స్వదేశానికి రప్పించాలని బాధితురాలి వేడుకోలు
రాయవరం: జీవనోపాధి నిమిత్తం ఖతర్ వెళ్లిన ఓ మహిళ అక్కడ తనకు జరుగుతున్న బాధలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించి, ఇండియా తీసుకువెళ్లాలని వేడుకుంది. తనను రక్షించి తన పిల్లల వద్దకు చేర్చాలని, ప్రభుత్వం తన పట్ల దయ చూపించాలని ఆ వీడియోలో కోరింది. దానికి సంబంధించిన వీడియోలో ఆ మహిళ ఆవేదన ఈ విధంగా ఉంది.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రాయవరం గ్రామానికి చెందిన సారథి దేవీ హేమలత స్థానికంగా ఫ్యాన్సీ షాపులో పనిచేసేది. కుటుంబ పోషణ నిమిత్తం భర్త మధుబాబు, ఇద్దరు ఆడ పిల్లలను వదిలి జీవనోపాధి కోసం ఖతర్ వెళ్లింది. 2023 నవంబర్‌లో ఏజెంటు ద్వారా ఖతరు వెళ్లిన ఆమె.. అక్కడ పరిస్థితులు మరోలా ఉన్నాయని ఆ వీడియోలో వెల్లడిస్తూ ఆవేదన చెందింది. భారత కరెన్సీలో రూ.25,000 జీతంతో ఇంటిలో క్లీనింగ్ పని అని చెప్పి తనను ఖతర్ పంపించారని పేర్కొంది.
తీరా అక్కడకు వెళ్లిన తరువాత రాత్రి అనక, పగలనక తనతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, ఆరోగ్యం బాగుండకపోయినా తనతో పనిచేయిస్తున్నారని చెప్పింది. ఆరోగ్యం బాగుండకపోతే ఆస్పత్రికి కూడా తీసుకువెళ్లడం లేదని, కనీసం మందులు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను బతికే పరిస్థితి లేదంటూ ఆవేదనతో వెల్లడించింది. మంత్రులు నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్ తనపై దయతలచి తనను స్వదేశానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా వేడుకొంది.
Comments
Please login to add a commentAdd a comment