రాంగ్ నంబర్‌తో పరిచయమైన యువతి
ఎస్సై కావడంతో జీవితం బాగుంటుందని పెళ్లికి ఒత్తిడి
లేకపోతే శారీరకంగా వాడుకున్నట్టు చెబుతానని బ్లాక్‌మెయిల్
పెళ్లి చేసుకోకపోతే చనిపోవాలని ఒత్తిడి
నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు.. కేసు వివరాల వెల్లడి
వాజేడు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది. ఎస్సై ఆత్మహత్యకు కారణమైన యువతిని శనివారం అరెస్టు చేసినట్టు వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్ వెల్లడించారు. ఈ మేరకు కేసు వివరాలు, అరెస్ట్ చూపిన ఫొటోలను మీడియాకు ఒక ప్రకటన రూపంలో పంపారు.
వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్(29) ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అదేరోజు అతని తల్లిదండ్రులు రుద్రారపు రాములు, మల్లికాంబలు వాజేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించడానికి దర్యాప్తు ముమ్మరం చేశారు.
పూర్తి ఆధారాలను పోలీసులు, క్లూస్‌టీమ్ సభ్యులు సేకరించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియతండాకు చెందిన బానోత్ అనసూర్య (అనూష) కారణమని గుర్తించారు. ఈ మేరకు ఆమెను వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు.
పెళ్లి చేసుకోవాలని..
అనూష హైదరాబాద్‌లోని వీబీఐటీ కాలేజీలో అడ్మిన్ స్టాఫ్‌గా పనిచేస్తోంది. ఏడు నెలల క్రితం రాంగ్ నంబర్ కాలింగ్ ద్వారా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్‌ను అనూష పరిచయం చేసుకుంది. ఎస్సై కావడంతో అతడిని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందని భావించింది. తరచూ ఫోన్ చేసి సాన్నిహిత్యం పెంచుకోవడంతోపాటు పెళ్లికి ఒప్పించాలని నిర్ణయానికి వచ్చింది.
ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసి తనను పెళ్లి చేసుకోకపోతే శారీరకంగా వాడుకున్నట్టు మీడియాతోపాటు పైఅధికారులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతోపాటు బెదిరించింది. ఇలా ఎస్సై హరీశ్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీ రాత్రి వాజేడు మండలం పూసూరు గ్రామ సమీపంలోని గోదావరి బ్రిడ్జి వద్ద ఉన్న ఓ రిసార్ట్‌లో హరీశ్‌తోపాటు అనూష ఉన్నారు.
తనను పెళ్లి చేసుకోవాలి లేదా చచ్చిపోవాలని ఒత్తిడి తెచ్చింది. దీంతో భావోద్వేగానికి లోనైన హరీశ్.. 2వ తేదీ తెల్లవారుజామున ఆమెను బయటకు పంపి తన సర్వీస్ రివాల్వర్‌తో గదువ కింది భాగంలో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు అనూష ప్రమేయం ఉండడంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment