మీరాబాయ్
అది రాజస్థాన్ రాష్ట్రం, ఉదయ్‌పూర్ నగరానికి సుమారు 40 కి.మీ.ల దూరంలో ఆరావళి పర్వతశ్రేణుల్లో ఓ కుగ్రామం. పేరు పడూనా. ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని గ్రామం. బడి లేదు, కరెంటు లేదు. అలాంటి గ్రామంలో ఓ మహిళ. జీవనోపాధి కోసం తనకు తాను ఓ కొత్త బాటను వేసుకుంది. అందుకు ఆమె చేస్తున్న పని సాధారణమైనదే. కానీ ఆ పనిని ఇప్పటి వరకు మగవాళ్లు తప్ప ఆడవాళ్లు చేసి ఎరగరు. అందుకే ఆమె ప్రత్యేకం.
ఎవరామె?
ఆమె పేరు మీరాబాయ్ మీనా. వయసు 52 ఏళ్లు. చేస్తున్న పని... హ్యాండ్ బోర్ రిపేరు చేయడం. హ్యాండ్ బోరు కుళాయి విప్పి రిపేరు చేసి మళ్లీ బిగిస్తుంది. మీరాబాయికి చదువులేదు. పుట్టిన ఊరు దాటి పది కిలోమీటర్లు కూడా వెళ్లింది లేదు. మహిళాభివృద్ధి గురించి తెలియదు. మహిళలకు సమాజంలో సమభాగస్వామ్యం వంటి పెద్ద పదాలేవీ ఆమెకు తెలియదు. సాధికారత అంటే ఏమిటో తెలియదు. అయినా సాధికారత సాధించింది. మహిళలు ఈ పని చేయకూడదనే చాదస్తపు సామాజిక నిబంధనను ఒక్క చూపుతో పక్కన పెట్టింది. తనకు ఆసక్తి ఉన్న బోర్ రిపేర్ పని నేర్చుకుంది. సొంతంగా డబ్బు సంపాదించుకుంటోంది. సొంతంగా జీవించి చూపిస్తోంది. ఇప్పుడు పడూనాతోపాటు ఝాబ్లా గ్రామాల్లో ఎక్కడ చేతిపంపు రిపేరు వచ్చినా ఆమెకే పిలుపు వస్తుంది.‘ఒంట్లో శక్తి ఉంది, చేతిలో పని ఉంది. ఇక నేను ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి?’ అంటోంది ధీమాగా. భర్త చిన్నప్పుడే పోయాడు, పిల్లలు లేరు. భవిష్యత్తు ఎలా అని ప్రశ్నించిన వారిని ‘పని చేయలేని నాడు తినడానికి దాచుకున్న డబ్బు ఉంది. నాకు అన్నదమ్ములున్నారు, వాళ్లకు పిల్లలున్నారు. సోదరులు నన్ను పోషించాలంటే కష్టపడతారేమో కానీ అభిమానం పంచడానికి కష్టపడరు’ అంటోంది. ఆమె మాటల్లో సమాజాన్ని ఆకళింపు చేసుకున్న జ్ఞానం. స్వరంలో ‘నాకు నేనున్నాను’ అనే ధీమా.
Comments
Please login to add a commentAdd a comment