ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేయడం... చేసిన పనులు సగర్వంగా చెప్పుకోవడం... తద్వారా ఎన్నికల సమయంలో ఓట్లడగటం నిజమైన నాయకుడి లక్షణం. అదే దొంగ ఓట్లను నమ్ముకోవడం... అధికారంకోసం అడ్డదారులు ఎంచుకోవడం... అందుకోసం కుట్రలు, కుతంత్రాలకు తెరతీయడం... ఎంతటి అక్రమానికైనా వెరవకపోవడం కుటిల నీతికి నిదర్శనం.
రెండో కేటగిరీకి చెందినవారే మన పచ్చనేతలు. విజయమే పరమావధిగా దొంగ ఓట్లను ఇష్టానుసారంగా చేరి్పంచేసి వారిద్వారా గెలవడం అలవాటు చేసుకున్నారు. ఇందుకు పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాలే సాక్ష్యం. అక్కడ అధికారుల తనిఖీల్లో వేలాది దొంగఓట్లు బహిర్గతమయ్యాయి. వాటి ద్వారానే గతంలో వారు విజయం సాధించారని ఈ సంఘటన రుజువు చేస్తోంది.
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ దొంగ ఓట్లతోనే గత ఎన్నికల్లో గెలుపొందింది. తాజాగా బయటపడ్డ దొంగ ఓట్ల వ్యవహారం చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని అధికారపార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులకు పలుదఫాలు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు వాటి తొలగింపునకు ఫారం–7 దరఖాస్తులు పెట్టారు. జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టగా పెద్ద ఎత్తున అక్రమ ఓట్లు ఉన్నట్లు తేలింది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఓట్లున్నవారికీ ఇక్కడ ఓట్లుండటం, స్థానికంగా ఒకే నియోజకవర్గంలో రెండు చోట్ల ఓట్లు నమోదు కావడం, చని పోయినవారి ఓట్లు జాబితాలో ఉండటం బయటపడింది.
ఈ విధంగా బాపట్ల జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 46,116 దొంగ ఓట్లను అధికారులు తొలగించారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపొందిన పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు అధికంగా బయటపడ్డాయి. అక్రమ ఓట్ల వల్లే గత ఎన్నికల్లో టీడీపీ గెలుపొందినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు వాటిని తొలగించడం వల్ల రాబోయే ఎన్నికల్లో వారి విజయం ప్రశ్నార్థకంగా మారనుంది.
పర్చూరులో పదివేలకు పైగా దొంగ ఓట్లు
పర్చూరు నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలుపొందారు. 2014లో 10,775 ఓట్లు, 2019లో 1647 ఓట్ల మెజారిటీ వచ్చింది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా 1967, 1991, 2004, 2019లో మాత్రమే పదివేలకుపైబడి మెజార్టీవచ్చింది. మిగిలిన 11 ఎన్నికల్లో 7 వేలకు మించలేదు. తాజాగా అధికారులు ఈ నియోజకవర్గంలో 10,468 దొంగ ఓట్లను తొలగించారు. మరిన్ని దొంగ ఓట్లు బయటపడే అవకాశముంది. దీన్నిబట్టి పర్చూరులో టీడీపీ దొంగ ఓట్లవల్లే గెలుపొందినట్లు తెలుస్తోంది.
రేపల్లెలోనూ దొంగ ఓట్ల హవా...
రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 2014లో 13,355 ఓట్లు, 2019లో 11,555 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ జరిగిన 15 ఎన్నికల్లో 8 సార్లు 10 వేలకు మించి మెజార్టీ రాగా 7 సార్లు 10వేలలోపు మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఓట్ల విచారణ పూర్తికాక ముందే 8,880 దొంగ ఓట్లను గుర్తించారు. ఇంకా మరికొన్ని దొంగ ఓట్లు బయటపడే అవకాశముంది. దొంగ ఓట్ల తొలగింపు రాబోయే ఎన్నికల్లో పచ్చపార్టీపై ప్రభావం చూపనున్నట్టు తెలుస్తోంది.
అద్దంకిలోనూ అదే తీరు...
అద్దంకి నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్(ఐ), వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యరి్థగా పోటీచేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆయనకు 12,991 మెజార్టీ వచ్చింది. 2009, 2019 ఎన్నికల్లో మాత్రమే ఈ నియోజకవర్గంలో 10 వేలకు మించి మెజార్టీ వచ్చింది. మిగిలిన 12 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సగటున 5 వేలకు మించి మెజార్టీ రాలేదు. తాజాగా ఈ నియోజకవర్గం పరిధిలో అధికారులు 7,207 దొంగ ఓట్లను తొలగించారు. విచారణ పూర్తయితే మొత్తం 8 వేల పైచిలుకు దొంగ ఓట్లను తొలగించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment