లాక్‌డౌన్‌; ఆగిన బతుకు బండి | Lockdown Derails Livelihood of Railway Porters | Sakshi
Sakshi News home page

కరోనా కల్లోలం; రైల్వే కూలీలు విలవిల

Published Fri, Jul 3 2020 10:27 AM | Last Updated on Fri, Jul 3 2020 10:42 AM

Lockdown Derails Livelihood of Railway Porters - Sakshi

నిత్యం స్టేషన్‌లో రైలు బండి ఆగితేనే.. వారి ‘బతుకు బండి’ సాగేది.. ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై అడుగు పెట్టగానే ఎర్రచొక్క, లైసెన్స్‌ బిళ్లతో వారు కనిపిస్తారు. ‘బరువు’ బాధ్యతగా తీసుకుంటారు.. స్టేషన్‌ బయట లగేజీ ఉంచి మళ్లీ ఇంకో రైలు కోసం పరుగులు తీస్తారు.. రేయింబవళ్లు బరువులు మోస్తేనే కడుపునిండేది.. కానీ ప్రస్తుతం స్టేషన్లలో సందడి లేదు.. మూడు నెలల క్రితం వరకు హాయిగా సాగిన వారి జీవితాలు భారంగా మారాయి. నెల రోజులుగా నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో తక్కువ మంది ప్రయాణిస్తుండగా.. కరోనా భయం కారణంగా తక్కువ లగేజీతో వెళ్తున్నారు. దీంతో ‘సార్‌.. కూలీ’.. అంటే పర్వాలేదు నేనే తీసుకెళ్తా.. అంటున్నారు. దీంతో దీనస్థితిలో తల ఊపుతూ.. వెనుదిరుగుతున్నారు. గతంలో రోజుకు రూ.600 నుంచి రూ.800 లు ఇంటికి తీసుకెళ్తే.. ప్రస్తుతం రూ.100 కూడా లభించడం లేదు.  

సాక్షి, హైదరాబాద్‌: ఇరవై ఏళ్ల క్రితం ఎర్రచొక్క, లైసెన్స్‌ బిళ్లతో రైల్వే కూలీగా మొదటిసారిగా స్టేషన్‌లో అడుగుపెట్టిన ఐలయ్య.. రాత్రింబవళ్లు బరువులు మోశాడు. ‘రేపెట్లా’.. అనే భయం లేకుండా కుటుంబాన్ని పోషించుకున్నాడు. రామంతాపూర్‌లోని ఓ అద్దె ఇంట్లో ముగ్గురు పిల్లలు, భార్యతో హాయిగా ఉన్నాడు. కానీ కరోనా మహమ్మారి ఐలయ్య కుటుంబంలో కల్లోలం రేపింది. లాక్‌డౌన్‌ కారణంగా ‘బతుకు బండి’ నిలిచిపోయింది. నెల రోజులుగా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. కానీ ప్రయాణికులు అంతంత మాత్రమే. కరోనా వైరస్‌ భయంతో తక్కువ లగేజీ తీసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వే కూలీలకు ఉపాధి లేకుండా పోయింది.

‘స్టేషన్‌లో ఇప్పుడు కూలీ అనే పిలుపే వినిపించడం లేదు. మూడు నెలలుగా ఏ ఇబ్బంది లేకుండా బతికిన ఐలయ్య ప్రస్తుతం ఇంటి కిరాయి కట్టలేని దుస్థితిలో ఉన్నాడు. భార్యకు కూడా ఇళ్లలో పనిలేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పిల్లలను చదివించే ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. ఒక్క ఐలయ్య మాత్రమే కాదు. అనేక దశాబ్దాలుగా రైల్వే పోర్టర్‌లుగా పనిచేస్తున్న వందలాది మంది భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రైల్వేస్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ట్రాలీలు వంటి సదుపాయాలు అందుబాటులోకి రావడంతో రైల్వే కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని, మూడున్నర నెలలుగా రైళ్ల రాకపోకలు స్తంభించడంతో రైల్వే పోర్టర్స్‌ వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని రైల్వే కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

ఎదురుచూపులే మిగిలాయి..
సాధారణంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రతిరోజు 220 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. కనీసం 100 రైళ్లు దూరప్రాంతాలకు నడుస్తాయి. సుమారు 500 మంది రైల్వే కూలీలు ఈ రైళ్లపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంటనగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు వందలాది మంది రైల్వేకూలీలు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంటారు. 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారు. సికింద్రాబాద్‌తో పాటు నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లలో కనీసం వెయ్యి మంది పని చేస్తున్నట్లు అంచనా. రైల్వే కూలీల గుర్తింపు కోసం అధికారులు అందజేసే పోర్టర్‌ లైసెన్స్‌ వాళ్లకు ఎంతో విలువైంది. అది అనేక సంవత్సరాలుగా వారి ఉపాధికి భరోసా ఇస్తోంది. తరతరాలుగా ఎన్నో కుటుంబాలు  ఆ బిళ్లనే నమ్ముకొని బతుకుతున్నాయి. ప్రతిరోజు 1.85 లక్షల మంది రాకపోకలు సాగించే సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఒక్కో రైల్వే కూలీకి రోజుకు రూ.600 నుంచి రూ.800 వరకు ఆదాయం లభిస్తుంది. 40 కిలోల బరువు బ్యాగుకు రూ.80 చొప్పున లభిస్తుంది. సికింద్రాబాద్‌ తర్వాత ఎక్కువ శాతం రైల్వే కూలీలు  నాంపల్లిపై ఆధాపడి బతుకుతున్నారు.

లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత వివిధ రంగాల్లో కొంత మేరకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. పరిశ్రమలు, కంపెనీల్లో పనులు ప్రారంభమయ్యాయి. భవన నిర్మాణ రంగం తిరిగి గాడిన పడింది. కానీ రైళ్లు మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో రైల్వే పోర్టర్స్‌ చాలా కష్టాలు పడుతున్నారు. కూలీలను ఆదుకొనేందుకు రైల్వే అధికారులు మొదట్లో కొన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. నిత్యావసర వస్తులను అందజేశారు. కానీ రెండు నెలలుగా ఎలాంటి సాయం అందడం లేదు. ‘వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. సమీప భవిష్యత్‌లోనే రైల్వే కూలీ వ్యవస్థ కనుమరుగవుతుందేమోననిపిస్తోంది.’ అని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఒక్క రైలుకు 50 మంది  
లాక్‌డౌన్‌ సడలింపులతో ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. కానీ ఒక్క రైలుకు 50 మంది పోటీపడాల్సి వస్తోంది. పైగా లగేజీ కూడా ఉండటం లేదు. రాత్రింబవళ్లు కష్టపడితే వంద రూపాయలు కూడా లభించడం లేదు. ఆ  కూలీ కోసం ఉదయం 11 గంటలకు డ్యూటీలో చేరితే మరుసటి రోజు ఉదయం 11 గంటలకు డ్యూటీ దిగుతున్నాం.
– నర్సింహ

భవిష్యత్‌ భయంగా ఉంది  
ఎన్ని కష్టాలు పడినా పిల్లల చదువులు ఆగిపోవద్దనుకున్నాను. కానీ రేపు వాళ్లకు స్కూళ్లు తెరిచినా ఫీజులు మాత్రం కట్టలేను. మూడు నెలల కరెంటు బిల్లు రూ.2,500 వచ్చింది. ఎక్కడి నుంచి తేగలను. ఇంటి కిరాయి కూడా కట్టాలి. అడ్డా కూలీకి వెళ్తే వాళ్లు రానివ్వడం లేదు. ఎక్కడా పది రూపాయాలు అప్పు కూడా లభించడం లేదు.
– ఐలయ్య

ఎక్కడికెళ్లాలి   
ముప్పై ఏళ్లయ్యింది. భుజాల మీద లగేజీ మోయడం తప్ప మరో పని తెలియదు. పొద్దున ఇంటి నుంచి బయలుదేరితే మరుసటి రోజే ఇంటికి చేరుకుంటాం. ఎప్పుడు రైళ్లొస్తాయో అని ఎదురు చూడటం తప్ప ఏం చేయగలం. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. రైళ్ల కోసం ఎంతకాలం ఎదురుచూడాలో.. అప్పటి వరకు ఇంకెన్ని కష్టాలో.. భయంగా ఉంది.
– సైదులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement