డియర్ ఆనంద్ సర్.. జీవితాంతం రుణపడి ఉంటా
రాంచీ: ద్రోహం చేసినవారిని మరిచిపోయినా ఫర్వాలేదుగానీ.. సాయం చేసిన వారిని మాత్రం ఎప్పటికీ మరువకూడదు. ఎందుకంటే వారే మన భవిష్యత్తు బాటలో మరో రాయిని మన జీవిత సౌదానికి అందించిన ఘనులు. వారిపట్ల కృతజ్ఞతా భావంతో ఉండటం దైవలక్షణం. మనం గొప్ప వాళ్లయిన తర్వాత సాయం చేసిన వారికి ఓసారి కృతజ్ఞత భావాన్ని తెలియజేయడం వల్ల దానిని పొందిన వ్యక్తి ఎంత అద్భుతంగా భావిస్తాడో ఊహిస్తేనే అమితానందం.
అయితే, ఇలాంటి కృతజ్ఞతలు పొందేవారు ఈ రోజుల్లో అరుదయ్యారు.. అలా చెప్పేవారు కూడా కరువయ్యారు. కానీ జార్ఖండ్కు చెందిన ఓ పేద విద్యార్థి మాత్రం తాను పొందిన సాయాన్ని మరిచిపోలేదు. ఆ సాయం చేసిన వ్యక్తిని లేఖ ద్వారా అలుముకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనీ అనుకుంటున్నారా.. బీహార్లో ఐఐటీకి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే అత్యున్నత సంస్థ సూపర్ 30 ఇన్స్టిట్యూట్ యజమాని ఆనంద్ కుమార్. సాయం పొందిన బాలుడు రాహుల్ కుమార్(19). ఒకసారి అతడి లేఖను పరిశీలిస్తే..
డియర్ ఆనంద్ సర్,
ధన్యవాదాలు. నా జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిన అందుకు కారణం మీరే. జార్ఖండ్ రాష్ట్రంలోని హజరీబాగ్ జిల్లాలో మా నాన్న ఓ మాములు రైతు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జీవిస్తున్నాం. అక్కడ ఫోన్లు, నెట్ వర్క్లు ఏమీ ఉండవు. ఎలాంటి సౌకర్యాలు ఉండవు. నాకు వివాహం అయిన ఓ సోదరి, పాఠశాలలో చదువుతున్న ఇద్దరు సోదరులు ఉన్నారు.
మా నాన్న సంవత్సరంలో ఐదు నెలలు మాకున్న కొద్దిపాటి భూమిలో సాగు చేస్తారు. అది కూడా వాతావరణం సహకరిస్తేనే. మిగతా రోజుల్లో కోల్ కతా వెళ్లి భవన నిర్మాణ కూలీగా పనులు చేస్తారు. నేను ఒక్కోసారి ఒకపూట భోజనంతోనే సరిపెట్టుకునే ఇంట్లో పెరిగాను.
ఎనిమిదో తరగతిలో ఉండగా నవోదయ పాఠశాలకు ఎంపికయ్యాను. ఆ సమయంలో నేను మా సీనియర్ భరత్ యాదవ్ను గమనించాను. అతడికి ఉన్న అంకితభావం నన్ను అమితంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయనొక ఐఐటీయన్. నేను కూడా మా సీనియర్ అంతటి వాడిని కావాలని మనసులో ప్రతిరోజూ స్మరించుకుంటుంటాను.
పాఠశాల తర్వాత మీ సూపర్-30 ఇన్ స్టిట్యూట్ గురించి విని ఎంతో క్లిష్టమైన ఎంపిక విధానాన్ని దాటుకొని ప్రవేశం పొందాను. ఆనంద్ సర్ మీరే నాకు జీవితంలో అతిపెద్ద స్ఫూర్తి. పెద్దపెద్ద కుటుంబాల మాదిరిగా మా కుటుంబం లక్షల్లో ఫీజులు చెల్లించలేదు. ఈ విషయం గుర్తించిన మీరు నాకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, నా ఖర్చులు భరించి, పోషణ భారాన్ని మోసి ఐఐటీలో ప్రవేశం పొందేందుకు కావాల్సిన నమ్మకాన్ని ధైర్యాన్నిచ్చారు.
నేను ఖరగ్పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదవాలనుకుంటున్నాను. గొప్ప పారిశ్రామికవేత్త కావాలనేది నా లక్ష్యం. అది కూడా ఇండియాలోనే. భారత్లో ఈ రంగంలో సేవలు అందించే అవకాశాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. విదేశాల్లోకి ఎగిరిపోయి అక్కడే ఉండిపోవాలనుకుంటున్నవారిలో నేను ఎప్పటికీ ఉండను. మా అమ్మనాన్నలు ముసలితనంలో ఎలాంటి పనులు చేయలేనందున వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మా గ్రామంలో ఆస్పత్రి కట్టించాలనేది నా ధ్యేయం.
ఐఐటీ ప్రవేశ పరీక్షలో విజయం సాధించిన నన్ను చూసి మా వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. మా అమ్మయితే భావోద్వేగాన్ని ఆపుకోలేక ఆనంద భాష్పాలు రాల్చింది. నాన్న కూడా అంతే. దీనంతటికీ కారణం మీ చలవే. ఐఐటీకి సరిపోయేంత క్వాలిటీ విద్యనందించే పాఠశాలలు మన దేశంలో ఉంటే అంతకంటే మంచి సందర్భం మరొకటి ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో డబ్బులు పెట్టి నాలాంటి వారు చదవలేరు కదా! నాలాంటి వారు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. నేను మాత్రం చాలా అదృష్టవంతుడిని. మీరు నాజీవితంలో ఉండటం మిగతా అన్నింటి కంటే కూడా గొప్ప విషయం... అదృష్టం.. మీకు జీవితాంత రుణపడి ఉంటాను. మీకోసం ఏమైనా చేస్తాను.
చూశారుగా ఎంత పరిపక్వతతో రాహుల్ కుమార్ ఈ లేఖ రాశాడో.. ఇలా ఒక్క రాహులే కాదు.. ఎంతో మంది పేద విద్యార్థులకు ఆనంద్ కుమార్ సేవలు అందిస్తున్నారు.