migrations
-
ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోతాం..
ముంబై: దేశంలోని అత్యంత ధనవంతుల్లో 22 శాతం మంది ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. విదేశాల్లో మెరుగైన జీవన పరిస్థితులు, వ్యాపార అనుకూల వాతావరణం వారిని ఆకర్షిస్తున్నాయి. 150 మంది అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (అల్ట్రా హెచ్ఎన్ఐలు) అభిప్రాయాలను కోటక్ ప్రైవేటు (వెల్త్ మేనేజర్), ఈవై ఇండియా సర్వే చేశాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ దేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది అల్ట్రా హెచ్ఎన్ఐ భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా దేశాలు ఆఫర్ చేస్తున్న గోల్డెన్ వీసా పథకం అనుకూలంగా ఉన్నట్టు కోటక్–ఈవై నివేదిక తెలిపింది. ఏటా 25 లక్షల మంది విదేశాలకు వలసపోతున్న గణాంకాలను ప్రస్తావించింది. సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురు అల్ట్రా హెచ్ఎన్ఐలలో ఒకరు విదేశాలకు వలసపోయే ప్రణాళికతో ఉన్నట్టు తెలిసింది. వీలైతే అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని, అదే సమయంలో భారతీయ పౌరసత్వాన్ని కొనసాగించుకునే ఆలోచనతో ఉన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలు, విద్య, జీవనశైలి ఇలా అన్నింటా విదేశాల్లో మెరుగైన ప్రమాణాలను వారు కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రతి ముగ్గురిలో ఒకరు విదేశాల్లో వ్యా పార నిర్వహణలో ఉండే సౌలభ్యం తమను ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యం, శ్రేయ స్సుకు వీరు ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. పిల్లల విద్యకూడా కారణమే.. విదేశాలకు వలసపోవాలన్న నిర్ణయాన్ని భవిష్యత్ పెట్టుబడిగా ఈ సర్వే నివేదిక అభివర్ణించింది. వారి పిల్లలకు అత్యుత్తమ ఉన్నత విద్య సదుపాయం సైతం వారిని ఆ దిశగా నడిపించొచ్చని పేర్కొంది. ‘‘విదేశాలకు వలసపోవాలన్న నిర్ణయాన్ని పెట్టబడులు తరలిపోవడంగా చూడరాదు. ఈ తరహా కార్యకలాపాలపై పరిమితులు విధించడం ద్వారా పౌరసత్వ హోదా మారినప్పటికీ వారి పెట్టుబడులు తరలిపోకుండా చూడొచ్చు. భారత్‌లో నివసించే పౌరుడు ఏడాదికి ఇంటికి తీసుకెళుతున్నది సగటున 2,50,000 డాలర్లే. అదే విధంగా నాన్ రెసిడెంట్‌ను సైతం ఏటా మిలియన్ డాలర్లనే తీసుకెళ్లేందుకు అనుమతించడం వల్ల పెట్టుబడులు తరలిపోవు’’అని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్ గౌతమి గవంకర్ అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తల కంటే వృత్తి నిపుణులే ఎక్కువగా విదేశాలకు వలసపోయే ఉద్దేశంతో ఉన్నారు. అది కూడా అల్ట్రా హెచ్ఎన్ఐలలో 36–40 ఏళ్ల వయసులోని వారు, 61 ఏళ్లపైన వయసువారు వలసవెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2.83 లక్షల అల్ట్రా హెచ్ఎన్ఐలు 2023 నాటికి మన దేశంలో 2.83 లక్షల మంది అల్ట్రా హెచ్ఎన్ఐలు ఉన్నారు. ఒక్కొక్కరి నెట్‌వర్త్ (నికర సంపద విలువ) రూ.25 కోట్లకు పైన ఉండడాన్ని ప్రామాణికంగా తీసుకుని, వీర జనాభా లెక్కగట్టారు. వీరందరి ఉమ్మడి సంపద విలువ రూ.2.83 లక్షల కోట్లుగా ఉంది. 2028 నాటికి అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య 4.3 లక్షలకు పెరుగుతుందని, వీరి నిర్వహణలోని సంపద రూ.359 లక్షల కోట్లకు విస్తరిస్తుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. బలమైన ఆర్థిక వృద్ధి, అధిక వినియోగం, పనిచేయతగిన యువ జనాభా ఎక్కువగా ఉండడం అల్ట్రా హెచ్ఎన్ఐల విభాగం వృద్ధికి అనుకూలిస్తాయని తెలిపింది. -
బాబ్బాబు ఇక్కడే ఉండు..!
న్యూఢిల్లీ: బడా ప్రైవేటు బ్యాంక్‌లు అధిక ఉద్యోగ వలసలకు (అట్రిషన్) కొంత అడ్డుకట్ట వేయగలిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అట్రిషన్ రేటు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే తగ్గినట్టు డేటా తెలియజేస్తోంది. ఉద్యోగులు సంస్థతోనే కొనసాగేందుకు వీలుగా బ్యాంక్‌ల యాజమాన్యాలు పలు చర్యలను ఆచరణలో పెట్టడం ఫలితాలనిస్తోంది. మేనేజర్లను జవాబుదారీ చేయడం, అధిక ప్రోత్సాహకాలు తదితర చర్యలు ఇందులో భాగంగా ఉన్నాయి. బీఎఫ్ఎస్ఐ రంగంలో ఇతర సంస్థల మాదిరే బ్యాంక్‌లు సైతం నైపుణ్య మానవ వనరుల పరంగా ఆటుపోట్లను చూస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ తెలిపారు. 2022–23లో ఉద్యోగుల వలసలు బ్యాంక్‌తోపాటు పరిశ్రమకు సైతం ఆందోళన కలిగించినట్టు చెప్పారు. 30 ఏళ్లలోపు వారే ఎక్కువ.. ‘‘2023–24లో వలసలను అడ్డుకునేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పలు చర్యలు తీసుకుంది. ఉద్యోగులు సంస్థను వీడేందుకు గల కారణాలను గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉన్నత స్థాయిలో టాస్‌్కఫోర్స్‌ను సైతం ఏర్పాటు చేశాం’’అని జగదీశన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అట్రిషన్ రేటు 7 శాతం మేర తగ్గి, 27 శాతంగా ఉంది. అదే మహిళా ఉద్యోగుల వలసలు 28 శాతంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఇలా సంస్థను వీడి వెళ్లే వారిలో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారుంటుంటే, ఆ తర్వాత 30–50 ఏళ్ల వయసులోని వారున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల అనుభవం మెరుగుపడేందుకు వీలుగా తాము ఇన్వెస్ట్ చేసినట్టు జగదీశన్ వెల్లడించారు. బ్యాంక్‌కు చెందిన లెరి్నంగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎంపవర్’ ద్వారా వృత్తిపరమైన నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఉద్యోగుల మనోగతం, వారి అభిప్రాయాలను తెలుసుకునే కార్యాచరణను అమలు చేసినట్టు తెలిపారు. 2 లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తున్నట్టు వివరించారు. 2023–24లో 6 లక్షల గంటల అభ్యసనను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నమోదు చేసింది. ఇతర బ్యాంకుల్లోనూ.. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లోనూ అట్రిషన్ రేటు గత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం మేర తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో 25 శాతం, యాక్సిస్ బ్యాంక్‌లో 29 శాతం, కోటక్ బ్యాంక్‌లో 40 శాతం చొప్పున నమోదైంది. ఇక ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో ఉద్యోగ వలసల రేటు 14 శాతం తగ్గి 37 శాతానికి, యస్ బ్యాంక్‌లో 5 శాతం తగ్గి 38 శాతానికి పరిమితమైంది. పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్‌లోనే ఉద్యోగుల వలసలు అధికంగా ఉన్నాయి. దీంతో ఈ సంస్థ ఉద్యోగులను కాపాడుకునేందుకు గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో చర్యలు చేపట్టింది. శాఖల వారీగా, రిలేషన్షిప్ మేనేజర్లు, అసిస్టెంట్ ఏరియా మేనేజర్లకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేసింది. కొన్ని విభాగాల్లో వేతనాలు, ప్రయోజనాల పరంగా ఆగు నెలల కాలానికి స్థిరమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. బ్రాంచ్ మేనేజర్లు, ఏరియా మేనేజర్లకు ప్రోత్సాహకాలు పెంచింది. పోటాపోటీగా వేతన, ప్రోత్సాహక ప్యాకేజీలతో ఉద్యోగులను కాపాడుకునేందుకు, ఆకర్షించేందుకు ప్రముఖ బ్యాంక్‌లు చర్యలు అమలు చేస్తున్నట్టు హంట్ పార్ట్నర్స్కు చెందిన వికమ్ర్ గుప్తా తెలిపారు. -
శీతాకాలం విడిది కోసం వలస వెళ్తున్న పక్షులు, వేలకిలోమీటర్ల ప్రయాణం
శీతాకాలం విడిది కోసం పక్షుల వలసలు మొదలయ్యాయి. దేశీయంగానూ ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు పక్షులు వలస వెళ్తాయి.ఎన్నో జాతుల పక్షులకు వలస వెళ్ళడం వాటి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ప్రపంచ పక్షి జాతుల్లో సుమారు 40శాతం దాకా వలస వెళ్తాయని అంచనా. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. శీతోష్ణస్థితిలో ఏర్పడిన అననుకూల పరిస్థితుల వల్ల, ఆహారం కోసం, గుడ్లను పెట్టి పొదిగి సంతానాభివృద్ధికి, వ్యాధుల నుంచి రక్షణకు పక్షులు వలస వెళ్తాయి. వలసలో భాగంగా పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.వాతావరణం అనుకూలంగా మారిన తరవాత మళ్ళీ వెనుదిరుగుతాయి. ముఖ్యంగా శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరియా, రష్యా, టర్కీ, యూరప్ దేశాల నుంచి పక్షులు భారత్‌లోకి వలస వస్తుంటాయి. అయితే శీతాకాల విడిది కోసం వలస వచ్చే విదేశీ పక్షుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న పక్షి పేరు ఓనోన్ కుకూ. ఏప్రిల్29న ఆఫ్రికాలోని కెన్యాలో ఉన్న ఈ పక్షి ఈరోజు(శనివారం)మధ్యప్రదేశ్‌కి చేరుకుంది. అరేబియా సముద్రానికి 150 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఈ పక్షి ప్రయాణం సాగింది. మరో వారం రోజుల్లో ఇది 5వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు.దీనిలాగే ఇతర పక్షులు కూడా మార్గమధ్యంలో ఆహారం, విశ్రాంతి కోసం కొంతకాలం ఆగుతాయి. He is Onon a Cuckoo. This bird was in Kenya on 29th April. Today he is in Madhya Pradesh. He has completed his crossing of the Arabian Sea to India and, for good measure, flown another 600 km inland also. It is 5000 Kms flying in a week. Feel that amazing feat. @BirdingBeijing pic.twitter.com/SGfuGO3MkS — Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 4, 2020 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చే విభిన్న రకాల విదేశీ పక్షులను చూసేందుకు, కెమెరాలతో క్లిక్ మనిపించేందుకు బర్డ్ వాచర్లు క్యూ కడుతుంటారు. అయితే ఒకప్పుడు వందల సంఖ్యలో వచ్చే విదేశీ పక్షుల రాక క్రమక్రమంగా తగ్గుతోంది. ఈ పక్షులు ఆవాసాలుగా చేసుకునే చెరువులు ఆక్రమణలకు గురవడం, చెరువుల చుట్టూ నిర్మాణాలు పెరిగిపోతుండటంతో వాటి రాక క్రమంగా తగ్గిపోతోంది. 📢Today is the day! Let’s celebrate bird migration on #WorldMigratoryBirdDay! On their epic journeys, migratory birds help inspire many people and cultures along the way. Learn more about their migration & how you can protect them: ➡️https://t.co/SoAJkVyx3z pic.twitter.com/OIiFGSPaTp — World Migratory Bird Day (@WMBD) October 14, 2023 ప్రస్తుతం ఈ సీజన్లోనూ సిటీకి విదేశీ పక్షులు వచ్చినప్పటికీ మునుపటితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువని బర్డ్వాచర్లు పేర్కొంటున్నారు. ఇలాగే కొనసాగితే రాను రాను ఈ సంఖ్య మరింత పడిపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
Manipur violence: మొయితీల వలసబాట
గువాహటి/కోల్‌కతా: కల్లోల మణిపూర్‌లో తెగల మధ్య రాజుకున్న మంటలు ఆరడం లేదు. బాధితులు ప్రాణభయంతో రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నారు. సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ పొరుగు రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. సొంత రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడేదాకా మరోచోట తలదాచుకోవడమే మేలని భావిస్తున్నారు. ఇద్దరు గిరిజన మహిళలను దిగంబరంగా ఊరేగించిన ఘటన బయటపడిన తర్వాత మొయితీ తెగ ప్రజల్లో భయాందోళన మరింత పెరిగిపోయింది. ఇప్పటికే మిజోరాంలో ఉంటున్న మణిపూర్ మొయితీల్లో ప్రాణ భయం మొదలైంది. మాజీ మిలిటెంట్ గ్రూప్ నుంచి బెదిరింపులు రావడమే ఇందుకు కారణం. 41 మంది మెయితీలు శనివారం రాత్రి మిజోరాం నుంచి అస్సాంలోని సిల్చార్కు చేరుకున్నారు. వారికి బిన్నాకండీ ఏరియాలోని లఖీపూర్ డెవలప్మెంట్ బ్లాక్ కార్యాలయ భవనంలో ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా ఆర్థికంగా మెరుగైన స్థానంలో ఉన్నవారేనని, సొంత వాహనాల్లో అస్సాం దాకా వచ్చారని పేర్కొన్నారు. ఈ 41 మంది మొయితీల్లో కాలేజీ ప్రొఫెసర్లు, ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఉన్నారని తెలియజేశారు. మిజోరంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని వారు చెప్పారని వివరించారు. అయినప్పటికీ అక్కడ రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక అస్సాంకు వచ్చామంటూ తమతో పేర్కొన్నారని వెల్లడించారు. బాధితులకు పూర్తి రక్షణ కలి్పస్తున్నట్లు అస్సాం పోలీసులు ఉద్ఘాటించారు. వదంతులు నమ్మొద్దు: మిజోరాం ప్రభుత్వం మణిపూర్‌లో మే 3వ తేదీ నుంచి ఘర్షణలు ఉధృతమయ్యాయి. ఇప్పటిదాకా వేలాది మంది మొయితీలతోపాటు గిరిజన తెగలైన కుకీలు, హమర్ ప్రజలు వలసబాట పట్టారు. వీరిలో చాలామంది అస్సాంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలా ఉండగా, వెంటనే రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలంటూ మిజోరంలో తలదాచుకుంటున్న మణిపూర్ మొయితీలకు మాజీ తీవ్రవాద గ్రూపు నుంచి బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ మాజీ మిలిటెంట్ గ్రూప్‌నకు కుకీ అనుకూల వర్గంగా పేరుంది. తమ రాష్ట్రంలో ఉంటున్న బాధితులకు పూర్తిస్థాయిలో రక్షణ కలి్పస్తున్నామని, వదంతులు నమ్మొద్దని మిజోరం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బెదిరింపులు తట్టుకోలేక కొందరు మొయితీలు మిజోరం నుంచి సొంత రాష్ట్రం మణిపూర్‌కు వెళ్లిపోయినట్లు తెలిసింది. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మే 4న చోటుచేసుకుంది. మే 15న ఇంఫాల్‌లో 18 ఏళ్ల బాలికలపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట ఆరోపించింది. -
‘డాలర్ మిలియనీర్ల విదేశీ వలసలు తగ్గుతున్నాయి’
ఇండియా నుంచి పది లక్షల డాలర్ల (మిలియన్) మించిన సంపద ఉన్న ధనికులు పెట్టుబడులతో విదేశాలకు తరలిపోవడం క్రమంగా పెరుగుతోందని కిందటేడాది ఆందోళన వ్యక్తమైంది. నిజమే, కొత్తగా కోట్లాది రూపాయలు సంపాదించిన తెలివైన భారతీయులు స్వదేశం విడిచి ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాలకు తరలిపోవడం ఎవరికైనా మొదట దిగులు పుట్టిస్తుంది. కష్టపడి వ్యాపారాల ద్వారా సంపాదించిన వ్యక్తులు మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు పోగేసుకున్న తర్వాత కూడా తమకు అనుకూలంగా కనిపించే దేశాలకు పెట్టుబడుల ద్వారా వలసపోవడానికి అనేక కారణాలుంటాయి. తమ ఆర్జనపైన, విదేశాల్లో పెట్టే పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయాలపైన భారత ప్రభుత్వం విధించే పన్నులు సబబుగా, హేతుబద్ధంగా లేవనే కారణంతో కొందరు పైన చెప్పిన డాలర్ మిలియనీర్లు విదేశాలకు వలసపోతుంటారు. మరి కొందరు మిలియనీర్లు ఇక్కడ కన్నా మెరుగైన సామాజిక జీవనశైలి సాధ్యమని భావించిన దేశాలకు పోయి స్థిరపడుతుంటారు. ఇలా రకరకాల కారణాలతో కొద్ది మంది కొత్త కోటీశ్వరులు ఇండియా నుంచి బయటకు పోతున్నారు. వలసపోయే మిలియనీర్ల సంఖ్య తగ్గడం శుభవార్తే! 2022లో దేశం నుంచి మిలియన్ డాలర్ల సంపన్నులు 7,500 మంది విదేశాలకు తరలిపోయారు. కాని, ఇలా విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి బయటకు పోతున్న సంపన్నులను ఆకట్టుకోవడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా 2023లో ఇలాంటి ధనికుల సంఖ్య 6,500కు తగ్గుతుందని అంచనా. ఇలాంటి పెట్టుబడి వలసలపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసే లండన్ కు చెందిన హెన్లీ అండ్ పార్టనర్స్ సంస్థ విడుదల చేసిన వివరాలు పై విషయాలను వెల్లడిస్తున్నాయి. ఇండియా వదిలిపోవాలనుకునే భారత సంపన్నుల్లో ఎక్కువ మంది ఇష్టపడే దేశం ఆస్ట్రేలియా. తర్వాత స్థానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఒకటైన దుబాయి. ఇప్పటికే దుబాయి మాదిరిగానే భారత సంతతి ప్రజలున్న సింగపూర్ పోయి స్థిరపడానికి కూడా కొందరు భారతీయులు ఉత్సాహపడుతున్నారని హెన్లీ అండ్ పార్టనర్స్ సర్వే చెబుతోంది. ఆస్ట్రేలియాలో 2023లో పెట్టుబడులతో వచ్చి స్థిరపడే విదేశీయులు గరిష్ఠంగా 5,200 వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. డాలర్ మిలియనీర్ల వలసల్లో చైనాదే ప్రథమ స్థానం! 20వ శతాబ్దంలో 1978 నుంచీ ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన చైనా, 1991 నుంచీ పేదరికం నిర్మూలించి, సంపద సృష్టించడానికి కొత్త మార్గంలో ప్రయాణం మొదలెట్టిన ఇండియాలో కొత్త ఐడియాలతో, వినూత్న పరిశ్రమతో కొత్త డాలర్ మిలియనీర్లు ఏటా గణనీయ సంఖ్యలో పుట్టుకొస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ సైజులో పెద్దదైన చైనా ఇలాంటి వలసల విషయంలో కూడా ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంది. 2023లో చైనా నుంచి 13,500 మంది కోటీశ్వరులు ఇతర దేశాలకు వలసపోతారని భావిస్తున్నారు. 2022లో ఈ సంపన్నుల సంఖ్య 10,800 మాత్రమే. అంటే ఏటా చైనా నుంచి బయటకు పోయే కొత్త ధనికుల (పది లక్షల అమెరికన్ డాలర్లకు మించిన సంపద ఉన్న హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్) సంఖ్య పెరుగుతుండగా ఇండియాలో వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం విశేషం. ఆరో అతిపెద్ద ఆర్థిక శక్తి ఇంగ్లండ్ నుంచి కూడా డాలర్ మిలియనీర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో విదేశాలకు తరలిపోతున్నారట. ఇంకా ఈ తరహా దేశాల్లో రష్యా, బ్రెజిల్ కూడా ఉన్నాయి. భారతదేశానికి సంబంధించి సంపన్నుల విదేశీ వలసల విషయంలో శుభపరిణామం ఏమంటే–ఇండియాలో మెరుగవుతున్న ఆర్థిక,సామాజిక పరిస్థితులను, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అనేక మంది భారతీయులు విదేశాల నుంచి వెనక్కి వచ్చి స్వదేశంలో స్థిరపడుతున్నారు. వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం, అవకాశాల స్వర్గంగా భావించే అమెరికా నుంచి కూడా మిలియనీర్లు ఇతర దేశాలకు వలసపోవడం సాధారణ విషయంగా నేడు మారిపోయింది. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ ఎంపీ. -
సంపన్నుల వలసబాట.. ఆ దేశాలకే ఎందుకు?
భద్రమైన జీవితాన్ని వెతుక్కుంటూ ఎంతోమంది భారతీయ సంపన్నులు విదేశాలకు పయనమవుతున్నారు. అక్కడే స్థిరపడుతున్నారు. మెరుగైన శాంతిభద్రతలు, కాలుష్యానికి తావులేని చక్కటి వాతావరణం, సంపదపై తక్కువ పన్నులు వారిని ఆకర్శిస్తున్నాయి. ఈ ఏడాది భారత్ నుంచి 6,500 మంది అత్యంత సంపన్నులు విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, సంపన్నుల కదలికల తీరును విశ్లేషించే హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్–2023 తాజాగా వెల్లడించింది. 2022లో భారత్ నుంచి 7,500 మంది ధనవంతులు విదేశాలకు వెళ్లి స్థిరపడినట్లు అంచనా. ► మిలియన్ డాలర్లు(రూ.8.2 కోట్లు), అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగల సంపద ఉన్నవారిని అల్ట్రా రిచ్(హెచ్ఎన్డబ్ల్యూఐ)గా పరిగణిస్తారు. ► శాశ్వతంగా స్థిరపడడానికి సంపన్నులను విశేషంగా ఆకర్షిస్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సింగపూర్, అమెరికా, స్విట్జర్లాండ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ► ఇక 2023లో చైనా, ఇండియా, యునైటెడ్ కింగ్డమ్(యూకే), రష్యా, బ్రెజిల్ నుంచి ఎక్కువ మంది ధనవంతులు విదేశాలకు వెళ్తారని అంచనా వేస్తున్నట్లు న్యూ వరల్డ్ వెల్త్ పరిశోధక సంస్థ చీఫ్ ఆండ్రూ ఆమోయిల్స్ చెప్పారు. ► భారత్ నుంచి మిలియనీర్లు వెళ్లిపోతున్నా పెద్దగా నష్టం లేదని, దేశంలో అంతకంటే ఎక్కువ మంది మిలియనీర్లు తయారవుతారని ఆమోయిల్స్ తెలిపారు. ► ఈ ఏడాది చైనా నుంచి 13,500 మంది ధనికులు వలస వెళ్తారని అంచనా. ► 2022 ఆఖరు నాటికి టాప్–10 ధనిక దేశాల జాబితాలో భారత్ 10వ స్థానంలో నిలిచింది. అమెరికా, జపాన్, చైనా, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ దేశాలు మొదటి 9 స్థానాలో ఉన్నాయి. ► భారత్‌లో మొత్తం జనాభా 142 కోట్లు కాగా, వీరిలో 3,44,600 మంది అల్ట్రా రిచ్(మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అస్తి), 1,078 మంది సెంటి–మిలియనీర్లు(100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తి), 123 మంది బిలియనీర్లు(బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తి) ఉన్నారు. ► చైనా జనాభా 141 కోట్లు కాగా, వీరిలో 7,80,000 మంది అల్ట్రా రిచ్, 285 మంది బిలియనీర్లు ఉన్నారు. అమెరికా జనాభా 34 కోట్లు కాగా, వీరిలో 52,70,000 మంది అల్ట్రా రిచ్, 770 మంది బిలియనీర్లు ఉన్నారు. అనువైన దేశం కోసం అన్వేషణ ► విదేశాలకు వలస వెళ్లడానికి సంపన్నులు ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. రాజకీయ స్థిరత్వం, తక్కువ పన్నుల విధానం, వ్యక్తిగత స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ► ఆరోగ్యకరమైన జీవనం సాగించేందుకు అనువైన దేశం కోసం అన్వేషిస్తున్నారు. ► పిల్లలకు నాణ్యమైన చదువులు, వైద్య సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలు అందాలని కోరుకుంటున్నారు. ► తమ సంపదకు, ఆస్తులకు రక్షణ కల్పించే దేశాన్ని ఎంచుకుంటున్నారు. ► చట్టబద్ధ పాలన ఉండడంతోపాటు ఆర్థిక స్వేచ్ఛకు హామీ ఇచ్చే దేశాలకు వలస వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ► ప్రైవేట్ సంపద వెళ్లిపోవడం దేశాలకు నష్టదాయకమేనని నిపుణులు చెబుతున్నారు. ► భారత్‌లో పన్ను నిబంధనలు కఠినంగా ఉండడంతో ధనవంతులు తమ డబ్బును విదేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వలసలు, నిరాసక్తత
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి ఉపాధి కోసం వలసలు, పట్టణాల్లో, యువతలో నిరాసక్తత వంటి ఎన్నో కారణాలున్నా యని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. సి బ్బంది, న్యాయం, ప్రజా సమస్యలపై పార్లమెంటు సంఘానికి ఈ మేరకు నివేదించింది. సోమ వారం జరిగిన సంఘం సమావేశంలో ఈ అంశంపై ఈసీ ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ సమర్పించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు రిమో ట్ ఓటింగ్ సదుపాయం వంటివి అందుబాటులోకి తేవాలని సూచించారు. అయితే, ‘‘రిమోట్ ఓటింగ్ పరిజ్ఞానం కూడా నెట్‌వర్క్‌లకు అనుసంధానమయ్యే తరహాలో కాకుండా ఈవీఎంల మాదిరిగా స్వతంత్రంగా ఉండేలా చూడటం ముఖ్యం. అప్పుడే ఎలాంటి దుర్వినియోగానికీ తావుండదు’’ అని అభిప్రాయపడ్డారు. -
బ్రిటన్‌లోకి విదేశీ విద్యార్థుల వలసల కట్టడికి రిషి స్కెచ్!
లండన్: బ్రిటన్‌లోకి విదేశీ విద్యార్థుల రూపంలో పోటెత్తుతున్న వలసల కట్టడికి ప్రధాని రిషి సునాక్ సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నిబంధనలను కఠినతరం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దిగువ శ్రేణి డిగ్రీ చదివేందుకు, డిపెండెంట్లుగా ఉండేందుకు వస్తున్న వారందరినీ నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని కార్యాలయ ఉన్నతాధికారి వెల్లడించారని బీబీసీ పేర్కొంది. ‘‘వలసలు బ్రిటన్ను వేధిస్తున్నాయి. 2021లో 1,73,000గా ఉన్న వలసలు ఈ ఏడాది 5,04,000కు పెరిగాయి. విదేశీ విద్యార్థుల్లో చైనాను భారతీయులు వెనక్కినెట్టారు. కానీ వీరిని తగ్గిస్తే ఆ సీట్లను బ్రిటన్ వర్సిటీలు స్థానిక విద్యార్థులకు తక్కువ ఫీజుకే ఇవ్వాల్సి ఉంటుంది. అవి భారీ ఆదాయాన్ని కోల్పోతాయి. ఆదాయం కాపాడుకుంటూ, అంతర్జాతీయ విద్యార్థుల్ని తగ్గించుకోవడం సంక్షిష్టమైన అంశం’’ అని సునాక్ అధికార ప్రతినిధి శుక్రవారం అన్నారు. భారత విద్యార్థులు వీసా ముగిసినా బ్రిటన్‌లో తిష్ట వేస్తున్నారన్న హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ వ్యాఖ్యలు దీనికి నేపథ్యంగా భావిస్తున్నారు. -
గల్ఫ్ దేశాల్లో వలస కార్మికుల రక్షణే ధ్యేయంగా
-
గల్ఫ్ దేశాల్లో వలస కార్మికుల రక్షణే ధ్యేయంగా
గల్ఫ్ వలసలు - ఘర్ వాపసీ, కార్మికుల పునరావాసం గురించి ఐఎల్ఓ (ఇంటర్నేషనల్ లేబర్ మైగ్రేషన్) ప్రతినిధులతో గల్ఫ్ జేఏసీ ప్రతినిధులు చర్చించారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐఎల్ఓ దక్షిణ ఆసియా దేశాల ఇంచార్జి, కార్మికుల వలస వ్యవహారాల నిపుణుడు డినో కోరెల్, సాంకేతిక నిపుణుడు అమిష్ కర్కి హైదరాబాద్‌లో వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల నుండి వివిధ కారణాల వలన తిరిగి వచ్చిన వలస కార్మికులకు స్వగ్రామాలలో పునరావాసం కల్పించడం, వారు సమాజంతో, కుటుంబంతో మమేకమవ్వడం వంటి అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు భీం రెడ్డి తెలిపారు. అంతకు ముందు ఐఎల్ఓ ప్రతినిధి సంజయ్ అవస్థి, ఐఓఎం (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్) ప్రతినిధి డగ్మార్ వాల్టర్ ల ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిలతో సమావేశమయ్యారు. -
పల్లెకు పోదాం చలో చలో.. రివర్స్ మైగ్రేషన్‌కు మోడల్‌గా నిలిచిన మన్దీప్ కౌర్
పట్టణాల్లో ఉపాధి వెదుక్కుంటూ చాలామంది పట్నం బాట పడుతుంటే, పల్లెకళ మాయమవుతోంది. ఏ మూల చూసినా నిరుపేద నిశ్శబ్దం. అలాంటి పల్లెల్లో పంజాబ్‌లోని తంగ్రా కూడా ఒకటి. ఒకప్పుడు ఈ మారుమూల గ్రామం గురించి చుట్టుపక్కల ఎన్ని గ్రామాలకు తెలుసో తెలియదుగానీ మన్‌దీప్‌కౌర్ పుణ్యమా అని ఇప్పుడు చాలా ప్రసిద్ధి పొందింది. ‘రివర్స్ మైగ్రేషన్’కు మోడల్‌గా నిలిచింది. ‘రూరల్ ఐటి మోడల్’ కాన్సెప్ట్‌కు అపారమైన బలాన్ని ఇచ్చింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన మన్దీప్ చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేది. ‘మన జీవితాలు మారాలంటే చదువు తప్ప మరోదారి లేదు’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేసిన మన్‌దీప్‌కు రహేజా గ్రూప్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం పాతికవేలు. ఆ తరువాత... బ్యాంకాక్‌కు చెందిన ప్రసిద్ధనగల కంపెనీలో ఉద్యోగం చేసింది. అక్కడ మార్కెటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం దొరికింది. వివాహం తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి భర్తతో పాటు అమెరికా వెళ్లింది కౌర్. భర్త ఐటీ ప్రొఫెషనల్. అక్కడ ఉన్నప్పుడు సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన చేసింది. తన ఆలోచనను భర్తతో పంచుకుంటే ఆయన సానుకూలంగా స్పందించారు. అలా ‘శింబాక్వార్జ్’ రూపంలో తొలి అడుగుపడింది. ఈ ఇ–కామర్స్ ప్లాట్‌ఫామ్ సక్సెస్ అయింది. కొన్ని సంవత్సరాల తరువాత స్వదేశానికి తిరిగివచ్చిన కౌర్ తన స్వగ్రామం తంగ్రాలో ‘శింబాక్వార్జ్’ అనే ఐటీ కంపెనీ ప్రారంభించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. పల్లెటూరిలో ఐటీ కంపెనీ ఏమిటి! అని చాలామంది ఆశ్చర్యపడ్డారు. రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకురాలేదు. మౌలిక వసతుల లేమి అనేది మరో సమస్య. అయితే ఆమె సంకల్పబలానికి ఇవేమీ అడ్డుకాలేదు. తన సేవింగ్స్‌తో కంపెనీ మొదలుపెట్టింది. ప్రారంభంలో ముగ్గురు ఉద్యోగులు ఉండేవారు. ఐఐటీ, ఐఐఎంఎస్ క్యాంపస్‌లలో నుంచి చురుకైన స్టూడెంట్స్‌ను ఉద్యోగులుగా ఎంపిక చేసుకున్నారు. తంగ్రా గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువతీ,యువకులు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తమ ఊళ్లోనే, తమ దగ్గరి ఊళ్లోనే ఐటీ కంపెనీ మొదలైందని తెలిసి కొద్దిమంది చేరారు. అలా కంపెనీ ప్రస్థానం మొదలైంది. కొద్దికాలంలోనే మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, కన్సల్టేషన్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్...మొదలైన విభాగాల్లో ‘శింబాక్వార్జ్’ దూసుకుపోయింది. ఉద్యోగుల సంఖ్య వందకు పెరిగింది. కంపెనీ పుణ్యమా అని ఊళ్లో సందడి పెరిగింది. కొత్త కళ వచ్చింది. అయితే కరోనా కఠోర సమయంలో పెద్ద సవాలు ఎదురైంది. పెద్ద పెద్ద కంపెనీలే ఉద్యోగులను తొలిగిస్తూనో, జీతాలు బాగా తగ్గిస్తూనో ఉన్న కాలం అది. ‘శింబా’ కంపెనీ సంక్షోభంలోకి వెళ్లింది. ‘అలాంటి కఠిన సమయంలోనూ ఏ ఒక్క ఉద్యోగిని కంపెనీ నుంచి తీసివేయాలని, జీతం తగ్గించాలనుకోలేదు. ఎందుకంటే నన్ను నమ్మి ఎన్నో కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. అవసరం అయితే జీరో నుంచి మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభించాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది కౌర్. గడ్డుకాలం పూర్తయిన తరువాత... కంపెనీ మళ్లీ ఊపందుకుంది. ‘స్మైల్స్ కేర్’ అనే స్వచ్చంద సంస్థను నెలకొల్పి గ్రామాలలోని అట్టడుగువర్గాల ప్రజలకు సేవ చేస్తుంది కౌర్. మరోవైపు మోటివేషనల్ స్పీకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ముఖాముఖీ సమావేశం అయిన మన్‌దీప్‌కౌర్, ఆయన నుంచి ప్రశంసలు అందుకుంది. -
పల్లె జనం పట్టణ బాట
సాక్షి, అమరావతి: పల్లె జనం పట్టణ బాట పడుతున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం గ్రామీణులు పట్టణాలకు వలస వెళ్తున్నారు. దీంతో దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల (హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్) మంత్రిత్వ శాఖ 2021–22 వార్షిక నివేదికలో వెల్లడించింది. గ్రామాల్లో విద్యా సౌకర్యాలు మెరుగుపడుతుండటంతో చదువుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. వారంతా ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్తున్నారు. చదువుకోని వారు కూడా ఉపాధిని వెదుక్కుంటూ పట్టణాలకు చేరుతున్నారు. చదువుకొని, నైపుణ్యం కలిగిన వారు ఉద్యోగాలు చేసుకొంటూ పట్టణాల పరిధిలో నివాసం ఉంటుంటే.. సాంకేతిక నైపుణ్యాలు లేని వారు ఏదో ఒక పని చేసుకొంటూ పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దీంతో ఆ గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరిగి, అతి తక్కువ కాలంలోనే అవి పట్టణాల్లో అంతర్భాగమవుతున్నాయి. తద్వారా పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన బాధ్యత కూడా స్థానిక సంస్థలకు పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్రాలు అమలు చేసే వివిధ పట్టణాభివృద్ధి, నివాస పథకాలు, పట్టణ జీవనోపాధి మిషన్ వంటి కార్యక్రమాలు కూడా పట్టణీకరణకు బాటలు వేస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది. పేదరికం తగ్గుతుందనడానికి ఇదో సూచన భారతదేశంలో పట్టణీకరణ ముఖ్యమైన ప్రక్రియగా మారిందని, ఇది జాతీయ ఆర్థిక వృద్ధితో పాటు తగ్గుతున్న పేదరికానికి ముఖ్యమైన సూచనగా ఉందని ఆ నివేదిక తెలిపింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడిప్పుడే పట్టణీకరణను సంతరించుకుంటున్నాయని, దీనివల్ల పట్టణీకరణ మరింత పెరుగుతుందని అభిప్రాయపడింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాలు విస్తరిస్తాయని తెలిపింది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి ఎజెండా అయిన సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్–2030 (ఎస్డీజీ) కూడా ఇదే అభిప్రాయాన్ని చెబుతున్నట్టు పేర్కొంది. జీడీపీలో 60 శాతం పట్టణాలదే దేశంలో 10 లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు 53కు చేరుకుంటాయని నివేదిక తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 377 మిలియన్లు (37.71 కోట్ల మంది) అంటే దేశ జనాభాలో 31.16 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2031 నాటికి ఈ సంఖ్య 60 కోట్లకు చేరుతుందని అంచనా. అంతేగాక పట్టణాలు గ్రోత్ ఇంజన్లుగా పనిచేస్తున్నాయని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 60 శాతం కంటే ఎక్కవ వాటాను పట్టణ జనాభా అందిస్తుండడమే అందుకు నిదర్శనమని పేర్కొంది. 2001లో దేశంలో 5,161 పట్టణాలు ఉండగా.. 2011 నాటికి వాటి సంఖ్య 7,933కి పెరిగిందని, 2050 నాటికి దేశ జనాభాలో 50 శాతం పట్టణాల్లోనే ఉంటుందని పేర్కొంది. కాగా భారతదేశ జనాభా 2050 నాటికి 164 కోట్లకు చేరుకుంటుందని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో అంతర్భాగమైన స్వతంత్ర జనాభా, ఆరోగ్య పరిశోధన కేంద్రం ‘ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’ (ఐహెచ్ఎంఈ) అంచనా వేసింది. ఈ లెక్కల ప్రకారం మరో 30 ఏళ్లకు భారతదేశ పట్టణ జనాభా 82 కోట్లకు చేరుకుంటుంది. పట్టణాల ముందు సవాళ్లూ ఉన్నాయ్.. వేగవంతమైన పట్టణీకరణ తాగు నీరు, పారిశుద్ధ్యం, పట్టణ రవాణా వంటి సేవలను మెరుగుపరచడం వంటి అనేక సవాళ్లను స్థానిక సంస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. దీంతో పాటు పట్టణ పేదరికాన్ని తగ్గించడం, మురికివాడల వ్యాప్తి నివారణ వంటివీ చేపట్టాల్సి ఉంటుంది. పాక్షిక పట్టణీకరణ ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే ఈ తరహా సమస్యలు ఎదురవుతున్నాయి. నీటి సరఫరా, మురుగునీరు, డ్రైనేజీ నెట్వర్క్, ఘన/ద్రవ వ్యర్థాల నిర్వహణ సౌకర్యాలు, రహదారులు, ప్రజా రవాణా, వీధి దీపాలు, పాదచారుల మార్గాలు వంటి ప్రజా భద్రతా వ్యవస్థలు వంటి ప్రాథమిక సేవలు, జనాభా పెరుగుదలకు అనుగుణంగా భూమి, నివాస సౌకర్యాలు కల్పించడం సాధ్యపడటంలేదని తేల్చింది. -
ఉక్రెయిన్ వలసలు 10 లక్షలు
కీవ్: రష్యా దాడుల పర్యవసానంగా ఉక్రెయిన్ జనాభాలో 2% మంది నివాసాలను వదిలిపెట్టి వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. కేవలం వారం రోజుల్లోనే 10 లక్షల మంది వలసబాటపట్టారని తెలిపింది. ఈ శతాబ్దంలోనే అత్యంత వేగవంతమైన వలసలుగా అభివర్ణించింది. దేశంలోని రెండో అతిపెద్ద నగరంతోపాటు, వ్యూహాత్మకమైన రెండు నౌకాశ్రయాలపై రష్యా సైన్యం దాడులు ముమ్మరమయ్యాయి. సుమారు 15 లక్షల జనాభా కలిగిన ఖర్కీవ్ నగర జనావాసాలపై ఒక వైపు బాంబుదాడులు జరుగుతున్నా ప్రజలు అక్కడి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఐరాస వలసల విభాగం తెలిపింది. ఖర్కీవ్ రైల్వే స్టేషన్లో పెద్ద సంఖ్యలో చేరిన ప్రజలు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకుండా వచ్చిన రైళ్లలోకి ఎక్కి వెళ్లిపోతున్నారని పేర్కొంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెలుపల భారీ సంఖ్యలో బారులు తీరిన ట్యాంకులు, ఇతర వాహనాలు రెండు రోజులుగా అక్కడే తిష్టవేశాయని తెలిపింది. అజోవ్ సముద్ర తీర నగరం మరియుపోల్‌ను రష్యా బలగాలు దిగ్బంధించాయని, నల్లసముద్రంలోని మరో కీలక నౌకాశ్రయం పరిస్థితి అస్పష్టంగా ఉందని బ్రిటన్ రక్షణ మంత్రి చెప్పారు. మరో పెద్ద నగరం ఖెర్సన్ తమ పూర్తి అధీనంలోకి వచ్చిందని రష్యా బలగాలు ప్రకటించుకున్నాయి. దాడులు మొదలైనప్పటి నుంచి 227 మంది పౌరులు చనిపోగా, 525 మంది క్షతగాత్రులైనట్లు యూఎన్‌హెచ్‌సీఆర్ తెలపగా, 2 వేల మందికి పైగానే చనిపోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. అయితే, సైన్యానికి జరిగిన నష్టాన్ని తెలపలేదు. మొదటిసారిగా, రష్యా కూడా తమ బలగాలకు వాటిల్లిన నష్టం వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు సుమారు 500 సైనికులు చనిపోగా, 1,600 మంది గాయపడినట్లు పేర్కొంది. ఇదే ప్రతిఘటనను కొనసాగించండి రష్యా సేనలను ప్రజలు ప్రతిఘటిస్తున్న తీరుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ప్రశంసలు కురిపించారు. ఇదే ప్రతిఘటనను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆక్రమణదారులను ప్రశాంతంగా ఉండనివ్వవద్దన్నారు. వారు నైతిక స్థైర్యం కోల్పోతారన్నారు. రష్యా సైనికులు సూపర్‌పవర్ సైనికులు కాదు, అయోమయంలో ఉన్న పిల్లలని అభివర్ణించారు. (చదవండి: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థిపై కాల్పులు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) -
ఉక్రెయిన్ వలసలు 5 లక్షలు: ఐరాస
జెనీవా: రష్యా ఆక్రమణతో ఉక్రెయిన్ నుంచి ప్రజలు భారీగా వలస బాట పట్టారు. దేశం వీడి వెళ్లే వారితో సరిహద్దు పాయింట్లు రద్దీగా మారాయి. కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ నుంచి 5లక్షల మందికి పైగా ప్రజలు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి వలసల విభాగం(యూఎన్‌హెచ్‌సీఆర్) హై కమిషనర్ ఫిలిపో గ్రాండి చెప్పారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ పోతోందని ఆయన సోమవారం ట్విట్టర్లో తెలిపారు. -
3.68 లక్షలకు చేరుకున్న ఉక్రెయిన్ వలసలు: ఐరాస
జెనీవా: రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజల వలసలు వేగంగా పెరుగుతున్నాయని ఐరాస వలస విభాగం తెలిపింది. శనివారం అంచనా ప్రకారం కనీసం 1.50 లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్ వీడి పోగా ఆదివారానికి ఈ సంఖ్య 3.68 లక్షలకు చేరుకున్నట్లు పేర్కొంది. వీరంతా పోలండ్, హంగరీ, రొమేనియా తదితర దేశాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ వీడి వచ్చే వారితో పోలండ్ సరిహద్దుల్లో 14 కిలోమీటర్ల పొడవైన కార్ల క్యూ ఉందని వలస విభాగం ప్రతినిధి క్రిస్ మీజర్ ట్విట్టర్లో తెలిపారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారన్నారు. ఎముకలు కొరికే చలిలో వీరు రాత్రంతా కార్లలోనే జాగారం చేశారని చెప్పారు. -
యూపీలో బీజేపీకి భారీ షాక్.. పార్టీని వీడిన మూడో మంత్రి
-
యూపీలో బీజేపీకి భారీ షాక్.. పార్టీని వీడిన మూడో మంత్రి
లక్నో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే యూపీలో అధికార బీజేపీ నుంచి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, బీజేపీకి చెందిన మరో మంత్రి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన స్వతంత్ర మంత్రి ధరమ్‌సింగ్ సైనీ పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖేష్ వర్మ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే మంత్రి రాజీనామా చేయడం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీని మారిన విషయం తెలిసిందే. యూపీలో వరుస నిష్క్రమణలకు కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఆద్యం పోసినట్లు చర్చకొనసాగుతుంది. పార్టీని వీడిన నాయకులు.. ప్రధానంగా బీజేపీ అధికార నాయకత్వం.. వెనుక బడిన వర్గాలపై వివక్ష చూపిస్తుందని, ప్రజా ప్రతినిధులను పట్టించుకోకుండా, అగౌరవ పర్చిందని ఎద్దేవా చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ముఖేష్ వర్మ తన లేఖలో ఒక అడుగు ముందుకేసి ‘స్వామి ప్రసాద్ మౌర్య వెనుకబడిన వర్గాల గొంతు’అని, ‘మా నాయకుడని’ లేఖలో అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది. కాగా, స్వామి ప్రసాద్ మౌర్యతోపాటు.. మరికొందరు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరనున్నారో మరికొన్నిరోజుల్లో తెలువనుంది. ప్రస్తుతం బీజేపీ నుంచి వరుస వలసలతో పెద్ద రాజకీయా దుమారం కొనసాగుతుంది. చదవండి: యూపీ ఎన్నికలు.. ఉన్నవ్ అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్ -
రికార్డులలో పేర్లున్నాయ్ కానీ.. ఊళ్లు లేవ్
చరిత్ర పుటల్లో చెదరని చరితం ఆ గ్రామాల సొంతం. భౌతికంగా అక్కడ ఊళ్లు లేకపోయినా రికార్డుల్లో చిరునామాలు మాత్రం ఉన్నాయి. గతంలో అక్కడ ప్రజలు నివసించే వారని చెప్పేందుకు ఆనవాలుగా శిథిల గోడలు, బావులు, గ్రామ చావిడిలు దర్శనమిస్తున్నాయి. ఇదీ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలోని ఈచనహాల్, గుర్రాలదొడ్డి, కాటదొడ్డి, కోసిగి మండలంలోని బాత్ర బొమ్మలాపురం, కలవలగుండు, పుట్టకుంట, పెండేకల్లు, ఎండపల్లి గ్రామాల పరిస్థితి. దొంగల బెడదతో.. కౌతాళం–ఉరకుంద గ్రామ రోడ్డులో ఈచనహాల్ గ్రామం ఉండేది. ఒకప్పుడు దాదాపు 40 కుటుంబాలు ఆ ఊళ్లో నివాసం ఉండేవి. గ్రామం వంకను ఆనుకుని ఉండటం.. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో రాత్రిళ్లు దొంగలు ఇళ్లలో ప్రవేశించి విలువైన వస్తువులు అపహరిస్తుండేవారట. దొంగల బెడద భరించలేక అక్కడ ఉన్న కుటుంబాలు ఓబుళాపురం, కామవరం, కౌతాళం గ్రామాలకు వలస వెళ్లి పోయారు. బంగారమ్మవ్వ, ఆంజనేయస్వామి ఆలయాలు, శిథిలమైన గ్రామచావిడి, రాతి బావి ఇప్పటికీ గ్రామానికి సాక్షీభూతంగా నిలిచాయి. రెవెన్యూ రికార్డులలో 816 ఎకరాల సాగుభూమి ఈచనహాల్ గ్రామ పంచాయతీ పేరుపైనే ఉండటం విశేషం. ఈచనహాల్ గ్రామానికి చెందిన గ్రామ చావిడి (శిథిలస్థితిలో) పట్నం బాటలో పెండేకల్లు కోసిగి మండల కేంద్రానికి ఈశాన్య దిశగా పెండేకల్లు ఉండేది. చాలా కాలం క్రితం దాదాపు 35 కుటుంబాలు అక్కడ నివాసం ఉండేవి. ఏళ్ల క్రితం నుంచి ఒక్కొక్కరు మండల కేంద్రానికి వలసబాట పట్టారు. కోసిగిలో వారిని పెండేకల్లు ఇంటిపేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. దాదాపు 150 కుటుంబాలు కోసిగిలో ఉన్నాయి. గ్రామ గుర్తుగా పెండేకల్లు ఆంజనేయస్వామి ఆలయం ఉంది. గ్రామానికి సంబంధించి రెవెన్యూ రికార్డులో 1423.16 ఎకరాల సాగుభూమి ఉంది. వరద పోటుతో.. కౌతాళం మండలంలో తుంగభద్ర నది ఒడ్డున ఒకప్పుడు కాటదొడ్డి, గుర్రాలదొడ్డి ఉండేవి. ఏళ్ల క్రితం గుర్రాలదొడ్డి పూర్తిగా కనుమరుగైంది. ఆ పక్కనే ఉన్న కాటదొడ్డిలో 20 కుటుంబాలకుపైగా ఉండేవి. వరద పోటుకు కుటుంబాలన్నీ గుడికంబాలి, కుంభళనూరు గ్రామాలకు వలస వెళ్లాయి. రెవెన్యూ రికార్డుల్లో 418 ఎకరాలు సాగుభూమి కాటదొడ్డి గ్రామం పేరుపైనే ఉంది. గుర్రాలదొడ్డి గ్రామం పేరుపై ఎలాంటి ఆస్తులు లేవు. కోసిగి మండలంలోని బాత్ర బొమ్మలాపురం ప్రస్తుత ఆర్డీఎస్ ఆనకట్టను ఆనుకుని ఉండేది. వరదల కారణంగా ఊరంతా కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. కొందరు అగసనూరు, సాతనూరు, కందకూరు గ్రామాల్లో స్థిరపడ్డారు. బాత్ర బొమ్మలాపురం పేరుపై 600 ఎకరాల భూములు రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ ఉన్నాయి. గ్రామం గుర్తుగా మారెమ్మ ఆలయం మాత్రం దర్శనమిస్తుంది. ప్లేగు వ్యాధి కారణంగా.. ప్లేగు వ్యాధి కారణంగా ఎన్నో పల్లెలు కనుమరుగైనట్లు చరిత్ర చెబుతోంది. ఈ కోవలోనే కోసిగి మండలం కలవలగుండు, పుట్టకుంట, ఎండపల్లి గ్రామాలు కనుమరుగైనట్లు పెద్దలు పేర్కొంటున్నారు. కలవలగుండు గ్రామంలో 574.95 ఎకరాల సాగు భూమి ఉంది. ప్రస్తుతం పొలాలు పల్లెపాడు, చింతకుంట, పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్నారు. కలవలగుండు ప్రాంతంలో సుంకులమ్మ ఆలయం, కొండపై, కింద భాగాల్లో రాతి రోళ్లు ఉన్నాయి. కోసిగి మండలం అర్లబండ, కడదొడ్డి గ్రామాల మధ్యలో పుట్టకుంట అనే గ్రామం ఉండేది. అంతుచిక్కని వ్యాధి కారణంగా కుటుంబాలు అర్లబండ బాట పట్టాయి. కోసిగి మండలం దుద్ది గ్రామం దక్షిణ దిశగా ఎండపల్లి గ్రామం ఉండేదట. శతాబ్దాల క్రితమే గ్రామం కనుమరుగై పోయింది. దుద్ది, కోసిగి గ్రామాల్లో ఎండపల్లి వాసులు నివాసం ఉంటున్నారు. కొందరు ఎండపల్లి ఇంటి పేరుగా కొనసాగుతున్నారు. ప్లేగు వచ్చి ఊరు వదిలారు నా పేరు శివారి గజ్జయ్య. మాది కోసిగి మండలం పల్లెపాడు గ్రామం. మా గ్రామానికి దక్షిణ దిక్కున నాలుగు తరాల క్రితం కలవలగుండు అనే ఊరు ఉండేదని మా పెద్దలు చెప్పేవారు. ఇప్పటికీ ఆ గ్రామం ఆనవాలుగా బండరాళ్లపై రోళ్లు, పాడుబడిన గోడలు ఉన్నాయి. అక్కడే సుంకులమ్మ ఆలయం, కొంత దూరంలో ఆంజనేయస్వామి విగ్రహాలున్నాయి. అప్పట్లో ప్లేగు వచ్చి ఊరు ఖాళీ అయ్యిందట. మా ముత్తాతల నాడే వలస నా పేరు గోపాలు. మా ముత్తాతలు ఈచనహాల్ నుంచి కౌతాళం మండల కేంద్రానికి వచ్చారట. అందుకే మా ఇంటి పేరు ఈచనహాల్గా మారిందట. దోపిడీ దొంగల బెడద కారణంగా మా ముత్తాతలు ఊరిని వదిలేసి వచ్చారని చెబుతారు. ఇప్పటికీ మాకు ఆ గ్రామ పొలిమేరలోనే రెండు ఎకరాల భూమి ఉంది. వరదలకు ఊరు ఖాళీ నా పేరు ఈరన్న. మాది కాటదొడ్డి గ్రామం. గ్రామంలో గతంలో 20 కుటుంబాలకుపైగా ఉండేవారు. గతంలో వరదలకు ఊరు ముంపునకు గురి కావడంతో కుటుంబాలన్నీ కుంబళనూరుకు మారాయి. ఆంజనేయస్వామి గుడి ఉండటంతో పూజారులుగా మా మూడు కుటుంబాలు ఇక్కడే ఉండిపోయాం. -
జీవనయానం వలస ప్రయాణం
చరిత్ర గురించి చాలా నిర్వచనాలే ఉండొచ్చు. స్థూలంగా మానవుల వలస పరిణామాన్ని నమోదు చేసే కథనమే చరిత్ర. వలసలు లేకుండా మానవాళికి మనుగడ లేదు. చరిత్ర అంతా వలసల మయమే! ప్రకృతి సానుకూలత లేని ప్రదేశాలను విడిచిపెట్టి, సురక్షిత ప్రదేశాలకు వలస వచ్చిన మానవులు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నప్పుడు నాగరికతలు ఏర్పడ్డాయి. నాగరికతల పరిణామ క్రమంలో స్థిర నివాసాల సంస్కృతి వ్యాప్తిలోకి వచ్చినంత మాత్రాన మనుషుల వలసలు ఆగిపోలేదు. ప్రకృతి బీభత్సాల నుంచి, యుద్ధాల నుంచి, నియంతృత్వ పీడనల నుంచి, కరవు కాటకాల నుంచి వీలైనంత దూరంగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవడానికే మనుషులు ప్రయత్నిస్తారు. పుట్టిపెరిగిన చోట చాలీచాలని బతుకులను బలవంతంగా నెట్టుకొచ్చే కంటే, ఎంత దూరమైనా వెళ్లి బతుకులను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో మెరుగైన జీవితాల కోసం మనుషులు తాము పుట్టి పెరిగిన ప్రదేశాలను విడిచిపెట్టి, దేశాలను దాటి వలసలు వెళుతూనే ఉన్నారు. వలసలు మనుషులకు మాత్రమే పరిమితం కాదు. భూమ్మీద మనుషులే కాకుండా, జలచర ఖేచరాదులు కూడా సానుకూల పరిసరాలను వెదుక్కుంటూ సుదూర ప్రదేశాలకు వలస వెళతాయి. ఇప్పుడు మన దేశంలో వలసపక్షుల కాలం మొదలైంది. ఖండాంతరాలను దాటి శరదృతువులో ఇక్కడకు చేరుకునే నానాజాతుల పక్షులు వసంత రుతువు వరకు ఉంటాయి. మనుషుల వలసలకు, పక్షుల వలసలకు తేడాలున్నాయి. మనుషులకు తాము పుట్టి పెరిగిన ప్రదేశం కంటే వలస వచ్చిన ప్రదేశమే సురక్షితంగా, తమ అభివృద్ధికి భేషుగ్గా ఉన్నట్లయితే, అక్కడే స్థిరపడిపోయి, తరతరాలుగా పాతుకుపోతారు. పాపం, పక్షులు అలా కాదు. వాటి వలసలన్నీ కేవలం రుతుధర్మాన్ని అనుసరించే సాగుతాయి. వలసల్లో పక్షుల క్రమశిక్షణ తిరుగులేనిది. కచ్చితంగా నిర్ణీత కాలానికి వస్తాయి.æఅంతే కచ్చితంగా నిర్ణీత కాలానికి తమ తమ నెలవులకు తిరిగి వెళ్లిపోతాయి. మనుషుల మాదిరిగా ఆస్తులు కూడబెట్టుకుని, శాశ్వతంగా ఉండిపోవాలనుకోవు. శరదృతువు ఆగమనంతోనే మన దేశంలోని ప్రధానమైన సరస్సుల వద్ద వలసపక్షుల సందడి మొదలవుతుంది. ఒడిశాలోని చిలికా, ఆంధ్రప్రదేశ్‌లోని పులికాట్, కొల్లేరు, గుజరాత్‌లోని నలసరోవర్, కేరళలోని కుమరకోమ్ వంటి సరస్సుల వద్దకు, పశ్చిమబెంగాల్లోని సుందర్బన్, అరుణాచల్‌లోని ఈగల్నెస్ట్ వంటి అభయారణ్యాలకు వందలాది జాతులకు చెందిన లక్షలాది వలస పక్షులు వస్తాయి. ధ్రువప్రాంతంలోని శీతల వాతావరణానికి దూరంగా, కాస్త వెచ్చగా ఉండే ప్రదేశాలకు ఈ పక్షులు వలస వస్తాయి. గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలు చేస్తాయి. పిల్లలకు రెక్కలు రాగానే, వాటితో కలసి వేసవి మొదలవుతుండగా తిరిగి వెళ్లిపోతాయి. వలసల్లో మనుషుల పద్ధతి కాస్త భిన్నం. తరతరాల కిందట మన దేశం నుంచి వలసవెళ్లిన మనవారు వివిధ దేశాల్లో పూర్తిగా స్థిరపడిపోయారు. కొన్ని దేశాల్లో అధికార పదవులనూ దక్కించుకున్నారు. అలాగని వలసలన్నీ సుఖప్రదమైన ప్రయాణాలు కావు. పక్షులకైనా, మనుషులకైనా వలసల్లో ఆటుపోట్లు, అడుగడుగునా ప్రమాదాలూ తప్పవు. ప్రకృతి వైపరీత్యాల నుంచి వలసపక్షులకు మార్గమధ్యంలో ఆపదలు ఎదురవుతుంటాయి. వాటన్నింటినీ అధిగమించి సానుకూల వాతావరణంలోకి వలస వచ్చి, గూళ్లు ఏర్పాటు చేసుకున్నా, వాటి మనుగడకు పూర్తి భద్రత ఉండదు. వేటగాళ్ల వలలకు, ఉచ్చులకు చిక్కి బలైపోతుంటాయి. ఇన్ని కష్టనష్టాల తర్వాత ప్రాణాలతో మిగిలినవి మాత్రమే తిరిగి తమ స్వస్థలాలకు సురక్షితంగా చేరుకోగలుగుతాయి. బతుకుతెరువు కోసం వలస వెళ్లే మనుషుల పరిస్థితీ అంతే! ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికులు దళారుల చేతిలో మోసపోయి, వెట్టి చాకిరి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడే పరిస్థితులు ఉన్నాయి. అనుకోని దుర్ఘటనల్లో అయినవారికి దూరంగా ప్రాణాలు పోగొట్టుకునే ఉదంతాలూ ఉన్నాయి. మంచు గడ్డకట్టే శీతల వాతావరణాన్ని తట్టుకునేందుకు ఏకకణ జీవి అమీబా మొదలుకొని, క్షీరదమైన మంచు ఎలుగుబంటి వంటి జీవులు శీతాకాలమంతా ఉన్న చోటనే కదలకుండా పడిఉండి సుప్తావస్థలో గడుపుతాయి. నిత్యచైతన్యశీలత కలిగిన పక్షులు ఇలా సుప్తావస్థలోకి జారుకోలేవు. అందుకే తమ స్వేచ్ఛా విహారానికి తగిన మెరుగైన పరిసరాలను అన్వేషిస్తూ వలసలు ప్రారంభిస్తాయి. వాతావరణం ఎంత ప్రతికూలంగా మారినా, ఎక్కడికక్కడే ఉండిపోయి సుప్తావస్థలోకి జారుకోవడం స్తబ్ధతకు పరాకాష్ఠ! ఇలాంటి స్తబ్ధత కొందరు మనుషుల్లోనూ ఉంటుంది. పరిస్థితుల్లోని మార్పులకు స్పందించకుండా, ఎలాంటి కదలికా లేకుండా శీతలనిద్రలోకి జారుకునే మనుషులు చరిత్ర ప్రవాహంలో ఆనవాళ్లే లేకుండా కొట్టుకుపోతారు. బలమైన ఆకాంక్షలతో వలసల బాట పట్టిన సమూహాలు, వ్యక్తులు చరిత్రగతిని మార్చేసిన ఉదంతాలు మనకు తెలుసు. ఎక్కడెక్కడి నుంచో ఈ దేశానికి వలస వచ్చిన సమూహాలు, ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుని, శతాబ్దాల తరబడి పాలన సాగించాయి. స్థానికులపై నిర్దాక్షిణ్యంగా అణచివేత సాగించాయి. ఉన్నత విద్య కోసం బ్రిటన్‌కు, ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లిన గాంధీజీ, తన వలస ప్రస్థానాన్ని స్వాతంత్య్రోద్యమానికి పునాదిగా మలచుకున్నారు. శ్వేతజాతీయుల వలస ఈ దేశాన్ని బానిసత్వంలోకి నెట్టేస్తే, గాంధీజీ వంటి జాతీయ నాయకుల వలస ఈ దేశ స్వాతంత్య్రానికి ఊపిరిపోసింది. అన్ని ప్రయాణాల్లో మాదిరిగానే వలసల్లోనూ ప్రమాదాలు అనివార్యం. అంతమాత్రాన వలసలు ఆగిపోవు, చరిత్రా ఆగిపోదు! -
సువేందును భయపెడుతున్న ఆ 24 మంది..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీకి షాకుల మీద షాకుల తగులుతున్నాయి. బీజేపీ తరఫున గెలిచిన ముకుల్ రాయ్ తృణమూల్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఆయన బాటలో మరి కొందరు పయణించే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలందరు తమతోనే ఉన్నారని నిరూపించుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు గండి పడింది. బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి, గవర్నర్ భేటీకి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఈ సంఘటనతో మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలోకి తిరుగుపయనం కానున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. సువేందు అధికారి సోమవారం సాయంత్రం గవర్నర్ జగ్దీప్ ధన్కర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనుచిత సంఘటనలు, వాటి పరిణామాలతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. దాంతో వారంతా తిరిగి టీఎంసీలో చేరతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీలోకి వచ్చిన సువేందుకు ప్రతిపక్ష నేత పదవి కట్టబెట్టడాన్ని పలువురు నేతలు జీర్ణించుకోలకపోతున్నారు. సువేందు నాయకత్వాన్ని అంగీకరించడానికి వారు సుముఖంగా లేరు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ముకుల్ రాయ్ టీఎంసీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే మరికొందరు బీజేపీని వీడి తృణమూల్‌లో చేరతారని భావిస్తున్నారు. 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ టీఎంసీ ప్రకటించడం గమనార్హం. చదవండి: ముకుల్‌రాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి -
మనకు రెండో ఇల్లు అదే.. కానీ అమెరికానే ఫేవరెట్
సాక్షి, హైదరాబాద్: గత రెండు దశాబ్దాలుగా భారతదేశం నుంచే అత్యధికంగా విదేశాలకు వలస వెళ్తున్నారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశమే అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో భారత్‌కు విదేశాల నుంచి వలసలు తగ్గిపోయాయి. ఇలా బాగా వలసలు తగ్గిపోయిన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇతర దేశాల పౌరులతో పోలిస్తే భారతీయులే అత్యధికంగా విదేశాల్లో నివసిస్తున్నారు. దాదాపు 1.8 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తుండగా, ఆ తర్వాత మెక్సికో (1.1 కోట్ల మంది), రష్యా (1.1 కోట్ల మంది), చైనా (1 కోటి మంది), సిరియా (80 లక్షల మంది) జాతీయులు విదేశాల్లో ఉంటున్నారు. కాగా అంతర్జాతీయ వలసలు– 2020 నివేదికను ఐక్యరాజ్య సమితి తాజాగా చేసింది. ఈ నివేదిక ప్రకారం గడిచిన రెండు దశాబ్దాల్లో విదేశాల నుంచి వలసలు అత్యతంగా తగ్గిన దేశాల్లో అర్మేనియా మొదటి స్థానంలో నిలవగా, భారత్ రెండో స్థానంలో ఉంది. అర్మేనియా, భారత్, పాకిస్తాన్, ఉక్రెయిన్, టాంజానియా దేశాలకు విదేశీయుల రాక గణనీయంగా తగ్గినట్లు ఐరాస తెలిపింది. మరోవైపు జర్మనీ, స్పెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికాకు వలసలు భారీగా పెరిగినట్లు వెల్లడించింది. మనకు రెండో ఇల్లు యూఏఈ ప్రవాస భారతీయులకు భారత దేశం తర్వాత మరో ఇల్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మారింది. ప్రపంచంలోనే అత్యధికంగా 35 లక్షల మంది ప్రవాస భారతీయులు యూఏఈలో నివాసముంటుండగా, అమెరికాలో 27 లక్షలు, సౌదీ అరేబియాలో 25 లక్షల మంది ఉంటున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్, పాకిస్తాన్, ఖతర్, బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్‌లో కూడా భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉన్నారు. 2020లో 1,78,69,492 మంది ప్రవాస భారతీయులు విదేశాల్లో నివసిస్తుండగా, భారత్‌లో 48,78,704 మంది విదేశీయులు నివాసం ఉంటున్నారు. దేశ జనాభాలో వీరి శాతం 0.4 మాత్రమే కాగా, వీరిలో 2,07,334 మంది శరణార్థులున్నారు. అమెరికాయే ఫేవరెట్.. ప్రపంచవ్యాప్తంగా 28.1 కోట్ల వలసదారులు ఉండగా, వీరిలో మూడో వంతు 20 దేశాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచ వలసదారుల ఇష్టమైన దేశంగా అమెరికా నిలిచింది. అత్యధికంగా 5.1 కోట్ల మంది విదేశీయులు అమెరికాలో నివసిస్తున్నారు. అత్యధిక సంఖ్యలో విదేశీయులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల్లో 1.6 కోట్ల మందితో జర్మనీ రెండో స్థానంలో, 1.3 కోట్ల మందితో సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉంది. రష్యాలో 1.2 కోట్లు, బ్రిటన్, నెదర్లాండ్‌లో 90 లక్షల మంది విదేశీయులు ఉంటున్నారు. ఐరోపాలో అత్యధికంగా 8.7 కోట్ల వలసదారులు నివసిస్తుండగా, ఉత్తర అమెరికాలో 5.9 కోట్లు, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియాలో 5 కోట్ల మంది వలసదారులు ఉంటున్నారు. -
అతిథి ఆగయా
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ శీతాకాలం.. చలిపులిని వెంటబెట్టుకుని రావడమే కాదు.. ఖండాంతరాల్లో ఉన్న ప్రకృతి ప్రసాద విహంగాలకూ ఆహ్వానం పలుకుతుంది. వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే ఎన్నో రకాల పక్షులకు నగరం ఆతిథ్యమిస్తుంది. చలి కాలం ప్రారంభమైందంటే చాలు.. ప్రతి ఏటా వర్ణశోభితమైన పక్షులు నగరంలోని పలు తటాకాల్లో సోయగాల సరాగాలు ఆలపిస్తుంటాయి. కిలకిలారావాలతో ప్రకృతి రమణీయతను ఇనుమడింపజేస్తుంటాయి. రంగురంగుల విహంగాలతో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. ప్రస్తుతం నగర శివారులోని అమీన్పూర్, గండిపేట చెరువులకు విదేశీ వలస పక్షులు వస్తుండటంతో ఈ తటాకాలు నూతన శోభను సంతరించుకుంటున్నాయి. వెర్డిటెర్ ఫ్లై క్యాచర్ ఎక్కడెక్కడి నుంచో.. సైబీరియా నుంచి హైదరాబాద్‌కు సుమారు 20 వేల కి.మీ దూరం ఉంటుందని అంచనా. పక్షులు అంత దూరం నుంచి ప్రయాణించి నగరానికి వలస రావడం గమనార్హం. శీతాకాలంలో అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి వెళ్లడం, తద్వారా వాటికి ఆహార సమస్య ఎదురవడం వంటి కారణాలతో అత్యంత సురక్షిత ప్రాంతంతో పాటు ఆహారం దొరికే ప్రాంతంగా హైదరాబాద్, శివారు ప్రాంతాలను వలస పక్షులు ఎంచుకుంటాయి. ఈ క్రమంలో ఇక్కడి ఆతిథ్యం కోసం నెలల పాటు ప్రయాణం చేసి వస్తుంటాయి. సైబీరియాతో పాటు యూరప్, దక్షిణ యూరేషియా, సెంట్రల్ ఏషియా, రష్యా, టర్కీ, ఆఫ్రికా, ట్రాన్స్– హిమాలయాల నుంచి వివిధ రకాల పక్షులు వలస వస్తుంటాయి. అవి వచ్చే క్రమంలో మధ్యమధ్యలో డే హాల్ట్ (పగలు) చేస్తూ రాత్రి వేళ తమ గమ్యం వైపు సాగిపోతాయి. ఉదాహరణకు సైబీరియా నుంచి వచ్చే పక్షులు చైనా భూభాగంలోని తిపత్, ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లోని చెరువుల వద్ద కొద్ది రోజులు బస చేసి మళ్లీ హైదరాబాద్ వైపు గమ్యం సాగిస్తుంటాయి. అలా దాదాపు నెల, రెండు నెలల పాటు తమ ప్రయాణం కొనసాగిస్తుంటాయి. ప్రతి పక్షి హిమాలయాలను టచ్ చేసి రావాల్సిందే. నగరంలో కొన్ని నెలల పాటు బస చేసి దిగువ ప్రాంతాలకు పయనమై తిరిగి వేసవి కాలం నాటికి స్వస్థలాలకు వెళ్తుంటాయి. ఎల్లో వాగ్‌టేల్ కచ్చిత గమ్యాన్ని ఎలా చేరుకుంటాయి..? పక్షులు కచ్చితమైన గమ్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి పంథాను అనుసరిస్తాయనే సందేహం రావడం సహజం. మనుషులు మొదటిసారి కొత్త గమ్యానికి వెళ్లాలంటే తెలిసిన వారిని అంటిపెట్టుకుని వెళ్లడమో లేదా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జీపీఎస్ ఆధారంగానో వెళ్తుంటారు. ఒకసారి గమ్యాన్ని చేరుకున్నారంటే మరోసారి సులువుగా ఎవరి సహాయం అవసరం లేకుండా ఆ గమ్యాన్ని చేరుకోవచ్చు. అలాగే ఒకసారి దారిని కనిపెట్టిన పక్షులు మరోసారి అవలీలగా ఆ మార్గాన్ని అనుసరిస్తూ వస్తుంటాయి. ఈ క్రమంలో రాత్రివేళల్లో ఆకాశంలోని నక్షత్రాలను, చంద్రుడి దిశలను గుర్తుపెట్టుకుంటాయి. కాలానుగుణంగా నక్షత్రాలు, చంద్రుడి దిశలు ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. ఈ నేపథ్యంలో శీతాకాలంలో ఎన్ని డిగ్రీల కోణంలో ప్రయాణం చేస్తే తమ గమ్యం చేరుకుంటామో పక్షుల మైండ్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఆ మేరకు నక్షత్రాలు, చంద్రుడిని అనుసరిస్తూ రాత్రివేళల్లోనే ఎక్కువగా పక్షులు ప్రయాణం చేస్తుంటాయి. నక్షత్రాలు, చంద్రుడి కిరణాల ప్రసరణతో పైకి ఎగురుకుంటూ వెళ్లే క్రమంలో కింద ఉన్న చెరువులు, కుంటలను కూడా స్పష్టంగా పసిగడతాయి. ఒకవేళ కొత్తగా వలస వచ్చే పక్షులైతే ఇంతకముందు వలస వచ్చిన పక్షులను అనుసరిస్తూ ఉంటాయి. అలా గ్రూపులు గ్రూపులుగా మధ్యమధ్యలో ఆగుతూ చివరకు నగరాన్ని చేరుకుంటాయి. కామన్ స్టోన్‌చాట్ నగరాన్నే ఎందుకు ఎంచుకుంటాయి..? చలికాలంలో పక్షులకు సురక్షితమైన ప్రాంతంగా హైదరాబాద్ ఉంటుంది. చలిని తట్టుకునే ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు కావడంతో పాటు ఆహారానికి కూడా అనువుగా ఉంటాయి. సహజసిద్ధమైన వాతావరణం వలస పక్షులకు ఇక్కడ లభిస్తుంది. చెరువుల చుట్టూ భారీ చెట్లు ఉండటం వలస పక్షులకు అనుకూల అంశం. చెరువుల చెంతనే చెట్లపై గూళ్లు కట్టుకోవడానికి అనువైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. చెరువుల మధ్యలో అక్కడక్కడా రాతి శిలలతో పాటు కృత్రిమంగా ఏర్పాటు చేసిన స్టాండ్లు ఉండటం వల్ల ఫ్లెమింగో వంటి పక్షులు వాటిపై గంటల పాటు స్టే చేస్తూ చేపలను అన్వేషిస్తుంటాయి. ఇలా తమ ఆహారాన్ని సేకరించుకోవడానికి అనువుగా ఉంటుంది. చేపల జోలికి వెళ్లని కొన్ని రకాల పక్షులు చెరువు ఒడ్డు ప్రాంతంలో సంచరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. పక్షులకు అనువైన వాతావరణంతో పాటు వనరులు ఇక్కడ పుష్కలంగా అందుబాటులో ఉండడంతో వలస పక్షులు ఏటా ఇక్కడ వచ్చి విడిది చేస్తుంటాయి. బ్లాక్–టేల్డ్ గాడ్విట్ పక్షి మొత్తం 380 రకాల పక్షి జాతుల్లో దాదాపు 70– 80 వలస పక్షులు ప్రతి ఏటా చలికాలంలో నగరాన్ని ముద్దాడుతుంటాయి. ఇందులో విదేశాలకు చెందిన 40– 45 రకాల పక్షులు విహారం చేస్తుంటాయి. ఇందులో ప్రధానంగా ఫ్లెమింగ్‌లోని పలు రకాల పక్షులు, వెర్డిటెర్ ఫ్లై క్యాచర్, కామన్ స్టోన్‌చాట్, నార్తరన్ షోవలర్, బ్లాక్ టెయిల్డ్ గాడ్విట్, ఎల్లో వాగ్‌టెయిల్, హారియర్స్‌లో పలు రకాల పక్షులు, 12 జాతులకు చెందిన డక్స్, ఈగల్స్, వాడర్స్, లిటిల్ టెర్న్ వంటి ఎన్నో రకాల రంగురంగుల వలస పక్షులను ఈ వింటర్ సీజన్లో చూడవచ్చు. పర్యావరణానికి సంకేతం.. పర్యావరణం ఎలా ఉందో వలస పక్షుల రాకను బట్టి చెప్పవచ్చు. ఇవి ఎక్కువగా వస్తున్నాయంటే ఇక్కడి వాతావరణం ఆమోదయోగ్యంగా ఉందనే భావించాలి. ఒకవేళ వలస పక్షుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయంటే అంతకుముందు కంటే పర్యావరణం దెబ్బతిందన్న సంకేతంగా చెప్పుకోవచ్చని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గత పదేళ్లతో పోలిస్తే వలస పక్షుల రాక కొంచెం తగ్గిందంటున్నారు. పర్యావరణానికి కాస్త విఘాతం కలిగి ఉండవచ్చు లేక వాటి ప్రయాణంలో అవాంతాలు ఎదురై ఉండవచ్చని భావిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే క్రమంలో ఇటీవల రాజస్థాన్‌లో ఒక రకమైన బ్యాక్టీరియా కారణంగా కొన్ని వేల వలస పక్షులు చనిపోయాయి. అలాంటి సంఘటనలు జరగడం ద్వారా కూడా నగరానికి వలస వచ్చే పక్షుల సంఖ్య తగ్గి ఉండవచ్చని చెబుతున్నారు. ఏదేమైనా శీతాకాలం వలస పక్షులను నగరం మురిసిపోతుందనడంలో సందేహం లేదు. నార్తర్న్ షోవెలర్ చెరువులు కాలుష్యం కాకుండా చూడాలి.. వలస పక్షులపై విశ్లేషణ చేయడంతో పాటు ఫొటోలు తీసి ‘బర్డ్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్’ గ్రంథంలో ప్రస్తావించాను. ఇప్పటివరకు నేను 226 రకాల పక్షుల ఫొటోలను తీశాను. వీటిలో దాదాపు 80 రకాల వలస పక్షులు శీతాకాలంలో నగరానికి రావడం గమనించాను. పక్షులు విరివిగా రావాలంటే మన చెరువులను కాలుష్యం బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ మంగ,‘బర్డ్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్’ రచయిత వలస పక్షుల రాక తగ్గింది.. గత పదేళ్లుగా నగరానికి దాదాపు 50 శాతం మేర వలస పక్షులు రావడం తగ్గింది. అక్టోబర్ 15 నాటికి వలస పక్షులు రాక మొదలవుతుంది. వేసవికాలం ప్రారంభమయ్యే ముందు తిరిగి వెళతాయి. పక్షులకు అనువైన వాతావరణం కల్పించి తగిన ఆతిథ్యం ఇస్తే బాగుంటుం ది. పర్యావరణాన్ని కాపాడినవారమవుతాం. – చెల్మల శ్రీనివాస్, ఓయూ జంతుశాస్త్ర సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ -
బైబై ఇండియా..!
భారత్‌ను వీడి విదేశాల్లో ఆశ్రయం పొందాలనుకుంటున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతర్యుద్ధం, రాజకీయ సంక్షోభం వంటి సమస్యలు లేకపోయినా విదేశాల్లో ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ తెలిపింది. 2008–18 మధ్యకాలంలో ఇలా విదేశాలను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య ఏకంగా 996.33 శాతానికి ఎగబాకిందని వెల్లడించింది. ఇలా ఆశ్రయం కోరుతున్నవారిలో అత్యధికులు అమెరికా, కెనడా దే శాలవైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొంది. సాధారణంగా అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత ఇతర కారణాలతో ప్రజలు ప్రాణాలను అరచేతపెట్టుకుని పారిపోతుంటారు. ఈ తరహా సమస్యలు ఏవీ లేకపోయినా భారత్ నుంచి భారీగా వలసలు పెరగడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల క్రితం పరిస్థితి వేరు... పదేళ్ళ క్రితం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. 2008–09 మధ్యకాలంలో అమెరికా, కెనడాల ఆశ్రయాన్ని కోరుతూ కేవలం 282 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కానీ గత పదేళ్ళలో ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయి 22,967కి చేరుకుంది. 2018లో అమెరికా ఆశ్రయాన్ని కోరుకున్న భారతీయుల సంఖ్య 28,489కు పెరగ్గా, కెనడా ఆశ్రయాన్ని కోరుకున్న వారి సంఖ్య 5,522కు చేరుకుంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అమెరికా, కెనడాల తర్వాత భారతీయులు ఆశ్రయం కోరిన దేశాల్లో దక్షిణాఫ్రికా(4,329), ఆస్ట్రేలియా(3,584), దక్షిణకొరియా(1,657), జర్మనీ(1,313) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి వలస వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ పేదరికం, అంతర్యుద్ధం, విపరీతమైన హింస ఉండే యెమెన్, సూడాన్, బోస్నియా, బురుండి వంటి దేశాలను కూడా భారతీయులు ఆశ్రయం కోరడం అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులను విస్మయంలో పడేస్తోంది. 2018లో ఇలాంటి 57 దేశాల్లో భారతీయులు ఆశ్రయాన్ని కోరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత్‌లో నెలకొన్న అసహనం కారణంగానే ఇలా ప్రజలు విదేశీ ఆశ్రయం కోరుతున్నారని మరికొందరు వాదిస్తున్నారు. భారత్‌కు వస్తున్నవారు తక్కువే... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఆశ్రయిస్తోన్న శరణార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం గమనార్హం. అంతర్జాతీయంగా 35.03 లక్షల మంది శరణార్థులు వేర్వేరు దేశాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారు 11,957 మంది(0.34 శాతం) మాత్రమే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 2018 చివరికినాటికి భారత్ 1.95 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది. ప్రాంతాలవారీగా చూసుకుంటే పాకిస్తాన్ 14.04 లక్షల మంది విదేశీయులకు ఆశ్రయం ఇచ్చింది. వీరిలో అత్యధికులు ఆఫ్గన్లు. 9.06 లక్షల మందితో బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. రోహింగ్యాలు వీరిలో అత్యధికంగా ఉన్నారు. -
మహబూబ్‌నగర్‌లో.. వలస జీవుల తీర్పెటో..?
హలో..! నేను.. మాట్లాడుతున్న. ఎలా ఉన్నారు..? అక్కడ ఏం పని చేస్తున్నరు..? మనోళ్లు ఎంత మంది ఉంటరు..? అందరికీ పని దొరుకుతుందా..? ఏప్రిల్ 11న ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలున్నయ్ తెలుసు కదా. తప్పకుండా రావాలి మరీ. వచ్చి ఓటు రూపంలో నన్ను ఆశీర్వదించండి. రవాణా ఖర్చులకు ఇబ్బందిపడకండా మనోళ్లు చూసుకుంటరు. అక్కడ మీ బాధలు నాకు తెలుసు. నేను గెలిస్తే మీకు ఇక్కడే ఉపాధి కల్పిస్తా.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల, మిగతా సాగునీటి పథకాలకు నిధులు తెచ్చి వాటిని పూర్తి చేస్తా. సాగునీటి ఇబ్బందులు తీర్చి మీ చేనులను సస్యశ్యామలం చేస్తా. ఓటు వేసేందుకు తప్పకుండా రండి. మీ ఒక్క ఓటు నా గెలుపునకు ముఖ్యం. మరిచిపోవద్దు. ప్లీజ్..’అంటూ ఎంపీ అభ్యర్థులు, వారి అనుచరులు ఇతర ప్రాంతాల్లో ఉంటోన్న వలస ఓటర్లను మచ్చిక చేసుకుంటున్న తీరు ఇది. సాక్షి , మహబూబ్‌నగర్: పాలమూరు.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఈ ప్రాంతంలో నెలకొన్న కరువే. వ్యవసాయ భూములున్నా సాగుకు నీరు లేక.. స్థానికంగా చేసేందుకు పని దొరక్క పొట్ట కూటి కోసం ముంబై.. పూణె.. కర్ణాటక.. హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన లక్షలాది కుటుంబాలు గుర్తొస్తాయి. దశాబ్దాల కాలంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంత మంది పాలకులు మారినా.. వలసజీవుల తల రాతలు మారడం లేదు. పరాయి ప్రాంతాల్లో వారు పడుతోన్న కష్టాలు గుర్తుకొస్తాయి. ‘స్థానికంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి జిల్లాను సస్యశా మలం చేస్తాం.. నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అంటూ ప్రతిసారీ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చే హామీలు గుర్తొస్తాయి. ఇప్పుడు మళ్లీ వలస జీవులతో మన నాయకులకు పని పడింది. ఈ నెల 11 తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డ ఎంపీ అభ్యర్థులు తాజాగా వలస జీవుల ఓట్లనూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఎన్నికలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్యకర్తలు.. కుల.. మత పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తున్న అభ్యర్థులు తాజాగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తోన్న వలస కూలీలు, కార్మికుల ఓట్లపై దృష్టి సారించారు. మూడున్నర లక్షలకు పైనే.. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలున్నాయి. మహబూబ్‌నగర్ పరిధిలో 15,05,190మంది, నాగర్‌కర్నూల్ పరిధిలో 15,88,746మంది ఓటర్లున్నారు. రెండు సెగ్మెంట్ల నుంచి మూడున్నర లక్షలకు పైగా మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలు, కార్మికులుగా పని చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న కోయిలకొండ, దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాజ్‌పేట, మద్దూరు, కోస్గి మండలాల నుంచి పెద్ద మొత్తంలో ముంబయి, బెంగళూరు, పూణె నగరాల్లో ఉంటున్నారు. మక్తల్ మండలం కర్లి, గుడిగండ, మంతన్‌గోడ్, అనుగొండ, జక్లేర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో ఉంటున్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎక్కువ మంది ముంబైలో ఉంటున్నారు. ఇలా వలస వెళ్లిన వారిని గుర్తించిన ఎంపీ అభ్యర్థులు, అనుచరులు వారికి ఫోన్లు చేస్తున్నారు. ఉగాది పండుగకు రాకున్నా.. పోలింగ్ రోజు కచ్చితంగా రావాలని అభ్యర్థిస్తున్నారు. ఉగాదికి తమ సొంతూర్లకు విచ్చేసిన వారి వివరాలు తీసుకుని వారిని కలుస్తున్నారు. ఎన్నికల తర్వాతే వెళ్లాలని అప్పటి వరకు ఏవైనా ఖర్చులున్నా తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. అందరి నోటా అదే మాటా.. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ప్రచారాన్ని వేగిరాన్ని పెంచిన ఎంపీ అభ్యర్థులందరూ ‘వలస’ ఓట్లు రాబట్టేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకున్న అభ్యర్థులు తాము గెలిస్తే వలసలకు అడ్డుకట్ట వేసేలా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ హామీలు చేస్తున్నారు. అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులందరూ క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ఇలాంటి హామీలే ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలో వస్తుందని.. నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని.. తమను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో పోరాడైనా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేస్తామని, వలసలను నివారించేందుకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామంటూ బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, బంగారు శ్రుతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు మహబూబ్‌నగర్ ప్రజల సమస్యలు తెలుసని.. ఎంపీగా గెలిస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎవరూ వలస వెళ్లకుండా, వలస వెళ్లిన వారిని రప్పించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కాంగ్రెస్ అభ్యర్థులు చల్లా వంశీచందర్‌రెడ్డి, మల్లురవి హామీలు ఇస్తున్నారు. వలస వెళ్లిన వారందరూ తిరిగి వచ్చేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వలసలకు అడ్డుకట్ట వేస్తామంటూ టీఆర్ఎస్ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో వలస జీవులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అని అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
ముల్లె సర్దిన పల్లె
సాక్షి, పెనుకొండ: దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి కూలీలకు నిరవధికంగా పని కల్పించాలని, వారి ఉపాధికి ఎలాంటి సమస్య లేకుండా చూడాలని కలలు కని కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఎంతో మంది కూలీలు ఈ పథకంతో లబ్ధి పొందుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే టీడీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూలీలు చేసిన పనికి సకాలంలో వేతనాలు అందక పూట గడవని పరిస్థితి ఏర్పడింది. రెండు మూడు నెలలైనా ప్రభుత్వం వేతనాలను కూలీల ఖాతాలకు జమ చేయకపోవడంతో కూలీలు తీవ్ర ఆందోళన చెందుతున్నరు. కూలీలు ఉపాధి బిల్లులు పడ్డాయో లేదోనని చూసుకోవడా¯నికి పలుమార్లు బ్యాంకుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో అనేక మంది కూలీలు పనికి స్వస్తి పలికి పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. గతంలో దాదాపు ఐదు వేల మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్లేవారు. నేడు ఉపాధి కూలీల సంఖ్య వందలకు పడిపోయింది. దీన్నిబట్టి చూస్తే ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వ ఎలా నీరుగారుస్తుందో అర్ధం చేసుకోవచ్చు. గ్రామాల్లో అనేక మంది ఇళ్లను వదలి వెళ్లిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని అడదాకులపల్లి, మహదేవపల్లి, శెట్టిపల్లి, కొండంపల్లి, సోమందేపల్లి, బ్రాహ్మణపల్లి, పందిపర్తికి చెందిన గ్రామస్తులు భారీగా వలస వెళ్లారు. ఒకవైపు తీవ్ర వర్షాబావంతో పంటలు పండక నష్టపోయిన రైతన్నలు, మరోవైపు ఉపాధి కూలీలకు వేతనాలు సకాలంలో అందకపోవడంతో వలసలు రోజురోజుకి పెరుగుతున్న పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది. కొంపముంచిన వరుణుడు.. పెనుకొండ నియోజకవర్గంలో ఖరీఫ్ 56,000 ఎకరాల్లో కంది, వేరుశనగ, అలసంద, పెసర, సోయాబీన్స్ తదితర పంటలు సాగు చేశారు. ఇందులో వేరుశనగ అధిక విస్తీర్ణంలో సాగయింది. పంట సాగులో అడపదడపా వర్షాలు కురిసినా తర్వాత మూడు నెలల పాటు చినుకు జాడ కనిపించలేదు. దీంతో పంట పూర్తిగా దెబ్బతినింది. చాలా చోట్ల రైతులు పంటను పశువులకు వదిలేశారు. ఇక రబీలో నియోజకవర్గ వ్యాప్తంగా 5500 ఎకరాల్లో పప్పుశనగ, ఉలవలు తదితర పంటలు సాగుచేశారు. రబీలో కూడా వరణుడు కరుణించకపోగా తీవ్ర వర్షాభావం, తెగుళ్ల బెడదతో పంటలు చేతికందకుండా పోయాయి. దీంతో పంట పెట్టుబడి చేతికందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ, బీమా రాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో వలసబాట పట్టారు. మండలాల వారీగా జాబ్‌కార్డులు,కూలీలు, పెండింగ్ వేతనాల వివరాలు మండలం జాబ్ కార్డుల పని చేస్తున్నకూలీలు సంఖ్య పెండింగ్‌లో ఉన్న వేతనాలు పెనుకొండ 10959 1029 రూ.85 లక్షలు సోమందేపల్లి 8526 3000 రూ.70 లక్షలు రొద్దం 15753 1202 రూ.56 లక్షలు గోరంట్ల 6459 1100 రూ.60 లక్షలు పరిగి 11229 1188 రూ.35 లక్షలు నియోజకవర్గంలో వలసపోయిన వారి సంఖ్య మండలం వలసపోయిన వారు పెనుకొండ 1000 సోమందేపల్లి 1000 రొద్దం 1500 పరిగి 1000 గోరంట్ల 4500 ఈ ఫోటోలో ఉన్న వృద్ధురాలి పేరు హనుమక్క. పెనుకొండ మండలం మహదేవపల్లి గ్రామం. కుమారుడు రామాంజినేయులు ఇతర కుటుంబ సభ్యులు కూలీ పనులకు బెంగళూరుకు వెళ్లడంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. అన్ని పనులు చేసుకుంటూ నానా ఇబ్బందులు పడుతోంది. ఉపాధి హామీ పనులు సక్రమంగా జరగకపోవడం, వేతనాలు సకాలంలో పడకపోవడం, బోర్లు బావులు ఎండిపోయి తినడానికి కూడా ఇబ్బందిగా ఉండడంతో గత్యంతరం లేక కుటుంబ సభ్యులు వలస బాట పట్టక తప్పలేదు. ఇంటి వద్ద ఒక్కదాన్నే ఉంటున్నా.. కుమారుడు వలస వెళ్లడంతో ఇంటి వద్ద ఒక్కదాన్నే ఉంటున్నాను. కుమారుడు హిందూపురం ప్రాంతానికి వలస వెళ్లి పనులు చేసుకుంటూ అక్కడే సంసారం పెట్టుకున్నాడు. 10 రోజులకు ఒకసారి వచ్చి పలకరించి వెళ్తుంటాడు. వృద్ధురాలినైనా నిస్సహాయంగా ఉండాల్సిన పరిస్థితి. బతకడానికి గ్రామంలో ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ఇతర ప్రాంతానికి వలస వెళ్లక తప్ప లేదు. – నాగమ్మ, మహదేవపల్లి, పెనుకొండ మండలం బిల్లులు సక్రమంగా పడవు గతంలో ఉపాధి పనులకు చాలా మంది వెళ్లే వాళ్లం. ప్రస్తుతం బిల్లులు సక్రమంగా పడక పోవడంతో పనులకు వెళ్లడానికి కూలీలు ఆసక్తి చూపడం లేదు. దీంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. పూట గడవాలంటే కూడా కష్టంగా ఉంది. వలస వెళ్లక తప్పడం లేదు. – రామాంజినమ్మ, మహదేవపల్లి -
పని కోసం పట్నం బాట
సరైన వర్షాలు లేక జలాశయాలు వెలవెలబోతున్నాయి. కరువు పరిస్థితులతో వ్యవసాయం ముందుకు సాగడం లేదు. ఉన్న ఊళ్లో చేయడానికి పనులు లేవు. దీంతో పని వెతుక్కుంటూ చాలా కుటుంబాలు వలసవెళ్తున్నాయి. పల్లెలు ఖాళీ అవుతున్నాయి. సాక్షి, నాగిరెడ్డిపేట (కామారెడ్డి ): రోజురోజుకు ముదురుతున్న ఎండలతో భూగర్భజలాలు సైతం పాతాళానికి చేరుతున్నాయి. బోరుబావులు ఒక్కొక్కటిగా వట్టిపోతున్నాయి. కొత్తగా బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండడం లేదు. కరువు పరిస్థితులతో నాగిరెడ్డిపేట మండలంలోని చాలా గ్రామాల్లో వ్యవసాయభూములు బీడుగానే ఉన్నాయి. కొందరు రైతులు ధైర్యంచేసి అక్కడక్కడా వేసిన పంటలు సైతం సాగునీరందక ఎండుముఖం పడుతున్నాయి. దీనికితోడు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు సైతం అంతంతమాత్రంగానే ఉండడంతో పల్లె ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పనికోసం వలస బాట పడుతున్నారు. మండలంలోని మాల్తుమ్మెద, గోపాల్పేట, నాగిరెడ్డిపేట, లింగంపల్లి, తాండూర్, ధర్మారెడ్డి, రాఘవపల్లి, కన్నారెడ్డి, మాసాన్‌పల్లి, ఆత్మకూర్, జలాల్పూర్, జప్తిజాన్కంపల్లి, బొల్లారం తదితర గ్రామాల నుంచి ప్రజలు పొట్ట చేతబట్టుకొని ఇతరప్రాంతాలకు భారీగా వలసవెళ్లారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డిపేట మండలంతోపాటు ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి మండలాల్లోని పలుగ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్, ఆర్మూర్ తదితర ప్రాంతాలకు వలసవెళ్తున్నారు. ఆదుకోని ఉపాధి హామీ.. పేదలకు అండగా ఉండాల్సిన ఉపాధి హామీ పథకం ఈసారి పెద్దగా పనులు కల్పించలేకపోయింది. వరుసగా వస్తున్న ఎన్నికలతో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటోంది. అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో సకాలంలో పనులను గుర్తించలేకపోయారు. మరోవైపు వరుణుడి కరుణ లేకపోవడంతో వ్యవసాయ పనులూ అంతంతగానే ఉన్నాయి. దీంతో గ్రామాలలో చేయడానికి పనులు లేకుండాపోయాయి. ఇళ్లకు తాళాలు వేసి.. గ్రామాల్లో పనిలేకపోవడంతో చాలాకుటుంబాలు ఇళ్లకు తాళాలువేసి పట్టణాలకు వలసవెళ్తున్నాయి. కొందరు కుటుంబ సభ్యులందరికీ తీసుకుని ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్తుండగా.. మరికొంతమంది వృద్ధులు, పిల్లలను ఇంటివద్దనే వదిలి వలసబాట పడుతున్నారు. పిల్లలు చదువుకు దూరమవకూడదని, వృద్ధులు ఉంటే ఇంటికి కాపలాగా ఉంటారని భావించి కేవలం భార్యాభర్తలు మాత్రమే పనికోసం పట్టణాలకు వెళ్తున్నారు. మాల్తుమ్మెద గ్రామంలో 500లకుపైగా కుటుంబాలుండగా సుమారు వంద కుటుంబాలు బతుకుదెరువు కోసం వలస వెళ్లడం సమస్య తీవ్రతను తెలుపుతోంది. పిల్లల చదువు కోసం నేనిక్కడ ఉన్న ఊళ్లె పనిలేక ఆరునెలల కింద నా కొడుకు, కోడలు హైదరాబాద్‌కు వలసపోయిండ్రు. నా మువవడు, మనుమరాలి సదువు కోసం నేను ఇంటికాడ్నే ఉంటున్న. నా కొడుకు, కోడలు పనిచేసి పైసలు పంపిస్తుండ్రు. ఆ పైసలతోనే మేము బతుకుతున్నం. – తలారి దుర్గమ్మ, మాల్తుమ్మెద ఇంటికి కాపలాగా.. ఈడ పని దొరక్క ఏడాదికింద నా కొడుకులు, కోడళ్లు బతకపోయిండ్రు. నా మనుమళ్లను గోపాల్‌పేటలోని హాస్టళ్ల ఏసిండ్రు. నేను మాత్రం ఇంటికి కాపాలాగా ఉన్న. ఆళ్లు పైసలు పంపిస్తే నేను బతుకుతున్న. ఊళ్లె పనిలేక మస్తుమంది బతుకవోతుండ్రు. – నక్క పోచమ్మ, మాల్తుమ్మెద షాతకాదని ఇంటికాడ్నే ఉంటున్న నా కొడుకు, కోడలు పనికోసం ఏడాదికింద ఆర్మూర్‌కు పోయిండ్రు. నాకు షాతకాదని ఇంటికాడ్నే ఉంటున్న. ఆళ్లు ఆర్మూర్‌లో కూలిపని చేసుకుంటుండ్రు. ఈ ఏడాది కాలం కాక పొలాలు కూడా పండుతలేవు. దీంతో ఊళ్లెకెళ్లి చానామంది బతుకడానికి యాడపని ఉంటే ఆడికి పోతుండ్రు. – వదల్పర్తి గంగమ్మ, మాల్తుమ్మెద -
‘కూలీ’న బతుకులు
వంద రోజులు పని దినాలు కల్పించాలని ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం జిల్లాలో నీరుగారిపోతోంది. జిల్లాలో ఇప్పటికే కరువుకాటకాలు విలయతాండవం చేస్తున్నాయి. దీంతో ఉపాధి పనితోనైనా.. నాలుగు మెతుకులు తిందామంటే ఆ పనులు కూడా అందరికీ కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. లక్షలాది మంది కూలీలు ఉండగా వేలాదిమంది కూలీలకే పనులు కల్పిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక జిల్లా కూలీలు వలసబాట పడుతున్నారు. మెదక్ : జిల్లాలో వర్షాలు లేవు. భూగర్భ జలాలు అందనంత లోతులోకి వెళ్లిపోయాయి. వెరసి వ్యవసాయం మూలన పడింది. కూలీలకు ఉపాధి పనులు కల్పించి వలసల నివారణకు తోడ్పడాల్సిన ఉపాధిశాఖ అధికారులు పల్లెలో కేవలం నర్సరీల ఏర్పాటుతోనే సరిపెడుతున్నారు. జిలాలో 7,68,271 మంది జనాభా ఉన్నారు. 1,81,342 జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 4,05,104 మంది కూలీలుగా నమోదై ఉన్నారు. వీరందరికీ ఏడాదికి 100 రోజుల పాటు పని కల్పించాల్సి ఉండగా 80శాతం గ్రామాల్లో ఉపాధి పనులు జరగడం లేదు. కానీ మెజార్టీ గ్రామ పంచాయతీలు నర్సరీల్లో మొక్కలను పెంచే పనిలో నిమగ్నమయ్యారు. మొక్కలను పెంచేందుకు కేవలం 10 మంది కూలీలకు మించి ఉపాధి దొరకడం లేదు. దీంతో పనులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. 10 వేల మందికి మాత్రమే.. 320 గ్రామ పంచాయతీల్లో ప్రతీ గ్రామం పరిధిలో వన నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,05,104 మంది కూలీలు ఉండగా సుమారు 10,955 మంది కూలీలకు మాత్రమే ఈ నర్సరీల ఏర్పాటులో పని దొరకుతోంది. ఈ లెక్కన 3,94,149 మందికి పనులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో ఉన్న ఊళ్లో పనులు దొరక్క పొట్ట చేతబట్టుకొని వలసలు వెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు పని చేస్తున్నారు. అదనపు భత్యం మాటే లేదు.. ఉపాధి కూలీలకు వేసవికాలంలో ప్రతి ఏటా ఐదు నెలల పాటు అదనపు భత్యం అందించాల్సి ఉంది. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 20 నుంచి 30 శాతం అదనంగా కూలీ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనవరిలోనే విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు ఆ ఊసే కానరావడం లేదు. వారం రోజులుగా జిలాల్లో 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో పనులు చేసే అతికొద్ది మంది కూలీలకు సైతం ఆ భత్యం అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. పనులు లేక పస్తులుంటున్నాం.. నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో రెండు బోర్లు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేక పోవడం, ఎండలు ప్రారంభం కావడంతో ఆ రెండు బోర్లు నీళ్లు పోయడం లేవు. ఉపాధి హామీలో ఇచ్చే కరువు పనులు చేద్దామంటే మా గ్రామంలో ఇప్పటికి ఉపాధి పనులు ప్రారంభం కాలేదు. సార్లను అడిగినా ఫలితం లేకుండా పోతోంది. ఇక పట్నం బతుకుదెరవు పోయేందుకు సిద్ధమౌతున్నం. –జాల దుర్గయ్య , పాతూర్ జనాభా 7,68,271 జాబ్ కార్డులు 1,81,342 కూలీలు 4,05,104 పని చేస్తున్న కూలీలు 10,955(సుమారు) -
ముంబైసే ఆయా మేరా దోస్త్!
తెలంగాణలో శుక్రవారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది. తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ముంబై సహా పలు ప్రాంతాలకు వలసపోయిన వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్లకు పయనమయ్యారు. ఇప్పటికే చాలా మంది స్వగ్రామాలకు చేరుకోగా.. మరికొందరు ఈ రెండ్రోజుల్లో చేరుకోనున్నారు. ఇప్పటికే చేరుకున్న వారిలో కొందరు తమకు నచ్చిన పార్టీల తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వివిధ కారణాలతో ఓటేసేందుకు రానివారిని ఎలాగైనా రప్పించేందుకు ఇప్పటికే పలువురు అభ్యర్థుల ప్రతినిధులు ముంబై సహా పలు ప్రాంతాల్లో తెలుగు ఓటర్లను ఒప్పిస్తున్నారు. 70% తెలంగాణ ప్రజలే! ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో తెలుగు మూలాలు ఉన్న వారు దాదాపుగా కోటి మంది ఉంటారని అంచనా. ముంబై, భివండి, సోలాపూర్, పుణే తదితర ప్రాంతాల్లో తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు. కేవలం ముంబైలోనే సుమారు 10 లక్షల మంది ఉన్నారు. వీరిలో సుమారు 70% తెలంగాణ వాళ్లే. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులే ఎక్కువ. కరీంనగర్‌తోపాటు నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాదు, వరంగల్ జిల్లాలకు చెందిన వారు ముంబైతోపాటు చుట్టుపక్కల పరిసరాల్లో నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది తమ సొంతూళ్లలోని బంధువులతో సంబంధాలు, రాకపోకలు కొనసాగిస్తున్నారు. వీరిలో అనేక మందికి ఓటు హక్కు మహారాష్ట్రతోపాటు తెలంగాణలో కూడా వచ్చింది. ఈ సారి తెలంగాణలో అనేక మంది తమకంటూ ఓ గుర్తింపు ఉండాలని అనేక మంది ఓటర్ల లిస్టులో తమ పేరును నమోదు చేయించుకున్నారు. చార్జీలతోపాటు మందు, విందు! వలస ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వివిధ పార్టీలకు చెందిన స్థానిక కార్యకర్తలతోపాటు వివిధ పార్టీలు, అభ్యర్థుల అభిమానులు ముంబైలో ప్రచారం చేçస్తున్నారు. దీంతో ముంబైలో తెలంగాణ ప్రజల్లో ఒకరకమైన రాజకీయ వేడి కన్పిస్తోంది. ఓటర్లు స్వగ్రామాల్లో ఓటేసేందుకు కొందరు అభ్యర్థులు రానుపోను బస్సు, రైలు చార్జీలతోపాటు అన్ని వసతులు కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. ముంబై నుంచి జన్నారం వెళ్లే భూమి ట్రావెల్స్ తెలంగాణ ఓటర్లకు 20% డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు ఈ ట్రావెల్స్ యజమాని వోరంగటి భూమన్న ప్రకటించారు. అయితే ఈ రాయితీ కేవలం ఓటరు కార్డు లేదా ఓటరు లిస్టులో తమ పేర్లను చూపించినవారికే మాత్రమే ఇవ్వనున్నారు. ఎన్నికల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాలలో ఓటర్లు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. అందిన వివరాల మేరకు కొన్ని ప్రాంతాల్లో వాహనాలను తీసుకుని అందరు షేరింగ్ చేసుకుని వెళ్తుండగా మరి కొన్ని ప్రాంతాల్లోపార్టీ అభ్యర్థులు వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. వలస జీవుల డిమాండ్లు వలస ఓటర్ల డిమాండ్లు అనేకం ఉన్నాయి. ముంబైలో తెలంగాణ భవనం ఏర్పాటు, ముంబై యునివర్సిటీలో తెలుగు పీఠం, నాకా కార్మికుల సమస్యలతోపాటు అనేక సమస్యలు తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలని వీరు కోరుతున్నారు. మరోవైపు ముంబైకి మరిన్ని రైళ్లు బస్సులు లేదా నడపాలని కోరుతున్నారు. స్వగ్రామాల్లో తమ గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నారు. పుణే టు నారాయణపేట్ మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ నియోజకవర్గానికి చెందిన వేలాది కుటుంబాలు పుణే పాషాణ్లోని సంజయ్‌గాంధీ బస్తీలో నివాసముంటున్నాయి. వీరందరు ఇక్కడ స్థిరపడ్డారు. ధన్వాడ, నారాయణ పేట్, కోయిల కొండ, ధామర్ గట్టి తదితర మండలాలోని హనుమాన్ పల్లి, తోలగుట్ట తాండా, నీలగుర్తి తాండా, అంకల తాండా, తుమ్మచెర్ల తాండా, దొడ్లమంచెర్ల తాండా, భోజనాయక్ తాండా, ఈదన్న తాండా, కొత్తూరు తాండా, వడంచెరు తాండా, రామకృష్ణ పల్లె, మొండోల తాండా తదితర తండాలకు చెందిన వారున్నారు. పుణేలో స్థానికంగా కూడా సుమారు నాలుగు వేల ఓట్లు వీరివి ఉండగా నారాయణపేట్ నియోజకవర్గంలో కూడా సుమారు రెండు వేల మందికిపైగా ఓట్లున్నవారున్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం తొలిసారి జరిగిన అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లో వీరు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సారి కూడా ప్రత్యేక వాహనాలు, బస్సులు, రైళ్లలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఓటు హక్కు ఉన్న అనేక మందిని లక్ష్మినాయక్, డాక్యా నాయక్, హనుమంత్ నాయక్, వెంటకేష్ నాయక్, పాండు నాయక్, మోతీనాయక్, రాం నాయిక్‌లు తమ తమ సొంత వాహనాల్లో తీసుకెళ్తున్నారు. -
‘కారు’ దిగుతున్న గులాబీ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తరుణంలో టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వలసలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు అమలు చేస్తున్నాయి. టీఆర్ఎస్లోని పలువురు కీలక ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి దూరమవుతున్నారు. మరికొందరిపై టీఆర్ఎస్ అధిష్టానం స్వయంగా వేటు వేస్తోంది. కారణాలు ఏమైనా అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్ఎస్కు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు దూరమయ్యారు. ఎన్నికలు ముగిసేలోపు ఇంకెంత మంది ఈ జాబితాలో ఉంటారనేది ఆసక్తికరంగా మారుతోంది. చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈ నెల 20న టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో యాదవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేలోపే మరికొందరు కీలక ప్రజాప్రతినిధులపై ఇదే తరహా నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ముఖ్యలు ప్రకటిస్తున్నారు. అసంతృప్తితో ఒక్కొక్కరు.. టీఆర్ఎస్ వ్యవహారాలకు కొన్ని నెలలుగా దూరంగా ఉంటూ వచ్చిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కొన్ని రోజుల క్రితం రాహుల్‌ని, ఆ తర్వాత సోనియాగాంధీని కలిశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు డీఎస్ అధికారికంగా ప్రకటించకపోయినా టీఆర్ఎస్కు దూరమయ్యారు. అసెంబ్లీ రద్దయిన వెంటనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ నుంచి పోటీ చేసే 105 అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. పోటీ చేసే అవకాశం రాకపోవడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు ఆర్.భూపతిరెడ్డి, రాములునాయక్, కొండా మురళీధర్‌రావు టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే తాజా మాజీ ఎమ్మెల్యేలు కొండా సురేఖ, బాబుమోహన్, బొడిగె శోభ, బి.సంజీవరావు టీఆర్ఎస్ను వీడారు. వీరిలో కొండా సురేఖ, సంజీవరావు కాంగ్రెస్‌లో చేరారు. బాబుమోహన్, శోభ బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీకి దిగారు. మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్‌గౌడ్, ఎన్.బాలునాయక్, రమేశ్‌రాథోడ్, కేఎస్ రత్నం సైతం టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. యాదవరెడ్డిపై వేటు.. ఎమ్మెల్సీ యాదవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ అధిష్టానం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
దక్షిణాదిన పెరుగుతున్న హిందీ ప్రభావం
ఉపాధి కోసం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస పోవడం మన దేశంలో సహజమే. అయితే,ఈ వలసల పుణ్యమా అని దక్షిణాదిన (భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో) మాట్లాడే భాషల శాతం మారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉత్తర ప్రదేశ్ అంటే హిందీ మాట్లాడే వారు ఎక్కువ ఉన్న రాష్ట్రమని, ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగు, తమిళనాడు తమిళం మాట్లాడేవారు మెజారిటీగా ఉన్నారని, కేరళ మలయాళీలదని ప్రస్తుతం అందరూ భావిస్తున్నారు.అయితే, ఉత్తరాది నుంచి దక్షిణాదికి వలసలు ఎక్కువవుతున్న నేపథ్యంలో తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా హిందీ మాతృభాషగా చెప్పుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల అర్థం మారిపోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2016–17 ఆర్థిక సర్వే ఈ విషయాన్ని నిర్థారించింది. దేశ ఆర్థిక సమగ్రతకు సంస్కృతి, సంప్రదాయాలు అడ్డుకావని ఈ పరిణామం స్పష్టం చేస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ఆర్థిక సర్వే ప్రకారం 2001 –2011 మధ్య హిందీయేతర రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లలో హిందీ మాతృభాషగా చెప్పుకునే వారి సంఖ్య 45శాతం పెరిగింది. స్వాతంత్రానికి పూర్వం, తరువాత కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాలకు పేరుగాంచిన తమిళనాడులోనే హిందీ మాతృభాషగా చెప్పుకునే వారి శాతం మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ పెరగడం విశేషం. 2001–2011 మధ్య హిందీ రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, బిహార్, రాజస్థాన్ల నుంచి 20–29 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువ మంది దక్షిణాది రాష్ట్రాలకు వలస వచ్చారని సర్వే వెల్లడించింది. ఈ కాలంలో ఉత్తర ప్రదేశ్ నుంచి 58.3 లక్షలు, బిహార్ నుంచి26.3 లక్షల మంది యువత దక్షిణాది రాష్ట్రాలకు వలస పోయారు. వీరిలో 10 లక్షల మంది ఒక్క తమిళనాడుకే వెళ్లారని ఆర్థిక సర్వే తెలిపింది.తమిళనాడు తర్వాత ఎక్కువ మంది వలసదారులు వెళ్లిన రాష్ట్రం కేరళ. ఉపాధి కోసం పేద రాష్ట్రాల(ఉత్తర,ఈశాన్య రాష్ట్రాలు) నుంచి ధనిక రాష్ట్రాలకు(దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు) వలసలు అనివార్యమవుతున్నాయి. ఉపాధి కోసం జరుగుతున్న ఈ వలసలు ఆయా రాష్ట్రాల్లో సాంస్కృతిక, భాష మార్పులకు కారణమవుతున్నాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల్లోని భాషకు సంబంధించిన గణాంకాల ప్రకారం 2001–2011 మధ్య హిందీ రాష్ట్రాల( ఉత్తర ప్రదేశ్, బిహార్, జార్ఖండ్,ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ) జనాభా 21శాతం పెరిగింది. అదే సమయంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో హిందీ మాతృభాషగా చెప్పుకునే వారి సంఖ్య45శాతం పెరిగింది. ఈ రాష్ట్రాల్లో స్థానిక భాష మాట్లాడే వారి సంఖ్యతో పోలిస్తే ఇది నామమాత్రమే అయినా పెరుగుదల శాతం మాత్రం గుర్తించదగినది. ప్రస్తుతం స్థానికేతర గొడవలు జరుగుతున్న గుజరాత్ విషయానికి వస్తే 2001–2011 మధ్య గుజరాత్‌లోని మొత్తం 26 జిల్లాలకు గాను 21 జిల్లాల్లో హిందీ మాతృభాషగా చెప్పుకునే వారు 23శాతం పెరిగారు. మొత్తం మీద చూస్తే ఉత్తరాది నుంచి దక్షిణాదికి వలసలు ఏటా పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. అయితే, ఈ వలసలు ఆయా రాష్ట్రాల్లో సాంస్కృతికంగా, సామాజికంగా ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడే చెప్పలేం. గుజరాత్ తాజా అల్లర్లు దీని ఫలితమేనా..ఈ పరిణామం ఒక్క గుజరాత్‌కే పరిమితమా లేక ఇతర దక్షిణ రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉందా అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. -
పల్లె పొమ్మంటోంది.. పట్నం రమ్మంటోంది
ఈ చిత్రంలో వృద్ధురాలి వద్ద కనిపిస్తున్న చిన్నారుల పేర్లు అరవింద్, మాన్విత. వీరి తల్లిదండ్రులు అశోక్, సునీతమ్మలు పొట్టకూటి కోసం బెంగుళూరుకు వలస వెళ్లారు. తమ పిల్లలను తల్లి సునందమ్మ వద్దే వదిలేసి వెళ్లారు. వీరి ఆలనా పాలన ఆమె చూసుకుంటోంది. పొట్టకూటి కోసమే తమ తల్లిదండ్రులు వలస వెళ్లారని, వారిని విడిచి ఉండటం కష్టంగానే ఉన్నా తప్పడం లేదని ఈ చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం, శెట్టూరు : కుమారులు దూరమయ్యారని ఓ తల్లి ఆవేదన. తమ తల్లిదండ్రులు తమ దగ్గరలేరని చిన్నారుల గగ్గోలు. తమను పట్టించుకునే దిక్కేలేదని వృద్ధ దంపతుల ఘోష. జనావాసం లేక బోసిపోయిన గ్రామాలు. తాళాలతో వెక్కిరిస్తున్న ఇళ్లు... ఇలా అన్నింటికీ కారణం ‘కరువు రక్కసే’. ఉన్న ఊరిలో ఉపాధి పనులు చేసుకుందామనుకుంటే బిల్లులే రావు.. బయట పనులు చేసుకుందామంటే కరువు దెబ్బతో ఏ పనీ దొరకదు. ఇక చేసేది లేక బతుకు జీవుడా అంటూ వలసబాట పట్టిన ఉపాధి కూలీలు, రైతులు వ్యథ అంతా ఇంతా కాదు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా 68,429 జాబ్‌కార్డులుండగా 1200కు పైగా 100 రోజుల పని దినాలు పూర్తయ్యాయి. ఆయా జాబ్‌కార్డుదారులంతా దినసరి కూలీలుగా వెళ్తూ కాలం వెళ్లదీసేవారే. అయితే అనంతపురం జిల్లాకు పిలవని బంధువులా ప్రతియేటా వస్తున్న కరువు ఈసారి కూడా ఖరీఫ్ రైతును కాటేసింది. ఇప్పటికే జూన్నెలలో సాగు చేసిన వేరుశనగ నియోజకవర్గ వ్యాప్తంగా 12 వేల హెక్టార్లలో ఎండిపోయినట్లు ప్రాథమిక అంచనా. మరోవారం రోజుల్లో వర్షం కురవకపోతే ఇప్పటి వరకు సాగైనా 40 వేల హెక్టార్ల వేరుశనగ పంట ఎండిపోయే ప్రమాదముంది. ఇదే జరిగితే నియోజకవర్గంలో వేరుశనగ సాగు చేసిన రైతుల పెట్టుబడి రూ.100 కోట్లు నేలపాలైనట్లే. ఉపాధిలేక... ఉన్న ఊర్లో ఉపాధి హామీ పథకం ఉన్నా నెలల తరబడి చేసిన పనులకు కూలీ డబ్బు రాక వలస బాట పడుతున్నవారే అధికంగా ఉన్నారు. ఉన్న ఊర్లో ఉపాధి కల్పిస్తున్నామని ఉపాధి అధికారులు కాకిలెక్కలు చెబుతున్నారు , ఏ గ్రామంలో కూడా వలసలు లేవంటూ ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నారు. -
గుక్కెడు నీటికోసం రాష్ట్రం దాటాల్సిందే..
జైపూర్, రాజస్థాన్ : అసలే అది ఎడారి ప్రాంతం. భగభగ మండే భానుడి తాపానికి గుక్కెడు నీళ్లు లేక వేల గొంతులు తడారిపోతున్నాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఓ జిల్లాలోని వేల జనం వలస బాట పట్టాల్సిందే. విశేషమేమంటే.. ఆ ప్రాంతంమంతా చంబల్ నది పరివాహక ప్రాంతంలో ఉండడం. కానీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడంతో.. ధోల్పూర్ జిల్లాలోని దాదాపు 40 గ్రామాల ప్రజలు ఎండాకాలం మొదలవగానే నీటి చెలిమలు వెతుక్కుంటూ.. వలసెళ్లి పోతారు. ఇంకో విస్మయం కల్గించే విషయమేంటంటే ధోల్పూర్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సొంత జిల్లా కావడం. ‘నీటి సంరక్షణ పథకాలు ప్రవేశపెడుతున్నాం. సంప్రదాయ నీటి నిలువ పద్ధతుల్ని కూడా అనుసరించి తాగునీటి సరఫరాకై చర్యలు తీసుకుంటున్నామ’ని ముఖ్యమంత్రి వసుంధర రాజే పదే పదే చెప్తున్నారు. మరి ధోల్పూర్ ప్రజలు ఎండాకాలం వచ్చిందంటే చాలు.. నీటి కటకటతో వలసబాట పడుతున్నది వాస్తవం కాదా..! అని రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షురాలు అర్చనా శర్మ వసుంధర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నీటికై రాష్ట్రం దాటాల్సిందే.. ‘మా గ్రామ పంచాయతీ పరిధిలో 30 నుంచి 35 చిన్న చిన్న పల్లెలుంటాయి. కానీ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఒక్క బిందెడు తాగునీటి సౌకర్యానికి కూడా నోచుకోలేదు. ఎండాకాలం మొదలవగానే ఆయా గ్రామాల ప్రజలు మరో ప్రాంతానికో లేదా బంధువుల ఊళ్లకో వలస పోతారు. ప్రధానంగా ధోల్పూర్ జిల్లా ప్రజలంతా ఆగ్రా, కాగరోల్, మధుర వంటి సరిహద్దు ప్రాంతాలకు పయనమవుతారు. ఐదేళ్లకోసారి వచ్చి ఎన్నికల్లో మాతో ఓటు వేయించుకొని పోయే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు మా సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు’ అని గాలోరి గ్రామ నివాసి రాజేష్ వాపోయారు. ‘మా గ్రామంలోని పురుషులందరూ పిల్లలతో కలిసి నీటి చెలిమలు వెతకడానికి, నీటిని తేవడానికే సరిపోతోంది. నీటి కోసమే ఎంతో సమయం వృధా అవుతోంది. అక్కడక్కడ నీటి చెలిమలు ఉన్నా.. పశువులు తాగే నీటినే మనుషులు తాగాల్సిన పరిస్థితి. వాటిని తాగి జనం రోగాల పాలవుతున్నారు’ అని గాలోరి మరో నివాసి రామ్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. -
76 దేశాల జైళ్లలో భారతీయ ఖైదీలు..
2017 డిసెంబర్ 28 వరకు తమవద్ద ఉన్న సమాచారం మేరకు 76 దేశాలలోని జైళ్లలో 7,985 మంది భారతీయులున్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎం.జె.అక్బర్ జనవరి 3న లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల స్థితిగతుల గురించి లోక్‌సభ సభ్యులు నినాంగ్ ఎరింగ్, కైలాష్ ఎన్ సింగ్ దేవ్, జితేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్)లు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. కొన్ని దేశాలలోని గోప్యతా చట్టాల వల్ల జైళ్లలో ఉన్నవారి వివరాలు తెలియడం లేదు. ఆరు అరబ్ దేశాల గల్ఫ్ సహకార మండలి (గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ – జీసీసీ) సభ్య దేశాలైన సౌదీ అరేబియాలో 2,229, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో 1,628, కువైట్‌లో 506, ఖతార్‌లో 196, బహ్రెయిన్‌లో 77, ఒమన్‌లో 60 మంది భారతీయులు జైళ్లలో మగ్గుతున్నారు. గల్ఫ్ దేశాల జైళ్లలోనే 58 శాతానికి పైగా 4,696 మంది ఉన్నారు. మలేషియాలో 341, సింగపూర్‌లో 115, నేపాల్‌లో 859, పాకిస్తాన్లో 395, థాయిలాండ్‌లో 47, యూకేలో 376, యఎస్‌లో 343 మంది జైళ్లలో ఉన్నారు. వీరిలో శిక్షా కాలం పూర్తయిన వందలాది మంది జైళ్లలోనే మగ్గుతున్నారు. జరిమానాలు చెల్లించనందున కొందరు, సాంకేతిక కారణాల వలన మరి కొందరు జైళ్లలో, డిటెన్షన్ సెంటర్ల (నిర్బంధ కేంద్రాలు)లో మగ్గుతున్నారు. పరాయిదేశం, తెలియని భాష, స్థానిక చట్టాలపై అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం తదితర కారణాలతో తప్పులుచేసి జైలు పాలైనవారు కొందరున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, రోడ్డు ప్రమాదాలు, పని ప్రదేశంలో ప్రమాదాలకు కారకులైనవారు, గొడవలు, ఆర్థికపరమైన మోసాలు, ఇతర మోసాలు, మద్యం సేవించడం, మద్యం వ్యాపారం, జూదం, లంచం, వీసా నిబంధనలు, కస్టమ్స్, ఇమిగ్రేషన్ ఉల్లంఘనలు, చెక్ బౌన్స్, ఫోర్జరీ లాంటి కేసులలో కొందరు జైళ్లలో మగ్గుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, మాదక ద్రవ్యాల వ్యాపారం, మానవ అక్రమ రవాణా, సెక్స్, వ్యభిచార నిర్వహణ, దొంగతనాలు, హత్యలు లాంటి తీవ్రమైన నేరాలలో జైలు పాలైన వారూ ఉన్నారు. భారత్ నుంచి విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేవారు, తాము ఏ దేశానికి, ఏం పనిపై వెళుతున్నారు, ఆ దేశ చట్టాలు, ఆచార వ్యవహారాలూ, పద్ధతులు తెలుసుకొని అవగాహనతో వెళ్లడం మంచిది. ఆయా దేశాల చట్టాల ప్రకారం శిక్షలు ఖరారు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా మెలగాలి. గల్ఫ్ నుంచి భారత్‌కు బదిలీకి ఎదురుచూస్తున్న ఖైదీలు ఖైదీలను స్వదేశానికి తీసుకువచ్చే చట్టం 2013 (రిపాట్రియేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 2013) ప్రకారం ఇప్పటివరకు 170 దరఖాస్తులు వచ్చాయని 62 మంది విదేశీ జైళ్ల నుంచి భారత్ జైళ్లకు బదిలీ అయ్యారని మంత్రి తెలిపారు. భారత్ ఇప్పటివరకు 30 దేశాలతో ఖైదీల బదిలీ ఒప్పందం చేసుకున్నదని అన్నారు. ఇవికాకుండా ఇంటర్ అమెరికన్ కన్వెన్షన్‌ను ఆమోదించిన సభ్య దేశాలతో భారతదేశం ఖైదీల బదిలీకి అభ్యర్థనలు పంపడానికి, స్వీకరించడానికి అర్హత కలిగి ఉన్నది. యూఏఈ, భారత్ మధ్య 2011 నవంబర్ 2న ఖైదీల బదిలీ ఒప్పందం జరిగింది. అప్పటి భారత హోంమంత్రి పి.చిదంబరం, యూఏఈ దేశ ఉప ప్రధాని, హోం మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహయాన్‌లు ఈ ఒప్పందంపై ఢిల్లీలో సంతకాలు చేశారు. 2015 మార్చి 25న ఖతార్‌తో కూడా ఖైదీల బదిలీ ఒప్పందం జరిగింది. ఈ రెండు గల్ఫ్ దేశాల ఒప్పందాలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశంలోని అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, రాసల్ ఖైమా, ఫుజీరా, ఉమ్మల్ కోయిన్ అనే ఏడు రాజ్యాలలోని వివిధ జైళ్లలో మగ్గుతున్న 1,628 మందిలో శిక్షపడిన వందలాది మంది భారతీయ ఖైదీలతో పాటు ఖతార్‌లోని 196 మందికి ఈ ఒప్పందం వలన లాభం కలుగుతుంది. వీరు మిగిలిన శిక్ష కాలాన్ని తమ ఇష్ట ప్రకారం భారత్ జైళ్లలో పూర్తిచేసుకోవచ్చు. వీరిలో 40 మంది మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. భారత్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఒకే ఒక్క యూఏఈ పౌరుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. భారతీయ ఖైదీలు తమ స్వదేశానికి బదిలీ అయితే తమ కుటుంబ సభ్యులను కలుసుకొని స్వాంతన పొందే అవకాశం ఉంది. విదేశీ జైళ్లలో మగ్గుతున్న పేద ప్రవాసీ కార్మికులకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ సహాయం అందించాలి. చిన్నపాటి జరిమానాలను చెల్లించి వారి విడుదలకు కృషి చేయాలి. గల్ఫ్ జైళ్లలో ఉన్న మలయాళీలను విడిపించడం కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతేక నిధిని కేటాయించింది. సంవత్సరాల తరబడి గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వారి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. నొప్పి నివారణ మాత్రలు, గసగసాలు కలిగి ఉన్నందుకు 24 ఏళ్ల జైలు శిక్షకు గురై దుబాయి జైలులో మగ్గుతున్న తెలుగువారు ఉన్నారు. గల్ఫ్ దేశాలలో ఏం చేయాలో, ఏం చేయకూడదో మన కార్మికులకు తెలియజేయడానికి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. –మంద భీంరెడ్డి mbreddy.hyd@gmail.com -
మిలియనీర్ల వలస బాట..
సాక్షి, న్యూఢిల్లీ : నల్లధనంపై నియంత్రణలతో 2014 నుంచి పెద్దసంఖ్యలో డాలర్ మిలియనీర్లు భారత్‌ను విడిచివెళ్లారు. చైనా, ఫ్రాన్స్ కంటే భారత్ నుంచే డాలర్ మిలియనీర్లు అత్యధికంగా విదేశాలకు తరలివెళ్లారు. 2014 నుంచి 23,000 మంది మిలియనీర్లు దేశం వీడివెళ్లగా వీరిలో కేవలం 2017లోనే 7000 మంది విదేశాలకు చెక్కేశారని మోర్గాన్ స్టాన్లీలో చీఫ్ గ్లోబల్ స్ట్రేటజిస్ట్ రుచిర్ శర్మ విశ్లేషించారు. భారత సంపన్నుల్లో 2.1 శాతం మంది దేశాన్ని వీడగా, ఫ్రాన్స్ సంపన్నుల్లో 1.3 శాతం, చైనా సంపన్నుల్లో 1.1 శాతం ఆయా దేశాలను విడిచివెళ్లారని చెప్పుకొచ్చారు. 1,50,000 మంది మిలియనీర్లపై ఎన్‌డబ్ల్యూ వరల్డ్ వెల్లడించిన గణాంకాలను బట్టి ఈ వివరాలు వెల్లడయ్యాయి.కారణమేదైనా సంపన్నులు ఇంత పెద్ద సంఖ్యలో దేశం వీడటం ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చబోదని రుచిర్ శర్మ పేర్కొన్నారు. ప్రపంచ సంపన్నులంతా అక్లాండ్, మోంట్రీల్, టెల్అవీవ్, టొరంటో వంటి నగరాలను ఎంచుకుంటున్నారని ఆయన విశ్లేషించారు.ఇక భారత్ నుంచి సంపన్నులు అధికంగా బ్రిటన్, దుబాయ్, సింగపూర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దేశం వెలుపల ఆరు నెలలుపైగా గడిపిన వారిని ఈ జాబితాలో చేర్చారు. మరోవైపు ఫ్రాన్స్ నుంచీ కూడా మిలియనీర్లు పెద్దసంఖ్యలోనే వేరే దేశాలకు తరలివెళ్లారు. ఐరోపా యూనియన్ విచ్ఛిన్నమైన అనంతరం బ్రిటన్ నుంచి సైతం పలువురు సంపన్నులు ప్రపంచంలోని ఇతర నగరాలకు వలసవెళ్లారు. భారత్‌లో పన్ను చట్టాలను కఠినతరం చేయడం, బ్లాక్ మనీపై నియంత్రణలు, ఎన్పీఏల ఒత్తిడితో కొందరు సంపన్నులు ఇతర దేశాలకు తరలివెళ్లినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి. -
‘చైనా సాయంతో పాక్ పక్కా ప్లాన్’
న్యూఢిల్లీ: చైనా సాయంతో పాకిస్తానే పక్కా ప్రణాళికతో బంగ్లాదేశీయులు ఈశాన్య రాష్ట్రాల్లోకి వలస వచ్చేలా చేస్తోందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ బుధవారం అన్నారు. ఈ ప్రాంతంలో అస్థిరత నెలకొనేలా చూడటమే వారి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోకి బంగ్లాదేశీయుల వలసలు పెరిగిపోతున్న అంశంపై ఆయన ఢిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. అస్సాంలో ముస్లింల జనాభా పెరిగిపోతుండటాన్ని రావత్ ప్రస్తావిస్తూ అక్కడ ఏఐయూడీఎఫ్ అనే ముస్లిం పార్టీ బీజేపీ కన్నా చాల వేగంగా ఎదుగుతోందని అన్నారు. ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలోనే ఈ సమస్యకు పరిష్కారం దాగుందని రావత్ సూచించారు. -
పల్లె పొమ్మంది.. పట్నం రమ్మంది!
ఉన్న ఊళ్లో పని లేక పోవడంతో పేదలు పొట్ట చేత పట్టుకుని పట్నాలకు వలస వెళ్తున్నారు. స్థానికంగానే పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉపాధి పథకం కూడా వారిని ఆదుకోకపోవడంతో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. నివారణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంతో ఇప్పటికే 50వేల మందికి పైగా సుగ్గిబాట పట్టారు. కర్నూలు(అర్బన్): జిల్లాలోని పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పనులు పూర్తి కావడంతో వేలాది మంది వ్యవసాయ కూలీలు పొట్ట చేతపట్టుకొని ఇళ్లకు తాళాలు వేసి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఉపాధి కూలీ గిట్టుబాటు కాకపోవడం, ఏడాది క్రితం చేసిన పనులకే వేతనాలు అందకపోవడం వలసలకు కారణమని తెలుస్తున్నా అధికారులు చూసీచూడనట్లున్నారనే ఆరోపణలున్నాయి. బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు కడప, గుంటూరు, విజయవాడ పట్టణాల్లోని భవన నిర్మాణ, ఇతర వ్యవసాయ పనుల్లో జిల్లా వాసులు మగ్గుతున్నారు. ప్రస్తుతం చేపడుతున్న పనులు .. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో చేపట్టిన ఫారంపాండ్స్‌ను మార్చి నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. జిల్లాలో 45 వేల ఫారంపాండ్స్‌ను ఈ ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 12 వేలు మాత్రం పూర్తి కాగా, 20 వేలు వేర్వేరు దశల్లో కొనసాగుతున్నాయి. ఇంకా 13 వేల ఫారంపాండ్స్ పనులు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఫీల్డ్ చానల్స్, ఫీడర్ చానల్స్ పనులతో పాటు భూమి అభివృద్ధి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, ఆట స్థలాలు, సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. పెండింగ్‌లో రూ.15 కోట్ల వేతనాలు.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులకు సంబంధించి బడ్జెట్ సకాలంలో విడుదల చేయకపోవడం, విడుదల చేసినా అరకొరగా ఉండటంతో ఏడాది కాలంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని కూలీలకు రూ.15 కోట్ల మేర బకాయిలున్నాయి. బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ సక్రమంగా ఉన్న కూలీలకు రూ.9 కోట్ల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉండగా, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్ అనుసంధానంలో దొర్లిన పొరపాట్లు, ఇతరత్రా సాంకేతిక కారణాల వల్ల రూ.6 కోట్లు ఆయా బ్యాంకుల్లోని సస్పెన్షన్ ఖాతాల్లోనే మూలుగుతున్నాయి. 145 గ్రామ పంచాయతీల్లోప్రారంభం కాని పనులు.. జిల్లాలోని 889 గ్రామ పంచాయతీలకు గానూ 145 పంచాయతీల్లో ఎలాంటి ఉపాధి పనులు ప్రారంభం కాలేదు. రుద్రవరం మండలంలో 17, బనగానపల్లె మండలంలో 10 పంచాయతీల్లో పనులు చేపట్టడం లేదు. జిల్లాలోని 10 క్లస్టర్లలో 95,977 మంది కూలీలకు పనులు కల్పించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటి వరకు ఆయా క్లస్టర్లలోని గ్రామ పంచాయతీల్లో కేవలం 30 వేల మంది కూలీలు మాత్రమే ఉపాధి పనులకు హాజరు కావడం గమనార్హం. ♦ కోసిగి మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో 69 వేల జనాభా ఉంది. ఈ మండలంలో 2,990 మంది ఉపాధి కూలీలు పనులు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయితే గ్రామాలకు గ్రామాలు వలస వెళ్లడంతో ప్రస్తుతం 561 మంది మాత్రమే 12 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులను చేస్తున్నారు. మిగిలిన 5 గ్రామ పంచాయతీల్లో కూలీలు లేకపోవడంతో ఎలాంటి పనులు నేటి వరకు కల్పించలేకపోతున్నారు. ఈ మండలం నుంచే దాదాపు 10 వేలకు పైగా వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మార్చి నాటికి 60 లక్షల పనిదినాలు పూర్తి చేసేందుకు చర్యలు ఈ ఏడాది మార్చి నాటికి 60 లక్షల పనిదినాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో కూలీల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం. నంద్యాల డివిజన్లో ఇంకా వ్యవసాయ పనులు ఉండటంతో ఉపాధి పనులు పుంజుకునేందుకు కొంత సమయం పడుతుంది. వలసలను నివారించేందుకు పడమటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాం. వేతనాలు గిట్టుబాటయ్యేలా ఫారంపాండ్స్, ఫీల్డ్ చానల్స్, ఫీడర్ చానల్స్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. – డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి, డ్వామా పీడీ -
ప్రమాదంలో ఉత్తరాఖండ్ ?
సాక్షి, డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వలసలు వేధిస్తున్నాయి. అక్కడి గ్రామాలు నానాటికి హరించుకుపోతున్నాయి. పర్వతమయ ప్రాంతాల్లో ఉండలేక, తమ బతుకులు ముందుకు తీసుకెళ్లలేక ప్రతి ఏడాది ఊర్లకు ఊర్లే ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. యువకులంతా కూడా తమ గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదు. దీంతో కనీసం 20 ఏండ్ల నుంచైనా తమ పిల్లలను చూసుకోలేని పరిస్థితి ఉన్న తల్లిదండ్రులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఉదాహరణకు పౌరీ జిల్లాలో భోకాండి అనే గ్రామంలో ఇద్దరంటే ఇద్దరే వ్యక్తులు ఉంటున్నారు. ఇద్దరు ముసలి వారే. ప్యారేలాల్ కు 75 ఏళ్లు ఉండగా ఆయన భార్య సుదామకు దాదాపు అంతే వయసు. పైగా ఆమెకు చూపులేదు. దాదాపు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న వారి ఇంటి ముందు బిక్కుబిక్కుమంటూ ఆకలి బాధతో ఒళ్లంతా కృశించిపోయి వారిని కలిసి మీడియా ప్రతినిధులతో అతికష్టంగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. వారి పరిస్థితి చూసిన ఎవరైనా కళ్లు చెమర్చాల్సిందే. 'మా బిడ్డ మనోజ్ ఉద్యోగం కోసం నగరం వెళ్లిపోయాడు. ఎప్పుడోగానీ వస్తాడు వెంటనే వెళతాడు. మాకు తెలుసు వాడు ఇక రాడని. అందరిలాగే వాడికి వయసొచ్చింది.. వెళ్లిపోయాడు' అని చెప్పుకుంటూ ఏడ్చేశారు. ఇలాగే ముసలి తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లిపోతున్న మనోజ్‌లు ఇప్పుడు ఉత్తరాఖండ్ గ్రామాల్లో కోకొల్లలు. ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల నుంచి లక్షల్లో యువత వలస వెళుతున్నారు. ఒక్క పౌరీ జిల్లాలోనే దాదాపు 300 గ్రామాలు వలసల కారణంగా నిర్మాణుష్యంగా మారాయంటే అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా మరికొన్ని గ్రామాలు చెప్పుకుంటూ వెళితే కేసుందర్ అనే గ్రామంలో 199మంది ఉండగా వారిలో చాలామంది 50 ఏళ్లు పైబడినవారే.. ఇక అన్సోలి అనే గ్రామంలో 69మందే ఉండగా వారిలో 13మంది మాత్రమే యువకులు ఉన్నారు. ఇక సిరోలి అనే గ్రామంలో 181మంది ఉండగా వారిలో 20మంది మాత్రమే యువకులు. ప్రస్తుతం గ్రామాల్లో బతికే పరిస్థితులు లేకపోవడం, వారికి ఉపాధి లేని కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
వలస దేవోభవ
సైబీరియా నుంచి లక్షల కొలదీ పక్షులు భారతదేశానికి వలస వస్తాయి. మంచి నీటి సరస్సులు ఉన్న ప్రాంతంలో చెట్ల మీద గూళ్లు కట్టుకుంటాయి. గుడ్లు పెట్టి, పిల్లల్ని కని, వాటికి రెక్కలు వచ్చేవరకు అక్కడే ఉంటాయి. ఆ తరవాత సైబీరియా తరలి వెళ్లిపోతాయి.సంతానోత్పత్తి కోసం ఎంతో సంతోషంతో వలస వస్తాయి. సంతానంతో ఆనందంగా మరలి వెళ్లిపోతాయి. ఆదిమ మానవుడి జీవితం వలసలతోనే ప్రారంభమైంది. ఆహారం కోసం వేటాడుతూ కొన్ని వందల మైళ్ల దూరానికి కూడా వలస వెళ్లేవాడు. ఆహారం కోసం వలసలు వెళ్లడం నాటి నుంచి నేటి వరకూ ఉంది. మంచి ఉద్యోగాలు, మంచి సంపాదన కోసం యువతరం పొరుగు దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. అక్కడే స్థిరపడిపోతున్నారు. మరి కొందరు... వరదలు, భూకంపాలు వంటి విపత్తులు ఏర్పడినప్పుడు తాత్కాలికంగా మరో ప్రాంతానికి వలసలు వెళ్తున్నారు. వాతావరణం అనుకూలించాక స్వగ్రామానికి మరలి వస్తారు. అన్నిటి కంటే బాధాకరమైనది... ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జన్మభూమి నుంచి మరో ప్రాంతానికి శాశ్వతంగా వలస వెళ్లవలసిరావడం. దేశంలో అంతర్యుద్ధాలు జరుగుతున్నప్పుడు, ఉగ్రవాదం కోరలు చాచినప్పుడు... ఆయా దేశాల వారు వలస పోతున్నారు. ఇదే విషాదమనుకుంటే, వారిని ఎవ్వరూ చేరనివ్వకపోవడం మరింత విషాదం. వారిని పెద్ద మనసుతో అక్కున చేర్చుకోవాలి. సాటి మనిషికి సహాయపడినట్లే సాటి దేశాలకు ఆపన్న హస్తం అందించాలి. అదే మానవత్వం, దైవత్వం అనిపించుకుంటుంది. (నేడు అంతర్జాతీయ వలసదారుల దినం) -
బీజేపీలోకి సరైన సమయంలో చేరికలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బూత్ స్థాయి నుంచి బలోపేతమవుతున్న బీజేపీలోకి సరైన సమయంలో భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతోందని, చాలా మంది ప్రముఖలు బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, ఆ పార్టీ ఇప్పట్లో కోలుకొనే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, విమోచన దినోత్సవం నిర్వహించకపోవడం వల్ల ప్రజల్లో వెల్లువెత్తిన అసంతృప్తి టీఆర్ఎస్ పతనానికి నాంది అవుతాయని విశ్లేషించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తా మని, 10 పార్లమెంటు స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యవర్గ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాష్ట్రంలోని తాజా పరిస్థితులను, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చేప ట్టిన ఆందోళనల గురించి నివేదిక అందించినట్టు చెప్పారు. 23 వేల పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల తర్వాత అమిత్ షా తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటిస్తారని తెలిపారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ పర్యటిస్తారని తెలిపారు. జనవరి–ఫిబ్రవరి నెలల్లో లక్ష మందితో తెలంగాణలో భారీ సభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో కేంద్ర జల వనరుల సంఘం సలహాదారు శ్రీరాం వెదిరె, పార్టీ సమన్వయ కర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘హుండీ’..హవా..!
- జోరందుకున్న వ్యాపారం - పెద్ద నోట్ల రద్దు ప్రభావం - బ్యాంకుల్లో విత్‌డ్రా ఆంక్షలు - నష్టపోతున్న వలస పక్షులు కోరుట్ల: గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇటీవల హుండీ వ్యాపారం జోరందుకుంది. పెద్దనోట్ల రద్దు.. బ్యాంకుల్లో విత్‌డ్రాలపై పరిమితుల నేపథ్యంలో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన వారు హుండీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గల్ఫ్ కరెన్సీ మారకంలో తక్కువ డబ్బులు వస్తున్నా.. ఒకేసారి పెద్ద మొత్తంలో నేరుగా ఇంటికి పంపే అవకాశం ఉండడంతో హుండీ వ్యాపారం ద్వారా డబ్బులు పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. గతేడాది నవంబరులో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత బ్యాంకులు, ఏటీఎం నుంచి రోజు డబ్బులు విత్‌డ్రా చేసే అంశంలోనూ పరిమితులు విధించారు. ఆ తర్వాత బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకోవడానికి ప్రజలు పడ్డ ఇబ్బందులు అందరికీ తెల్సినవే. కాగా, గల్ఫ్ వెళ్లిన వారు సాధారణంగా ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి తాము సంపాదించిన డబ్బులను ఇంటికి పంపుతుంటారు. బ్యాంకులకు ఈ డబ్బులు పంపితే ఒకేసారి విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోవడం.. రోజు బ్యాంకులకు వచ్చి ఇక్కడి వారు ఇబ్బందులు పడుతుండడంతో గల్ఫ్ నుంచి డబ్బులు పంపేవారు హుండీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. హుండీ వ్యాపారుల ద్వారా డబ్బులు పంపితే ఎన్ని డబ్బులు పంపితే అంత మొత్తం నేరుగా ఇంటికి చేరుతుండడంతో గల్ఫ్ వెళ్లిన వారు హుండీ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. అడ్డగోలు కమీషన్లు.. ఉత్తర తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల రాజన్న, ఆదిలాబాద్, మంచిర్యాల, కామారెడ్డి పరిసర ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వలసవెళ్లిన వారు లక్షల్లో ఉన్నారు. ప్రస్తుతం వీరిలో చాలామంది తమ డబ్బులు హుండీ వ్యాపారుల ద్వారా ఇంటికి పంపుతున్నారు. సాధారణంగా గల్ఫ్ దేశాల నుంచి డబ్బులు బ్యాంకుల ద్వారా ఇంటికి పంపితే ఎక్ఛేంజీ భారం పడదు. ఉదాహరణకు సౌదీ నుంచి వంద ధర్హామ్లు ఇండియాకు బ్యాంకు ద్వారా పంపితే మారకం ప్రకారం రూ. 1,750 వస్తాయి. ఎంత డబ్బు పంపినా కేవలం ఇరవై ధర్హామ్లు మాత్రమే ఎక్ఛేంజీ కమీషన్ కింద సౌదీ బ్యాంకుల్లో తీసుకుంటారు. కాగా, హుండీ నుంచి వంద ధర్హామ్స్(ఇండియా కరెన్సీ రూ.1,750) పంపితే ఇండియాలో రూ.1,650 –1,700 మాత్రమే అందిస్తారు. అంటే వంద ధర్హామ్స్కు సుమారు రూ. వంద వరకు కమీషన్ కింద హుండీ వ్యాపారులు కట్ చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఇంత కంటే ఎక్కువే కట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా గల్ఫ్ దేశాల నుంచి లక్షల్లో డబ్బులు పంపే వారు తీవ్రంగా నష్టపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో హుండీని ఆశ్రయిస్తున్నారు. ముంబై కేంద్రంగా.. ముంబై కేంద్రంగా కొందరు గల్ఫ్ దేశాల్లో తమ ఏజెంట్లను నియమించి వ్యాపారం నడుపుతున్నారు. గల్ఫ్‌లో ఉన్న ఏజెంట్లు ఇండియాకు డబ్బులు పంపడానికి తమ వద్దకు వచ్చే వారి నుంచి కమీషన్ ముందుగానే కట్ చేసుకుంటారు. వారి చేతికి అక్కడి కరెన్సీ అందిన తర్వాత ముంబైలో ఉన్న హుండీ వ్యాపారికి సమాచారం ఇస్తారు. వీరు ఆ డబ్బులను ఆయా జిల్లాల్లో ఉన్న తమ ఏజెంట్ల ద్వారా బంధువులకు నేరుగా అందిస్తారు. ఈ దందాలో పెద్ద మొత్తంలో కమీషన్లు దండుకోవడంతో పాటు తమ వద్ద ఉన్న బ్లాక్ మనీ నేరుగా వైట్‌మనీగా మార్చుకోవడానికి హుండీ వ్యాపారులకు ఆస్కారం చిక్కుతోంది. -
కేరళలో మన అన్నదాతలు భిక్షాటన : వైస్ జగన్
అమరావతి: ఉపాధి హామీ నిధులను ఉపాధి సృష్టించేందుకు వాడకపోవడంతో కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ... ఉపాధి హామీ పనుల్లో లేబర్ కాంపోనెంట్‌ను (కార్మికుల వ్యయాన్ని) తగ్గించి మెటీరియల్ కాంపోనెంట్‌ను పెంచుతున్నారన్నారు. లేబర్ కాంపోనెంట్‌ను తగ్గించడం వల్ల పనులు లేక కూలీలు ఉపాధి కోసం కేరళ, కర్ణాటక, చెన్నైకి వలస పోతున్నారన్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగానే మన రాష్ట్రానికి చెందిన అన్నదాతలు కేరళలో భిక్షాటన చేస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 97.5 శాతం ఉపాధి హామీ నిధులను లేబర్ కాంపోనెంట్‌కే వినియోగించారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంగన్వాడీ, పంచాయతీ భవనాలు, సిమెంట్ రోడ్లు, శ్మశానాల నిర్మణానికి ఈ నిధులు ఖర్చు పెడుతోందని వైఎస్ జగన్ అన్నారు. సిమెంట్ పనులు పెరగడం వల్ల కార్మికులకు ఉపాధి లేకుండా పోతోందని..మెటీరియల్ కాంపోనెంట్‌ను ఎక్కువ పెట్టడం వల్ల అవార్డులు వచ్చాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్నారు. కానీ పేదల గురించి మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
కేరళలో మన అన్నదాతలు భిక్షాటన
-
వలసల నివారణకు ‘ఉపాధి’ పనులు
– డ్వామా అడిషనల్ పీడీ మురళీధర్ నంద్యాలరూరల్: వలసలు నివారించేందుకు జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఉపాధి పనులను ప్రారంభించాలని సిబ్బందిని డ్వామా అడిషనల్ పీడీ పి.మురళీధర్ ఆదేవించారు. శుక్రవారం నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీడీ, ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉపాధి పనులపై లక్ష్యాన్ని ఇచ్చామని, దానిని పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 48 వేల ఫాంపాండ్లు పూర్తి చేశామని, మరో 40వేలు మిగిలి ఉన్నాయని, మార్చి నెలాఖరులోగా వీటిని పూర్తి చేయాలన్నారు. అలాగే 16వేల వర్మీకంపోస్టు యూనిట్లు పూర్తి చేయాలని చెప్పారు. పనులు చేసిన ఉపాధి కూలీలకు మస్టర్ వేసిన 15రోజుల్లోగా వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆయన వెంట నంద్యాల ఎంపీడీఓ స్వర్ణలత ఉన్నారు. -
పల్లెలు.. రాళ్ల ముల్లెలు
ఏటా వలస గోసే బుక్కెడు బువ్వ కోసం మైళ్లకు మైళ్లు.. ప్రత్యేక రాష్ట్రంలోనూ తీరని ‘ఆకలి’ ‘కొత్త’ ఆకాంక్ష నెరవేర్చని పాలకులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తరతరాల కరువుకు పుట్టిళ్లు ఆ పల్లెలు. నీళ్లు లేక రాళ్లు తేలిన భూముల్లో సాగు పాణం మీదకొస్తోంది. విధిలేక భూమి మీద భరోసా వదిలి బువ్వ కోసం మైళ్లకు మైళ్లు వెళ్లే వలస పక్షులు అక్కడి జనం. తెలంగాణ కల సిద్ధించిన వేళ ఈ ప్రాంత కరువును తరిమికొట్టాలి. పడావు పడిన భూముల్లో పారిశ్రామిక విప్లవం రావాలి. వలస గోసతోనే నిర్వీర్యమైపోతున్న యువతకు శాశ్వత ఉపాధి దొరకాలి. నారాయణఖేడ్ ఆకలి తీరాలి. మారుమూల పల్లెల్లో పరిశ్రమలు నిలబడాలంటేæ ప్రత్యేక రాయితీ కావాలి. అందుకు పారిశ్రామిక వెనుకబాటు ఉన్న మెదక్ జిల్లానే గత్యంతరం. తాత్కాలిక వనరుల కల్పనను, లేని ఉద్వేగాలను కారణంగా చూపించి రాజకీయ నేతలు సంగారెడ్డిలో కలపాలనుకోవడం చారిత్రక తప్పిదం అవుతోందని, యువత భవిష్యత్తు ఉపాధిని విధ్వంసం చేసిన వారు అవుతారని సమాజిక పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామికంగా అత్యంత పురోగతిలో ఉన్న జిల్లా సంగారెడ్డి. దేశంలోనే పెద్ద ఇండస్ట్రీయల్ కారిడార్ పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరాలో కెమికల్, ఫార్మా పరిశ్రమలు, అందోల్ ప్రాంతంలో బీరు పరిశ్రమల, సంగారెడ్డిలో పెప్సీకోలా, గణపతి షుగర్స్, ఓడీఎఫ్, బీడీఎల్, రామచంద్రాపురంలో బీహెచ్ఈఎల్, సదాశివపేటలో ఎమ్మార్ఎఫ్ తదితర ఇంటర్నెషనల్ కంపెనీలు ఇప్పటికే స్థిరపడ్డాయి. మరో వైపు జహీరాబాద్‌లో 12 వేల ఎకరాలతో పారిశ్రామిక పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్) ఏర్పాటు చేస్తున్నారు. నిమ్జ్ ప్రారంభమైతే వేలాది పరిశ్రమలు ఇక్కడకు వస్తాయి. ఇక సంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం పరిశ్రమల కోసం ప్రత్యేక రాయితీలు ప్రకటించాల్సిన అవసరం అసలు ఉండదు. ప్రస్తుత ప్రదిపాదనల ప్రకారం వెనుకబడిన నారాయణఖేడ్‌ను సంగారెడ్డి జిల్లాలోనే ఉంచితే అది యువత భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారుతోందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 2.50 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇందులో 80 వేల ఎకరాల భూమి వ్యవసాయానికి అంత యోగ్యమైనది కాదని కేవలం పారిశ్రామిక అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుందని ఇప్పటికే నిపుణులు తేల్చారు. హైదరాబాద్ చుట్ట పక్కల ప్రాంతాల కంటే అత్యంత చౌకగా భూములు దొరుకుతాయి. పైగా బీదర్, లాతూర్ లాంటి ముఖ్యపట్టణాలు అతి సమీపంగానే ఉన్నాయి. అన్నిటికీ మించి శ్రామిక శక్తి పుష్కలంగా ఉంది. అయినా ఇప్పటి వరకు పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెట్టకపోవడం ప్రభుత్వ పరమైన ప్రోత్సాహం లేకపోవటం. ప్రత్యేక రాయితీ ద్వారా ఇక్కడ పరిశ్రమలను పోత్సహించాల్సి ఉంటుంది. అది జరుగాలంటే నారాయణఖేడ్‌ను నూటికి నూరుపాళ్లు మెదక్ జిల్లాలోనే ఉంచాలని పారిశ్రామిక వేత్తలు చెప్తున్నారు. ప్రతిపాదిత మెదక్ జిల్లాలో చేగుంట, చిన్నశంకరంపేట, కొంత మేరకు తూప్రాన్ బెల్టులో మినహాయిస్తే ఎక్కడ కూడా పరిశ్రమలు లేవు. భవిష్యత్తులో మెదక్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిన జిల్లా. పారిశ్రామికంగా వెనుకబడిన జిల్లాను ప్రోత్సహించడం కోసం కచ్చితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రాయితీ ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే వేలాది పరిశ్రమలు మెదక్ జిల్లాను తాకుతాయి. ప్రస్తుతం నారాయణఖేడ్ నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న పారిశ్రామిక భూమి లభ్యతను బట్టి వందల్లో మల్టీనేషన్ కంపెనీలు, వేలాదిగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అక్కడ స్థిరపడే అవకాశం ఉందని, ఈ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 50 వేల నుంచి 75 వేల మంది స్థానిక యువతకు భవిష్యత్తులో ఉపాధి లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రవాణాపరంగా ప్రస్తుతం ఉన్న ప్రతిపాదనల ప్రకారం మెదక్ జిల్లాకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ప్రస్తుతం అక్కన్నపేట- మెదక్ రైల్వే పనులు కొనసాగుతున్నాయి. ఈ రైలు మార్గాన్ని బీదర్ వరకు పొడగించే ప్రతిపాదనలపై అధ్యయనం జరుగుతోంది. మరో వైపు నిజాంపేట నుంచి బీదర్ వరకు దాదాపు 50 కిలోమీటర్ల పొడవుతో 50వ నెంబర్ జాతీయ రహదారి పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇంకో వైపు మెదక్ పట్టణం నుంచి నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలకు అనుమతి లభించింది. డివిజన్ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణ ప్రక్రియ పూర్తి కావటానికి గరిష్టంగా 5నుంచి 10 ఏళ్లకు మించి పట్టదు. ఆ తరువాత పారిశ్రామిక వేత్తలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి వాలుతారు. దీంతో రైతుల భూములకు కూడా మంచి డిమాండ్ వస్తుంది, అక్కడి యువతకు కరువుతీరా శాశ్వత ఉపాధి దొరుకుతుంది. -
వలసలపై పెరిగిన ‘ప్రేమ’
వలసల పట్ల గతంలో అయిష్టత ప్రదర్శించిన వారిని ప్రస్తుతం మానవతా దృక్పథం కదిలిస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి మరో కారణం.. ఇప్పుడు వలస వస్తున్న వారు రాష్ట్రంలోని వారైనందువల్లే కావచ్చు. ముంబై వీరిని అతిథులుగానే చూస్తోంది. ముంబై నగరం వలస ప్రజల పట్ల సాదరంగా సమ్మతి తెలిపేది. కానీ ఒక దశలో అది వారి పట్ల ఉన్మాదపూరితమైన దృక్ప థంతో వ్యవహరించింది. బతక డం కోసం వచ్చి సాధారణ గృహా నికి అద్దె కట్టడం తప్పిస్తే అక్ర మంగా ఏదీ స్వాధీనం చేసు కోని.. కాస్త మెరుగైన స్థితిలో ఉన్న వారు ఫర్వాలేదు. కానీ దారిద్య్రం తొణకిసలాడుతున్న తమ స్వస్థలాలను వదిలి వచ్చిన పేదవారు మాత్రం ‘హాని’ కలిగించే వారై పోయారు. ఎలాంటి స్థితిలోఉన్నా, ఈ రెండు విభాగా లకు చెందినవారు బతకడం కోసం ముంబైకి వచ్చారు. బహుశా మొట్టమొదటిసారిగా, ముంబై నగరం సంక్షోభంలో చిక్కుకున్న వారికి, ఈ సందర్భంలో మర ట్వాడా కరువు బాధితులకు ఆపన్నహస్తాలను అందిం చింది. వీరికోసం ముంబైవాసులు శిబిరాలు నెలకొల్పారు. రాజకీయవాదులు ఆహార ఏర్పాట్లు చేశారు. తగిన స్థాయిలో కొంత పని కల్పించి పారితోషికం ఇచ్చారు. శివసేన మంత్రే దీనికి పూనుకున్నారు. వలస ప్రజలంటేనే ముఖం చిట్లించుకున్న పార్టీ ఇది. మహారాష్ట్రలోని మరట్వాడా ప్రాంత సంక్షోభం ఎంత తీవ్రమైనదంటే, తమ గణపతిని దర్శించుకున్న సందర్శ కుల నుంచి నగదు వసూలు చేసిన ప్రజలు, దాన్ని నానా పటేకర్ స్థాపించిన ‘నామ్ ఫౌండేషన్’కు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సంక్షోభం పొంచుకుని ఉందని వారికి తెలుసు. తమ శక్తిమేరకు ఎంత సహాయపడినప్పటికీ, ఇది సహృదయంతో చేసిన ప్రయత్నం. కానీ సంక్షోభం చుట్టు ముట్టిన ప్రాంతంలో నివాసముంటున్న వారికి కూడా ఏం జరగనుందో తెలుసు. అయితే గత నెల చివరి వరకు వారి లో ఎక్కువమంది ఆశాభావంతో అక్కడే ఉండిపోయారు. తాము కూడా స్వయంగా గతంలో వలస వచ్చినవారే కావచ్చు కానీ మానవ వలసల పట్ల గతంలో అయిష్టత ప్రదర్శించిన వారిని ప్రస్తుతం మానవతా దృక్పథం కదిలిస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి మరో కారణం.. ఇప్పుడు వలస వస్తున్న వారు రాష్ట్రంలోని వారైనందువల్లే కావచ్చు. మరట్వాడాతో సమానంగా సంక్షోభాన్ని చవిచూసిన బుందేల్‌ఖండ్ నుంచి మునుపట్లో ముంబైకి వలసలు రాలేదని చెప్పలేం. వీరు ముంబైకి వచ్చి స్థిరపడ్డారు కూడా. వీరు చడీచప్పుడు లేకుండా ఇటీవలే వచ్చి అప్పటికే ఉన్న తమ ప్రాంత వాసులతో కలిసిపోయి ఉండవచ్చు. ఇలా వచ్చిన వారి వాస్తవ సంఖ్య తెలీదు. స్వస్థలంలో నెలకొన్న దుస్థితి నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశ పూర్వకంగా ప్రజలు తరలి వస్తున్నప్పుడు ఇలాంటివారి సంఖ్యను లెక్కించడం దాదాపుగా సాధ్యం కాదు. కానీ గుర్తించవలసింది ఏమిటంటే ముంబై వీరిని అతిథులుగా చూస్తోంది. ఏదేని కారణం వల్ల తన ఇంటిని ఉపయోగించుకోని స్థితిలో మీ పొరుగునున్న వ్యక్తి మీ ఇంటిలో ఆశ్రయం పొందినట్లుగానే ఇది కనిపిస్తోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తను మళ్లీ వెనక్కు వెళ్లిపోవచ్చు. కాని అతడు శరణార్థే. యూరప్‌వైపు సిరియన్లు వెళుతున్నట్లుగా కాకుండా, తాత్కాలికంగా మాత్రమే ఇతడు శరణార్థిగా ఉంటున్నాడు. ప్రస్తుతానికి మాత్రం వలస వస్తున్నవారి పట్ల నగరం దృక్కోణం ఆశాజనకంగానే కనిపిస్తోంది. నగర మేయర్ స్నేహల్ అంబేకర్ వలస ప్రజలకు మద్దతుగా తమ వేతనాలలో కొంత బాగాన్ని కేటాయించవలసిందిగా నగర వాసులను కోరినట్లు చెప్పారు. కానీ నగర రూపురేఖలను వికారం చేస్తున్న కారణంగా మురికివాడలంటే ముఖం చిట్లించుకునే సమాజంలోని ఒక సెక్షన్ నుంచి ఈ మద్దతు రావలసి ఉంది. అయితే ఇక్కడ కూడా ఓటర్లు కనబడుతుంటారు కాబట్టి వీరు మురికివాడల్లోని ప్రజలను రహస్యంగా ప్రోత్సహిస్తూ వారిని చట్టబద్ధం చేస్తుంటారు. వలస ప్రజలు నగరాలకు తరలి వెళుతుంటారు. అన్ని పెద్ద నగరాల కంటే ముంబై సహజ అయస్కాంతంలాగా మంచి అవకాశాలను అందించేదిగా ఆకర్షిస్తుంటుంది. అయితే పుణే వంటి ఇతర నగరాలు కూడా వలస ప్రజలతో నిండిపోయినట్లు వార్తలు సూచిస్తున్నాయి. ఎందుకంటే తీవ్రమైన నీటి ఎద్దడితో గ్రామీణ ఆర్థికవ్యవస్థ కృశించి పోయింది. రాష్ట్రం వెలుపల నుంచి గత కొద్ది సంవత్సరాలుగా లాతూర్ కూడా వలసలను ఆకర్షించేది కానీ ఇక్కడి స్థానికుల్లో కొందరైనా ఇప్పుడు బయటకు వెళ్లడానికి ప్రాధాన్యమిస్తున్నారు. వలస ప్రజలు రెండు రకాలు. ఒకరు నియామక పత్రాలతో వచ్చేవారు. వీరికి వస్తూనే అద్దె గృహాలు కూడా దొరికే అవకాశముంది. రెండు. ఏదో ఒక మంచి జరుగుతుందనే ఆశతో తక్కువ వేతనాలున్న అసంఘటిత రంగం నుంచి ఎక్కువగా నగరంలోకి వచ్చిపడ్డవారు. ఇలాంటివారికి తోటి గ్రామస్థుడిలాగా తాత్కాలిక వసతి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అలా వసతి దొరికితే వీరికి అక్కడ జీవనం సాధ్యపడుతుంది. వీరు చాలా వరకు నైపుణ్యం లేనివారు. ఈ రెండో విభాగంలోని వ్యక్తి శరణార్థే. ఎందుకంటే కొన్ని ఎకరాల భూమిని కలిగి ఉన్నప్పటికీ బతకడానికి తగిన పంటలను అది ఇవ్వనందున ఆర్థిక కారణాల వల్లే ఇతడు ఇల్లు వదిలి వస్తున్నాడు. రోజువారీ ప్రాతిపదికన పనిచేస్తూ ఇతడు చివరికి మురికివాడలో తేలతాడు. ఒక పని తర్వాత మరొక పనికి మారుతూ, ఒక మురికివాడ నుంచి మరొక దానికి కూడా మారుతూ ఉంటాడు. వీరి జీవితాలు వీలైనంత అనిశ్చితంగానే ఉంటాయి. మురికివాడల్లో నివసించని వారు ఇలాంటివారిని ఉపయోగించుకుంటూ ఉంటారు కానీ వారిని ఏ మాత్రం పట్టించుకోరు. వర్షాలు కురిస్తేనే వీరందరూ లేదా వీరిలో చాలామంది తమ స్వస్థలాలకు మరలుతారని మనకు తెలుసు. ఇది వ్యవసాయంపై వారికి కుదిరే నమ్మకం, ఆర్థిక వ్యవస్థ మునుపటి స్థాయికి చేరుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. వెనక్కు వెళ్లడానికి ఏదైనా ఉపాధిని వారు కనుగొన్నట్లయితే, మరొక తక్షణ విపత్తుకు వ్యతిరేకంగా దాన్ని ఒక బీమాలాగా ఉపయోగించుకోవడానికి వీలైనట్లయితేనే ఇది జరుగు తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అలాంటి రక్షణకు తగు హామీ ఇవ్వలేనంతగా గిడసబారిపోయింది. గ్రామాల్లో భూములు కలిగిన ప్రజలు ముంబైలోని నూతన భవనాల్లోని నేలను చదును చేస్తుండటం కొత్త కాదు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేష్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com -
వలసలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
పార్టీ నేతలకు చంద్రబాబు సూచన సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహచర నేతలకు సూచించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీని రాజకీయంగా దెబ్బతీసి నైతికంగా బలహీన పరిచేందుకు ప్రతిరోజూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీలో చేరే లా ప్రణాళికలు రూపొందించటంతోపాటు చివరి వరకూ గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల నాటికి ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 30 నుంచి 40 మందికి వివిధ కారణాలతో టికెట్లు ఇవ్వలేమని, నియోజకవర్గాల పెంపు వల్ల మరో 50 సీట్లు అదనంగా వస్తాయని, ఇన్ని స్థానాలకు చివరి నిమిషంలో అభ్యర్థులు దొరకటం కష్టం కాబట్టి ప్రతిపక్షం నుంచి సాధ్యమైనంత ఎక్కువమందిని చేర్చుకునే పనిలో నేతలు నిమగ్నం కావాలని హితోపదేశం చేశారు. టీడీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం బుధవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం లో జరిగింది. ఫిరాయింపులపై ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించినా ఎదురుదాడి చేయాల్సిందిగా చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో పెద్దసంఖ్యలో ఫిరాయింపులు జరిగినపుడు స్పందించని పార్టీలు ఇపుడు తప్పుపట్టటమేంటని ప్రశ్నించటం ద్వారా గట్టిగా సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించినవారు రాజీనామా చేయాలని, వారి రాజీనామాల్ని ఆమోదించాలని వైఎస్సార్సీపీ ఎంత ఒత్తిడి తెచ్చినా పట్టించుకోవద్దన్నారు. ఎనిమిదో అద్భుతంలా అమరావతి సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రపంచంలో ఎనిమిదో అద్భుతంలా రాజధాని అమరావతిని నిర్మిస్తామని, ఇందుకు తగ్గట్టుగా నిర్మాణ శైలి ఉండాలని అంతర్జాతీయ నిర్మాణరంగ నిపుణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాజధానిని పరిపాలన కేంద్రంగానే పరిమితం చేయకుండా ఆర్థిక కార్యకలాపాలకు వేదిక చేస్తామన్నారు. తద్వారా అమరావతిని అందరూ నివసించేలా ప్రజారాజధానిగా చేయడం సాధ్యమవుతుందని చెప్పారు. అంతర్జాతీయ నిర్మాణరంగ నిపుణులు, వాస్తుశిల్పులతో పరిపాలన-నివాస సముదాయ భవనాల నిర్మాణ డిజైన్లపై సీఎం బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సృజనాత్మకతను రంగరించి.. తగిన ప్రణాళికలు రూపొందించాలని కోరారు. డిజైన్ల పోటీ..: సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్‌భవన్,ప్రజాప్రతినిధులు, మంత్రుల నివాస సముదాయాల్ని 900 ఎకరాల్లో నిర్మిం చేందుకు డిజైన్ల పోటీ నిర్వహిస్తున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ పోటీలో పాల్గొంటున్న సంస్థలకు లక్షా 50 వేల డాలర్లను ముందుగా చెల్లిస్తున్నట్లు తెలిపారు. మార్చి 22, 23, 24 తేదీల్లో ఈ సంస్థలు డిజైన్లు సమర్పిస్తాయని, వాటిలో ఒకదానిని క్రిస్టోఫర్ బెనింజర్ చైర్మన్‌గా గల ఆరుగురు సభ్యుల అంతర్జాతీయ కమిటీ మార్చి 25న ఎంపిక చేస్తుందని చెప్పారు. కాగా, జపాన్‌కు చెందిన జైకా ప్రతినిధి బృందం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలసింది. రెండురోజులుగా ప్రతిపాదిత విజయవాడ మెట్రో ప్రాజెక్టు కారిడార్లను పరిశీలిస్తున్న బృందం ఆయనతో సమావేశమై రుణం గురించి చర్చించింది. మరోవైపు రహదారుల స్థితిగతులను సమగ్ర విధానంతో సర్వే చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన అధునాతన సాంకేతిక వాహనాన్ని బాబు విజయవాడలో ప్రారంభించారు. -
‘ఆధారం’ తెగిపోనుందా?
‘ముంబాయ్.. దుబాయ్.. బొగ్గుబాయి .. తెలంగాణ ప్రజల బతుకంతా ఇదేకాదా..!’ - ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో తరుచుగా చేసిన వ్యాఖ్యలు మెతుకుసీమ, పాలమూరు వాళ్లకు త్యాగం ఎక్కువ. ఎక్కడెక్కడికో వలస పోయి కుటుంబానికి దూరంగా ఉండి నాలుగు రాళ్లు సంపాదించి.. భార్యా పిల్లలకు పంపి పోషించుకుంటారు. - దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వ్యక్తం చేసిన ఆవేదన సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: తెలంగాణ ప్రజల బతుకంతా వలసలే. ఉన్న ఊరిలో ఉపాధి దొరక్క పొట్టచేత పట్టుకొని ముంబాయ్, దుబాయ్ లాంటి సుదూర ప్రాంతాలకు వలసలు పోతారు. చంటి పిల్లలను ముసలి తల్లుల మీద వదిలేసి పని వెతుకుంటూ దేశం గాని దేశానికి వలస పోవటం మెతుకుసీమ పల్లెల్లోనూ నిత్యకృత్యం. జిల్లా నుంచి ఏటా మూడు లక్షల మంది కూలీలు జానెడు పొట్ట నింపుకునేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్లు అంచనా. నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజవర్గాల్లో వలసలు తీవ్రంగా ఉండగా, మిగిలిన ప్రాంతాల్లోనూ ఓ మోస్తరుగా ఉన్నాయి. వీళ్లు ఎప్పుడో ఏడాదికి ఒకసారి ఇంటికి వచ్చిపోతుంటారు. కష్టం తెలిసిన మెతుకుసీమ బిడ్డ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ విషయాలు తెలియని కావు. అన్ని తెలిసిన ఆయనే ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ‘ఆధార్’ కార్డును ముడిపెట్టడం వివాదాస్పదమవుతోంది. సుప్రీంకోర్టే ఆధార్ ‘ఆధారం’గా పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ, మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డును ముడిపెట్టడంతో వలస కూలీలకు శాపంగా మారింది. రేషన్ కార్డుల ఏరివేత నుంచి మొదలుకుని దళితుల భూ పంపిణీ వరకు ప్రభుత్వం ఆధార్ కార్డునే కీలక ‘ఆధారం’గా తీసుకోవడంతో వలస కూలీల కుటుంబాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడింది. ‘ఆధార్’తోనే దూరం చేస్తున్నారు ఇటీవల చేపట్టినబోగస్ రేషన్ కార్డుల ఏరివేతను కూడా ఆధార్ కార్డు ఆధారంగానే గుర్తించారు. వలస కూలీలు పిల్లల పెళ్లిళ్ల సమయంలో సొంత గ్రామాలకు వచ్చి ఆ తంతు ముగిసిన వెంటనే మళ్లీ వలస వెళ్లిపోతారు. ఓ తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు చేస్తే ఇక ఆ జంట వేరుగానే బతుకుతుంది. ఎవరి పిల్లలు వాళ్లకు ఉంటారు. పంచుకోవడానికి ఆస్తిపాస్తులు ఏమి ఉండవు కాబట్టి ప్రత్యేకంగా వేరు పడటం అంటూ ఏమీ ఉండదు. పైగా ఆధార్ కార్డు తీసే సమయానికి వాళ్లు అసలు ఊళ్లోనే ఉండరు. అధికారులు ఇవేమి పరిగణలోకి తీసుకోకుండా దాన్ని ఉమ్మడి కుటుంబంగా పరిగణించి, దాన్ని ఆధార్ కార్డుతో ముడిపెట్టి వాళ్లను ప్రభుత్వ సంక్షమ పథకాలకు దూరం చేస్తున్నారు. దళితుల్లోనే వలసలు ఎక్కువ ప్రభుత్వం దళితులకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమికి కూడా అర్హుల జాబితాను ఆధార్ కార్డు ఆధారంగానే రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు గుంట జాగా కూడా లేని దళితులు.. శ్రమనే నమ్ముకొని బతికారు. ఎక్కడ పని దొరికితే అక్కడకు వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. వలసలు కూడా దళిత కుటుంబాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. వలసలు వెళ్లిన చాలా మంది దళితులకు ఆధార్‌కార్డులు లేవు. కానీ ప్రభుత్వం వలస కూలీల కుటుంబాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేవలం గ్రామంలో ఉన్న వారినే పరిగణలోకి తీసుకొని వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేయడం వలన అర్హులైన పేదలంతా వలస జీవులుగానే మిగిలిపోయే ప్రమాద ం ఉంది. ఆధార్ లేని వలస కూలీలు ఈ రాష్ట్రం వాళ్లు కాదా? ఈ నెల 19న సర్వే చేపట్టబోతున్న ప్రభుత్వం వలస జీవులను పూర్తిగా విస్మరించినట్లు ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించి స్థానికులు ఇంటి వద్ద ఉండేటట్టు చర్యలు చేపట్టింది. కానీ ఊరు వదిలివె ళ్లిన వలస కూలీల పరిస్థితి ఏమిటీ? ఇప్పటికే రాష్ట్రం సరిహద్దులు దాటి వెళ్లిపోయిన వారికి సర్వే జరుగుతుందనే విషయం ఎలా తెలియాలి? ఎవరు చెప్పాలి? వారిని ఎవరు స్థానిక ప్రాంతాలకు తీసుకురావాలి? జిల్లా నుంచి ఎంత మంది వలసలు వెళ్లారన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే కరువయ్యారు. అసలు జిల్లా చెందిన ఎంతమంది కార్మికులు వలస వెళ్లారని డీఆర్డీఏ, డ్వామా, రెవిన్యూ, కార్మిక శాఖ అధికారులను అడిగితే ఏ ఒక్కరి దగ్గర కూడా వివరాలు లేవు. ప్రతి శాఖ అధికారులు కూడా అది తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోకి రాదని చెప్పారు. ఇప్పటికే వాళ్లకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవు. ఇక ప్రస్తుతం చేపట్టనున్న ఇంటింటి సర్వే సమయంలో వలస కూలీలు అందుబాటులో లేకుంటే ఇక వారు ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కాకుండా మిగిలిపోవాల్సిందేనా? -
వలస పాలెం
కొనకనమిట్ల, న్యూస్‌లైన్: కొనకనమిట్ల మండలం కాట్రగుంట పంచాయతీలోని వడ్డెపాలెంలో 50 కుటుంబాలు నివశిస్తున్నాయి. గ్రామ జనాభా 250 మంది ఉంటారు. ఊళ్లో చేసేందుకు పనులు లేక యువకులంతా బేల్దారి పనుల కోసం వలస వెళ్తుంటారు. ఏడాదికి మూడు నెలలు మాత్రమే ఊళ్లో ఉండి..మిగిలిన తొమ్మిది నెలలు వలస బాట పడతారు. అయిన వారిని, పొలాలను, ఇళ్లను వదిలిపెట్టి బతుకుదెరువు కోసం హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. వారితో పాటే భార్యా, పిల్లల్ని కూడా తీసుకెళ్తారు. దీంతో ఊరంతా ఖాళీ అయింది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కేవలం మూడు కుటుంబాల్లో ఐదుగురు వృద్ధులు మాత్రమే అక్కడుంటున్నారు. ఇళ్లన్నీ తాళాలు వేసి, వీధుల్లో చెట్లుపెరిగి ఉన్నాయి. కొన్ని ఇళ్ల సమీపంలోనూ చెట్లు పెరిగి శిథిలావస్థకు చేరాయి. బేల్దారి పనులకు వెళ్లిన వారు ఏటా ఆగస్టు నెలలో కులదేవత పెద్దమ్మతల్లి జాతర కోసం స్వగ్రామాలకు చేరుకుంటారు. జాతర అనంతరం ఊళ్లో మూడు నెలలపాటు ఉండి..తిరిగి పనుల కోసం వలసెళ్తుంటారు. గ్రామంలోని కోటమ్మ అనే వృద్ధురాలిని ‘న్యూస్‌లైన్’ పలకరించగా..తన గోడు వెళ్లబోసుకుంది. ‘అయ్యా ఊళ్లో పనుల్లేవు. మా ముగ్గురు పిల్లలు బేల్దారి పనులకు వేరే ఊళ్లకు ఎళ్లారు. మా ఆయనకు వచ్చే పింఛను, జీవాలు అమ్ముకోని వచ్చిన దాంతో బతుకుతున్నాం’ అని చెప్పింది. గేదెలు మేపుకుంటూ పాడి ద్వారా జీవనం సాగిస్తున్నామని వేముల పిచ్చమ్మ అనే వృద్ధులు తెలిపింది. మరో వృద్ధురాలు బత్తుల పిచ్చమ్మ ఆరోగ్యం బాగోలేక మంచంపట్టింది. దూరప్రాంతాలకు వలసెళ్లి పనులు చేయలేక ఇక్కడే ఇళ్లు కనిపెట్టుకుని ఉంటున్నట్లు చెప్పింది. అరకొర ఆదాయాలతో కుటుంబాలు గడవటమే కష్టంగా ఉందని..ఇల్లు కట్టుకునే స్థోమత లేక రేకుల షెడ్లు వేసుకుని ఉంటున్నామని కోటమ్మ అనే వృద్ధురాలు తెలిపింది. -
వలస బాట.. ఉపాధి వేట..
ఉట్నూర్/బెజ్జూర్, న్యూస్‌లైన్ : జిల్లాలో మళ్లీ వలసలు మొదలయ్యాయి. ఏటా కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గతేడాది కూడా వందల గ్రామాల నుంచి వేలాది మంది కూలీలు వలస వెళ్లారు. ఎప్పుడు మార్చి, డిసెంబర్ నెలల్లో వలసలు మొదలయ్యేవి. ఈ ఏడాది ముందుగానే ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని రైతులు, కూలీలు పయనం అవుతున్నారు. ఈసారి జిల్లాలో, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు పంటలు నీటమునిగాయి. పంటలు కుళ్లిపోయి రెండు, మూడు సార్లు విత్తనాలు విత్తిన సరైనా దిగుబడి రాలేదు. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొందరు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు, జిల్లాలకు వెళ్తున్నారు. పదెకరాల రైతులు కూడా కూలీలుగా మారుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చూపించలేదు. ఇటు వ్యవసాయం గిట్టుబాటక, అటు పని దొరుకక పొట్టచేత పట్టుకుని పిల్లా పాపలతో పల్లె జనం వలస బాట పడుతున్నారు. పొరుగు ప్రాంతాలకు పయనం తాజాగా బెజ్జూర్ మండలం ఇందిర్గాం, ఎల్కపల్లి, చిన్నసిద్ధాపూర్, నాగుల్వాయి, రేచిని, ఇప్పలగూడ, నాగపెల్లి గ్రామాలకు చెందిన కూలీలు వలసబాట పట్టారు. వీరితోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఉరిలో ఉపాధి కరువై ఏటా ముంబై, చంద్రాపూర్, కీన్వర్ట్, మెవాడ్, నాందేడ్, బల్లార్షా, యావత్మాల్, మధ్యప్రదేశ్‌లతోపాటు రాష్ట్రంలోని ఖమ్మం, గుంటూర్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస పోతున్నారు. వీరు వ్యవసాయ, పౌల్ట్రీ పరిశ్రలు, భవన నిర్మాణ పనుల్లో రోజువారీ కూలీలుగా కాలం వెళ్లదీస్తున్నారు. అక్కడ గుడిసెలు వేసుకుని ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అరిగోస పడుతున్నారు. వలస వెళ్లే గ్రామాలు ఇవే.. జిల్లా వ్యాప్తంగా ఏటా వందల గ్రామాల నుంచి కూలీలు వలస పోతున్నారు. వేమనపల్లి మండలంలో రాజారం, సుంపుటం, కల్లెంపల్లి, రాచర్ల, కెరమెరి మండలంలో ఆగర్‌వాడ, ఇంద్రానగర్, సుర్ధాపూర్, కైరి, నీంగూడ రింగన్ఘట్, బెజ్జూర్ మండలం నుంచి నాగుల్వాయి, సిద్ధాపూర్, జిల్లె డ, సోమిని, రంగపల్లి, బోరుగూడ, ఎల్కపల్లి, నాగపల్లి, ఏటిగూడ, కోయపల్లి, తిక్కపల్లి, నం దిగాం, తుకుడ, అంబగట్టు, పాపన్పెట్, కలా యి, కుంతలమానపల్లి, సులుగుపల్లి, మర్పిడి, శివపల్లి, ఎల్లూర్, ఉట్నూర్ మండలంలో వడో ని, కోలాంగూడ, ఇంద్రవెల్లి మండలంలో రాం పూర్, గోపాల్పూర్, ధర్మసాగర్, పాటగూడ, అందుగూడ, భుర్శన్పటార్, మర్కగూడ, కుభీ ర్ మండలంలో రంగశివుని, కౌటాల, సిర్పుర్ (టి) తదితర మండలాల నుంచి వేలాది మంది పిల్లపాలతో బతుకుదెరువు కోసం వలసలు పో తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధు లు, అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా వీరు స్పందించి వలసలను నివారించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.