చీరాల: వారంతా శ్రీలంకలో బతకలేక.. ప్రాణాలకు తెగించి సముద్ర మార్గంలో తమిళనాడుకు వలస వచ్చారు. జీవనోపాధి కోసం వచ్చిన కాందిశీకులకు వసతులు, ఉపాధి కష్టంగా మారింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీలంక కాందిశీకులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టింది. అప్పట్లో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి కాందిశీకులకు ఉపాధి కల్పించింది.
కాగా.. 1980లో చీరాల ప్రాంతంలోని వేటపాలెం మండలం దేశాయిపేట వద్ద కేంద్ర ప్రభుత్వం నూలు మిల్లు ఏర్పాటు చేసింది. ఆ మిల్లులో పనుల కోసం దాదాపు 200 శ్రీలంక కాందిశీక కుటుంబాలను చీరాల తరలించారు. నూలు మిల్లు పక్కనే 10 ఎకరాలు స్థలాన్ని కేటాయించి కాందిశీకులకు కాలనీ కట్టించి ఇళ్లు కేటాయించారు.
ఆ కాలనీలో కాందిశీకులు నివాసం ఉంటూ నూలుమిల్లులో పనులు చేసుకుంటూ జీవించేవారు. నూలు మిల్లులు నష్టాల పాలవడంతో వాటన్నింటినీ మూసివేశారు. 2000 సంవత్సరంలో చీరాల నూలు మిల్లు కూడా మూతపడింది. అప్పటినుంచి కాందిశీకులు ఈ ప్రాంతంలోనే ఉంటూ వివిధ పనులు చేసుకుంటున్నారు.
కాందిశీకుల కల నెరవేర్చిన జగన్
దేశాయిపేటలో నిర్మించిన సిలోన్ కాలనీలో ఇళ్లలో నివాసం ఉంటున్న కాందిశీకులకు ఆ ఇళ్లపై ఎటువంటి హక్కు లేకుండా పోయింది. దీంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సిలోన్ కాలనీలో నివాసం ఉంటున్న కాందిశీకులందరికీ ఇంటి పట్టాలు అందజేశారు. దీంతో వారికి ఆ ఇళ్లపై సంపూర్ణ హక్కు లభించింది. దీంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పట్టాలు ఇవ్వడం ఆనందంగా ఉంది
శ్రీలంక నుంచి చీరాల వచ్చి స్థిరపడిన కాందిశీకులకు 42 ఏళ్ల తరువాత సొంత గూడు ఏర్పాటుకు పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. సిలోన్ కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించాం. కాలనీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా. – కరణం బలరాం ఎమ్మెల్యే, చీరాల
ఇళ్ల పట్టాలు ఇచ్చారు
43 ఏళ్ల కిందట ఈ ప్రాంతానికి వలస వచ్చాం. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సిలోన్ కాలనీలో ఉంటున్నాం. ఆ ఇళ్లపై మాకు పూర్తి హక్కులు లేకుండా పోయాయి. ఈ ప్రభుత్వం వాటికి పట్టాలు మంజూరు చేసింది. – ఎం.శివనాడియన్, సిలోన్ కాలనీ
అన్ని సౌకర్యాలు ఉన్నాయి సిలోన్ కాలనీలో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నూలుమిల్లు మూసివేసిన తరువాత ఈ ప్రాంతంలోనే వివిధ పనులు చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిపోయాం. కాలనీలో ప్రస్తుతం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. – ఎం.సత్యవేలు, సిలోన్ కాలనీ
Comments
Please login to add a commentAdd a comment