స్పందనలో భాగంగా మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఏప్రిల్, మే, జూన్ మొదటి వారం వరకు ఉపాధి పనులు ముమ్మరంగా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇదే వేగంతో పనులు ముమ్మరంగా చేపట్టాలి. ఉపాధి హామీ పథకాన్ని కలెక్టర్లు ఓన్ చేసుకోవాలి. నాలుగైదు రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా సమీక్షించాలి. జాయింట్ కలెక్టర్లు కూడా ఈ పథకంపై దృష్టి పెట్టాలి.
కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఆవశ్యకత ఎంతో ఉంది. ఆగస్టు 15న వీటిని ప్రారంభించాలనుకుంటున్నాం. అందుకే వీలైనంత త్వరగా యుద్ధ ప్రాతిపదికన వీటి నిర్మాణ పనులు పూర్తి చేయాలి. గ్రామ స్థాయిలో ఆరోగ్య శ్రీ రిఫరెల్ పాయింట్‌గా విలేజ్ క్లినిక్స్ ఉంటాయి.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులను రికార్డు స్థాయిలో చేపట్టడం ద్వారా కోవిడ్ కష్ట కాలంలో రూ.5,818 కోట్లు నేరుగా కూలీలకు ఇవ్వగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తద్వారా కూలీలకు 25.42 కోట్ల పని దినాలను కల్పించి ఆదుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని.. చిన్న రాష్ట్రమైనా, దేశంలో మనం మూడో స్థానంలో ఉండడం గర్వకారణమని అన్నారు. ఇందుకు అందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు. స్పందనలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు పథకాలు, కార్యక్రమాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో రెండు, మూడు జిల్లాలు ఇంకా మెరుగు పడాల్సి ఉందని, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆర్బీకేల భవనాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆలోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని చెప్పారు. ఖరీఫ్ ప్రారంభం సందర్భంగా ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల (బీఎంసీలు) నిర్మాణాలు ఆగస్టు 31 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, సెప్టెంబర్‌లో వీటిని ప్రారంభించబోతున్నామని తెలిపారు. 9,899 చోట్ల బీఎంసీలను ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందులో 3,841 చోట్ల పనులు మొదలయ్యాయని, మిగిలిన చోట్ల కూడా వెంటనే పనులు మొదలు పెట్టాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
మే నాటికి గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి
► గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు తదితర భవన నిర్మాణాలు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతోంది కాబట్టి, ఈ భవనాల నిర్మాణంపై పూర్తిగా దృష్టి పెట్టాలి.
► గ్రామ సచివాలయాల నిర్మాణంలో కొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఆ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మే నాటికల్లా గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలి.
25 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
► రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందు కోసం 15 ఎకరాల భూమిని గుర్తించాలి. అక్కడ యూనిట్ ఏర్పాటు చేయాలి.
► ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం, ఇతరత్రా పంటలను ప్రాసెస్ చేయడానికి ఈ యూనిట్లు ఉపయోగపడతాయి. రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ కోసం గత సంవత్సరం రూ.4,300 కోట్లు ఖర్చు చేశాం.
90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వాలి
► ఇప్పటి దాకా 94 శాతం ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయ్యింది. మిగిలిన 1,69,558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయడంపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. టిడ్కోలో సుమారు 47 వేల ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలి.
► ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా వారికి ఇంటి పట్టా ఇవ్వాల్సిందే.
► పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లను వెంటనే వెరిఫికేషన్ చేసి, పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి. కొత్తగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి అవసరమైన చోట వెంటనే భూమిని సేకరించాలి.
► ఇళ్ల పట్టాల దరఖాస్తులను తిరస్కరించేటప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నామో కారణం చెప్పగలగాలి. ఒకవేళ దరఖాస్తు తిరస్కరించిన తర్వాత కూడా, తగిన కారణాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి దరఖాస్తులను మళ్లీ రీ వెరిఫికేషన్ చేయాలి.
► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాల కొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ ఆర్ అనురాధ, పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, సివిల్ సప్లైస్ కమిషనర్ కోన శశిధర్, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లిఖార్జున, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు
► ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కింద తొలి విడతలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. 8,682 కాలనీల్లో ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది. ఆలోగా బోరు, కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
► ఇళ్ల నిర్మాణానికి సన్నాహకంగా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, ఏపీ హౌసింగ్ వెబ్‌సైట్‌లో లబ్ధిదారుని రిజిస్ట్రేషన్, ఉపాధి హామీ కింద జాబ్ కార్డుల జారీ.. ఈ పనులన్నీ ఏప్రిల్ 10 లోగా పూర్తి చేయాలి.
► గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి జిల్లా, డివిజన్ స్థాయి అధికారులను ప్రతి మండలానికీ, ప్రతి మునిసిపాలిటీకి నోడల్ అధికారులుగా నియమించాలి. ప్రతి లే అవుట్‌లో కచ్చితంగా ఒక మోడల్ హౌస్‌ను నిర్మించాలి.
► దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో వస్తున్న ఇబ్బందులు, నిర్మాణ ఖర్చు ఎంత అవుతుంది అన్న దానిపై అవగాహన వస్తుంది. కట్టిన ఇల్లు ఎలా ఉందో లబ్ధిదారులకు తెలుస్తుంది. ఏప్రిల్ 15 నాటికి మోడల్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్ల సేవలను ఇళ్ల నిర్మాణంలో వినియోగించుకోవాలి.
► లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం సిమెంట్, స్టీల్, ఇసుక, మెటల్, ఇటుకలు అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలి. నిర్మాణ సామగ్రిలో కచ్చితంగా నాణ్యత ఉండాలి. ఒకవైపు ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగానే.. మరో వైపు కాలనీలో చేపట్టాల్సిన రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు... ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనపై కార్యాచరణ రూపొందించాలి.
Comments
Please login to add a commentAdd a comment