డబ్బును విదేశాలకు తరలించిన మాల్యా?
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా డబ్బును విదేశాలకు తరలించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు చెప్పాయి. దీనికి సంబంధించి ఈడీకి ఆధారాలు లభించినట్టు సమాచారం. బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా ఇటీవల విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.
మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు రెండు రోజుల్లోగా వాటికి సంబంధించిన వివరాలు, డాక్యుమెంట్లను సమర్పించాలని ఈడీ ఆదేశించింది. సోమవారం ఐడీబీఐ సహా 17 బ్యాంకులకు ఈడీ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఐడీబీఐ మంజూరు చేసిన 900 కోట్ల రూపాయల రుణాన్ని చెల్లించలేదు. ఈ కేసులో ఈడీ ఇదివరకే ఆరుగురు ఐడీబీఐ బ్యాంకు అధికారులకు సమన్లు జారీ చేసింది.
విజయ్ మాల్యా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను పారిపోలేదని, ఏ తప్పూ చేయలేదని చెప్పారు. ఓ స్నేహితుడితో కలసి వ్యక్తిగత పర్యటనకు వెళ్లినట్టు తెలిపారు. కాగా ఏ దేశానాకి వెళ్లిందీ ఆయన చెప్పలేదు.