మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామం వద్ద లారీ ఢీకొని నుజ్జయిన ట్రక్ ఆటో
ఉండ్రాజవరం: జీవనోపాధి కోసం బయలుదేరిన వారు.. అట్నుంచి అటే మృత్యులోకాలకు చేరుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామానికి చెందిన యల్లమిల్లి రవికుమార్ (38), పోలుమాటి శ్రీను (37), చోరపల్లి వీరబాబులు నాటుకోళ్లకు గాబులు (మెష్ గాబులు) కడుతూంటారు. ఫోన్‌లో ఆర్డర్లు బుక్ చేసుకుని ట్రక్ ఆటోలో మెష్‌లు వేసుకుని, ఆర్డర్లు ఇచ్చిన ప్రాంతానికి వెళ్లి నాటు కోళ్లకు గాబులు కడతారు.
తద్వారా వచ్చిన డబ్బులతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇదేవిధంగా సోమవారం ఈ ముగ్గురూ ట్రక్ ఆటోలో మెష్‌లు పట్టుకుని బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని చుట్టుపక్కల గ్రామాలకు బయలుదేరారు. అర్ధరాత్రి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామం వద్ద 216 జాతీయ రహదారిపై వారి ఆటోను లారీ ఢీకొంది.
ఈ ప్రమాదంలో రవికుమార్, శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వీరబాబు విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. రెక్కడితేనే కానీ డొక్కాడని ఆ కుటుంబాల్లో ఈ ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది.
మృతులు రవికుమార్, శ్రీను వివాహితులు, ఇద్దరికీ చెరో ఇద్దరు చొప్పున పిల్లలున్నారు. రవికుమార్, శ్రీను మృతితో కుటుంబ సభ్యులతో పాటు భార్య, పిల్లలు రోదిస్తున్నారు. అందరితోనూ ఆప్యాయంగా ఉండే వారు.. ఈ ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామస్తులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment