సాక్షి, పెనుకొండ: దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి కూలీలకు నిరవధికంగా పని కల్పించాలని, వారి ఉపాధికి ఎలాంటి సమస్య లేకుండా చూడాలని కలలు కని కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఎంతో మంది కూలీలు ఈ పథకంతో లబ్ధి పొందుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే టీడీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూలీలు చేసిన పనికి సకాలంలో వేతనాలు అందక పూట గడవని పరిస్థితి ఏర్పడింది. రెండు మూడు నెలలైనా ప్రభుత్వం వేతనాలను కూలీల ఖాతాలకు జమ చేయకపోవడంతో కూలీలు తీవ్ర ఆందోళన చెందుతున్నరు. కూలీలు ఉపాధి బిల్లులు పడ్డాయో లేదోనని చూసుకోవడా¯నికి పలుమార్లు బ్యాంకుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు.
ఈ నేపధ్యంలో అనేక మంది కూలీలు పనికి స్వస్తి పలికి పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. గతంలో దాదాపు ఐదు వేల మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్లేవారు. నేడు ఉపాధి కూలీల సంఖ్య వందలకు పడిపోయింది. దీన్నిబట్టి చూస్తే ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వ ఎలా నీరుగారుస్తుందో అర్ధం చేసుకోవచ్చు. గ్రామాల్లో అనేక మంది ఇళ్లను వదలి వెళ్లిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని అడదాకులపల్లి, మహదేవపల్లి, శెట్టిపల్లి, కొండంపల్లి, సోమందేపల్లి, బ్రాహ్మణపల్లి, పందిపర్తికి చెందిన గ్రామస్తులు భారీగా వలస వెళ్లారు. ఒకవైపు తీవ్ర వర్షాబావంతో పంటలు పండక నష్టపోయిన రైతన్నలు, మరోవైపు ఉపాధి కూలీలకు వేతనాలు సకాలంలో అందకపోవడంతో వలసలు రోజురోజుకి పెరుగుతున్న పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది.
కొంపముంచిన వరుణుడు..
పెనుకొండ నియోజకవర్గంలో ఖరీఫ్ 56,000 ఎకరాల్లో కంది, వేరుశనగ, అలసంద, పెసర, సోయాబీన్స్ తదితర పంటలు సాగు చేశారు. ఇందులో వేరుశనగ అధిక విస్తీర్ణంలో సాగయింది. పంట సాగులో అడపదడపా వర్షాలు కురిసినా తర్వాత మూడు నెలల పాటు చినుకు జాడ కనిపించలేదు. దీంతో పంట పూర్తిగా దెబ్బతినింది. చాలా చోట్ల రైతులు పంటను పశువులకు వదిలేశారు. ఇక రబీలో నియోజకవర్గ వ్యాప్తంగా 5500 ఎకరాల్లో పప్పుశనగ, ఉలవలు తదితర పంటలు సాగుచేశారు. రబీలో కూడా వరణుడు కరుణించకపోగా తీవ్ర వర్షాభావం, తెగుళ్ల బెడదతో పంటలు చేతికందకుండా పోయాయి. దీంతో పంట పెట్టుబడి చేతికందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వం నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా రాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో వలసబాట పట్టారు.
మండలాల వారీగా జాబ్‌కార్డులు,కూలీలు, పెండింగ్ వేతనాల వివరాలు
మండలం | జాబ్ కార్డుల | పని చేస్తున్నకూలీలు సంఖ్య | పెండింగ్‌లో ఉన్న వేతనాలు |
పెనుకొండ | 10959 | 1029 | రూ.85 లక్షలు |
సోమందేపల్లి | 8526 | 3000 | రూ.70 లక్షలు |
రొద్దం | 15753 | 1202 | రూ.56 లక్షలు |
గోరంట్ల | 6459 | 1100 | రూ.60 లక్షలు |
పరిగి | 11229 | 1188 | రూ.35 లక్షలు |
నియోజకవర్గంలో వలసపోయిన వారి సంఖ్య
మండలం | వలసపోయిన వారు |
పెనుకొండ | 1000 |
సోమందేపల్లి | 1000 |
రొద్దం | 1500 |
పరిగి | 1000 |
గోరంట్ల | 4500 |
ఈ ఫోటోలో ఉన్న వృద్ధురాలి పేరు హనుమక్క. పెనుకొండ మండలం మహదేవపల్లి గ్రామం. కుమారుడు రామాంజినేయులు ఇతర కుటుంబ సభ్యులు కూలీ పనులకు బెంగళూరుకు వెళ్లడంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. అన్ని పనులు చేసుకుంటూ నానా ఇబ్బందులు పడుతోంది. ఉపాధి హామీ పనులు సక్రమంగా జరగకపోవడం, వేతనాలు సకాలంలో పడకపోవడం, బోర్లు బావులు ఎండిపోయి తినడానికి కూడా ఇబ్బందిగా ఉండడంతో గత్యంతరం లేక కుటుంబ సభ్యులు వలస బాట పట్టక తప్పలేదు.
ఇంటి వద్ద ఒక్కదాన్నే ఉంటున్నా..
కుమారుడు వలస వెళ్లడంతో ఇంటి వద్ద ఒక్కదాన్నే ఉంటున్నాను. కుమారుడు హిందూపురం ప్రాంతానికి వలస వెళ్లి పనులు చేసుకుంటూ అక్కడే సంసారం పెట్టుకున్నాడు. 10 రోజులకు ఒకసారి వచ్చి పలకరించి వెళ్తుంటాడు. వృద్ధురాలినైనా నిస్సహాయంగా ఉండాల్సిన పరిస్థితి. బతకడానికి గ్రామంలో ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ఇతర ప్రాంతానికి వలస వెళ్లక తప్ప లేదు.
– నాగమ్మ, మహదేవపల్లి, పెనుకొండ మండలం
బిల్లులు సక్రమంగా పడవు
గతంలో ఉపాధి పనులకు చాలా మంది వెళ్లే వాళ్లం. ప్రస్తుతం బిల్లులు సక్రమంగా పడక పోవడంతో పనులకు వెళ్లడానికి కూలీలు ఆసక్తి చూపడం లేదు. దీంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. పూట గడవాలంటే కూడా కష్టంగా ఉంది. వలస వెళ్లక తప్పడం లేదు.
– రామాంజినమ్మ, మహదేవపల్లి
Comments
Please login to add a commentAdd a comment