కిర్లంపూడి/యలమంచిలి రూరల్: తమ పిల్లలకు ఉన్నత భవిష్యత్తును ఇవ్వాలనే ధృడసంకల్పంతో నిత్యం కష్టపడుతూ వారిని ఆ దంపతులు చదివించుకున్నారు. తల్లిదండ్రులు ఆశించిన విధంగానే పెద్ద కుమారుడు ప్రవీణ్ బాగా చదివి చైన్నెలో నేవీలో పనిచేస్తున్నాడు. గుంటూరులో సీఏ చదువుతున్న చిన్న కుమారుడు సురాజ్ మంచి ఉద్యోగం సాధిస్తాడని మురిసిపోతున్న సమయంలో ఆ దంపతులను మృత్యువు కాటేసింది. తమ పిల్లలు వృద్ధిలోకి రావడాన్ని చూడాలనే వారి ఆశ తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...
కిర్లంపూడి ఏనుగువీధికి చెందిన ఏనుగు దొరబాబు(52) తన తండ్రి ఏనుగు రంగారావుకు రెండో సంతానం. మృతుడికి గొల్లలమామిడాడకు చెందిన ఏనుగు వేణు(45)తో 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కుటుంబ పోషణకు దొరబాబు దుబాయ్, కాకినాడలో కొన్నాళ్లు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేశాడు. తన పిల్లల చదువుల కోసమని కొన్నేళ్లుగా విశాఖపట్నం జిల్లా కొమ్మాదిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. దొరబాబు విశాఖపట్నం, పరిసర గ్రామాలలో ఏసీల మెకానిక్‌గా పనిచేస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు.
రెండు రోజుల క్రితం సంక్రాంతి పండగకు తన ఇంటిని శుభ్రం చేసుకుందామని కిర్లంపూడిలో ఉన్న తన స్వగృహానికి ఆ దంపతులు వచ్చారు. పనులు పూర్తి చేసుకుని తమ కారులో సోమవారం సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యారు. యలమంచిలి మండలం, పోతిరెడ్డిపాలెం వై.జంక్షన్ వద్ద ఎడమ పక్క నుంచి వస్తున్న బైక్‌ను తప్పించబోయి కారును కుడి వైపుకు తిప్పడంతో డివైడర్ ఎక్కి వైజాగ్ వైపు నుంచి వస్తున్న లారీని ఢీకొట్టింది. (కారును మృతురాలు వేణు నడుపుతోంది) దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆనందంగా నవ్వుతూ వెళ్లిన వారు విగత జీవులుగా మంగళవారం సాయంత్రం ఇంటికి చేరుకోవడం బంధువులను, గ్రామస్తులను కలచివేసింది.
మార్చురీలో విగతజీవులుగా..
యలమంచిలి మార్చురీలో విగత జీవులుగా ఒకేచోట కన్పించిన దొరబాబు, వీరవేణి దంపతులను చూసి బంధువులు చలించారు. పెళ్లయినప్పటి నుంచి ఒకరినొదిలి మరొకరు ఉండేవారు కాదని, ఎంతో అనురాగంగా వుండేవారని బంధువులు చెప్పారు. జీవితపు తుది మజిలీలో కూడా ఒక్కటిగానే అందనంత దూరాలకు వెళ్లిపోయారంటూ దుఃఖసాగరంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment