అదిరిపోయే డ్యాన్సులు, నటనతో బాలీవుడ్ గ్రీక్ గాడ్‌గా ఫేమ్ తెచ్చుకున్న కథా నాయకుడు హృతిక్‌రోషన్. 2017లో కాబిల్ లాంటి వైవిధ్యమైన చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో దాదాపు రెండున్నర సంవత్సరాల విరామం తర్వాత సూపర్–30తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణనిస్తూ ఐఐటీలకు పంపుతూ పేరు గడించిన ప్రముఖ గణితవేత్త ఆనంద్‌కుమార్ జీవిత గాథతో తీసిన సూపర్ 30 సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి వాటిని ఈ చిత్రం ఎంతమేర అందుకుందో తెలుసుకుందాం..
కథ:
బిహార్‌లోని పాట్నాలో ఉండే ఆనంద్‌కుమార్‌కు గణితం అంటే ఎనలేని ఆసక్తి. ఆ ఇష్టంతోనే తక్కువ కాలంలో గణితంపై పట్టు తెచ్చుకొని, ప్రఖ్యాత కేంబ్రిడ్జి వర్సిటీలో సీటు దక్కించుకుంటాడు. కానీ పేదింట్లో పుట్టిన ఆనంద్ ఆర్థిక సమస్యలతో కేంబ్రిడ్జికి వెళ్లలేకపోతాడు. అదే సమయంలో అతని కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలతో అతడి చదువు ఆగిపోతుంది. కుటుంబ పోషణ కోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో క్లాసులు చెప్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. కానీ ఓ రాత్రి ఒక బాలుడు, రిక్షా కార్మికుడితో జరిపే సంభాషణతో తీవ్ర వేదనకు గురైన ఆనంద్ ఉద్యోగం మానేసి, పేద పిల్లలకు ఉచితంగా ఐఐటీ శిక్షణ ఇవ్వాలన్న నిర్ణయానికి వస్తాడు. సొంత అకాడమీని నెలకొల్పి, నైపుణ్యం కలిగిన 30 మంది పేద పిల్లలను ఎంచుకుని వారికి ఉచిత వసతి కల్పిస్తూ పాఠాలు చెప్తుంటాడు. తమ కోచింగ్ వ్యాపారానికి ఆనంద్ చర్యలతో నష్టమని గ్రహించిన ప్రైవేటు శిక్షణ సంస్థ యజమాని ఆదిత్య శ్రీవాత్సవ, రాజకీయ నాయకుడు పంకజ్ త్రిపాఠీ ఆనంద్‌పై కక్ష కడతారు. చివరికి వారు ఆనంద్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఏం చేశారు? తను శిక్షణనిస్తున్న పిల్లలకు ఐఐటీలో సీట్లు తీసుకురావాలన్న ఆనంద్‌కుమార్ కల నెరవేరిందా లేదా అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటులు:
ఆనంద్‌కుమార్ పాత్రలో హృతిక్‌రోషన్ జీవించాడనే చెప్పాలి. ఆ పాత్రలో హృతిక్ ఒదిగిన తీరు అద్భుతం. చాలా చోట్ల ఆయన కళ్లతో, హావభావాలతో సన్నివేశాలకు అదనపు హంగులద్దాడు. కేంబ్రిడ్జిలో సీటు వచ్చే సీన్, పతాక సన్నివేశాల్లో హృతిక్ నటన ఆడియన్స్‌ను సీట్ల నుంచి కదలనివ్వకుండా చేస్తుంది. కొన్ని సీన్లలోనే కనపడినా క్లాసికల్ డ్యాన్స్, మంచి లుక్స్‌తో రితూ పాత్రలో కథానాయిక మృనాల్ ఠాకూర్ ఆకట్టుకుంది. హీరో తండ్రి పాత్రలో నటించిన సీనియర్ నటుడు వీరేందర్ సక్సేనా సహజసిద్ధ నటనతో మెప్పించాడు. కోచింగ్ సెంటర్ యజమానిగా బాగా నటించిన ఆదిత్య శ్రీవాత్సవ పాత్ర కథను కీలక మలుపు తిప్పుతుంది. రాజకీయ నాయకుడిగా పంకజ్ త్రిపాఠీ పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఆనంద్‌కుమార్ తమ్ముడు ప్రణవ్ కుమార్‌గా నటించిన నందిష్ సింగ్ చక్కని నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. ఆనంద్ వద్ద శిక్షణ పొందే పిల్లలుగా నటించిన వారందరూ ఆకట్టుకున్నారు. విలేకరిగా నటించిన అమిత్ సాద్‌తోపాటు మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు.
విశ్లేషణ:
ఆదర్శంగా నిలిచే ఆనంద్‌కుమార్ జీవితాన్ని అంతే స్ఫూర్తిమంతంగా తెరకెక్కించి, ప్రేక్షకుల ముందుంచడంలో దర్శకుడు వికాస్ భల్ విజయవంతమయ్యాడు. పాత్రల చిత్రణ, వాటి తాలూకు సంఘర్షణకు తెరరూపమివ్వడంలో ఆయన సఫలమయ్యాడు. చిన్న పిల్లల నుంచి తనకు కావాల్సిన నటనను రప్పించుకోవడం, హృతిక్‌ను పాత్రకు తగ్గట్లుగా మలచడంలో సక్సెస్ అయ్యాడు. కథనంలో వేగం తగ్గిన్నప్పుడల్లా సున్నితమైన హాస్యంతో సినిమాను నిలబెట్టాడు. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకున్న హృతిక్ రోషన్ స్టార్ ఇమేజ్ తాలూకు ఛాయలు పాత్రలో కనపడనీయకుండా అద్భుతమైన నటనను కనబరిచారు. బిహారీ హిందీ యాసలో హృతిక్, పంకజ్ త్రిపాఠీ, వీరేందర్ సక్సేనాలు తమ డైలాగులు, నటనతో పేక్షకుల్ని మాయ చేస్తారు. అనయ్ గోస్వామి తన కెమెరా పనితనంతో పాట్నా వీధులు, పేదల జీవితాలను బాగా చూపాడు. అజయ్–అతుల్ సంగీతం కథలో భాగంగా సాగగా.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సంజీవ్ దత్తా రాసిన సంభాషణలు మనసుకు హత్తుకునేలా, పొట్టచెక్కలయ్యేలా, ఆలోచింపజేసేలా ఉన్నాయి. స్ఫూర్తినింపుతూ సందేశాన్నిచ్చే కథ, నటీనటుల సహజమైన నటన, చక్కని వినోదం, హృతిక్‌ను కొత్తగా చూపిన విధానం కలగలిపిన ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుందనడంలో సందేహం లేదు.
టైటిల్: సూపర్ 30 (హిందీ చిత్రం)
జానర్: బయోగ్రఫీ
నటీనటులు: హృతిక్ రోషన్, మృణాల్ ఠాకూర్, పంకజ్ త్రిపాఠీ, వీరేందర్ సక్సేనా, అమిత్ సాద్, నందిష్ సింగ్, ఆదిత్య శ్రీవాత్సవ
సంగీతం: అజయ్ గోగావలే –అతుల్ గోగావలే
నిర్మాత: అనురాగ్ కశ్యప్, మధు మంతెన వర్మ, సాజిద్ నదియాడ్‌వాలా
దర్శకత్వం: వికాస్ భల్
– నిధాన్ సింగ్ పవార్
Comments
Please login to add a commentAdd a comment