పండగ రోజు పెను విషాదం
● స్కూటీని ఢీకొన్న ట్యాంకర్
● భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు
గండేపల్లి: దీపావళి రోజు రాజమహేంద్రవరంలో ఆనందంగా గడిపి తిరిగి వస్తున్న ఆ దంపతులను మృత్యువు వెంటాడింది. మరికొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకునేలోపు ట్యాంకర్ రూపంలో కబలించింది. ఈ ఘటనలో భార్య చనిపోగా, భర్తకు తీవ్రగాయాలయ్యాయి. సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేటకు చెందిన తాడి సతీష్ కుమార్ స్థానిక దేవీ సెంటర్‌లో ఫాస్ట్‌ఫుడ్ షాపు నిర్వహిస్తున్నాడు. దీపావళి సందర్భంగా గురువారం సెలవు కావడంతో భార్య స్వర్ణలత (24)ను తీసుకుని స్కూటీపై రాజమహేంద్రవరం వెళ్లాడు. వీరి 16 నెలల పాప అమ్యక్రిస్టిని ఇంటి దగ్గర కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమహేంద్రవరంలో సరదాగా గడిపి, రెస్టారెంట్లో భోజనం ముగించుకుని ఇంటికి బయలుదేరారు. మురారి బ్యాంక్ ఆఫ్ బరోడా సమీపంలోకి వచ్చేసరికి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో విశాఖ వైపు వెళుతున్న భారత్ పెట్రోలియం ట్యాంకర్ వీరి స్కూటీని ఢీకొంది. భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై పడిపోగా స్వర్ణలత తలపై నుంచి ట్యాంకర్ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సతీష్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఎస్సై యూవీ శివనాగబాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్వర్ణలత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సతీష్ కుమార్‌ను జగ్గంపేటలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీపీ చలగళ్ల దొరబాబు ప్రమాద స్థలానికి చేరుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. సతీష్ కుమార్ తండ్రి తిరుమలరావు ఏడాది క్రితం మృతి చెందారు. తల్లి ఉదయ భాను, తమ్ముడు సురేష్‌తో కలిసి సతీష్ కుమార్ కుటుంబం నివసిస్తోంది. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడని ప్రత్యక్ష్య సాక్షులు తెలిపారు. కాగా.. అమ్యక్రిస్టి 16 నెలలకే తల్లి ప్రేమకు దూరం కావడంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment