బాలీవుడ్‌లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతోంది. సామాన్య ప్రజల అసాధారణ జీవిత చరిత్రలను బయోపిక్‌లుగా మలిచి.. హిట్ మీద హిట్ కొడుతున్నారు. ఈ క్రమంలో వస్తున్న తాజా బయోపిక్ సూపర్ 30. బిహార్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్‌గా ఈ సినిమాలో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించి.. వారు ఐఐటీలో సీటు సాధించేలా చేసిన ఆనంద్‌కుమార్ జీవిత నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు.
అయితే మూవీ టైలర్ రిలీజైన తరువాత నుంచి హృతిక్ మాట తీరు, వేషధారణపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. 12 సంవత్సరాలుగా సరైన హిట్‌లేని హృతిక్ ఈ సినిమాతో తనకు మంచి హిట్ దొరుకుతుందని ఆశిస్తున్నాడు. చివరగా 2017లో కాబిల్ చిత్రంలో కనిపించిన హృతిక్ దాదాపు రెండేళ్ల తర్వాత సూపర్30 సినిమాతో జూలై 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ‘సూపర్ 30’ ఇన్‌స్టిట్యూట్ అధినేత, ప్రముఖ గణిత శాస్త్రవేత ఆనంద్‌కుమార్‌ను ఇండియా టుడే పలుకరించింది. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సూపర్ 30 సినిమాకు ముందు ఆ సినిమా డైరెక్టర్ వికాస్ భల్ ఎవరో తనకు తెలియదని, సూపర్‌హిట్ అయిన క్వీన్ మూవీని ఆయన డైరెక్ట్ చేసిన విషయం కూడా తెలియదని ఆనంద్‌కుమార్ చెప్పారు. సూపర్ 30 సినిమా చర్చల్లో భాగంగా డైరెక్టర్ వికాస్ ఫైనల్ స్ర్కిప్ట్‌ను తీసుకురావడానికి పన్నెండుసార్లు కథలో మార్పులు చేశారన్నారు. ఈ సినిమా కోసం హృతిక్ భోజ్‌పురి(బిహారీ)ను నేర్చుకున్నాడని తెలిపారు. ఈ సినిమాను నిర్మిస్తున్న సమయంలో తనతోపాటు వికాస్‌కు కూడా సమస్యలు ఎదురయ్యాయని, వికాస్ భల్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయితే, ఈ వ్యవహారంలో కోర్టు అతనికు క్లీన్‌చిట్ ఇచ్చిందని, చేసిన కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడూ దక్కుతుందని, అందుకే ఆయనకు క్లీన్‌చిట్ లభించి.. చిత్ర దర్శకుడిగా క్రెడిట్ కూడా దక్కిందని తెలిపారు.
ఐఐటీ సీటు సాధించిన తమ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 30 మంది విద్యార్థుల పేర్లు వెల్లడించలేదంటూ గౌహతీ ఐఐటీకి చెందిన నలుగురు విద్యార్థులు తనకు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్ వేశారని ఆనంద్ చెప్పుకొచ్చారు. అయితే, అస్సాంకు చెందిన ఆ నలుగురు విద్యార్థులను తనను ఎన్నడూ కలవలేదన్నారు. కొందరు పెద్దల ఒత్తిడి కారణంగానే వారు పిల్ వేశామని ఒప్పుకొన్నారని, తనపై దాడికి యత్నించడమే కాకుండా మళ్లీ పిల్ వేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారని, వారి పేర్లను వెల్లడించడానికి తనకు ఇష్టం లేదని ఆనంద్ చెప్పారు. తనకు రక్షణగా బీహార్ ప్రభుత్వం నలుగురు కమాండోలను నియమించిందన్నారు. తన జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతున్న సూపర్ 30 మూవీకి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, దర్శకుడు వికాస్‌భల్ తగిన న్యాయం చేశారన్నారు. సినిమా చూస్తే అసలు వాస్తవం తెలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment