Super 30 institute in Bihar
-
‘నా సాయం తిరస్కరించారు.. అభినందనలు’
పట్నా : ఐఐటీ జేఈఈ పరీక్షకు సిద్ధం అవుతోన్న వారికి బిహార్‌కు చెందిన ప్రముఖ గణిత వేత్త ఆనంద్ కుమార్ గురించి తెలిసే ఉంటుంది. ప్రతిభావంతులైన 30 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించి.. వారు ఐఐటీలో సీటు సాధించేందుకు తోడ్పడుతూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఆనంద్ కుమార్. ఈ ఐఐటీ ట్యూటర్ జీవిత చరిత్ర ఆధారంగా... బాలీవుడ్లో ‘సూపర్ 30’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఆనంద్ కుమార్ పాత్రలో నటించారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లలోనూ దూసుకుపోతుంది. ఆనంద్ కుమార్ కృషి గురించి తెలుసుకున్న వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. అంతేకాక ‘ఆనంద్ చేస్తోన్న పని గురించి తెలిసి అతడిని అభినందించడానికి వెళ్లాను. నా వంతుగా ఆయనకు ఆర్థిక సాయం చేద్దామని భావించాను. కానీ ఆశ్చర్యం.. ఆనంద్ నా సాయాన్ని తిరస్కరించారు. తన స్వంతంగానే ఈ సూపర్ 30 కార్యక్రమాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయన పట్టుదల చూసి నాకు చాలా ముచ్చటేసింది. ఆయన కృషిని అభినందిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ కుమార్ స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు సార్.. మీ అభినందనలే నాకు ఎంతో బలాన్నిస్తాయి’ అంటూ రీట్వీట్ చేశాడు. Anand Kumar says in the article that he turned down my offer to fund his efforts. I confirm that when we met, he courteously declined my offer of financial support. I remain an admirer of how he’s changed the lives of so many. https://t.co/3Gn3V1Qdlp pic.twitter.com/fAFqYg6UtU — anand mahindra (@anandmahindra) July 13, 2019 ఆనంద్ కుమార్ 2002లో ఈ సూపర్ 30 ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. నైపుణ్యం కలిగిన 30 మంది పేద పిల్లలను ఎంచుకుని వారికి ఉచిత వసతి కల్పిస్తూ పాఠాలు చెప్తుంటారు. మొదటి ఏడాదిలోనే ఈ అకాడమీకి చెందిన 30 మందిలో 18 మంది ఐఐటీకి సెలక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2010 లో ఈ అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థులు ఐఐటీ జేఈఈకి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో ఆనంద్ కుమార్ గురించి దేశవ్యాప్తంగా తెలిసింది. ఫారిన్ మీడియా కూడా ఆనంద్ కుమార్ కృషిని ప్రశంసించింది. -
'సూపర్ 30' ఆనంద్‌కుమార్ ఇంటర్వ్యూ
బాలీవుడ్లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది. సామాన్య ప్రజల అసాధారణ జీవిత చరిత్రలను బయోపిక్‌లుగా మలిచి.. హిట్ మీద హిట్ కొడుతున్నారు. ఈ క్రమంలో వస్తున్న తాజా బయోపిక్ సూపర్ 30. బిహార్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్కుమార్గా ఈ సినిమాలో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించి.. వారు ఐఐటీలో సీటు సాధించేలా చేసిన ఆనంద్‌కుమార్ జీవిత నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు. అయితే మూవీ టైలర్ రిలీజైన తరువాత నుంచి హృతిక్ మాట తీరు, వేషధారణపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. 12 సంవత్సరాలుగా సరైన హిట్‌లేని హృతిక్ ఈ సినిమాతో తనకు మంచి హిట్ దొరుకుతుందని ఆశిస్తున్నాడు. చివరగా 2017లో కాబిల్ చిత్రంలో కనిపించిన హృతిక్ దాదాపు రెండేళ్ల తర్వాత సూపర్30 సినిమాతో జూలై 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘సూపర్ 30’ ఇన్స్టిట్యూట్ అధినేత, ప్రముఖ గణిత శాస్త్రవేత ఆనంద్‌కుమార్‌ను ఇండియా టుడే పలుకరించింది. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సూపర్ 30 సినిమాకు ముందు ఆ సినిమా డైరెక్టర్ వికాస్ భల్ ఎవరో తనకు తెలియదని, సూపర్‌హిట్ అయిన క్వీన్ మూవీని ఆయన డైరెక్ట్ చేసిన విషయం కూడా తెలియదని ఆనంద్‌కుమార్ చెప్పారు. సూపర్ 30 సినిమా చర్చల్లో భాగంగా డైరెక్టర్ వికాస్ ఫైనల్ స్ర్కిప్ట్‌ను తీసుకురావడానికి పన్నెండుసార్లు కథలో మార్పులు చేశారన్నారు. ఈ సినిమా కోసం హృతిక్ భోజ్‌పురి(బిహారీ)ను నేర్చుకున్నాడని తెలిపారు. ఈ సినిమాను నిర్మిస్తున్న సమయంలో తనతోపాటు వికాస్‌కు కూడా సమస్యలు ఎదురయ్యాయని, వికాస్ భల్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే, ఈ వ్యవహారంలో కోర్టు అతనికు క్లీన్చిట్ ఇచ్చిందని, చేసిన కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడూ దక్కుతుందని, అందుకే ఆయనకు క్లీన్చిట్ లభించి.. చిత్ర దర్శకుడిగా క్రెడిట్ కూడా దక్కిందని తెలిపారు. ఐఐటీ సీటు సాధించిన తమ ఇన్స్టిట్యూట్కు చెందిన 30 మంది విద్యార్థుల పేర్లు వెల్లడించలేదంటూ గౌహతీ ఐఐటీకి చెందిన నలుగురు విద్యార్థులు తనకు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్ వేశారని ఆనంద్ చెప్పుకొచ్చారు. అయితే, అస్సాంకు చెందిన ఆ నలుగురు విద్యార్థులను తనను ఎన్నడూ కలవలేదన్నారు. కొందరు పెద్దల ఒత్తిడి కారణంగానే వారు పిల్ వేశామని ఒప్పుకొన్నారని, తనపై దాడికి యత్నించడమే కాకుండా మళ్లీ పిల్ వేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారని, వారి పేర్లను వెల్లడించడానికి తనకు ఇష్టం లేదని ఆనంద్ చెప్పారు. తనకు రక్షణగా బీహార్ ప్రభుత్వం నలుగురు కమాండోలను నియమించిందన్నారు. తన జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతున్న సూపర్ 30 మూవీకి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, దర్శకుడు వికాస్‌భల్ తగిన న్యాయం చేశారన్నారు. సినిమా చూస్తే అసలు వాస్తవం తెలుస్తుందన్నారు. -
లెక్కలు చెప్తా
...అంటున్నారు హృతిక్ రోషన్. ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారేమోనని పొరపాటు పడకండి. ఎందుకంటే ఆయన బీహార్‌కు చెందిన ఆనంద్‌కుమార్ బయోపిక్‌లో నటించబోతున్నారు. ఆనంద్‌కుమార్ ఎవరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదూ! ‘సూపర్30’ ప్రోగ్రామ్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు ప్రముఖ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) సంస్థల్లో ఆడ్మిషన్ పొందేలా కృషి చేస్తున్న మ్యాథమ్యాటిషియన్ ఆనంద్‌కుమార్. రీల్‌పై ఆనంద్కుమార్గా కనిపించడానికి రెడీ అయ్యారు హృతిక్. హిందీలో ‘క్వీన్’, ‘షాందార్’ సినిమాలకు దర్శకత్వం వహించిన వికాస్ బాల్ ‘సూపర్ 30’ టైటిల్‌తోనే ఈ సినిమా రూపొందించనున్నారు. వచ్చే ఏడాది నవంబర్ 23న సినిమాను విడుదల చేయన్నట్లు ప్రకటించారు. -
డియర్ ఆనంద్ సర్.. జీవితాంతం రుణపడి ఉంటా
రాంచీ: ద్రోహం చేసినవారిని మరిచిపోయినా ఫర్వాలేదుగానీ.. సాయం చేసిన వారిని మాత్రం ఎప్పటికీ మరువకూడదు. ఎందుకంటే వారే మన భవిష్యత్తు బాటలో మరో రాయిని మన జీవిత సౌదానికి అందించిన ఘనులు. వారిపట్ల కృతజ్ఞతా భావంతో ఉండటం దైవలక్షణం. మనం గొప్ప వాళ్లయిన తర్వాత సాయం చేసిన వారికి ఓసారి కృతజ్ఞత భావాన్ని తెలియజేయడం వల్ల దానిని పొందిన వ్యక్తి ఎంత అద్భుతంగా భావిస్తాడో ఊహిస్తేనే అమితానందం. అయితే, ఇలాంటి కృతజ్ఞతలు పొందేవారు ఈ రోజుల్లో అరుదయ్యారు.. అలా చెప్పేవారు కూడా కరువయ్యారు. కానీ జార్ఖండ్‌కు చెందిన