సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) అంటే ప్రపంచంలోనే పేరెన్నికగన్న సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటి. ఐఐటీలో సీటు వస్తే ఆ విద్యార్థి అతను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మార్గం ఏర్పడినట్టే. అత్యున్నత శిక్షణలో రాటు దేలే ఐఐటీ విద్యార్థులంటే విదేశీ సంస్థలకూ క్రేజే. అందుకే భారత ఐఐటీ విద్యార్థులకు విదేశాలు రాచబాట పరుస్తున్నాయి. వారికి విదేశీ సంస్థలు ఉద్యోగ, ఉన్నత విద్యాభ్యాసం అందించేందుకు పోటీ పడుతున్నాయి.
తత్ఫలితంగా దేశం నుంచి మేధో వలసలో ఐఐటీ విద్యార్థులే అత్యధిక శాతం ఉంటున్నారు. దేశంలో ఐఐటీల నుంచి ఏటా పట్టా పొందుతున్న విద్యార్థుల్లో మూడోవంతు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఐఐటీల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షల ద్వారా దేశంలో అత్యంత ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు. అక్కడ శిక్షణ పొందిన వారిని అత్యుత్తమ మానవ వనరులుగా ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి.
అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు, ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు భారత ఐఐటీ విద్యార్థులకు పెద్దపీట వేస్తున్నాయని అమెరికాకు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రిసెర్చ్ (ఎన్‌బీఈఆర్) తాజా నివేదిక వెల్లడించింది. దేశంలోని 23 ఐఐటీలలోని 16,598 సీట్ల భర్తీ కోసం ఈ ఏడాది నిర్వహించిన పరీక్ష కోసం 1,89,744 మంది విద్యార్థులు పోటీ పడ్డారని ఆ నివేదిక పేర్కొంది. దేశంలోని ఐఐటీలలో కూడా చెన్నై, ముంబై, ఖరగ్‌పూర్, ఢిల్లీ, కాన్పూర్ ఐఐటీల విద్యార్థులకు మల్టీ నేషనల్ కంపెనీలు మరింత పెద్దపీట వేస్తున్నాయని తెలిపింది. ఎన్‌బీఈఆర్ నివేదికలోని ప్రధాన అంశాలు సంక్షిప్తంగా..
► భారత్‌లో ఐఐటీల నుంచి ఏటా పట్టా పొందుతున్న విద్యార్థుల్లో 35 శాతం విదేశాలకు వెళ్లిపోతున్నారు
► ఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో టాప్–1000లో నిలుస్తున్న విద్యార్థుల్లో 36 శాతం మంది విదేశాల బాట పడుతున్నారు.
► భారత ఐఐటీయన్ల ప్రధాన గమ్యస్థానం అమెరికా. విదేశాలకు వెళుతున్న ఐఐటీయన్లలో 65 శాతం అమెరికాకే వెళ్తున్నారు. వారిలో 85 శాతం మంది అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి అక్కడే ప్రముఖ కంపెనీల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి సీఈవోల వరకు బాధ్యతలు చేపడుతున్నారు.
► ప్రపంచంలో 50 విదేశీ విద్యా సంస్థల విద్యార్థులకు బ్రిటన్ హైపొటెన్షియల్ ఇండివిడ్యువల్ వీసాలు జారీ చేస్తోంది. వారిలో భారత ఐఐటీ విద్యార్థులే మొదటి స్థానంలో ఉన్నారు.
► భారత ఐఐటీ అంటే విదేశీ సంస్థలకు ఎంతటి క్రేజ్ ఉందో చెప్పడానికి వారణాశిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయమే (బీహెచ్‌యూ) తార్కాణం. బీహెచ్‌యూకు ఐఐటీ హోదా కల్పించిన తరువాత ఆ సంస్థలోని విద్యార్థులకు విదేశాల్లో ప్లేస్‌మెంట్స్ ఏకంగా 540 శాతం పెరగడం విశేషం.
ఐఐటీ విద్యార్థులకు విదేశాల రెడ్ కార్పెట్
Published Tue, Jun 13 2023 5:59 AM | Last Updated on Tue, Jun 13 2023 9:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment