కాకినాడ క్రైం: కాకినాడలో తల్లీకుమార్తెల ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగన్నాథపురం పెంకేవారి వీధిలో శ్రీదుర్గానివాస్ పేరుతో జీప్లస్ వన్ భవనం ఉంది. దానిలోని కింద అంతస్తులో ఆకాశం సరస్వతి (60), ఆమె కుమార్తె స్వాతి (28) ఉంటున్నారు. సరస్వతి భర్త 16 ఏళ్ల క్రితం మృతి చెందాడు. వివాహిత అయిన పెద్ద కుమార్తె విశాఖపట్నంలో ఉంటోంది.
చిన్న కుమార్తె స్వాతి టైలరింగ్ చేస్తూ సరస్వతిని పోషిస్తోంది. కాగా.. వీరి ఇంటి నుంచి మంగళవారం దుర్వాసన రావడంతో పైఅంతస్తులో ఉన్నవారు గమనించి ఇంటి యజమాని గుర్రాల శ్రీనివాస్‌కు చెప్పారు. ఆయన సమాచారంతో సీఐ నాగదుర్గారావు, బృందం అక్కడికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి చూస్తే లోపల సరస్వతి మంచంపై పడి చనిపోయి ఉంది. స్వాతి ఉరివేసుకుని కనిపించింది. వీరిద్దరూ కలిసి ఉరి వేసుకోగా, బరువుకు చీర తెగిపోయి సరస్వతి మంచంపై ఉండి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నాగదుర్గారావు తెలిపారు.
తల్లికి అనారోగ్యం
సరస్వతి కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. స్వాతి ఆమెను కాకినాడ జీజీహెచ్‌లో చేర్చి వైద్యం చేయించింది. తల్లి ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తుండడంతో స్వాతి మనోవేదనకు గురయ్యేది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లి ఏమైపోతుందోనని బాధపడుతూ ఉండేది. ఈ కారణంతోనే తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. కాగా.. శనివారం రాత్రి 8 గంటల సమయంలో పొరుగున ఉన్న మహిళ దుస్తులను కుట్టించుకునేందుకు స్వాతి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తల్లీకుమార్తెలిద్దరూ నవ్వుతూనే మాట్లాడారు. ఆదివారం పాలు వేసే వ్యక్తి వచ్చి తలుపు తట్టినా తీయలేదు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment