
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి కోసం విదేశాలకు పోయి, సైబర్ కేఫేలో బందీలుగా చిక్కుకుపోయిన 540 మంది భారతీయులు మంగళవారం ఢిల్లీకి చేరుకోగా, వారిలో బుధవా రం రాత్రి తెలంగాణకు చెందిన 24 మంది బాధితులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారికి సంబంధించిన పర్వవేక్షణ బాధ్యతలను ఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్‌ఉప్పల్‌కు అప్పగించారు. వారిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా హైదరాబాద్‌కు తరలించారు. దీంతో వారి బంధువులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
అయితే అధికారులు రెగ్యులర్ ఎగ్జిట్ నుంచి కాకుండా రహస్య ప్రాంతానికి తరలించి వారి నుంచి వివరాలు, స్టేట్‌మెంట్ తీసుకున్నట్టు సమాచారం. దీంతో ఆందోళనకు గురైన బంధువులు పోలీసులను ఆశ్రయించగా, బాధితుల నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న తర్వాత పంపిస్తామని చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు తెలంగాణకు చేరుకున్న 24 మంది బాధితుల గురించి కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ ఆరా తీసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
మంత్రి శ్రీధర్‌బాబు కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల పేరిట అక్రమ రవాణా చేయడానికి కారణమైన వారిని గుర్తించడానికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, విచారణ అనంతరం మధుకర్‌రెడ్డిని కుటుంబసభ్యులకు అప్పగించారు.
జగిత్యాలలో వెలుగుచూసిన మరో మోసం
సైబర్ కేఫేలో చిక్కుకొని బయటపడిన వ్యక్తి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదైంది. జగిత్యాల జిల్లా ఎర్దండి గ్రామానికి చెందిన దేశెట్టి రాకేశ్ విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు మల్లికార్జున మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీని సంప్రదించాడు. నిర్వాహకుడు ఆల్లెపు వెంకటేశ్‌కు ఫోన్‌పే, నగదు రూపంలో 2022లో రూ.3.50 లక్షలు అప్పజెప్పాడు. 2023 ఆగస్టులో రాకేశ్‌ను ఆర్మీనియాకు పంపించాడు. కానీ అక్కడ జాబ్ చూపించకపోవడంతో ఇబ్బందులు పడి, అతి కష్టం మీద నవంబర్ 2023లో స్వదేశానికి చేరుకున్నాడు.
డబ్బులు తిరిగి ఇవ్వాలని వెంకటేశ్‌ను అడగ్గా 2025 జనవరి 12న రాకేశ్‌ను థాయిలాండ్‌కు పంపించాడు. అక్కడ వెంకటేశ్‌కు సంబంధించిన వ్యక్తులు ఒక సైబర్ క్రైమ్ చేసే ముఠాకు అప్పజెప్పారు. ఇతరుల సహాయంతో ఇండియన్ ఎంబసీనీ సంప్రదించి స్వదేశానికి రాకేశ్ తిరిగి వచ్చాడు. తనను మోసం చేసిన కన్సల్టెన్సీ నిర్వహకుడు ఆల్లెపు వెంకటేశ్‌పై జగిత్యాలటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసుదర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment