మారీచులపై నిరుపేదల విజయమిది | Distribution of house sites in Amaravati is victory to poor says Cm Jagan | Sakshi
Sakshi News home page

మారీచులపై నిరుపేదల విజయమిది

Published Sat, May 27 2023 3:57 AM | Last Updated on Sat, May 27 2023 11:10 AM

Distribution of house sites in Amaravati is victory to poor says Cm Jagan - Sakshi

మంగళగిరి, తాడికొండ నియోజక వర్గాల పరిధిలో 1,402 ఎకరాల్లో 25  లే అవుట్లలో 50,793 మంది నా పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు అందజేసే కార్యక్రమం వారం పాటు పండుగ వాతావరణంలో కొనసాగుతుంది.  ప్రతి అక్కచెల్లెమ్మను లే అవుట్‌ వద్దకు తీసుకెళ్లి, అక్కడే ఇంటి పత్రాలు అంద జేస్తారు. ఆ స్థలంలో ఫొటో తీసుకుని, జియో ట్యాగింగ్‌ కూడా పూర్తయ్యాక ఇళ్లు  కట్టించే కార్యక్రమానికి బీజం పడుతుంది. –ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడైనా సరే పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కావాలని ధర్నాలు చేసే వారిని చూశా­మని.. రాష్ట్రంలో మాత్రం పేదలకు వాటిని ఇవ్వొ­ద్దని ధర్నాలు చేస్తున్న చంద్రబాబు ముఠాను చూస్తున్నా­మని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తోంటే తట్టుకోలేక గజ దొంగల ముఠా అడ్డు పడుతోందని చెప్పారు.

ఈ మారీచులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సుప్రీంకోర్టు వరకు వెళ్లి.. న్యాయ పోరాటం చేసిమరీ పేదలకు ఇళ్ల పట్టాలిస్తున్న చారిత్రక ఘట్టాన్ని అమరావతిలో చూస్తు­న్నా­మని తెలిపారు. ఇది మారీచులపై నిరుపేదల విజయమని, దేశ చరిత్రలోనే ఇది సువర్ణాధ్యాయమని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది నిరుపేద అక్కచెల్లెమ్మలకు సీఆర్డీఏ పరిధిలో కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. దీంతోపాటు ఇక్కడ నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్ల పత్రాలను సైతం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ పరిధిలోని వెంకటపాలెం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి పోరాటాలు వందలు, వేలు చూశామన్నారు.

పేదలకు మేలు జరుగుతుంటే మారీచు, సుభాహులు అడ్డు పడుతున్నారని, వారెన్ని కుయుక్తులు పన్నినా తన పయనం ధర్మం వైపే ఉంటుందని, ప్రభుత్వం నిరుపేదల పక్షానే పని చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడు పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్లు మంజూరు చేసి.. జూలై 8.. నాన్నగారి (దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి) జయంతి రోజున ఇళ్ల నిర్మాణాలు మొదలు పెడతామని చెప్పారు.

ఇప్పటికే ల్యాండ్‌ లెవలింగ్‌ పూర్తి చేసి, ప్లాట్లలో సరిహద్దు రాళ్లు కూడా ఏర్పాటు చేశారని, దాదాపు 232 కి.మీ మేర అంతర్గత గ్రావెల్‌ రోడ్ల నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 

ఈ ఇళ్ల పట్టాలు.. సామాజిక న్యాయ పత్రాలు
ఇక్కడ ఈ రోజు జరుగుతున్న సభకు, ఈ సందర్భానికి మన రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలన్న ప్రభుత్వ తాపత్రయం ఒకవైపు.. దాన్ని అడ్డుకునేందుకు మారీచులు, రాక్షసులు ఏకంగా సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి ఇవ్వకూడదని అడ్డుపడుతున్న పరిస్థితులు ఇంకోవైపు.. బహుశా ఇటువంటి ఘటన ఎక్కడా జరిగి ఉండదు. 

ఈ రోజు 50,793 మంది అక్కచెల్లెమ్మలకు వారి పేరు మీద ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్న గొప్ప సందర్భం. నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూసే ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి రుణపడి ఉంటాను. 

మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, మంత్రి సురేష్‌ను.. ఈ ప్రాంతంలో గజం రేటు ఎంతుంటుందని అడిగాను. ఈ మధ్య కాలంలో జరిగిన వేలంలో గజం రూ.17 వేలకు అమ్ముడుపోయిందని.. కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో గజం ధర ఉంటుందన్నారు. అంటే రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం నా పేద అక్కచెల్లెమ్మల పేర్లమీద రిజిస్ట్రేషన్‌ జరగబోతుంది. పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల పత్రాలు వారికిస్తున్న హక్కులు కావు.. వారికిస్తున్న సామాజిక న్యాయ పత్రాలు కూడా. ఇకపై ఇదే అమరావతి ఇకపై సామాజిక అమరావతి అవుతుంది. మనందరి అమరావతి అవుతుంది. 

అక్కచెల్లెమ్మల చేతిలో రూ.3 లక్షల కోట్లు 
♦ అక్కచెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణంపై మూడు ఆప్షన్లు ఇస్తాం. మొదటి ఆప్షన్‌లో సొంతంగా తామే కట్టుకుంటామంటే అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో రూ.1.80 లక్షలు వేస్తాం. రెండో ఆప్షన్‌గా వారి ఇంటి నిర్మాణానికి కావాల్సిన సిమెంటు, ఇసుక, స్టీల్‌ లాంటి నిర్మాణ సామగ్రి అందిస్తాం. నిర్మాణ కూలి మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తాం. ఇవన్నీ మేం చేసుకోలేం అన్న వాళ్లకు మూడో ఆప్షన్‌గా ప్రభుత్వమే ఆ ఇళ్లను నిర్మించి ఇస్తుంది. ఇందులో అక్క చెల్లెమ్మలు ఏ ఆప్షన్‌ తీసుకున్నా పర్వాలేదు.

♦  ఇప్పటికే రాష్ట్రంలో అన్ని చోట్ల చేస్తున్నట్టే.. ఈ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందిస్తాం. సిమెంటు, స్టీల్, డోర్‌ ఫ్రేములు అన్నీ మార్కెట్‌ రేట్ల కంటే తక్కువకే ప్రభుత్వం అందిస్తుంది. నాణ్యత విషయలో రాజీ పడేది లేదు. దీంతో పాటు రూ.35 వేలు చొప్పున పావలా వడ్డీకే లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తున్నాం. దీనివల్ల ఇళ్లు కట్టే కార్యక్రమం వేగవంతం అవుతుంది. 

♦  మన ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు ఇచ్చాం. వీరిలో 21 లక్షల మందికి ఇళ్లు కూడా మంజూరు చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మకు చెపుతున్నా.. 30.75 లక్షల ఇంటి స్థలాల్లో దాదాపు రూ.2.50 లక్షల కోట్లు విలువ చేసే ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇల్లు పూర్తయిన తర్వాత ఇంటి విలువ.. ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. 

ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు.. మీ అన్నగా, మీ బిడ్డగా అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నా. గత ప్రభుత్వంలో పాలకులు ఇలాంటి ఆలోచన చేసే సాహసమైనా చేశారా? గతానికీ, ఇప్పటికీ మధ్య ఎంత తేడా ఉందో గమనించండి. 

సీఆర్డీయే పరిధిలో 5,024 మందికి టిడ్కో ఇళ్లు
ఈ 50,793 ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు సీఆర్డీఏ పరిధిలో 8 చోట్ల జగనన్న కాలనీల్లో పీఎంఏవై కింద జీ ప్లస్‌ 3 విధానంలో నిర్మించిన 5,024 మందికి టిడ్కో ఇళ్లను కూడా అందిస్తున్నాం. వారం రోజుల్లో వారితో కూడా గృహ ప్రవేశాలు చేయించి, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు అందిస్తాం. టిడ్కో ఇళ్ల నిర్మాణం విలువ రూ.443 కోట్లు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఫ్లాట్‌పై రూ.1.50 లక్షలు చొప్పున సబ్సిడీగా రూ.75 కోట్లు ఇస్తే.. మనసున్న ప్రభుత్వంగా, పేదల ప్రభుత్వంగా, మన బాధ్యతగా ఈ 5024 ప్లాట్ల మీద మన ప్రభుత్వం మరో రూ.251 కోట్లు ఖర్చు చేసింది. 

టిడ్కో ఇళ్ల ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన మాటలు వస్తుంటాయి. అయ్యా మీరు టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తే వాటిని పేదలకు ఇవ్వడానికి జగన్‌కు నాలుగేళ్లు ఎందుకు పడుతుంది? అని చంద్రబాబునాయుడుని అడుగుతున్నాను. 300 చదరపు అడుగుల ఫ్లాట్‌ కట్టడానికి అయ్యే విలువ అడుగుకి రూ.2 వేలు వేసుకుంటే.. దాదాపు రూ.5.75 లక్షలు అవుతుంది. మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష అవుతుంది. 

♦ అంటే రూ.6.65 లక్షలు ఖర్చయ్యే ప్లాట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1.50 లక్షల చొప్పున రూ.3 లక్షలు సబ్సిడీ ఇస్తే మిగిలిన రూ.3 లక్షల డబ్బును బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని 20 ఏళ్లపాటు ఆ పేదవాడు ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున కట్టాలి. 20 ఏళ్లలో పేదవాడి మీద పడే అప్పు వడ్డీతో తడిసి మోపెడై మొత్తం రూ.7.20 లక్షలు చెల్లించాలి. మరి ఇది పేదవాడికి ఇచ్చినట్టేనా? కానీ మీ బిడ్డ ఈ ఫ్లాట్‌ను అక్కచెల్లెమల పేరుపై రూ.1కే రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్నాడు. అయితే చంద్రబాబు, వారి గజ దొంగల ముఠా, ఎల్లో మీడియా వక్రభాష్యాలు చెబుతూనే ఉంది. 

మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ 
రెండేళ్లు కోవిడ్‌ కష్టాలు రాష్ట్రాన్ని వెంటాడినా, రాష్ట్రానికి వచ్చే వనరులు తగ్గినా మాకున్న కష్టం కన్నా మీ కష్టమే ఎక్కువ అని భావించి మీ బిడ్డ పరుగెత్తాడు. కోవిడ్‌ సమయంలో కూడా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా రైతులకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, పిల్లలకు, సామాజిక వర్గాలకు నవరత్నాల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాం. 

మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించాం. మేనిఫెస్టోలో 98 శాతం వాగ్దానాలను అమలు చేశాం. ఇళ్ల స్థలాల పంపిణీలో మరో రెండడుగులు ముందుకు వేసి ఇళ్ల నిర్మాణాలను దశల వారీగా చేపడుతూ పరిగెత్తిస్తున్నాం.

ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి, లంచం, వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రూ.2.11 లక్షల కోట్లు జమ చేశాం. మీ బిడ్డ బటన్‌ నొక్కగానే ఆ డబ్బులు వారి ఖాతాల్లో జమ అయింది.  ఒక్కో ఇంటి స్థలం రూ.2.50 లక్షలు చొప్పున 30 లక్షల ఇళ్ల విలువ రూ.75 వేల కోట్లు అవుతుంది. మిగిలిన గోరుముద్ద, సంపూర్ణ పోషణ వంటివి కలిపి అక్షరాలా రూ.3 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు చేర్చాం. 

మంచి జరుగుతుంటే తట్టుకోలేక..
ఇంత మంచి జరుగుతుంటే తట్టుకోలేని దుష్టచతుష్టయం, గజదొంగల ముఠా.. అంటే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వీరందరికీ తోడు దత్తపుత్రుడు కలిసి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం చూశాం. అప్పుడూ.. ఇప్పుడూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌. అప్పులు కూడా అప్పటి కన్నా ఇప్పుడే తక్కువ. అప్పుల పెరుగుదల కూడా ఇప్పుడే తక్కువ. 

లంచాలు, వివక్ష లేకుండా మరి ఇన్ని లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇప్పుడు ఎలా వెళ్లింది? చంద్రబాబు హయాంలో అలా ఎందుకు జరగలేదని ఆలోచించండి. వారికి మంచి చేసే ఉద్దేశం లేదు. వారి తపన, తాపత్రయం అంతా దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి అధికారంలోకి రావడం మాత్రమే. వారి దారుణాలను ఎవరూ రాయరు, చూపరు. ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు. ఇదీ చంద్రబాబు హయాంలో మాయ. 

♦  చంద్రబాబు తన పాలనలో 2014–2019 మధ్య ఏ ఒక్క పేదవాడికీ సెంటు భూమి, కనీసం ఒక ఇంటి పట్టా ఇచ్చిన పాపానపోలేదు. ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల్లో 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి.. రైతులను, అక్కచెల్లెమ్మలను, నిరుద్యోగులతో సహా అందర్నీ మోసం చేశాడు. ఎన్నికలు సమీపిస్తుంటే కొత్త మోసాలతో ముందుకొస్తారు జాగ్రత్త.

రాష్ట్రంలో క్లాస్‌ వార్‌  
♦ ఇప్పుడు రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం జరగడంలేదు. ఇక్కడ జరుగుతోంది క్లాస్‌ వార్‌. ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపు పేదవాళ్లకు మంచి జరగకూడదన్న పెత్తందార్లు ఏకమై యుద్ధం చేస్తున్నారు. పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి అడ్డుకుంటున్నారు. 

♦  ఈ అమరావతిలో పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. కోర్టులకు వెళ్లి సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని వాదించారు. అంటే పేదవాడు ఇక్కడికి వచ్చి ఉంటే పెత్తందార్లు జీర్ణించుకోలేక హైకోర్టులో కేసులు వేశారు. అక్కడ ఓడిపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అక్కడా ఓడిపోయినా ఇప్పటికీ ఈ పెద్దమనిషి చంద్రబాబు ఏదో ఒక రూపేణా అడ్డుకుంటూనే ఉన్నారు.

పేదవాడు చదవాలి, ఎదగాలి అని మనం తాపత్రయపడుతుంటే గవర్నమెంటు బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం ఉండడానికే వీల్లేదని అడ్డుకుంటున్నారు. మనం వేసే ప్రతి మంచి అడుగులోనూ పేదవాడికి అన్యాయం చేస్తున్నారు. కానీ మీ జగన్‌ మాత్రం మీ వెంటే ఉన్నాడు. అమ్మఒడి, ఆసరా, చేయూతతో నా అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడగలుగుతున్నారు. వాళ్ల పిల్లలను గొప్పగా చదివించగలుగుతున్నారు.  

♦ జగన్‌ మాదిరిగా పాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాస్తారు. వాళ్ల టీవీల్లో డిబేట్లు పెడతారు. రాబోయో రోజుల్లో పేదలకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. 

మీరు ఎంచుకున్న ఆప్షన్‌ ప్రకారం.. జూలై 8న ఇళ్లు కట్టించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ 50 వేల మంది అక్కచెల్లెమ్మలకు, 25 కాలనీల్లో ప్రతి కాలనీలోనూ అంగన్‌వాడీ, ప్రైమరీ స్కూల్, విలేజ్‌ క్లినిక్, డిజిటల్‌ లైబ్రరీ, పార్కులు కూడా వస్తాయి. ఇక్కడే నవులూరిలో లేక్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. 
  
ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ పెద్దమనిషి చంద్రబాబు మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటూ మోసపూరిత ప్రేమ చూపిస్తాడు. సామాజిక వర్గాల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో అని అంటాడు. మోసం చేసేవాడిని ఎప్పుడూ నమ్మకండి. నరకాసురుడినైనా నమ్మొచ్చేమో గాని, నారా చంద్రబాబునాయుడిని మాత్రం నమ్మొద్దు.   – సీఎం వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement