Livelihood
-
వేధింపుల నుంచి కాపాడండి
రాయవరం: జీవనోపాధి నిమిత్తం ఖతర్ వెళ్లిన ఓ మహిళ అక్కడ తనకు జరుగుతున్న బాధలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించి, ఇండియా తీసుకువెళ్లాలని వేడుకుంది. తనను రక్షించి తన పిల్లల వద్దకు చేర్చాలని, ప్రభుత్వం తన పట్ల దయ చూపించాలని ఆ వీడియోలో కోరింది. దానికి సంబంధించిన వీడియోలో ఆ మహిళ ఆవేదన ఈ విధంగా ఉంది. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రాయవరం గ్రామానికి చెందిన సారథి దేవీ హేమలత స్థానికంగా ఫ్యాన్సీ షాపులో పనిచేసేది. కుటుంబ పోషణ నిమిత్తం భర్త మధుబాబు, ఇద్దరు ఆడ పిల్లలను వదిలి జీవనోపాధి కోసం ఖతర్ వెళ్లింది. 2023 నవంబర్‌లో ఏజెంటు ద్వారా ఖతరు వెళ్లిన ఆమె.. అక్కడ పరిస్థితులు మరోలా ఉన్నాయని ఆ వీడియోలో వెల్లడిస్తూ ఆవేదన చెందింది. భారత కరెన్సీలో రూ.25,000 జీతంతో ఇంటిలో క్లీనింగ్ పని అని చెప్పి తనను ఖతర్ పంపించారని పేర్కొంది. తీరా అక్కడకు వెళ్లిన తరువాత రాత్రి అనక, పగలనక తనతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, ఆరోగ్యం బాగుండకపోయినా తనతో పనిచేయిస్తున్నారని చెప్పింది. ఆరోగ్యం బాగుండకపోతే ఆస్పత్రికి కూడా తీసుకువెళ్లడం లేదని, కనీసం మందులు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను బతికే పరిస్థితి లేదంటూ ఆవేదనతో వెల్లడించింది. మంత్రులు నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్ తనపై దయతలచి తనను స్వదేశానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా వేడుకొంది. -
పరిహారం రాక.. ప్రాణాలు తీసుకున్నాడు!
జైపూర్: జీవనోపాధి కోసం రూ.6 లక్షలు అప్పు తెచ్చి కొనుగోలు చేసిన ట్రాక్టర్‌కు గిరాకీ లేదు.. ట్రాక్టర్ కిస్తీలు కట్టలేని పరిస్థితి. అదీగాక ఏడాది క్రితం చెల్లి పెళ్లి కోసం రూ.5 లక్షలు అప్పు తెచ్చాడు. సింగరేణి సంస్థ నుంచి పరిహారం వస్తే తన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నాడు. కానీ, రెండేళ్లుగా పరిహారం విషయం ఎటూ తేలడం లేదు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో హరీశ్ (28) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.తన చావుకు సింగరేణి యాజమాన్యం, గ్రామ పెద్దలు కారణమని సూసైడ్ నోట్ రాశాడు. అమ్మా నాన్న క్షమించండి.. అక్క, చెల్లి.. అమ్మనాన్నలను బాగా చూసుకోండి అని అందులో పేర్కొన్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట పంచాయతీ పరిధిలోని దుబ్బపల్లిలో జరిగింది. జైపూర్ ఎస్సై నాగరాజు కథనం ప్రకారం.. దుబ్బపల్లి గ్రామానికి చెందిన జాడి బొందాలు–పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు హరీశ్ సంతానం. బొదాలు కూలీనాలి చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశాడు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఏ పని చేయడం లేదు. దీంతో కుటుంబ భారం హరీశ్‌పై పడింది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వస్తుందని...దుబ్బపల్లి గ్రామాన్ని రెండేళ్ల క్రితం సింగరేణి శ్రీరాంపూర్ ఓసీపీ విస్తరణ కోసం సేకరించింది. ఇంటితోపాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.20 లక్షలు పరిహారం వస్తుందని హరీశ్ భావించాడు. కానీ, రెండేళ్లుగా సింగరేణి యాజమాన్యం పరిహారం విషయం తేల్చడం లేదు. గ్రామ పెద్దలు పరిహారం ఇప్పించే బాధ్యత తీసుకున్నా.. ఎలాంటి పురోగతి లేదు. ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Kudumbashree Mission: బడి రెక్కలతో మళ్లీ బాల్యంలోకి...
ఆ క్లాసురూమ్‌లో చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపించేంత నిశ్శబ్దం. స్కూల్ యూనిఫామ్‌లో మెరిసిపోతున్న విద్యార్థులు టీచర్ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు. పాఠం పూర్తయిన తరువాత ‘ఏమైనా డౌట్స్ ఉన్నాయా?’ అని టీచర్ అడిగితే ఒక్కొక్కరు తమ డౌట్స్‌ను అడగడం మొదలు పెట్టారు...‘ఈ దృశ్యంలో విశేషం ఏముంది... అన్ని స్కూళ్లలో కనిపించేదే కదా’ అనే డౌటు రావచ్చు. అయితే ఈ క్లాస్‌రూమ్‌లో కూర్చున్న విద్యార్థులు పిల్లలు కాదు. ముప్ఫై నుంచి డెబ్బై ఏళ్ల వయసు వరకు ఉన్న మహిళలు. ఏవో కారణాల వల్ల చదువును మధ్యలోనే మానేసిన వీరు ‘బ్యాక్–టు–స్కూల్’ ప్రోగ్రామ్‌తో మళ్లీ బడిపిల్లలయ్యారు.... దేశంలోనే పెద్దదైన స్వయం సహాయక బృందం ‘కుదుంబశ్రీ మిషన్’ చదువును మధ్యలోనే మానేసిన మహిళలను తిరిగి స్కూల్‌కు తీసుకువచ్చే విధంగా రెండు నెలల పాటు విస్తృత ప్రచారం చేసింది. మెసేజ్‌లు, పోస్టర్లు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలోనూ ప్రచారం నిర్వహించింది. వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసింది. కేరళలోని 14 జిల్లాలలోని రెండువేలకు పైగా స్కూల్స్‌లో తిరిగే స్కూల్లిల్ (బ్యాక్ టు స్కూల్) కార్యక్రమంలో భాగంగా వందలాది మంది మహిళలు వీకెండ్ క్లాస్‌లకు హాజరవుతున్నారు. ‘నా వయసు యాభై సంవత్సరాలు దాటింది. పెళ్లివల్ల పదవతరగతి పూర్తి కాకుండానే చదువు మానేయవలసి వచ్చింది. బ్యాక్ టు స్కూల్ కార్యక్రమంలో భాగంగా వీకెండ్ క్లాస్‌కు హాజరయ్యే ముందు అందరూ నవ్వుతారేమో అనిపించింది. నవ్వడానికి నేను చేస్తున్న తప్పేమిటి? అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఈ క్లాసులకు హాజరవడానికి ముందు మామూలు సెల్‌ఫోన్‌ను ఆపరేట్ చేయడం ఎలాగో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం డిజిటల్‌కు సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నాను. బ్యాంకు వ్యవహారాల్లో నేర్పు సంపాదించాను. ఒకప్పుడు ఇతరులు ఎవరైనా నాతో వస్తేనే బ్యాంకుకు వెళ్లేదాన్ని. ఇప్పుడు మాత్రం సొంతంగా బ్యాంకింగ్ వ్యవహారాలను చక్కబెడుతున్నాను. సొంతంగా వ్యాపారం మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాను. స్కూల్ ద్వారా ఎన్నో విలువైన సలహాలు తీసుకున్నాను’ అంటుంది కొట్టాయం జిల్లాకు చెందిన నీల. ‘బ్యాక్ టు స్కూల్’ వీకెండ్ క్లాస్‌లు అకడమిక్ పాఠాలకే పరిమితం కావడం లేదు. సుపరిపాలన, స్త్రీ సాధికారత, కష్టాల్లో ఉన్న వారికి కలిసికట్టుగా సహాయం చేయడం... ఇలా ఎన్నో సామాజిక, సేవా సంబంధిత చర్చలు క్లాస్‌రూమ్‌లో జరుగుతుంటాయి. ఈ చర్చలేవీ వృథా పోలేదు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ క్లాసులకు హాజరవుతున్న ఒక మహిళ భర్తకు కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చింది. ఇందుకోసం మహిళలు అందరూ కలిసి ఇందుకు అవసరమైన డబ్బును సేకరించారు. ‘తరగతులకు హాజరు కావడం ద్వారా ఆర్థిక స్వతంత్రత, డిజిటల్ అక్షరాస్యత, వ్యాపారదక్షత ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. ఎంతోమంది సొంతంగా వ్యాపారం ప్రారంభించారు’ అంటుంది శ్రీష్మ అనే ట్రైనర్. ‘యాభై దాటిన వారు స్కూల్‌కు రారేమో అనుకున్నాం. అయితే యాభై నుంచి అరవైఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉండడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. వారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అంటుంది హసీనా అనే టీచర్. స్కూల్‌కు హాజరవుతున్న వాళ్లలో భిన్నమైన సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లు, భిన్నమైన ప్రతిభాపాటవాలు ఉన్న మహిళలు ఉన్నారు. పాలక్కాడ్ జిల్లా పుదుక్కోడ్ గ్రామానికి చెందిన రాధ రెండున్నర సంవత్సరాలుగా క్యాంటీన్ నడుపుతోంది. వీకెండ్ క్లాసులకు క్రమం తప్పకుండా హాజరవుతుంది. ‘ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలిగాను అనేది ఒక సంతోషం అయితే, నేర్చుకున్న వాటి ద్వారా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడం మరో సంతోషం’ అంటుంది రాధ. ‘ఫైనాన్సియల్ ప్లానింగ్, మహిళకు కొత్త జీవనోపాధి అవకాశాలు పరిచయం చేయడం, డిజిటల్ అక్షరాస్యత, సామాజిక ఐక్యత మొదలైన అంశాలకు సంబంధించి మాడ్యుల్ తయారు చేశాం’ అంటున్నాడు కుదుంబ శ్రీ మిషన్ స్టేట్ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ నిషాద్. ‘డిజైనింగ్‌కు సంబంధించి ఎన్నో క్లాసులు తీసుకున్నాను. క్లాసుకు హాజరవుతున్న మహిళల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే వారు భవిష్యత్‌లో తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం కలుగుతుంది’ అంటుంది మనప్పదం గ్రామానికి చెందిన పుష్పలత. ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్‌ను నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది పుష్పలత. -
చిరు వ్యాపారులకు రుణాల్లో భారీగా ఏపీ ‘ముద్ర’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద చిన్న వ్యాపారులకు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైంది. స్వయం ఉపాధి కోసం ముద్ర యోజన కింద ఎటువంటి పూచీ కత్తు లేకుండా రాష్ట్రంలో గత నాలుగేళ్లలోనే 44.63 లక్షల మందికి రూ. 49,313 కోట్ల మేర రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఇందులో అత్యధికంగా మహిళలకే మంజూరయ్యాయి. ఇప్పటికే చేస్తున్న వ్యాపారాలను మరింత విస్తరించడానికి లేదా కొత్తగా వ్యాపారం చేసేందుకు ముద్ర రుణాలను మంజూరు చేశారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కోవిడ్ సమయంలో తిరిగి రాష్ట్రానికి వచ్చిన వారికి జీవనోపాధి కల్పించడానికి ముద్ర రుణాలను రాష్ట్ర ప్రభుత్వం విరివిగా ఇప్పించింది. గత మూడేళ్లుగా లక్ష్యానికి మించి చిన్న వ్యాపారాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి 135 శాతం మేర ముద్ర రుణాలను మంజూరు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.12,000 కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యం కాగా రూ.16,212 కోట్లను మంజూరు చేశారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 10,838 కోట్లు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యమైతే రూ. 11,445 కోట్లు మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని మించడం పట్ల ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మహిళల రుణాల రికవరీ బాగుందని, మహిళల రుణాల్లో నిరర్థక ఆస్తులు కూడా చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు ముద్ర యోజన ద్వారా మహిళలు స్వయం ఉపాధి రంగంలో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ముద్ర కింద మూడు రకాల రుణాలను మంజూరు చేస్తున్నారు. శిశు పథకం కింద రూ. 50 వేల వరకు, కిశోర్ పథకం కింద రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు, తరుణ్ పథకం కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తున్నాయి. టైర్ల ఫిట్ షాపుతో స్వయం ఉపాధి రాజమహేంద్రవరానికి చెందిన యోగిత సింహాచలం పీఎంఎంవై కింద పది లక్షల రూపాయల రుణం తీసుకుని పరమేశ్వర బెస్ట్ ఫిట్ టైర్ షాపు ఏర్పాటు చేశారు. తొలుత ఒక్కరితో ప్రారంభమైన ఆ షాపులో తరువాత మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం కార్లకు టైర్లు ఫిట్ చేస్తున్నామని, త్వరలోనే మరింత విస్తరించడం ద్వారా మరో పది మందికి కూడా ఉపాధి కల్పిస్తామని సింహాచలం పేర్కొన్నారు. కర్టెన్ డిజైనర్ యూనిట్ తిరుపతికి చెందిన సులోచన డిజైనింగ్‌పై ఆసక్తిని వ్యాపారంగా మార్చుకోవాలనే ఆలోచనతో కెనరా బ్యాంక్‌లో తరుణ్ పథకం కింద రుణం కోసం ధరఖాస్తు చేసుకుంది. కెనరా బ్యాంకు రూ. 7.5 లక్షల రుణం మంజూరు చేసింది. దీంతో ఆమె కర్టెన్ డిజైనర్ పేరుతో యూనిట్‌ను ప్రారంభించింది. మైక్రో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో కర్టెన్ల రూపకల్పనతో పాటు గృహోపకరణాలను తయారు చేయడం ప్రారంభించింది. మరో ఐదుగురికి ఉపాధి కూడా కల్పించారు. -
సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో సమాచారం
సాక్షి, అమరావతి: మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో మత్స్య సంపదను వేటాడే వేళ గంగపుత్రులు ఆపదలో చిక్కుకుంటే.. రక్షించేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఇస్రో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెల్ సిగ్నల్ అందకపోయినా.. రక్షణ పరిధిలోకి తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్ మైళ్ల వరకు రాష్ట్ర పరిధిలో ఉండగా.. 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు దేశీయ జలాలు. 200 నాటికల్ మైళ్ల దూరం దాటితే అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లు తీరం నుంచి 4 నాటికల్ మైళ్ల వరకు వెళ్తుంటాయి. మోటరైజ్డ్ బోట్లు 12 నాటికల్ మైళ్ల వరకు, మెకనైజ్డ్ బోట్లు 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు వెళ్లి వేట సాగిస్తుంటాయి. రాష్ట్రంలో 1,610 మెకనైజ్డ్, 22 వేల మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 1.60 లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఇప్పటివరకు వేట సాగించే మత్స్యకారులకు ఇన్కాయిస్ సంస్థ శాటిలైట్ ద్వారా సముద్రంలో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రదేశాలను (పీఎఫ్జెడ్–పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్) గుర్తించి బోట్లలో అమర్చే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏఐఎస్), మత్స్య శాఖ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్స్ ద్వారా 12 నాటికల్ మైళ్ల పైబడి దూరం వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు సమాచారం అందిస్తున్నాయి. ఈ సమాచారం సంప్రదాయ, మోటరైజ్డ్ బోట్లకు అందించే అవకాశం లేదు. పైగా ఇది 2–3 రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది. మరో వైపు ఏదైనా ఆపదలో ఉంటే తమ క్షేమ సమాచారం మొబైల్స్‌కు ఉండే సిగ్నల్స్‌పై ఆధారపడి ఉంటుంది. సిగ్నల్ మిస్ అయితే తీరానికి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. ఈ పరిస్థితికి ఇక చెక్ పెడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. 100 శాతం సబ్సిడీపై.. కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్‌పాండర్)ను 12 నాటికల్ మైళ్లకు పైబడి దూరం వెళ్లే మరబోట్లు, మెకనైజ్డ్ బోట్లకు అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.36,400 విలువైన ఈ పరికరాన్ని 100 శాతం సబ్సిడీతో అమర్చనున్నారు. తీరంలో గస్తీ కోసం అభివృద్ధి చేసిన ఐఆర్ఎన్ఎస్ (నావిక్), జీపీఎస్ శాటిలైట్స్‌తో ఈ డివైస్ అనుసంధానమై పనిచేస్తుంది. బోట్లలోని మత్స్యకారుల వద్ద ఉండే స్మార్ట్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే చాలు సిగ్నల్‌తో సంబంధం లేకుండా రెండువైపులా సమాచారాన్ని పరస్పరం పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సమయం వృథా కాకుండా.. మరోవైపు ఇన్కాయిస్ సంస్థ అందించే పీఎఫ్జెడ్ సమాచారాన్ని కచ్చితమైన లొకేషన్స్‌తో బోట్లలోని మత్స్యకారులకు పంపడం వలన వారు క్షణాల్లో అక్కడకు చేరుకొని వేట సాగించడం ద్వారా సమయం, ఆయిల్ ఆదా అవుతుంది. పట్టుబడిన మత్స్యసంపదను ఏ సమయంలో ఏ రేవుకు తీసుకొస్తే మంచి రేటు వస్తుందో కూడా ఈ డివైస్ ద్వారా సమాచారం పంపిస్తారు. దీంతో తీరానికి చేరుకున్న తర్వాత తగిన ధర లేక మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి ఉండదు. అయితే ఈ డివైస్ పనిచేయాలన్నా, సిగ్నల్‌తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ పనిచేయాలన్నా.. సంబంధిత బోట్లలో రీ జనరేట్ చేసుకునే పవర్ సిస్టమ్ అవసరం ఉంటుంది. వైపరీత్యాల వేళ అప్రమత్తం చేయొచ్చు తుపాను హెచ్చరికలు, అకాల వర్షాలు, ఈదురు గాలులకు సంబంధించిన సమాచారాన్ని ఈ డివైస్ ద్వారా లోతు జలాల్లో వేట సాగించే అన్నిరకాల బోట్లకు క్షణాల్లో పంపించి వారిని అప్రమత్తం చేయవచ్చు. లోతు జలాల్లో ఉన్నవారిని సాధ్యమైనంత త్వరగా తీరానికి చేరుకునేలా హెచ్చరికలు జారీ చేయొచ్చు. ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే ఈ డివైస్ ద్వారా సమాచారం పంపితే శాటిలైట్ ద్వారా గ్రౌండ్ స్టేషన్‌కు చేరుతుంది. అక్కడ నుంచి క్షణాల్లో ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేçస్తున్న మోనిటరింగ్ స్టేషన్స్తోపాటు కోస్ట్ గార్డు, మెరైన్, నేవీ విభాగాలతోపాటు సమీపంలో ఉండే కమర్షియల్ వెసల్స్‌కు కూడా సమాచారం అందిస్తారు. తద్వారా క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని ప్రాణాలతో రక్షించే అవకాశం ఉంటుంది. దశల వారీగా అమర్చుతాం కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్‌పాండర్)ను లోతు జలాల్లో మత్స్య వేట సాగించే బోట్లకు దశల వారీగా అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తొలి దశలో 4,484 బోట్లలో అమర్చనున్నాం. అక్టోబర్ నాటికి వీటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. – వీవీ రావు, జేడీ, మత్స్య శాఖ (సముద్ర విభాగం) -
నీతి–మనా లోయ మహిళలపై ప్రధాని మోదీ ప్రశంసలు
డెహ్రాడూన్: భోజపత్ర కాలిగ్రఫీని జీవనోపాధిగా మార్చుకున్న ఉత్తరాఖండ్‌లోని నీతి–మనా లోయ మహిళలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో వారి కృషిని ఆయన ప్రస్తావించారు. ‘పురాతన కాలంలో మహాభారతాన్ని భోజపత్రపైనే రాశారు. మన సంస్కృతిలో భాగమైన భోజపత్రతో నీతి–మనా లోయ మహిళలు కళాఖండాలు, సావనీర్లు రూపొందిస్తున్నారు. దీనితో తమ జీవితాలనే మార్చేసు కున్నా రు’అని కొనియాడారు. ఈ లేఖనాలను అందరూ ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నార న్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సాంస్కృతిక వారసత్వాన్ని ఉపయోగించుకోవడం అభినందనీయమన్నారు. వీరి కృషి కారణంగా ఈ ప్రాంతం పర్యాటకపరంగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. అక్టోబర్‌లో చైనా సరిహద్దు సమీపంలోని బద్రీనాథ్‌ను సందర్శించిన సమయంలో స్థానిక మహిళ ఒకరు అందమైన భోజపత్ర లేఖనాన్ని బహుమతిగా అందేజేసినట్లు గుర్తుకు తెచ్చుకున్నారు. నీతి–మనా లోయలోని మనా గ్రామాన్ని ప్రధాని మోదీ అప్పట్లో మొట్టమొదటి భారతీయ గ్రామంగా అభివర్ణించారు. -
ఏపీలో ప్రకృతి సాగు భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ విధానం ఆదర్శనీయమని ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్లోబల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ టూల్‌కిట్ (జిస్ట్) ఇంపాక్ట్ సంస్థ ప్రకటించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలవుతున్న ప్రకృతి వ్యవసాయం ప్రపంచంలోనే వ్యవసాయ పర్యావరణానికి (అగ్రో ఎకాలజీకి) అతి పెద్ద పరివర్తన (మార్పు) అని తెలిపింది. ప్రకృతి వ్యవసాయం ప్రస్తుత వ్యవసాయ విధానాలకు సరియైన లాభసాటి ప్రత్యామ్నాయ విధానమని వెల్లడించింది. అధిక దిగుబడి, అత్యున్నత జీవనోపాధి, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుందని తెలిపింది. ప్రపంచ స్థాయి సంస్థల కూటమి (గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ ) మద్దతుతో జిస్ట్ ఇంపాక్ట్ సంస్థ ఆంధ్రఫ్రదేశ్‌లో నిర్వహించిన అధ్యయన ఫలితాలను బుధవారం వెల్లడించింది. భావితరాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ స్థాయిలో ఆహార వ్యవస్థల్లో పరివర్తన తేవడానికి ఈ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మూడు విభిన్న ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ఫలితాలను నిశితంగా పరిశీలించారు. కోస్తా, రాయలసీమ, డెల్టా ప్రాంతాల్లో అధ్యయనం చేశారు. 2020 – 2022 మధ్య ఎంపిక చేసిన 12 గ్రామాల్లో ఇంటింటా సమగ్ర ప్రాథమిక సర్వే చేశారు. విస్తృత ప్రయోజనాలతో నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు అంశాలు వెలుగు చూశాయి. వ్యవసాయ పర్యావరణ మార్పునకు దోహదం ఇతర విధానాలతో పోల్చితే సంప్రదాయ జీవ ఎరువులతో చేస్తున్న ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడి వస్తోంది. ఈ విధానంలో పంట వైవిధ్యత చూపితే 11% అధిక దిగుబడి వ స్తుంది. ఇది పెరుగుతున్న జనా భాకు సరిపడే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా 49% అధిక లాభం చేకూరడంతో ప్రకృతి వ్యవసాయ కుటుంబాల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. ఆ రైతుల కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. రైతు వ్యవస్థ బలంగా తయారవుతోందని వెల్లడించింది. ప్రకృతి సాగులో మహిళా శ్రామిక శక్తి అధికం మహిళా సంఘాల సభ్యులు భాగస్వామ్యం పెరుగు తుండడంతో ప్రకృతి సాగులో మహిళా శ్రామిక శక్తి అధికంగా కనిపిస్తోందని జిస్ట్ ఇంపాక్ట్ పేర్కొంది. మహిళలు క్రియాశీలక పాత్ర పోషిస్తుండడంతో కు టుంబాల మధ్య ఐక్యత, అన్యోన్యత పెరుగు తు న్నాయి. తద్వారా సామాజిక పెట్టుబడిలో పెరుగు దల స్పష్టంగా కన్పిస్తోంది. ఇతర పద్ధతుల్లో వ్యవ సాయం చేసే రైతులతో పోలిస్తే ప్రకృతి సాగు చేసే రైతుల్లో 33%తక్కువ పని దినాలతోనే అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులు మితిమీరి వినియోగి స్తున్న రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల ఉత్పాదకత నష్టాలతోపాటు అనారో గ్యానికి గురవుతున్నారు. ప్రకృతి సాగులో ఆ పరిస్థితి కన్పించడంలేదు. గ్రామీణ జీవనోపాధి, పౌష్టికాహా రం, జీవ వైవిధ్య నష్టం, వాతావరణ మార్పు, నీటి కొరత, కాలుష్యం వంటి బహుళ అభివృద్ధి సవాళ్లను ప్రకృతి సాగు చేస్తున్న రైతులు అధిగమిస్తున్నారని అధ్యయనంలో గుర్తించినట్టు ఆ సంస్థ తెలిపింది. భవిష్యత్ ప్రణాళికకు ఇదొక బ్లూ ప్రింట్ మా పరిశోధన వాతావరణ పర్యావరణ అనుకూల వ్యవసాయ అభివృద్ధికి ఒక నమూనా (బ్లూప్రింట్)గా ఉపయోగపడుతుంది. ఏపీని స్ఫూర్తిగా తీసు కొని ప్రకృతి వ్యవసాయంలో ముందుకె ళ్లాలని భాగస్వామ్య దేశాలకు సిఫార్సు చేస్తాం. – పవన్ సుఖ్‌దేవ్, జిస్ట్ ఇంపాక్ట్, సీఈవో ప్రభుత్వ కృషి ప్రశంసనీయం ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల జీవితాలు, సమాజంలో మార్పుకు కృషి జరుగు తున్నట్టు గుర్తించాం. సంప్రదాయ వ్యవ సాయం నుంచి రైతులను ప్రకృతి వ్యవ సాయం దిశగా తీసుకు వె ళ్లేందుకు ప్రభుత్వం చే స్తున్న కృషి ప్రశంసనీయం. – లారెన్ బేకర్, డిప్యూటీ డైరెక్టర్, గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఫ్యూచర్ అంతర్జాతీయంగా గుర్తింపు భవిష్యత్‌లో ఎదురయ్యే ఆహార సంక్షోభ పరి స్థితులకు ప్రకృతి వ్యవసాయం ఒక్కటే చక్క టి పరిష్కారమని జిస్ట్ ఇంపాక్ట్ సర్వే స్పష్టం చేస్తోంది. రెండేళ్లపాటు శాస్త్రీయ పద్ధతిలో చేసిన ఈ అధ్యయనం ఫ లితాలు రాష్ట్రంలో ప్రకృతి సాగుకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు దోహదపడతాయి. – టి.విజయ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్, రైతు సాధికార సంస్థ -
ప్రకృతి సేద్యం..ఉపాధికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు!
అనారోగ్యం వల్ల కోల్పోయే పనిదినాలు మూడో వంతు తగ్గాయి.ప్రకృతి వ్యవసాయంతో పంట దిగుబడులను పెరిగే జనానికి సరిపోయేంత సాధ్యమేనా? వంటి ప్రాధమిక ప్రశ్నలకు, అనుమానాలకు ఇప్పుడు పూర్తిగా కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోత్సాహంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 8 లక్షల మందికి పైగా రైతులు ఇటువంటి ప్రశ్నలన్నిటినీ తమ అనుభవాల ద్వారా పటాపంచలు చేశారు. దిగుబడులు సరే, ప్రకృతి సేద్యంలో శాస్త్రీయత ఎంత? అనే ప్రశ్నకు కూడా ఇటీవల విడుదలైన అంతర్జాతీయ స్థాయి అధ్యయన నివేదిక దీటుగా బదులిచ్చింది. జిస్ట్ ఇంపాక్ట్, గ్లోబల్ అలియన్స్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ అనే స్వచ్ఛంద సంస్థలు ఏపీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో 2020 నుంచి మూడేళ్లు లోతుగా అధ్యయనం చేసి, ‘నాచురల్ ఫార్మింగ్ త్రో ఎ వైడ్ యాంగిల్ లెన్స్’ పేరిట నివేదికను వెలువరించాయి. ఈ నివేదికను ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.)కి కూడా సమర్పించాయి. హరిత విప్లవానికి ప్రతీకైన డెల్టా ప్రాంతంలోని పశ్చిమగోదావరి, నీటి ఎద్దడి ప్రాంతాలకు ప్రతీకైన అనంతపురం, కొండ ప్రాంత గిరిజన వ్యవసాయానికి ప్రతీకైన విజయనగరం జిల్లాల్లో 12 గ్రావలను ఎంపిక చేసుకొని, ఆయా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం, రసాయనిక వ్యవసాయం చేసే రైతుల క్షేత్రాల్లో లోతుగా అధ్యయనం చేశాయి. ఖరీఫ్, రబీ పంటలు, దీర్ఘకాలిక పంటలతో పాటు పశువుల పెంపకానికి సంబంధింన విషయాలను అధ్యయనం చేశాయి. దిగుడులు, ఖర్చులు, నికరాదాయంతో పాటు.. రసాయనిక పురుగుమందులు, ఎరువుల ప్రభావం రైతులు, గ్రామీణుల ఆరోగ్యంపై ఎలా ఉందన్న విషయాన్ని పరిశీలించి తొలి అధ్యయనం కావటం మరో విశేషం. ప్రకృతికి సంబంధించిన అంశాలపై నోబెల్ ప్రైజ్‌గా భావించే టేలర్ పురస్కారం(2020) అందుకున్న ప్రముఖ పర్యావరణ ఆర్థికవేత్త పవన్ సుఖదేవ్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరగటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ నివేదికలో ఏముందంటే..? ప్రకృతి సేద్యంతో 49% పెరిగిన నికరాదాయం రసాయనిక సేద్యం జరిగే పొలాల్లో ఒకటో రెండో పంటలు పండిస్త ఉంటే.. ప్రకృతి వ్యవసాయంలో సగటున 4 పంటలు పండిస్తున్నారు. వరి, మొక్కజొన్న, మినుము, రాగులు, కంది వంటి ప్రధాన పంటల దిగుబడి రసాయనిక వ్యవసాయంతో పోల్చితే ప్రకృతి వ్యవసాయంలో సగటున 11% పెరిగింది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో శ్రమ అవసరం రసాయనిక సేద్యంతో పోల్చితే సగటున 21% పెరిగింది. రైతు కుటుంబం, కలీల శ్రమ మొత్తాన్నీ లెక్కగట్టారు. గోదావరి డెల్టాలో రసాయన వ్యవసాయంలో ఏడాదికి 313 గంటలు పని చేస్తే, ప్రకృతి సేద్యంలో ఇది 377 గంటలకు పెరిగింది. రాయలసీమలో 258 నుంచి 322 గంటలకు పెరిగింది. ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో 234 నుంచి 268 గంటలకు పెరిగింది. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం మానెయ్యటంతో ఖర్చు సగటున 44% తగ్గింది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ప్రకృతి వ్యవసాయదారుల సగటు నికరాదాయం 49% పెరిగింది. చిన్న రైతులే ‘సామాజిక మూలధనం’ ప్రకృతి సేద్య అనుభవాలను ఒకరితో మరొకరు పంచుకోవటం వల్ల మీకు తోడుగా మేం ఉన్నాం అన్న భావం విస్తరించింది. పరస్పర విశ్వాసం, మద్దతు, సాంఘిక సమన్వయం పెరిగాయి. అన్యోన్యతకు దారితీసింది. ∙ఈ విధంగా రసాయనాల్లేని సాగు అనుభవాలను పంచుకోవడం ద్వారా సామాజిక మూలధనం గణనీయంగా పెరగడానికి మహిళా స్వయం సహాయక బృందాలు ప్రభావశీలంగా పనిచేస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయానికి మళ్లటంలో, ఈ క్రమంలో ఒకరికి మరొకరు తోడుగా నిలబడటంలో పెద్ద రైతుల కంటే చిన్న కమతాల రైతులు ముందంజలో ఉన్నారు. సావజిక మూలధనాన్ని పెంపొందిచటంలో చిన్న రైతుల పాత్ర చాలా ప్రధానమైనదని తేటతెల్లమైంది. మన రైతుల్లో 83% మంది చిన్న, సన్నకారు రైతులే. మెరుగైన ఆరోగ్యం... రసాయనిక వ్యవసాయం చేసే రైతులు, ఆ పొలాల్లో పనిచేసే కూలీలు అనారోగ్యాల పాలవుతూ చాలా పని దినాలు కోల్పోతూ ఉంటారు. వీరితో పోల్చితే ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే కూలీలు, రైతులు అనారోగ్యం వల్ల పనికి వెళ్లటం మానుకోవాల్సిన రోజులు మూడింట ఒక వంతు (33%) తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడైంది. రసాయనిక పురుగుమందులు, ఎరువుల వాడే రైతులకు ఆరోగ్య ఖర్చులు ఎక్కువ. వారి జీవన నాణ్యత, పని సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. సాధారణంగా ఇటువంటి ఆరోగ్యంపై దుష్ప్రభావం కలిగించే నష్టాన్ని లెక్కలోకి తీసుకోవటం లేదు. ∙ప్రకృతి సేద్యం చేసే రైతుల ఆస్పత్రి ఖర్చులు 26% తక్కువ. ప్రకృతి వ్యవసాయదారులు ఎక్కువ రకాల పంటలు పండించడమే కాదు ఎక్కువ రకాల ఆహారాన్ని తినగలుగుతున్నారు. పోషకాలతో కూడిన అనేక రకాల ఆహారం తినటం వల్ల వీరి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంది. (చదవండి: ఆ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తి..చిట్టి మొక్కలతో గట్టిమేలే చేస్తున్నారుగా!) -
సిలోన్ కాందిశీకుల కల నెరవేరింది
చీరాల: వారంతా శ్రీలంకలో బతకలేక.. ప్రాణాలకు తెగించి సముద్ర మార్గంలో తమిళనాడుకు వలస వచ్చారు. జీవనోపాధి కోసం వచ్చిన కాందిశీకులకు వసతులు, ఉపాధి కష్టంగా మారింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీలంక కాందిశీకులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టింది. అప్పట్లో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి కాందిశీకులకు ఉపాధి కల్పించింది. కాగా.. 1980లో చీరాల ప్రాంతంలోని వేటపాలెం మండలం దేశాయిపేట వద్ద కేంద్ర ప్రభుత్వం నూలు మిల్లు ఏర్పాటు చేసింది. ఆ మిల్లులో పనుల కోసం దాదాపు 200 శ్రీలంక కాందిశీక కుటుంబాలను చీరాల తరలించారు. నూలు మిల్లు పక్కనే 10 ఎకరాలు స్థలాన్ని కేటాయించి కాందిశీకులకు కాలనీ కట్టించి ఇళ్లు కేటాయించారు. ఆ కాలనీలో కాందిశీకులు నివాసం ఉంటూ నూలుమిల్లులో పనులు చేసుకుంటూ జీవించేవారు. నూలు మిల్లులు నష్టాల పాలవడంతో వాటన్నింటినీ మూసివేశారు. 2000 సంవత్సరంలో చీరాల నూలు మిల్లు కూడా మూతపడింది. అప్పటినుంచి కాందిశీకులు ఈ ప్రాంతంలోనే ఉంటూ వివిధ పనులు చేసుకుంటున్నారు. కాందిశీకుల కల నెరవేర్చిన జగన్ దేశాయిపేటలో నిర్మించిన సిలోన్ కాలనీలో ఇళ్లలో నివాసం ఉంటున్న కాందిశీకులకు ఆ ఇళ్లపై ఎటువంటి హక్కు లేకుండా పోయింది. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సిలోన్ కాలనీలో నివాసం ఉంటున్న కాందిశీకులందరికీ ఇంటి పట్టాలు అందజేశారు. దీంతో వారికి ఆ ఇళ్లపై సంపూర్ణ హక్కు లభించింది. దీంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు ఇవ్వడం ఆనందంగా ఉంది శ్రీలంక నుంచి చీరాల వచ్చి స్థిరపడిన కాందిశీకులకు 42 ఏళ్ల తరువాత సొంత గూడు ఏర్పాటుకు పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. సిలోన్ కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించాం. కాలనీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా. – కరణం బలరాం ఎమ్మెల్యే, చీరాల ఇళ్ల పట్టాలు ఇచ్చారు 43 ఏళ్ల కిందట ఈ ప్రాంతానికి వలస వచ్చాం. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సిలోన్ కాలనీలో ఉంటున్నాం. ఆ ఇళ్లపై మాకు పూర్తి హక్కులు లేకుండా పోయాయి. ఈ ప్రభుత్వం వాటికి పట్టాలు మంజూరు చేసింది. – ఎం.శివనాడియన్, సిలోన్ కాలనీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి సిలోన్ కాలనీలో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నూలుమిల్లు మూసివేసిన తరువాత ఈ ప్రాంతంలోనే వివిధ పనులు చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిపోయాం. కాలనీలో ప్రస్తుతం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. – ఎం.సత్యవేలు, సిలోన్ కాలనీ -
పండుగైనా, పబ్బమైనా.. అనారోగ్యమైనా అడవి బాట!
సాక్షి, కామారెడ్డి: పొద్దున లేవగానే సద్దిమూట కట్టుకుని, నీళ్ల డబ్బా వెంటేసుకుని.. చేతిలో గొడ్డలితో అడవిబాట పట్టడం.. ఒంటరిగానే తిరగడం.. అక్కడే తినడం, చీకటి పడ్డాకే తిరిగి ఇంటి దారి పట్టడం.. ఒకరోజు, రెండు రోజులు కాదు.. దాదాపు జీవితాంతం ఇలాగే గడుస్తుంది. ఇది గొర్రెల కాపరుల జీవితం. పొద్దంతా మేత కోసం గొర్రెలను తిప్పడం, రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఇంట్లో పండుగైనా, పబ్బమైనా, చివరికి అనారోగ్యం బారినపడినా.. ఇంట్లో ఎవరో ఒకరు గొర్రెల వెంట వెళ్లాల్సిందే. ఇలా ఎలమందలు తమ జీవితకాలంలో సగటున లక్ష కిలోమీటర్లపైనే నడుస్తారని అంచనా. వారి జీవనంపై ప్రత్యేక కథనం. గొర్రెల మందలే లోకంగా.. రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి 7.61 లక్షల కుటుంబాలు జీవిస్తున్నట్టు అంచనా. ఆ కుటుంబాల్లోని వారు పది, పదిహేనేళ్ల వయసులోనే గొర్రెల వెంట వెళ్లడం మొదలుపెడతారు. 65 ఏళ్లు దాటినా వృత్తిని కొనసాగిస్తూనే ఉంటారు. ఏదైనా అనారోగ్యం వస్తే తప్ప ఇంటిపట్టున ఉండేది లేదు. ఎవరైనా బంధువులో, కుటుంబ సభ్యులో చనిపోయినా కూడా.. గొర్రెలను కొట్టంలోనే ఉంచేయలేరు. తోటి గొర్రెల కాపరులకు అప్పగించడమో, తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కాయడానికి వెళ్లడమో చేస్తుండే పరిస్థితి. ఒక కాపరి రోజు కనీసం పది, పదిహేను కిలోమీటర్లు చొప్పున సగటున ఏడాదికి 2,100 కిలోమీటర్లపైన.. యాభై ఏళ్ల పాటు లక్ష కిలోమీటర్లపైనే నడుస్తారని అంచనా. కుటుంబాలను వదిలి.. మన్యం పోయి.. తమ ప్రాంతాల్లో గొర్రెలకు మేత సరిగా లభించని పరిస్థితుల్లో.. దూరంగా ఉన్న అడవులకు గొర్రెలను తీసుకెళ్తుంటారు. దీన్ని మన్యం పోవడం అని పిలుచుకుంటారు. ఇలా గోదావరి, కృష్ణ, మంజీరా నది పరీవాహక ప్రాంతాలకు వెళ్తుంటారు. మూడు, నాలుగు నెలలు అక్కడే ఉండి గొర్రెలను మేపుతారు. వెంట తీసుకువెళ్లిన తిండి గింజలతో, సమీపంలోని ఊర్ల నుంచి తెచ్చుకునే సామగ్రితో వంట చేసుకుని తింటారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు చాలామంది గోదావరి వెంట వెళ్తారు. కొందరు గోదావరి దాటి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకూ గొర్రెలను తోలుకెళ్లి మేపుతుంటారు. మరికొందరు మంజీరా వెంట కర్ణాటకకు వెళ్తారు. బీపీ, షుగర్లు దరిచేరవట! గొర్రెలను కాయడానికి అలుపులేకుండా తిరగడం వల్ల కాపరులకు బీపీ, షుగర్ వంటి వ్యాధులు వారి దరిచేరవని అంటుంటారు. పచ్చని గట్లు, పొలాలు, అడవుల వెంట తిరగడం వల్ల స్వచ్ఛమైన గాలిని పీలుస్తుండటంతో ఆరోగ్యంగా ఉంటామని చెప్తుంటారు. అయితే నడిచీ నడిచీ కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతుండటం మాత్రం కనిపిస్తుంటుంది. అడవుల్లో తిరిగేప్పుడు ముళ్లు గుచ్చుకోవడం, గాయాలవడం వంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో చాలా మందికి మూలికలు, ఆకు పసర్లతో సొంతంగా వైద్యం చేసుకునే నైపుణ్యం ఉంటుంది. అడవుల్లో తిరిగే సమయాల్లో చాలాసార్లు వన్య మృగాలు కనిపిస్తాయని, వాటి కంట పడకుండా జాగ్రత్త పడతామని.. ఒకవేళ దాడి చేస్తే ఎదుర్కొనేందుకూ సిద్ధంగా ఉంటామని గొర్రెల కాపరులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టుకు మహర్దశ) చిరుతపులి వెంట పడ్డాం.. పదేళ్ల వయసు నుంచి జీవాల వెంట వెళ్తున్నాను. ఇప్పుడు 65 ఏండ్లు. జ్వరం వచ్చినప్పుడే ఇంటి పట్టున ఉండేది. పండుగ ఉన్నా ఆగమాగం తిని పోవుడే. ఓసారి అడవిలో ఎలుగుబంటి మా మీదికి వస్తే కొట్లాడినం. ఇంకోసారి చిరుత పులి గొర్రెను అందకునిపోతే వెంటపడ్డం. గొర్రెను విడిచి పారిపోయింది. – చెట్కూరి హన్మయ్య, ఇస్రోజివాడి, కామారెడ్డి జిల్లా కాపరుల జీవితమంతా కష్టాలే.. గొర్రెలు, మేకల కాపరుల జీవితమంతా కష్టాలే. మేత కోసం అడవికి వెళితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు ఇబ్బంది పెడతారు. పంట చేల వెంట వెళితే రైతుల నుంచి ఇబ్బందులు. జీవాలకు రోగాలతో సమస్య. వాటికి మందుల కోసం ఖర్చు పెరిగిపోతోంది. ప్రభుత్వం గొర్లు, మేకల పెంపకానికి స్థలాలు కేటాయించాలి. మందలకు అవసరమైన షెడ్లు నిర్మించి ఇవ్వాలి. నీటి సౌకర్యం కల్పించాలి. ఏళ్లకేళ్లు నడవడం వల్ల కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నరు. వారికి ప్రత్యేక పింఛన్లు ఇవ్వాలి. – జోగుల గంగాధర్, న్యాయవాది, గొర్రెలమేకల కాపరుల సంఘం నాయకుడు నలభై ఐదేళ్లుగా గొర్రెలు కాస్తున్నా.. పదేళ్ల వయసులో గొర్లు మేపడం మొదలుపెట్టిన. 45 ఏళ్లుగా మేపుతున్నా.. అడవిలో చిరుతపులులు, ఎలుగుబంట్లతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఏటా మేత కోసం మూడు నాలుగు నెలలు మహారాష్ట్రలోని ధర్మాబాద్, కొండల్వాడి, బిలోలి వైపు వెళతాం. అప్పట్లో గొర్రెలు, మేకలకు రోగమొస్తే ఆకు పసర్లు పోసేవాళ్లం. ఇప్పటి మందులు ఎన్ని పోసినా రోగాలు తగ్గడం లేదు. – కన్నపురం బక్కయ్య, ఇసన్నపల్లి, కామారెడ్డి జిల్లా అన్నం పాచిపోయినా తినాల్సి వస్తది నేను ఏడేండ్ల వయసు నుంచే గొర్ల వెంట పోతున్న. చలి, వాన, ఎండ ఏదైనా సరే పోక తప్పది. ఎండా కాలంలో సద్దిడబ్బా మూత తీసేసరికి అన్నం పాచిపోయి ఉంటుంది. ఆకలైతది ఎట్లయిన తినాలె. అన్నంల నీళ్లు పోసి కలిపి.. నీళ్లను పారబోసి అన్నం తినేవాళ్లం. – మాసూరి రాజయ్య, ఇసన్నపల్లి -
జీవనాధారం కోల్పోయి.. ఊపిరి తీసుకున్న ఆటో డ్రైవర్
సాక్షి(బంజారాహిల్స్): అన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నీ బాంఛన్.. నా జీవనాధారం నువ్వే లాక్కేళ్తే నా కుటుంబాన్ని ఎట్ల పోషించుకోవాలి.. రెండు నెలల్లో చిట్టీ వాయిదాలు చెల్లిస్తాను. నన్ను నమ్ము ఈ ఒక్కసారి కనికరించు అంటూ ఆ ఆటో డ్రైవర్ కాళ్లావేళ్లా పడ్డా సదరు లీడర్ వినిపించుకోలేదు. దీంతో కుటుంబాన్ని పోషించాల్సిన జీవనాధారమే లేకపోవడంతో ఓ ఆటో డ్రైవర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూర్ మండలం కొత్తమొల్గర గ్రామం పరిధిలోని తుల్జాభవానీ తాండాకు చెందిన ఇస్లావత్ రవినాయక్(31) భార్య రాజి, ముగ్గురు కూతుళ్లు, కొడుకుతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5లోని దుర్గా భవానీనగర్ బస్తీలో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఓ ప్లాట్ కొనుక్కోవడానికి అదే బస్తీలో ఉన్న ఓ లీడర్ వద్ద చీటీ వేశాడు. చీటి పాడుకున్న తర్వాత ఇటీవల కరోనా కారణంగా ఆటో సరిగ్గా నడవలేదు. రెండు నెలలు వాయిదాలు చెల్లించలేకపోయాడు. దీంతో ఆయన ఆటోను సదరు చిట్టీ వ్యాపారి లాక్కెళ్లాడు. రెండు వారాలుగా ఆటో లేకపోవడంతో బతుకు రోడ్డును పడింది. తన ఆటోను ఇవ్వాలని రాత్రింబవళ్లు ఆటో నడిపి వాయిదాలు చెల్లిస్తానని మొత్తుకున్నా ఆ వ్యాపారి కనికరించలేదు. ఈ నెల 4వ తేదీన చివరి సారిగా ఆటో ఇవ్వాలంటూ సదరు లీడర్‌ను బతిమాలుకున్నా ఆయన వినిపించుకోలేదు. దీంతో తాను చీటి వ్యాపారిని బతిమిలాడిన విషయాన్ని ఆడియో రికార్డ్ చేసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు లీడర్లు మృతదేహాన్ని హుటాహుటిన స్వగ్రామానికి తరలించారు. అయితే అక్కడ పోలీసులు కేసు తీసుకోకపోగా శవపంచనామా కూడా చేయలేదు. ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడే ఫిర్యాదు చేయాలని చెప్పడంతో మృతురాలి భార్య రాజీతో పాటు ఆ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, మరో వంద మంది గ్రామస్తులు ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తన భర్త ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: కుమార్ వర్మ కుమ్మేశాడు! పెట్టుబడి పేరుతో కోట్లు కొట్టేశాడు) -
వారి కన్నీటి కథ.. కండలు కరిగినా కడుపునిండదాయె
సాక్షి, హైదరాబాద్: ఎండనక, వాననక రాళ్లను తీసుకువచ్చి రోళ్లను తయారు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు వడ్డెరలు. బతుకుదెరువు కోసం వివిధ జిల్లాల నుంచి వలస వచ్చి మేడ్చల్ జిల్లాలో జీవనం గడుపుతున్నారు. చదువంటే తెలియని వయస్సు పొట్టకూటి కోసం సమ్మెట ఆయుధంగా చేసుకున్న వారి జీవితాల్లో వెలుగులు కానరావడంలేదు. ప్రస్తుతం జవహర్‌నగర్‌లో దాదాపు వెయ్యి కుటుంబాలకు పైగా రాళ్లను కొడుతూ జీవనం సాగిస్తున్నాయి. రెండు రోజులు రాళ్లు కొడితేనే విసురు రాళ్లు, రుబ్బు రోళ్లు తయారవుతాయి. విసురు రాయికి రూ.100, రోలుకు రూ.70, రుబ్బు రోలుకు రూ.100 అవుతాయని అంటున్నారు. స్వశక్తితోనే కుటుంబాలు పోషించుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఎక్కడైనా రోడ్లు మంజూరైతే కాని పని దొరకదని వడ్డెరలు పేర్కొంటున్నారు. పేదరికానికి మారుపేరు వారు. బతుకు గమనంలో చితికిపోయిన జీవితాలు. భవిçష్యత్‌పై ఆశలు లేని గమనాలు. కోటి విద్యలు కూటి కొరకే అన్న నానుడి రాళ్లను రోళ్లుగా తయారు చేస్తున్న వారి విషయంలో సరిపోతుంది. పొట్ట కూటి కోసం గ్రామాలు తిరుగుతూ బతుకు బండిని లాగుతున్నారు. రోళ్లను తయారు చేసే వారిని కదిలిస్తే కన్నీటి కథలే కనిపిస్తాయి. రాళ్లను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం వడ్డెరులకే సాధ్యం. బతుకు గమనంలో తమకు చేయూతనందించాలని వేడుకుంటున్న వడ్డెరుల జీవిత గమనంపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ పథకాల గురించి అసలే తెలీదు.. పిల్లలను చదివించే స్తోమత లేదని అందరం కష్టపడి పని చేస్తామని చెబుతున్నారు. తమకు నగర శివారుల్లోని కొంత అటవి ప్రాంతాన్ని అప్పగిస్తే అందులో లభించే బండలను కొట్టుకుని జీవనం సాగిస్తామని వేడుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల గురించి అసలు తమకు తెలియదని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని వడ్డెర కులస్తులు విన్నవిస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లను సుత్తితో పగలగొట్టి ఉపయోగంలోకి తీసుకువస్తారు. ప్రతిరోజు ఉదయం కుటుంబ సభ్యులందరూ కలిసి బండలు పగలగొట్టె పనికి వెళ్తారు. ఎంత కష్టపడుతున్నా శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదని వడ్డెరలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో రాళ్లను కంకరగా తయారు చేయడానికి కొత్త రకాల క్రషర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వారికి పని దొరకని పరిస్థితి. రెండు రోజులు రాళ్లు కొడితేనే.. రెండు రోజులు రాళ్లు కొడితేనే విసురు రాళ్లు, రుబ్బు రోళ్లు తయారవుతాయి. విసురు రాయికి రూ.100, రోలుకు రూ.70, రుబ్బు రోలుకు రూ.100 అవుతాయని అంటున్నారు. స్వశక్తితోనే కుటుంబాలు పోషించుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఎక్కడైనా రోడ్లు మంజూరైతే కాని పని దొరకదని వడ్డెరలు పేర్కొంటున్నారు. పని దొరకదు.. కడుపు నిండదు వంశపారంపర్యంగా ఈ వృత్తిని నమ్ముకునే జీవిస్తున్నాం. సంచార జీవితాన్ని గడపడంతో ఎదగలేకపోతున్నాం. పూట గడవడమే తప్ప ఒక్క పైసా వెనుకేసుకోలేదు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలం మేము. ప్రతి రోజు పని చేస్తేనే నాలుగు పైసలు కండ్ల చూస్తాం. లేకుంటే పస్తులుంటాం. ఒక్కోసారి పని దొరకదు. కడుపు నిండదు. ప్రభుత్వమే వడ్డెరులపై శ్రద్ధ వహించాలి. – నర్ర మహేష్, జవహర్‌నగర్ రాళ్లు కొట్టడానికి అనుమతి ఇవ్వాలి.. బండరాళ్లను అందమైన రోళ్లుగా తయారు చేయడమే తప్ప చదవడం అంటే తెలియదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో పనికి వెళ్లి వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకున్నాం. కాయకష్టం చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. గుట్టల్లో రాళ్లను కొట్టడానికి అనుమతులు ఇవ్వాలి. – రేపన్ లక్ష్మణ్, జవహర్‌నగర్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి వడ్డెర కులస్తులకు కొంత అడవిని అప్పగించాలి. నగర శివారు ప్రాంతాలలో జీవిస్తున్న వడ్డెర కులస్తుల జీవితాలలో ఎలాంటి మార్పు రావడం లేదు. వడ్డెరలను ఎస్టీ జాబితోకి చేర్చి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి. చాలా మంది వడ్డెరల పిల్లలు చదువులకు దూరంగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో వసతి గృహాలను ఏర్పాటు చేయాలి. తాతల కాలం నుంచి రాయిని కొట్టుకుని జీవిస్తున్న మాకు వడ్డెరలకు చేయుతనివ్వాలి. – పల్లపు రవి, కార్పొరేటర్, జవహర్‌నగర్ సీఎం దృష్టికి తీసుకెళ్లాం రాష్ట్రంలో వడ్డెర కులస్తుల జీవన విధానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వాస్తవంగా వారి జీవితాల్లో ఎంతో విప్లవాత్మక మార్పులు తీసుకురాల్సిన అవసరం ఉంది. చాలా మంది కుటుంబాలకు దూరంగా బండలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వడ్డెరల స్థితిగతులపై ప్రత్యేక నివేదికను తయారు చేసి సీఎం కేసీఆర్‌కు అందజేశాం. అదే విధంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరాం. – మర్రి రాజశేఖరరెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ -
శాశ్వత జీవనోపాధి: ఏపీ సర్కార్ మరో ముందడుగు..
సాక్షి, అమరావతి: లాభదాయక వ్యాపార అవకాశాల్లో మహిళలకు తోడ్పాటు అందించడం ద్వారా శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు మరో 14 కా ర్పొరేట్ సంస్థలు, ఎన్జీవోలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలోని మంత్రుల కమిటీ సమక్షంలో సోమవారం సాయం త్రం ఆయా సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఎంవోయూలపై సంతకాలు చేయనున్నారు. మహీంద్ర టాప్ గ్రీన్ హౌసె స్, ఈ–కామర్స్ వ్యాపార సంస్థల్లో ఒకటైన ‘అజి యో’ బిజినెస్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎన్ఐ–ఎం ఎస్ఎంఈ), ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ వేల్యూ చైన్స్, హీఫెర్ ఇంటర్నేషనల్ సంస్థ తో భాగస్వామిగా ఉన్న గ్రామీణ వికాస కేంద్రం (సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్) తదితర సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోన్నాయి. పేద మహిళల శాశ్వత జీవనోపాధుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం గత ఏడాది హిందుస్థాన్ లీవర్, ప్రోక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ), ఐటీసీ, రిలయన్స్, అమూల్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే. ఆన్లైన్ మార్కెట్‌కూ వీలు వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా మహిళలకు ఇచ్చే నగదును వివిధ వ్యాపార మార్గాల్లో పెట్టుబడికి వినియోగించుకునే అవకాశం కల్పించ డం ద్వారా ఈ ఏడాది కనీసం 6 లక్షల మహిళల కుటుంబాలకు శాశ్వత జీవనోపాధులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా మహిళలు చేతివృత్తుల ద్వారా తయారు చేసే బొమ్మలు, ఇతర వస్తువులు, రెడీమెడ్ దుస్తుల విక్రయానికి ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఆన్లైన్ మార్కెట్లో అవకాశాలు కల్పిస్తారు. అంతేకాకుండా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ, వసతుల కల్పన ద్వారా వ్యవసాయ, ఉద్యాన రంగాల్లోనూ లాభదాయకత పెంచడం వంటి చర్యలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ఏడాది ఈ రెండు పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళల్లో సుమారు 3 లక్షల మంది ప్రభుత్వం అందించిన అదనపు తోడ్పాటుతో కిరాణా దుకాణాలు వంటివి ఏర్పాటు చేసుకుని శ్వాశత జీవనోపాధి పొందుతున్నారు. ఈ ఏడాది మహిళల చేతికి రూ.11 వేల కోట్లు వైఎస్సార్ చేయూత పథకం కింద వరుసగా రెండో ఏడాది కూడా జూన్ 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 23.44 లక్షల మంది మహిళలకు రూ.18,750 చొప్పున రూ.4,395 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన విషయం విదితమే. మరోవైపు వైఎస్సార్ ఆసరా పథకం కింద వరుసగా రెండో సంవత్సరం కూడా వచ్చే సెప్టెంబర్‌లో మరో రూ.6 వేల కోట్లకు పైగా సొమ్మును పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించబోతోంది. ఈ రెండు పథకాల ద్వారా దాదాపు రూ.11 వేల కోట్లు మహిళల చేతికి అందుతుండగా.. ఆ డబ్బులను వ్యాపార, స్థిర ఆదాయ మార్గాల్లో పెట్టుబడులు పెట్టుకునేలా ప్రభుత్వం అదనపు తోడ్పాటు అందజేయనుంది. పారిశ్రామికవేత్తలుగానూ తీర్చిదిద్దేలా.. ఈ–కామర్స్ సంస్థ అజియో బిజినెస్ సంస్థతో ఒప్పందం ద్వారా మహిళలు చేతి వృత్తుల ద్వారా తయారు చేసే బొమ్మలు, ఇతర వస్తువులతో పాటు రెడీమేడ్ దుస్తులను ఆన్లైన్లో విక్రయించే అవకాశం కలుగుతుంది. ఈ ఒక్క సంస్థ ద్వారానే 90 వేల మంది మహిళలకు శాశ్వత ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వం ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక గ్రీన్ హౌసెస్ వ్యవసాయ పద్ధతులతో అధిక ఫలసాయం పొందడం, నాణ్యమైన ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ సదుపాయం కల్పించడంలో మహీంద్ర టాప్ గ్రీన్ హౌసెస్ సంస్థ మహిళలకు తోడ్పాటు అందిస్తుంది. ఈ సంస్థ ద్వారా 65 వేల మహిళలకు శాశ్వత జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఎన్ఐ–ఎంఎస్ఎంఈ సంస్థ ద్వారా కుటీర పరిశ్రమల ఏర్పాటులోనూ మహిళలకు తోడ్పాటు అందించనున్నారు. ఈ సంస్థ తోడ్పాటుతో 1,300 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. -
లాక్డౌన్; ఆగిన బతుకు బండి
నిత్యం స్టేషన్లో రైలు బండి ఆగితేనే.. వారి ‘బతుకు బండి’ సాగేది.. ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై అడుగు పెట్టగానే ఎర్రచొక్క, లైసెన్స్ బిళ్లతో వారు కనిపిస్తారు. ‘బరువు’ బాధ్యతగా తీసుకుంటారు.. స్టేషన్ బయట లగేజీ ఉంచి మళ్లీ ఇంకో రైలు కోసం పరుగులు తీస్తారు.. రేయింబవళ్లు బరువులు మోస్తేనే కడుపునిండేది.. కానీ ప్రస్తుతం స్టేషన్లలో సందడి లేదు.. మూడు నెలల క్రితం వరకు హాయిగా సాగిన వారి జీవితాలు భారంగా మారాయి. నెల రోజులుగా నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో తక్కువ మంది ప్రయాణిస్తుండగా.. కరోనా భయం కారణంగా తక్కువ లగేజీతో వెళ్తున్నారు. దీంతో ‘సార్.. కూలీ’.. అంటే పర్వాలేదు నేనే తీసుకెళ్తా.. అంటున్నారు. దీంతో దీనస్థితిలో తల ఊపుతూ.. వెనుదిరుగుతున్నారు. గతంలో రోజుకు రూ.600 నుంచి రూ.800 లు ఇంటికి తీసుకెళ్తే.. ప్రస్తుతం రూ.100 కూడా లభించడం లేదు. సాక్షి, హైదరాబాద్: ఇరవై ఏళ్ల క్రితం ఎర్రచొక్క, లైసెన్స్ బిళ్లతో రైల్వే కూలీగా మొదటిసారిగా స్టేషన్లో అడుగుపెట్టిన ఐలయ్య.. రాత్రింబవళ్లు బరువులు మోశాడు. ‘రేపెట్లా’.. అనే భయం లేకుండా కుటుంబాన్ని పోషించుకున్నాడు. రామంతాపూర్‌లోని ఓ అద్దె ఇంట్లో ముగ్గురు పిల్లలు, భార్యతో హాయిగా ఉన్నాడు. కానీ కరోనా మహమ్మారి ఐలయ్య కుటుంబంలో కల్లోలం రేపింది. లాక్డౌన్ కారణంగా ‘బతుకు బండి’ నిలిచిపోయింది. నెల రోజులుగా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. కానీ ప్రయాణికులు అంతంత మాత్రమే. కరోనా వైరస్ భయంతో తక్కువ లగేజీ తీసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వే కూలీలకు ఉపాధి లేకుండా పోయింది. ‘స్టేషన్లో ఇప్పుడు కూలీ అనే పిలుపే వినిపించడం లేదు. మూడు నెలలుగా ఏ ఇబ్బంది లేకుండా బతికిన ఐలయ్య ప్రస్తుతం ఇంటి కిరాయి కట్టలేని దుస్థితిలో ఉన్నాడు. భార్యకు కూడా ఇళ్లలో పనిలేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పిల్లలను చదివించే ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. ఒక్క ఐలయ్య మాత్రమే కాదు. అనేక దశాబ్దాలుగా రైల్వే పోర్టర్లుగా పనిచేస్తున్న వందలాది మంది భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రైల్వేస్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ట్రాలీలు వంటి సదుపాయాలు అందుబాటులోకి రావడంతో రైల్వే కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని, మూడున్నర నెలలుగా రైళ్ల రాకపోకలు స్తంభించడంతో రైల్వే పోర్టర్స్ వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని రైల్వే కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎదురుచూపులే మిగిలాయి.. సాధారణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు 220 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. కనీసం 100 రైళ్లు దూరప్రాంతాలకు నడుస్తాయి. సుమారు 500 మంది రైల్వే కూలీలు ఈ రైళ్లపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు వందలాది మంది రైల్వేకూలీలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటారు. 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారు. సికింద్రాబాద్‌తో పాటు నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లలో కనీసం వెయ్యి మంది పని చేస్తున్నట్లు అంచనా. రైల్వే కూలీల గుర్తింపు కోసం అధికారులు అందజేసే పోర్టర్ లైసెన్స్ వాళ్లకు ఎంతో విలువైంది. అది అనేక సంవత్సరాలుగా వారి ఉపాధికి భరోసా ఇస్తోంది. తరతరాలుగా ఎన్నో కుటుంబాలు ఆ బిళ్లనే నమ్ముకొని బతుకుతున్నాయి. ప్రతిరోజు 1.85 లక్షల మంది రాకపోకలు సాగించే సికింద్రాబాద్ స్టేషన్లో ఒక్కో రైల్వే కూలీకి రోజుకు రూ.600 నుంచి రూ.800 వరకు ఆదాయం లభిస్తుంది. 40 కిలోల బరువు బ్యాగుకు రూ.80 చొప్పున లభిస్తుంది. సికింద్రాబాద్ తర్వాత ఎక్కువ శాతం రైల్వే కూలీలు నాంపల్లిపై ఆధాపడి బతుకుతున్నారు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వివిధ రంగాల్లో కొంత మేరకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. పరిశ్రమలు, కంపెనీల్లో పనులు ప్రారంభమయ్యాయి. భవన నిర్మాణ రంగం తిరిగి గాడిన పడింది. కానీ రైళ్లు మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో రైల్వే పోర్టర్స్ చాలా కష్టాలు పడుతున్నారు. కూలీలను ఆదుకొనేందుకు రైల్వే అధికారులు మొదట్లో కొన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. నిత్యావసర వస్తులను అందజేశారు. కానీ రెండు నెలలుగా ఎలాంటి సాయం అందడం లేదు. ‘వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. సమీప భవిష్యత్‌లోనే రైల్వే కూలీ వ్యవస్థ కనుమరుగవుతుందేమోననిపిస్తోంది.’ అని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క రైలుకు 50 మంది లాక్డౌన్ సడలింపులతో ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. కానీ ఒక్క రైలుకు 50 మంది పోటీపడాల్సి వస్తోంది. పైగా లగేజీ కూడా ఉండటం లేదు. రాత్రింబవళ్లు కష్టపడితే వంద రూపాయలు కూడా లభించడం లేదు. ఆ కూలీ కోసం ఉదయం 11 గంటలకు డ్యూటీలో చేరితే మరుసటి రోజు ఉదయం 11 గంటలకు డ్యూటీ దిగుతున్నాం. – నర్సింహ భవిష్యత్ భయంగా ఉంది ఎన్ని కష్టాలు పడినా పిల్లల చదువులు ఆగిపోవద్దనుకున్నాను. కానీ రేపు వాళ్లకు స్కూళ్లు తెరిచినా ఫీజులు మాత్రం కట్టలేను. మూడు నెలల కరెంటు బిల్లు రూ.2,500 వచ్చింది. ఎక్కడి నుంచి తేగలను. ఇంటి కిరాయి కూడా కట్టాలి. అడ్డా కూలీకి వెళ్తే వాళ్లు రానివ్వడం లేదు. ఎక్కడా పది రూపాయాలు అప్పు కూడా లభించడం లేదు. – ఐలయ్య ఎక్కడికెళ్లాలి ముప్పై ఏళ్లయ్యింది. భుజాల మీద లగేజీ మోయడం తప్ప మరో పని తెలియదు. పొద్దున ఇంటి నుంచి బయలుదేరితే మరుసటి రోజే ఇంటికి చేరుకుంటాం. ఎప్పుడు రైళ్లొస్తాయో అని ఎదురు చూడటం తప్ప ఏం చేయగలం. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. రైళ్ల కోసం ఎంతకాలం ఎదురుచూడాలో.. అప్పటి వరకు ఇంకెన్ని కష్టాలో.. భయంగా ఉంది. – సైదులు -
14 ఏళ్లుగా తేనీరే ఆహారం
సాక్షి, రాయచూరు : ఆరోగ్యం సహకరించకున్నా రకరకాల వంటకాలు తినాలని నాలుక ఉవ్విళ్లూరుతుంటుంది. కానీ ఓ మహిళ కేవలం టీతో ఆకలిని చల్లార్చుకుంటోంది. 14 ఏళ్ల కిందట కుమారుడు మరణించగా, ఆనాటి నుంచి టీ తప్ప మరేమీ తీసుకోవడం లేదు. కర్ణాటకలో విజయపుర జిల్లా తాళికోటె తాలూకా సాసనూరుకు చెందిన శాంతమ్మ బిరాదార్ (75)కు ముగ్గురు ఆడపిల్లలు, కొడుకు ఉన్నారు. కొడుకు, భర్త చనిపోయిన తర్వాత జీవితంపై విరక్తి పెంచుకుంది. టీ తాగుతూ కాలం వెళ్లదీస్తోంది. చిన్న మఠంలో ఉంటున్న ఆమె అన్నం ముట్టదు. కుటుంబీకులు వైద్యుల వద్ద చూపించగా, ఆమె ఆరోగ్యం బాగుందని తేల్చారు. భోజనం చేయాలని వైద్యులు సూచించినా ఆమె మాత్రం రోజుకు 4 సార్లు టీ తాగుతూ ఆకలిని జయిస్తోంది. -
కళాకారుల కళ చెదురుతుంది
సాక్షి, పిడుగురాళ్ల : ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం చేతివృత్తి కళాకారుల జీవనోపాధిపై పెను ప్రభావం చూపుతోంది. కళాకారులు వేసిన చిత్రాలు ఏళ్ల తరబడి నాణ్యతను సంతరించుకుని ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే డిజిటల్ రంగప్రవేశం కళాకారుల బతుకుల్ని చిదిమేసింది. కొద్దిరోజుల్లో చిరిగి, రంగులుపోయే వినైల్, ఫ్లెక్సీ ప్రింటింగ్, స్టిక్కర్ కటింగ్ మిషన్లు, లైటింగ్ బోర్డులపైనే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. దీంతో కళనే వృత్తిగా నమ్ముకుని జీవనం సాగిస్తున్న కళాకారులకు ఉపాధి కరువైంది. చిత్రకళ తప్ప ఇతర పనులుచేయడం చేతగాకపోవడంతో నియోజకవర్గంలో పదుల సంఖ్యలో కళాకారులు ఇక్కట్లు పడుతూ దయనీయ జీవనం గడుపుతున్నారు. ఉపాధి కోల్పోయిన కళాకారులు... డిజిటల్ ప్రింటింగ్‌తో చిత్రకారులు జీవనోపాధి కోల్పోయారు. నియోజకవర్గంలో సుమారు 100 నుంచి 150 మంది కళాకారులు దుకాణాల ఎదుట బోర్డులు, బ్యానర్లు రాస్తూ, బొమ్మలు వేస్తూ జీవనం సాగించేవారు. ఎన్నికలు వస్తే ఇక ఆర్టిస్టులు రేయింబవళ్లు పదులసంఖ్యలో పనిచేసేవారు. అయితే ఎన్నికల్లో గోడలపై రాతలు, బ్యానర్లు ఉండరాదన్న ఎన్నికల కమిషన్ నియమావళితో 50 శాతం మంది ఆర్టిస్టు ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. కాలక్రమంలో డిజిటల్ ప్రింటింగ్ రంగప్రవేశంతో మిగిలిన 40 శాతం మంది ఆర్టిస్టులకు పనిలేకుండా పోయింది. కొద్దోగొప్పో ఆర్థికస్తోమత ఉన్నవారు డిజిటల్ ప్రింటింగ్ మిషన్లు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తుండగా మరికొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇళ్లకు రంగులు వేయడానికి వెళుతున్నారు. మరికొందరు కష్టమైనా వేరే వృత్తిని ఎంచుకోలేక పెయింటింగ్ వృత్తినే నమ్ముకుని వారానికి ఒకసారో, రెండుసార్లో వచ్చే పనులకు వెళ్లి రంగులువేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అక్కడక్కడ పాఠశాల గోడలకు దేశనాయకుల చిత్రాలను గీస్తూ జీవనం సాగిస్తున్నారు. తమకు ప్రభుత్వం రుణాలు మంజూరుచేసి చేయూతనివ్వాలని ఆర్టిస్టులు కోరుతున్నారు. 90 శాతం పనులు తగ్గాయి 35 ఏళ్లుగా ఆర్టిస్టుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కళాకారులకు 90శాతం మేర పనులు తగ్గాయి. డిజిటల్ ఫ్లెక్సీలు రావడంతో అందరూ వాటినే ఏర్పాటుచేసుకుంటున్నారు. దీంతో మాకు పనులు సన్నగిల్లాయి. ప్రభుత్వం చేతివృత్తి కళాకారులకు రుణాలు మంజూరుచేస్తే ఏదొక వ్యాపారం పెట్టుకుని జీవనం సాగిస్తాం. – కె.చెన్నకేశవ, ఆర్టిస్టు, పిడుగురాళ్ల -
చింతపండే ఉపాధి
హవేళిఘణాపూర్(మెదక్) : చింతపండు... నిత్యవసర వస్తువుల్లో ప్రతి రోజు ఏదో ఒక వంట(కూర)లో వాడుతుంటాం. కూరల్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. చింతపండుతో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. హవేళిఘణాపూర్ మండల పరిధిలోని గంగాపూర్, కూచన్‌పల్లి, రాజ్పేట్, కొత్తపల్లి, బూర్గుపల్లి, వాడీ, శమ్నాపూర్ గ్రామ ప్రజలు చింతపండును సేకరించి, దానిని కొట్టి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇలా చింతపండును సేకరించి కొందరు సొంతంగా ఉపాధి పొందుతున్నారు. ఈ యేడు చింతపండు బాగా కాసిందని, గింజలతో ఉన్న చింతపండు కిలో రూ.40 నుంచి 50 వరకు విక్రయించగా...గింజలు లేని చింతపండు(కొట్టింది) కిలో రూ.80 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. -
నాకు నేనున్నాను
అది రాజస్థాన్ రాష్ట్రం, ఉదయ్‌పూర్ నగరానికి సుమారు 40 కి.మీ.ల దూరంలో ఆరావళి పర్వతశ్రేణుల్లో ఓ కుగ్రామం. పేరు పడూనా. ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని గ్రామం. బడి లేదు, కరెంటు లేదు. అలాంటి గ్రామంలో ఓ మహిళ. జీవనోపాధి కోసం తనకు తాను ఓ కొత్త బాటను వేసుకుంది. అందుకు ఆమె చేస్తున్న పని సాధారణమైనదే. కానీ ఆ పనిని ఇప్పటి వరకు మగవాళ్లు తప్ప ఆడవాళ్లు చేసి ఎరగరు. అందుకే ఆమె ప్రత్యేకం. ఎవరామె? ఆమె పేరు మీరాబాయ్ మీనా. వయసు 52 ఏళ్లు. చేస్తున్న పని... హ్యాండ్ బోర్ రిపేరు చేయడం. హ్యాండ్ బోరు కుళాయి విప్పి రిపేరు చేసి మళ్లీ బిగిస్తుంది. మీరాబాయికి చదువులేదు. పుట్టిన ఊరు దాటి పది కిలోమీటర్లు కూడా వెళ్లింది లేదు. మహిళాభివృద్ధి గురించి తెలియదు. మహిళలకు సమాజంలో సమభాగస్వామ్యం వంటి పెద్ద పదాలేవీ ఆమెకు తెలియదు. సాధికారత అంటే ఏమిటో తెలియదు. అయినా సాధికారత సాధించింది. మహిళలు ఈ పని చేయకూడదనే చాదస్తపు సామాజిక నిబంధనను ఒక్క చూపుతో పక్కన పెట్టింది. తనకు ఆసక్తి ఉన్న బోర్ రిపేర్ పని నేర్చుకుంది. సొంతంగా డబ్బు సంపాదించుకుంటోంది. సొంతంగా జీవించి చూపిస్తోంది. ఇప్పుడు పడూనాతోపాటు ఝాబ్లా గ్రామాల్లో ఎక్కడ చేతిపంపు రిపేరు వచ్చినా ఆమెకే పిలుపు వస్తుంది.‘ఒంట్లో శక్తి ఉంది, చేతిలో పని ఉంది. ఇక నేను ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి?’ అంటోంది ధీమాగా. భర్త చిన్నప్పుడే పోయాడు, పిల్లలు లేరు. భవిష్యత్తు ఎలా అని ప్రశ్నించిన వారిని ‘పని చేయలేని నాడు తినడానికి దాచుకున్న డబ్బు ఉంది. నాకు అన్నదమ్ములున్నారు, వాళ్లకు పిల్లలున్నారు. సోదరులు నన్ను పోషించాలంటే కష్టపడతారేమో కానీ అభిమానం పంచడానికి కష్టపడరు’ అంటోంది. ఆమె మాటల్లో సమాజాన్ని ఆకళింపు చేసుకున్న జ్ఞానం. స్వరంలో ‘నాకు నేనున్నాను’ అనే ధీమా. -
నగరంపై 125 ఏళ్ల ముద్ర
సాక్షి, హైదరాబాద్: నాడు నిజాం సంస్థానంలో వేడుకలు జరిగితే ఆహ్వాన పత్రాలు ఎక్కడ ముద్రించే వారో తెలుసా..? నిజాం ఫర్మానాలు ఎక్కడ ప్రింట్ అయ్యేవో తెలుసా..? ఇప్పుడంటే ప్రింటింగ్‌లో కొత్తకొత్త టెక్నాలజీలు దూసుకొస్తున్నాయి.. మరి నాడు ఏ టెక్నాలజీ వాడారు? మన భాగ్యనగరంలో ప్రింటింగ్ శకం ఎప్పుడు మొదలైంది? సరిగ్గా 125 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో తొలి ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభమైంది. దాని పేరు షమ్సుల్ ఇస్లాం ప్రెస్. 1892లో డిసెంబర్ నెలలో అప్పటి ప్రముఖ మార్కెట్ అయిన ఛత్తాబజార్‌లో దీన్ని ప్రారంభించారు. నేడు అదే ప్రాంతంలో ఒకటి కాదు రెండు కాదు.. 300కుపైగా ప్రింటింగ్ ప్రెస్‌లు ఏర్పాటయ్యాయి. ఇలా ఒకేచోట ఇన్ని ప్రింటింగ్ ప్రెస్‌లు ఉండటం, వాటి ద్వారా వేలాది మందికి ఉపాధి పొందడం దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరెక్కడా లేదనడం అతిశయోక్తి కాదు! విజిటింగ్ కార్డు మొదలుకొని... వెడ్డింగ్ కార్డులు, బ్రోచర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, బ్యాడ్జీలు, ఐడెంటిటీ కార్డులు, కంపెనీలకు లోగోలు, పుస్తకాలు, క్యాలెండర్ల ప్రింటింగ్.. ఇలాంటి వాటన్నింటికీ ఛత్తాబజార్ చిరునామాగా మారింది. అఫ్జల్‌గంజ్ నుంచి చార్మినార్ వెళ్లే దారిలో మదీనా చౌరస్తాకు ఎడమ వైపున ఉన్న గల్లీలోకి ప్రవేశించగానే ఈ ప్రింటింగ్ ప్రపంచం స్వాగతం పలుకుతుంది. మాన్యువల్ స్క్రిప్ట్‌తో వస్తే చాలు తెలుగు, హిందీ, ఉర్దూ, అరబీతోపాటు ఇతర భాషల్లోకి అనువాదాల పని కూడా ఇట్టే పూర్తవుతుంది. ఇక్కడి ప్రింటింగ్ ప్రెస్‌లలో వార, పక్ష, మాస, దినపత్రికలు అచ్చువుతుండటం గమనార్హం. వేల కుటుంబాలకు జీవనోపాధి ఛత్తాబజార్ ప్రింటింగ్ ప్రెస్‌లలో దాదాపు 5 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరంతా ప్రింటింగ్, బైండింగ్, స్క్రీన్ ప్రింటింగ్ తదితర విభాగా ల్లో పని చేస్తున్నారు. ఇక్కడ కొంతకాలం పనినేర్చుకుంటున్న యువకులు తర్వాత తమ ప్రాంతాల్లో సొంతంగా ప్రింటింగ్ ప్రెస్‌లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. ఉర్దూ భాషలో ఛత్ అంటే పైకప్పు. ఇక్కడున్న కమాన్లపై ఛత్లు ఉన్నాయి. అలాగే పూర్వం ఇక్కడి చిన్నచిన్న దుకాణాలపైన గుడారాల్లాంటి కప్పులు ఉండేవట. దీంతో ఈ బజార్‌కు ఛత్తాబజార్ అని పేరొచ్చిందని చెబుతారు. షమ్సుల్ ఇస్లాం.. తొలి ప్రింటింగ్ ప్రెస్.. సరిగ్గా 125 ఏళ్ల కిందట షమ్సుల్ ఇస్లాం పేరిట నగరంలో తొలి ప్రింటింగ్ ప్రెస్ వెలిసింది. దీన్ని ప్రారంభించిన సయ్యద్ గౌసుద్దీన్.. ఆ రోజుల్లో కాతిబ్ ( క్యాలీగ్రాఫీ) రాసేవారు. నిజాం సంస్థానంలో వేడుకలు జరిగినప్పుడు ఆహ్వాన పత్రికలతోపాటు ఫర్మానాలు కూడా రాయించే వారు. రాయడానికి అవసరమైన కలం, ఇంక్‌లను కొనేందుకు తరచూ బొంబాయి వెళ్లేవారు. ఈ క్రమంలో అక్కడున్న ప్రెస్‌లను చూసి హైదరాబాద్‌లో 1892లో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు. తర్వాత ఇందులోనే నిజాం కార్యాలయానికి సంబంధించిన దాదాపు అన్ని దస్తావేజులు ముద్రించే వారు. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వివాహ ఆహ్వాన పత్రాలను కూడా ఇక్కడే ముద్రించారు. మాదే తొలి ప్రెస్ 125 ఏళ్ల కిందట మా తాత ఈ ప్రెస్‌ను ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆయన కాతిబ్ రాసేవారు. ముంబై నుంచి ప్రెస్‌కు సంబంధించిన మొత్తం సామగ్రి తెచ్చి దీన్ని ఏర్పాటు చేశారు. ఆయన తర్వాత మా నాన్న మీర్ ఖమురొద్దీన్ నడిపారు. ఇప్పుడు నేను ఈ ప్రెస్‌ను కొనసాగిస్తున్నా. – మీర్ అహ్మద్ అలీ, షమ్సుల్ ఇస్లాం ప్రెస్ ఇది లిథో ప్రింటింగ్ టెక్నాలజీ. చాలా పురాతన విధానం. ఇందులో తొలుత బటర్ పేపర్‌పై ప్రింట్ తీస్తారు. తర్వాత ఆ పేపర్‌ను ప్లేట్‌పై అతికించి ఇలా వేడి చేస్తే పేపర్‌పై ఆక్షరాలు ప్లేట్‌పై అచ్చవుతాయి. తర్వాత ప్లేట్‌ను మిషన్‌కు అనుసంధానించి ప్రింట్లు తీస్తారు. నగరంలో అచ్చయిన మొట్టమొదటి చార్మినార్ చిత్రం -
చంచల్‌గూడలో మహిళా పెట్రోల్ బంక్
ప్రారంభించేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ ఏర్పాట్లు హైదరాబాద్: దేశంలోనే మొదటిసారిగా మహిళా ఖైదీలతో నిర్వహించే పెట్రోల్ బంక్‌ను చంచల్‌గూడలో ప్రారంభించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఖైదీల సంస్కరణల్లో భాగంగా చంచల్‌గూడ మహిళా జైలులో శిక్ష అనుభవించి విడుదలైన 30 మంది మహిళలకు ఈ బంక్‌లో జీవనోపాధి కల్పించనున్నారు. వీరికి నెలకు రూ.12 వేల వేతనం ఇవ్వనున్నారు. మరో 20 రోజుల్లో ఈ బంక్ వినియోగంలోకి రానుంది. ఖైదీలకు ఉపాధి కల్పించే ప్రయత్నంలో భాగంగానే ఈ పెట్రోల్ బంక్ నెలకొల్పుతున్నామని మహిళా జైలు సూపరింటెండెంట్ బషీరాబేగం పేర్కొన్నారు. -
భార్య చదువుకున్నా జీవనభృతి ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: భార్య చదువుకున్నంత మాత్రాన మధ్యంతర జీవనభృతిని నిరాకరించడం కుదరదని ఢిల్లీలోని సెషన్స్‌కోర్టు తీర్పునిచ్చింది. గృహహింస కేసులో దాఖలైన పిటిషన్‌ను విచారించిన అదనపు సెషన్స్ జడ్జీ వివేక్ గులియా, దిగువ మేజిస్ట్రియల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేశారు. మధ్యంతర భృతి పొందడానికి భార్య నిరాశ్రయురాలు కావాల్సిన అవసరం లేదన్నారు. భార్యకు నెలకు రూ.3,000 మధ్యంతర భృతి చెల్లించాల్సిందిగా ఆమె భర్తను ఆదేశించారు. 2015 జనరిలో పిటిషనర్‌కు వివాహమైన తర్వాత అదనపు కట్నం తేవాల్సిందిగా ఆమెను భర్త, అతని కుటుంబ సభ్యులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. దీంతో పెళ్లైన అయిదు నెలలకే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత మధ్యంతర భృతి కోసం మేజిస్ట్రియల్ కోర్టును ఆశ్రయించగా, పిటిషనర్‌కు తనను తాను పోషించుకోగల సామర్థ్యం ఉందని పటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో ఆమె సెషన్స్‌కోర్టును ఆశ్రయించారు. -
భిక్షమెత్తైనా భృతి ఇవ్వాల్సిందే: హైకోర్టు
కేకే.నగర్: భార్యబిడ్డ జీవన భృతి కోసం భిక్షమెత్తి సంపాదించైనా డబ్బులు ఇవ్వాల్సిందేనని మదురై హైకోర్టు ఓ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. విరుదునగర్ జిల్లా శ్రీ విల్లిపుత్తూరుకు చెందిన సెల్వరాజన్‌కు, కోవిల్పట్టికి చెందిన రంగసుభద్ర భార్యాభర్తలు. వీరికి ఒక బిడ్డ ఉంది. కాగా అభిప్రాయ భేదాల కారణంగా వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో తనకు ఉండడానికి ఇల్లు, నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ రంగసుభద్ర కోవిల్పట్టి కోర్టులో పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన కోర్టు ఇంటి అద్దె కింద రూ. పదివేలు, నష్టపరిహారంగా రూ. 50 వేలు ఇవ్వాలని సెల్వరాజన్‌ను ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ సెల్వరాజన్ తూత్తుకుడి కోర్టులో అప్పీలు చేసుకున్నాడు. పిటీషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఇంటి అద్దెకు పదివేలు ఇవ్వాల్సిన అవసరం లేదని, రూ.10 వేల జీవన భృతి, రూ. 25 వేలు నష్టపరిహారంగా ఇస్తే చాలని ఆదేశించింది. కాగా ఈసారి ఆదేశాలను వ్యతిరేకిస్తూ సెల్వరాజన్ మళ్లీ మదురై హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి దేవదాస్ ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం ఈ విధంగా తీర్పునిచ్చాడు. ‘శారీరకంగా కంటే మానసికంగా పడే బాధ వర్ణనాతీతం. రంగసుభద్రను పిటిషన్ దారుడు మానసికంగా ఎన్నో కష్టాలను పెట్టాడు. ఇప్పుడు కేసు నుంచి తప్పించుకోవడానికి తాను ఇంజనీరింగ్ చదివినా నిరుద్యోగినని కుంటిసాకులు చెపుతున్నాడని కోర్టుకు అర్థమైంది. చట్ట ప్రకారం రంగసుభద్రకు పిటిషన్‌దారుని ఆస్తిలో భాగం ఇవ్వాల్సిందే. పిటిషన్‌దారుడు కూలీ పనిచేసైనా భార్యాబిడ్డకు జీవనభృతి చెల్లించాల్సిందే. లేని పక్షంలో భిక్షమెత్తై వారి భోజనానికి అయ్యే ఖర్చుల కింద జీవన భృతి ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదంటూ ’తీర్పు వెలువరించారు. -
గుర్రమే జీవనాధారం
ఊరూరా తిరుగుతూ వ్యాపారం మునిపల్లి: గుర్రంపై ఠీవీగా ఉన్నాడు.. ఇతనిదేమైనా రాచరిక కుటుంబమా? అని అనుకుంటున్నారా? అ లాంటిదేమీ లేదు.. గుర్రమే ఇతని జీవనాధారం. అదెలా అనుకుంటే ఈ స్టోరీ చదవండి... మునిపల్లి మం డలం ఖమ్మంపల్లికి చెందిన కట్కె పాషమియా పెద్దగా చదువుకోలేదు. దీంతో తన పూర్వీకులు చేసిన పనినే జీవనోపాధిగా మల్చుకున్నాడు. మండల పరిధిలో అంతారం, ఖమ్మంపల్లి, చిన్న చల్మెడ, మునిపల్లి తదితర గ్రామాల్లో జరిగే సంతల్లో గొర్రెలు, మేకల మాంసాన్ని విక్రయిస్తూ ఉంటాడు. ఈక్రమంలో దాదాపు 40 కిలోమీటర్లు గుర్రంపైనే వెళ్తుంటాడు. చదువు విలువ తెలిసింది ‘మా నాన్న కట్కె మౌలన్సాబ్. చదువకోమని ఎన్నిసార్లు చెప్పిన వినలే. ఆయనతో పోయి మేక, గొర్రెల మాంసం అమ్మేతో డిని. దీంతో ఈ వ్యాపారం ఎట్ల చేయాలో తెలిసింది. రెండెకరాల పొలం ఉంది. దాంతో పాటు ఈ వ్యాపారం చేస్తూ భార్య, పిల్లల్ని పోషించుకుంటున్న. నాలా నా కొడుకులు కాకూడదని వాళ్లను చదివిస్తున్న’ అని పాషమియా ‘సాక్షి’కి చెప్పాడు. -
పల్లెప్రగతితో జీవనోపాధి
* 37.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యం * రూ. 642 కోట్లతో ‘సెర్ప్’ తాజా ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పల్లె ప్రగతి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద రైతు కుటుంబాల కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ప్రణాళికను సిద్ధం చేసింది. వచ్చే ఐదేళ్లలో 10,621 గ్రామాల్లోని 37.50 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జీవనోపాధికి ప్రాధాన్యత కల్పించింది. మొత్తం పల్లెప్రగతి ప్రాజెక్ట్ వ్యయం రూ.642 కోట్లు కాగా, జీవనోపాధి కార్యక్రమాలకే రూ.264 కోట్లు కేటాయించింది. వివిధ రకాల పంటలు పండించే రైతులతోనే ఉత్పత్తిదారుల సంస్థ(ప్రొడ్యూసర్స్ గ్రూప్)లను ఏర్పాటు చేసి, వారి ఆదాయాన్ని 50 శాతం పెంచేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. రైతులకు సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం, ఉత్పత్తులకు మెరుగైన ధర పొందేలా సెర్ప్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం చేయనుంది. 165 ఉత్పత్తిదారుల సంస్థల్లో 2.55 లక్షల మందిని భాగస్వాములు చేయనుంది. మానవాభివృద్ధి మెరుగుదలకు: జీవనోపాధి కల్పనతో పాటు మానవాభివృద్ధి మెరుగుదల కోసం పల్లెప్రగతి కార్యక్రమం కింద పలు చర్యలు చేపట్టనున్నారు. ఆరోగ్యం, పౌష్టికాహార భద్రత, మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం నాణ్యమైన విద్యను అందించడం ఇందులో ముఖ్యమైనవి. 2.50 లక్షల కుటుంబాలు మెరుగైన మానవాభివృద్ధిని అనుభవించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కమ్యూనిటీ పర్యవేక్షణ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో అన్ని రకాల సేవలను అందించేందుకు డిజిటల్ కనెక్టివిటీతో సమగ్ర సేవా కేంద్రాలను స్థాపించి, ఉపాధిహామీ, ఆసరా పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ ఉపకార వేతనాలు.. తదితర చెల్లింపులన్నీ ఈ కేంద్రాల నుంచే పొందే వీలు కల్పిస్తారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ-గవర్నెన్స్, ఫిర్యాదుల నమోదు వంటి సేవలను ఒకేచోట లభించేలా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. -
తెలంగాణ.. అభివృద్ధికి చిరునామా కావాలి
నల్లగొండ జిల్లాలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఫార్మసీ చదువు పూర్తి చేసి జీవనభృతి కోసం మస్కట్ వెళ్లాడు. అనుకోని అవకాశం తలుపు తట్టడంతో అమెరికా పయనమయ్యాడు. అది ఆయన జీవితాన్నే మార్చేసింది. ఫార్మసీలో ఉద్యోగి స్థాయి నుంచి సొంతంగా న్యూయార్క్‌లో మూడు ఫార్మసీలను స్థాపించే స్థాయికి ఆయనను చేర్చింది. అమెరికా తెలుగు అసోసియేషన్ ట్రస్టీల్లో ఒకరిగా మార్చింది. తెలంగాణ అసోసియేషన్ ఫర్ ఫార్మా అండ్ కెమికల్ ఇండస్ట్రీస్‌కి ఎన్నారై కన్వీనర్‌ని, అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్‌కి ఉపాధ్యక్షుడిని చేసింది. ఇన్ని బాధ్యతలను ఏక కాలంలో సమర్థంగా నిర్వర్తిస్తూ, మరోవైపు తెలంగాణ అభివృద్ధి కోసం ఉత్సాహంగా అడుగులు వేస్తోన్న ఆయనే లక్షణ్ అనుగు. తన జీవిత విశేషాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ స్థాపించాలన్న ఆలోచన ఎవరిది? ఓసారి ప్రొఫెసర్ జయశంకర్ అమెరికా వచ్చారు. నా రూమ్మేట్స్ అయిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఆయన్ని కలవాలని అనుకున్నారు. వాళ్లతో పాటే నేనూ వెళ్లాను. అక్కడ ఆయన తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడిన మాటలు విని స్ఫూర్తి పొందాను. ఆయన చేతుల్లో పురుడు పోసుకున్న సంస్థే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్. తెలంగాణ ఉద్యమమే లక్ష్యంగా దీన్ని స్థాపించారా? ఈ ఫోరమ్ స్థాపించేనాటికి అసలు ఉద్యమమే లేదు. తెలంగా ణవాడిగా ఇక్కడి ప్రాంతాలకు మంచి చేయాలన్న లక్ష్యం, అభి వృద్ధిపర్చాలన్న ఆశయంతో దీన్ని స్థాపించాం. ఆదిలాబాద్ జిల్లాలో 200 మంది పిల్లలు కలరా వచ్చి చనిపోయారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. అది నన్ను కలచివేసింది. ఇలాంటి బాధాకర పరిస్థితులు అక్కడ చాలా ఉన్నాయి. వాటిని మార్చాలన్న ఉద్దేశంతోనే ఈ ఫోరమ్ ఊపిరి పోసుకుంది. తెలంగాణ ఉద్యమంలో మీ ఫోరమ్ ఎలాంటి పాత్ర పోషించింది? నిజానికి మా ఫోరమ్ చాలా ప్రముఖ పాత్ర పోషించింది. సమావేశాలు నిర్వహించింది. పుస్తకాలు ప్రచురించింది. మూడు వేల మంది సభ్యులున్నాం. ప్రత్యేక రాష్ట్రం కల తీరింది కాబట్టి ఇప్పుడు అభివృద్ధి మీద దృష్టి సారిస్తున్నాం. ఇంతవరకూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? చేనేత కార్మికులకు చేయూతనివ్వడం కోసం సంకల్పం అనే ప్రాజెక్టును ప్రారంభించాం. భారతి అనే ప్రాజెక్ట్ ద్వారా విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నాం. లైబ్రరీలు స్థాపిస్తున్నాం. ‘మిషన్ కాకతీయ’లో భాగస్వాములమయ్యాం. ఇవన్నీ చేయడానికి సభ్యులందరం కలిసి ప్రతి ఒక్కరం రోజుకో డాలర్ సేవ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహం ఎలా ఉంది? మేము ఏదైనా ప్లాన్ చెబితే కేసీఆర్‌గారు సానుకూలంగా స్పం దిస్తున్నారు. అంతా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని భరోసా ఇస్తున్నారు. అంతకంటే కావాల్సింది ఏముంది! భవిష్యత్ ప్రణాళికలు...? తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చడమే. ఇంతవరకూ చెప్పినవాటితో పాటు నాకొక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. నేను మస్కట్‌లో ఉన్నప్పుడు మన భారతీయులు చాలామంది ఆవేశంలో చిన్న చిన్న నేరాలకు పాల్పడి జైలు పాలవడం చూశాను. నిజానికి వాళ్లు నేరస్తులు కాదు. చేసిన చిన్న పొరపాట్లకు పెద్ద శిక్షలకు గురై జైళ్లలో మగ్గిపోతుం టారు. వాళ్లు ఏమైపోయారో, ఎలా ఉన్నారో తెలియక వారి తల్లిదండ్రులు అల్లాడిపోతుంటారు. కొందరు విదేశాల్లో ప్రమాదాల్లో మరణిస్తుంటారు. వారి వివరాలను ఇంటికి చేరవేయడం, మృతదేహాలను స్వస్థలానికి రప్పించడం చాలా పెద్ద పని. ఈలోపు వారి కుటుంబ సభ్యులు ఎంతో వేదన అనుభవిస్తుంటారు. ఇలాంటి సమస్యలు తీర్చడం కోసం మన ప్రభుత్వం ఏదైనా చేయాలి. దీనికోసం ఓ విభాగాన్ని స్థాపించి, ఒక ఐఏఎస్ అధికారికి దాని బాధ్యత అప్పగించాలి. ఈ విషయమై కేసీఆర్‌గారితో ఇప్పటికే చర్చించాను. ఆయన త్వరలో ఏర్పాటు చేద్దామన్నారు. అది సాకారమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నా. -
సమాజానికి ఎంతో చేశాం
వాటిని పరిగణనలోకి తీసుకొని శిక్ష విధించండి శిక్ష ఖరారుకు ముందు న్యాయమూర్తికి రామలింగరాజు నివేదన సాక్షి, హైదరాబాద్: ‘మీపై నేరం రుజువైంది. మీకు గరిష్టంగా 14 ఏళ్ల జైలుశిక్ష, అపరిమిత జరిమానా విధించవచ్చు. అందువల్ల శిక్ష ఖరారుకు ముందు మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా?’ అంటూ న్యాయమూర్తి రామలింగరాజును అడిగారు. అందుకు రామలింగరాజు బదులిస్తూ తాను దేశం కోసం చేసిన కొన్ని సేవలను కోర్టు ముందుంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. ‘అమెరికాలో 911 సర్వీసు తరహాలో దేశంలోనే తొలిసారిగా 108 సర్వీసును ప్రారంభించి 10 లక్షల మంది ప్రాణాలను కాపాడాం. ఆపదలో ఉన్న 3.5 కోట్ల మందికి సేవ చేశాం. ఈ సర్వీసు ద్వారా 40 వేల మందికి ఉపాధి కల్పించాం. దేశవ్యాప్తంగా 70 కోట్ల మంది ప్రజలకు ఈ సర్వీసు ద్వారా సేవలు అందించాం. బైర్రాజు ఫౌండేషన్ ద్వారా 200 గ్రామాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా విద్య, వైద్యం, జీవనోపాధి తదితర 30 రకాల సేవలు అందించాం. గ్రామాల్లో ఇంటి దగ్గరకే మినరల్ వాటర్‌ను మొదటిసారిగా అందించాం. స్వర్గీయ అంజిరెడ్డితో కలసి స్థాపించిన నాంది ఫౌండేషన్ 14 రాష్ట్రాల్లో ప్రజలకు సమర్ధంగా సేవలు అందిస్తోంది. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుల్లో నేనూ ఒకరిని. ప్రపంచంలోనే ఉత్తమ బిజినెస్ స్కూల్‌గా గుర్తింపు పొందిన ఇండియన్ బిజినెస్ స్కూల్‌ను ప్రారంభించిన సభ్యుల్లో నేనూ ఉన్నా. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 104 సర్వీసును ప్రారంభించాం. సత్యం కంప్యూటర్స్ ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించాం. అనేక సంస్థలకు ఐటీ సేవలను అందించాం. దేశంలోనే మొదటిసారిగా సిఫీ ఇంటర్నెట్ సంస్థను స్థాపించి ప్రజలకు ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చాం. శాటిలైట్ వ్యవస్థను అనుసంధానించడం ద్వారా ఆఫ్ షోర్ సర్వీసులను అందించాం. జాయింట్ వెంచర్ ద్వారా కాగ్నిజెంట్ కంపెనీతో కలసి 2.11 లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఇందులో 80 శాతానికిపైగా భారతీయులే ఉన్నారు. సత్యం కంపెనీని టెక్ మహీంద్ర కొనుగోలు చేసే నాటికి షేర్ విలువ రూ. 58 ఉండగా ప్రస్తుతం రూ. 320గా ఉంది. ఇటీవలే మదుపుదార్లకు బోనస్ షేర్లను కూడా ఇచ్చారు. సమాజానికి ప్రయోజనకరమైన పనులెన్నో చేశా. 33 నెలలపాటు రిమాండ్‌లో ఉన్నా. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని శిక్షను ఖరారు చేయండి’ అని రామలింగరాజు న్యాయమూర్తికి నివేదించారు. కుటుంబానికి మేమే ఆధారం ‘కేసు నమోదైనప్పటి నుంచి తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నాం. 30 నెలలుగా జైల్లో ఉన్నాం. మా కుటుంబాలు అన్ని రకాలుగా చితికిపోయాయి. బంధువులు, మిత్రులు మమ్మల్ని సాంఘికంగా బహిష్కరించారు. పిల్లలు, భార్య, తల్లిదండ్రులు మా మీదే ఆధారపడి ఉన్నారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్నారు. వారిని పోషించాల్సిన బాధ్యత మాపైనే ఉంది. మేం చేసిన అపరాధానికి ఈ శిక్ష సరిపోతుందని భావిస్తున్నాం’ అని ఇతర దోషులు న్యాయమూర్తికి నివేదించారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నానని, ఈ కేసు తర్వాత తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు కూడా రావట్లేదనిమరో దోషి ప్రభాకర్‌గుప్తా న్యాయమూర్తికి నివేదించారు. -
రేపటి నుంచి ‘తెలంగాణ పల్లె ప్రగతి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో.. తెలంగాణ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి కార్యక్రమం(టీఆర్ఐజీపీ)గా ఉన్న ఈ ప్రాజెక్టుకు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘తెలంగాణ పల్లె ప్రగతి’గా నామకరణం చే సింది. దీని అమలుకు విధివిధానాలతో శుక్రవారం పంచాయతీరాజ్ విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఐదేళ్లపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు రూ.450 కోట్లు ఆర్థిక సాయంగా అందించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.192కోట్లు వెచ్చించనున్నారు. తొలి విడ తగా రాష్ట్రంలో వెనుకబడిన 150 మండలాలను ఎంపిక చేసిన అధికారులు.. ఆయా ప్రాంతాల్లో పేద వర్గాలకు జీవనోపాధి కల్పించడం, వారిని మానవ వనరుల అభివృద్ధికి చేరువ చేయడం వంటి కార్యక్రమాలను చేపడతారు. ఈ కార్యక్రమం 2020 ఫిబ్రవరి 1వర కు కొనసాగుతుంది. -
గంధవరంలో భారీ అగ్నిప్రమాదం
⇒ఆరిళ్లు, రెండు దుకాణాలు దగ్ధం ⇒తప్పిన ప్రాణ నష్టం ⇒రూ.4 లక్షల ఆస్తినష్టం ⇒ సర్వం కోల్పోయిన బాధితులు గంధవరం (చోడవరం) : గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఆరు పూరిళ్లు, టీ, కిళ్లీ షాపులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాద సమయంలో ఆటుగా వెళుతున్న మోటారు సైకిలిస్టు చూసి కేకలు వేయడంతో బాధితులు ప్రాణాలతో బయపడ్డారు. చోడవరం-అనకాపల్లి రోడ్డులో గంధవరం గ్రామం ఉంది. అర్ధరాత్రి అటుగా వెళుతున్న మోటారు సైకిలిస్టు రోడ్డు పక్కనే ఉన్న టీ కొట్టు నుంచి మంటలు వ్యాపించడాన్ని గమనించి పెద్దగా కేకలు వేశాడు. దీంతో ఇళ్లలో ఉన్న వారంతా హాహాకారాలు చేసుకుంటూ బయటకు పరుగుతీశారు. అగ్నికి వాయుదేవుడు తోడవడంతో క్షణాల్లో మంటలు ఇళ్లను చుట్టుముట్టాయి. కళ్ల ముందే ఇళ్లు అగ్నికి ఆహుతవడాన్ని వారు జీర్ణించుకోలేక బోరున విలపించారు. ప్రమాదంలో షేక్ పీర్ సాహెబ్ కుటుంబం సర్వం కోల్పోయింది. పల్లా అప్పలనాయుడు, పల్లా సన్నిబాబు, అప్పలర్సమ్మ, ఊసర్ల రామకృష్ణ, పల్లా అప్పయ్యమ్మల పూరిళ్లు, టీ, కిళ్లీ షాపులు కాలిబూడిదయ్యాయి. పీర్ సాహెబ్‌కు చెందిన సుమారు రూ.2 లక్షలు వరకు ఆస్తినష్టం వాటిల్లింది. స్థానిక ఎంపీటీసీ మొల్లి ప్రసాద్, సర్పంచ్ పల్లా నర్సింగరావు, స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితంలేకపోయింది. సమాచారం తెలుసుకున్న చోడవరం, అనకాపల్లి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశాయి. అప్పుచేసిన సొమ్ము కాలిపోయింది ‘గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. మటన్ దుకాణం ద్వారా జీవనోపాధి పొందుతున్నాం. వేరే చోట ఇల్లు కట్టుకోవడానికి అప్పుతెచ్చిన రూ.50 వేలు, రెండు తులాల బంగారం, 12 తులాల వెండి పట్టీలు, మూడు సైకిళ్లు, నా కొడుకు పదో తరగతి, పాలిటెక్నికల్ సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. రెప్పపాటులో ప్రాణాలు కాపాడుకున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలం’టూ బాధితులు షేక్ పీర్ సాహెబ్, పాతిమ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ఊరి చివర ఒంటరి చిన్నారి!
నవనీత (12) ఇల్లు ఊరికి చివరన.. అరిచినా ఎవరికీ వినిపించనంత దూరంలో ఉంటుంది. వర్షం వస్తే ఆ ఇల్లు చెరువు అవుతుందనడానికి సాక్ష్యంగా ఇంటి పైకప్పుకి కన్నాలు! పొగచూరిన బాల్యానికి గుర్తుగా మూడురాళ్లపై అన్నం గిన్నె, ఆ గిన్నెలో కొద్దిగా అన్నం. విద్యుత్ సౌకర్యం కూడా లేని ఆ చీకటి గదిలో ఆ అమ్మాయి, తమ్ముడు ఎలా ఉంటారోనని ఆ ‘ఇల్లు’ చూసినవారికెవ్వరికైనా అనిపిస్తుంది. గుండెల్లో గుబులు కమ్ముకుంటుంది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఈ ఇద్దరు చిన్నారులు కనీసం తోడు కూడా లేకుండా జీవిస్తుండడం దినదిన సాహసమే. అత్తలూరి అరుణ రంగారెడ్డి జిల్లా దోమ మండలం, మోత్కూర్ గ్రామానికి చెందిన గూడ రామచంద్ర, యాదమ్మలకి ముగ్గురు పిల్లలు. ఆ దంపతులకు నవనీత రెండో కూతురు. ఆమెకో పెళ్ళైన అక్క, ఆరో తరగతి చదివే తమ్ముడు. ఇంటికి ఆధారమైన నాన్నకి ఊహించని విధంగా జబ్బు చేసింది. సర్కార్ దవాఖానాలో కూడా చూపించుకునే స్థోమత లేనంత కటిక దారిద్య్రంలో 2010లో టీబీతో ఆయన కన్ను మూశాడు. ఏ జబ్బు చేసిందో తెలియదు. ఆ ఊరిలో చాలా మందిని కబళించిన వ్యాధే నవనీత అక్కనూ కాటేసింది. అక్క హఠాత్తుగా మరణించింది. కళ్ళెదుటే అక్క కన్ను మూస్తే అక్క కొడుకుకి నవనీతే తల్లిగా మారింది. దుఃఖంలో నుంచి నవనీత తల్లి యాదమ్మ బయటకు రాలేకపోయింది. మనోవేదనతో మంచం పట్టింది. మతిభ్రమించి ఎటో వెళ్లిపోయింది. ఒకటిన్నర సంవత్స రాలు గడిచినా ఆమె ఆచూకీ లేదు. శ్మశానాన్ని తలపించే తన ఇంటిని చూసి చాలా రోజులు బావురుమంది నవనీత. చెల్లాచెదురైన ఈ చిన్నారులు ముగ్గురూ అన్నం పెట్టే దిక్కులేక పస్తులున్నారు. అనుకోని జబ్బులతో ఆ ఊరు ఊరే వల్లకాడులా మిగిలిపోతే ఇక వీరి ఆకలిగోడు ఎవరికి వినిపిస్తుంది? ఆకలితో... అలమటించారు. కన్నీళ్లు కడుపునింపవని అర్థం అయ్యింది నవనీతకు. రక్తసంబంధం తన బాధ్యతని గుర్తు చేసింది. జీవితం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను చెరిపేసుకుంటూ నవనీత జీవించడం మొదలుపెట్టింది. తన కోసం కాదు. తన తమ్ముడి కోసం, అక్క బిడ్డకోసం. కటిక పేదరికం... చదువుపై నవనీతకు ఉన్న ఆశని చిదిమేసింది. తన తమ్ముడినైనా చదివించాలని ఆ చిన్ని మనసు శపథం చేసింది. నాలుగవ తరగతి నుంచి పనిలోకి వెళ్లిన నవనీతకు రెండేళ్లు గడిచేసరికి పనే సర్వస్వం అయ్యింది. ఆరోక్లాసుని అర్ధంతరంగా మానేసింది. చదువంటే ప్రాణంగా భావించే నవనీత తమ్ముడి చదువుకోసం తన చదువే కాదు, అన్ని ఇష్టాలను వదిలేసింది. నవనీత చేతులిప్పుడు పెద్దవాళ్లతో పోటీపడి మరీ పత్తి చేలో పత్తి తీస్తున్నాయి. వయసుకి మించిన బతుకుభారాన్ని మోయడానికి అలవాట పడిన నవనీతకు ఇప్పుడు మట్టి తట్ట పెద్ద బరువనిపించడం లేదు. కంపచెట్లల్లో.... కందిచేలల్లో పడీ పడీ చాకిరీ చేస్తోన్న ఈ బాలికను చూస్తే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు, వాస్తవికతకు మధ్య ఉన్న అగాధం ఏమిటో అర్థం అవుతోంది. మరోవైపు తన తమ్ముడికోసం తాను ఏదైనా చేస్తానంటున్న నవనీతకు మరో ప్రమాదం పొంచి ఉంది. అదే భద్రత. అన్నీ ఉండి, తల్లీతండ్రీ నీడన పెరిగే పిల్లలకే రక్షణ కరువైన ఈ రోజుల్లో ఈ చిన్నారి భద్రత గాలిలో దీపమే. ఇన్నాళ్లూ ఆ ఇంటికి వచ్చిపోయే బావ, ఇటీవలే కొడుకుని తీసుకెళ్లాడు. మళ్లీ తీసుకొస్తానని చెప్పి మరీ వెళ్ళాడు. ఆ పిల్లాడు నవనీత చేతుల్లోనే పెరిగాడు కనుక పూర్తి బాధ్యత నవనీత పైనే వదిలినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఊరి చివరనున్న ఆ పూరి గుడిసెలో ధైర్యంగా జీవిస్తున్న నవనీతకిప్పుడు బతుకుపై భరోసా కల్పించాలి. ఆమె కోరుతోంది కూడా అదే. చెప్పాల్సింది ప్రభుత్వమే తల్లీ తండ్రీ లేక దిక్కులేని వారిగా మారిపోతున్న నవనీత లాంటి వారిని అక్కున చేర్చుకునే వ్యవస్థ మనకు లేదు. ప్రభుత్వ రక్షణ లేదు. నవనీత చదువు మాత్రమే కాదు, ఆమె భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమయింది. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. - సత్తయ్య, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ డివిజన్ ఇంచార్జ్, మోత్కుర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎమ్మార్వోల చేత సర్వే చేయించాలి ప్రభుత్వ పథకాలు ఇటువంటి పిల్లలకు కూడా వర్తింపజేయాలి. వారికి జీవనోపాధిని కల్పించే బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపట్టాలి. ఏ ప్రాంతమైనా ఎమ్మార్వోల చేత సర్వే చేయించి ఇటువంటి పిల్లలను గుర్తించి వారికి ఉపాధి కలిగించే సాంకేతిక శిక్షణతో కూడిన విద్య నేర్పించాలి. - రవీందర్ గౌడ్, విద్యావంతుల వేదిక, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు -
పాలకుల వివక్షతో వడ్డెర్లకు భద్రత కరువు
తిరుపతి కల్చరల్: వృత్తినే జీవనాధారంగా చేసుకుని బతుకులు వెళ్లదీస్తున్న వడ్డెర్ల పట్ల పాలకులు చూపుతున్న వివక్షతో భద్రత కోల్పోతున్నారని ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గుంజి దయాకర్ తెలిపారు. ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం నగర కమిటీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో వడ్డెర వృత్తిదార్లు సుమారు 25 లక్షల మంది ఉన్నారన్నారు. ఇందులో 15 లక్షల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారన్నారు. వృత్తిలో జరిగే ప్రమాదంలో వీరు చనిపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోయారు. వీరి కున్న సంక్షేమ పథకాలు కూడా నామ మాత్రమే అయినప్పటికీ అవి కూడా సక్రమంగా అందడంలేదన్నారు. ప్రభుత్వం వడ్డెర్ల సంక్షేమానికి బడ్జెట్లో వంద కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గుట్టలపై, క్వారీలపై పూర్తి హక్కు వడ్డెర వృత్తిదారులకు ఇవ్వాలన్నారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ఫెడరేషన్‌కు నిధులు కేటాయించాలన్నారు. వృత్తిరీత్యా చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. సొసైటీల ద్వారా లేదా వ్యక్తిగత రుణాలు మంజూరు చేసి వడ్డెర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వడ్డెర వృత్తిదారుల సంఘం నాయకులు మోహన్, రవి, రమణ, వెంకటరమణయ్య, చక్రవేలు, రవికుమార్ తది తరులు పాల్గొన్నారు. -
సులభంగా.. వేగంగా... బైక్ స్ప్రే
ద్విచక్రవాహనంతో పురుగు మందులను పిచికారీ చేసే విధానం అందుబాటులోకి వచ్చిన తరువాత 90శాతం మంది రైతులు పాత పద్ధతులకు స్వస్తి చెప్పారు. బైక్ సాయంతో పైరుకు మందుకొట్టడం చాలా సులభమంటున్నారు. దీని ద్వారా తక్కువ ఖర్చుతో పాటు సమయం కూడా ఆదా అవుతోందని చెబుతున్నారు. ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల ఉపాధి లభిస్తోందని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. ఆ వివరాలు ఇవీ... - చిన్నమండెం - ద్విచక్రవాహనంతో పురుగు మందుల పిచికారీ - ఈ పద్ధతి చాలా సులభమంటున్న రైతులు - జీవనోపాధి లభిస్తోందంటున్న నిర్వాహకులు గతంలో కాలితో తొక్కే యంత్రం, భుజాలకు తగిలించుకునే యంత్రం ద్వారా రైతులు పైరుకు మందులను పిచికారీ చేసుకునే వారు. ప్రస్తుతం ద్విచక్రవాహనంతో మందును పిచికారీ చేసుకునే కొత్తపద్ధతి అలవాటైంది. కొందరు నిరుద్యోగులు.బజాజ్ బైక్‌కు ఒక చిన్నపాటి వీల్‌ను ఏర్పాటు చేసుకుని, కావాల్సినంత పైపును, 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్మును అమర్చుకుని పంట పొలాలకు మందులను పిచికారీ చేసి జీవనం సాగిస్తున్నారు. బైక్ పద్ధతి ద్వారా మామిడి, టమాట, వరి, వేరుశనగ, కర్బుజా తదితర పైర్లకు మందు కొట్టొచ్చు. ద్విచక్రవాహనంతో మందులను పిచికారీ చేసే పద్ధతి వచ్చిన తర్వాత 90శాతం మంది రైతులు పాత పద్ధతులకు స్వస్తి పలికారు. ఎందుకంటే ఈ పద్ధతిలో సులభంగానూ, త్వరితగతిన మందును పిచికారీ చేయవచ్చు. పైపు నుంచి మందు వేగంగా వచ్చి చెట్లపైన పడి, ఆ తర్వాత చెట్ల మొదళ్లకు కూడా తాకుంది. తెగుళ్ల నివారణకు కూడా ఈ పద్ధతి బాగుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఒక డ్రమ్ము మందు పిచికారీకి రూ.150 బజాజ్ ద్విచక్ర వాహనం సాయంతో పురుగు మందులు పిచికారీ చేస్తే రూ.150 మాత్రమే ఖర్చవుతుంది. ఇదే మందు పాత పద్ధతిలో పిచికారీ చేయాలంటే, కూలీలకు, మిషన్ అద్దె సహా మొత్తం రూ.500 అవుతుంది. దీంతో పాటు పని కూడా వేగంగా జరుగుతుంది. దీంతోనే రైతులు ఈ పద్ధతిపైనే ఆధారపడుతున్నారు. పని సులభమవుతోంది గతంలో కూలీలను పిలిచి, యంత్రాన్ని బాడుగకు తెచ్చుకుని పైరుకు మందులు కొట్టే వాళ్లం. ఇప్పుడు బైక్‌తో మందును పిచికారీ చేసుకోవడం సులభమవుతోంది. ఖర్చు తగ్గుతోంది. బైక్‌తో మందు కొట్టేందుకు ఎకరాకు 150 రూపాయల ఖర్చవుతోంది. అదే మందును యంత్రం ద్వారా కొట్టాలంటే మిషన్ తొక్కేందుకు ఒకరు, నీళ్లు తెచ్చేందుకు మరొకరు, మందు కొట్టేందుకు ఇంకొకరు మొత్తం ముగ్గురు కూలీలు అవసరం ఉంటుంది. దీంతో పాటు మందులు చాలా సార్లు కలపడం వల్ల పంటలకు సమాన మోతాదులో అందే అవకాశం ఉండదు. - మచ్చ చంద్ర మోహన్, రైతు (9642 407596) జీవనోపాధి దొరికింది రోజువారీ వ్యవసాయ పనులకు వెళ్లేవాడిని. కుటుంబ పోషణ జరిగేది కాదు. ఏడాది క్రితం 20వేల రూపాయల ఖర్చుతో ఒక బజాజ్ బైక్, అందుకు కావాల్సిన పైపు, వీలు, డ్రమ్మును కొనుగోలు చేసుకున్నాను. పైర్లకు మందులను పిచికారీ చేస్తున్నాను. ప్రతి నెలా అన్ని ఖర్చులు పోనూ 10 -15వేల రూపాయలు మిగులుతోంది. పొలాలకు మందులు పిచికారీ చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాను. మామిడితోటల్లో మందు కొట్టాలంటే నాతో పాటు మరొకరిని తీసుకెళతాను. ఖర్చు తక్కువ రావటం వల్ల రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. - దేవరింటి నాగరాజ, బజాజ్ బైక్ నిర్వాహకుడు (95730 48996), దేవగుడిపల్లె -
తగ్గిన అటవీ ఉత్పత్తుల సేకరణ
అచ్చంపేట: అటవీఉత్పత్తులకు పుట్టినిల్లు.. నల్లమలలో అటవీ ఉత్పత్తుల సేకరణ ఏటా తగ్గిపోతోంది. దీంతో ఉపాధి మార్గా లు కూడా తగ్గిపోతుండడంతో చెంచుగిరిజనుల జీవనోపాధి కష్టతరంగా మారింది. రోజంతా అడవిలో తిరిగినా కనీస కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని చెంచులు వాపోతున్నారు. అటవీప్రాంతంలో ఫలసాయాన్ని అందించే కుంకుడు, కానుగ, ఇప్పచెట్లు, చింతచెట్లు, జిగురు చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు ఘననీయంగా తగ్గింది. 2011-12లో రూ.కోటి 43లక్షలు, 2012-13లో రూ.కోటి 12లక్షల విలువైన అటవీ ఉత్పత్తు లు కొనుగోలు చేస్తే 2013-14లో కేవలం రూ.89లక్షల విలువ గల వస్తుసేకరణ మా త్రమే జరిగింది. ఇదిలాఉండగా, రాష్ట్రం రెండుగా విడిపోయినా గిరిజన కార్పొరేషన్ మాత్రం ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కటిగానే ఉంది. మహబూబ్‌నగర్, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, రం గారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఇది కలిసి పనిచేస్తుంది. వీటి పరిధిలో 40డీఆర్‌డిపోలు, 10సబ్ డిపోలు ఉన్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబా ద్ మండలం మన్ననూర్‌లో గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(జీసీసీ) శాఖ కార్యాలయం ఏర్పాటు చేశారు. దీని పరిధిలో 22 డీఆర్ డిపోలు, ఏడు సబ్‌డిపో లు పనిచేస్తున్నాయి. ఐటీడీఏ పాత లెక్కల ప్రకారం 36వేల చెంచు జనాభా కలిగి ఉం డగా జిల్లాలోని 10 మండలాల పరిధిలో 112 చెంచుగూడెల్లో 7500 జనాభా ఉంది. ధరలు పెంచినా..! గిరిజనులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తుల్లో కొన్నింటి ధరలను జీసీసీ ఈ ఏడాది పెంచింది. తేనే ధర ఇదివరకు కిలో రూ.120 ఉండగా ప్రస్తుతం రూ.130కు పెంచింది. విషముష్టి గింజల ధర రూ.25నుంచి రూ.30, కానుగ గింజల ధర రూ.9.50 నుంచి రూ.10, విప్పపరక ధర రూ.14 నుంచి15,50, నరమామిడి చెక్క రూ.28నుంచి రూ.32కు పెంచారు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల్లో పెరిగిన ధరల ప్రకారం అమ్ముకొనే అవకాశం కల్పించారు. ధరల పెంపు బాగానే ఉన్నా.. ఉత్పత్తుల సేకరణ తగ్గిపోవడంతో చెంచులకు ఉపయోగం లేకుండాపోయింది. ఆదాయం పెంచేందుకు జీసీసీ శ్రీకారం గిరిజన సహకార సంస్థ అటవీ ఉత్పత్తుల సేకరణను పెంచేందుకు ప్రత్యేకచర్యలు తీసుకోవడంతో పాటు కొత్త వరవడికి జీసీసీ శ్రీకారం చుట్టింది. అటవీ సమీప గ్రామాల్లో సబ్డిపోలను ఏర్పాటు చేసేందుకు సహకార సంస్థ ముందకు వచ్చింది. దీంతో దూర ప్రాంతాలకు కాలినడకన వెళ్లి అటవీఉత్పత్తులు అమ్ముకొనే శ్రమ గిరిజనులకు తగ్గుతుంది. అలాగే చెంచుల ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు దోమలపెంట, మన్ననూర్, కొండనాగుల, లింగాలలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో పెట్రోలు బంకులు, ఎల్పీజీ గ్యాస్ సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించారు. పట్టా భూములు కలిగిన చెంచులకు రూ.10వేల వరకు పంట రుణాలను పావులావడ్డీ కింద అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కిరాణాదుకాణం ఏర్పాటు చేసుకునే చెంచులకు రూ.10వేల రుణ సహాయం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. డీఆర్డీపోల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక గ్రూపులకు అప్పగించే యోచనలో జీసీసీ ఉంది. -
‘ఇరాక్’ కలవరం
- అక్కడ మనోళ్లంతా క్షేమం వారితో ఎప్పటికప్పుడు - ఫోన్లో మాట్లాడుతున్న కుటుంబ సభ్యులు - ఎలాంటి ఇబ్బందులు లేవని సమాచారం అత్తిలి: ఇరాక్‌లో తలెత్తిన అంతర్యుద్ధం మన జిల్లా వాసులనూ కలవరపాటుకు గురిచేస్తోంది. జీవనోపాధి కోసం ఆ దేశానికి వెళ్లిన వారంతా అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారోనని వారి కుటుంబ సభ్యులు, ఆయూ గ్రామాల వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది జీవనోపాధి కోసం ఇరాక్ వెళ్లినట్టు తెలుస్తోంది. మిలిటెంట్ల దాడులతో అట్టుడికిపోతున్న ఆ దేశంలో చిక్కుకుపోరున జిల్లా వాసులంతా క్షేమంగానే ఉన్నట్టు సమాచారం అందింది. వారితో కుటుంబ సభ్యులు, బంధువులు ఇక్కడినుంచి ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. మిలి టెంట్లు బాంబు దాడులకు తెగబడుతున్న ప్రాంతానికి 400 కిలోమీటర్ల దూరంలో తాము ఉన్నామని, తమకెలాంటి ఆపద లేదని అక్కడ చిక్కుకున్న వారంతా తమ వారికి సమాచారం ఇచ్చారు. స్వల్ప ఇబ్బందులు తప్ప తమకెలాంటి సమస్య లేదని చెప్పటంతో కుటుం బ సభ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అరుుతే, మిలిటెంట్లు ఏ క్షణంలో, ఎక్కడ, ఎలాంటి ఘాతుకానికి పాల్పడతారోననే భయం ఇక్కడి వారిని వెన్నాడుతోంది. 40మంది భారతీయులను మిలిటెంట్లు కిడ్నాప్ చేయడం కలవరానికి గురిచేస్తోంది. అక్కడ చిక్కుకుపోరుున వారు స్వదేశాలకు తిరిగి వచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తిరిగొచ్చేందుకు ప్రయత్నాలు ఇటీవల కాలంలో ఇరాక్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో అక్కడ పనిచేస్తున్న జిల్లా వాసులు స్వగ్రామాలకు తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, వారితో పని చేరుుంచుకుంటున్న కంపెనీలు ఇందుకు అంగీకరించడం లేదు. దీంతో అక్కడ చిక్కుకుపోరుున వారంతా ఇబ్బందులు పడుతున్నారు. వారిని స్వగ్రామాలకు రప్పించే ఏర్పాటు చేయూల్సిందిగా వారి కుటుంబ సభ్యులు ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. అత్తిలి మండలం నుంచి 40 మంది ఏజెంట్లు చెబుతున్న సమాచారం ప్రకారం జీవనోపాధి కోసం అత్తిలి మండలం నుంచి ఇరాక్ దేశానికి సుమారు 40 మంది వెళ్లారు. వారిలో ఉనికిలికి చెందిన 20 మంది, ఆరవల్లికి చెందిన ఐదుగు రు, మంచిలికి చెందిన ముగ్గురు, వరిఘేడుకు చెం దిన ఆరుగురు, పాలికి చెందిన ముగ్గురు ఉన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. ఇక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. మా ఊళ్లో ఉపాధి దొరక్క ఏడాదిన్నర క్రితం ఇరాక్ వచ్చాను. నిర్మాణ రంగానికి చెందిన కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాను. గల్ఫ్‌లోని ఇతర దేశాలకంటే ఇరాక్‌లో జీతాలు బాగుంటాయి. అందుకే ఇక్కడికొచ్చాను. అయితే కొన్ని నెలలుగా ఇక్కడ జీతాలు ఇవ్వటం లేదు. కంపెనీ వారిని, నన్ను ఇరాక్ పంపించిన బ్రోకర్ని కలుస్తున్నాను. నన్ను ఇంటికి పంపించెయ్యమని అడుగుతున్నా స్పందించడం లేదు. మేం ఇరాక్‌లోని శివారు ప్రాంతంలో ఉండటం వల్ల ప్రస్తుతానికి మాకెలాంటి ఇబ్బంది లేదు. అరుతే, కంపెనీల తీరు, భయానక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ పనిచేసేందుకు అనుకూల వాతావరణం లేదు. అందువల్ల ఇక్కడి వాళ్లందరం స్వదేశానికి వచ్చేయాలనుకుంటున్నాం. సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లాం. - ఇరాక్ నుంచి లక్కవరపు సురేష్, ఉనికిలి వాసి -
మారిన మనిషి
పరివర్తన నేర్పిన ‘జైలు’ టీ స్టాల్‌తో జీవనోపాధి కొత్త జీవితానికి పోలీసుల సాయం కుషాయిగూడ, న్యూస్‌లైన్ : ‘ చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే... అన్యాయంగా సంపాదించిన డబ్బు కంటే భార్యాపిల్లలతో ఆనందంగా గడపడమే గొప్ప... తప్పు చేసిన వారు ఎప్పటికైనా మానసిక క్షోభను అనుభవించాల్సిందే... ఈ మాటలన్నది సాధువో, సంఘ సంస్కర్తో, అధికారో, రాజకీయ నాయకుడో కాదు. తాను చేసిన తప్పులకు జైల్లో ఏళ్ల తరబడి శిక్ష అనుభవించడంతో తనలో వచ్చిన పరివర్తనతో ఓ పాతనేరస్తుడి మనసులోంచి వచ్చిన మాటలివి. జీవనోపాధికి పోలీసుల అండ... తనలాగా మరొకరు దొంగలా తయారు కావద్దని, అందుకు తనవంతుగా ప్రచారం చేస్తానని చెబుతున్న ఓ పాత నేరస్తునికి కుషాయిగూడ పోలీసులు అండ గా నిలిచారు. జీవనోపాధి కోసం ఈసీఐఎల్ బస్ టర్మినల్ వద్ద టీస్టాల్ ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థికంగా సాయమందించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ టీ-స్టాల్ ఏర్పాటుకు దాతల సహకారం తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. కుటుంబంతో ఆనందంగా గడపాలని... చేసిన నేరాలకు పశ్చాత్తాపం చెందుతున్నానని, పిల్ల ల కోసం, వారికి మంచి భవిష్యత్తును అందించేందుకే ఇక నుంచి తన జీవితం కొనసాగుతుందని పేర్కొంటున్న పాతనేరస్తుడు రాజు కష్టపడి కుటుంబాన్ని పోషిస్తానంటున్నాడు. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచన మేరకు పోలీసులు ఇటీవల 900 మంది పాతనేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత డిసెంబర్ 28న మల్కాజిగిరి సీసీఎస్‌లో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు రాజు భార్యాపిల్లలతో పాటు హాజరయ్యాడు. తనలో మార్పుకు పోలీసుల చర్యలు ఊతమిచ్చాయని, ఇకనుంచి కుటుంబంతో ఆనందంగా గడిపేందుకే ప్రాధాన్యతనిస్తానని అతనంటున్నాడు. పోలీసులపై అపోహలొద్దు... కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ కేసులో రెండేళ్ల శిక్ష ఖరారవడంతో చివరిసారిగా రాజు జైలుకు వెళ్లి గత డిసెంబర్ 28న విడుదలయ్యాడు. ఈ మధ్యలో భార్య అనారోగ్యం పాలవడం, పిల్లలకు తన అవసరాన్ని గుర్తించడం, జైలు సంస్కరణల్లో భాగంగా అధికారులు చెప్పిన మాటలతో... మనసు మారిన రాజు తాను ఏదైనా పనిచేసి సొంతంగా సంపాదించుకుంటూ భార్యా పిల్లలను పోషించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మల్కాజిగిరి సీసీఎస్ ఇన్స్పెక్టర్ రామ్‌కుమార్ సహకారంతో సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి విన్నవించుకోగా, ఆయన సానుకూలంగా స్పందించారు. పోలీసులు, వారి ప్రవర్తనపై అపోహలొద్దని, పాతనేరస్తులు ఎవరైనా తనలాగా జీవనోపాధి చూసుకోవాలని రాజు చెప్తున్నాడు. నేర ప్రస్థానం... పేరు: మారినేని రాజు(36) అలియాస్ జయరాజు అలియాస్ విజయరాజు స్వగ్రామం: కమ్మగూడ దామెర భీమనపల్లి, నల్లగొండ జిల్లా భార్య, సంతానం: వరంగల్ జిల్లాకు చెందిన ప్రియాంకను 2004 ఫిబ్రవరి 22న ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆదిత్య, విశాల్‌లు సంతానం. నగరంలో నివాసం: అల్వాల్‌లోని గబ్బిలాలపేట తొలి నేరం: తోటి కూలీ హత్య కేసులు: 107 (103 చైన్‌స్నాచింగ్‌లు, ఒక కిడ్నాప్, 3 హత్య కేసులు) ఇది తొలివిజయం : సీవీ ఆనంద్ పాతనేరస్తుల్లో పరివర్తన కలిగించి, వారిని మా మూలు జీవితం గడిపేందుకు ప్రోత్సహించడం ద్వారా నేరాలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ సమీపంలో పాతనేరస్తుడు రాజుతో ఏర్పాటు చేయించిన టీస్టాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు 900 మంది పాత నేరస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చామని, అందులో తాము సాధించిన ‘మొదటి విజయం ఇది’ అ న్నారు. భార్యాపిల్లలతో కలిసి పాతనేరస్తులు మా మూలు జీవితం గడిపేందుకు ముందుగా వారిలో వచ్చిన పరివర్తనను అంచనా వేస్తామని, వారు గతంలో చేసిన నేరాల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ క్రైం డీసీపీ జానకీ షర్మిల, మల్కాజిగిరి డీసీపీ నవదీప్ సింగ్, అల్వాల్ ఏసీపీ ప్రకాశరావు, క్రైం ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు కె.వెంకట్ రెడ్డి, రమేష్ కొత్వాల్, రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీలంక దాడులతో.. ఇతర రాష్ట్రాలకు వెళుతున్న మత్య్సకారులు
రామేశ్వరం: శ్రీలంక సరిహద్దు జలశయాల్లో చేపల వేటకు వెళ్లుతున్న మత్స్యకారులపై శ్రీలంక నావికా దళం తరుచూ దాడులకూ పాల్పడుతుండటంతో మత్య్సకారులంతా తమ వృత్తులను వదిలేసి బ్రతుకుదెరువు కోసం ప్రక్కప్రాంతాలైన కేరళ, కర్ణాటక ప్రాంతాలకు వలస వెళుతున్నారని మత్య్సకారుల సంఘం పేర్కొంది. శ్రీలంక దాడులకు భయపడి 3వేల మంది మత్య్సకారులు తమ వృత్తిని వదిలివేశారు. చేపలు పట్టడమే తమ నిత్యకృత్యమై జీవనం సాగిస్తున్న జాలర్లంతా ఆ వృత్తిపైనే ఆధారపడ్డారు. రామేశ్వరం తీరప్రాంతాల్లో తమిళ జాలర్లు తమ పడవల సహాయంతో చేపల వేటకు వెళుతుంటారు. ఈ సమయంలో సరిహద్దు పరివాహక ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న శ్రీలంక నావికాదళం వారిపై దాడులుకూ పాల్పడటం పరిపాటైంది. దీంతో మత్య్సకారులంతా భయాందోళనలతో తమ జీవనాన్ని నెట్టుకుస్తున్నారు. ఇలా అయితే తాము చేపల వేటకు వెళ్లి బ్రతికి బట్టకట్టడం కష్టమంటూ వారూ వాపోతున్నారంటూ మత్య్సకారుల సంఘం అధ్యక్షుడు ఎమీరిట్ పిటిఐకి తెలిపారు. గడిచిన కొన్నిరోజుల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లడం మానివేయడంతో చేపల దిగుమతి 90శాతానికి పడిపోయిందన్నారు. అక్కడి తీరప్రాంతాల ద్వీపాలలో దాదాపు 4వేల మంది మత్య్సకారులుంటారని ఎమీరెట్ పేర్కొన్నారు. చేపల పడవలను అద్దెకిచ్చే యాజమానులు జాలర్ల కుటుంబాలకు సహాయం అందించేందుకు విముఖుత చూపిస్తున్నారు. శ్రీలంక జైల్లో నిర్భందానికి గురైన మత్య్సకారుల సంఘం సహాయకుడు ఫెలోమెన్ త్యాగరాజన్ తమ ఆవేధనను వెల్లబుచ్చారు. ఈ సమస్యపై ఇరుదేశాల మధ్య సానుకూల మార్పు రావాల్సిన అవసరం ఎంతైన వుందని ఎమీరిట్ చెప్పారు. దీనిపై కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకుని సమాలోచన చేసి అనుకూల వాతావరణాన్ని కల్పించాలని అప్పడే భారత జాలర్లు నిర్భయంగా భారత జలశయాల్లోకి వెళ్లగలరని అన్నారు. చేపలు పట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో హక్కు కల్పించాల్సిందిగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇరుదేశాల ఒప్పందం ప్రకారమే కాథేచ్చివ్ ద్వీప సరిహద్దులో చేపలు వేటడేందుకు అనుమతి ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినప్పటికీ కూడా శ్రీలంక నావికా దళం ఒప్పందాన్ని విస్మరించి తరుచూ దాడులకు పాల్పడుతుండటం సరికాదని అన్నారు. తాజాగా శ్రీలంక హై కమీషనర్ వెల్డడించిన వివరాల ప్రకారం.. భారత జాలర్లు దాదాపు 114మంది లంక జైల్లో మగ్గుతున్నారని, అంతర్గతంగా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు జరగలేదన్నారు. కానీ ఇలాంటి దుశ్చర్యలను భారత జాలర్లు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారని ఆయన తెలిపారు.