ఓ పేద విద్యార్థి మాత్రం తాను పొందిన సాయాన్ని మరిచిపోలేదు. ఆ సాయం చేసిన వ్యక్తిని లేఖ ద్వారా అలుముకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనీ అనుకుంటున్నారా.. బీహార్‌లో ఐఐటీకి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే అత్యున్నత సంస్థ సూపర్ 30 ఇన్స్టిట్యూట్ యజమాని ఆనంద్ కుమార్. సాయం పొందిన బాలుడు రాహుల్ కుమార్(19). ఒకసారి అతడి లేఖను పరిశీలిస్తే.. డియర్ ఆనంద్ సర్, ధన్యవాదాలు. నా జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిన అందుకు కారణం మీరే. జార్ఖండ్ రాష్ట్రంలోని హజరీబాగ్ జిల్లాలో మా నాన్న ఓ మాములు రైతు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జీవిస్తున్నాం. అక్కడ ఫోన్లు, నెట్ వర్క్‌లు ఏమీ ఉండవు. ఎలాంటి సౌకర్యాలు ఉండవు. నాకు వివాహం అయిన ఓ సోదరి, పాఠశాలలో చదువుతున్న ఇద్దరు సోదరులు ఉన్నారు. మా నాన్న సంవత్సరంలో ఐదు నెలలు మాకున్న కొద్దిపాటి భూమిలో సాగు చేస్తారు. అది కూడా వాతావరణం సహకరిస్తేనే. మిగతా రోజుల్లో కోల్ కతా వెళ్లి భవన నిర్మాణ కూలీగా పనులు చేస్తారు. నేను ఒక్కోసారి ఒకపూట భోజనంతోనే సరిపెట్టుకునే ఇంట్లో పెరిగాను. ఎనిమిదో తరగతిలో ఉండగా నవోదయ పాఠశాలకు ఎంపికయ్యాను. ఆ సమయంలో నేను మా సీనియర్ భరత్ యాదవ్‌ను గమనించాను. అతడికి ఉన్న అంకితభావం నన్ను అమితంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయనొక ఐఐటీయన్. నేను కూడా మా సీనియర్ అంతటి వాడిని కావాలని మనసులో ప్రతిరోజూ స్మరించుకుంటుంటాను. పాఠశాల తర్వాత మీ సూపర్-30 ఇన్ స్టిట్యూట్ గురించి విని ఎంతో క్లిష్టమైన ఎంపిక విధానాన్ని దాటుకొని ప్రవేశం పొందాను. ఆనంద్ సర్ మీరే నాకు జీవితంలో అతిపెద్ద స్ఫూర్తి. పెద్దపెద్ద కుటుంబాల మాదిరిగా మా కుటుంబం లక్షల్లో ఫీజులు చెల్లించలేదు. ఈ విషయం గుర్తించిన మీరు నాకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, నా ఖర్చులు భరించి, పోషణ భారాన్ని మోసి ఐఐటీలో ప్రవేశం పొందేందుకు కావాల్సిన నమ్మకాన్ని ధైర్యాన్నిచ్చారు. నేను ఖరగ్‌పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదవాలనుకుంటున్నాను. గొప్ప పారిశ్రామికవేత్త కావాలనేది నా లక్ష్యం. అది కూడా ఇండియాలోనే. భారత్‌లో ఈ రంగంలో సేవలు అందించే అవకాశాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. విదేశాల్లోకి ఎగిరిపోయి అక్కడే ఉండిపోవాలనుకుంటున్నవారిలో నేను ఎప్పటికీ ఉండను. మా అమ్మనాన్నలు ముసలితనంలో ఎలాంటి పనులు చేయలేనందున వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మా గ్రామంలో ఆస్పత్రి కట్టించాలనేది నా ధ్యేయం. ఐఐటీ ప్రవేశ పరీక్షలో విజయం సాధించిన నన్ను చూసి మా వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. మా అమ్మయితే భావోద్వేగాన్ని ఆపుకోలేక ఆనంద భాష్పాలు రాల్చింది. నాన్న కూడా అంతే. దీనంతటికీ కారణం మీ చలవే. ఐఐటీకి సరిపోయేంత క్వాలిటీ విద్యనందించే పాఠశాలలు మన దేశంలో ఉంటే అంతకంటే మంచి సందర్భం మరొకటి ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో డబ్బులు పెట్టి నాలాంటి వారు చదవలేరు కదా! నాలాంటి వారు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. నేను మాత్రం చాలా అదృష్టవంతుడిని. మీరు నాజీవితంలో ఉండటం మిగతా అన్నింటి కంటే కూడా గొప్ప విషయం... అదృష్టం.. మీకు జీవితాంత రుణపడి ఉంటాను. మీకోసం ఏమైనా చేస్తాను. చూశారుగా ఎంత పరిపక్వతతో రాహుల్ కుమార్ ఈ లేఖ రాశాడో.. ఇలా ఒక్క రాహులే కాదు.. ఎంతో మంది పేద విద్యార్థులకు ఆనంద్ కుమార్ సేవలు అందిస్తున్నారు.