తెలంగాణలో శుక్రవారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొంది. తెలంగాణ నుంచి మహారాష్ట్రలో ముంబై సహా పలు ప్రాంతాలకు వలసపోయిన వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్లకు పయనమయ్యారు. ఇప్పటికే చాలా మంది స్వగ్రామాలకు చేరుకోగా.. మరికొందరు ఈ రెండ్రోజుల్లో చేరుకోనున్నారు. ఇప్పటికే చేరుకున్న వారిలో కొందరు తమకు నచ్చిన పార్టీల తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వివిధ కారణాలతో ఓటేసేందుకు రానివారిని ఎలాగైనా రప్పించేందుకు ఇప్పటికే పలువురు అభ్యర్థుల ప్రతినిధులు ముంబై సహా పలు ప్రాంతాల్లో తెలుగు ఓటర్లను ఒప్పిస్తున్నారు.
70% తెలంగాణ ప్రజలే!
ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో తెలుగు మూలాలు ఉన్న వారు దాదాపుగా కోటి మంది ఉంటారని అంచనా. ముంబై, భివండి, సోలాపూర్, పుణే తదితర ప్రాంతాల్లో తెలుగు వారు ఎక్కువగా ఉన్నారు. కేవలం ముంబైలోనే సుమారు 10 లక్షల మంది ఉన్నారు. వీరిలో సుమారు 70% తెలంగాణ వాళ్లే. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులే ఎక్కువ. కరీంనగర్‌తోపాటు నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాదు, వరంగల్ జిల్లాలకు చెందిన వారు ముంబైతోపాటు చుట్టుపక్కల పరిసరాల్లో నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది తమ సొంతూళ్లలోని బంధువులతో సంబంధాలు, రాకపోకలు కొనసాగిస్తున్నారు. వీరిలో అనేక మందికి ఓటు హక్కు మహారాష్ట్రతోపాటు తెలంగాణలో కూడా వచ్చింది. ఈ సారి తెలంగాణలో అనేక మంది తమకంటూ ఓ గుర్తింపు ఉండాలని అనేక మంది ఓటర్ల లిస్టులో తమ పేరును నమోదు చేయించుకున్నారు.
చార్జీలతోపాటు మందు, విందు!
వలస ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వివిధ పార్టీలకు చెందిన స్థానిక కార్యకర్తలతోపాటు వివిధ పార్టీలు, అభ్యర్థుల అభిమానులు ముంబైలో ప్రచారం చేçస్తున్నారు. దీంతో ముంబైలో తెలంగాణ ప్రజల్లో ఒకరకమైన రాజకీయ వేడి కన్పిస్తోంది. ఓటర్లు స్వగ్రామాల్లో ఓటేసేందుకు కొందరు అభ్యర్థులు రానుపోను బస్సు, రైలు చార్జీలతోపాటు అన్ని వసతులు కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. ముంబై నుంచి జన్నారం వెళ్లే భూమి ట్రావెల్స్ తెలంగాణ ఓటర్లకు 20% డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు ఈ ట్రావెల్స్ యజమాని వోరంగటి భూమన్న ప్రకటించారు. అయితే ఈ రాయితీ కేవలం ఓటరు కార్డు లేదా ఓటరు లిస్టులో తమ పేర్లను చూపించినవారికే మాత్రమే ఇవ్వనున్నారు. ఎన్నికల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాలలో ఓటర్లు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. అందిన వివరాల మేరకు కొన్ని ప్రాంతాల్లో వాహనాలను తీసుకుని అందరు షేరింగ్ చేసుకుని వెళ్తుండగా మరి కొన్ని ప్రాంతాల్లోపార్టీ అభ్యర్థులు వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు.
వలస జీవుల డిమాండ్లు
వలస ఓటర్ల డిమాండ్లు అనేకం ఉన్నాయి. ముంబైలో తెలంగాణ భవనం ఏర్పాటు, ముంబై యునివర్సిటీలో తెలుగు పీఠం, నాకా కార్మికుల సమస్యలతోపాటు అనేక సమస్యలు తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాలని వీరు కోరుతున్నారు. మరోవైపు ముంబైకి మరిన్ని రైళ్లు బస్సులు లేదా నడపాలని కోరుతున్నారు. స్వగ్రామాల్లో తమ గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నారు.
పుణే టు నారాయణపేట్
మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ నియోజకవర్గానికి చెందిన వేలాది కుటుంబాలు పుణే పాషాణ్‌లోని సంజయ్‌గాంధీ బస్తీలో నివాసముంటున్నాయి. వీరందరు ఇక్కడ స్థిరపడ్డారు. ధన్వాడ, నారాయణ పేట్, కోయిల కొండ, ధామర్ గట్టి తదితర మండలాలోని హనుమాన్ పల్లి, తోలగుట్ట తాండా, నీలగుర్తి తాండా, అంకల తాండా, తుమ్మచెర్ల తాండా, దొడ్లమంచెర్ల తాండా, భోజనాయక్ తాండా, ఈదన్న తాండా, కొత్తూరు తాండా, వడంచెరు తాండా, రామకృష్ణ పల్లె, మొండోల తాండా తదితర తండాలకు చెందిన వారున్నారు. పుణేలో స్థానికంగా కూడా సుమారు నాలుగు వేల ఓట్లు వీరివి ఉండగా నారాయణపేట్ నియోజకవర్గంలో కూడా సుమారు రెండు వేల మందికిపైగా ఓట్లున్నవారున్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం తొలిసారి జరిగిన అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లో వీరు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సారి కూడా ప్రత్యేక వాహనాలు, బస్సులు, రైళ్లలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఓటు హక్కు ఉన్న అనేక మందిని లక్ష్మినాయక్, డాక్యా నాయక్, హనుమంత్ నాయక్, వెంటకేష్ నాయక్, పాండు నాయక్, మోతీనాయక్, రాం నాయిక్‌లు తమ తమ సొంత వాహనాల్లో తీసుకెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment