iit students
-
ఐఐటీ విద్యార్థులకు విదేశాల రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) అంటే ప్రపంచంలోనే పేరెన్నికగన్న సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటి. ఐఐటీలో సీటు వస్తే ఆ విద్యార్థి అతను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మార్గం ఏర్పడినట్టే. అత్యున్నత శిక్షణలో రాటు దేలే ఐఐటీ విద్యార్థులంటే విదేశీ సంస్థలకూ క్రేజే. అందుకే భారత ఐఐటీ విద్యార్థులకు విదేశాలు రాచబాట పరుస్తున్నాయి. వారికి విదేశీ సంస్థలు ఉద్యోగ, ఉన్నత విద్యాభ్యాసం అందించేందుకు పోటీ పడుతున్నాయి. తత్ఫలితంగా దేశం నుంచి మేధో వలసలో ఐఐటీ విద్యార్థులే అత్యధిక శాతం ఉంటున్నారు. దేశంలో ఐఐటీల నుంచి ఏటా పట్టా పొందుతున్న విద్యార్థుల్లో మూడోవంతు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఐఐటీల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షల ద్వారా దేశంలో అత్యంత ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు. అక్కడ శిక్షణ పొందిన వారిని అత్యుత్తమ మానవ వనరులుగా ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు, ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు భారత ఐఐటీ విద్యార్థులకు పెద్దపీట వేస్తున్నాయని అమెరికాకు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రిసెర్చ్ (ఎన్‌బీఈఆర్) తాజా నివేదిక వెల్లడించింది. దేశంలోని 23 ఐఐటీలలోని 16,598 సీట్ల భర్తీ కోసం ఈ ఏడాది నిర్వహించిన పరీక్ష కోసం 1,89,744 మంది విద్యార్థులు పోటీ పడ్డారని ఆ నివేదిక పేర్కొంది. దేశంలోని ఐఐటీలలో కూడా చెన్నై, ముంబై, ఖరగ్‌పూర్, ఢిల్లీ, కాన్పూర్ ఐఐటీల విద్యార్థులకు మల్టీ నేషనల్ కంపెనీలు మరింత పెద్దపీట వేస్తున్నాయని తెలిపింది. ఎన్‌బీఈఆర్ నివేదికలోని ప్రధాన అంశాలు సంక్షిప్తంగా.. ► భారత్‌లో ఐఐటీల నుంచి ఏటా పట్టా పొందుతున్న విద్యార్థుల్లో 35 శాతం విదేశాలకు వెళ్లిపోతున్నారు ► ఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో టాప్–1000లో నిలుస్తున్న విద్యార్థుల్లో 36 శాతం మంది విదేశాల బాట పడుతున్నారు. ► భారత ఐఐటీయన్ల ప్రధాన గమ్యస్థానం అమెరికా. విదేశాలకు వెళుతున్న ఐఐటీయన్లలో 65 శాతం అమెరికాకే వెళ్తున్నారు. వారిలో 85 శాతం మంది అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి అక్కడే ప్రముఖ కంపెనీల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి సీఈవోల వరకు బాధ్యతలు చేపడుతున్నారు. ► ప్రపంచంలో 50 విదేశీ విద్యా సంస్థల విద్యార్థులకు బ్రిటన్ హైపొటెన్షియల్ ఇండివిడ్యువల్ వీసాలు జారీ చేస్తోంది. వారిలో భారత ఐఐటీ విద్యార్థులే మొదటి స్థానంలో ఉన్నారు. ► భారత ఐఐటీ అంటే విదేశీ సంస్థలకు ఎంతటి క్రేజ్ ఉందో చెప్పడానికి వారణాశిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయమే (బీహెచ్‌యూ) తార్కాణం. బీహెచ్‌యూకు ఐఐటీ హోదా కల్పించిన తరువాత ఆ సంస్థలోని విద్యార్థులకు విదేశాల్లో ప్లేస్‌మెంట్స్ ఏకంగా 540 శాతం పెరగడం విశేషం. -
ఐఐటీల ప్రవేశాల్లో తెలుగు విద్యార్థులు భేష్!
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు గణనీయ సంఖ్యలో సీట్లు కొల్లగొట్టారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా సక్సెస్ రేటును పరిశీలిస్తే.. ఏపీ, తెలంగాణ టాప్–5 రాష్ట్రాల్లో ఉండటం విశేషం. భర్తీ అయిన మొత్తం 16,635 సీట్లలో 18.5 శాతం సీట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకోవడం విశేషం. సక్సెస్ రేటులో ముందు వరుసలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో, తెలంగాణ ఐదో స్థానంలో నిలిచాయి. కాగా మొదటి స్థానంలో రాజస్థాన్, రెండో స్థానంలో మహారాష్ట్ర ఉండగా నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. భర్తీ అయిన మొత్తం సీట్లలో సగానికి పైగా ఈ ఐదు రాష్ట్రాల విద్యార్థులకే దక్కడం విశేషం. అగ్రస్థానంలో రాజస్థాన్.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఐటీల్లో సీట్లను కైవసం చేసుకున్న విద్యార్థుల్లో 15 శాతం సక్సెస్ రేట్‌తో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. రాజస్థాన్ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరైన 13,801 మందిలో 2,184 మంది ఐఐటీల్లో చేరారు. రాజస్థాన్ తర్వాత సక్సెస్ రేటులో మహారాష్ట్ర నిలిచింది. ఈ రాష్ట్రం నుంచి 16,341 మంది అడ్వాన్స్‌డ్‌కు హాజరు కాగా 1,747 మంది (సక్సెస్ రేటు 10.69) ఐఐటీల్లో సీట్లు సాధించారు. సక్సెస్ రేటులో మూడో స్థానంలో ఏపీ నిలిచింది. ఏపీ నుంచి 14,364 మంది పరీక్షరాయగా 1,428 మంది ఐఐటీల్లో ప్రవేశం పొందారు. సక్సెస్ రేటు పరంగా నాలుగో స్థానంలో నిలిచిన ఉత్తరప్రదేశ్ నుంచి 22,807 మంది పరీక్ష రాయగా 2,131 మంది ఐఐటీల్లో చేరారు. ఐదో స్థానంలో నిలిచిన తెలంగాణ నుంచి 17,891 మంది హాజరు కాగా 1,644 మందికి (సక్సెస్ రేటు 9.18) సీట్లు లభించాయి. ఐఐటీలన్నీ హౌస్‌ఫుల్.. కాగా ఈ ఏడాది ఐఐటీల్లో దాదాపు అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. కొన్ని కొత్త ఐఐటీలు మినహా ప్రముఖ ఐఐటీలన్నింటిలో సీట్లు పూర్తిగా నిండాయి. ప్రముఖ ఐఐటీల్లో అయితే మొత్తం సీట్ల కంటే అదనంగా సీట్లను కేటాయించడం విశేషం. తమ సంస్థల్లో చేరడానికి వచ్చే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అవసరమైతే అదనంగా సీట్లు కేటాయించుకునేలా ఆయా ఐఐటీలకు స్వయంప్రతిపత్తి ఉంది. దీంతో పలు సంస్థలు అదనపు ప్రవేశాలు కల్పించాయి. 2022–23 విద్యాసంవత్సరానికి ఐఐటీల్లో 16,598 సీట్లు ఉన్నట్టు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సెలింగ్‌కు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో 1,567 సీట్లు మహిళల కోసం సూపర్ న్యూమరరీ కోటాలో కేటాయించారు. కాగా ఆరు విడతల కౌన్సెలింగ్ తర్వాత మొత్తం సీట్లు 16,598 మించి ప్రవేశాలు ఉండడం విశేషం. ఐఐటీ బాంబే విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మొత్తం 16,635 సీట్లు భర్తీ అయ్యాయి. మహిళలకు సూపర్ న్యూమరరీ కోటా కింద కేటాయించిన సీట్లు 1,567తోపాటు ఇతర కేటగిరీల్లో ప్రతిభ ఆధారంగా మరో 1,743 సీట్లు దక్కాయి. ప్రముఖ ఐఐటీల్లో అదనంగా సీట్ల కేటాయింపు.. విద్యార్థులు మొదటి ప్రాధాన్యం ఇచ్చే ఐఐటీ బాంబేలో 1,360 సీట్లుండగా ఆ సంస్థ 1,371 మందికి ప్రవేశాలు కల్పించింది. అలాగే ఐఐటీ ఢిల్లీలో మొత్తం సీట్లు 1,209 కాగా 1,215 మందిని చేర్చుకుంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 1,869 సీట్లు ఉండగా 1,875 సీట్లు కేటాయించింది. వీటితోపాటు ఐఐటీ మద్రాస్, కాన్పూర్, హైదరాబాద్, రూర్కీ, తిరుపతి, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, ఇండోర్ వంటి చోట్ల కూడా మొత్తం సీట్లకు మించి భర్తీ చేశారు. అలాగే డ్యూయెల్ డిగ్రీలకు సంబంధించి 102 సీట్లు కూడా భర్తీ అయినట్టు ఐఐటీ బాంబే గణాంకాలు పేర్కొంటున్నాయి. ఐఐటీ జోధ్‌పూర్, రోపార్, ధార్వాడ్, జమ్మూ, వారణాసి, ధన్‌బాద్‌ల్లో మాత్రమే స్వల్పంగా సీట్లు మిగిలాయి. ఐఐటీ బాంబే వైపే టాపర్ల మొగ్గు.. కాగా ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ 1,000 ర్యాంకులు సాధించినవారిలో ఏకంగా 246 మంది ఐఐటీ బాంబేను ఎంచుకోవడం విశేషం. ఆ తర్వాత 210 మంది అభ్యర్థులతో ఐఐటీ ఢిల్లీ నిలిచింది. -
స్వదేశీ త్రీడీ ప్రింటెడ్ మానవ కార్నియా
బంజారాహిల్స్ (హైదరాబాద్): భారతదేశంలో మొదటిసారిగా త్రీడీ ప్రింటెడ్ మానవ కార్నియాను బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, సీసీఎంబీ, ఐఐటీ విద్యార్థులు అభివృద్ధి చేశారు. యుద్ధ సమయంలో సైనికులకు వ్యక్తిగతంగా కార్నియల్ గాయాలు తగిలినప్పుడు, లేదా తృతీయ నేత్ర సంరక్షణ సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాల్లో కంటిచూపు అందించడానికి ఇది దోహదపడుతుంది. మేడిన్ ఇండియా ప్రొడక్ట్‌లో భాగంగా భారతీయ వైద్యులు, శాస్త్రవేత్తల బృందం కార్నియల్ అంధత్వానికి చవకైన పరిష్కారాన్ని అందజేసింది. మానవదాత కార్నియల్ టిష్యూ నుంచి త్రీడీ ప్రింటెడ్ కార్నియాను ఈ బృందాలు అభివృద్ధి చేశాయి. ప్రభుత్వం, దాతృత్వ నిధుల ద్వారా దీన్ని దేశీయంగా అభివృద్ధి చేశారు. ఇందులో సింథటిక్ భాగాలు జంతువుల అవశేషాలు లేకుండా రోగులకు ఉపయోగించడానికి సురక్షితమైనవిగా, సహజమైనవిగా ఈ ప్రొడక్ట్‌ను తయారు చేసినట్లు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చెందిన ప్రధాన పరిశోధకులు డాక్టర్ సయ్యన్ బసూ, డాక్టర్ వివేక్‌సింగ్ తెలిపారు. కార్నియా పారదర్శకంగా లేకుండా మారడం లేదా కార్నియా క్రమంగా సన్నగా మారడం వంటి వ్యాధుల చికిత్సలో అద్భుతమైన, చౌకగా అందించగలిగే ఆవిష్కరణ ఇది అన్నారు. ఈ త్రీడీ ప్రింటెడ్ కార్నియా తయారు చేయడానికి ఉపయోగించే బయో ఇంక్, కార్నియల్ చిల్లులను మూసివేయడానికి, యుద్ధ సంబంధితమైన గాయాల సమయంలో ఇన్ఫెక్షన్ నిరోధించడానికి, గాయపడ్డ ప్రదేశంలో చూపు కోల్పోకుండా సహాయ పడుతుందని వెల్లడించారు. కార్నియా అనేది కంటి ముందు పొర అని, ఇది కాంతిని కేంద్రీకరించడంలో చూపు స్పష్టంగా ఉండటంతో సహాయ పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.5 మిలియన్లకు పైగా కొత్త కార్నియల్ బ్లైండ్నెస్ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. -
ఐఐటీ విద్యార్థులు కనిపెట్టిన కొత్త యంత్రం
-
శానిటైజర్ యంత్రం..ఏవైనా శుభ్రం చేయచ్చు
-
ఈ ఫ్యాన్‌కు ఉరేసుకోలేరు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకోవాలనే విద్యార్థుల ప్రయత్నాలను అడ్డుకోవడంపై చెన్నై ఐఐటీ దృష్టి సారించింది. ఉరేసుకునేందుకు వీలు లేకుండా సీలింగ్ ఫ్యాన్‌లో ప్రత్యేక స్ప్రింగ్ అమర్చేందుకు పరిశో«ధనలు జరుగుతున్నాయి. ఐఐటీల్లో ప్రొఫెసర్ల వల్ల, జాతి, మత, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో కొందరు విద్యార్థులు మధ్యలోనే ఐఐటీని వదిలి వెళ్లిపోతుండగా, మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. చెన్నై ఐఐటీలో 2016 నుంచి ఈ ఏడాది వరకు ఒక మహిళా ప్రొఫెసర్ సహా 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనలపై మానవవనరులశాఖ చెన్నై ఐఐటీని మందలించింది. దీంతో ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆత్మహత్యల్లో ఎక్కువశాతం మంది సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు గుర్తించారు. ఫ్యాన్‌లో స్ప్రింగ్ లాంటి పరికరాన్ని అమర్చేందుకు పరిశోధనలు మొదలుపెట్టారు. ఎవరైనా ఊగినా, అదనపు బరువుతో వత్తిడి కలగజేసినా ఆ స్ప్రింగ్ సాగిపోయి ఫ్యాన్ కిందకు జారిపోతుంది. ఉరివేసుకున్న వారు సీలింగ్ ఫ్యాన్‌తో సహా కిందకు పడిపోతారు. -
ఆనంద్‌కుమార్ అబద్ధాలు.. చిక్కుల్లో ‘సూపర్ 30’
పట్నా: హృతిక్ రోషన్ తాజా సినిమా ‘సూపర్ 30’ విడుదల చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ మ్యాథమేటిషియన్ ఆనంద్‌కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అయితే, తన ‘సూపర్ 30’ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎక్కువమంది విద్యార్థులను ఐఐటీలో చేరుస్తున్నట్టు ఆనంద్‌కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో ఆయన వ్యాఖ్యలు అవాస్తవమని పలువురు ఐఐటీ విద్యార్థులు న్యాయస్థానంలో గత ఏడాది పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ విచారణలో ఉండగానే ఆనంద్‌కుమార్ జీవితాన్ని గొప్పగా చూపిస్తూ సినిమా ఎలా విడుదల చేస్తారని ఈ పిల్ దాఖలు చేసిన విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పిల్ దాఖలు చేసిన ఐఐటీ విద్యార్థులైన అవినాశ్ బారో, బికాస్ దాస్, మోన్‌జిత్ దోలే, ధనిరాం థా.. ‘సూపర్ 30’ సినిమా విడుదలను ఆపాలంటూ మరో వ్యాజ్యం వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక కేసు నమోదైన వ్యక్తిపై.. ఆ కేసు తేలకముందే సినిమా ఎలా విడుదల చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆనంద్‌కుమార్‌పై తీసిన సినిమా నిజాలను ప్రతిబింబించినట్టు కనిపించడం లేదని, సినిమాకు నష్టం చేయాలన్నది తమ ఉద్దేశం కానప్పటికీ.. అతనిపై వచ్చిన అభియోగాలకు ఇప్పటివరకు సరైన సమాధానం ఆనంద్‌కుమార్ ఇవ్వాలేదని విద్యార్థుల తరఫు న్యాయవాది అమిత్ గోయల్ తెలిపారు. 2018లో తమ ఇన్స్టిట్యూట్ నుంచి 26మంది విద్యార్థులు ఐఐటీలో చేరారని ఆనంద్‌కుమార్ చెప్పుకున్నారని, కానీ, ఐఐటీలో చేరిన ఆ 26 మంది విద్యార్థులెవరో.. వారి పేర్లు వెల్లడించాలని కోర్టులో కోరినా.. ఇప్పటివరకు ఆయన ఆ వివరాలు తెలుపలేదని పిటిషనర్లు అంటున్నారు. నిరుపేద కుటంబాలకు చెందిన విద్యార్థులకు స్వయంగా కోచింగ్ ఇచ్చి.. ప్రతి సంవత్సరం వారు ఐఐటీల్లో చేరేలా కృషి చేస్తున్న ఆనంద్‌కుమార్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన జీవితాన్ని తెరమీద ఆవిష్కరిస్తూ.. హృతిక్ రోషన్ హీరోగా ‘సూపర్ 30’ సినిమా తెరకెక్కింది. -
ఐఐటీ విద్యార్థులు క్షేమం
సిమ్లా/సాక్షి ప్రతినిధి, చెన్నై: హిమాచల్‌ప్రదేశ్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లి అనూహ్యంగా చిక్కుకుపోయిన రూర్కీ ఐఐటీ విద్యార్థులను సైన్యం సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. వీరితోపాటు తమిళనాడుకు చెందిన 33 మంది విద్యార్థులు, 29 మంది ఉపాధ్యాయులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఐఐటీ రూర్కీకి చెందిన 45 మంది ఐఐటీ విద్యార్థులు రొహ్తంగ్ కనుమల్లో ట్రెక్కింగ్ కోసం రెండురోజుల క్రితం వచ్చారు. మంచు కురుస్తుండటంతో ట్రెక్కింగ్‌కు వెళ్లిన కొండ ప్రాంతంలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న లాహౌల్– స్పిటి జిల్లా అధికారులు విద్యార్థులతోపాటు సుమారు 500 మందిని మంగళవారం సురక్షిత ప్రాంతానికి తరలించి, వసతి కల్పించారు. ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన సైన్యం హెలికాప్టర్ల దారా వారిని బయటకు తీసుకువచ్చింది. తమిళనాడులోని వివిధ ప్రైవేటు పాఠశాలలకు చెందిన 33 మంది విద్యార్థులు, 29 మంది టీచర్లు మనాలిలో సురక్షితంగా ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. మంచు కురుస్తుండటంతో లాహౌల్– స్పిటి జిల్లా కేంద్రం కీలాంగ్లో అత్యల్పంగా 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాలతో అతలాకుతలమవుతున్న హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి మంగళవారం కాస్త మెరుగైంది. వరదలతో రూ.1,200 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం జైరాం ఠాకూర్ తెలిపారు. -
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆపన్నహస్తం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వరదల్లో చిక్కుకుని సాయం కోసం ఎదురుచూస్తున్న కేరళవాసులకు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఓవైపు సాంకేతికంగా సహకారం అందిస్తూ, మరోవైపు బాధి తులకు అవసరమైన దుస్తులు, ఇతర వస్తు సామగ్రిని సమకూర్చే పనిలో నిద్రాహారాలు లేకుండా పని చేస్తున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇందులో ఐఐటీ హైదరాబాద్ ఎన్ఎస్ఎస్ విభాగంతోపాటు, కేరళకు చెందిన విద్యార్థులు పాలుపంచుకుం టున్నారు. చెన్నై, ముంబై, బెంగళూరుల్లోని తమ మిత్ర బృందాలను భాగస్వాములను చేస్తున్నారు. 30 వేల మంది ఫోన్ నంబర్లు వరద బాధితుల సమాచారాన్ని తెలుసుకునేందుకు కేరళ ఐటీ విభాగం ‘కేరళ రెస్క్యూ డాట్‌కామ్’పేరిట ఓ వెబ్సైట్ ఏర్పాటు చేసింది. వేలాది మంది వరద బాధితులు తమను ఆదుకోవాలంటూ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ వెబ్సైట్ నుంచి ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన కొందరు కేరళ విద్యార్థులు సుమారు 30 వేల మంది వరద బాధితుల ఫోన్ నంబర్లు సేకరించారు. ఈ నంబర్లను గ్రూపులుగా విభజించి ఐఐటీ హైదరాబాద్‌తోపాటు, ముంబై, బెంగళూరు, చెన్నైలోని తమ మిత్ర బృందాలకు పంపించారు. క్లాస్ రూమ్‌ను కాల్ సెంటర్‌గా మార్చుకున్నారు. ఒక్కో సభ్యుడు కనీసం 50 నుంచి వంద మంది బాధితులతో మాట్లాడి వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చే బాధ్యతను తీసుకున్నారు. బాధితులతో నేరుగా సంభాషణ బాధితులతో ఫోన్లో సంభాషిస్తున్న విద్యార్థులు.. వారి వివరాలను సేకరించి సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులు, రెస్క్యూ బృందాలతో సమన్వయం చేస్తున్నారు. గత గురువారం ఒక్కరోజే తాము ఏడు వేల మంది బాధితులతో సంభాషించినట్లు ఐఐటీహెచ్ విద్యార్థిని అనఘ ‘సాక్షి’కి వెల్లడించారు. సెల్ ఫోన్ నెట్వర్క్ కొన్నిచోట్ల దెబ్బతినడంతో బాధితులను అందరినీ చేరుకోలేకపోయినట్లు విద్యార్థి బృందం తెలిపింది. గత గురువారం నుంచి ఆదివారం వరకు మొత్తంగా సుమారు 30 వేల మందిని సంప్రదించగలిగామని చెప్పారు. విరాళాలు, సామగ్రి సేకరణ ఓ వైపు వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేరేలా చూస్తూనే, మరోవైపు బాధితులకు ధన, వస్తు రూపంలో సాయం అందించడంపైనా విద్యార్థులు దృష్టి సారించారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లోని 12 హాస్టళ్లతోపాటు సిబ్బంది నుంచి ఇప్పటి వరకు 2.50 లక్షలకు పైగా రూపాయాలను విరాళాలు సేకరించి కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించారు. అంతేకాకుండా విద్యార్థులు, సిబ్బంది నుంచి రూ.4 లక్షలకు పైగా విలువ చేసే దుస్తులు, ఔషధాలు, సెల్‌ఫోన్ చార్జర్లు, టార్చ్లైట్లు, బ్లాంకెట్లు, చెప్పులు తదితర సామగ్రిని సేకరించారు. ఈ వస్తువుల నాణ్యతను సరిచూసిన తర్వాతే ప్యాక్ చేస్తుండటం విశేషం. కొచ్చిలో పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ వస్తువులను వరద బాధితులకు అందేలా ఏర్పాటు చేసినట్లు కణ్ణన్ అనే విద్యార్థి తెలిపారు. నిరంతరాయంగా సంప్రదించాం.. కేరళ వరదలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్టింగులతో అప్రమత్తమయ్యాం. వెంటనే బృందాలుగా ఏర్పడ్డాం. కేరళ ప్రభుత్వ వెబ్‌సైట్‌కు కుప్పలు తెప్పలుగా వస్తున్న అభ్యర్థనలను స్వీకరించి, ఫోన్ల ద్వారా బాధితులను నిరంతరాయంగా సంప్రదిస్తూ వచ్చాం. గత నాలుగు రోజుల్లో కనీసం 30 వేల మంది బాధితులను మా బృందం ఫోన్ ద్వారా సంప్రదించి, వారి వివరాలను కంట్రోల్ రూమ్, రెస్క్యూ బృందాలకు అందిస్తూ వచ్చింది. ఎవరెవరు, ఎక్కడెక్కడ చిక్కుకున్నారో చెబుతూ, బాధితులు సురక్షిత ప్రాంతాలకు చేరుకునేంత వరకు ఫాలో అప్ చేస్తూ వచ్చాం. – అనురాగ్ అశోకన్, ఐఐటీహెచ్ ఉద్యోగి మా శ్రమకు ఫలితం దక్కింది పతనందిట్ట, తిరువల్లూరు తదితర ప్రాంతాల్లో వరద బీభత్సం ఎక్కువగా ఉంది. పథనంథిట్ట జిల్లాలోని మా సొంతూరు కోజెన్చెర్రిలో ఇళ్లు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. మా మందుల దుకాణం కూడా మునిగిపోయింది. అక్కడి ఆస్పత్రిలోని రోగులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలంటూ అభ్యర్థనలు అందాయి. మా బృందం సాయంతో వారిని రక్షించాం. వేలాది మందిని ఫోన్లో సంప్రదించి వరదల నుంచి బయట పడేలా చూశాం. ప్రాంతాలకు అతీతంగా ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు మాకు సహకరిస్తున్నారు. మా శ్రమకు ఫలితం దక్కింది. – దివిజ, రీసెర్చ్ అసోసియేట్, ఐఐటీహెచ్ -
మళ్లీ తెరపైకి హోమో సెక్సువల్ అంశం...
సాక్షి, న్యూఢిల్లీ: హోమో సెక్సువల్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎల్జీబీటీ( లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) కమ్యూనిటీ లైంగిక ప్రాధామ్యాలను పరిరక్షించేందుకు భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిని గురువారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేయాలని కోరుతూ 20 మంది ఐఐటీ విద్యార్థులు ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారణ చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది. అయితే తదుపరి వాదనల తేదీ ఎప్పుడన్నది బెంచ్ స్పష్టం చేయలేదు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్-377 ప్రకారం సజాతి లైంగిక కార్యకలాపాలు నేరంగా పరిగణిస్తారు. దీనిని రద్దు చేయాలని దశాబ్దాలుగా గే హక్కుల కార్యకర్తలు న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ అంశంపై గతంలో చాలా వరకు పిటిషన్లపై తీర్పు పెండింగ్‌లో ఉన్నాయి కూడా. ఓవైపు ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీబీటీ హక్కులను అనేక దేశాలు గుర్తిస్తూ వస్తున్నప్పుడు పౌరుల హక్కులను దెబ్బతీసే ఇలాంటి చట్టాలను ఎత్తివేయడమే మంచిదన్న ఓ అభిప్రాయం వ్యక్తమవుతుండగా.. మరోవైపు అసహజ శృంగారాన్ని ప్రోత్సహించే అంశం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందేమోనన్న ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ సెక్షన్ ఎత్తివేయాల్సిందిగా 2000 సంవత్సరంలోనే లా కమిషన్ సిఫార్సు చేసింది. అయినా వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఎక్కడ సనాతన ధర్మాలు కలిగిన ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోందన్న భయం. 2009లో ఢిల్లీ హైకోర్టు సెక్షన్ 377ను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అయితే 2013, డిసెంబర్ 11న హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు విభేదించింది. తన నిర్ణయాన్ని సమీక్షించాల్సిందిగా దాఖలైన పిటిషన్లను 2014, జనవరి 28న సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సెక్షన్ కింద శిక్ష పడేది అతి కొద్ది మందికే కనుక పౌరుల ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలిగినట్లు కాదంటూ సుప్రీం కోర్టు భాష్యం చెప్పింది. 1950 నుంచి ఇప్పటి వరకు ఇండియన్ పీనల్ కోడ్‌కు 30 సార్లు సవరణలు చేసినా.. సెక్షన్ 377 జోలికి మాత్రం పోలేదు. -
కొత్త రాజకీయ పార్టీ.. ‘బాప్’!
న్యూఢిల్లీ : రాజకీయాలంటేనే బురద..అందులోకి దిగడం అంటే ఊబిలోకి దిగినట్టే అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచేవారు చాలా మందే ఉంటారు. కానీ మేము ఆ కోవకు చెందిన వాళ్లం కాదంటున్నారు ఐఐటీ పూర్వ విద్యార్థులు. తాము కేవలం మాటలకు పరిమితం కాదని.. లక్షల జీతాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధం అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల హక్కులను కాపాడటమే ధ్యేయంగా పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ‘బహుజన్ ఆజాద్ పార్టీ’ పేరిట ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించామని బృంద నాయకుడు నవీన్ కుమార్ తెలిపాడు. 50 మందితో మా ప్రయాణం మొదలు.. ఐఐటీ పూర్వ పూర్వ విద్యార్థులైన 50 మంది బృందంగా ఏర్పడి రాజకీయ పార్టీ స్థాపించాలనే నిర్ణయానికి వచ్చామని నవీన్ కుమార్ తెలిపారు. ఎన్నికల సంఘం గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ పార్టీ రాజకీయ ప్రస్థానం మొదలుపెడతామని భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు. బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయుల ఫొటోలతో కూడిన పోస్టర్ రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు. తమ పార్టీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, సిద్దాంతపరంగా కూడా తమకు ఎవరితో విభేదాలు ఉండబోవని తెలిపారు. కాగా ఈ బృందంలో అత్యధిక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. -
టెక్నోక్రాట్ల రాజకీయ పార్టీ !
రాజకీయాల్లో మార్పు కోసం, అణగారిన వర్గాల హక్కుల్ని కాపాడడం కోసం ఒక కొత్త పార్టీ పురుడు పోసుకుంటోంది. ఇదేదో ఒక వ్యక్తి కనుసన్నుల్లో నడిచే పార్టీ కాదు. మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యంగా కొంత మంది ఐఐటీ నిపుణులు జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. ఢిల్లీ, ఖరగపూర్కు చెందిన 50 మంది ఐఐటీ నిపుణులు బహుజన్ ఆజాద్ పార్టీ (బీఏపీ) పేరుతో ఒక కొత్త పార్టీ స్థాపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2015 సంవత్సరంలో ఢిల్లీ ఐఐటీలో పట్టా పొందిన నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ పార్టీ నడవబోతోంది. ’ పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న దాదాపు 50 మంది నిపుణులు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కొత్త పార్టీ విధివిధానాలపై భారీగా కసరత్తు చేస్తున్నారు. మాకు కొందరు సివిల్ సర్వీసు అధికారులు కూడా బయట నుంచి మద్దతు ఇస్తారు‘ అని నవీన్‌కుమార్ తెలిపారు. పార్టీకి సేవలందించేవారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారేనని, అందుకే వాళ్ల స్థితిగతులపై తమకు చాలా అవగాహన ఉందని నవీన్‌కుమార్ వెల్లడించారు. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్రం ఎన్నికల సంఘాన్ని కూడా సంప్రదించారు. 2020 బిహార్ ఎన్నికల్లో పోటీ అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలో ఆప్ రాజకీయాల్లో ఒక సంచలనాన్ని సృష్టించినట్టే బహుజన్ ఆజాద్ పార్టీ (బాప్) ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మేధోమథనం జరుగుతోంది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత పోటీ చేసి, ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యా, న్యాయ రంగాల్లో అణగారిన వర్గాల పాత్ర చాలా పరిమితంగా ఉండడంతో వారి హక్కుల్ని కాపాడడంపైనే కొత్త పార్టీ ప్రధానంగా దృష్టి సారించనుంది. స్వాగతిస్తున్న వివిధ వర్గాలు రాజకీయాల్లో కుళ్లును కడిగేసే విధంగా ఒక ఉప్పెనలా కొత్త తరం రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దళితులు, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్న తరుణంలో వారి గళాన్ని వినిపించడం కోసం నవయువకులైన కొందరు ఐఐటీ నిపుణులు ముందుకు రావడంపై దళిత సంఘాలు, రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘. కొంతమంది ఐఐటీ నిపుణులు ప్రధాన రాజకీయాల్లోకి రావడం అభినందించాల్సిన విషయం. రాజకీయాల్లో దిగ్గజాలైన కాంగ్రెస్, బీజేపీతో పోరాటం కోసం కాకుండా, బహుజనుల అభ్యున్నతి కోసం పోరాటం సాగిస్తే ఆ రాజకీయ పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని‘ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. -
ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించండి
ఐఐటీ విద్యార్థులకు సీఐఐ చైర్పర్సన్ శోభన కామినేని పిలుపు - 474 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం - సంగారెడ్డి జిల్లా కందిలో ఘనంగా ఐఐటీ ఆరో స్నాతకోత్సవం సాక్షి, సంగారెడ్డి: ఉత్పత్తి రంగం సామర్థ్యం పెరుగుతున్నా ఆ మేరకు ఉద్యోగావకాశాలు పెరగడం లేదని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షురాలు శోభన కామినేని అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కందిలో సంస్థ హైదరాబాద్ పాలక మండలి చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఐఐటీ హైదరాబాద్ ఆరో స్నాతకోత్సవ సభలో ఆమె మాట్లాడారు. యువత శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే శక్తి ఆధునిక భారతానికి ఉందని, డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. వివిధ రంగాల్లో ఉత్పాదకతను ఒక శాతం పెంచడం ద్వారా భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. తద్వారా కొత్తగా 50 లక్షల ఉద్యోగాలతో పాటు, ప్రతీ పది మందిలో తొమ్మిది మంది పేదరికం నుంచి బయట పడతారన్నారు. 85 శాతం మంది నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయని శోభన పేర్కొన్నారు. రవాణా, సాంకేతికత కలబోత ద్వారా స్పేస్ ఎక్స్, హైపర్‌లూప్ వంటి అద్భుత ఆవిష్కరణలు జరుగుతున్నాయని వివరించారు. రోబోటిక్స్, ఆరోగ్య రంగం భాగస్వామ్యం.. శస్త్ర చికిత్సల ముఖచిత్రాన్ని మార్చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రాబోయే రెండు, మూడు దశాబ్దాల్లో దేశంలోని సగానికి పైగా జనాభా పట్టణాల్లో ఉంటుందని, ఈ నేపథ్యంలో వందలాది పట్టణాలు స్మార్ట్ సిటీలుగా మారేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ఆరోగ్య సేవలు, రక్షిత తాగునీరు, వ్యవసాయం, ప్రపంచ శాంతి, సైబర్, సరిహద్దుల రక్షణతో పాటు ఉద్యోగాల కల్పన అతి పెద్ద సవాలుగా నిలుస్తాయని చెప్పారు. ఉద్యోగ అవకాశాలను సృష్టించండి చదువు ముగించుకుని వెళ్తున్న ఐఐటీ విద్యా ర్థులు ఉద్యోగ అవకాశాలను సృష్టించడంపై దృష్టి సారించాలని ఐఐటీ హైదరాబాద్ పాలక మండలి చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు జరగాలన్నారు. బోధన, మానవ వనరులు, ఉత్తీర్ణత వంటి అంశాల్లో ఐఐటీ హైదరాబాద్ నానాటికీ మెరుగవుతోం దన్నారు. ఐఐటీహెచ్‌లో 3,238 మంది విద్యా ర్థులు 14 విభాగాల్లో చదువుతున్నారని సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీ దేశాయ్ తెలిపారు. ఐఐటీ హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.232 కోట్ల మేర నిధులతో పరిశోధనలు జరుగు తున్నాయన్నారు. జపాన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్, తైవాన్, స్విట్జర్లాండ్ తదితర దేశాలతో తమ సంస్థ పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొ నేందుకు రూపొందించాల్సిన సాంకేతికతపై జపాన్‌కు చెందిన కియో యూనివర్సిటీ పర్యావరణ, సమాచార శాస్త్రాల డీన్ ప్రొఫెసర్ జూన్ మురయ్ ప్రసంగించారు. 473 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం స్నాతకోత్సవం సందర్భంగా బీటెక్, ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంఫిల్, పీహెచ్డీ తదితర కోర్సులకు సంబంధించి 473 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. బీటెక్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన జోషి కేయూర్ ప్రయాగ్, అర్జున్ వీ.అనంద్, ఎమ్మెస్సీలో త్రిష భట్టాచార్య, ఎంటెక్‌లో తివారి రామయజ్ఞ బంగారు పతకాలు అందుకున్నారు. స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులు పోచంపల్లి ఖాదీ కండువాలతో హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
31 మంది విద్యార్థులకు జైకా స్కాలర్షిప్లు
గడిచిన మూడేళ్లలో మొత్తం 31 మంది విద్యార్థులకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) స్కాలర్షిప్లు అందాయని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ తెలిపింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మానవ వనరుల శాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ఐఐటీల విద్యార్థులు జపాన్ విశ్వవిద్యాలయాల్లో చదువుకోడానికి వీలుగా జైకా రుణాలు ఏమైనా ఇస్తున్నారా, అలాగైతే ఆంధ్రప్రదేశ్ నుంచి గత మూడేళ్లలో ఎంతమంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు అందాయని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. జైకా, ఇతర సంస్థల నిధులతో ఏడు ఐఐటీలలో అంతర్జాతీయ స్థాయి ల్యాబ్‌లు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా.. అలా అయితే ఎక్కడెక్కడ అని కూడా అడిగారు. అయితే, ల్యాబ్‌ల ఏర్పాటు ప్రతిపాదన ఏమీ లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు జపాన్‌లోని వివిధ యూనివర్సిటీలలో చదువుకోడానికి వీలుగా జైకా స్కాలర్షిప్లు ఇస్తుందని, అందుకోసం అక్కడి యూనివర్సిటీల ప్రతినిధులు ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ, స్క్రీనింగ్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారని ఆ సమాధానంలో తెలిపారు. గత మూడేళ్లలో ఈ స్కాలర్‌షిప్‌లకు 31 మంది ఎంపికయ్యారని, 2013లో 9 మంది, 2014లో 12 మంది, 2015లో 10 మంది ఎంపికయ్యారని వివరించారు. ఈ ఏడాది ఆ స్కాలర్షిప్కు 13 మంది ఎంపికయ్యారని, వారిలో నలుగురు ఏపీ/ తెలంగాణల నుంచి ఉన్నారని చెప్పారు. -
భారత అండర్ గ్రాడ్యుయేట్స్ అద్భుతసృష్టి
ఫార్ములా1 కారును తయారుచేసిన ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులు కోల్‌కతా: రష్యాలో జరిగే అంతర్జాతీయ పోటీలో పాల్గొనేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులు ఓ ఫార్ములా 1 రేసింగ్ కారును తయారు చేశారు. ఈ కారుకు ‘కే-3’గా నామకరణం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే కాంపిటీషన్లో 800 మంది విద్యార్థులతో కూడిన 30 బృందాలు పాల్గొంటాయి. ఇప్పటికే మూడు రేసింగ్ కార్లను తయారు చేసిన ఖరగ్‌పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఈసారి తక్కువ బరువు, ఎక్కువ మైలేజీ సామర్థ్యం కలిగిన కే-3ని తయారు చేశారు. ఈ కారు బరువు కేవలం 220 కిలోలు మాత్రమే. గతంలో రూపొందించిన కార్లు కేవలం 2 కిలోమీటర్ల మైలేజీ మాత్రమే ఇచ్చేవని, అందుకే కార్బన్ ఫైబర్ ప్యానల్స్‌ను ఉపయోగించి ఈ తక్కువ బరువున్న కారును తయారు చేశామన్నారు. ఈ కారును తయారు చేసిన విద్యార్థులంతా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులే కావడం గమనార్హం. అయితే పూర్వ విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఈ సరికొత్త కారును రూపొందించామని టీమ్ లీడర్ కేతన్ ముంధ్రా తెలిపారు. -
జైపూర్ ను వెనక్కునెట్టిన ఢిల్లీ
ముంబై: దేశరాజధాని ఢిల్లీ నుంచి ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు ఐఐటీకి ఎంపికయ్యారు. జైపూర్ ను అధిగమించి మొదటి స్థానానికి చేరుకుంది. జైపూర్ లో ఎక్కువగా శిక్షణ సంస్థలు ఉండడంతో అక్కడి విద్యార్థులు అధిక సంఖ్యలో ఐఐటీలకు అర్హత సాధిస్తున్నారు. టాప్-10లో మూడు మహారాష్ట్ర నగరాలు ముంబై, పుణే, నాగపూర్ ఉన్నాయి. ముంబై తన స్థానాన్ని మెరుగుపరుచుకుని ఆరు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. మధ్యప్రదేశ్ నగరాలు భోపాల్, ఇండోర్ కు చోటు దక్కింది. గత రెండేళ్ల నుంచి టాప్-10లో జైపూరే ముందు ఉంది. గతేడాది ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, పాట్నా, ముంబై ఉన్నాయి. 15 నగరాలకు చెందిన విద్యార్థులే 50 శాతం ఐఐటీ సీట్లు దక్కించుకోవడం విశేషం. ఈ నగరాలకు నుంచి 14,385 మంది విద్యార్థులు ఐఐటీకి అర్హత సాధించారు. ఐఐటీ అభ్యర్థులు ఇచ్చిన చిరునామా ఆధారంగా ఈ జాబితా తయారు చేశారు. -
కోటి రూపాయల ఆఫర్‌ను తిరస్కరించారు!
న్యూఢిల్లీ: ఏడాదికి కోటి రూపాయల జీతమంటే ఐఐటీ విద్యార్థులు ఎగిరిగంతేసేవారు. విదేశాలకు వెళ్లాలనే మోజుతో ఈ ఆఫర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూసేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. విదేశాల్లో పనిచేయడం కోసం ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు ఏడాదికి దాదాపు కోటి రూపాయలకు పైగా జీతాన్ని ఆఫర్ చేయగా.. ఢిల్లీ ఐఐటీకి చెందిన నలుగురు విద్యార్థులు తిరస్కరించారు. జీతం కాస్త తక్కువయినా స్వదేశంలో పనిచేసేందుకు మొగ్గుచూపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' ఈ మార్పునకు కారణమని భావిస్తున్నారు. గూగుల్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రతిష్టాతక కంపెనీలు ప్రతి ఏడాది ఢిల్లీలో ఐఐటీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటాయి. ప్రతిభావంతులైన ఉద్యోగులకు భారీ జీతాన్ని ఆఫర్ చేస్తుంటాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది ఢిల్లీ ఐఐటీకి చెందిన ఎనిమిదిమంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఒక్కొక్కరి జీతం ఏడాదికి దాదాపు కోటి రూపాయలకు పైనే. అయితే నలుగురు విద్యార్థులు ఈ భారీ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్టు ప్లేస్మెంట్ సెల్లో చెప్పారు. అంతర్జాతీయ కంపెనీల్లోనే భారత్‌లో కాస్త తక్కువ జీతంతో పనిచేస్తామని చెప్పారు. విదేశీ కంపెనీలు 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో ఉత్పత్తులు ప్రారంభించడం దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నది దీని లక్ష్యం. -
ఐఐటీ విద్యార్థులపై వేతన ఒత్తిళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఐఐటీలో సీటు వచ్చిందంటే చాలు.. నాలుగేళ్లు గడిస్తే రూ.కోట్లలో వేతనాలు.. సంతోషకరమైన జీవితం.. ఇవీ ఐఐటీల్లో సీట్లు పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలు.. ఆకాంక్షలు. కానీ భారీ వేతనాలు ఇచ్చి ప్రముఖ కంపెనీలు తీసుకెళ్లేది కొద్దిమంది విద్యార్థులనే. ఐఐటీల్లో వేల సంఖ్యలో చదివే విద్యార్థులందరికీ వచ్చేది భారీ మొత్తంలో కాదు. ఎక్కువ శాతం మందికి సాధారణ, తక్కువ వేతనాలే. ఏదో కొద్ది మంది విద్యార్థులకు వచ్చే భారీ వేతనాలను చూసి తల్లిదండ్రులు ఇతర పిల్లలపై తీవ్ర ఒత్తిడి చేస్తుండటం ఆందోళనకరంగా మారింది. దీంతో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారని పలు ఐఐటీలు గుర్తించాయి. అందుకే ఐఐటీ బాంబే, ఐఐటీ ఖరగ్‌పూర్ వంటి సంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్లలో కంపెనీలు విద్యార్థులకు ఆఫర్ చేసే వేతనాలను, ఆ విద్యార్థుల వివరాలను వెల్లడించవద్దని నిర్ణయించాయి. ఈ నెలలోనే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఈ నెలలో క్యాంపస్ ప్లేస్మెంట్లు ప్రారంభం అవుతుండటంతో ఐఐటీలు ఈ నిర్ణయానికి వచ్చాయి. అంతేకాదు ఇటీవల గౌహతి ఐఐటీలో జరిగిన ఆల్ ఐఐటీస్ ప్లేస్మెంట్ కమిటీ సమావేశంలో అన్ని ఐఐటీల్లోనూ క్యాంపస్ ప్లేస్మెంట్లలో విద్యార్థులకు కంపెనీలు ఇచ్చే వేతనాల వివరాలను, ఆ విద్యార్థుల వివరాలను కూడా బయటకు వెల్లడించవద్దని నిర్ణయించాయి. 2009లోనే వేతన వివరాలను బయటకు వెల్లడించవద్దన్న నిర్ణయం తీసుకున్నా అమలుకు నోచుకోలేదు. కాని ఇపుడు మాత్రం కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు ఖరగ్‌పూర్ ఐఐటీ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ చైర్మన్ ప్రొఫెసర్ సుధీర్‌కుమార్ బరాయ్ వెల్లడించారు. ‘కంపెనీలు నియామకాల్లో భాగంగా చేసుకునే ఉద్యోగ ఒప్పందంలో రెమ్యునరేషన్‌ను బయటకు వెల్లడించవద్దన్న నిబంధన ఉంది. దీన్ని ఉల్లంఘిస్తే కంపెనీలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. భారీ వేతనాల ఆఫర్ వచ్చిన విద్యార్థులు, వారి కుటుంబాల భద్రత సమస్యగా మారుతోంది. అందుకే వేతన వివరాలు, విద్యార్థుల వివరాలను బయట పెట్టవద్దని నిర్ణయించాం..’ అని ఒక ఐఐటీకి చెందిన ప్లేస్మెంట్ సెల్ ఇన్చార్జి పేర్కొన్నారు. -
రెండు వేల కోట్లు దోపిడి!
గోల్డ్ మెడల్స్ సాధించి, ఉన్నత స్థాయికి ఎదగాల్సిన ఐదుగురు ఐఐటీ విద్యార్థులు అనుకోని విధంగా 2000 కోట్ల రూపాయలను ఏ విధంగా దోచేశారు? ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి? అనే కథాంశంతో పవన్ రెడ్డి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘2000 క్రోర్ బ్లాక్‌మనీ’. రమేశ్ ముక్కెర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సీడీని మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ ఆవిష్కరించి, దర్శక, నిర్మాత సానా యాదిరెడ్డికి అందించారు. దర్శకుడు మల్లికార్జున్ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి తనయుడు ప్రశాంత్, దర్శకుడు ప్రేమ్‌రాజ్ కూడా పాల్గొన్నారు. ‘‘ఇది బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయినా తెరపై పెద్ద సినిమా’’ అని దర్శకుడు అన్నారు. ‘‘చిన్న చిత్రాలకు విమర్శకులు రివ్యూలు రాయరు. కానీ, ఈ చిత్రాన్ని చూసి, రేటింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను’’ అని పవన్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జనార్ధన్ రెడ్డి ఎల్లనూరు. -
రూ. కోటి వేతనాన్నీ వద్దన్నారు!
బంపర్ ఆఫర్లను తిరస్కరించిన ఐఐటీ విద్యార్థులు కాన్పూర్: ఐఐటీ కాన్పూర్‌లో బుధవారం ప్రముఖ కంపెనీలు నిర్వహించిన క్యాంపస్ నియామకాల్లో నలుగురు విద్యార్థులకు ఏడాదికి రూ. కోటికి పైగా వేతన ప్యాకేజీతో బంపర్ ఆఫర్లు వచ్చాయి. కానీ, వారు ఆ ఉద్యోగాలను తిరస్కరించారు. ముగ్గురు యువకులు, ఒక యువతికి ఈ ఆఫర్లు వచ్చాయి. అయితే, వారిలో ఇద్దరు పైచదువుల కోసం ఉద్యోగాలను తిరస్కరించగా, మరో ఇద్దరు తమకు ఆ ఉద్యోగాలు సరిపడవంటూ చిన్న కంపెనీల్లో రూ. 50 లక్షల వేతనానికి ఉద్యోగాల్లో చేరారని ఐఐటీ కాన్పూర్ ప్లేస్మెంట్ సెల్ చైర్మన్ దీపూ ఫిలిప్ వెల్లడించారు. నలుగురు విద్యార్థులకూ ఏడాదికి రూ. 93 లక్షల వేతనం, ఇతర ప్రోత్సాహకాలతో కలిపి కోటికి పైగా ఆఫర్ ఇచ్చారని తెలిపారు. ఇటీవల ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థికి రూ. 1.54 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. మరోవైపు ఐఐటీ మద్రాస్‌లో జరుగుతున్న క్యాంపస్ నియామకాల్లో ఇప్పటిదాకా 487 మంది విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి. -
ప్రేమ జంటలకు పార్కుల్లో నో ఎంట్రీ!
కిస్ ఆఫ్ లవ్ వివాదం ప్రేమ జంటల పాలిట శాపంగా మారుతోంది. కాసేపు పార్కుల్లో కూర్చుని సరదాగా మాట్లాడుకునేందుకు ఇక తంటాలు పడాల్సిన పరిస్థితి. పార్కుల్లో పోలీసుల నిఘా పెరగటం ఇందుకు నిరద్శనం. ఈ నిఘా కాస్త గిల్నగర్ పార్కులో మంగళవారం వివాదానికి దారి తీసింది. సాక్షి, చెన్నై:కిస్ ఆఫ్ లవ్ పేరిట కొందరు విద్యార్థులు ముద్దుల్లో మునిగి తేలుతున్నారు. ఉత్తరాదికి పరిమితమైన బహిరంగ ప్రదేశాల్లో ముద్దుల పోటీ దక్షిణాదికి పాకింది. చెన్నై ఐఐటీ విద్యార్థులు దీన్ని ప్రారంభించారు. ఇది వివాదానికి దారి తీసింది. ఓ వైపు ఆందోళనలు సాగుతుంటే, మరో వైపు కోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది. అదే సమయంలో మరికొన్ని కళాశాలల్లో విద్యార్థులు కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టే పనిలో పడ్డారు. తమిళనాడులో అత్యధికంగా ్రైపైవేటు కళాశాలల్లో బయటి రాష్ట్రాల విద్యార్థులే చదువుకుంటున్నారు. దీంతో ముద్దుల పోటీ రాష్ట్రంలో చాప కింద నీరులా పాకుతోంది. కోయంబత్తూరులో నిర్వహించ తలబెట్టిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే పనిలో పోలీసులు పడ్డారు. కిస్ ఆఫ్ లవ్...కిస్ ఆఫ్ లవ్ అన్న ఈ ప్రచారం రాష్ట్రంలో విస్తృతంగా సాగుతుండడంతో ప్రేమ జంటల మీద అందరి దృష్టి పడింది. సాధారణంగానే కొన్ని చోట్ల అనేక జంటలు శ్రుతి మించి వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రచారం పుణ్యమా అని మరింతగా రెచ్చి పోవచ్చన్న సంకేతాలు బయల్దేరాయి. జంటలకు నో ఎంట్రీ: ఇన్నాళ్లు ఏ పార్కుల్లో బడితే ఆ పార్కుల్లో ప్రేమ జంటలు పెద్ద ఎత్తున కనిపించేవి. మెరీనా తీరంలో సాయంత్రం అయితే చాలు ప్రేమ జంటలే...జంటలు. కొన్ని జంటలు అసభ్యకరంగా ప్రవర్తిస్తే, మరికొన్ని జంటలు సరదాగా కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్లి పోతుంటారుు. అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్లను ప్రశ్నించ లేని పరిస్థితి. బహిరంగ ప్రదేశాల్లో తమ ఇష్టం అని గర్జించే జంటలే అధికం. ఇక, ఈ కిస్ ఆఫ్ లవ్ పుణ్యమా అని నిజమైన ప్రేమ జంటలకు సైతం తంటాలు తప్పడం లేదు. చిన్న పిల్లల పార్కులు, వృద్ధుల వాకింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన పార్కుల్లో ఇక ప్రేమ జంటల్ని అనుమతించ కూడదన్న నిర్ణయానికి పోలీసులు వచ్చినట్టు తెలుస్తున్నది. కొన్ని జంటల తీరు పిల్లల మీద ప్రభావం చూపుతుందన్న భావనతో ఏకంగా జంటల మీద నిఘా పెట్టేందుకు సిద్ధమయ్యారు. పార్కుల్లోకి వచ్చే జంటలు అసభ్యకరంగా ప్రవ ర్తించకుండా క్లాస్ పీకేందుకు రెడీ అయ్యారు. వివాదం : చిల్డ్రన్స్ పార్కుల్లో జంటలకు అనుమతి లేదన్న అంశానికి అద్దం పట్టే ఘటన మంగళవారం గిల్ నగర్లో చోటు చేసుకుంది. జంటల్ని తరిమేందుకు పోలీసులు రావడం వివాదానికి దారి తీసింది. చెన్నై చూలై మేడు గిల్ నగర్‌లోని పార్కులో ఉదయం పోలీసులు తనిఖీల్లో నిమగ్నమయ్యారు. అక్కడి జంటల్ని విచారించడం మొదలెట్టారు. కొందరు జంటలు పోలీసుల రాకతో పలాయనం చిత్తగించారుు. మరి కొందరు అయితే, తమకేం భయం అన్నట్టుగా అక్కడే కూర్చుండి పోయారు. కొన్ని జంటలు పోలీసుల మీద తిరగబడే యత్నం చేయడం వివాదాస్పదం అయింది. ఆ జంటల్ని విచారించే పనిలో పోలీసులు నిమగ్నం కావడంతో కాసేపు వాగ్యుద్ధం చోటు చేసుకుంది. కొందరు అయితే, ఆ జంటలకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడంతో ఇక వివాదం పెద్దది అవుతుందన్న విషయాన్ని గ్రహించి పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు. దీనిపై ఆ ప్రాంత పోలీసు ఇన్చార్జ్ అధికారి ఒకరిని ప్రశ్నించగా, గిల్ నగర్ పార్కులో పిల్లలు, వృద్ధులకు మాత్రమే ప్రవేశం ఉందన్నారు. ప్రేమ జంటలకు నో ఎంట్రీ అని స్పష్టం చేశారు. కొన్ని జంటలు లోనికి వెళ్లి శ్రుతి మించి వ్యవహరిస్తున్నాయని తమకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటప్పుడు తనిఖీలు చేయాల్సిందేగా? అని ఎదురు ప్రశ్న వేయడం గమనార్హం. -
చెన్నైకి చేరిన కిస్ ఆఫ్ లవ్
-
విహారంలో విషాదం
నలుగురు ఢిల్లీ ఐఐటీ విద్యార్థుల దుర్మరణం జెసల్మేర్: రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఐఐటీ-ఢిల్లీలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు విహారయాత్రకు జైసల్మేర్ వెళ్లారు. ఆదివారం ఉదయం వీరంతా జైసల్మేర్ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. జైసల్మేర్ నుంచి ఐదు కిలోమీటర్లు దాటిన తర్వాత వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో వాహనం రోడ్డుపై పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చనిపోయిన నలుగురిని దీక్షా గౌతమ్, పల్లవ్ అగర్వాల్, అర్చనా కుమారి, మయాంక్ గోయల్‌గా గుర్తించారు. గాయపడిన మరో ఇద్దరు విద్యార్థులు స్థానిక ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.