మంచిర్యాల జిల్లాలో యువకుడి ఆత్మహత్య
చావుకు సింగరేణి యాజమాన్యమే కారణమని సూసైడ్ నోట్
జైపూర్: జీవనోపాధి కోసం రూ.6 లక్షలు అప్పు తెచ్చి కొనుగోలు చేసిన ట్రాక్టర్‌కు గిరాకీ లేదు.. ట్రాక్టర్ కిస్తీలు కట్టలేని పరిస్థితి. అదీగాక ఏడాది క్రితం చెల్లి పెళ్లి కోసం రూ.5 లక్షలు అప్పు తెచ్చాడు. సింగరేణి సంస్థ నుంచి పరిహారం వస్తే తన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నాడు. కానీ, రెండేళ్లుగా పరిహారం విషయం ఎటూ తేలడం లేదు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో హరీశ్ (28) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తన చావుకు సింగరేణి యాజమాన్యం, గ్రామ పెద్దలు కారణమని సూసైడ్ నోట్ రాశాడు. అమ్మా నాన్న క్షమించండి.. అక్క, చెల్లి.. అమ్మనాన్నలను బాగా చూసుకోండి అని అందులో పేర్కొన్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావుపేట పంచాయతీ పరిధిలోని దుబ్బపల్లిలో జరిగింది. జైపూర్ ఎస్సై నాగరాజు కథనం ప్రకారం.. దుబ్బపల్లి గ్రామానికి చెందిన జాడి బొందాలు–పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు హరీశ్ సంతానం. బొదాలు కూలీనాలి చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశాడు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఏ పని చేయడం లేదు. దీంతో కుటుంబ భారం హరీశ్‌పై పడింది.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వస్తుందని...
దుబ్బపల్లి గ్రామాన్ని రెండేళ్ల క్రితం సింగరేణి శ్రీరాంపూర్ ఓసీపీ విస్తరణ కోసం సేకరించింది. ఇంటితోపాటు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.20 లక్షలు పరిహారం వస్తుందని హరీశ్ భావించాడు. కానీ, రెండేళ్లుగా సింగరేణి యాజమాన్యం పరిహారం విషయం తేల్చడం లేదు. గ్రామ పెద్దలు పరిహారం ఇప్పించే బాధ్యత తీసుకున్నా.. ఎలాంటి పురోగతి లేదు. ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment