గుంటూరు జిల్లా వెంకటాయపాలెంలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల లే అవుట్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఒకటీ రెండూ కాదు.. వందా ఐదు వందలూ అసలే కాదు.. అక్షరాలా 51,392 నిరుపేదల కుటుంబాలు.. ప్రభుత్వం చొరవతో సొంతింటికి హక్కుదారులు అవుతున్నాయి. శుక్రవారం ఉదయం తుళ్లూరు మండలం వెంకటాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ ప్రాంతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా సీఎం వైఎస్ జగన్ లబ్ధిదారులకు అందజేయనున్నారు.
సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం.. నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లో ‘నవరత్నాలు – పేదలంరికీ ఇళ్లు’ పథకంలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన లబ్ధిదారుకులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం 1402.58 ఎకరాల్లో ఒకొక్కరికి సెంటు చొప్పున 25 లేఅవుట్లలో 51,392 కుటుంబాలకు ప్లాట్లు సిద్ధం చేసింది. అయితే, అమరావతి ప్రాంతం పెద్దలదని, అక్కడ పేదలకు చోటులేదని ప్రతిపక్ష టీడీపీ నాయకులు, మరికొందరు రైతుల ముసుగులో అనేక అడ్డంకులు సృష్టించారు. కోర్టులకు కూడా వెళ్లారు.
దేశంలోనే అతి ఖరీదైన న్యాయవాదులను పెట్టుకుని వ్యాజ్యాలు వేశారు. సీఆర్డీఏ ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుందని చెప్పి కోర్టులను అడ్డుపెట్టుకుని చోటు లేకుండా చేయాలకున్నారు. ఎల్లో మీడియా ఎంత రాద్ధాంతం చేసినా ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని కోర్టులు కూడా సమర్ధించాయి. దీంతో ఉద్యమం పేరుతో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం వీటన్నింటినీ అధిగమించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసింది.
1,402.58 ఎకరాల్లో 51,392 ప్లాట్లు
సీఆర్డీఏ ప్రాంతంలో నిరుపేదలకు ఇస్తున్న 1402.58 ఎకరాల్లో ఎన్టీఆర్ జిల్లాకు కేటాయించిన 751.93 ఎకరాల్లో 14 లేఅవుట్లను వేసి 27,532 మందికి ప్లాట్లు కేటాయించారు. గుంటూరు జిల్లాకు కేటాయించిన 650.65 ఎకరాల్లో 11 లేఅవుట్లలో 23,860 ప్లాట్లు వేశారు. ఈ లేఅవుట్లలో 67,700 హద్దు రాళ్లు వేసి ప్లాట్లకు పొజిషన్ ఇచ్చారు. ఇళ్ల స్థలాల మార్కింగ్, నంబరింగ్ పూర్తి చేశారు. 76.28 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లు నిర్మించారు. నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు.
తక్కువ సమయంలోనే పూర్తి
సీఆర్డీఏ పరిధిలో 1402.58 ఎకరాల్లో 51,392 ప్లాట్లు సిద్ధం చేశాం. అన్ని ప్లాట్లకు నంబర్లు కేటాయించి మార్కింగ్ కూడా పూర్తిచేశాం. శుక్రవారం ఉదయం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తారు. అందుకోసం వెంకటాయపాలెంలో వేదికను సిద్ధం చేస్తున్నాం. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో తక్కువ సమయంలోనే అన్ని పనులు పూర్తి చేశాం. ఇక్కడి నుంచే టిడ్కో లబిద్ధదారులకు కూడా రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేస్తాం. – వివేక్ యాదవ్, ఏపీసీఆర్డీఏ కమిషనర్
పేదలకు పట్టాలివ్వకుండా ఎన్నెన్నో కుట్రలు
సీఆర్డీయే పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలివ్వకుండా తెలుగుదేశం పార్టీ, కొందరు వ్యక్తులు రైతుల ముసుగులో అనేక కుట్రలు పన్నారు. రైతుల పేరుతో ఆ ప్రాంతంలో నిరసనలకు దిగారు. జగనన్న లేఅవుట్లలో పనులు జరగకుండా అడ్డుకొన్నారు. కొందరు పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించారు. పోలీసులపైనా దాడులకు దిగారు. కొందరు హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. కోర్టుల్లోనూ సమర్ధంగా వాదనలు వినిపించింది.
కోర్టులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించడంతో ఇప్పుడు సీఆర్డీఏ ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత పేదలకు ఇళ్ళ స్థలాలే వద్దన్న బాబు అండ్ కో సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆర్ 5 జోన్‌లో కాకుండా ఆర్–3 జోన్లో ఇస్తే ఇబ్బంది లేదని, సెంటు కాకుండా ఐదు సెంట్లు ఇవ్వాలంటూ మరో రాగం అందుకున్నారు. సెంటు భూమి సమాధులు కట్టుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రాదంటూ చంద్రబాబు పేదలను అవహేళన చేసేలా మాట్లాడారు.
తాజాగా దళిత జేఏసీ పేరుతో జడ శ్రావణ్‌కుమార్ తదితరులు తుళ్లూరులో 144 సెక్షన్ అమల్లో ఉన్నా లెక్కచేయకుండా బుధవారం అక్కడ అశాంతిని సృష్టించే ప్రయత్నం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకొనేందుకు దీక్ష పేరుతో ఆయన తుళ్లూరు దీక్షా శిబిరానికి దొడ్డిదారిలో చేరుకున్నారు. వెంటనే పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి, విజయవాడకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment