IIT entrance exam
-
అసలు ఐఐటీలో ఏముంటుంది? ఎందుకు చేర్పించాలి? ఏం నేర్చుకుంటారు?
ఐఐటీలో ఇటీవల జరుగుతున్న ఘటనలు, వివిధ వార్తల నేపథ్యంలో ఒక ఐఐటీ విద్యార్థి పేరుతో Sripati Nagaraju ఫేస్ బుక్‌లో రాసిన అభిప్రాయాన్ని పాఠకులతో షేర్ చేసుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది తల్లితండ్రులు తమ పిల్లలను ఐఐటీల్లో చేర్పించాలన్న తపన పడుతుంటారు. ఇటీవల ఐఐటీల్లో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యల ఘటనలకు సంబంధించిన వార్తలతో కొందరు అసలు ఏం జరుగుతుందని తెలుసుకుంటున్నారు. అలాంటి వారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఒక ఐఐటీ విద్యార్థి అభిప్రాయం IIT లు సృజనాత్మకతకు కేంద్రాలు. ఒక క్రియేటర్ గా ఉండాలనుకున్నవాడికి , ఐఐటీలో వాడి కులమే గుర్తుండదు.. పక్కవాడి కులంతో పనేలేదు. ఒత్తిడి అనేది IITలలో కో కరిక్యులర్, ఎక్సట్రా కరిక్యులర్ యాక్టివిటిస్‌లో, క్లబ్స్‌లో పాల్గొనకుండా నా రూమ్ లో నేను తెగ చదివేసుకుంటాను అనేవాడికి ఉంటుంది. అసలు అలాంటివాళ్ళు IIT లకు పనికి రారు అని అడ్మిషన్ అయిన మొదటిరోజు జరిగే ఓరియంటేషన్ క్లాస్ లోనే ప్రొఫెసర్లు చెప్తారు. Drop outs : వరసగా ఏవైనా రెండు సెమిస్టర్లలో 5 GPA కంటే తక్కువ వస్తే ఆటోమేటిక్ గా రోల్స్ నుండి ఔట్ అవుతారు. Hindi, English లలో నైపుణ్యం పెంచుకోకుండా , సెల్ఫ్ స్టడీ అలవాటు చేస్కోకుండా, క్రియేటివ్ స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా ఉండే స్టూడెంట్ డ్రాప్ అవడానికి అవకాశం ఎక్కువ. Games ఆడకపోవటం వలన ఫిజికల్ ఫిట్నెస్ తగ్గొచ్చేమోగానీ, గెలుపు ఓటములను సమానంగా తీసుకునే తత్వం IITiansకి ఉంటుంది కు ప్రిపేర్ అయ్యే క్రమంలో రాసే వందల ప్రాక్టీస్ టెస్టులు ప్రతీదీ ఒక ఆటే. అందులో తగ్గడం, పడిలేచిన కెరటంలా ఎదగటం మేం నేర్చుకుంటున్నాం. నేర్చుకున్నాం. ఇక IITలలో చేరినాక జిమ్‌లో మన ఫిట్నెస్ పెంచుకోవచ్చు. నచ్చిన స్పోర్ట్స్ ఎంచుకొని ఆడుకోవచ్చు. ప్రిపరేషన్లో భాగంగా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు హ్యపీ ఎంజైమ్స్ రిలీజ్ అవకపోవటం అంటూ ఉండదు. మా ఫన్ మాకు ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులను మిస్ అయినా , చాలా మంది స్నేహితుల ద్వారా ఆ లోటు పూరించుకుంటూ పరీక్షకు చదువుకుంటాం. కాబట్టి ఆ లోటు మాకు లేదు. యూనివర్శిటీలలో కుల వివక్ష ఉండొచ్చేమోగానీ, అత్యుత్తమ IIT లలో కులం తో సాధించేదేమీ లేదు, స్కాలర్ షిప్ తప్ప. అసలు అడ్మిషన్ కోసమే IIT Rank అవసరం. కానీ ఒకసారి అడ్మిట్ అయ్యాక మనకొచ్చిన ర్యాంకు నాలుక గీస్కోటానికి కూడా పనికిరాదు. అసలు IIT లలో నీ ర్యాంకు ఎంత అని అడిగేవాడే ఉండడు. ఈ ర్యాంకు వల్ల విద్యార్థుల్లో ఆత్మన్యూనతకి అవకాశమేలేదు. IIT లో Ph.D లాంటి మహోత్కృష్ఠమైన కోర్స్ లో చేరినవాడు కూడా ఆత్మహత్య చేస్కున్నాడూ అంటే వాడు ఐడియాలజికల్‌గా ఎంతో వెనకబడి ఉన్నాడని అర్థం. దానికీ అసలు ఒత్తిడి అనేమాటే ఉండదు. ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, తల్లిదండ్రుల ప్రవర్తన, ఇలా ఎన్నో పార్శ్వాలు ఆత్మహత్యల వెనక ఉంటాయి. IITల శిక్షణ పేరిట వేల కోట్ల వ్యాపారం జరగొచ్చు గాక. అది IITల బయట విషయం. దానికీ IITలకి సంబంధం లేదు. కార్పొరేట్ కాలేజీలు రాకముందు కూడా 1954 నుండే IIT లు ఉన్నాయి. కార్పొరేట్ వ్యాపార దాహానికి ప్రతిష్టాత్మక IIT లకు సంబంధం లేదు. కార్పోరేట్ కాలేజీల్లో చేర్పిస్తేనే మా IIT లో అడ్మిషన్ ఇస్తాం అని ఏ ఒక్క IIT కూడా చెప్పదు. విద్యార్థి ఇష్టాయిష్టాలు, శక్తి సామర్థ్యాల ప్రకారం తల్లితండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ప్లాన్ చేయాలి. అంతే తప్ప దానికి భిన్నంగా ప్రవర్తించవచ్చు. దురాశ దుఃఖానికి చేటు అనేది ఉండనే ఉంది. అది ఏ రంగం కైనా వర్తిస్తుంది. IIT కి ఒక్కదానికే కాదు. -
డియర్ ఆనంద్ సర్.. జీవితాంతం రుణపడి ఉంటా
రాంచీ: ద్రోహం చేసినవారిని మరిచిపోయినా ఫర్వాలేదుగానీ.. సాయం చేసిన వారిని మాత్రం ఎప్పటికీ మరువకూడదు. ఎందుకంటే వారే మన భవిష్యత్తు బాటలో మరో రాయిని మన జీవిత సౌదానికి అందించిన ఘనులు. వారిపట్ల కృతజ్ఞతా భావంతో ఉండటం దైవలక్షణం. మనం గొప్ప వాళ్లయిన తర్వాత సాయం చేసిన వారికి ఓసారి కృతజ్ఞత భావాన్ని తెలియజేయడం వల్ల దానిని పొందిన వ్యక్తి ఎంత అద్భుతంగా భావిస్తాడో ఊహిస్తేనే అమితానందం. అయితే, ఇలాంటి కృతజ్ఞతలు పొందేవారు ఈ రోజుల్లో అరుదయ్యారు.. అలా చెప్పేవారు కూడా కరువయ్యారు. కానీ జార్ఖండ్‌కు చెందిన ఓ పేద విద్యార్థి మాత్రం తాను పొందిన సాయాన్ని మరిచిపోలేదు. ఆ సాయం చేసిన వ్యక్తిని లేఖ ద్వారా అలుముకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనీ అనుకుంటున్నారా.. బీహార్‌లో ఐఐటీకి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే అత్యున్నత సంస్థ సూపర్ 30 ఇన్స్టిట్యూట్ యజమాని ఆనంద్ కుమార్. సాయం పొందిన బాలుడు రాహుల్ కుమార్(19). ఒకసారి అతడి లేఖను పరిశీలిస్తే.. డియర్ ఆనంద్ సర్, ధన్యవాదాలు. నా జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిన అందుకు కారణం మీరే. జార్ఖండ్ రాష్ట్రంలోని హజరీబాగ్ జిల్లాలో మా నాన్న ఓ మాములు రైతు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జీవిస్తున్నాం. అక్కడ ఫోన్లు, నెట్ వర్క్‌లు ఏమీ ఉండవు. ఎలాంటి సౌకర్యాలు ఉండవు. నాకు వివాహం అయిన ఓ సోదరి, పాఠశాలలో చదువుతున్న ఇద్దరు సోదరులు ఉన్నారు. మా నాన్న సంవత్సరంలో ఐదు నెలలు మాకున్న కొద్దిపాటి భూమిలో సాగు చేస్తారు. అది కూడా వాతావరణం సహకరిస్తేనే. మిగతా రోజుల్లో కోల్ కతా వెళ్లి భవన నిర్మాణ కూలీగా పనులు చేస్తారు. నేను ఒక్కోసారి ఒకపూట భోజనంతోనే సరిపెట్టుకునే ఇంట్లో పెరిగాను. ఎనిమిదో తరగతిలో ఉండగా నవోదయ పాఠశాలకు ఎంపికయ్యాను. ఆ సమయంలో నేను మా సీనియర్ భరత్ యాదవ్‌ను గమనించాను. అతడికి ఉన్న అంకితభావం నన్ను అమితంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయనొక ఐఐటీయన్. నేను కూడా మా సీనియర్ అంతటి వాడిని కావాలని మనసులో ప్రతిరోజూ స్మరించుకుంటుంటాను. పాఠశాల తర్వాత మీ సూపర్-30 ఇన్ స్టిట్యూట్ గురించి విని ఎంతో క్లిష్టమైన ఎంపిక విధానాన్ని దాటుకొని ప్రవేశం పొందాను. ఆనంద్ సర్ మీరే నాకు జీవితంలో అతిపెద్ద స్ఫూర్తి. పెద్దపెద్ద కుటుంబాల మాదిరిగా మా కుటుంబం లక్షల్లో ఫీజులు చెల్లించలేదు. ఈ విషయం గుర్తించిన మీరు నాకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, నా ఖర్చులు భరించి, పోషణ భారాన్ని మోసి ఐఐటీలో ప్రవేశం పొందేందుకు కావాల్సిన నమ్మకాన్ని ధైర్యాన్నిచ్చారు. నేను ఖరగ్‌పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదవాలనుకుంటున్నాను. గొప్ప పారిశ్రామికవేత్త కావాలనేది నా లక్ష్యం. అది కూడా ఇండియాలోనే. భారత్‌లో ఈ రంగంలో సేవలు అందించే అవకాశాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. విదేశాల్లోకి ఎగిరిపోయి అక్కడే ఉండిపోవాలనుకుంటున్నవారిలో నేను ఎప్పటికీ ఉండను. మా అమ్మనాన్నలు ముసలితనంలో ఎలాంటి పనులు చేయలేనందున వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మా గ్రామంలో ఆస్పత్రి కట్టించాలనేది నా ధ్యేయం. ఐఐటీ ప్రవేశ పరీక్షలో విజయం సాధించిన నన్ను చూసి మా వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. మా అమ్మయితే భావోద్వేగాన్ని ఆపుకోలేక ఆనంద భాష్పాలు రాల్చింది. నాన్న కూడా అంతే. దీనంతటికీ కారణం మీ చలవే. ఐఐటీకి సరిపోయేంత క్వాలిటీ విద్యనందించే పాఠశాలలు మన దేశంలో ఉంటే అంతకంటే మంచి సందర్భం మరొకటి ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో డబ్బులు పెట్టి నాలాంటి వారు చదవలేరు కదా! నాలాంటి వారు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. నేను మాత్రం చాలా అదృష్టవంతుడిని. మీరు నాజీవితంలో ఉండటం మిగతా అన్నింటి కంటే కూడా గొప్ప విషయం... అదృష్టం.. మీకు జీవితాంత రుణపడి ఉంటాను. మీకోసం ఏమైనా చేస్తాను. చూశారుగా ఎంత పరిపక్వతతో రాహుల్ కుమార్ ఈ లేఖ రాశాడో.. ఇలా ఒక్క రాహులే కాదు.. ఎంతో మంది పేద విద్యార్థులకు ఆనంద్ కుమార్ సేవలు అందిస్తున్నారు. -
ప్రశాంతంగా ఐఐటీ-జేఈఈ
-
ఐఐటీ.. ఆమడంత దూరం
గ్రామీణ విద్యార్థులకు అందని ద్రాక్షలా ఐఐటీలు వాటిలో నగర విద్యార్థులదే పైచేయి.. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే అత్యధికం అర్హుల్లో అత్యధికులు మనవారే.. రెండోస్థానం రాజస్థాన్‌దే అమ్మాయిలూ తక్కువే.. జాయింట్ అడ్మిషన్ బోర్డు నివేదిక వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఐఐటీ ప్రవేశ పరీక్షకు హాజరైనవారు, అర్హత సాధించిన వారిలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉండగా.. నగరాలు, పట్టణాల విద్యార్థులదే పైచేయిగా నిలిచింది. అలాగే మన రాష్ట్రం.. హాజరైనవారిలో, అర్హత సాధించినవారిలో అగ్రస్థానంలో నిలిచింది. 2013-14 ఐఐటీ అడ్మిషన్ల అనంతరం జాయింట్ అడ్మిషన్ బోర్డు విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఈ ఏడాది అనుసరించిన నూతన విధానాన్ని విశ్లేషిస్తూ పలు గణాంకాలతో ఈ నివేదిక విడుదలైంది. ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్ధేశించిన జేఈఈ-మెయిన్స్ ఉత్తీర్ణుల్లో 1,50,000 మంది విద్యార్థులను మాత్రమే ఈ ఏడాది జేఈఈ-అడ్వాన్స్డ్(ఐఐటీ ప్రవేశ పరీక్ష)కు అనుమతించారు. ఇందులో కూడా 50.5 శాతం(75,750) మందిని కామన్ మెరిట్ లిస్ట్ నుంచి, 27 శాతం(40,500) మందిని ఓబీసీ మెరిట్ లిస్ట్ నుంచి, 15 శాతం(22,500) మందిని ఎస్సీ మెరిట్ లిస్ట్ నుంచి, 7.5 శాతం(11,250) మందిని ఎస్టీ మెరిట్ లిస్ట్ నుంచి ప్రతిభాక్రమంలో ఎంపిక చేశారు. అయితే వీరిలో 1,26,749 మంది అభ్యర్థులు మాత్రమే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 21,110 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 215 కోర్సుల్లో 9,867 ఐఐటీ సీట్లు అందుబాటులో ఉండగా.. 14,336 మందిని తొలి విడత కౌన్సెలింగ్‌కు పిలిచారు. మన రాష్ట్రం నుంచే ఎక్కువ మంది బోర్డుల పరంగా చూస్తే 2013 ఐఐటీ ప్రవేశ పరీక్షకు అర్హత సాధించిన వారిలో సీబీఎస్ఈ బోర్డు విద్యార్థులు అత్యధికంగా 58,587 మంది ఉన్నారు. అయితే వీరంతా విభిన్న రాష్ట్రాలకు చెందిన వారు. రాష్ట్రాల వారీగా చూస్తే మన రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు పరిధిలో ఇంటర్మీడియెట్ చదివిన 17,360 మంది విద్యార్థులు ఐఐటీ ప్రవేశపరీక్షకు అర్హత సాధించారు. కామన్ మెరిట్ లిస్ట్‌లో నిలిచారు. వీరిలో 3,538 మంది పరీక్ష పాసయ్యారు. అటు సీబీఎస్ఈ, ఇటు ఇంటర్ బోర్డు నుంచి మొత్తంగా 3,698(17.75 శాతం) మంది పాసయ్యారు. ఆ తరువాతి స్థానంలో రాజస్థాన్ నుంచి 15,759 మంది హాజరైనప్పటికీ.. అర్హులైన వారిలో వీరి శాతం 17.43గా నిలిచింది. ఉత్తరప్రదేశ్ నుంచి 16,557 మంది పరీక్షకు హాజరైనప్పటికీ.. 2,520 (12.10 శాతం) మంది మాత్రమే అర్హత సాధించడంతో మూడో స్థానంలో నిలిచింది. గ్రామీణ విద్యార్థులు చాలా స్వల్పం.. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులై, ఐఐటీ ప్రవేశ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు 1,26,749 మంది ఉండగా వీరిలో గ్రామీణ విద్యార్థులు కేవలం 16,144(12.74 శాతం) మంది మాత్రమే ఉన్నారు. ఇక వీరిలో ఈ పరీక్ష ఉత్తీర్ణులైంది కేవలం 1,700 మంది. ఐఐటీ ప్రవేశ పరీక్షలో మొత్తం అర్హులు 20,834 మంది ఉండగా.. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు వీరిలో 8.16 శాతమే కావడం గమనార్హం. నగరాల నుంచి హాజరైన వారు 64.78 శాతం ఉండగా.. అర్హత సాధించిన వారిలో 75.85 శాతంగా ఉన్నారు. పట్టణాల నుంచి హాజరైన వారు 22.48 శాతంగా ఉండగా.. అర్హత సాధించిన వారిలో వారు 15.99 శాతంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలదే పైచేయి.. ఈ ఏడాది ఐఐటీ ప్రవేశ పరీక్షకు హాజరైన వారిలోనూ, అర్హత సాధించిన వారిలోనూ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలది పైచేయిగా నిలిచింది. ఈ కేటగిరీలో 36,387 మంది ప్రవేశ పరీక్షకు హాజరవగా.. 6,215 అర్హత సాధించారు. ఆ తరువాత అత్యధిక సం ఖ్యలో పరీక్షకు హాజరైనవారిలో వ్యాపారుల పిల్లలు ఉన్నారు. ఇక తండ్రి నిరక్షరాస్యుడైనా ఐఐటీ ప్రవేశ పరీక్షకు అర్హత సాధించి పరీక్షరాసిన విద్యార్థులు 6,693 మంది ఉండగా.. వీరి లో 540 మంది పాసవడం విశేషం. తల్లిదండ్రులు ఆదాయాన్ని బట్టి చూస్తే ఎక్కువ ఆదాయం ఉన్నవారి పిల్లలే.. అర్హత సాధించిన వారిలో ఎక్కువ శాతం ఉన్నారు. అంటే వీరంతా మెరుగైన శిక్షణ పొందినట్టు అంచనావేయవచ్చు. ఐఐటీ ప్రవేశ పరీక్షల కోచింగ్ వ్యయం భరించగలిగిన వారే ఎక్కువ శాతం అర్హత సాధించినట్టు అర్థం చేసుకోవచ్చు. అన్ని పోటీ పరీక్షల్లో అమ్మాయిలు పైచేయి సాధిస్తున్నప్పటికీ ఈ పరీక్షలో అబ్బాయిలదే పైచేయిగా నిలుస్తోంది. మొత్తంగా 20,834 మంది ఐఐటీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించగా.. వీరిలో అబ్బాయిలు 18,468 మంది ఉండగా.. అమ్మాయిలు కేవలం 2,366 మంది మాత్రమే ఉన్నారు. మన రాష్ట్రం మద్రాస్, ఖరగ్‌పూర్ జోన్(పాక్షికంగా) పరిధిలో ఉంది. మద్రాస్ జోన్ పరిధిలో అబ్బాయిలు 3,603 మంది అర్హత సాధించగా..అమ్మాయిలు 624 మంది మాత్రమే అర్హత సాధించారు. ఖరగ్‌పూర్ జోన్‌పరిధిలో 2,131 మంది పరీక్ష రాయగా.. 236 మంది మాత్రమే అమ్మాయిలు అర్హత సాధించారు.