
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బూత్ స్థాయి నుంచి బలోపేతమవుతున్న బీజేపీలోకి సరైన సమయంలో భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతోందని, చాలా మంది ప్రముఖలు బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, ఆ పార్టీ ఇప్పట్లో కోలుకొనే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, విమోచన దినోత్సవం నిర్వహించకపోవడం వల్ల ప్రజల్లో వెల్లువెత్తిన అసంతృప్తి టీఆర్‌ఎస్ పతనానికి నాంది అవుతాయని విశ్లేషించారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తా మని, 10 పార్లమెంటు స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యవర్గ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాష్ట్రంలోని తాజా పరిస్థితులను, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చేప ట్టిన ఆందోళనల గురించి నివేదిక అందించినట్టు చెప్పారు. 23 వేల పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల తర్వాత అమిత్ షా తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటిస్తారని తెలిపారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ పర్యటిస్తారని తెలిపారు. జనవరి–ఫిబ్రవరి నెలల్లో లక్ష మందితో తెలంగాణలో భారీ సభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో కేంద్ర జల వనరుల సంఘం సలహాదారు శ్రీరాం వెదిరె, పార్టీ సమన్వయ కర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు.