హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాజకీయాలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న పరిస్థితులే.. త్వరలో తెలంగాణలోనూ కనిపించవచ్చని వ్యాఖ్యానించారాయన. బుధవారం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార, ప్రధాన ప్రతిపక్షంపై మండిపడ్డారు.
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో ఉంది. అధికార కాంగ్రెస్‌పై సొంత ఎమ్మెల్యేలే తిరగబడ్డారు. అసహనంతోనే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితే తెలంగాణలోనూ రావొచ్చు. తెలంగాణలో తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్‌లో ఉన్నారు. రాబోయే రోజుల్లో రేవంత్‌రెడ్డి పరిస్థితి దారుణంగా మారుతుంది. అని లక్ష్మణ్ అన్నారు.
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తా ఇక లోక్‌సభ ఎన్నికల కోసం గెలిచే గుర్రాలనే బరిలోకి దింపుతున్నట్లు తెలిపారాయన. ముఖ్యమంత్రి సహా మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. వాళ్లు తమ భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. దురుసు మాటలు ఆపి హామీల సంగతి ఆలోచించాలన్నారాయన.
ఇక.. పదేళ్లు అధికారంలో ఉండి ఒక్కసారిగా అది దూరం అయ్యే సరికి బీఆర్‌ఎస్ సైతం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని అన్నారాయన. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. బీఆర్‌ఎస్ నుంచి కూడా కొందరు మాతో టచ్‌లో ఉన్నారు. అయితే.. మేం ఆచితూచి వ్యవహరిస్తాం అని అన్నారాయన. ఇక.. ఎన్నికల ముందు పథకాలు అందరికీ అని చెప్పి, ఇప్పుడేమో కండిషన్లు అప్లై అని కాంగ్రెస్ అంటోందని.. ప్రజలను మోసం చేసేందుకే గ్యారెంటీలు ఇచ్చిందని విమర్శించారాయన. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులు విరిచి కొడితే కానీ గ్యారంటీలు అమలు కావంటూ చురకలంటించారు.
బీజేపీ సంకల్ప యాత్రలను కాంగ్రెస్ అడ్డుకోవాలని చూస్తుందని.. అయినా ఈ యాత్రలు జగన్నాథ రథ చక్రాలుగా కదులుతూనే ఉంటాయని బీజేపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ తోడు దొంగలుగా బిజెపిపై అరోపణలు చేస్తున్నాయి. కేటీఆర్, హరీష్‌రావులకు దమ్ముంటే ఒక్క లోక్‌సభ సీటులో అయినా పోటీ చేసి గెలవాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment