పట్నా: హృతిక్ రోషన్ తాజా సినిమా ‘సూపర్ 30’ విడుదల చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ మ్యాథమేటిషియన్ ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అయితే, తన ‘సూపర్ 30’ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఎక్కువమంది విద్యార్థులను ఐఐటీలో చేరుస్తున్నట్టు ఆనంద్‌కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో ఆయన వ్యాఖ్యలు అవాస్తవమని పలువురు ఐఐటీ విద్యార్థులు న్యాయస్థానంలో గత ఏడాది పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ విచారణలో ఉండగానే ఆనంద్‌కుమార్ జీవితాన్ని గొప్పగా చూపిస్తూ సినిమా ఎలా విడుదల చేస్తారని ఈ పిల్ దాఖలు చేసిన విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పిల్ దాఖలు చేసిన ఐఐటీ విద్యార్థులైన అవినాశ్ బారో, బికాస్ దాస్, మోన్‌జిత్ దోలే, ధనిరాం థా.. ‘సూపర్ 30’ సినిమా విడుదలను ఆపాలంటూ మరో వ్యాజ్యం వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక కేసు నమోదైన వ్యక్తిపై.. ఆ కేసు తేలకముందే సినిమా ఎలా విడుదల చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
ఆనంద్‌కుమార్‌పై తీసిన సినిమా నిజాలను ప్రతిబింబించినట్టు కనిపించడం లేదని, సినిమాకు నష్టం చేయాలన్నది తమ ఉద్దేశం కానప్పటికీ.. అతనిపై వచ్చిన అభియోగాలకు ఇప్పటివరకు సరైన సమాధానం ఆనంద్‌కుమార్ ఇవ్వాలేదని విద్యార్థుల తరఫు న్యాయవాది అమిత్ గోయల్ తెలిపారు. 2018లో తమ ఇన్‌స్టిట్యూట్ నుంచి 26మంది విద్యార్థులు ఐఐటీలో చేరారని ఆనంద్‌కుమార్ చెప్పుకున్నారని, కానీ, ఐఐటీలో చేరిన ఆ 26 మంది విద్యార్థులెవరో.. వారి పేర్లు వెల్లడించాలని కోర్టులో కోరినా.. ఇప్పటివరకు ఆయన ఆ వివరాలు తెలుపలేదని పిటిషనర్లు అంటున్నారు. నిరుపేద కుటంబాలకు చెందిన విద్యార్థులకు స్వయంగా కోచింగ్ ఇచ్చి.. ప్రతి సంవత్సరం వారు ఐఐటీల్లో చేరేలా కృషి చేస్తున్న ఆనంద్‌కుమార్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన జీవితాన్ని తెరమీద ఆవిష్కరిస్తూ.. హృతిక్ రోషన్ హీరోగా ‘సూపర్ 30’ సినిమా తెరకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment