కాలేజీ నిర్మాణం
జిల్లాలో వైద్య కళాశాల పనులకు గ్రహణం
గత ప్రభుత్వంలో రూ.500కోట్లు మంజూరు
కొత్త ప్రభుత్వం రాకతో ఆగిన అభివృద్ధి
గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన స్థానికులు
సాక్షి, అమలాపురం: కోనసీమ వాసుల చిరకాల స్వప్నం తీరే దారి కనబడడం లేదు.. అమలాపురం సమీపంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం ఇంచు కూడా కదలడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశలో ప్రారంభమైన ఈ కాలేజీల నిర్మాణాలకు నిధుల కొరత ఉండడంతో నిలిపివేయాలని సీఎం చంద్రబాబు సూచించడంతో పనులకు బ్రేక్ పడ్డాయని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారంతా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌కు సోమవారం మొరపెట్టుకున్నారు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేసింది. ఇందుకు రూ.500 కోట్లు కేటాయించింది. అమలాపురం రూరల్ సమనస, చిందాడగరువు పరిధిలో దీని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి, రెండో దశలో నిర్మాణ పనులు మొదలు పెట్టిన పలు మెడికల్ కాలేజీలు పూర్తి కావడం, అక్కడ తరగతులు ప్రారంభం కావడం తెలిసిందే. మూడో దశలో అమలాపురంలో మెడికల్ కాలేజీ నిర్మాణం మొదలు పెట్టారు. దీనికి అనుబంధంగా అమలాపురం ఏరియా ఆసుపత్రిని బోధనాసుపత్రిగా గుర్తించారు. ఇది ప్రస్తుతం 100 పడకల ఆసుపత్రి కాగా, దీనిని వెయ్యి పడకల ఆసుపత్రిగా విస్తరించాలని నిర్ణయించారు. తొలి దశలో 650 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు రెండో దశలో 350 పడకలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల అమలాపురం పట్టణ నడిబొడ్డున అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తోందని ప్రజలు ఆనందపడ్డారు.
అప్పుడు వేగం.. ఇప్పుడు జాప్యం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. పలు నిర్మాణాలు చురుగ్గా సాగాయి. కొన్ని భవనాలకు రెండు, నాలుగు అంతస్తులు నిర్మించారు. అయితే ఎన్నికల నాటి నుంచి నెమ్మదించిన పనులు కొత్త ప్రభుత్వంలో దాదాపు నిలిచిపోయే పరిస్థితికి వచ్చాయి. నిధుల కొరతతో మూడో దశ ఆసుపత్రి నిర్మాణ పనులు నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం నుంచి సూచనలు అందడంతో నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ ఇక్కడ పనులు ఆపేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా పనుల్లో వినియోగించే కీలక సామగ్రి తరలిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీనిపై స్పందించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు నిరాకరించారు.
పనులు కొనసాగించండి
మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నిలిచిపోయాయని స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు వినతిపత్రంతో పాటు మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు వినియోగించిన సామగ్రి తరలిపోతున్న ఫొటోలను సైతం జత చేశారు. మెడికల్ కళాశాలకు గత ప్రభుత్వం 47 ఎకరాల భూమి కొనుగోలు చేసి నిర్మాణ పనులు మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ 40 శాతం పనులు జరిగాయని వివరించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత మూడో దశలో మెడికల్ కళాశాలల పనులు నిలిపివేయాలని ఆదేశాలు వచ్చినట్లు గుత్తేదారు సంస్థ చెబుతోందని, నిర్మాణ సామగ్రితోపాటు ఐరన్, ఇసుక, సిమెంట్‌ను మెగా సంస్థ తరలించుకుపోతోందని చెప్పారు. కళాశాలను పూర్తి చేయాలని వారు కోరారు. జిల్లా వాసులు అత్యవసర వైద్యం కోసం కాకినాడ, రాజమహేంద్రవరం వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. అమలాపురం జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామ్‌గోపాల్, సర్పంచ్ పొనకల గణేష్, ఉప సర్పంచ్ రాజులపూడి భాస్కరరావు, మాజీ సర్పంచ్ జలదాని కాశీ విశ్వేశ్వరరావు, కరెళ్ల సూరిబాబు, వై.ఏసుబాబు, సీహెచ్‌వీ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఆశలపై నీళ్లు
గత ప్రభుత్వం మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వడంతో పాటు 47 ఎకరాలు కొనుగోలు చేసి పనులు మొదలు పెట్టింది. ఈ పనులు వేగంగా జరగడం చూసి కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, బోధనాసుపత్రి లేని లోటు తీరుతోందని జిల్లా వాసులు సంబరపడ్డారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరాల్లో మాత్రమే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు (జీజీహెచ్)లు ఉన్నాయి. కోనసీమలో కిమ్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఉన్నా రోగుల అవసరాలు పూర్తిగా తీర్చడం లేదు. అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీల్లో ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. జనరల్ ఆసుపత్రి లేని లోటు పట్టిపీడిస్తోంది. రామచంద్రపురం, మండపేటలకు కాకినాడ, రాజమహేంద్రవరం కొంత దగ్గర. కానీ అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలకు దూరం అవుతోంది. ఇక్కడ జీజీహెచ్ నిర్మించాలని స్థానికులు దశాబ్దాలుగా కోరుతున్నా ఫలితం లేకుండా పోయింది. రూ.కోట్ల విలువైన చమురు, సహజ వాయువులను కొల్లగొట్టుకుపోతున్న చమురు సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ నిధులతో మెడికల్ కాలేజీ, జీజీహెచ్ నిర్మించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది.
ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లాం
మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయాన్ని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు దృష్టికి తీసుకు వెళ్లాం. ఆయన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రితో మాట్లాడతానని చెప్పారు. నిర్మాణ పనులు నిలిచిపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
– పందిరి శ్రీహరి, జెడ్పీటీసీ సభ్యుడు, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment