
22 శాతం సంపన్న భారతీయుల అభిమతం
మెరుగైన జీవన ప్రమాణాలు కరువు
వ్యాపార అనుకూల పరిస్థితులూ లేవు
ఈవై–కోటక్ ప్రైవేటు సర్వేలో వెల్లడైన అంశాలు
ముంబై: దేశంలోని అత్యంత ధనవంతుల్లో 22 శాతం మంది ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. విదేశాల్లో మెరుగైన జీవన పరిస్థితులు, వ్యాపార అనుకూల వాతావరణం వారిని ఆకర్షిస్తున్నాయి. 150 మంది అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు) అభిప్రాయాలను కోటక్ ప్రైవేటు (వెల్త్ మేనేజర్), ఈవై ఇండియా సర్వే చేశాయి.
అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ దేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది అల్ట్రా హెచ్‌ఎన్‌ఐ భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా దేశాలు ఆఫర్ చేస్తున్న గోల్డెన్ వీసా పథకం అనుకూలంగా ఉన్నట్టు కోటక్–ఈవై నివేదిక తెలిపింది. ఏటా 25 లక్షల మంది విదేశాలకు వలసపోతున్న గణాంకాలను ప్రస్తావించింది. సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురు అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలలో ఒకరు విదేశాలకు వలసపోయే ప్రణాళికతో ఉన్నట్టు తెలిసింది.
వీలైతే అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని, అదే సమయంలో భారతీయ పౌరసత్వాన్ని కొనసాగించుకునే ఆలోచనతో ఉన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలు, విద్య, జీవనశైలి ఇలా అన్నింటా విదేశాల్లో మెరుగైన ప్రమాణాలను వారు కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రతి ముగ్గురిలో ఒకరు విదేశాల్లో వ్యా పార నిర్వహణలో ఉండే సౌలభ్యం తమను ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యం, శ్రేయ స్సుకు వీరు ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం.
పిల్లల విద్యకూడా కారణమే..
విదేశాలకు వలసపోవాలన్న నిర్ణయాన్ని భవిష్యత్ పెట్టుబడిగా ఈ సర్వే నివేదిక అభివర్ణించింది. వారి పిల్లలకు అత్యుత్తమ ఉన్నత విద్య సదుపాయం సైతం వారిని ఆ దిశగా నడిపించొచ్చని పేర్కొంది. ‘‘విదేశాలకు వలసపోవాలన్న నిర్ణయాన్ని పెట్టబడులు తరలిపోవడంగా చూడరాదు. ఈ తరహా కార్యకలాపాలపై పరిమితులు విధించడం ద్వారా పౌరసత్వ హోదా మారినప్పటికీ వారి పెట్టుబడులు తరలిపోకుండా చూడొచ్చు.
భారత్‌లో నివసించే పౌరుడు ఏడాదికి ఇంటికి తీసుకెళుతున్నది సగటున 2,50,000 డాలర్లే. అదే విధంగా నాన్ రెసిడెంట్‌ను సైతం ఏటా మిలియన్ డాలర్లనే తీసుకెళ్లేందుకు అనుమతించడం వల్ల పెట్టుబడులు తరలిపోవు’’అని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్ గౌతమి గవంకర్ అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తల కంటే వృత్తి నిపుణులే ఎక్కువగా విదేశాలకు వలసపోయే ఉద్దేశంతో ఉన్నారు. అది కూడా అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలలో 36–40 ఏళ్ల వయసులోని వారు, 61 ఏళ్లపైన వయసువారు వలసవెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
2.83 లక్షల అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు
2023 నాటికి మన దేశంలో 2.83 లక్షల మంది అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు ఉన్నారు. ఒక్కొక్కరి నెట్‌వర్త్ (నికర సంపద విలువ) రూ.25 కోట్లకు పైన ఉండడాన్ని ప్రామాణికంగా తీసుకుని, వీర జనాభా లెక్కగట్టారు. వీరందరి ఉమ్మడి సంపద విలువ రూ.2.83 లక్షల కోట్లుగా ఉంది. 2028 నాటికి అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 4.3 లక్షలకు పెరుగుతుందని, వీరి నిర్వహణలోని సంపద రూ.359 లక్షల కోట్లకు విస్తరిస్తుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. బలమైన ఆర్థిక వృద్ధి, అధిక వినియోగం, పనిచేయతగిన యువ జనాభా ఎక్కువగా ఉండడం అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల విభాగం వృద్ధికి అనుకూలిస్తాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment