కాకినాడ రూరల్: అతి వేగం ఇద్దరు స్నేహితులను బలిగొంది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సినిమాకు వెళ్తున్నామని ఇంటి వద్ద చెప్పి, స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన కొడుకు.. రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఒక కుటుంబం.. బయటకు వెళ్లిన కొడుకు ఇక తిరిగి రాడని తెలిసి మరో కుటుంబం తల్లడిల్లిపోయాయి. రెండు కుటుంబాలకు పుత్రశోకం మిగిల్చిన ఈ ప్రమాదం వివరాలివీ..
కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద సూపర్ బజార్ ఎదురుగా ఆదివారం అర్ధరాత్రి డివైడర్‌ను స్కూటర్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను కాకినాడ రూరల్ మండలం వలసపాకల బాలాజీ నగర్‌కు చెందిన కర్నాటి షణ్ముఖ గణేష్ (17), ములికి శివసత్య(17)గా గుర్తించారు. వారిద్దరూ స్కూటర్‌పై సర్పవరం జంక్షన్ నుంచి మితిమీరిన వేగంతో నాగమల్లితోట జంక్షన్ వైపు వస్తూండగా ఈ ప్రమాదం జరిగింది. స్కూటర్‌ను శివసత్య నడుపుతూండగా వెనుక షణ్ముఖ గణేష్ కూర్చున్నాడు. అతి వేగంతో డివైడర్‌ను స్కూటర్ ఢీకొనడంతో వెనుక కూర్చున్న గణేష్ తూలిపోయి రోడ్డు అవతలివైపు పడ్డాడు. వేగాన్ని నియంత్రించలేక కొద్ది దూరం వెళ్లిన తరువాత శివసత్య రోడ్డుపై పడిపోయాడు.
అతడి తల వెనుక భాగం రోడ్డుకు బలంగా తగలడంతో తీవ్ర గాయంతో రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెండాడు. గణేష్ కూడా తలకు గాయమవడంతో దుర్మరణం పాలయ్యాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు సర్పవరం పోలీసులకు, 108కు సమాచారం అందించారు. సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణ, సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అప్పటికే శివసత్య, గణేష్ మాట్లాడకపోవడంతో తట్టి లేపే ప్రయత్నం చేశారు. వారిద్దరినీ 108 అంబులెన్స్ సిబ్బంది పరిశీలించి, మృతి చెందినట్టు నిర్ధారించారు.
దీంతో ఆ ఇద్దరి మృతదేహాలను పోలీసులు ఆటోలో జీజీహెచ్‌కు తరలించారు. ఏమాత్రం కొన ఊపిరి ఉన్నా బతికే అవకాశం ఉంటుందని వైద్యం కోసం ప్రయత్నం చేశారు. అయితే, ఆ ఇద్దరు యువకులూ మృతి చెందారని ప్రభుత్వాస్పత్రి వైద్యులు మరోసారి నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి, జీజీహెచ్‌కు తరలివచ్చారు.
షణ్ముఖ గణేష్ తండ్రి పెంటయ్యకు ఐదు ట్రాక్టర్లు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. పదో తరగతి వరకూ చదువుకున్న గణేష్ తండ్రికి అండగా ఉంటున్నాడు. రాత్రి సినిమాకు వెళ్తున్నట్టు తండ్రి వద్ద రూ.500 తీసుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన శివసత్యను తీసుకుని బయటకు వెళ్లాడు. ఇద్దరూ సినిమాకు వెళ్లకుండా చాలాసేపు సర్పవరం జంక్షన్‌లో గడిపారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు స్కూటర్‌పై అతి వేగంగా వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. మరో మృతుడు శివసత్య తాపీమేస్త్రిగా జీవనోపాధి పొందుతున్నాడు.
తొమ్మిదో తరగతి వరకూ చదువుకున్నాడు. ఇద్దరు యువకుల మృతితో బాలాజీ నగర్‌లో విషాదం అలుముకుంది. అంది వచ్చిన కొడుకులు అర్ధాంతరంగా మృతి చెందడంతో గణేష్ తల్లిదండ్రులు పెంటయ్య, సత్యవతి.. శివసత్య తల్లిదండ్రులు సత్తిబాబు, సూకరత్నం కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. సర్పవరం ఎస్సై మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. సీఐ ఎ.మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment