National Rural Employment Guarantee works
-
ఉపాధి హామీ పని దినాలు పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్ కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటగా 14 కోట్ల పని దినాల కల్పనకు ఆమోదం తెలిపిన కేంద్రం.. ప్రస్తుతం ఆ కేటాయింపులను 19 కోట్ల పని దినాలకు పెంచింది. ఈ పథకం ద్వారా ప్రస్తుత ఆర్థిక ఏడాదికి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత పేదలకు పనుల కల్పనలో అదనపు పని దినాల కేటాయింపుపై గురువారం ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో పని దినానికి రూ.428 చొప్పున కేటాయింపు ఒక్కొక్క పని దినానికి గరిష్టంగా రూ.428 చొప్పున గ్రామీణాభివృద్ధి శాఖకు అందుతాయి. పేదలకు వారు చేసే రోజు వారీ పని ఆధారంగా కూలీ రూపంలో గరిష్టంగా రూ.257 చొప్పున అందజేస్తారు. కూలీల వేతనాల ఆధారంగా మిగిలిన రూ.171 మెటీరియల్ కేటగిరీ నిధులుగా పేర్కొంటారు. మెటీరియల్ కేటగిరీ నిధులను 75–25 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించి ఇప్పటికే 17.30 కోట్ల పని దినాల పాటు పేదలకు పనులు కల్పన పూర్తయిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా.. 19 కోట్ల పని దినాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించింది. వీటిని పూర్తి చేసిన వెంటనే అదనపు పని దినాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయగా.. అదనపు కేటాయింపులు కూడా చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు హామీ ఇచ్చారు. -
విపత్తులోనూ పేదలకు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: ప్రస్తుత కరోనా పరిస్థితులలోనూ పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గ్రామాల్లో పని కావాల్సిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రోజూ దాదాపు 31 లక్షల మంది ఈ పథకంలో పనులకు హాజరవుతున్నట్టు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు వెల్లడించారు. వలసలు ఎక్కువగా ఉండే విజయనగరం, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోనే అత్యధిక మంది ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు.. సుమారు నెల రోజుల వ్యవధిలోనే ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు రూ. 751.29 కోట్లను వేతనాల రూపంలో చెల్లించినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల రోజుల వ్యవధిలో 26.38 లక్షల కుటుంబాలకు సంబంధించి 40 లక్షల మంది ప్రయోజనం పొందినట్టు అధికారులు తెలిపారు. పని ప్రదేశాలలో కూలీలకు కరోనా భయాలు లేకుండా ఉపాధి పథకం సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ► ఎక్కువ మంది గుమికూడే అవకాశం లేకుండా ఒక్కో చోట గరిష్టంగా 30 మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. ► సాధ్యమైనంత వరకు కూలీ ఇంటికి సమీపంలోనే పనులు కల్పిస్తున్నారు. కూలీలు ఆటోల వంటి వాహనాల్లో కిక్కిరిసి వెళ్లాల్సిన అవసరం లేకుండా నడిచి వెళ్లే దూరంలోనే పనులు కల్పిస్తున్నారు. ► ప్రతిరోజు పనుల ప్రారంభానికి ముందు కూలీలందరినీ థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష చేస్తున్నారు. కరోనా లక్షణాలు లేకపోతేనే పనులకు అనుమతిస్తున్నారు. ► పని ప్రదేశంలో కూలీలతో తప్పనిసరిగా మాస్క్‌లు ధరింపచేస్తున్నారు. అలాగే చేతులు శుభ్రంగా ఉంచుకునేందుకు సబ్బులను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తోంది. -
‘ఉపాధి’తో పేదలకు భరోసా
సాక్షి, అమరావతి: వ్యవసాయ పనులు తక్కువగా ఉండే వేసవి కాలంలో ఉపాధి హామీ పనుల ద్వారా పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భరోసా ఇస్తోంది. ప్రతి నెలా సరాసరిన రూ.1,311 కోట్ల చొప్పున మూడు నెలల్లో రూ.3,934 కోట్ల విలువైన పనులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కలిపి 16.06 కోట్ల పనిదినాలను అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు 90 లక్షల పనిదినాల మేర.. కూలీలకు పనులు కల్పించారు. ఈ నెలాఖరునాటికి మొత్తం 3.90 కోట్ల పనిదినాల ద్వారా రూ.955.07 కోట్ల లబ్ధి కల్పించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే మే నెలలో 6.56 కోట్ల పనిదినాలు, జూన్‌లో 5.60 కోట్ల పనిదినాలు కల్పిస్తారు. తద్వారా మే నెలలో రూ.1,607.93 కోట్లు, జూన్‌లో రూ.1,371 కోట్ల మేర లబ్ధి చేకూర్చనున్నారు. ప్రస్తుతం ఒక్కొక్క పనిదినానికి గరిష్టంగా రూ.245 చొప్పున చెల్లిస్తున్నారు. కాగా, వేసవిలో ఎండ తీవ్రత, భూమి గట్టి పడడం వంటి కారణాలతో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం.. ఏప్రిల్, మే నెలలో సాధారణ రోజుల్లో కూలీలు చేయాల్సిన పని కంటే 30 శాతం మేర, జూన్ నెలలో 20 శాతం తక్కువ చేసినప్పటికీ పూర్తి మొత్తం చెల్లించేలా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌లో ప్రత్యేక జాగ్రత్తలు.. వేసవి ఎండలతో పాటు కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి హామీ పథకం పనుల సమయంలో ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకోనున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. పని సమయంలో మధ్యమధ్యలో కూలీలు విశ్రాంతి తీసుకునేందుకు టెంట్ ఏర్పాటు చేయడంతో పాటు మంచినీరు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అలాగే సాధ్యమైనంత వరకు ఉదయం 11 గంటల్లోపు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూలీలు పనులు చేసుకునేలా వీలు కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు వివరించారు. పని ప్రదేశంలో కూలీలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
'ఉపాధి'కి మరింత భరోసా
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వ్యవసాయ పనులు ముగిసిన నేపథ్యంలో కూలీలు వలస వెళ్లకుండా గ్రామాల్లో ముమ్మరంగా ఉపాధి పనులు కల్పిస్తోంది. అడిగిన వారందరికీ జాబ్‌కార్డు ఇచ్చి, పని చూపిస్తోంది. రోజువారీ వేతనం పెంచడంతోపాటు ఎండల నుంచి ఉపమశనం పొందేలా పనివేళలు మార్చి ‘ఊపాధి’కి మరింత భరోసా కల్పించింది. కర్నూలు(అగ్రికల్చర్): మండే ఎండాకాలం ‘ఉపాధి’ పనులకు వెళ్తున్న కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం చల్లని కబురు అందించింది. ఈ నెల 1వ తేదీ నుంచి గరిష్ట వేతనాన్ని రూ.237 నుంచి రూ.245కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రత్యేకంగా 30 శాతం అలవెన్స్ ఇవ్వాలని ఆదేశించింది. ఫలితంగా పనిలో 30 శాతం తక్కువ చేసినా కూలీలకు పూర్తి వేతనం లభిస్తుంది. కుటుంబానికి ఒకటి చొప్పున జిల్లాలో 5,75,231 జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 11,39,439 మంది సభ్యులుగా ఉన్నారు. మొత్తం 3,70,449 కుటుంబాలకు చెందిన 6,59,538 మంది ఊపాధి పనులకు వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ 1.50 లక్షల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. అడిగిన వారందరికీ పని.. అడిగిన వారందరికీ పని కల్పించే విధంగా జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల వారీగా ఇంటింటికి వెళ్లి డిమాండ్ తీసుకొని పనులు కల్పిస్తున్నారు. వలసలు లేకుండా గ్రామగ్రామాన పనులు కల్పిస్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా.. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ఉపాధి పనులకు హజరయ్యే కూలీలు వడ దెబ్బకు గురికాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూలీలు ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు పనులు చేసే విధంగా కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నారు. మధ్యాహ్నానికి ఇంటికి చేరుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పనులు చేసే ప్రాంతంలో నీడను కల్పించే బాధ్యతను శ్రమశక్తి సంఘాలకు అప్పగించారు. పని ప్రదేశంలో ఎవరైనా వడదెబ్బకు గురైతే తక్షణం ప్రథ«మ చికిత్స చేసేందుకు వీలుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి కూలీలకు మజ్జిగ సరఫరా చేయాలనే ప్రతిపాదన ఉంది. మెరుగైన సదుపాయాలు జిల్లాలో ఉపాధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎండల తీవ్రత నుంచి కూలీలకు రక్షణ కల్పిస్తున్నాం. పని ప్రదేశంలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి. – అమరనాథరెడ్డి, డ్వామా పీడీ వలస వెళ్లడం మానుకున్నాం గతంలో ఉపాధి కూలీ అరకొర వచ్చేది. గుంటూరుకు వలస వెళ్లేవాళ్లం. ఈ సారి కూలీ గిట్టుబాటు అవుతోంది. ఉన్న ఊర్లోనే పనులు దొరుకుతున్నాయి. సౌకర్యాలు కూడా బాగున్నాయి. వలస వెళ్లడం మానుకున్నాం. – సీతమ్మ, ఉపాధి కూలి,బాటతాండ, తుగ్గలి మండలం -
ఆ ‘ఉపాధి’లో అక్రమాలు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలో చేసిన పనులకు సంబంధించి భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చిందని ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. 4,338 పనుల విషయంలో డబ్బుల రికవరీకి విజిలెన్స్ సిఫారసు చేసిందని తెలిపారు. ఉపాధి పనుల విషయంలో కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని, బిల్లుల చెల్లింపులు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని వివరించారు. రూ.5 లక్షల కన్నా తక్కువ విలువ కలిగిన పనుల బిల్లుల్లో 20 శాతం సొమ్ము మినహాయించి మిగిలిన మొత్తం చెల్లించే వ్యవహారం ప్రాసెస్‌లో ఉందన్నారు. రూ.5 లక్షలకు పైబడిన మొత్తాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. చెల్లించాల్సిన మొత్తాలన్నీ కాంట్రాక్టర్లకే వెళతాయని, గ్రామ పంచాయతీలకు వెళ్లవని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు... రూ.5 లక్షల లోపు చేయాల్సిన చెల్లింపులను ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటివరకు చెల్లింపులు చేయకపోవడం సరికాదని పేర్కొంది. ఇలా అయితే సంబంధిత శాఖాధికారులను పిలిచి వివరణ కోరాల్సి ఉంటుందని తెలిపింది. కోర్టుకు చెప్పిన విధంగా చెల్లింపులు చేయాల్సిందేనంది. చెల్లింపు వివరాలను కోర్టు ముందుంచేందుకు వీలుగా తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2018–19 ఉపాధి హామీ బిల్లులకు సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పి.వీరారెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తూ దాదాపు 7 లక్షల పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా కొత్త బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. -
ఏపీ: ‘ఉపాధి హామీ’ అమలులో అద్భుత ప్రగతి
సాక్షి, అమరావతి: కరోనా విపత్తుతో అల్లాడిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలులో అద్భుత ప్రగతి కనబరిచింది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మార్చి 29వ తేదీ సోమవారం నాటికి రూ.10,169.65 కోట్ల దాకా ఇందుకు ఖర్చుపెట్టింది. ఒకపక్క పని అడిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి ఈ పథకం ద్వారా పనులు కల్పిస్తూనే, గ్రామాల్లో ఏకంగా 48,966 శాశ్వత భవన నిర్మాణ పనుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 47.70 లక్షల కుటుంబాలకు 25.42 కోట్ల పనిదినాల పాటు పనులు కల్పించి కూలీ నిమిత్తం వారికి ఏకంగా రూ.5,818 కోట్లు చెల్లించింది. భవన నిర్మాణ పనులకు మరో 3,965.41 కోట్లు ఖర్చుచేసింది. మరో రూ.386 కోట్లకు పైగా పథకం అమలు నిర్వహణకు ఖర్చుచేశారు. కేవలం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఇంత పెద్ద సంఖ్యలో పేదల కుటుంబాలకు పనులు కల్పించడంలోగానీ.. ఒకే ఏడాది రూ.25 కోట్లకు పైబడి పనిదినాల పాటు పనులు కల్పించడంలోగానీ.. కూలీలకు ఉపాధి కల్పిస్తూ గ్రామాల్లో వేల సంఖ్యలో శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టడంలోగాని రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధిక లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే కరోనా విపత్తులో రూ.5,818 కోట్ల మేర ప్రభుత్వం ఈ పథకం ద్వారా పేదలకు లబ్ధి చేకూర్చితే, అందులో 83 శాతానికి పైబడి ఎస్సీ, ఎస్టీ, బీసీలే లబ్ధిపొందారు. అందులోనూ బీసీ సామాజిక వర్గాల వారు 48.64 శాతం మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందినట్లు అధికారులు తెలిపారు. అలాగే.. ► గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన వారు లాక్డౌన్ కారణంగా గ్రామాలకు తిరిగిరావడంతో, అలాంటి వారి కుటుంబాలకు 3.85 లక్షల కొత్త జాబ్‌కార్డులు మంజూరు చేశారు. దీంతో మొత్తంగా ఈ ఏడాది 8.79 లక్షల మంది కొత్తగా ఉపాధి కూలీలుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ► దేశవ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉన్న జూన్ 9వ తేదీ ఒక్కరోజునే రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల మంది ‘ఉపాధి హామీ’ ద్వారా పనులు పొందారు. ఇదో రికార్డుగా అధికారులు చెబుతున్నారు. ► ఆ నెలలో ఒక్క విజయనగరం జిల్లాలోనే పేదలకు కోటి పనిదినాల మేర పనులు కల్పించారు. మరో ఐదు జిల్లాల్లో 50 లక్షలకు పైబడి పనిదినాల పాటు పేదలు ‘ఉపాధి’ పొందారు. ► దీంతో ఈ ఏడాది కూలీలు సరాసరి రూ.228 చొప్పున వేతనం పొందారు. 13,054 భవన నిర్మాణాలు పూర్తి ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం వరకు సొంత పంచాయతీ కార్యాలయ భవనం కూడా లేని చిన్నచిన్న గ్రామాల్లో సైతం ఇప్పుడు గ్రామ సచివాలయ భవనం, రైతుభరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ భవనాలతో పాటు అంగన్వాడీ, పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దస్థాయిలో శ్రీకారం చుట్టింది. పేదలకు ‘ఉపాధి’ కల్పిస్తూనే ఈ పథకం నిధులను ఇతర ప్రభుత్వ నిధులతో అనుసంధానంచేసి గ్రామాల్లో శాశ్వత భవనాల నిర్మాణం చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 48,966 శాశ్వత భవనాలను ఉపాధి హామీ పథకం అనుసంధానంతో నిర్మిస్తోంది. వీటిలో 13,054 భవనాలు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. ‘ఉపాధి’లో పచ్చదనానికి పెద్దపీట ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ సమతుల్యత సాధించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనిచ్చింది. 37,870 మంది రైతులకు చెందిన 56,675 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధితో పాటు 10,706 కి.మీ. పొడవునా రోడ్డుకు ఇరువైపులా మొక్కల పెంపకం చేపట్టింది. 11,928 హౌసింగ్ లే అవుట్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో, రైల్వేకు చెందిన 34 ప్రాంతాల్లో మొక్కల పెంపకం ద్వారా పేదలకు ఉపాధి కల్పించింది. ఈ ఏడాది ‘ఉపాధి’ అమలు ఇలా.. ► రాష్ట్రంలో యాక్టివ్ ‘ఉపాధి’ జాబ్‌కార్డులు: 55.52 లక్షల కుటుంబాలకు ► వీటిలో నమోదైన కూలీల సంఖ్య: 96.16 లక్షల మంది ► 2020–21లో పనులు పొందిన కుటుంబాలు: 47,70,602 ► పనిచేసిన కూలీల సంఖ్య: 79,75,413 ► పని కల్పించిన మొత్తం పనిదినాలు: 25,42,07,719 ► ఏడాదిలో కూలీలకు వేతనాలుగా చెల్లించింది: రూ.5,818.07 కోట్లు ► ఇందులో ఎస్సీలకు కల్పించిన పని: 5,76,48,132 (22.68%) పనిదినాలు ► ఎస్టీలకు కల్పించిన పని: 2,82,87,014 (11.13 శాతం) పనిదినాలు ► బీసీలకు కల్పించిన పని: 12,36,37,848 (48.64 శాతం) పనిదినాలు ► మైనార్టీలకు కల్పించిన పని: 31,35,242 (1.23 శాతం) పనిదినాలు ► ఇతరులకు కల్పించిన పని: 4,22,47,495 (16.62 శాతం) పనిదినాలు సమిష్టి కృషితోనే.. రాష్ట్రంలో ఉపాధి హామీ ద్వారా రికార్డు స్థాయిలో పేదలకు పనులు కల్పించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థ నాయకత్వం, అధికార యంత్రాంగం సమిష్టి కృషి ఉంది. మరో రెండ్రోజుల్లో (మార్చి 31 నాటికి) 26 కోట్ల పనిదినాల మైలురాయిని కూడా అధిగమిస్తాం. ఈ రాష్ట్రంలో పనుల్లేక ఇతర ప్రాంతాలకు ఏ ఒక్కరూ వలస వెళ్లే పరిస్థితి ఉండకూడదనే లక్ష్యంతోనే సీఎం జగన్ నిత్యం పనిచేస్తున్నారు. అధికారులు ఇదే స్ఫూర్తితో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మరింత ప్రగతి కనబర్చేలా పనిచేయాలి. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి -
'ఉపాధి'లో రికార్డు: సీఎం వైఎస్ జగన్
ఏప్రిల్, మే, జూన్ మొదటి వారం వరకు ఉపాధి పనులు ముమ్మరంగా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇదే వేగంతో పనులు ముమ్మరంగా చేపట్టాలి. ఉపాధి హామీ పథకాన్ని కలెక్టర్లు ఓన్ చేసుకోవాలి. నాలుగైదు రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా సమీక్షించాలి. జాయింట్ కలెక్టర్లు కూడా ఈ పథకంపై దృష్టి పెట్టాలి. కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఆవశ్యకత ఎంతో ఉంది. ఆగస్టు 15న వీటిని ప్రారంభించాలనుకుంటున్నాం. అందుకే వీలైనంత త్వరగా యుద్ధ ప్రాతిపదికన వీటి నిర్మాణ పనులు పూర్తి చేయాలి. గ్రామ స్థాయిలో ఆరోగ్య శ్రీ రిఫరెల్ పాయింట్‌గా విలేజ్ క్లినిక్స్ ఉంటాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులను రికార్డు స్థాయిలో చేపట్టడం ద్వారా కోవిడ్ కష్ట కాలంలో రూ.5,818 కోట్లు నేరుగా కూలీలకు ఇవ్వగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. తద్వారా కూలీలకు 25.42 కోట్ల పని దినాలను కల్పించి ఆదుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని.. చిన్న రాష్ట్రమైనా, దేశంలో మనం మూడో స్థానంలో ఉండడం గర్వకారణమని అన్నారు. ఇందుకు అందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు. స్పందనలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు పథకాలు, కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో రెండు, మూడు జిల్లాలు ఇంకా మెరుగు పడాల్సి ఉందని, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆర్బీకేల భవనాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆలోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని చెప్పారు. ఖరీఫ్ ప్రారంభం సందర్భంగా ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల (బీఎంసీలు) నిర్మాణాలు ఆగస్టు 31 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, సెప్టెంబర్‌లో వీటిని ప్రారంభించబోతున్నామని తెలిపారు. 9,899 చోట్ల బీఎంసీలను ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందులో 3,841 చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల కూడా వెంటనే పనులు మొదలు పెట్టాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మే నాటికి గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి ► గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు తదితర భవన నిర్మాణాలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతోంది కాబట్టి, ఈ భవనాల నిర్మాణంపై పూర్తిగా దృష్టి పెట్టాలి. ► గ్రామ సచివాలయాల నిర్మాణంలో కొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఆ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మే నాటికల్లా గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలి. 25 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ► రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందు కోసం 15 ఎకరాల భూమిని గుర్తించాలి. అక్కడ యూనిట్ ఏర్పాటు చేయాలి. ► ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం, ఇతరత్రా పంటలను ప్రాసెస్ చేయడానికి ఈ యూనిట్లు ఉపయోగపడతాయి. రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ కోసం గత సంవత్సరం రూ.4,300 కోట్లు ఖర్చు చేశాం. 90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వాలి ► ఇప్పటి దాకా 94 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయ్యింది. మిగిలిన 1,69,558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయడంపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. టిడ్కోలో సుమారు 47 వేల ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలి. ► ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా వారికి ఇంటి పట్టా ఇవ్వాల్సిందే. ► పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లను వెంటనే వెరిఫికేషన్ చేసి, పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి. కొత్తగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అవసరమైన చోట వెంటనే భూమిని సేకరించాలి. ► ఇళ్ల పట్టాల దరఖాస్తులను తిరస్కరించేటప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నామో కారణం చెప్పగలగాలి. ఒకవేళ దరఖాస్తు తిరస్కరించిన తర్వాత కూడా, తగిన కారణాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి దరఖాస్తులను మళ్లీ రీ వెరిఫికేషన్ చేయాలి. ► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాల కొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ ఆర్ అనురాధ, పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, సివిల్ సప్లైస్ కమిషనర్ కోన శశిధర్, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లిఖార్జున, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు ► ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కింద తొలి విడతలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. 8,682 కాలనీల్లో ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది. ఆలోగా బోరు, కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ► ఇళ్ల నిర్మాణానికి సన్నాహకంగా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, ఏపీ హౌసింగ్ వెబ్సైట్లో లబ్ధిదారుని రిజిస్ట్రేషన్, ఉపాధి హామీ కింద జాబ్ కార్డుల జారీ.. ఈ పనులన్నీ ఏప్రిల్ 10 లోగా పూర్తి చేయాలి. ► గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి జిల్లా, డివిజన్ స్థాయి అధికారులను ప్రతి మండలానికీ, ప్రతి మునిసిపాలిటీకి నోడల్ అధికారులుగా నియమించాలి. ప్రతి లే అవుట్లో కచ్చితంగా ఒక మోడల్ హౌస్‌ను నిర్మించాలి. ► దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో వస్తున్న ఇబ్బందులు, నిర్మాణ ఖర్చు ఎంత అవుతుంది అన్న దానిపై అవగాహన వస్తుంది. కట్టిన ఇల్లు ఎలా ఉందో లబ్ధిదారులకు తెలుస్తుంది. ఏప్రిల్ 15 నాటికి మోడల్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్ల సేవలను ఇళ్ల నిర్మాణంలో వినియోగించుకోవాలి. ► లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం సిమెంట్, స్టీల్, ఇసుక, మెటల్, ఇటుకలు అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలి. నిర్మాణ సామగ్రిలో కచ్చితంగా నాణ్యత ఉండాలి. ఒకవైపు ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగానే.. మరో వైపు కాలనీలో చేపట్టాల్సిన రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు... ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనపై కార్యాచరణ రూపొందించాలి. -
అక్రమాలపై విచారణ తర్వాతే ‘ఉపాధి’ బిల్లుల చెల్లింపు
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు టీడీపీ హయాంలో ఉపాధి హామీ పథకం కింద జరిగిన పనుల్లో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విచారణ జరుపుతున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విచారణ ముగిసిన తర్వాత పనుల నాణ్యత ఆధారంగా ఆయా పనులకు బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ‘ఉపాధి’ పనుల పెండింగ్ బిల్లుల పరిష్కారానికి సంబంధించిన అంశంపై టీడీపీ సభ్యులు 311వ నిబంధన కింద ఇచ్చిన నోటీసుపై శుక్రవారం మండలిలో జరిగిన చర్చకు మంత్రి జవాబిచ్చారు. 2018 అక్టోబర్ నుంచి 2019 మే మధ్య జరిగిన పనులకు బిల్లులు వెంటనే చెల్లించాలని పలువురు టీడీపీ సభ్యులు కోరిన నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. ఆరోపణలు వచ్చినప్పుడు నాణ్యత ప్రమాణాలు పరిశీలించకుండా ప్రభుత్వం బిల్లులు ఎలా చెల్లిస్తుందని ప్రశ్నించారు. రెండేళ్లలో రూ.8 వేల కోట్లు పనులు కట్టబెట్టారు.. విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి 55.24 శాతం అంటే సగానికిపైగా పనుల్లో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారని తెలిపారు. టీడీపీ హయాంలో 2014–15 నుంచి మూడేళ్లలో రూ.4,900 కోట్ల మేర ఉపాధి హామీ పనులు జరిగితే, ఎన్నికలకు ముందు రెండేళ్లలో హడావుడిగా రూ.8 వేల కోట్లు పనులు జరిగాయని తెలిపారు. దీనిని బట్టే ఆ పనుల్లో నాణ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. విజిలెన్స్ ప్రాథమిక తనిఖీల అనంతరం చేసిన సిఫార్సుల ఆధారంగా ఆ మధ్యకాలంలో జరిగిన మొత్తం 7,95,494 పనులను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్, ఇంజనీరింగ్ అధికారులతో కూడిన మొత్తం 114 తనిఖీ బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పెద్దిరెడ్డి తెలిపారు. కాగా పనుల్లో నాణ్యత ఉన్నట్టు గుర్తించిన అప్పట్లో జరిగిన పనులకు గత 18 నెలల కాలంలో రూ.690.20 కోట్ల పాత బకాయిలను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. మొత్తం 7,95,494 పనుల్లో రూ.5 లక్షలు అంతకంటే తక్కువ విలువ గల 7,28,527 పనులకు గాను రూ.490 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. టీడీపీ సభ్యుల ఆందోళన విద్యుత్ సుంకం (సవరణ), భూమి హక్కుల యాజమాన్యం, దిశ, ఏపీ విత్త బాధ్యత.. బడ్జెట్ నిర్వహణ (సవరణ), రాష్ట్ర అభివృద్ధి సంస్థ, ద్రవ్య వినిమయ బిల్లులను ఆయా శాఖల మంత్రులు మండలి ఆమోదం కోసం ప్రతిపాదించారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి జవాబిచ్చిన తర్వాత కూడా ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే మంజూరు చేయాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టి వెల్‌లో బైఠాయించారు. సభ మూడుసార్లు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో.. చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించిన అనంతరం శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. -
ముల్లె సర్దిన పల్లె
సాక్షి, పెనుకొండ: దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి కూలీలకు నిరవధికంగా పని కల్పించాలని, వారి ఉపాధికి ఎలాంటి సమస్య లేకుండా చూడాలని కలలు కని కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఎంతో మంది కూలీలు ఈ పథకంతో లబ్ధి పొందుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే టీడీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూలీలు చేసిన పనికి సకాలంలో వేతనాలు అందక పూట గడవని పరిస్థితి ఏర్పడింది. రెండు మూడు నెలలైనా ప్రభుత్వం వేతనాలను కూలీల ఖాతాలకు జమ చేయకపోవడంతో కూలీలు తీవ్ర ఆందోళన చెందుతున్నరు. కూలీలు ఉపాధి బిల్లులు పడ్డాయో లేదోనని చూసుకోవడా¯నికి పలుమార్లు బ్యాంకుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో అనేక మంది కూలీలు పనికి స్వస్తి పలికి పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. గతంలో దాదాపు ఐదు వేల మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్లేవారు. నేడు ఉపాధి కూలీల సంఖ్య వందలకు పడిపోయింది. దీన్నిబట్టి చూస్తే ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వ ఎలా నీరుగారుస్తుందో అర్ధం చేసుకోవచ్చు. గ్రామాల్లో అనేక మంది ఇళ్లను వదలి వెళ్లిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని అడదాకులపల్లి, మహదేవపల్లి, శెట్టిపల్లి, కొండంపల్లి, సోమందేపల్లి, బ్రాహ్మణపల్లి, పందిపర్తికి చెందిన గ్రామస్తులు భారీగా వలస వెళ్లారు. ఒకవైపు తీవ్ర వర్షాబావంతో పంటలు పండక నష్టపోయిన రైతన్నలు, మరోవైపు ఉపాధి కూలీలకు వేతనాలు సకాలంలో అందకపోవడంతో వలసలు రోజురోజుకి పెరుగుతున్న పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది. కొంపముంచిన వరుణుడు.. పెనుకొండ నియోజకవర్గంలో ఖరీఫ్ 56,000 ఎకరాల్లో కంది, వేరుశనగ, అలసంద, పెసర, సోయాబీన్స్ తదితర పంటలు సాగు చేశారు. ఇందులో వేరుశనగ అధిక విస్తీర్ణంలో సాగయింది. పంట సాగులో అడపదడపా వర్షాలు కురిసినా తర్వాత మూడు నెలల పాటు చినుకు జాడ కనిపించలేదు. దీంతో పంట పూర్తిగా దెబ్బతినింది. చాలా చోట్ల రైతులు పంటను పశువులకు వదిలేశారు. ఇక రబీలో నియోజకవర్గ వ్యాప్తంగా 5500 ఎకరాల్లో పప్పుశనగ, ఉలవలు తదితర పంటలు సాగుచేశారు. రబీలో కూడా వరణుడు కరుణించకపోగా తీవ్ర వర్షాభావం, తెగుళ్ల బెడదతో పంటలు చేతికందకుండా పోయాయి. దీంతో పంట పెట్టుబడి చేతికందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ, బీమా రాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో వలసబాట పట్టారు. మండలాల వారీగా జాబ్‌కార్డులు,కూలీలు, పెండింగ్ వేతనాల వివరాలు మండలం జాబ్ కార్డుల పని చేస్తున్నకూలీలు సంఖ్య పెండింగ్‌లో ఉన్న వేతనాలు పెనుకొండ 10959 1029 రూ.85 లక్షలు సోమందేపల్లి 8526 3000 రూ.70 లక్షలు రొద్దం 15753 1202 రూ.56 లక్షలు గోరంట్ల 6459 1100 రూ.60 లక్షలు పరిగి 11229 1188 రూ.35 లక్షలు నియోజకవర్గంలో వలసపోయిన వారి సంఖ్య మండలం వలసపోయిన వారు పెనుకొండ 1000 సోమందేపల్లి 1000 రొద్దం 1500 పరిగి 1000 గోరంట్ల 4500 ఈ ఫోటోలో ఉన్న వృద్ధురాలి పేరు హనుమక్క. పెనుకొండ మండలం మహదేవపల్లి గ్రామం. కుమారుడు రామాంజినేయులు ఇతర కుటుంబ సభ్యులు కూలీ పనులకు బెంగళూరుకు వెళ్లడంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. అన్ని పనులు చేసుకుంటూ నానా ఇబ్బందులు పడుతోంది. ఉపాధి హామీ పనులు సక్రమంగా జరగకపోవడం, వేతనాలు సకాలంలో పడకపోవడం, బోర్లు బావులు ఎండిపోయి తినడానికి కూడా ఇబ్బందిగా ఉండడంతో గత్యంతరం లేక కుటుంబ సభ్యులు వలస బాట పట్టక తప్పలేదు. ఇంటి వద్ద ఒక్కదాన్నే ఉంటున్నా.. కుమారుడు వలస వెళ్లడంతో ఇంటి వద్ద ఒక్కదాన్నే ఉంటున్నాను. కుమారుడు హిందూపురం ప్రాంతానికి వలస వెళ్లి పనులు చేసుకుంటూ అక్కడే సంసారం పెట్టుకున్నాడు. 10 రోజులకు ఒకసారి వచ్చి పలకరించి వెళ్తుంటాడు. వృద్ధురాలినైనా నిస్సహాయంగా ఉండాల్సిన పరిస్థితి. బతకడానికి గ్రామంలో ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ఇతర ప్రాంతానికి వలస వెళ్లక తప్ప లేదు. – నాగమ్మ, మహదేవపల్లి, పెనుకొండ మండలం బిల్లులు సక్రమంగా పడవు గతంలో ఉపాధి పనులకు చాలా మంది వెళ్లే వాళ్లం. ప్రస్తుతం బిల్లులు సక్రమంగా పడక పోవడంతో పనులకు వెళ్లడానికి కూలీలు ఆసక్తి చూపడం లేదు. దీంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. పూట గడవాలంటే కూడా కష్టంగా ఉంది. వలస వెళ్లక తప్పడం లేదు. – రామాంజినమ్మ, మహదేవపల్లి -
అటవీ భూముల్లో ఉపాధి
► నీటి సంరక్షణ, అడవుల పరిరక్షణకు పెద్దపీట ► పెద్ద ఎత్తున నీటి, ఊట కుంటల తవ్వకాలు ► భూముల సరిహద్దు చుట్టూ కందకాలు ► త్వరలో ముగియనున్న పనుల గుర్తింపు ► ఉపాధి కూలీలకు పని.. ► అటవీ ప్రాంతాలకు వైభవం సాక్షి, రంగారెడ్డి జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ఇప్పటి వరకు పల్లెలకే పరిమితమయ్యాయి. ఇకపై ఈ పనుల విస్తృతి పెరగనుంది. అటవీ భూముల్లోనూ ఉపాధి పనులు చేపట్టనున్నారు. అటవీ భూముల్లో వర్షపునీటి వరదకు మట్టి కోతకు గురికాకుండా, భూమిలో తేమ సాంద్రత ఎక్కువ కాలం నిలిపే ప్రక్రియలో భాగంగా ఉపాధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తద్వారా అటవీ ప్రాంతంలో సారవంతమైన మట్టి కొటుకుపోవడానికి అవకాశం ఉండదు. అలాగే వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా మట్టిలో తేమ ఉంటుంది. తద్వారా మొక్కలు చనిపోకుండా మనుగడ సాగిస్తాయి. ఫలితంగా హరిత శాతం పెరగడంతో పాటు వన్యప్రాణులకు వేసవిలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అడవుల్లో నీటి లభ్యత లేని కారణంగా వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. దీంతో మూగజీవులు ప్రమాదాల బారిన పడడంతోపాటు వేటగాళ్లు, ఆకతాయిల చేతిలో బలవుతున్నాయి. తాజాగా నీటిని పెద్దఎత్తున సంరక్షించడం ద్వారా అటువంటి విఘాతాలకు అడ్డుకట్ట వేయవచ్చని సర్కారు భావిస్తోంది. అటవీ భూముల్లో వివిధ పనులను ఉపాధి పథకం ద్వారా చేపట్టడం ద్వారా కూలీలకు పని లభించడంతోపాటు.. అడవులకు వైభవం రానుంది. చేపట్టే పనులివే... అటవీ భూముల్లో నీటి సంరక్షణకు పెద్దపీట వేయనున్నారు. ఇందులో భాగంగా వాననీటిని ఒడిసి పట్టేందుకు నీటి కుంటలు, ఇంకుడు గుంతలు తవ్వనున్నారు. అలాగే ఏటావాలుగా ఉన్న ప్రాంతాల్లో భూమికి సమాంతరంగా కండిత కందకాలు తీయనున్నారు. పైనుంచి కిందకు వచ్చే వర్షపు నీరు ఈ కందకాల్లో చేరి భూమిలోకి సులువుగా ఇంకిపోతుంది. అలాగే భూముల రక్షణకూ ఉపక్రమించనున్నారు. అటవీ భూముల సరిహద్దు చుట్టూ వెడల్పాటి కందకాలు ఏర్పాటు చేస్తారు. తద్వారా బయటి నుంచి పశువులు, మనుషులు అటవీ భూముల్లోకి ప్రవేశించడానికి వీలుండదు. ఫలితంగా అటవీ వృక్షాలకు ఎటువంటి ముప్పు వాటిల్లదు. వేసవి వచ్చిందంటే అడవులకు నిప్పంటుకోవడం సహజంగా మారింది. మానవ తప్పిదం, యాధృచ్ఛికంగా జరుగుతున్న ఈ ప్రమాదాల వల్ల వృక్షాలు కాలి బూడిదవుతుండడంతో హరితం కనుమరుగవుతోంది. ఈ నష్టాన్ని నివారించడానికి చాలా ఏళ్లు పట్టక తప్పదు. ఈ క్రమంలో యంత్రాంగం అగ్ని ప్రమాదాలను సాధ్యమైనంత మేరకు నివారించడంపై దృష్టి సారించింది. అటవీ విస్తీర్ణాన్ని బట్టి ఒకవైపు నుంచి మరోవైపునకు నిర్ణీత వెడల్పులో నేలపై పూర్తిగా మొక్కలు లేకుండా పనులు చేపడతారు. అంటే మట్టి రోడ్డు మాదిరిలా ఆ ప్రాంతాన్ని తయారు చేస్తారు. ఈ విధానాన్ని అవలంభించడం వల్ల మంటల వ్యాప్తి కొంత ప్రాంతానికే పరిమితమై నష్ట తీవ్రత తగ్గుతుంది. త్వరలో పనుల గుర్తింపు.. అటవీ భూముల్లో నీటి సంరక్షణ, మొక్కల పెంపకం వంటి పనులు చేపట్టడానికి ఆ శాఖకు పెద్దగా నిధుల కేటాయింపు లేదు. అలాగే మానవ వనరులూ తక్కువే. దీంతో భూముల పరిరక్షణ కష్టంగా మారింది. ఇప్పటికే గ్రామాల్లో ఉపాధి కింద ఆ పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ శాఖకు చెందిన భూముల్లోనూ గుర్తించిన పనులను చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖను కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అటవీ భూముల్లో ఉపాధి కింద పనులు చేసేందుకు మార్గం సుగమం అయిందని అధికారులు వివరిస్తున్నారు. అటవీ భూముల్లో ఏయే ప్రాంతాల్లో ఏయే రకం పనులు చేపట్టాలన్న అంశంపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు అటవీ శాఖకు తాజాగా లేఖ రాశారు. వీలైనంత త్వరలో పనులు గుర్తించాలని కోరారు. ఈ పనులను పూర్తిగా ఉపాధి హామీ కూలీలే చేయనున్నారు. పనుల అంచనాలు రూపొందించడంతోపాటు కూలీలకు వేతనాలు అందజేయడం గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యత. పనుల పర్యవేక్షణ మాత్రం అటవీ శాఖ అధికారులదే. పచ్చదనం 9.75 శాతమే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విస్తీర్ణం 7,493 చదరపు కిలోమీటర్లు. నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం ఇందులో 33శాతం హరితం పరుచుకోవాలి. కానీ జిల్లాలో అతి భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో పచ్చదనం కేవలం 9.75 శాతానికే పరిమితమైనట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా సమతుల్యత లోపించడం కారణంగానే పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని, వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని నిపుణులు వివరిస్తున్నారు. భవిష్యత్ ఇవే పరిస్థితులు కొనసాగితే మానవ మనుగడకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఉపద్రవం ముంచుకరాకముందే యంత్రాంగం మేల్కొంటోంది. ఉపాధి పథకంలో భాగంగా అటవీ భూముల్లో విస్తృతంగా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు.