పదవికి రాజీనామా ప్రకటన
గన్‌మెన్, ప్రొటోకాల్ వదలరెందుకు?
అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యక్షం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల్లో నైతిక విలువలకు బొత్తిగా చోటు లేకుండా పోతోంది. నేతలు పార్టీలనే కాకుండా ఇచ్చిన మాటను, చేసిన ప్రకటనను కూడా ఫిరాయించేస్తున్నారు. అధికారం ఎటు వైపు ఉంటే అటే ఉంటామంటున్నారు. వైఎస్సార్ సీపీ ఎంతో నమ్మకం ఉంచి కాకినాడకు చెందిన కర్రి పద్మశ్రీకి గౌరవ ప్రదమైన శాసనమండలిలో స్థానం కల్పించింది. గవర్నర్ కోటాలో ఆమెకు మండలిలో సార్వత్రిక ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం కల్పించారు. బీసీలలో పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతోమంది సేవలందిస్తున్న సీనియర్‌లు ఉన్నప్పటికీ మత్స్యకార వర్గంలోని వాడబలిజ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతురాలైన పద్మశ్రీని మహిళా కోటాలో అప్పటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్సీగా పార్టీ అధిష్టానానికి సిఫారసు చేశారు.
పద్మశ్రీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక గత ఆగస్టు 30న కాకినాడ నగరపాలక సంస్థలో ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా కొనసాగుతానని అప్పటి కలెక్టర్ కృతికాశుక్లాకు లేఖ అందజేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేశాక ఏడాది తిరగకుండానే పద్మశ్రీ ఎమ్మెల్సీ పదవికి, వైఎస్సార్ సీసీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పద్మశ్రీ వైఎస్సార్ సీపీకి రాజీనామా చేశారు. పనులు చక్కబెట్టాలన్నా, లాబీయింగ్ చేయాలన్నా అధికార పార్టీలో ఉండాల్సిందేననే ధోరణితోనే ఎమ్మెల్సీ అటు వైపు ఫిరాయించారనే విమర్శలున్నాయి.
పద్మశ్రీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రెండు నెలలు గడిచిపోయాయి. కారణాలేమైనా పదవులకు రాజీనామా చేసే ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన రోజు నుంచి అధికారిక హోదాను వదులుకుంటారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించే వారెవరైనా ఇది అమలు చేస్తారు. అధికారంలోకి వచ్చిన అనంతరం తెలుగుదేశం సహా ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ సీపీకి ఎవరు వచ్చినా పార్టీ, వారు అంతవరకూ అనుభవించిన పదవులకు రాజీనామా చేసి రావాల్సిందేనని ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్మణ రేఖ గీశారు. ఆయా పార్టీల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులంతా దీన్ని పాటించే వైఎస్సార్ సీపీలోకి వచ్చారు.
విస్తుబోతున్న జనం
పద్మశ్రీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంటే చేశారు తప్ప ఆ పదవి ద్వారా సంక్రమించిన గన్‌మెన్, ప్రొటోకాల్‌ను వదులుకోలేకపోతున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటి అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్సీ హోదాలోనే హాజరవడంతో జనం విస్మయానికి గురవుతున్నారు. అక్టోబరు 21న పోలీసు అమరవీరుల దినోత్సవంలో ఎమ్మెల్సీ పద్మశ్రీ అధికారికంగా పాల్గొన్నారు. ఇటీవల కాకినాడ దుమ్ములపేటలో చెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తిచేసే ప్లాంట్‌కు శ్రీకారం చుట్టిన అధికారిక కార్యక్రమంలో ప్రొటోకాల్‌తో పద్మశ్రీ హాజరయ్యారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో మెకనైజ్డ్ బోట్ల యజమానులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్‌తో పాల్గొన్నారు. పార్టీ వద్దనుకుని, ఎమ్మెల్సీ పదవి వద్దనుకుని రాజీనామా చేసినప్పుడు ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ హోదాను ఎందుకు వదులుకోవడం లేదని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
సముచిత గౌరవం కల్పించినా..
వైఎస్సార్ సీపీ మాత్రం ఎప్పుడూ నమ్మిన వారికి న్యాయం చేయడంలో ముందే ఉంటుంది. ఎస్సీ, బీసీలకు న్యాయం చేయడంలో వైఎస్సార్ సీపీ మొదటి నుంచి ఒక అడుగు ముందే ఉంటోంది. పార్టీలో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కీలకమైన రెవెన్యూ మంత్రిని చేసింది. అనంతరం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తొలిసారి బీసీల నుంచి బోస్‌ను రాజ్యసభ సభ్యుడిని కూడా చేసింది. వైఎస్సార్ సీపీని నమ్ముకున్న వారికి ఏదో ఒక రోజు సముచిత గౌరవం దక్కుతుందని కర్రి పద్మశ్రీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ద్వారా మరోసారి నిరూపితమైంది. పద్మశ్రీ భర్త కర్రి నారాయణకు పార్టీలో రాష్ట్ర స్థాయి పదవులతో సముచిత ప్రాధాన్యం కల్పించారు.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాక పూర్వం నుంచి ద్వారంపూడి వెంట ఉన్న నారాయణకు, ఆ వర్గానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోసం ద్వారంపూడి సిఫారసు చేశారు. ద్వారంపూడి వెంట ఉన్న నారాయణ 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీతో చెట్టపట్టాలేసుకు తిరిగారు. తిరిగి వైఎస్సార్ సీపీలోకి వచ్చిన నారాయణను నమ్మి అతని భార్య పద్మశ్రీని ఎమ్మెల్సీని చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కూటమికి దక్కడంతో మరోసారి నారాయణ, భార్య ఎమ్మెల్సీ పద్మశ్రీ కూటమి వైపు వెళ్లిపోయారు. ఎంతో నమ్మకం ఉంచి ఎమ్మెల్సీ పదవిని ఇస్తే ఆమె విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికారం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటామంటున్న నేతల జాబితాలో కర్రి దంపతులు చేరిపోయారంటున్నారు.
డబ్బుకు అమ్ముడుపోవడం అన్యాయం
డబ్బుకు అమ్ముడుపోవడంతోనే ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఇది అతి పెద్ద వెన్నుపోటు. రాజకీయాల్లో ఎంతోమంది పార్టీలు మారుతుంటారు. అయితే కర్రి పద్మశ్రీ, భర్త నారాయణ వ్యవహారశైలి అత్యంత దారుణం. సాధారణ వ్యక్తిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసి గౌరవిస్తే చివరకు డబ్బుకు ఆశపడి రాజీనామా చేయడం అన్యాయం. రాజీనామా చేశానంటూనే అధికారిక కార్యక్రమాలకు ఎలా హాజరవుతున్నారు. గన్‌మెన్‌లను వెంట పెట్టుకు తిరుగుతున్నారు. ప్రొటోకాల్ వదులుకోలేక పోతున్నారు.
– ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి,
Comments
Please login to add a commentAdd a comment