుకొని పగలంతా ప్రయాణించేవాళ్లం. రాత్రి ళ్లు నిద్రపట్టేది కాదు. నిద్రపోయే కొద్ది సమయం లో మాత్రమే ఆ బ్యాగ్‌ను తీసి కిందపెట్టేవాళ్లం. శవాలను దాటివెళ్లాం.. చివరి దశలో చాలా కష్టమనిపించింది. తల్లిదండ్రులు, మాపై నమ్మకం ఉంచి డబ్బులు ఖర్చుపెట్టిన సార్లు, శిక్షకులు గుర్తొచ్చారు. 8,300 అడుగులు దాటాక పెద్దపెద్ద లోయలు ఉండేవి. వాటిని దాటేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోయినట్టే. ఆ సమయంలో అక్కడ చాలా శవాలు కనిపించాయి. వాటిని చూసినప్పుడు గుండెనిబ్బరం కోల్పోకూడదనుకున్నాం. మనోధైర్యంతో ముందుకెళ్లాం. తొలి అడుగు ఓ మధుర క్షణం చివరిగా 8,848 మీటర్లు దాటి ఎవరెస్టు శిఖరంపై తొలి అడుగువేసిన ఆ క్షణం...నా జీవితంలో మర్చిపోలేనిది. ఆ మధుర క్షణం కోసం ఇన్నిరోజులు నాకు తోడ్పడిన నా తల్లిదండ్రులు, మా కళాశాల ప్రిన్సిపాల్ శివనారాయణ, పీడీ, అధ్యాపకులు, ప్రవీణ్‌కుమార్ సార్, శిక్షకులు శేఖర్, స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరూ నా కళ్ల ముందు కదలాడారు. వారందరికీ నా విజయాన్ని అంకితమిస్తూ అక్కడ జాతీయ, తెలంగాణ జెండాలను ఉంచాం. అంబేద్కర్, ఎస్ఆర్ శంకర్ల ఫొటోలను పెట్టాం. స్పార్సో జెండాను పాతం. భారతదేశం, భద్రాచలం ఖ్యాతిని మరోమారు ప్రపంచశిఖరంపై రెపరెపలాడించటం నాకు గర్వంగా అనిపించింది. కృషి ఉంటే.. కృషి, పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదు. దీనికి నా జీవితమే నిదర్శనం. అతి పేద కుటుంబం నుంచి వచ్చిన నేను..నేడు పదిమందికి ఆదర్శంగా నిలిచాను. మాపై నమ్మకం ఉంచి కోట్లు ఖర్చుపెట్టిన అధికారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రమించాం.నాలాంటి పేదలు ఎంతో మంది ఉన్నారు. వారికి చేయూత నందిస్తే విజేతలుగా నిలుస్తారు. పేదవారికి, అట్టడుగు వర్గాల వారికి సాయం, మార్గదర్శకత్వం అందించేలా నేను ఉండాలనేది నా అభిమతం. ఐపీఎస్ సాధనే లక్ష్యం.. ఐపీఎస్‌ను సాధించడమే నా లక్ష్యం. మా స్వగ్రామానికి వెళ్లి వస్తా. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుపై దృష్టి పెడతా. ఉన్నతచదువులు చదివి ఐపీఎస్ సాధిస్తా. ఆ తర్వాత నా జిల్లా, మండలం, గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవాలనేదే నా లక్ష్యం. ఆ దిశగా నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్నందర్ని వేడుకుంటున్నా. -
భారతీయుడిగా గర్వపడుతున్నా
భద్రాచలం టౌన్: కష్టసాధ్యమైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినందుకు భారతీయుడిగా గర్వపడుతున్నానని సాధనపల్లి ఆనంద్‌కుమార్ అన్నాడు. ప్రపంచంలో ఎత్తై శిఖరాన్ని అధిరోహించి పలువురి ప్రశంసలు అందుకున్న ఆనంద్‌కుమార్ తన తల్లిదండ్రులతో గురువారం రాత్రి భద్రాచలం చేరుకున్నాడు. ఈ సందర్భంగా విద్యావేత్తలు, ప్రముఖులు, బంధువులు ఆనంద్‌కుమార్‌కు ఘనస్వాగతం పలికారు. భద్రాచలం ఎంఈవో మాధవరావు, పాల్‌రాజ్ ఇంజనీరింగ్ చైర్మన్ అబ్రహం పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ..... భారత దేశ జెండాతో పాటు, తెలంగాణ రాష్ట్ర జెండాను ఎవరెస్టు శిఖరంపై పాతటంతోనే తన గుండె ఉద్వేగంతో నిండిపోయిందని తెలిపాడు. తన విజయంతో భద్రాచలానికి ఖ్యాతి లభించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నాడు. పేదరికం దేనికి అడ్డుకాదని, ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని పట్టుదల, క్రమశిక్షణతో కష్టపడితే విజయం వరిస్తుందని ఈ యాత్ర ద్వారా తెలిసిందని పేర్కొన్నాడు. తన విజయం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. భద్రాచలం వచ్చిన ఆనంద్‌కుమార్‌కు స్వాగతం పలికిన వారిలో కరుణానిధి, జెట్టి రంజిత్‌కుమార్, సాధనపల్లి సతీష్, దాసరి శేఖర్ తదితరులు ఉన్నారు. కాగా, శుక్రవారం ఆనంద్‌కుమార్‌కు ఆర్డీవోతో పాటు, పలువురు సన్మాన, అభినందన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. -
తెలుగు తేజాలకు లోక్‌సభ అభినందనలు
న్యూఢిల్లీ: అతి పిన్నవయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగుతేజాలు మాలావత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్‌కుమార్‌లను లోక్‌సభ అభినందించింది. బుధవారం లోక్‌సభ సమావేశాలు మొదలైన తర్వాత పూర్ణ, ఆనంద్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పూర్ణ, ఆనంద్‌లను అభినందించి ఘనంగా సన్మానించారు. ఢిల్లీలో ఇటీవల పూర్ణ, ఆనంద్ వారిని కలిశారు. తెలుగు తేజం పూర్ణ చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆనంద్ రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల పూర్ణ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి.. 17 ఏళ్ల ఆనంద్ ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్ఇయర్ చదువుతున్నాడు. -
‘ఎవరెస్టు’ వీరులకు ఘనస్వాగతం
సాక్షి,హైదరాబాద్: ఎవరెస్టు శిఖరంపై భారత పతాకాన్ని ఎగరువేసిన తెలుగు తేజాలు లావత్పూర్ణ, సాధనపల్లి అనంద్‌కుమార్‌కు ఆదివారం ఇక్కడ ఘనస్వాగతం లభించింది. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే అభిమానులు గురుకుల సంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రపు బగ్గీలో ర్యాలీగా బయటికి తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి ర్యాలీగా శంషాబాద్‌కు చేరుకున్న పూర్ణ, ఆనంద్‌లు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా పాతబస్తీకి చేరుకున్నారు. ఫలక్‌నుమాలోనూ స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మొజంజాహిమార్కెట్, గన్‌పార్కు మీదుగా ట్యాంక్‌బంక్‌కు భారీ ర్యాలీ చేరుకుంది. -
ఐపీఎస్ అధికారి కావడమే లక్ష్యం
హైదరాబాద్: ఐపీఎస్ అధికారి కావడమే తన లక్ష్యమని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగుతేజం ఆనంద్ కుమార్ చెప్పాడు. చిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించి రికార్డు సృష్టించిన తెలుగుతేజాలు పూర్ణ, ఆనంద్ కుమార్ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ తిరిగివచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో వీరికి ఘనస్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టు నుంచి గుర్రపు బగ్గీలో ర్యాలీగా నగరానికి తీసుకువచ్చారు. తాము ఎవరెస్టు శిఖరం ఎక్కడానికి ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమారే స్ఫూర్తి అని పూర్ణ, ఆనంద్ చెప్పారు. తమకు సాయం చేసిన గురువులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భారతీయులైనందుకు గర్వపడుతున్నామని చెప్పారు. -
ఎవరెస్ట్ వీరులకు మోడీ సన్మానం
చిన్న వయసులోనే ఎవరెస్ట్‌ను అధిరోహించి రికార్డు నెలకొల్పిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం వీరిద్దరూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. పూర్ణ, ఆనంద్‌లను మోడీ సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్ణ, ఆనంద్‌లను మోడీ సన్మానిస్తున్నప్పటి ఫొటోను పీఎంఓ ప్రధాని కార్యాలయం అధికారులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. (చదవండి: మా సంకల్పం ముందు ఎవరెస్ట్ చిన్నదైంది) పూర్ణ, ఆనంద్‌లు గురువారం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాన్ని సాధించి దేశంలోని విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఈ సందర్భంగా వారితో కలసి ఫొటోలు దిగారు. కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్‌ను కూడా ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. వారిని మంత్రి ప్రశంసలతో ముంచెత్తారు. (చదవండి: కష్టమనిపించినా.. ఇష్టపడి చేశాం) తెలుగు తేజం పూర్ణ చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఆనంద్ రికార్డులకెక్కాడు. 14 ఏళ్ల పూర్ణ నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి.. 17 ఏళ్ల ఆనంద్ ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ ఫస్ట్ఇయర్ చదువుతున్నాడు. -
అమ్మే గుర్తొచ్చింది...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం ఆషామాషీ కాదు. ఇది సాధించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మొదట్లో చిన్న బండను చూసే భయపడ్డాను. కానీ పట్టుదలతో కష్టపడితే ఏదైనా సాధ్యమేననే ఆలోచనతో ముందుకెళ్లా. ఎవరెస్టు శిఖరం పైకి వెళుతున్నప్పుడు అమ్మే గుర్తొచ్చింది. అమ్మను తలుచుకుంటూనే ఉన్నా. మా ఊరు కూడా గుర్తొచ్చింది. నేను చదువుకున్న పాఠశాల కళ్ల ముందు కదలాడింది. మొదట్లో చెప్పిన విధంగానే ఖమ్మం జిల్లాకు పేరు తేవాలని ముందుకెళ్లా. ఎవరెస్టు శిఖరంపై జాతీయ పతాకంతో పాటు తెలంగాణ జెండాను కూడా ఉంచి వచ్చా. ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే అసాధ్యమంటూ ఏదీ లేదు’ అని అంటున్నాడు మన జిల్లా ముద్దుబిడ్డ, ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కి ఘనతసాధించిన సాధనపల్లి ఆనంద్‌కుమార్. చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన ఆనంద్ గత నెల 25న ఉదయం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. అనంతరం అతను భారత భూభాగంలోకి ప్రవేశించి ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీలో ఉన్నాడు. శుక్రవారం ప్రధానమంత్రి, ఇతర జాతీయ ప్రముఖులను కలిసి అభినందనలు అందుకోనున్న ఆనంద్ గురువారం ‘సాక్షి’ ప్రతినిధికి ఢిల్లీ నుంచి ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు... ఆ ఇంటర్వ్యూ విశేషాలు అతని మాటల్లోనే.... ఖమ్మం పేరు నిలబెట్టా ఎవరెస్టు శిఖరం ఎక్కడానికి వెళ్లే ముందు హైదరాబాద్‌లో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లోనే గట్టిగా చెప్పా. ఖమ్మం జిల్లా తరఫున సాధించి వస్తానని. అదే స్ఫూర్తితో నా టార్గెట్‌ను పూర్తి చేశా...ఖమ్మం జిల్లా పేరు నిలబెట్టా. నేను పుట్టి పెరిగిన కలివేరు గ్రామానికి, నా తల్లిదండ్రులకు, నేను చదువుకున్న చంద్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లె గురుకుల పాఠశాలకు మంచిపేరు తేవాలన్నదే నా కోరిక. నా ఈ విజయంలో నా తల్లిదండ్రులు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, నా పాఠశాల సిబ్బంది, నా ఉపాధ్యాయులు, నా ప్రాణమిత్రులు, సహచరులందరూ భాగస్వాములే. వారి ఆశీస్సులు, స్ఫూర్తి, సహచర్యం నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లాయి. నేను పుట్టిన గడ్డకు రుణపడి ఉంటా. నా గ్రామానికి ఏదైనా చేయాలన్నది నా కోరిక. ఖమ్మం ఎప్పుడెప్పుడు రావాలా అనిపిస్తోంది. త్వరలోనే వచ్చి నా మాతృభూమి ఆశీర్వాదం తీసుకుంటా. కాళ్ల కింద భూకంపం పుట్టేది ఎవరెస్టు ఎక్కేందుకు వెళుతున్నప్పుడు భయమనిపించింది కానీ లక్ష్యం ముందు ఆ భయం చిన్నపోయింది. శవాలు కనిపించినప్పుడు చాలా ఇబ్బంది అనిపించేది. అందరూ గుర్తొచ్చేవారు. లోతైన లోయల్లో నడుస్తున్నప్పుడు కాళ్ల కింద భూకంపం పుట్టేది. 20 కిలోల బరువు మోసుకుంటూ మంచు గడ్డలను ఛిద్రం చేసుకుంటూ వెళ్లే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాస అందేది కాదు. అన్ని అవయవాలను సమన్వయం చేసుకోవాల్సి వచ్చేది. చాలా క్రమశిక్షణతో ముందుకెళ్లాల్సి వచ్చేది. అన్ని పరిస్థితులను అధిగమించడం ముందే అలవాటు చేసుకున్నాం. అయినా కష్టంగానే వెళ్లాం. రాత్రిళ్లు నడవాల్సి వచ్చినప్పుడు, బేస్‌క్యాంపులు దగ్గర్లోకి వచ్చినప్పుడు కొంత ఉత్కంఠకు లోనయ్యాను. ఏదిఏమైనా ఖచ్చితంగా ఎవరెస్టు శిఖరాన్ని తాకి రావాలన్న లక్ష్యంతోనే ముందుకెళ్లి విజయం సాధించా. చాలా సంతోషంగా ఉంది. అమ్మ కదా... అంతే అంటుంది.... అమ్మా, నాన్నా నన్ను చాలా ప్రోత్సహించారు. వాళ్లు కనిపించిన వెంటనే కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటా. వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. చాలా చిన్న స్థాయి కుటుంబమైనా కష్టపడి నన్ను చదివిస్తున్నారు. అయినా అమ్మకు కొంచెం భయం. నేను ఎవరెస్టు ఎక్కేందుకు వెళుతున్నప్పుడు కూడా భయపడ్డారు. అమ్మ అంతే అంటుందిలే.. నాకు లక్ష్యం నెరవేరుస్తానన్న ధైర్యం ఉంది కదా అని వాళ్లకు కూడా ధైర్యం చెప్పి వెళ్లాను. ఐపీఎస్ కావాలన్నది నా కోరిక. ఇక, దాని కోసం శ్రమిస్తా. -
ఎవరెస్టుపై మన ధీరులు!
సంపాదకీయం: ప్రపంచానికి అందనంత ఎత్తులో ఉండి, సాహసులను రారమ్మని నిత్యమూ సవాల్ చేసే ఎవరెస్టు శిఖరం మన రాష్ట్రంలోని మారుమూల గ్రామాలనుంచి వెళ్లిన ఇద్దరు చిన్నారుల సంకల్పబలానికి బిత్తరపోయి ఉంటుంది. ఆసరా ఇవ్వాలేగానీ, అవకాశం రావాలేగానీ దేనికైనా సంసిద్ధులై ముందుకురికే నివురుగప్పిన నిప్పులు... మట్టిలోని మాణిక్యాలు ఇంకెన్ని ఉన్నాయోనని అచ్చెరువొంది ఉంటుంది. నిజామాబాద్ జిల్లా తాడ్వాయికి చెందిన 14 ఏళ్ల మాలావత్ పూర్ణ, ఖమ్మం జిల్లా కలివేరు గ్రామానికి చెందిన 17ఏళ్ల ఆనంద్‌కుమార్ ఆదివారం ఎవరెస్టు శిఖరాగ్రంపై అడుగుపెట్టిన వార్త ప్రతి ఒక్కరినీ పులకింపజేసింది. శిఖరారోహణ చేసిన అత్యంత పిన్నవయస్కురాలిగా పూర్ణ రికార్డులకెక్కింది. 30 మంది పర్వతారోహకుల బృందంలో భాగంగా వెళ్లిన ఈ ఇద్దరూ అందరికంటే ముందుగా దాన్ని చేరుకోగలగడం గర్వకారణమైతే... ఆ ఇద్దరిలోనూ పూర్ణ అరగంట ముందే లక్ష్యాన్ని ఛేదించడం మరింత గొప్పవిషయం. ఈ చిన్నారుల సామాజిక నేపథ్యం, వారి ఆర్ధిక స్థితిగతులు గమనిస్తే వారు సాధించిన ఘన విజయానికున్న ప్రాముఖ్యమేమిటో అర్ధమవుతుంది. పూర్ణ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు, గిరిజనులు. ఆనంద్ తండ్రి ఒక సైకిల్ షాపులో దినసరి కూలి. వారిది దళిత కుటుంబం. పుట్టుకే అన్నిటినీ నిర్దేశిస్తుందని, సకల సౌకర్యాలూ సమకూర్చుకోగల స్తోమత ఉంటేనే దేన్నయినా సాధించడం సాధ్యమవుతుందని భావించేవారి కళ్లు తెరిపించిన సాహస బాలలు వీరిద్దరూ. పాశ్చాత్యదేశాల్లో పర్వతారోహణ ఒక సాహసక్రీడ. అందుకోసం వేలాది డాలర్ల సొమ్మును ఖర్చుచేస్తారు. పర్వతారోహణ సంస్థలు ఒక్కొక్కరినుంచి దాదాపు 90,000 డాలర్ల వరకూ వసూలు చేస్తాయి. ప్రత్యేకించి ఎవరెస్టు శిఖరారోహణ కోసమని ఏళ్ల తరబడి పొదుపుచేస్తున్నవారూ ఉంటారు. ఏదీ సవ్యంగా ఉండని మన దేశంలో పర్వతారోహణ గురించి చాలామందికి అవగాహన ఉండదు. దానిపై దృష్టి సారించడానికి ప్రోత్సాహం అందించే సంస్థలూ అంతంతమాత్రమే. చదువే సర్వస్వమని, అందుకు పాఠ్యపుస్తకాలే మార్గమని భావించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్లో దాగివుండే ఇతరేతర ప్రతిభాపాటవాలను గుర్తించే స్థితి ఉండదు. సకాలంలో పాఠ్యపుస్తకాలు రావడమే మహద్భాగ్యమయ్యేచోట, పిల్లలకు కనీస సదుపాయాలు కూడా గగనమయ్యేచోట అలాంటి అవకాశమూ ఉండదు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (స్వేరోస్) కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ చొరవ వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఒక అధికారి నిబద్ధతతో, నిమగ్నతతో పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించగలరనడానికి ఈ ఇద్దరి బాలల ఎవరెస్టు శిఖరారోహణమే ఉదాహరణ. వేలాదిమంది పిల్లలతో స్వయంగా మాట్లాడి, వారిలో దాగివున్న శక్తిసామర్ధ్యాలను గుర్తించి... వాటిని వెలికితీయడానికి గల మార్గాలను అన్వేషించి ఆయన ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మామూలు కొండ ఎక్కడమంటేనే మాటలు కాదు. అడుగడుక్కీ ఆయాసం పెరుగుతూ ఆపైన ప్రతి అడుగూ పెనుభారమవుతూ చివరకది ఊపిరాడనీయని నడకగా మారుతుంది. ఇక అడుగడుగునా మృత్యువు పొంచివుండే ఎవరెస్టు శిఖరం గురించి చెప్పేదేముంది? అక్కడ మనిషిని నిలువునా గడ్డకట్టించే చలి. ఎత్తు పెరిగేకొద్దీ ఆక్సిజన్ త గ్గుతూ... ఎటునుంచి ఏ మంచుఖండం మృత్యువై విరుచుకుపడుతుందో అర్ధంకాని స్థితిలో ప్రతి అడుగునూ పునర్జన్మగా భావించుకోవాల్సిందే. నిజానికి ఆ యాత్ర... నిద్రపోతున్న మృత్యుదేవతను లేపి పరాచకాలాడటమే. అందుకే దానిని డెత్ జోన్ అన్నారు. ఎవరెస్టు దాకా అవసరం లేదు. అందుకోసమని వివిధ అంచెలుగా ఇచ్చే శిక్షణే అత్యంత కఠోరమైనది. ఈ సాహస క్రీడ కోసం తొలుత 110మందిని ఎంపికచేస్తే అన్ని రకాల పరీక్షలనూ దీటుగా ఎదుర్కొని చివరకు మిగిలింది ఈ ఇద్దరే. ఆ ఇద్దరూ ఇప్పుడు తమ పల్లెలకు, జిల్లాలకే కాదు రాష్ట్రానికే పేరు ప్రఖ్యాతులు సాధించిపెట్టారు. ప్రపంచానికే తలమానికమయ్యారు. ఇప్పుడు ఈ బాలలిద్దరూ సాధించిన విజయాలు చూశాకైనా మన భవిష్యత్తు పౌరులపై, రేపటి తరంపై ఎంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నామో అర్ధం కావాలి. పిల్లల అభిరుచులేమిటో తెలుసుకుని అందుకు అవసరమైన మంచి వాతావరణాన్ని సృష్టిస్తే... వారొక లక్ష్యాన్ని ఎంచుకునేలా ప్రోత్సహిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో పూర్ణ, ఆనంద్‌లు నిరూపించారు. బాలలు ఈ దేశ వారసత్వ సంపదని సుప్రీంకోర్టు ఆ మధ్య అభివర్ణించింది. అపురూపమైన ఈ వారసత్వ సంపదకున్న విలువనుగానీ, దాని గొప్పతనాన్నిగానీ గుర్తించలేక ప్రభుత్వాలు నిర్లక్ష్యంవహిస్తున్నాయి. పాఠశాల విద్యకు బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయక, స్కూళ్లకు అవసరమైన ఉపాధ్యాయులను నియమించక, మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లవంటివైనా అందుబాటులోకి తీసుకురాలేక తమ చేతగానితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ పిల్లలిద్దరూ మారుమూలనుండే పల్లెటూర్లనుంచి వ చ్చారని, అమ్మానాన్నల సామీప్యాన్ని కోరుకునే వయసులో వారికి దూరంగా ఉండి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్నారని తెలిసినప్పుడు ఈ ఎవరెస్టు శిఖరారోహణ మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. వ్యక్తులుగా కొందరు అంకితభావంతో పనిచేయడంవల్ల సాధ్యమైన ఈ విజయం... సమష్టిగా, వ్యవస్థాగతంగా సాగిస్తే మరెన్ని రెట్లు పెరుగుతుందో గుర్తుంచుకుంటే మనలోని నిర్లక్ష్యం మటు మాయమవుతుంది. పూర్ణ, ఆనంద్‌ల విజయం అందుకు దోహద పడాలని కోరుకుందాం. -
మన్యం పుత్రుడి ఘనత
ఖమ్మం జిల్లా కలివేరులో ఆనందోత్సాహాలు చర్ల, న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని చర్ల మండలంలో ఎక్కడో అడవిలో విసిరిపారేసినట్టున్న ఓ గిరిజన గ్రామం పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఆ గ్రామానికి చెందిన దళిత యువకుడు అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే కారణం. చర్ల మండలం కలివేరుకు చెందిన ఆనంద్‌కుమార్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సందర్భంగా ‘న్యూస్‌లైన్’ ఆయన స్వగ్రామాన్ని సందర్శిం చింది. ఆనంద్ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆనందంలో మునిగిపోయారు. తమ కుమారుడు సాధించిన ఘనత కు తల్లిదండ్రులు కొండలరావు, లక్ష్మి మురిసిపోతున్నారు. స్కూలుకు వెళ్లనన్నాడు: మొదట ఏడో తరగతి వరకు చదువుకున్న ఆనంద్.. కుటుంబ ఆర్థిక పరిస్థితి, స్నేహాల కారణంగా చదువు వద్దనుకున్నాడు. బడికి వెళ్లనంటూ మారాం చేసి మరీ కూలీ పనులకు వెళ్లాడు. ఏడాది పాటు అలాగే గడిచింది. అయితే బడికి వెళ్లకపోతే చనిపోతానని తల్లి బెదిరించడంతో ఆనంద్ మళ్లీ బడి బాట పట్టాడు. సైకిల్ మెకానిక్‌గా పని చేస్తున్న తండ్రి కొండలరావు అతడ్ని చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లిలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించాడు. క్రీడలంటే ప్రాణం...: మొదటి నుంచి ఆట లంటే ఇష్టపడే ఆనంద్ వాలీబాల్, హ్యాండ్‌బా ల్, అథ్లెటిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరి చాడు. టెన్తలో ప్రథమ శ్రేణిలో పాసై అక్కడే ఏపీఆర్జేసీలో ఇంటర్ బైపీసీలో చేరాడు. ఫస్టియర్ చదువుతున్న సమయంలో సాహసయాత్రలకు దరఖాస్తు చేసుకున్నా డు. నల్లగొండ జిల్లా భువనగిరిలో శిక్షణ పొంది.. పలు శిఖరాలను అధిరోహించాడు. ఇదే క్రమంలో కఠిన పరి స్థితులను తట్టుకునే సామర్థ్యం కనబరిచిన ఆనంద్‌ను ఎవరెస్ట్ యాత్రకు ఎంపిక చేశారు. ఎవరెస్ట్‌ను ఎక్కిన ఆనంద్‌కు ఐపీఎస్ అవ్వాలన్న ఆశయం ఉందని, అది కూడా కచ్చితంగా నెర వేరుతుందని అతని తల్లిదండ్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఎవరెస్టంత సంబురం
ఖమ్మం, న్యూస్‌లైన్: ఎవరెస్టు శిఖరాన్ని సాహసోపేతంగా అధిరోహించిన మన్యం బిడ్డ సాధనపల్లి ఆనంద్‌కుమార్‌ను జిల్లా ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఆనంద్ సాధించిన ఘన కీర్తి స్ఫూర్తిదాయమని అంటున్నారు. అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. గొప్ప విజయం సాధించాడు ఆనంద్ గొప్ప విజయాన్ని సాధించాడు. ఎంతో శ్రమతో కూడుకున్న సాహసమే చేశాడు. అతడి పట్టుదలకు జిల్లా అధికార యంత్రాంగం తరఫున అభినందనలు. ఇలాంటివి సాధించడం చాలా అరుదు. ఇతని స్ఫూర్తి విద్యార్థులందరికీ అవసరం. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు ఆనంద్, ఆయన సహచరి పూర్ణను అభినందించారు. కంగ్రాట్స్... ఆనంద్ కీపిట్అప్.. - శ్రీనివాస శ్రీనరేష్, కలెక్టర్ సంకల్పబలం ఉండాలి ఆనంద్ సాధించిన విజయం గర్వకారణం. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం కష్టమైన పని. ఎంతో సంకల్పబలం ఉంటేనే గానీ సాధ్యం కాదు. ఎత్తయిన కొండల మధ్య చిన్న వయసులో అత్యంత సాహసోపేత యాత్ర చేశాడు. విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆనంద్‌కు అభినందనలు. అతడిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులందరూ విజయాలు సాధించాలి. -సురేంద్రమోహన్, జాయింట్ కలెక్టర్ ఎవరెస్టుపై జిల్లా కీర్తి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని జిల్లాకు చెందిన విద్యార్థి సాధనపల్లి ఆనంద్‌కుమార్ అధిరోహించి జిల్లా కీర్తిని చాటాడు. ఆయన విజయం జిల్లాకే గర్వకారణం. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి అతిచిన్న వయసులోనే గొప్పసాహస కృత్యం చేయడం అభినందనీయం. ప్రమాదకరమని తెలిసినా పట్టువదలకండా ఈఘనతను సాధిం చడం గొప్ప విషయం. ఆనంద్ కుటుంబ సభ్యులతో పాటు అతడిని ప్రోత్సహించిన అధ్యాపకులు, స్నేహితులు, శిక్షకులకు అభినందనలు. ఆనంద్‌కు నా ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది. - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ స్ఫూర్తిగా తీసుకోవాలి మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థుకు సరైన శిక్షణ ఇస్తే ఉన్నతులుగా ఎదుగుతారని ఆనంద్ రుజువ చేశాడు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన ఆనంద్ జిల్లా విద్యార్థి కావడం జిల్లాకే గర్వకారణం. ఏపీఎస్డబ్ల్యూర్ఈఐ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ విద్యార్థుల ప్రతిభను గుర్తించి, యాత్రకు అన్ని ఏర్పాటు చేయడంతోనే పేద విద్యార్థి పెద్ద రికార్డును సాధించాడు. ఇతర విద్యార్థులు ఆనంద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. -రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి అరుదైన రికార్డు సాధించాడు అరుదైన రికార్డును జిల్లా విద్యార్థి సొంత చేసుకున్న విషయం తెలియగానే ఉబ్బితబ్బుబ్బిపోయాను. గిరిజన ప్రాంతానికి చెందిన విద్యార్థి ఈ విజయం సాధించడం చరిత్రపుఠల్లో లిఖించదగిన విషయం. సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం చేయూత నిస్తుందనడానికి ఆనంద్ సాహస యాత్రే నిదర్శనం. ఆనంద్ మరెన్ని విజయాలు, రికార్డులు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. -వెంకటనర్సయ్య, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి దేశానికే గర్వకారణం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి ఎవరెస్టు శిఖరం అధిరోహించడం యావత్ భారతావనికే గర్వకారణం. జాతీయ జెండాను ఎవరెస్టు శిఖరంపై పాతిన జిల్లా విద్యార్థి ఆనంద్‌కు అభినందనలు. ప్రతిభావంతులను గుర్తించి వారి ప్రతిభకు మెరుగు పెడితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆనంద్ రుజువు చేశాడు. -పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే తెలంగాణ బిడ్డ కీర్తి చాటాడు.. కనీస సౌకర్యాలకు కూడా నోచుకొని గిరిజన ప్రాంతం చర్ల మండలానికి చెందిన ఆనందర్ ఎవరెస్టు శిఖరం అధిరోహించడం దేశానికే గర్వకారణం. ప్రత్యేక రాష్ట్రం కల సాకారమవుతున్న తరుణంలో మనందరికీ ఆనందదాయక విషయం. అరుదైన సాహస యాత్ర చేసి విజయం సాధించి తెలంగాణ తేజాన్ని ప్రపంచం కీర్తిస్తోంది. పేద విద్యార్థిని ప్రొత్సహించిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌కు, సాహస యాత్రకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృ జ్ఞతలు. - ఆర్జేసీ కృష్ణ, విద్యావేత్త తెలుగు జాతి గర్వించ దగిన రోజు ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్టు శిఖరం అధిరోహించడం తెలుగుజాతి గర్వించ దగిన విషయం. తెలుగుతేజాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిని జిల్లా విద్యార్థి ఆనంద్‌కు అభినందనలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంలో ఇలాంటి రికార్డులు జిల్లా విద్యార్థి సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. - కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాహస వీరుడికి సలాం.. ఎవరెస్టు శిఖరం అధిరోహించిన ప్రముఖుల జాబితాలో జిల్లా విద్యార్థి చేయడం సంతోషకరం. ఎంతో సాహసం, ఓర్పు, పట్టుదల ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఎత్తయిన శిఖరంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ఆనంద్‌కు అభినందనలు. పట్టుదల ఉంటే పేదరికం అడ్డురాదని రుజువు చేసిన సాహస వీరునికి, మట్టిలో మాణిక్యాన్ని గుర్తించి ప్రోత్సహించిన ఐఏఎస్ అధికారికి సలాం. - శ్రీనివాస్, ఖమ్మం కమీషనర్ -
ఎవరెస్ట్‌ను మించిన సంకల్పం
‘మిషన్ ఎవరెస్ట్’ వెనుక ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సాక్షి, హైదరాబాద్: డాక్టర్ రేపల్లె శివప్రవీణ్‌కుమార్.. సీనియర్ ఐపీఎస్ అధికారి. ‘స్వేరోస్’గా పిలిచే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు ఏడాది క్రితం ఓ వినూత్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తై పర్వతంపై తెలుగు కీర్తి పతాకను రెపరెపలాడించింది. నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు గురుకుల విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌లు ‘మిషన్ ఎవరెస్ట్’ను అధిరోహించినా వారిని వెన్నంటి ముందుకు నడిపింది మాత్రం ఈ ఐపీఎస్ అధికారే! సంకల్పం మొగ్గతొడిగిందిలా.. ప్రవీణ్‌కుమార్ స్వేరోస్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 గురుకుల పాఠశాలల్ని సందర్శించి 90 వేల మందితో స్వయంగా మాట్లాడారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో దాగున్న అద్భుత శక్తిసామర్థ్యాలను గమనించారు. చదువంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదని, ఆ విద్యార్థులకు ప్రపంచాన్ని చూపించాలని భావించారు. సహజంగానే పోలీసు అధికారి కావడంతో వారికి సాహసక్రీడల్ని పరిచయం చేయాలని సంకల్పించారు. అదే సందర్భంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమండ్ పీటర్ ద్వారా శేఖర్‌బాబు అనే వ్యక్తి పరిచయమయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కండక్టర్ కుమారుడైన శేఖర్ దక్షిణ భారతదేశం నుంచి ఎవరెస్ట్ ఎక్కిన ఎకైక వ్యక్తి. 2007లో ఈ ఘనత సాధించారని తెలియడంతో ఆయన సహకారంతో గురుకుల విద్యార్థుల్ని పర్వతారోహకులుగా చేయాలని భావించారు. భువనగిరి నుంచి తొలి అడుగు సాహస క్రీడలకు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. దీంతో గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్నీ స్వేరోస్ సంప్రదించింది. అనేక ప్రయత్నాల అనంతరం కిందటేడాది మేలో 110 మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని సాహసక్రీడల శిక్షణ ఇప్పించేందుకు అంగీకరించారు. శేఖర్‌బాబు పర్యవేక్షణలో 30 రోజుల పాటు భువనగిరిలో శిక్షణ ఇచ్చి అక్కడే ఉన్న 600 మీటర్ల ఏకశిలను ఎక్కించారు. ఇందులో ‘ఏ గ్రేడ్’ వచ్చిన 20 మందిని ఎంపిక చేసి అదనపు శిక్షణ కోసం డార్జిలింగ్‌లో టెంజింగ్ నార్గే స్థాపించిన ప్రతిష్ఠాత్మకమైన హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్కు పంపించాని నిర్ణయించారు. అప్పటి వరకు కనీసం రైలు కూడా చూడని ఈ విద్యార్థులు 2013 సెప్టెంబర్‌లో రెలైక్కి డార్జిలింగ్‌కు పయనమయ్యారు. కానీ ఆ ఇన్స్టిట్యూట్లో చేరాలంటే కనీస వయస్సు 17 ఏళ్లు ఉండాలి. ఈ 20 మందిలో అనేక మంది 14 ఏళ్ల వారే ఉండటంతో శిక్షణ ఇవ్వమని చెప్పారు. స్వేరోస్ అభ్యర్థన మేరకు కాస్త మెత్తబడ్డారు. పదేసి కిలోల బరువు భుజాన వేసి పది కిలోమీటర్లు పరిగెత్తమంటూ విద్యార్థులకు పరీక్ష పెట్టారు. ఇందులో ఆర్మీ వారినే అధికమించడంతో అవాక్కైన ఆ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్... ఈ గురుకుల విద్యార్థుల కోసం తొలిసారిగా ప్రత్యేక బ్యాచ్ ప్రారంభించారు. శిక్షణ తర్వాత 10 రోజుల ఎక్స్‌పెడిషన్‌లో భాగంగా కాంచనగంగ శిఖరం వైపు నడిపించారు. ఇందులో పాల్గొన్న ఆర్మీ వారు కేవలం 14 వేల అడుగుల నుంచే వెనక్కు వచ్చేయగా... మొత్తం 20 మంది విద్యార్థుల్లో 19 మంది మౌంట్ రీనాక్ పర్వతం వైపు 17 వేల అడుగుల వరకు వెళ్లి అబ్బురపరిచారు. మిషన్ ఇలా మొదలైంది ఈ 19 మంది ప్రతిభను అంచనా వేసిన శిక్షకుడు జ్యోతి వీరిలో ఏడుగురు మాత్రం ఎవరెస్ట్ శిఖరం వైపు 17 వేల మీటర్ల వరకు వెళ్లగలరని చెప్పారు. దీంతో ‘టార్గెట్ ఎవరెస్ట్’ మొదలైంది. ఇందుకు 10 మందిని ఎంపిక చేసి గతేడాది సెప్టెంబర్‌లో లడక్ పంపారు. అప్పటి వరకు ఆకాశంలో ఎగిరే విమానాన్ని మాత్రమే చూసిన ఈ గురుకుల విద్యార్థులు జీతంలో తొలిసారిగా అందులో ప్రయాణించి తమ లక్ష్యం వైపు అడుగులు వేశారు. మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో, 18 వేల అడుగుల ఎత్తులో 50 రోజులపాటు శిక్షణ పొందారు. వీరిలో చివరికి నలుగురికి ఎవరెస్ట్ అధిరోహించే శక్తి ఉందని అంచనా వేశారు. ఈ నలుగురిలో ఓ బాలిక కూడా ఉండటంతో ఆమెను కూడా ఎవరెస్ట్ ఎక్కించాలని నిర్ణయించారు. అదనపు పరీక్షల తర్వాత ఈ నలుగురిలో మాలావత్ పూర్ణ, ఎస్.ఆనంద్‌కుమార్‌లను ఎవరెస్ట్ వైపు నడిపించాలని నిశ్చయించుకున్నారు. షెర్పాలకే స్ఫూర్తినిచ్చిన విద్యార్థులు.. ఆదివారానికి సరిగ్గా 52 రోజుల క్రితం పూర్ణ, ఆనంద్ ఎవరెస్ట్ వైపు అడుగులు వేయడం ప్రారంభించారు. శేఖర్ బాబు సూచలన మేరకు చైనీస్ మౌంటేయినింగ్ ఫెడరేషన్ ద్వారా ఉత్తరం వైపు నుంచి ఎవరెస్ట్ ఎక్కే అనుమతి పొందారు. సురక్షితంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. అదేసమయంలో నేపాల్‌లో ఏప్రిల్ 18న జరిగిన ప్రమాదం నేపథ్యంలో పర్వతారోహకులకు మార్గనిర్దేశం చేసే షెర్పాలు సమ్మె చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికి తోడు పూర్ణ అస్వస్థతకు గురైంది. అయినా ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుకే వెళ్తానంటూ పట్టుపట్టడం చూసిన షెర్పాలు.. తమ సమ్మె విరమించారు. వివిధ దేశాల నుంచి ఎవరెస్ట్ అధిరోహణకు వచ్చిన 100 మంది సాహసికులతో ముందుకు కదిలారు. ఈ బృందంలో ఆదివారం ఉదయానికి కేవలం 30 మందే ఎవరెస్ట్ ఎక్కారు. వారిలో సూర్యోదయ సమయంలో ముందుగా అడుగు పెట్టింది మన పూర్ణే. మరో అరగంటకు ఆనంద్ రాగా.. మిగిలిన 28 మందీ రెండు గంటల తర్వాత శిఖరాన్ని అధిరోహించారు. గురుకుల విద్యార్థులు తమ వెంట భారత జాతీయ పతాకం, బీఆర్ అంబేద్కర్ పతాకం,ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఈఐఎస్ వ్యవస్థాపకుడైన మాజీ ఐఏఎస్ అధికారి ఎస్సార్ శంకర్లకు చెందిన పతాకాలను తీసుకువెళ్లారు. చాలా ఆనందంగా ఉంది 2007లో నేను ఎవరెస్ట్ ఎక్కినప్పటికంటే ఈరోజు ఎక్కువ ఆనందం కలిగింది. పూర్ణ, ఆనంద్ సురక్షితంగా తిరిగి బేస్ క్యాంప్ వైపు బయలుదేరారు. సోమవారానికి అక్కడికి చేరుకోనున్నారు. - చైనా నుంచి ‘సాక్షి’తో ఫోనులో శేఖర్‌బాబు పాఠ్యాంశంగా పెడతాం పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన నిరుపేద విద్యార్థులు పూర్ణ, ఆనంద్‌లు ఐపీఎస్ అధికారులు కావడమే తమ లక్ష్యమని చెప్తున్నారు. వీరి సాహస గాథను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని నిర్ణయించాం. -ప్రవీణ్‌కుమార్, ఏపీఎస్డ బ్ల్యూర్ఈఐఎస్ కార్యదర్శి -
సాహస యాత్ర సం'పూర్ణం'
ఎవరెస్ట్‌ను అధిరోహించిన తెలుగు తేజాలు...14 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాలావత్ పూర్ణ * అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు * విజయ పతాకం ఎగరేసిన ఆనంద్ కుమార్ * 52 రోజుల పాటు 30 మంది బృందంతో సాగిన ట్రెక్కింగ్ * ఆదివారం ఉదయం 6 గంటలకు అపూర్వ ఘట్టం * సత్తా చాటిన గురుకుల విద్యార్థులు * కాబోయే ప్రధాని మోడీ అభినందనలు సాక్షి, హైదరాబాద్: ఆకాశాన్నంటే ఎవరెస్ట్ శిఖరంపై తెలుగు తేజాలు వెలుగులీనాయి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఇద్దరు పేద విద్యార్థులు ఆదివారం సూర్యోదయ వేళ ఎవరెస్ట్ శిఖరాగ్రంపై అడుగుపెట్టారు. దీంతో సరికొత్త రికార్డు కూడా నమోదైంది. ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా 14 ఏళ్ల మాలావత్ పూర్ణ రికార్డు సృష్టించింది. మొత్తం 30 మంది పర్వతారోహకుల బృందంలో ఉదయం ఆరు గంటలకు మొట్టమొదటగా అక్కడకు చేరుకున్న పూర్ణ ఈ అరుదైన ఘనత సాధించింది. మరో విద్యార్థి 16 ఏళ్ల సాధ నపల్లి ఆనంద్‌కుమార్ అరగంట తేడాతో శిఖరం పైకి చేరుకున్నాడు. మిగిలిన 28 మంది పర్వతారోహకులు మరో రెండు గంటల తర్వాతే యాత్ర పూర్తి చేయగలిగారు. సముద్రమట్టానికి 8848 మీటర్ల ఎత్తుకు వెళ్లిన ఈ బృందం అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తిరుగు ప్రయాణమైంది. అత్యంత ప్రమాదకరమైన డెత్జోన్ నుంచి బేస్ క్యాంప్ వైపు ఈ బృందం వెనక్కు వస్తోంది. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంయుక్త ఆధ్వర్యంలో 52 రోజుల క్రితం ఈ యాత్ర ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పాకాల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు లక్ష్మీ, దేవదాస్‌ల కుమార్తె మాలావత్ పూర్ణ స్వేరోస్ (14) ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇక ఖమ్మం జిల్లా చార్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన కొండలరావు ఓ సైకిల్ షాపులో దినసరి కూలీ. ఇతడి కుమారుడు ఆనంద్‌కుమార్ (17) అన్నపురెడ్డిపల్లిలో ఉన్న గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరి శిక్షకుడు శేఖర్‌బాబు నేతృత్వంలో ఈ సాహస యాత్ర జరిగింది. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసే యత్నాల్లో భాగంగా ఈ సాహస యాత్ర కోసం తొలుత 150 మందిని ఎంపిక చేశారు. వీరిలో 20 మందికి డార్జిలింగ్‌లోని ప్రఖ్యాత సంస్థలో ట్రెక్కింగ్‌పై శిక్షణనిచ్చారు. తర్వాత వీరిలో నుంచి 9 మంది గతంలో ఇండో-చైనా సరిహద్దుల్లో నిర్వహించిన సాహసయాత్రలో పాల్గొన్నారు. అత్యంత కఠిన పరిస్థితులను సైతం ఎదుర్కునే సామర్థ్యం కనబరిచిన పూర్ణ, ఆనంద్ కుమార్ ఎవరెస్ట్ యాత్రకు ఎంపికయ్యారు. గర్వపడేలా చేశారు: మోడీ అతి చిన్న వయస్సులోనే ఎవరెస్ట్‌ను అధిరోహించిన మాలవత్ పూర్ణతో పాటు ఆనంద్‌కుమార్‌కు కాబోయే ప్రధాని, బీజేపీ అగ్రనేత నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ‘ఈ విషయం చదివినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి అభినందనలు. వారు మనం గర్వపడేలా చేశారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వార్తకు సంబంధించిన కథనాన్ని కూడా ఆన్లైన్లో పోస్ట్ చేశారు. దేశం గర్వించేలా నిలిచారు: వైఎస్ జగన్ చిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. చిన్నతనంలోనే గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని దేశం యావత్తూ గర్వపడేలా అద్భుతం సాధించారని కొనియాడారు. పూర్ణ, ఆనంద్‌లు మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిదాతలుగా నిలిచారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వారిని తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు, గురువులకూ ఆయన అభినందనలు తెలియజేశారు. టీపీసీసీ తరఫున రూ.5 లక్షలు: పొన్నాల అవకాశాలను అందిపుచ్చుకుని పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన సాహస బాలురకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నజరానా ప్రకటించింది. ఈ ఘనత సాధించిన రాష్ర్ట విద్యార్థులు మాలావత్ పూర్ణ, ఆనంద్‌కుమార్‌లకు రూ. 5 లక్షల చొప్పున నగదు పురస్కారంతో పాటు, వారిని ఘనంగా సన్మానించనున్నట్లు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. ఇక పూర్ణ, ఆనంద్‌లను టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కూడా అభినందించారు. ఎవరెస్ట్ అధిరోహణతో తెలంగాణ గౌరవాన్ని హిమాలయాలంత ఎత్తుకు పెంచారని శ్లాఘించారు. -
ఎవరెస్టుకు చేరువలో తెలుగుతేజాలు
హైదరాబాద్: ఆ ఇద్దరు విద్యార్థుల సంకల్ప బలం ముందు ఎవరెస్టు తలవంచుతోంది. ఆ ఇద్దరు మారుమూల గ్రామాల విద్యార్థులు వయసుకు మించిన సాహసయాత్రకు నడుం బిగించారు. సాంఘిక సంక్షేమశాఖ సహకారంతో భారత జెండాను ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్టు శిఖరాగ్రంపై ఎగురవేయబోతున్నా రు. అన్నీ సవ్యంగా సాగితే ఆదివారం ఉద యం 8కల్లా మువ్వన్నెల జెండాను ఎవరెస్టుపై రెపరెపలాడించేందుకు సన్నద్ధమవుతున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వీరి యాత్ర అత్యంత ప్రమాదకరమైన డెత్జోన్లో సాగుతుందని యాత్రను పర్యవేక్షిస్తున్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ శనివారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రస్తుతం వీరు బేస్ క్యాంప్‌కు 27,390 అడుగుల ఎత్తులో ప్రయాణం సాగిస్తున్నారన్నారు. మరో రెండువేల అడుగులు సాహసయాత్రను పూర్తిచేస్తే.. ఆదివారం ఉదయం 8 గంటల్లోపే లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. సాహసయాత్రకు చేయూత.. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ విద్యార్థులు సాహసయాత్రకు బయలుదేరారు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయికి చెందిన లక్ష్మి, దేవదాస్ వ్యవసాయ కూలీలు. వారి కుమార్తె మాలావత్ పూర్ణ స్వేరోస్(14) ప్రస్తుతం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ 9వ తరగతి చదువుతోంది. ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మి, కొండలరావు దంపతుల కుమారుడు ఆనంద్‌కుమార్(17) అన్నపురెడ్డిపల్లి ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఇద్దరు విద్యార్థులు ప్రముఖ పర్వతారోహకుడు, అర్జున అవార్డు గ్రహీత శేఖర్‌బాబు నేతత్వంలో ఈ సాహసయాత్ర చేస్తున్నారు. వీరితో పాటు వివిధ దేశాలకు చెందిన 30 మంది ఈ సాహసయాత్ర చేస్తున్నారు. వీరు ఎవరెస్టు శిఖరం అధిరోహిస్తే పూర్ణ స్వేరోస్ అత్యంత పిన్నవయస్సులో ఎవరెస్టు అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. -
సిబల్ సహా పలువురి నామినేషన్ల సమర్పణ
న్యూఢిల్లీ: చాందినీచౌక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి కపిల్ సిబల్ గురువారం నామినేషన్ వేశారు. ఇక న్యూఢిల్లీ నుంచి పోటీ కోసం ఆప్ అభ్యర్థి ఆశిష్ ఖేతాన్, ఈశాన్యఢిల్లీలో పోటీ కోసం ఆనంద్‌కుమార్ కూడా నామినేషన్లు సమర్పించారు. బీజేపీ అభ్యర్థి మహేశ్ గిరి తూర్పుఢిల్లీ స్థానం కోసం నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాష్ట్రంలోని ఏడు స్థానాలకు వచ్చే నెల 10 నిర్వహించే ఎన్నికల కోసం గురువారం వరకు 34 మంది నామినేషన్ పత్రాలను అందజేశారని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వీటిలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒకటి చొప్పున, ఆప్ నుంచి రెండు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి మిగతావి వచ్చాయి. ఈ నెల 22 వరకు నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు. 26వ తేదీ వరకు వాటిని ఉపసంహరించుకునేందుకు అవకాశముంది. -
అధ్యాపకుల కొరతే అసలు సమస్య
దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అన్ని స్థాయిల్లోనూ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. యూజీసీ నిబంధనల ప్రకారం దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలను సమర్థంగా నిర్వహిం చేందుకు లక్షలాది మంది అధ్యాపకులు అవసరం. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ పాఠశాలల్లో అవసరమైన వారి కంటే 3 లక్షల మంది ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారు. బీహార్‌లో 2.60 లక్షల మంది తక్కువగా ఉన్నారు. మిగి లిన రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు దేశ విధా న నిర్ణేతలు ఇప్పటికైనా నడుం బిగించాలి. ఒకప్పుడు ఉపాధ్యాయ వృత్తిని ఎక్కువ మంది కోరుకునే వారు. ప్రతిభావంతులైన యువకులకు ఇప్పుడది ఏమాత్రం ఆకర్షణ లేని వృత్తిగా మారింది. ఫలితంగా లక్షలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా మిగులుతున్నాయి. ఇంజనీర్లు, డాక్టర్లు తక్కువమంది ఉన్నా భారత్ నెట్టుకు రాగలదు. అయితే, ఉపాధ్యాయుల సంఖ్య ఇంత తక్కువగా ఉంటే మాత్రం నెట్టుకు రావడం చాలా కష్టం. ఇంజనీరింగ్, మీడియా, మేనేజ్మెంట్ వంటి వృత్తులు భారీ ఆదాయాన్ని ఇస్తుండటంతో నేటి యువత వాటి కోసం పోటీ పడుతోంది. సీవీ రామన్, హోమీ జహంగీర్ బాబా, డాక్టర్ రాజేంద్రప్రసాద్ వంటి నిష్ణాతులను తయా రు చేసిన ఉపాధ్యాయుల వంటి వారు మనకిప్పుడెవరైనా ఉన్నారా?... ఆ ఉపాధ్యాయులకు పెద్దపెద్ద డిగ్రీలు లేకపోవచ్చు. అయితే, బోధన పట్ల వారికి అపరిమితమైన తపన ఉం డేది. విద్యార్థులకు వారు బోధించేటప్పుడు వారి తపన ప్రతిఫలించేది. ప్రస్తుతం విద్యాసంస్థల సంఖ్యలో గణనీయంగా పెరుగుదల కనిపిస్తున్నా, విద్యారంగంలో నాణ్యత తగ్గుతోంది. సమర్థులైన ఉపాధ్యాయులు దేశంలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. దాదాపు 85 శాతం మంది ఉపాధ్యాయులకు వారి పనేమిటో తెలియదు. ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలో నాణ్యమైన బోధన లభించడం లేదు. ఉపాధ్యాయులు సంపూర్ణమైన అవగాహన, తాము బోధించే అంశాలపై లోతైన పరి జ్ఞానాన్ని పెంచుకోవాలి. బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ఉపాధ్యాయులకు స్వీయ అధ్యయనం చాలా ముఖ్యం. అధ్యాపకుల బోధన నిరాసక్తంగా ఉన్నప్పుడే విద్యార్థులు తరగతులను ఎగ్గొడతారు. విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించి, ప్రభావవంతమైన రీతిలో బోధించినట్లయితే, వారు తరగతులను విడిచిపెట్టరు. ఈ పరిస్థితిని చక్కదిద్ది బోధనలో నాణ్యతను మెరుగుపరచేందుకు దేశవ్యాప్తంగా ‘ఉపాధ్యాయులకు బోధన’ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలి. దీనికి కేంద్ర మానవ వనరుల శాఖ, యూజీసీ చొరవ తీసుకోవాలి. ప్రస్తుతం ఉపాధ్యాయుల పరిస్థితి టీవీ సీరియళ్లు, సినిమాల్లో ఎగతాళి చేసే స్థాయికి దిగజారింది. ఉపాధ్యాయ దినోత్సవం ఒక తప్పనిసరి తంతు స్థాయికి దిగజారింది. ఇది చాలా దురదృష్టకరం. మరి కొందరు ఉపాధ్యాయులు కోచింగ్ పరుగు పందెంలో ఉన్నత ప్రమాణాలకు, విలువలకు నీళ్లొదిలేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన తరుణం ఆసన్నమైంది. ఉపాధ్యాయులకు దక్కాల్సిన గౌరవాన్ని వారికి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఉపాధ్యాయుల పట్ల గౌరవం క్షీణించడంలో విద్యార్థుల తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. ఒకవేళ ఉపాధ్యాయుడు ఎవరైనా విద్యార్థిని మందలిస్తే, తల్లిదండ్రులు తేలికగా తీసుకోవాలి. సరైన మార్గం పట్టేలా తమ పిల్లలకు స్ఫూర్తినివ్వాలి. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు, వ్యాపార రంగాల్లో మనకు రోల్ మోడల్స్ ఉన్నట్లే, బోధనా రంగంలోనూ రోల్ మోడల్స్ ఉండాలి. ఆనంద్ కుమార్ సూపర్-30 వ్యవస్థాపకుడు (దశాబ్దానికి పైగా ఏటా ముప్పయి మంది పేద విద్యార్థులకు బీహార్‌లో ఐఐటీ శిక్షణ ఇస్తున్నారు)